ఓహ్ కలకత్తా
చదువరీ! మీరీ లోకాభిరామమున క్రమముగ నాతోబాటు
సంచరించుచుంటిరా? ధన్యవాదములు. కాని మిమ్ము కలకత్తా నగరపు
బస్సులు, ట్రాములలో వదిలి నేను మరి ఎక్కడికో
వెళ్లినట్లుంటిని. రండు, మరొకమారు కలకత్తాలో తిరుగుదము. తొలి విడత జ్ఞాపకములే
తంపరలుగ తలలెత్తుచున్నవి!
బురద: కలకత్తాకు నేను మొదటిసారి వానల సీజన్‌లో
పోయినట్లున్న. అక్కడ బోలెడంత బీదతనం, పాతదనం ఎదురయినయి.
భవనాలన్నీ పాతవి. ప్రతి ఆవరణలోనూ నాలుగు మూలల నీటి మడుగు, అందులో చేపలుంటయట. మరీ సముద్రం తేమ వాతావరణం. స్నానం చేసి బయటకు వస్తుంటే
ఒళ్లు మళ్లీ జిడ్డుగ ఉంటుంది. అక్కడి వారికది అలవాట వుతుందేమో. ముత్యాలలాగ
ఉంటరందర. పరిశోధన సంస్థలో కూడా పొడగరి మగవారు, సిసలయిన బెంగాలీ పంచెకట్టులో రావడం గమనించిన. వారెంత శుభ్రంగా ఉంటరో నగరమంత
మురికిగ ఉంది అప్పట్లో. నగరం నడిబొడ్డున వారాలపాటు చెత్తకుప్పలు ఉండడం చూచిన.
పులి మీద పుట్ర అన్నట్టు (అంటే ఏమిటని, నాకయితే తెలియదు) వాన మొదలయింది. కలకత్తాలో బురద నల్లగ
ఉంది. బట్టలకు తగిలితే వదలదని చెప్పినరు. నగరంలోని కేంద్రంలో ఒకచోట డక్‌బ్యాక్
అని ఒక అంగడి ఉంది. ఆ బ్రాండ్ రెయిన్ కోట్లు ఉంటయని తెలుసు. గాలి ఊది నింపే
దిండ్లు కూడ ఉన్నయి వారి దగ్గర. అన్నిటికీ మించి గనుల్లో వాడే గమ్‌బూట్లు, పిక్కల దాకా ఉండేవి అమ్ముతున్నరు! నమ్మండి. వాటిని కొనేందుకు
అందరూ క్యూలో నిలబడి ఉన్నరు. ఆ ఊరంతా నల్లని బురద. కనుక బురద నుంచి రక్షణ!
బీదవాళ్లుండే గుడిసెలు, కోడిగూళ్లలాగున్నయి. వానతో వాటి చుట్టు బురద
చీదరయింది. పాపం ఎట్ల బతుకుతరో అనిపించింది.
కలకత్తాలో మనుషులు తొక్కేవికాక, లాగే రిక్షాలున్నాయి. ఆ రిక్షా వాళ్ల దగ్గర ఒక సత్తు కంచం
ఉంటుంది. పేలపిండి లాంటి పిండి, కానీ పసుపు చాయలో
ఉంది. కంచంలో కొలిపించుకుని, నీరు కలిపి పిసికి
తింటున్నరు. కొంచెం ఉప్పు, లేదా బెల్లం ముక్క
ఆధరువు! అదే తిండి. మరి ఇల్లంటూ ఉందా? ఏమో?
భీ భిల్ భెయిట్: బి.ఎన్.ముఖర్జీ అనే
బిశ్వనాథ్ బాబూ గురించి చెప్పకుండా కలకత్తా యాత్ర పూర్తి కాకూడదు. సన్నిహితులకు
ఆయన బిషన్‌దా! హ్యూమన్ జెనెటిక్స్, అందునా నేను
ఎన్నుకున్న పాపులేషన్ జెనెటిక్స్ రంగంలో పేరెన్నికగన్న పరిశోధకుడు. ఆయనను చూస్తే,
సంస్థలో ఏ క్లర్కుగానో పని చేస్తాడేమో అనిపించేంత సాదాసీదా
మనిషి. సొంత తమ్ముళ్లలాగ మా ముగ్గురిని (నేను, పటియాలా పిల్లలిద్దరు) అక్కున చేర్చుకున్నడాయన. ఏ మాత్రం దాచకుండా, తాము వాడుతున్న సాంకేతిక పద్ధతులన్నీ మాకు నేర్పసాగినడు.
అప్పట్లో కలకత్తాలో విద్యుత్తు కొరత బాగ ఉంది. కరెంటు గంటలపాటు పోతుంది. దాని పేరు
లోడ్ షెడింగ్. వచ్చినప్పుడు వోల్టేజ్ సరిగా ఉండదు. మా ప్రయోగాలు, కరెంటు మీద ఆధారపడే రకం. కరెంటు రాగానే బిషన్‌దా ‘హౌ ఇజ్ ధ
భోల్టేజ్’ అని అడిగేవాడు. ప్రయోగం పెట్టిన తరువాత ‘భి భిల్ హోప్’ అనేవాడు.
