Showing posts with label fun. Show all posts
Showing posts with label fun. Show all posts

Saturday, August 29, 2026

పిచ్చివాళ్ల స్వర్గం : మరణతరంగం నుంచి


పిచ్చివాళ్ల స్వర్గం

ఐజాక్‌ బషేవిస్‌ సింగర్‌

చచ్చి స్వర్గం చేరుకుంటే సులభంగా ఉంటుంది. ప్రపంచం గురించి ఆలోచించనక్కర లేకుండా అమృతం తాగుతూ, రంభ డాన్సు చూస్తూ, హాయిగా బతకవచ్చుననుకునే వాళ్లూ ఉండే ఉంటారు. మంచి వాళ్లకు బతికినంత కాలం కష్టాలుంటాయి. ఈ భూమి మీద నూకలు చెల్లితే అంతా సుఖమే సుఖం! అని మనవాళ్లు అనాదిగా నమ్ముతున్నదే. అలా నమ్మిన ఒక కుర్రవాడి పాత్ర చుట్టూ అల్లిన కథ పిచ్చివాళ్ల స్వర్గం. ఐజక్‌ బషేవిస్‌ సింగర్‌ అనే పోలాండ్‌ రచయిత రాసిన ఇద్దిష్‌ కథ ఇది. అసలు కథ ఏమిటంటే...

అనగనగా ఒక ధనవంతుడు. ఆయన పేరు కదిష్‌. ఆయనకు ఒక్కడే కొడుకు.ఆ  అబ్బాయి పేరు అట్సెల్‌. వాళ్లింట్లో ఒక దూరపు చుట్టాల అమ్మాయి కూడా ఉంటుంది. ఆమె పేరు ఆక్సా. అట్సెల్‌ అందగాడు. అక్సా కొంచెం పొట్టి. కానీ అందగత్తె. ఇద్దరిదీ ఇంచుమించు ఒకే వయసు. వాళ్లిద్దరూ కలిసి తినేవారూ, కలిసి తిరిగేవారూ, చదువుకునేవారూ, ఆడుకునేవారు కూడా. మొగుడు పెళ్లాలాట కూడా ఆడేవారు అప్పుడప్పుడు. పెద్దయింతర్వాత వాళ్లిద్దరికీ పెళ్లి చేసేయాలని పెద్దలనుకున్న సంగతీ అందరికీ తెలుసు. పెరిగారు, పెద్దవాళ్లయ్యారు. కానీ అట్సెల్‌కు ఒక మాయదారి రోగం పట్టుకుంది. ఎన్నడూ కనివిని ఎరుగని మాయరోగం అది. ఆ అబ్బాయి ఎప్పుడూ తానుచనిపోయాననుకునే వాడు!

తనకలాంటి ఆలోచనలు ఎక్కడినుంచి వచ్చాయి? ఇంట్లో ముసలి పని మనిషి ఎప్పుడూ కథలు చెపుతుంది గదూ! ఆవిడే స్వర్గం గురించి చెప్పిందట! స్వర్గానికెళితే కష్టపడవలసిన పనిలేదు. చదువుకోవలసిన అవసరం అంతకంటే లేదు. అమృతం తాగుతూ హాయిగా బతకవచ్చు!

అట్సెల్‌ నిజానికి సోమరి. పొద్దున్నే లేవాలన్నా, బడికి పోవాలన్నా, పని చేయాలన్నా తనకు ఇష్టం ఉండేది కాదు. పెద్దవాడయితే తండ్రి వ్యాపారమంతా తనే చూచుకోవలసి వస్తుందే మోనన్న భయం కూడా ఉండేదతనికి. మరి సుఖపడాలంటే స్వర్గానికి పోవాలి. స్వర్గానికి పోవాలంటే చావక తప్పదు. ఇలా ఆలోచించి, ఆలోచించి, చివరకు ఆ అబ్బాయి తను చనిపోయినట్టు ఊహించడం మొదలుపెట్టాడు.

పాపం అమ్మా నాన్నా, చాలా బెంగ పెట్టుకున్నారు. అక్సా కూడా ఏడిచింది. అట్సెల్‌ మాత్రం ఎంత చెప్పినా వినడు. ‘‘ఏమిటి మీ పిచ్చి? ఒకవేపు నేను చనిపోయి పడి ఉంటే మీరంతా కబుర్లేమిటి? నన్ను పాతేసెయ్యండి! నేను స్వర్గానికి వెళ్లిపోవాలి!’’ అనేవాడు.

