I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Monday, June 15, 2026
పడుచుదనం Japanese Folk tale Retold in Telugu
అనగనగా ఒకప్పుడు ఎక్కడో ఒకచోట కొండల మధ్యన ఒక కట్టెలు కొట్టే మనిషి తన భార్యతోపాటు ఉండేవాడు. వాళ్లు నిజానికి చాలా ముసలివాళ్లు. కానీ పిల్లలు మాత్రం లేరు. మొగుడు ప్రతినిత్యం ఒంటరిగా అడవిలోకి వెళతాడు. కట్టెలు కొట్టి తెస్తాడు. పెళ్లాం ఇంటిపట్టునే ఉంటుంది. నేతపని చేస్తుంది.
Tuesday, June 9, 2026
అక్షయ పాత్ర : భూటాన్ జానపద కథ
అక్షయ పాత్ర : భూటాన్ జానపద కథ
అక్షయ పాత్ర
డాంగ్ భూ థిక్ నాకి వెండా, డింగ్ బూ కిమథిక్ నాకి వెండా, అంటే అనగనగా ఒకప్పుడు అని అర్థం. అటువంటి ఒకప్పుడు ఒక లోయ ఉండేది. అందులో విశాలమైన ఒక నది ఉండేది. నది పక్కన మంచి పొలాలు ఉండేవి. అక్కడ కోయడానికి సిద్ధంగా పంటలు కనిపించేవి. కొండ చరియలమీద సాగుచేసి పంట నాటడానికి సిద్ధంచేసి ఉంటుంది. త్వరలోనే రైతులు వచ్చి నాట్లు మొదలు పెడతారు. కానీ వీధి చివరన పూరిగుడిసెలో ఉండే చిన్నపిల్లవాడికి మాత్రం ఆ అవకాశం లేదు. అతను విత్తనాలుగా నాటడానికి ధాన్యం మిగిలించుకోలేక పోయాడు. ఇంట్లో ఉన్న ధాన్యం మొత్తం తినేసాడు. దీనంగా ఉన్న అతని పరిస్థితి చూసి చుట్టుపక్కలవారు అతనికి ఒక పిడికెడు విత్తనాలు జమచేసి ఇచ్చారు. వాళ్లకు ధన్యవాదాలు చెపుతూ ఆ కొంచెం విత్తులను అతను తనకు ఉన్న కొద్దిపాటి నేలలో నాటుకున్నాడు. అతని పొలం పైన్ అడవుల పక్కన ఉంటుంది.
విత్తనాలు నాటిన కొద్దికాలానికే పిచ్చుకల గుంపు ఒకటి, పెద్దది వచ్చేసింది. కిచకిచలాడుతూ ఎగర సాగింది. చూస్తుండగానే నాటిన విత్తనాలు అన్నింటిని పొడిచి పొడిచి అవి తినేశాయి. బీద బాలుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. అతను బిత్తరపోయి ఉన్నాడు. కొంచెం సేపటికి తేరుకున్నాడు. పట్టరాని కోపం వచ్చింది. పిచ్చుకలను తరమ సాగాడు. ఆ పిచ్చుకల గూళ్ళు, ముళ్ళు నిండిన పొదలలో ఉన్నాయి. అక్కడ, ఆరు ఎగరడం చేతకాని చిన్న పక్షులు కూడా ఉన్నాయి. వెళ్ళిపోతున్న అబ్బాయి ఆ గూళ్ళను తగలబెట్టడానికి పూనుకున్నాడు. ఒక్కసారిగా పిచ్చుకలు అన్ని అతని ముందుకు వచ్చి తమను తమ పిల్లలను ప్రాణాలతో వదిలేయమని ప్రాధేయపడ్డాయి. నా గింజలు మీరు తినేశారు. నేను ఏం తిని బతకాలి? మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు, అన్నాడు అబ్బాయి. తండ్రి పిచ్చుక ముందుకు వచ్చింది. ఒక అక్షయపాత్ర గిన్నెను తెచ్చి అబ్బాయికి ఇచ్చింది. ఈ గిన్నె నీతో ఉంటే ఇక నీవు ఎన్నడు పని చేయవలసిన అవసరం ఉండదు. నీవు ఏమి అడిగితే వాటిని ఈ గిన్నె నీకు ఇచ్చేస్తుంది. ఇక మిమ్మల్ని వదిలిపెట్టు, అన్నది.