కరెంటు పొయ్యిందనుకోండి. ‘భి భిల్ భెయిట్’ అనేవాడు. ఆశావాదం. మరీ మంచి వాడు
బిషేన్‌దా. (దా, దాదా అన్నవి ‘అన్న’ను సంబోధించే మాటలు) ఆయన
దగ్గర ఎంతో నేర్చుకున్న. అందులో కొంత సైన్సు. మిగిలింది సెన్సు!
ల్యాబ్‌లో ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్స్
ఉండేవారు. ఆశ్చర్యం ఏమిటంటే, లాబ్ నుంచి
ప్రకటించిన పరిశోధన పత్రాలలో అన్నింటిలోనూ సైంటిస్టులతో బాటు వీళ్ల పేర్లు కూడా
ఉండేవి. ఆ ఇద్దర్లో ఒకతను దోస్త్ అయ్యినడు. కలిసి ఊరు తిరగడానికి కూడా వచ్చినడు.
ఒకచోట పెద్ద హోర్డింగ్ చూచి ‘సాధనా ఔషధాలయ్’ అని చదివిన. ఇంచుమించు హిందీ
అక్షరాలే. కనుక చదవగలిగిన. మిత్రుడు ‘నీకు బెంగాలీ వచ్చా?’ అంటూ ఆశ్చర్యపోయినడు. ‘ఓ! వచ్చు!’ అని గొప్పలు పోయిన. ‘బ్రిష్టి పొరిచేన్’
అన్నడు. వాన కురుస్తున్నది అంటున్నావని ఇంగ్లీషులో చెప్పిన. సంస్కృతంలో వృష్టి
అంటే వర్షం. చినుకులు పడుతున్నయి. కాస్తంత కామన్‌సెన్స్. ‘నీకు నిజంగా బంగ్లా
తెలుసులాగుంద’ని అతను ఆశ్చర్యపోయినడు.
శరత్‌బాబు: బొన్‌హుగ్లీలో ఐఎస్‌ఐ హాస్టల్,
సంస్థ ఆవరణలోనే ఉంది. ముందుండే రోడ్డు దాటితే చిన్నచిన్న
దుకాణాలుండేవి. వాటిలో ఒక దాంట్లో బిస్కెట్లు, చిరుతిండి అమ్ముతరు. ఒక యువకుడు, చదువుకున్న మనిషి,
ఆ అంగడిని నడుపుతున్నడు. బ్రిటానియా బిస్కెట్లకు కలకత్తా
కేంద్రం. అన్ని రకాల బిస్కెట్ల పొట్లాలలో కాక, బరువు ప్రకారం అమ్ము తడతను. నాకు మొదటి నుంచీ బిస్కెట్లంటే ప్రాణం. కొందమని
వెళ్లిన. అంగట్లో లోపట ఒక క్యాలెండర్ ఉంది. ఆశ్చర్యంగా దాని మీద నవలాకారుడు
శరచ్చంద్ర ఛటర్జీ బొమ్మ ఉంది. ‘శరత్‌బాబు’ అన్న ఆశ్చర్యంగనే. మన దగ్గర రచయితల
క్యాలెండర్ కలలోని మాట. అతనికి నేను స్థానికుడిని కానని తెలుసు. అతను అంతకన్న
ఆశ్చర్యపోయినడు. ‘నీకెట్లా తెలుస’న్నడు. ‘తెలియడమేమిటి? ఆయన నవలలు, కథలు అన్నీ చదివిన’ అన్న నేను. నేను తీవ్రంగా
అభిమానించే నలుగురయిదుగురు రచయితలలో శరత్ ఒకరు. నాటికీ, నేటికీ. ఇద్దరమూ, అనువాదాల గురించి బెంగాలీ రచయితల గురించి చర్చ
సాగించినము. నేను రోడ్డు మీద కనిపిస్తే చాలు ‘పండిత్ మోషాయ్! (మహాశయ్!)
నొమొష్కార్!’ అని పలకరించినడాయన నేనున్నన్ని నాళ్లూనూ!
పుస్తకాల ప్రసక్తి వచ్చింది గనుక, కలకత్తాలోని రొబీంద్ర సరణి ప్రాంతంలోని సెకండ్ హ్యాండ్
పుస్తకాల అంగళ్లను గురించి చెప్పుకోవాలె. అక్కడ వరుసబెట్టి దుకాణాలు. అరుదయిన
పుస్తకాలు దొరుకుతయి. అది యూనివర్సిటీ దగ్గరి ప్రాంతం. అందరూ ముగియబడి పుస్తకాలు
కొంటుంటరు. ఆ ప్రాంతంలోనే ఇండియా కాఫీ హౌస్ ఉంటుంది. ఉండేది అనాలె. దాన్ని
ఎత్తివేశినరట. రబీంద్రనాథ్ టాగోర్ నిత్యమూ అక్కడ వచ్చి టీ తాగేవాడట. రెండు
కప్పులూ టీ అడిగేవాడట. ఎందుకు అని అడిగితే ఒకటి నాకు, మరొకటి గడ్డానికి అనేవాడట.
