కుక్క - పిల్లి
చైనా జానపద కథ
కుక్క - పిల్లి
అనగనగా ఒకప్ప్పుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు ఒక భార్య కూడా ఉండేది. భార్యకు ఒక ఉంగరం ఉండేది. అది అదృష్టం ఉంగరం. అది ఎవరి దగ్గర ఉంటే వారికి కావలసినవి అన్నీ దొరుకుతాయి. అయితే ఆయనకు, ఆయన భార్యకు ఆ సంగతి తెలియదు. కనుక వాళ్లు ఆ ఉంగరాన్ని ఏదో అవసరానికి తక్కువ ధరకే అమ్మేశారు. ఉంగరం పోయింది. ఇక వాళ్లు రానురాను బీదవాళ్లు అయ్యారు. చివరకు పూటగడిచేది ఎలాగో తెలియని పరిస్థితి వచ్చింది.
ఆయన, ఆవిడల దగ్గర ఒక కుక్క, ఒక పిల్లి ఉండేవి. ఆయనకు, ఆవిడకే తిండిలేదు గనుక కుక్కకు, పిల్లికి కూడా ఆకలి తప్పలేదు.
వాటికి ఉంగరం సంగతి తెలుసు. యజమానులకు అదృష్టాన్ని తిరిగి కలిగించడం గురించి అవి చాలాకాలం
ఆలోచించాయి. అంత కాలము వాటి కడుపులు మండుతూనే ఉన్నాయి. కనుక మెదడు మాత్రం పదునెక్కింది.
చివరకు కుక్క ఒక ఆలోచన చెప్పింది. “ఏదో రకంగా ఉంగరాన్ని
తిరిగి తేవాలి” అన్నది. పిల్లి సరేనన్నది. “ఆ ఉంగరంలో మహత్తు ఉందని నాకు నమ్మకం కలిగింది”
అన్నది కుక్క. “నిజమేనేమో! అయితే ఆ ఉంగరాన్ని లీ ఫాన్‌కు అమ్మారు. దాన్ని ఆయన జాగ్రత్తగా
పెట్టేలో పెట్టి తాళం వేశాడు. లీ ఫాన్ ఇల్లు పూలతోటకు ఆవల ఉంటుంది. అది బాగా పెద్దగా
ఉంటుంది. గోడలు ఎత్తుగా ఉంటాయి. పెద్ద ఇనుపగేటు కూడా ఉంటుంది. లోపలికి వెళ్లడం ఎవరికీ
కుదరదు” అన్నది పిల్లి.
అయితే ఒక ఉపాయం చెపుతాను. నీవు ఒక చుంచును పట్టాలి. దాన్ని ఇద్దరము
కలిసి లీ ఫాన్ ఇంటికి తీసుకుపోదాము. అది గేటు కిందనుంచి దూరుతుంది. పెట్టెకు రంధ్రం
వేస్తుంది. ఉంగరాన్ని వెతికి తెస్తుంది. చుంచు ఒప్ప్పుకోలేదనుకో, దాన్ని తినేస్తాను అని నీవు
భయపెట్టాలి. చుంచుచేత ఈ పని చేయించాలి” అన్నది కుక్క.
పిల్లికి ఆలోచన నచ్చింది. అది త్వరలోనే ఒక చుంచును పట్టుకున్నది.
అంతా కలిసి ఉంగరం ఉన్న పెట్టె ఉన్న ఇంటికి బయలుదేరారు. మధ్యలో ఒక నది ఉంది. మరి పిల్లికి
ఈదడం చేతకాదు. కనుక అది కుక్క వీపుమీద ఎక్కింది. చుంచు దానితోబాటే ఉంది. కుక్క నది
ఈది అందరినీ అవతలికి చేర్చింది. అప్పుడు పిల్లి చుంచుతోబాటు లీ ఫాన్ ఇంటికి చేరింది.
అక్కడే ఉంగరంగల పెట్టె ఉంది మరి. చుంచు పెట్టెదాకా చేరింది. కొరికి కొరికి దానిలో రంధ్రం
వేసింది. ఉంగరాన్ని వెతికి తెచ్చింది.
పిల్లి ఉంగరాన్ని తీసుకుని నోట్లో పెట్టుకున్నది. నది
వద్దకు వచ్చింది. అక్కడ కుక్క ఎదురు చూస్తున్నది. పిల్లి దానిమీద ఎక్కింది. కుక్క నది
ఈదింది. అవతలి గట్టుకు అంతా చేరుకున్నారు. ఇంటికి బయలుదేరారు. అదృష్టం ఉంగరాన్ని యజమానులయిన
ఆయన, ఆవిడగారలకు ఇవ్వాలి.
కుక్కకు వీధుల వెంట తిరగడం మాత్రమే తెలుసు. కనుక నగరంలోని
వీధులన్నీ దాటుతూ అది ఇంటికి నడక ప్రారంభించింది. పిల్లి మాత్రం ఇళ్ల పై కప్ప్పుల మీదకు
ఎక్కుతుంది. పక్క ఇంటి మీదకు దూకుతుంది. అది నిజంగానే ఇళ్ల మీద దూకుతూ తొందరగా యజమానుల
వద్దకు చేరింది. ఉంగరాన్ని ఆయన, ఆవిడగారలకు ఇచ్చింది.
అప్ప్పుడు ఆయన తన ఆవిడతో “మన పిల్లి మహామంచిది. మనకు మంచి
చేసింది. కనుక మనం దానికి మంచి తిండి పెడదాము. స్వంత బిడ్డలాగ చూచుకుందాము” అన్నాడు.
కుక్క కొంతసేపటికి ఇల్లు చేరగలిగింది. వాళ్లు దాన్ని కొట్టారు.
అరిచి తిట్టారు. ఉంగరం తేవడంలో అది సాయం చేయలేదని యజమానుల కోపం. పిల్లి మాత్రం చప్ప్పుడు
చేయకుండా వెచ్చని పొయ్యిలో పడుకున్నది. అక్కడినుండే గుర్రుగుర్రు మన్నది. నిజం మాత్రం
చెప్పలేదు. చెపితే తనకు అందే బహుమానం కుక్కకు కూడా అందుతుందని అనుమానం. ఇక తనకు నిజంగా
రావలసిన బహుమానాన్ని పిల్లి దోచుకున్నది, కనుక కుక్కకు తెగ కోపం వచ్చింది. పిల్లి కనబడితే
చాలు అది వెంటపడి తరమడం మొదలుపెట్టింది.
ఇవాళటికీ కుక్కలు, పిల్లులను తరుముతూనే ఉన్నాయి.
No comments:
Post a Comment