కుర్రవాడు గిన్నె తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. నిజంగానే గిన్నె మహిమ గలది. అది ప్రతినిత్యం అబ్బాయికి అన్నిరకాల తిండి పదార్ధాలను అందజేస్తున్నది. పంచభక్ష్య పరమాన్నాలు పెడుతున్నది. అడగడమే ఆలస్యం. ఆ బాబు మునుపటివలె ధనికుల ఇళ్లకు బిచ్చం ఎత్తడానికి వెళ్లడంలేదు. అట్లాంటి ఒక కలవారి ఇల్లు బాబు ఇంటి పక్కనే ఉన్నది. ఆ ఇంటి యజమానురాలికి అనుమానం మొదలయింది. దొంగచాటుగా వెళ్లి ఆమె రహస్యం తెలుసుకునే ప్రయత్నం చేసింది. చూస్తుండగానే అబ్బాయి పాత గిన్నెను నడుముకు కట్టుకున్న గుడ్డలో నుంచి బయటకు తీసి ముందు పెట్టుకున్నాడు. ఇవాళ నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నం, మంచి మాంసం కూర కావాలి. ఎర్ర బియ్యం అన్నం కావాలి. సింగ్ చాంగ్ కూడా కావాలి, అన్నాడు.
కళ్ళు మూసి తెరిచేలోగా అడిగినవన్నీ అబ్బాయి ముందు ఉన్నాయి. బాంగ్ చుంగ్ నిండా వేడివేడి ఎర్ర అన్నం ఉంది. అన్నం మెతుకులు మిలమిలలాడుతున్నాయి. ఆమె అటువంటి అన్నం అంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఇక డాపా కంచంలో రకరకాల మాంసం కూరలున్నాయి. పచ్చని, ఎర్రని మిరపకాయలు కూడా ఉన్నాయి. సన్నగా తరిగిన ముల్లంగి ముక్కలు కూడా ఉన్నాయి. మొత్తం వంట ఆవిర్లు కక్కుతున్నది. అంటే అప్పుడే వండినట్టు ఉన్నది. అబ్బాయి మాత్రం ఆశ్చర్యం కనపరచకుండా తిండి తింటున్నాడు. లొట్టలు వేస్తూ రుచిని అనుభవిస్తూ పట్టినంత తినేశాడు. అందమైన బామై రూచుంగ్ పాత్రలో సింగ్ చాంగ్ పోసుకున్నాడు. హాయిగా దాన్ని తాగేశాడు. పక్క ఇంటి యజమానురాలికి పట్టరాని అసూయ కలిగింది. ఎలాగైనా ఆ గిన్నెను తాను కాజేయాలని ఆమె పథకం వేసింది. బీద పిల్లవాడిని పిలిచి ఏదో పని చెప్పి పక్క ఊరికి పంపించింది. ఆ ఊరు పక్కలోయలో ఉంది. బాబుతో బాటు ఆమె తన కొడుకును కూడా పంపించింది. పక్క లోయకు వెళ్లాలంటే వాళ్లు ఎన్నో వాగులు, వంకలు దాటాలి. అలా ప్రయాణం కొన్ని రోజులపాటు సాగుతుంది. అంత కాలం పాటు అతని గిన్నెను తాను దాచి ఉంచుతానని ఆమె బాబుకు చెప్పింది. అతను అమాయకంగా నమ్మి గిన్నెను ఇచ్చాడు.
కొన్నిరోజుల తరువాత అబ్బాయిలు ఇద్దరు తిరిగివచ్చారు. యజమానురాలు ఒక గిన్నెను బాబుకు తిరిగి ఇచ్చింది. నిజంగా జరిగింది ఏమంటే, అక్షయపాత్రను ఆమె దాచుకుని అటువంటిదే మరొక గిన్నెను బాబుకు ఇచ్చింది. బీద అబ్బాయి తన ఇంటికి వెళ్ళాడు. తిండికోసం గిన్నెను అడిగాడు. ఒక్కసారి కాదు, పదేపదే అడిగాడు. ఈ గిన్నె తిండి పెట్టలేదు. బాబుకు కోపం వచ్చింది. గిన్నె తీసుకుని పిచ్చుకల వద్దకు వెళ్ళాడు. గిన్నె పనిచేయడం లేదని కోపంగా చెప్పాడు. ఈసారి పిచ్చుకల తండ్రి, బాబుకు ఒక మేకపిల్లను ఇచ్చాడు. మేకపిల్లకు స్నానం పోసి తడితే చాలు, అది నీకు కావలసినంత డబ్బు ఇస్తుంది. దానితో నీవు తిండి కొనవచ్చు, అని చెప్పాడు.
కుర్రవాడు ఇంటికి వెళ్లగానే మేకపిల్లకు స్నానం పోసి తట్టాడు. దాని ఒంటినుండి బంగారం, వెండి నాణేలు రాలాయి. హాయిగా బతక సాగాడు. పక్కింటి యజమానురాలికి మళ్ళీ అనుమానం పుట్టింది. ఆమె మేకపిల్ల సంగతి గమనించింది. అది తనకు కావాలి, అనుకున్నది. పన్నాగం చేసి ఒక మామూలు మేకపిల్లను అంటగట్టింది. మేకపిల్ల డబ్బులు ఇవ్వడంలేదని గమనించిన బాబు, మళ్లీ పిచ్చుకల వద్దకు వెళ్ళాడు. నేను ఇచ్చిన రెండు బహుమానాలను నీవు జాగ్రత్తగా ఉంచుకోలేక పోయావు. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంకా ఏమీలేదు. ఒక దుడ్డుకర్ర మాత్రం ఉన్నది. అది కూడా, ఏదో రకంగా పనికి వస్తుంది. తీసుకువెళ్ళు. మళ్లీ మాత్రం నా వద్దకు రావద్దు. ఇప్పటికే నీకు చాలా ఇచ్చాను, అన్నది తండ్రి పిచ్చుక.
అబ్బాయి నిరాశలో మునిగి, ఇంతకూ ఈ కర్ర ఏం చేస్తుంది అని అడిగాడు. ఎవరినైనా కొట్టమంటే కొడుతుంది, అన్నాడు పిచ్చుకల తండ్రి.
దానికి నిత్యం పూజ చెయ్యి. మూడుసార్లు దండం పెట్టు. ఎవరిని కొట్టాలో చెప్పు. అప్పుడది వాళ్లను కొడుతుంది, పిచ్చుక మాటలు అవి.
బీద కుర్రవాడు ఇంటికి వచ్చాడు. ఈసారి ఏమి తెచ్చాడని చూడడానికి పక్కింటావిడ కూడా వచ్చింది. అప్పటికే కుర్రవానికి తన గిన్నె, మేక ఏమైంది అన్న సంగతి అర్థమయింది. కొంచెం ఆగితే అది ఏం చేస్తుందో చూపిస్తాను అని, దుడ్డు కర్రను చూపించాడు.
ముసలావిడకు మహా ఆత్రంగా ఉంది. ఈలోగా అబ్బాయి దుడ్డుకర్రకు పూజ చేశాడు. దానికి ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఏం జరుగుతుందో తెలిసేలోగా కర్ర ముసలామె వైపు వచ్చి అదేపనిగా కొట్టసాగింది. ఆమె తన ఇంట్లోకి పరుగు పెట్టింది. అయినా కర్ర వెంటబడి కొడుతూనే ఉన్నది. ఆవిడ పడుతూ లేస్తూ బాబోయ్, తప్పు తెలిసింది. నీ వస్తువులు నీకు ఇచ్చేస్తాను. ఈ కర్రను వెనుకకు పిలువు, అంటూ మొర పెట్టుకున్నది.
బాబు కర్రను వెనుకకు పిలిచాడు.
పక్కింటి యజమానురాలు దొంగిలించిన గిన్నెను, మేక పిల్లను తెచ్చింది. బాబుకు ఇచ్చింది. చేతులు జోడించి మళ్లీ దుడ్డుకర్రను మాత్రం నా మీదికి పంపకు అన్నది.
పిచ్చుకలు ఇచ్చిన మూడు బహుమానాలు మళ్ళీ పిల్లవాడికి దొరికాయి. తరువాత అతను హాయిగా బతికాడు.