Friday, February 13, 2026

గాలి గురించి - కొన్ని విశేషాలు - About the air around us!


గాలి గురించి - కొన్ని విశేషాలు


ప్రతి కుటుంబంలోను ఆ ఇంటివాళ్లకు మాత్రమే అర్థమయ్యే మాటలు, జోకులు కొన్ని ఉంటయి. మా ఇంట్లో కూడా మామూలుగానే మాటలు, జోకులు కొన్ని ఉన్నాయి. కొత్తగా తెలియని తిండి పదార్థం ఏదో ఒకటి ఒకనాడు బల్లమీదికి వచ్చినట్టుంది. మా అమ్మాయి ‘దీన్ని ఏమంటరు?’ అని అడిగింది. మామూలుగనే సరదాగ మాట్లాడే మా అబ్బాయి చటుక్కున ‘ఏమీ అనరు! తింటరు!’ అన్నడు. ఆ తరువాత మేము చాల సందర్భాలలో ప్రశ్న అడగకుండ తింటరు అంటూ తింటుంటము.

ఏదో కొత్త వస్తువు ఎదురుగ వస్తుంది. ఒకప్పుడయితే, దీన్ని దేనితో చేసినరు అని అడగడం అలవాటు. చాలకాలం వరకు మనిషి చేసిన వస్తువులన్నీ లోహం, కర్ర లేదంటే రాయిలాంటి వాటితో తయారయ్యేవి. మధ్యలో పింగాణి వచ్చింది. ఆ తరువాత చూస్తుండగానే ఫైబర్‌ గ్లాస్‌ వచ్చింది. బేకలైట్‌ వంటి రకరకాల కాంపోజిట్‌ బోర్డులు వచ్చినయి. ఇక వచ్చిన వేలాది ప్లాస్టిక్‌ల గురించి వేరుగ చెప్పుకోవలసి ఉంటుంది. మొత్తానికి ఎదురుగ వచ్చిన వస్తువు ఏ రకమయినది అని అర్థం చేసుకోవడానికి అందరూ తికమక పడిపోతున్నరు. చేతికందిన సీసా లేక గ్లాసు ఎలాంటిది తెలుసుకోవాలంటే ఒకతను సూది కాల్చి గుచ్చి చూడమన్నడు. ప్లాస్టిక్‌ అయితే కాలి రంధ్రం పడుతుంది మరి. ఎవరు మాత్రం కావాలని తన వస్తువులో రంధ్రాలు పొడుచుకుంటరు? కనుక పాత్ర సంగతి అర్థంకాకుండనే ఉండిపోతుంది. కొత్తగ కొన్న గుడ్డ కృత్రిమంగ తయారయిందా లేక సహజంగా పండిన పత్తినుంచి వచ్చిందా తెలుసుకోవాలంటే దానిలోని ఒక చివరన నిప్పు పెట్టిచూడాలె. ప్రపంచం ఇట్లాగయ్యింది.

చేతికి ఏదో అంటుకుంటుంది. మరోవేలితో ముట్టుకుని చూస్తే అది జిగురుగ ఉంటుంది. ‘శాణకు మూడుచోట్లు’ అని  మాకొక మాట ఉంది. అంటిందేదో మొదటిచోటు. కంటిముందు పెట్టుకుంటే రెండవచోటు. దాని వాసన కూడా చూస్తే మూడవచోటు. ఇక చివరికి ఆ అంటిన వస్తువు అసహ్యమయినదని తెలిస్తే అప్పుడు అసలు బాధ మొదలవుతుంది. దాన్ని వదిలించుకోవాలె. అందుకోసం సబ్బు వాడాలె. అన్నట్టు ఏం చేసి సబ్బు ఒంటికి అంటిన మకిలిని వదిలిస్తుంది? ఈ ప్రశ్నకు జవాబు అడగకుండనే అందరూ సబ్బును వాడుకుంటున్నరు. కొందరు సబ్బు కూడ వాడకుండా అదేపనిగ కేవలం నీళ్లతోనే ముఖాన్ని రుద్దేసుకుంటరు. నిజానికి సబ్బు అణువుకు రెండు కొండ్లు అంటే కొక్కాలు ఉంటయి. వాటిలో ఒకటి నీటి అణువును పట్టుకుంటుంది. మరొకటి చమురు అణువును పట్టుకుంటుంది. ఈ రకంగా సబ్బు అణువు చమురును పట్టుకుని, నీటితో తేలుతూ చేతినుంచి లేదా గుడ్డనుంచి దూరం పోతుంది. అంటినది చమురు కాకుంటే సబ్బుతో కూడ వదలదని అర్థం.

ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న పదార్థాలలో గాలి విచిత్రమయినది. పుట్టిన మరుక్షణం నుంచి చచ్చేవరకు మనం గాలి పీలుస్తనే ఉంటము. గ్రహం చుట్ట గాలిలేకపోతే మనం ఇట్లాగ ఉండగలిగే వాళ్లం కాదు. వాతావరణం అంటే చుట్టుకున్న గాలి అని అర్థం. ఇంత ముఖ్యమయినది అయినా గాలి గురించి ‘ఇది దేనితో తయారయింది?’ అని మాత్రం అడగకుండనే మనమంతా దాన్ని పీల్చేసి బతుకుతున్నము.

మనం ఒక్కసారి గాలి పీలిస్తే, అందులో అప్పటివరకు బతికిన మనుషులందర ఒక్కొక్కరు వదిలిన ఒక్క అణువయినా ఉంటుందట. మరింత గట్టిగ లెక్కచెప్పాలంటే ఇప్పటికి పుట్టి గిట్టిన వాళ్లందరు, ప్రస్తుతం బతికి ఉన్న వాళ్లలో కనీసం ఆరేళ్ల వయసు గలవాళ్లందరు ప్రపంచం మొత్తంమీదట పీల్చి వదిలిన గాలిని మనం ప్రతి శ్వాసలోను పంచుకుంటమట. ఒకరు వదిలిన గాలి మొత్తం భూమి వాతావరణంలో వ్యాపించి కలవడానికి ఆరు సంవత్సరాలు పడుతుంది. కనుకనే ఈ లెక్కలో ఆరేళ్ల కన్న చిన్న పిల్లలను చేర్చలేదని అర్థం చేసుకోవాలె. మనకు ఆరేళ్లు నిండిన నాటినుంచి మనం వదిలిన గాలిలోని ఒక్కొక్క అణువును ఈ ప్రపంచంలోని వారంత అణుక్షణం పీలుస్తున్నరని వేరుగ చెప్పనవసరం లేదు. గాలి గురించి ఒక్కసంగతి చెపితేనే బుర్రతిరిగి పోయే తీరుగ ఉంది. ఇంకా లోతుకు వెళితే ఎన్నెన్ని ఆశ్చర్యాలు ఎదురవుతయో తెలియదు.

పరిణామం జరుగుతుంటే ఒకప్పుడు కొన్ని జంతువులు మొప్పల పద్ధతిని పక్కనబెట్టి ఊపిరి తిత్తులతో నేరుగ గాలి పీల్చడం మొదలయింది. అప్పటి నుంచి ఈ గాలి పంపకం జరుగుతునే ఉన్నది. ఇప్పటి మనలాగే అప్పటినుంచి ఎవరూ గాలి గురించి పట్టించుకోలేదు. సుమారు ఓ వందేళ్ల క్రితం మాత్రం ఇద్దరు పరిశోధకులు ఈ విషయంగా బుర్రలు చించుకున్నరు. కనిపించని గాలి గురించి కనిపించని అంశాలను తెలుసుకోవాలని ప్రయత్నించినరు. అయినాసరే వాళ్లు కనుగొన్న సంగతులు ఎవరికీ పట్టకుండనే ఉండిపోయినయి. వాతావరణం గురించి మనం పట్టించుకోము. ఈ వాతావరణం లేకుంటే మనం బతకలేము. కానీ జీవం పుట్టిననాటి నుంచి వాతావరణం ఒకేరకంగ కాకున్నా ఉండను మాత్రం ఉంటున్నది. మన ప్రాణాలను  ప్రశ్నలడగకుండ అది నిలబెడుతనే ఉన్నది. అయితే మామూలుగ జరిగే ఏ విషయాన్ని మనిషి ప్రశ్నించడు. సూర్యుడు రోజూ కనిపిస్తడు. కనుక అందులో ఆశ్చర్యం లేదు. అనుక్షణం గాలి పీలుస్తము. కనుక అందులో ఆశ్చర్యం లేదు. సూర్యుడు కనిపించని రోజున కనీసం వెలుగు కనిపిస్తుంది. గాలి మామూలుగా లేనిచోట్ల కూడా ఏదో గాలి ఉండనే ఉంటుది. కనుక మనకు వాటి సంగతి పట్టదు.