ఎంతోమంది డాక్టర్లు ఎన్నో మందులు వేశారు. ఎన్నో రకాలుగా నచ్చ జెప్పడానికి ప్రయత్నించారు. ‘‘నువ్వింకా తింటూ, తాగుతూ, రాయిలా ఉండి చచ్చావంటావేమిటి?’’ అన్నారు. ఇంకేముంది అట్సెల్‌ తిండి మానేశాడు. నిజంగానే చచ్చే పరిస్థితి వచ్చింది!

కదిష్‌ అందరికన్నా పెద్ద డాక్టరుగారి దగ్గరకు వెళ్లాడు. తన కొడుకు సంగతి వివరించాడు. అంతా విన్న డాక్టరుగారు ‘‘ఏం ఫరవా లేదు! ఎనిమిది రోజుల్లో మీవాడి రోగం కుదురుస్తాను. కానీ ఒక షరతు! నేను ఏం చేయమంటే అది చేయాలి మీరు! ఎందుకని ప్రశ్నించకుండా!’’ అన్నారు.

ఆయన ఇంట్లో అందరికీ ఈ విషయం వివరించాడు. ఆ రోజు నుంచే వైద్యం మొదలయింది. డాక్టరుగారు ఏం చెపితే అది క్షణాల్లో అమలు జరగాలి. అది నియమం. డాక్టర్‌ అట్సెల్‌ గదిలోకి ప్రవేశించారు. నలిగిన గుడ్డలతో చిక్కిపోయిన అట్సెల్‌. మంచంలో పడి ఉన్నాడు. డాక్టర్‌ మొహం చిట్లించి, ‘‘ఏమిటది? ఇంకా ఈ శవాన్ని ఇంట్లో దాచుకున్నారేమిటి? అంతిమయాత్రకు ఏర్పాట్లు చేయండి!’’ అంటూ అరిచారు. అట్సెల్‌ తల్లిదండ్రులు అదిరిపోయారు. ఆ అబ్బాయి మాత్రం మొహం చింకిచాటంత చేసుకుని ‘‘నేనెప్పుడో చెప్పాను! చూడండి! నేను చనిపోయానో లేదో? డాక్టరుగారు కూడా అదే మాటన్నారు!’’ అన్నాడు.

డాక్టరుగారి షరతు జ్ఞాపకం తెచ్చుకుని ఇంట్లో అందరూ శవయాత్రకు ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఇదంతా చూస్తున్న ఆట్సెల్‌ సంతోషం పట్టలేక గంతులు వేశాడు. ‘‘ఆకలి! అన్నం కావాల’’న్నాడు. ‘‘స్వర్గంలో తిందువుగానిలే!’’అన్నారు డాక్టరుగారు.

ఆ ఇంట్లోనే డాక్టరుగారి ఆదేశం ప్రకారం ఒక గదిని స్వర్గంగా మార్చేశారు. గోడలు కనిపించకుండా తెరలు, నేల కనిపించకుండా తివాచీలు ఏర్పాటు చేశారు. కథలో స్వర్గంలో లాగ దీపాలు అమర్చారు. సేవకులంతా దేవదూతల్లాగ అలంకరించుకున్నారు.

అట్సెల్ ని శవపేటికలో పెట్టి ఊరేగింపు మొదలుపెట్టారు. అబ్బాయి నిద్ర పోయింది చూచి, అతడిని స్వర్గం గదిలో దిగబెట్టారు. నిద్రలేచిన అబ్బాయి ఆశ్చర్యపోయాడు. ‘‘నేనెక్కడున్నాను? ఎవరక్కడ?’’ అన్నాడు. దేవత ప్రత్యక్షమయి ‘‘ఇది స్వర్గం మహాప్రభో!’’ అని జవాబిచ్చాడు. ‘‘సరే! నాకాకలిగా ఉంది. ఆహారం, అమృతం కావాల’’న్నాడు అట్సెల్‌. ముఖ్య సేవకుడు చప్పట్లు చరవగానే తెరలు తొలగించుకుని సేవకులు బంగారు పళ్లాలలో అన్ని పదార్థాలు పట్టుకువచ్చి అట్సెల్‌ ముందు అమర్చారు. బాగా తిని వెంటనే మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు అబ్బాయి. మరురోజు పొద్దున్న నిద్రలేచాడు గానీ, అది పగలో రాత్రో తెలియలేదతనికి, అట్సెల్‌ నిద్రలేచాడని గమనించగానే, సేవకులంతా సిద్ధమయి అచ్చం మొదటి రోజులాగానే ఆహారం ఏర్పాటు చేశారు.

ఇదేమి బ్రేక్‌ఫాస్ట్‌? కాఫీ, బ్రెడ్‌ రోల్స్‌ కావాల’న్నాడతను.

కానీ స్వర్గంలో అవేవీ ఉండవు. ఎప్పుడూ ఇదే తిండి! మహాప్రభో’ అన్నారు సేవకులు.

అస్సలిప్పుడేమిటి? పగలా? రాత్రా?’ అన్నాడు అట్సెల్‌.

అంటే ఏమిటది? ఇక్కడదంతా ఉండదు!’ అన్నారు సేవకులు.

ఎలాగోలాగ తిండి అయిందనిపించి, ‘మరి కాలక్షేపానికి నేనిప్పుడేం చేయాలి?’ అని ప్రశ్నించాడా అబ్బాయి.

స్వర్గంలో ఎవరూ ఏమీ చేయరండీ!’ జవాబు.

మిగతా దేవతల గురించి అడిగితే చాలా దూరం అన్నారు.

మరి మా అమ్మా, నాన్నా ఎప్పుడొస్తారు?’ అని అడిగాడు అట్సెల్‌.

మీ నాన్నగారు ఇరవై ఏళ్ల తర్వాత, అమ్మగారు ముప్పయి ఏళ్లకు!’ అన్నారు.

మరి అక్సా సంగతి ఏమిటి?’

ఆమె రావాలంటే యాభయి సంవత్సరాలు కావాలి!’

అంటే అప్పటిదాకా, నేనిలా ఒంటరిగా ఉండవలసిందేనా?’’

అంతే మహాప్రభో!’

సరే, ఇప్పుడు అక్సా ఏం చేస్తుంది మరి?’’

‘‘కొన్నాళ్లు మీ కోసం ఏడుస్తుంది. నెమ్మదిగా మరిచి పోయింతర్వాత ఇంకో అందమయిన కుర్రవాణ్ణి చూచి పెళ్లి చేసుకుంటుంది. భూమ్మీద బతికేవాళ్లు ఎప్పుడూ అంతేగదా!’ అన్నారు సేవకులు. అట్సెల్‌కు తిండి ఒంటబడుతున్నది. కానీ చేయడానికి పని మాత్రం లేదు. ఎనిమిది రోజులు అలా గడిచే సరికి అతనికి దుఃఖం ముంచుకు వచ్చింది. పట్టలేక సేవకుడితే ‘‘స్వర్గంకన్నా భూమిమీదే బాగుంటుందేమో!’ అన్నాడు.

అయ్యో! ఏం బాగులెండి! చదువుకోవాలి! పనిచేయాలి! ఒక్కటా? అంతా కష్టం?’’ అన్నాడు సేవకుడు.

‘‘ఆ ఏం కష్టంలే? ఇలా పడి ఉండేకన్నా కట్టెలు కొట్టినా సుఖంగా ఉంటుంది! అయినా ఇలా ఎన్నాళ్లుండాలి నేను’ అన్నాడు ఆ అబ్బాయి.

ఎప్పటికీ ఇలాగేజవాబు.

ఛీ! అలాగయితే నేను ఛస్తాను!’

చచ్చినవాళ్లు మళ్లీ చావడానికి వీల్లేదు!’

చింతలో పడ్డాడు అట్సెల్‌.

కొన్ని క్షణాల తరువాత ఒక సేవకుడు ప్రత్యక్షమయ్యాడు. ‘మహాప్రభో! తప్పు కాయాలి. తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ మీరు చనిపోలేదు! ఇంకా బతికే ఉన్నారు!’ అన్నాడు.

ఎగిరి గంతేసి అట్సెల్‌ ‘ఏమిటి? నేనింకా బతికే ఉన్నానా? మరి నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారు? వెంటనే మా ఇంటికి తీసుకెళ్లండి!’ అన్నాడు.

సేవకులు తన కళ్లకు గంతలు కట్టి, కాసేపు అటూయిటూ తిప్పి, చివరకు ఇంట్లో అందరూ ఉన్న గదిలోకి తెచ్చారు. గంతలు విప్పారు. మళ్లీ ప్రపంచం చూచిన అట్సెల్‌ సంతోషం పట్టలేకుండా ఉందప్పుడు. బ్రతకడమెంత హాయిగా ఉంటుందో అర్థమయిందతనికి.      అక్సాని చూచి, ‘నీవింకా ఎవరినో పెళ్లి చేసేసుకుని ఉంటావనుకున్నాను! నా అదృష్టం ఇంకా ఇక్కడే ఉన్నావు!’ అన్నాడు.

వాళ్లిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. కానుకలు, కట్నాలు కూడా ఘనంగా వచ్చాయి. సోమరితనం మానేసి, అట్సెల్‌ వ్యాపారం మొదలు పెట్టాడు. బాగ్దాద్‌, భారతదేశమూ తిరిగాడు. చాలాకాలం తర్వాత గానీ, అట్సెల్‌కు డాక్టరు చేసిన వైద్యం గురించి తెలియదు. పిచ్చివాళ్ల స్వర్గం గురించి అతను తన పిల్లలకు, వాళ్లకూ కథలుగా చెపుతూ ఉండేవాడు.

కథకు ముగింపు మాత్రం ఎప్పుడూ ఒకటే. ‘నిజంగా స్వర్గంలో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు!’ అని.


 

Saturday, August 1, 2026

లోకాభిరామం - వానొచ్చె వరదొచ్చె : On rain and then Sambaru


వానొచ్చె వరదొచ్చె

పొటుకు - పొట్కు- టపక్‌

ఇల్లంత టపక్‌ పెడ్తున్నాది. పెద్దా పుస్కం తడ్సీ పోతుంది’ అని ఎర్రని గుడ్డలో చుట్టిన ఒక లావుపాటి పుస్తకాన్ని తెచ్చింది బువ్వమ్మ. ఆ పెద్ద పుస్కం పవిత్ర గ్రంథం ఖురాన్‌. తెచ్చిందేమో నిప్పులు కడిగే ఆచార్లవారి ఇంటికి. వాన కాలమంతా ఆ పుస్తకం ఆచార్లవారి ఇంట్లో గూట్లో సురక్షితంగా ఉంటుంది. అక్కడి మిగతా పుస్తకాలు అన్నింటితోబాటు! బువ్వమ్మ ఇల్లు పూరి గుడిసె అనుకుంటాను. ఆచార్ల వారిది మట్టిమిద్దె. అప్పటికి రాతిగోడలు వచ్చినయి కానీ, సిమెంటు కప్పులు రాలేదు.

మట్టిమిద్దె అంటే గోడలు కూడా మట్టివయి, ఆ మీద కప్పు ఉంటుంది. రాతిగోడల మీద కూడా మట్టిమిద్దె ఉంటుంది. దూలాలు లావుగ ఉంటయి. వాటిమీదనుంచి గోడల మీదకు కొంచెం సన్నటి వాట్లు ఉంటయి. (ఈ మాటంటే వేట్లు? అని అడిగాడు నా కొడుకు! మీకు అర్ధమయితే సరే, కాకుంటే వదిలేయండి.) ఆ వాట్లమీద చిలుక చెక్క పరిచి ఉంటుంది. కలిగిన వారయితే పలకలుగా తీర్చిన చిలుకు చెక్కలను, మధ్య ఖాళీలు లేకుండా పరిపిస్తరు. లేదంటే పొయ్యిలోకి కొట్టిన కట్టెలను పేర్చి, మీద గడ్డి పరిచి, ఆ మీద మట్టి వరస వేస్తరు. మట్టిమిద్దెలో ఎండలకు పగుళ్లు వస్తయి. గడ్డి, చిన్న మొక్కలు పెరుగుతయి. చుట్టు గోడలను మిద్దెకన్న కొంచెం ఎక్కువ ఎత్తు వరకు కడతరు. వాటిని కుంబిగోడలు అంటరు. వాటిమీద కూడా పగుళ్లు, గడ్డి మొక్కలు ఉంటయి. వానలు రాబోతున్నయంటే, మొక్క లన్నింటినీ పీకి, చవిటి మన్ను తెప్పించి మిద్దె నిండ పరిపించాలె. మొదటి వానలకే మట్టి తడిసి పరుచుకుంటుంది. దిమ్మిస పీటతో కొట్టి దాన్నంత చదును చేయాలె. వాలు సరిగ్గ వుండేట్లు సరిచేయాలె. ఇదంతా సక్రమంగ జరిగితే పడిన వాననీరు గూనలలోంచి కిందకు పడుతుంది. ఈ పనులు వీలవుతయి, కావు. కుదురుతయి, కుదరవు! ఇంక వాన వచ్చిందంటే చాలు పొటుకు మొదలవుతుంది.

వాతావరణం మారిపోతున్నదని చెప్పడానికి పరిశోధకుల దాక పోనవసరం లేదు. గతంలో వాన కాలమంటే  ప్రతినిత్యం ఉదయం, అస్తమానం వాన కురవవలసిందే. ముసుర్లు పట్టుకుంటే అయిదారు రోజులు ఏకాకారంగా వాన కొనసాగేది. గోనెసంచీ, గొంగడీ కప్పుకుని, అంత దూరం బడికిపోతే ‘సెలవు! వెళ్లిపొండి!’ అనేవారు. ఇంటి కంటే బడి మరింత అధ్వాన్నం. అందునా, మా బడి పక్కనే పెద్ద చెరువు కూడ ఉంది. నీళ్లు గదుల వరకు వచ్చినా ఆశ్చర్యం లేదు. అంతటి వానలో ఇల్లు, పూరి గుడిసె అయినా, మట్టిమిద్దె అయినా పొటుకు తప్పదు. పగుళ్లు, మొక్కల వేళ్లుంటే, ఎక్కువగ, లేదంటే, అక్కడా ఇక్కడా మిద్దెలోంచి నీరు ఇంకి చుక్కచుక్కగ పడుతుంది. అదే పొటుకు. మా ఇల్లు నిజంగ తాతల కాలం నాటిది. రకరకాల పాత్రలను ఆ పొటుకు పడుతున్న చోట పెట్టి, నేలన్న తడి కాకుండ జాగ్రత్తపడి, మిగిలిన చోట పండుకోవాలె. పొటుకు మరీ ఎక్కువగా ఉంటె, వానలోనే జాగ్రత్తగ మిద్దె ఎక్కి ఆ భాగంలో తొక్కాలె. చవిటి మన్ను జారుడుగ ఉంటుంది. కాలు జారితే ప్రమాదం! మట్టిమిద్దెలు పోయినయి! పొటుకు మాత్రం మిగిలింది. ఎవరన్నా ఒకేపని గురించి, సంగతి గురించి, తెరిపిలేకుండ అడుగుతూ (నస!) కష్టపెడుతున్నరనుకోండి. దాన్ని పొట్కు-పొటుకు పెడుతున్న రని వర్ణించేవారు. ఆర్‌సీసీ మిద్దెల్లో కూడా లీకులున్నయి. పొటుకుల ఉండే ఉంటయి. ఎండను తట్టుకోవాలని వేసే కూల్‌హోమ్‌ కారణంగ పగుళ్లు వస్తయని చెప్పినరు ఒకరు. మరేమి, అట్లాంటివి జరిగితే పొటుకు తప్పదు!

బల్లి సాంబారు: ఉల్లి సాంబారు అని వేరుగ ఏదయినా ఉంటుందా? సాంబారు వెంగాయం అని చిన్న చిన్న ఉల్లిపాయలుంటాయని తెలుసు. వాటిని అట్లాగే వేసి సాంబారు వండుతారనుకుంటాను. ‘బిసి బేళె హుళి అన్న’ అంటే వేడి పప్పుపులుసు అన్నం అని అర్ధం. అందులో వెంగాయం అంటే ఉల్లి పాయలు పెద్ద ముక్కలు వేయడం చూచాను. (నిజమే, నాకు తిండి గురించిన చింత ఎక్కువ. ఎర్రోనికి ఏమి చింత? అంటే ఎప్పటికి తిండిమీదనే చింత’ అని ఒక మాట ఉంది. ఈ ఏర్రోడు వెర్రివాడా లేక ఎర్రని వాడా? శివరాజు సుబ్బారావు అనే బుచ్చిబాబుగారు, వరంగల్‌ నవీన్‌గారి పద్ధతిలో పోతున్నది రాత. నా పేరులోనూ ‘బుచ్చి’ ఉంది. వరంగల్లు మీద కావలసినంత ప్రేమ ఉన్నది! అక్కడికే పోవాలె మనం ఇప్పుడు. వరంగల్‌లో ఎమ్‌ఎస్‌సి చదువుతున్నము. మధ్యాహ్నం పూట మొదటి పంక్తి భోజనాలు అయిపోయినవి. అమ్మాయిల హాస్టలు చిన్నది. అక్కడికి కూడా తిండి ఈ హాస్టల్‌నుంచే పోతుంది. అక్కడ కూడ అందరూ తిన్నరు. ఆలస్యమయి రెండవ పంక్తికి వచ్చిన వారు తింటుంటే సాంబారులో బల్లి పడిందని తెలిసింది! అసహ్యం అన్న మాట పక్కనపెడితే తెలియకుండ తిన్నవారికి, రెండవ పంక్తిలోని వారికీ, ఎవరికీ ఏమి కాలేదు! అంతా ఆరోగ్యంగ ఉన్నరు. సంగతి తెలిసిన తరువాత ‘కడుపులో తిరుగుతున్నది!’ అని కొందరు హెల్త్‌ సెంటర్‌కు పరిగెత్తినరు. పరిగెత్తినరంటే ఆరోగ్యంగ ఉన్నరనే గదా అర్థం. డాక్టర్‌ రెడ్డిగారు వాండ్లను పరీక్షించి డైజీన్‌ లాంటి మాత్ర ఏదో ఇచ్చి పంపించినరు. బల్లిని ఉడికించి తింటేనే ఏం కాలేదు. అది మీద పడితే ఏమవుతుంది! ఆ బల్లి అనారోగ్యంగ ఉండి, దాన్ని ద్వారా క్రిములేమైన సోకితే ఏమన్న అవుతుందేమో?ఏమో?

ఉల్లి సాంబారు: మేము (ఇంట్లో) ఉల్లి, వెల్లుల్లి, గోంగూర, ఆనపకాయ లాంటివి తినము. ఛాదస్తమే! అయినా తినము. ఎక్కడన్న ఉల్లిపాయల వంట తిన్నమంటే, తరువాత వాసన తెలుస్తుంది. మాకుండే ఛాదస్తం వెనక కొన్ని పద్ధతులున్నయని చెప్పంగ విన్న. కొన్ని పదార్థాలు చూడడానికి బాగుండవు. కొన్నింటి వాసన బాగుండదు. కొన్ని అర్ధం లేని చాదస్తం! క్యాబేజ్‌ కొత్తగ వచ్చినపుడు నాన్న అడ్వెంచరస్‌ గనుక కొని తెచ్చినడు. అది భయంకరమయిన వాసన.అప్పటి క్యాబేజీతో పోలిస్తే ఇప్పటిది ఎంత మేలో చెప్పలేము. అప్పట్లో పురుగుమందులు ఇంతగ లేవు కనుక ఆకుల మధ్యన పురుగులు కూడ ఉండేవి! ‘కన్న మన్ను తెచ్చి వండమంటరు!’ అని అమ్మ గులుగుడు (గొణుగుడు) నాకు గుర్తుంది. ‘మెప్పులకై కన్నతావు అప్పు వడక’ అన్నారు త్యాగయ్యవారు. కన్న అంటే కనిన అంటే చూచిన అని అర్ధం. అంతేగానీ ప్రసవంతో సంబంధం లేదు. బిడ్డను చూస్తము గనుక అది కానుపు! ‘నిను కన్నది కానుపు’ అని రామదాసుల వారంటే అది చూడడం గురించే, ప్రసవం గురించి కానే కాదు! అందుకే కన్న మన్ను అంటే కనపించిన మన్ను అని.

మళ్లీ, మేము ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి, గోంగూర, ఆనిగెంకాయె తినము (ఈసారి అసలు సంగతే చెప్త!) మా బిల్డింగులో ఒక్కోసారి సామూహిక భోజనాలు ఏర్పాటు చేస్తరు. ఒక్కో ఇంటివారు ఒక వంటకం చేసి తెచ్చి, అందరూ ఒక చోట తినడం అదొక సరదా! మా ఇల్లుగలావిడ, మా యజమాని, మా ప్రొఫెసరు గారు (మాయావిడ, నా భార్య) సాంబారు వండమంటే సరేనని వండింది. అందులో ఆన్యన్‌ అనే ఉల్లిపాయల్లేవు. అయినా చాలా రుచిగ ఉందన్నరు అందరు! ఆనియన్‌ అదే ఆన్యాన్‌ లేకుండా సాంబారు ఎట్లా చేస్తరని అందరూ హాచ్చెర్య పడిపోయేశినరు. తరువాత ఒకటి రెండుసార్లు కూడా సాంబారు తయారీ బాధ్యత మా ఇంటికే వచ్చినట్టు గుర్తు! అన్య అంటే ఇతరము. తమిళంలో అన్యన్‌, అన్నియన్‌ అవుతుంది. అపరిచితుడు ఎందుకు మనకు మన సినిమాలో?

మూడు పైసల నాటకం: అంకుశ్‌ బోర్‌హాడే అనే పేరు మీరు విని ఉండరు. అతను మరాఠీ అయి వుంటడని కొందరికి తోచి ఉండవచ్చు. బెర్ట్‌హోల్ట్‌ బ్రెష్‌ట్‌, జెర్మనీలో ప్రసిద్ధ నాటక రచయిత. అతని పేరును బ్రెఖ్‌ట్‌, బ్రెహ్ట్‌ అని కూడ పలుకుతరు. అతని సాంఘిక నాటకాలు సంచలనం కలిగించినయి. అందులో ఒకదాని అనువాదం ‘ద త్రీ పెన్నీ ఆపెరా’ పోనీ ఓపెరా అనండి! నాకు అభ్యంతరం లేదు. జబ్బార్‌ పటేల్‌ అనే మరాఠీ నాటక కారుడు దానికి అనువాదం కాదు గానీ అనుసరణ చేశినడు. ‘తీన్‌ పైసాచా తమాషా’ అని దాని పేరు. తమాషా అనేది మరాఠీ జానపద నాటక పద్ధతులలో ఒకటి. అక్కడ మొదలయి, ఈ నాటకం సాగుతుంది. అందులో నాయకుని పేరు అంకుశ్‌ బోర్‌హాడే. అతను నాటకం మొదలయిన తరువాత చాలాసేపటి వరకు రంగం మీదకి రాడు. అతనొక రౌడీ, దాదా! పాత్ర వచ్చే ముందు ఆ పేరును ప్రతిధ్వనులతోపాటు హాలంతా కదిలిపోయిందేమో అనిపించే పద్ధతిలో వినిపింపచేసిన తీరు నాకు ఇంకా గుర్తుంది. మనసులో మనం ఒక ఎస్వీ రంగారావును ఊహించుకుంటే, అక్కడ అందమైన యువకుడు ఎదురయ్యినడు. నాటకం ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో, అంత బాగుంది, అంత బాగుంది, అంత బాగుంది. పుణె (పూనా లేక పునహా) బాల గంధర్వ రంగమంచ్‌లో చూచిన నేను. అంకుశ్‌ పెళ్లవుతుంది. హాలంతా రంగు దీపాలు వెలిగినయి. ప్రేక్షకులందరు పెళ్లి వారయ్యినరు! ము! బావుంటుంది, మరాఠీ వారి నాటక విద్య! ఆ హాల్లో నిత్యమూ నాటకం ఉంటుంది. మిగతా చోట్ల సినిమా చూచినట్టే జనం టిక్కెట్లు కొని నాటకాలు చూస్తరు. ఈ అలవాటు మహారాష్ట్రలో ఇంకా కొనసాగు తున్నది. మన దగ్గర హైదరాబాదులో ప్రయత్నం జరిగింది కానీ, కొనసాగలేదు మరి.


 

Sunday, June 28, 2026

చెవిటి మనిషి : పొరుగు మనిషి Katha


చెవిటి మనిషి : పొరుగు మనిషి

రూమీ చెప్పిన కథలు

చెవిటి మనిషి - పొరుగు మనిషి

ఒక మనిషికి రాను రాను చెవులు వినిపించడం తగ్గిపోతున్నది. కానీ అతనికి తన లోపం గురించి అందరి ముందు అంగీకరించడానికి మనస్కరించడం లేదు. అతను మరి గర్విష్టి. ఏమీ జరగనట్టే నటిస్తూ బతుకుతున్నాడు. ఒకనాడు అనుకోకుండా, ఒక నేస్తం కలిశాడు. ఆ పక్కనే ఉన్న ఇంటిలో ముసలాయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు, అతని వద్దకు వెళ్లి పరామర్శిస్తే బాగుంటుంది కదా, అని అతను అన్నాడు. పక్కింటి పెద్ద మనిషిని పలకరించడానికి బంధువులు కూడా ఎవరూ లేరు, అంటూ పలకరించమని ప్రోత్సహించాడు. ఈ చెవిటి మనిషి, ఏదో రకంగా అతని మాటలు అర్థం చేసుకున్నాడు. పొరుగంటి మనిషిని తప్పకుండా వెళ్లి పలకరిస్తానని, నిజానికి ఆ రోజునే వెళతానని మాట ఇచ్చాడు కూడా.

ఇంతకు ఆ పొరుగింటి మనిషి దగ్గరకు వెళ్లడం ఎట్లాగా? అతను నిజంగా అనారోగ్యంతో తీసుకుంటూ ఉంటే, మాట బలహీనం అయిపోయి ఉంటుంది. అతను చెప్పేదేదో తనకు వినిపించదు. అయినా వెళ్ళక తప్పేటట్టు లేదు. కనుక తప్పకుండా వెళ్లాలి. ఆరోగ్యం గురించి ఏదో అడగాలి. తప్పదు అని నిర్ణయించుకున్నాడు. ఎదుటి మనిషి మాట్లాడుతున్నప్పుడు, అతని పెదవుల కదలికను బట్టి, ఏం మాట్లాడుతున్నది అర్థం చేసుకోవచ్చు కదా, అనుకున్నాడు. అయినా ఏదో జాగ్రత్తగా ఉండాలి కనుక, ఏం ప్రశ్నలు అడగాలి, వాటికి ఏమీ జవాబులు వస్తాయి, తర్వాత మరి ఏమి అడగాలి, అన్న విషయాలను అతను ముందే మనసులో మననం చేసుకున్నాడు.

తాను వెళతాడు. 'ఒంట్లో ఎలా ఉంది?' అని అడుగుతాడు. అనారోగ్యంగా ఉన్న మనిషి 'ఏదో దేవుడి దయవల్ల, లాగతీసుకు వస్తున్నాను,' అంటాడని ఊహించాడు. జవాబుగా 'చాలా గొప్ప విషయం,' అని తాను అంటాడు. వెంటనే తాను, 'ఈ పూట మరి ఏమి తిన్నావు' అని అడుగుతాడు. అతను ఏదో తిన్నాడని జవాబు చెబుతాడు. 'భలే భలే, బాగుంది మరి,' అని తాను అంటాడు. అప్పుడిక మూడవ ప్రశ్నగా, 'మందులు ఎవరి దగ్గర తీసుకుంటున్నావు?' అని అడగాలి. అతను ఊర్లో ఏదో ఒక వైద్యుడి పేరు చెబుతాడు. మళ్ళీ తను 'భలే భలే' అంటాడు. 'అతను చాలా గొప్పవాడు, నాకు తెలుసు,' అని కూడా అంటాడు.

ఈ రకంగా ముందే పథకం వేసుకొని, చెవుడు పెరుగుతున్న ఆ మనిషి వెంటనే పక్క ఇంటికి వెళ్ళాడు. ముసలతని పక్కనే కూర్చున్నాడు. నిజానికి అక్కడ మంచం లేదు. ముసలతను నేల మీదనే ఏదో గుడ్డలు పరుచుకుని పడుకున్నాడు. వెళ్లిన ఈ మనిషి, 'పెద్దాయనా! ఎలా ఉన్నావు?' అని అడిగాడు.

'చస్తున్నాను!' అన్నాడు ఆ ముసలి మనిషి. ముందు అనుకున్నట్టే చెవిటి మనిషి 'చాలా గొప్ప విషయం,' అనేశాడు. పథకం ప్రకారం, 'ఇంతకు ఏం తిన్నావు' అని అడిగాడు. ఆరోగ్యం సరిగా లేని మనిషి విసిగిపోయి ఉన్నాడు. 'విషం,' అన్నాడు. 'భలే భలే, బాగుంది మరి,' అన్నాడు మన చెవిటి మనిషి. మరి పథకం అదే కదా.

ముసలి మనిషికి చికాకు తలకెక్కింది. కానీ తమాయించుకుని పెదవి కొరుక్కున్నాడు. వచ్చిన మనిషిని తిడితే గౌరవంగా ఉండదు అనుకున్నాడు. ఇక పథకం కొనసాగింది. 'ఏ వైద్యుడి దగ్గర మందులు తీసుకుంటున్నావు?' అన్న ప్రశ్న వచ్చేసింది.

చికాకుగా ఉన్న ముసలి మనిషి, 'మృత్యుదేవత దగ్గర!' అన్నాడు. మరి మన చెవిటి పెద్దమనిషి 'భలే భలే! అతను చాలా గొప్పవాడు, నాకు తెలుసు,' అనేశాడు. 'అతని దగ్గరికి వెళ్లిన వాళ్లందరికీ ఇకపైన కష్టాలు అంటూ ఉండవు' అని కూడా చేర్చాడు.

అన్న మాటల ప్రభావం గురించి పట్టించుకోకుండా అతను పెద్దాయన చేయి పట్టుకుని, సెలవు అన్నట్టు ఒకసారి ఊపి, గట్టిగా నొక్కి, వచ్చేశాడు. తాను వచ్చి ముసలి ఆయనకు ఎంతో మంచి చేశాను అని మాత్రమే అతను మనసులో అనుకుంటున్నాడు. జరిగిన విషయం గురించి అతనికి ఏ మాత్రం అనుమానం లేదు. తర్వాత ఏమైంది మనకు తెలియదు.