ఆ పక్కనే మరొక వీధి ఉంటుంది. చైనా బజార్
అంటారేమో గుర్తు లేదు. అక్కడ అంగళ్లన్నీ చైనా వారు నడుపుతరు. అక్కడ అన్ని రకాల
పాదరక్షలు అమ్ముతరు. ఒకనాడు వెళ్లి కొలత ఇస్తే, మనకు కావలసిన రకంగా షూస్, శాండల్స్ కుట్టి
ఇస్తరు. వాళ్ల మెటీరియల్, డిజైన్లు
బాగున్నాయి. నేను షూస్, శాండల్ (బెల్ట్
బూట్స్) రెండూ కుట్టించుకున్న. మూడవ నాడు డెలివరీ, ధర చాలా సరసమయింది. హైదరాబాద్‌లో యూనివర్సిటీలో ఎంతమంది అడిగినరో వాటి
గురించి!
కలకత్తాలో తిండితోబాటు, అన్నీ చవకగ దొరుకుతాయనిపించింది. వంద రూపాయలకు మంచి సూట్‌కేస్ కొన్న. జ్యూట్
సంచులు, అందమయినవి కొన్ని తెచ్చిన. తిండి, మిఠాయిల సంగతి చెప్ప నవసరం లేదు. గ్రేట్ ఈస్టర్న్ హోటేల్
ప్రాంతంలో ఒక స్వీట్‌షాప్, రెస్టారెంట్ ఉంది.
మనకు తెలియని రకాలెన్నో అక్కడ దొరికినయి. వీలయినన్ని సార్లు అక్కడికి వెళ్లి
వీలయినన్ని రకాలు తిన్న. మొదలే స్వీట్లంటే ఇష్టం. అది బెంగాలీ వారి మూల లక్షణాలలో
ఒకటని తెలిసిపోయింది. ఎన్ని స్వీట్లు తిన్ననో తెలియదు.
రసగుల్లా (ఛ, రొష్షగొల్లా అనాలి)లను కనుగొన్న కె.సీ.దాస్ వారి అంగడి ప్రపంచ
ప్రసిద్ధమయినది. ఇరవయికి పైన రకాల రసగుల్లాలున్నయి అక్కడ. అప్పటికే సీల్ చేసిన
టిన్నులు అమ్మడం మొదలయింది. రెండు టిన్నులు కొన్న. అక్కడే సూట్‌కేస్ కూడా కొన్న
గనుక, దాన్ని నింపాలి. హాస్టల్లో మిత్రులకు ఇవ్వాలనే
మంచి ఉద్దేశంతో మరేవో స్వీట్లు అట్టపెట్టెలో కొన్న. అది నేను బయలుదేరే రోజు. చాలా
ముందుగ బయలుదేరకపోతే ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుంటవని హెచ్చరించినరు. మధ్యాహ్నమే
బయలు దేరాలె. నేను గదికి వచ్చేసరికి హాస్టల్లో ఎవరూ లేరు. ల్యాబ్‌కు వెళ్లే టైం
లేదు. వీడ్కోలు కార్యక్రమం అయిపోయింది. అట్టపెట్టె స్వీట్లు, సూట్‌కేస్‌లో పెట్టడానికి లేదు. బెంగాలీ తడి రకం. కనుక
మొత్తమన్నీ లంచ్‌గ తినేశిన.
పార్క్ స్ట్రీట్ అమ్మాయి: ఈ అమ్మాయిని
గురించి చెప్పకుండా ముగించడం అన్యాయమే అవుతుంది. పార్క్ స్ట్రీట్ అంటే, కలకత్తాలోని మాడరన్ షాపింగ్ ప్రాంతం. అంగళ్ల మధ్యన విండో
షాపింగ్ చేస్తూ తిరుగుతున్న. ఒక అందమయిన అమ్మాయి, చక్కని దుస్తుల్లో ఉంది. నన్ను చూచి చిరునవ్వింది. అర్థంగాక నా మానాన నేను
పోతున్న. వెంట నడిచింది. కాసేపటికి నా చేయి పట్టుకున్నది. ‘మా ఇంటికి పోదాం పద!’
అన్నది. మట్టిబుర్ర నాది. అర్థం కాలేదు మొదట్లో. అర్థమయింతరువాత ‘రాను’ అన్న.
నాలుగు రోజుల తరువాత మళ్లీ కనిపించింది. నవ్వింది. ‘నీవు పిరికివానివి’ అనేసి
వెళ్లిపోయింది.

