ఇప్పుడు గాలి గురించి మరొక విచిత్రమయిన సంగతి చెపితే ముక్కున వేలు వేసుకుంటరో, పక్కకు తిరిగి కనుబొమ్మలు ఎగరేస్తరో మీ ఇష్టం. పుట్టిన నాటినుంచి ఊపిరి ఆగేవరకు అంటే ప్రాణం పోయేవరకు మనం పీల్చేగాలిలో మనకు ఏ రకంగాను పనికిరాని నైట్రోజన్‌ అనే నత్రజని ఎక్కువగ ఉంటుంది. చుట్టూ ఉన్న గాలిలో మరి ఆ వాయువు 78 శాతం ఉంటుంది. అంత నత్రజనిని ఊపిరితిత్తులలోకి పీల్చినా మనకు అపాయం మాత్రం జరగదు. దానివల్ల సాయం జరగకపోతే అది వేరే సంగతి. దూరం నుంచి వినిపించే పాటలాగ అది చికాకు కాదు, పనికి వచ్చేది అంతకన్నా కాదు.

గాలిలో ఇంచుమించు అయిదో భాగం వరకు ప్రాణవాయువు అనే ఆక్సిజన్‌ ఉంటుంది. ఈ పేరు వినిపించగానే మన ప్రాణాలకు అదే ఆధారం అని అందరూ భుజాలు ఎగరేస్తరు. మూలకాలలో అన్నిటికన్నా ఎక్కువ ప్రచారం ఉన్నది ప్రాణవాయువేనేమో. ఈ మధ్యన ఆక్సిజన్‌ను అంగళ్లలో అమ్ముతున్నరట కూడా. కాలుష్యం కారణంగ సాయంత్రం కల్ల అలసటకు గురయిన వారు ఆక్సిజన్‌ బార్‌లకు చేరి అక్కడ కాసేపు శుభ్రమయిన వాయువును పీల్చి తేరుకుంటున్నరు. ఈ విశ్వంలో అన్నిటికన్న ఎక్కువగ ఉండే మూలకాలను లెక్కబెడితే ఆక్సిజన్‌ మూడవ స్థానంలో వస్తుంది. అది మన భూగ్రహం మీద మరింత ఎక్కువగ ఉంటుంది. మరింత చిక్కగనూ ఉంటుంది. ప్రాణవాయువు ప్రతి మూలన ఉంటుంది. చివరికి మరే వాయువుకు వీలులేని చోట కూడా ప్రాణవాయువు దూరి చేరుకుంటుంది. ప్రతి ఇసుక కణానికి ప్రాణవాయువు చుట్టుకుని ఉంటుంది. ప్రాణవాయువు కారణంగనే మన శరీరాల వయసు పెరుగుతున్నది అంటే నమ్మగలరా.

ఈ విశ్వంలో ఇంతగా ప్రాణవాయువు నిండుకున్న వాతావరణంగల నిర్మాణం భూమికాక మరొకటి లేదు. విశ్వంలోని మరే గోళంమీద చెట్లు లేవు. చెట్లు ప్రాణవాయువును వదులుతయని మీకు తెలిస్తే సంతోషం. తెలియకుంటే తెలుసుకోవాలె. చెట్లున్నయి కనుకనే భూవాతావరణంలో చిక్కగ ప్రాణవాయువు నిండి ఉంది. దూరంనుంచి చూస్తే ప్రాణవాయువు నుంచి ఒక రకమయిన ఆకుపచ్చని వెలుగు విరజిమ్ముతుంది. విశ్వంలోని అణువులకన్న చిన్న కణాల తాకిడి కారణంగా వాయువు ఈ రకంగ వెలుగుతుంది. ఈ రకమయిన ఆకుపచ్చ వెలుగు విశ్వంలో మరెక్కడయినా కనిపిస్తే అక్కడ కూడా భూమి మీదలాంటి జీవం ఉండవచ్చునని సులభంగా ఊహించవచ్చు. విశ్వంలో చెట్లు ఎక్కడ ఉన్నా ఈ రకమయిన వెలుగుతో తమ ఉనికిని ప్రకటించుకుంటాయని చెప్పవచ్చు. 



 

No comments: