I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Friday, February 20, 2026
అగ్గి మనిషి - A story in Telugu about human nature
అగ్గి మనిషి
A story in Telugu about human nature
అగ్గి
మనిషి
అనగనగనగా ఒకప్పుడు
ఒకానొక మనిషి ఉండేవాడు. ఆయనకు నిప్పు తయారు చేయడం తెలిసి ఉండేది. అతనికి గల ఆ
అద్భుతమైన శక్తిని చూచి ఆయన ఊరులోని వాళ్ళందరూ ఎంతో అబ్బుర పడేవాళ్లు. అతను
మొట్టమొదటిసారిగా నిప్పు తయారు చేశాడు. వాళ్లందరికీ దాని గురించి ఏమనాలో
తెలియలేదు. దాంతో ఏం చేసుకోవాలో అంతకన్నా తెలియలేదు. నిజానికి ఉన్న మాట చెప్పాలంటే, వాళ్లందరూ కొంచెం భయపడిపోయారు కూడా. కానీ, ఈ నిప్పు తయారు చేసే మనిషిని ఏమందాం అగ్గిమనిషి అందామా, అగ్గిమనిషి తాను తయారు చేసిన నిప్పుతో చలి పుడుతున్నప్పుడు
వెచ్చగా ఉండవచ్చునని, చీకటి చుట్టూ అలుముకున్నప్పుడు వెలుగు కోసం దాన్ని
వాడవచ్చునని, అట్లాగా మరెన్నో చెప్పాడు. తిండి వండుకోవడానికి మంట పనికి
వస్తుంది అని కూడా వాళ్లకు చేసి చూపించాడు. మట్టితో కుండలు తయారు చేసుకోవాలని కూడా
చేసి చూపించాడు. ఆ కుండలలో వాళ్ళు తిండి వండుకొని తినవచ్చునని కూడా చూపించాడు. ఆ
అడవిలో ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు, దారి తప్పిపోయాం
అనుకున్నప్పుడు, ఈ కొత్త బహుమానాన్ని పెద్ద మంటగా మారిస్తే, దూరంగా ఉండే వాళ్లకు కూడా అది కనబడుతుంది, వీళ్ళు ఎక్కడున్నది అందరికీ తెలుస్తుంది అని, అప్పుడు కాపాడడానికి ఎవరైనా రావడానికి వీలు ఉంటుందని కూడా
చెప్పాడు. అయితే నిప్పుతో
కొంచెం తంటాలు కూడా ఉన్నాయి. అజాగ్రత్తగా ఉంటే అది నాశనానికి దారి తీసింది కూడా.
కనుక అగ్గిమనిషి అగ్గి అనే అగ్నిని గౌరవంగా, జాగ్రత్తగా
వాడుకునే పద్ధతులను కూడా నేర్పించాడు. నిజంగా తెలివిగలిగి వాడుకుంటే, నిప్పు
బ్రతుకులను గొప్పగా మారుస్తుంది. ఎవరికి ఎటువంటి హాని ఉండదు. దానివల్ల ప్రపంచంలో
దేనికి కూడాను హాని ఉండనవసరం లేదు, అన్నాడు అగ్గిమనిషి. మొత్తానికి ఈ అగ్గి, నిప్పు, మంటలు గురించి
తొందరలోనే చుట్టుపక్కల ఊళ్లవాళ్ళకు అందరికి కూడా వార్త పొక్కిపోయింది. ఆ ప్రాంతంలో
అందరికీ సంగతి తెలిసిపోయింది. ఇక అగ్గిమనిషికి కావలసినంత గిరాకీ మొదలయింది. అందరూ
అతని దగ్గరికి రాసాగారు. అగ్గిమనిషి అన్ని ఊళ్లకు తిరిగాడు. అవసరమని ముందుకు
వచ్చిన వాళ్ళందరికీ తన విద్యను పంచాడు, పెంచాడు.
అందరూ నిజంగా ఆశగా నేర్చుకున్నారు. అగ్గిమనిషిని ఎంతో గౌరవంగా చూడసాగారు అందరూ. ఈ
మనిషి నిజంగా మామూలు వాడు కాదు. దేవతలు కూడా ఇతన్ని చూచి ఇష్టపడతారు అనుకున్నారు
కూడా. త్వరలోనే సంగతి
గురించి ప్రాంతం పెద్దలకు, అధికారులకు తెలిసిపోయింది. ప్రాంతం ప్రభువుకు కూడా
తెలిసిపోయింది. అయితే అన్యాయంగా వాళ్ళందరూ వింటున్న విషయాన్ని విచిత్రంగా కాక,
వినోదంగా అంతకన్నా కాక, వినాశనం కింద చూడ సాగారు. అగ్గి మనిషేమో అందరికీ, వారు
కోరుకున్న మీదనే, తన విద్యను పంచి పెడుతున్నాడు. దాంతో ప్రజలు సుఖంగా, సంతోషంగా, సౌకర్యంగా
బతుకుతున్నారు. ప్రజలంతా ప్రభువులను, పెద్దలను కూడా కాదని,
అగ్గిమనిషినే అనుసరించ సాగారు. ఇక అనుకున్నట్టే ఆ ప్రాంతంలో అందరికన్నా అతనే
గొప్పవాడు అయ్యాడు. అధికారుల పట్టు సడలిపోయింది. ఇంకేముందీ, వాళ్లంతా ఒక్కచోట చేరి, ఆ మనిషి ఆగడాలను ఆపకుంటే, అంతా
మునుగుతుంది, అన్నారు. అయితే అతడిని ఆపడానికి ఎవరికీ తరం కాలేదు. కనుక అంతకన్నా
అన్యాయమైన మార్గం ఏదో వాడితే తప్ప పని జరగదని వాళ్లకు అనిపించింది. అగ్గిమనిషి
అంతం కావాల్సిందే, అనుకున్నారు వాళ్ళు. నిర్ణయం అయిపోయింది. ప్రభువులు తలిస్తే
పని జరగకుండా ఉంటుందా... ఒక చీకటి రాత్రి
ఎక్కడో మారుమూలన వాళ్ళు అగ్గిమనిషిని చుట్టుముట్టి గుట్టుగా మట్టుపెట్టేశారు. అంటే
చంపారు. ఇక తరువాత ఎవరైనా నిప్పు తయారు చేసే పని అయితే అది నేరం కింద నమోదు
అవుతుందని అంతటా ప్రకటనలు వినిపించారు. ప్రజలంతా గగ్గోలు
పడిపోయారు. ఎవరు ధైర్యం చేసి అధికారులను ఎదిరించడానికి వీలు లేకపోయింది.
అగ్గిమనిషి లేకపోవడం గురించి అందరూ ఆలోచించారు. చర్చించారు. మనసులోనే
కుమిలిపోతున్నారు. అయితే ఈ లోపల అతను నేర్పిన విద్య గురించి మాత్రం అందరికీ మరుపు
వచ్చేసింది. ఏ పనైనా చేస్తుంటే గాని, అలవాటవుతుంది.
అంతేగాని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, నిజంగానే మరపు వచ్చేస్తుంది. అందరూ అగ్గి
తయారు చేయడం మర్చిపోయారు, కానీ అగ్గిమనిషిని మాత్రం మరువలేదు. ప్రభువులు, పెద్దమనుషులు అందరూ ఒకచోట చేరి, ప్రజల గురించి ఏం చేయాలని
మంతనాలు చేశారు. అపాయానికి కారణమయ్యే ఒక మనిషిని గురించి, అంతగా దిగులు పడిపోతున్న
ప్రజలను, మరో మార్గంలోకి నడిపించేందుకు, పథకాలు వేశారు. తగిన గౌరవం జరగాలంటే
అగ్గిమనిషికి అంతటా గుడులు కట్టించాలి, అని ప్రజలకు సలహాలు ఇచ్చారు. కనుక ఊరూరా అగ్గిమనిషి
గుడి వచ్చేసింది. ప్రజలంతా ఆ గుడులను అన్ని రకాల అలంకరించి పువ్వులు, పూజలతో, రంగురంగుల చిత్రాలతో, విగ్రహాలతో
నింపేశారు. వీలున్నప్పుడంతా, అక్కడ చేరి అగ్గిమనిషిని గురించి భజనలలాగ పాడసాగారు.
నిప్పు గురించి అతను ఒకప్పుడు చెప్పిన సంగతులన్నింటినీ పుస్తకాలలో రాసుకున్నారు.
సమూహంగా చేరినప్పుడంతా ఆ పుస్తకాలను పారాయణం చేయసాగారు. మొత్తానికి అధికారులు
మాత్రం చింత లేకుండా ఉంటున్నారు. అగ్నిని వాళ్ళు అదుపు చేసినట్టు భావించసాగారు. పాపం ప్రజలు మాత్రం
రాత్రులలో చలి బాధకు గురవుతున్నారు. చల్లని తిండి తింటున్నారు. హాయిగా మంట చుట్టూ
నాట్యం చేస్తూ ఆడే వీలు లేకుండా, అదోరకంగా
బతుకుతున్నారు. అగ్గిమనిషి పట్ల
వారిలోని విధేయత మాత్రం అణువంత కూడా తగ్గలేదు. ఆ రకంగా ఎంతోకాలం గడిచింది.
ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతున్నాయి. కానీ, ఎక్కడా అగ్గి, నిప్పు, మంట మాత్రం
అడుక్కున్నా కనిపించడం లేదు.
No comments:
Post a Comment