Wednesday, May 6, 2015

Damerla Ramarao - obit

This is an article published in the magazine Sharada after the sad demise of the young artiste.

దామెర్ల రామారావు


                రాజమహేంద్రవర పుర వాస్తవ్యులగు దామెర్ల రామారావుగారి యకాలమరణమును గూర్చి నివేదించుట కెంతయు చింతిలుచున్నారము. వీరి కిరువది యేడువత్సరములు మాత్రమే వయస్సు. కాని వారికిప్పుడే శతవర్ష పరిమితి యగుట యాంధ్రుల దురదృష్టమనుటకు సందియములేదు. వీరాంధ్ర దేశమునందేకాక భారతదేశము నందును ` ఖండాంతరముల యందుగూడ కీర్తిగణించిరి. వీరివలననే దేశ దేశాంతరములు ` ఖండ ఖండాంతరములయందు శిల్ప కళాసామ్రాజ్యము నందాంధ్రుల కర్హస్థానము లభించునని యువ్విళ్లూరుతుండ బంధుమిత్రులు, విద్యార్థులు, విద్యాధికుల కోరికల నూడబెరికి రామారావుగారిని పరలోకమునకుగొని యేగిన విధి నేమన వలయును?

                వీరితండ్రి దామెర్ల రమణారావు పంతులుగారు ప్రసిద్ధికెక్కిన వైద్యులైయుండిరి. సంఘసంస్కార ప్రియులు. వీరేశలింగం పంతులుగారికి కుడిభజమైయుండిరి. అందువలననే వారు పుత్రికా పుత్రుల కున్నతవిద్య జెప్పించి పరమపదించిరి. వీరియున్న గారగు వేంకటరావుగారు కూల్డ్రేగారి శిష్యులు. ఆర్ట్సు కాలేజి ప్రింసిపాలగు కూల్డేగారే రాజమహేంద్ర వరమున శిల్పబీజముల నాటిన మహనీయుడు. చాలమంది యువకులను చేర దీసి కళావిషయముల బోధించియుండిరి. వారి యపూర్వాదరణకు బాత్రమైన వారిలో ముఖ్యులు మన రామారావు గారొక్కరు.

                రామారావుగారికి స్వభావ సిద్ధముగనే శిల్పకళ యలవడెను. ఈయన బాల్యము నుండియు చిత్తరువుల రచించుచుండిరి. వీరు చిన్నప్పుడు స్వతంత్రముగ రచించిన చిత్తరువుల గాంచి కూల్డేగా రానంద భరితులై యీతడాంధ్రదేశమున శిల్పపీఠము నలంకరింప గలడను నమ్మకమున ధనసహాయమొనర్చి బొంబాయియందు గవర్నమెంటువారు స్ధాపించిన శిల్ప కళాశాలకు బంపించిరి.
                అచ్చటనయిదువత్సరములు శిల్పవిద్యనభ్యసింపవలయును. కాని ప్రధమముననే రామరావుగారిన మూడవతరగతియందు జేర్చుకొనిరి. ఉపాధ్యాయులు విద్యార్ధులు నబ్బురబాటు జెంద వీరుమూడువత్సరములలో సంపూర్ణ పాండిత్యమునార్జించి ప్రఖ్యాతిగాంచిరి. ఆ కాలేజి ప్రింసిపాలగు సాలమనుగారు అజంటా పద్ధతులనుగ ఊడ తన పద్ధతులయందు జొప్పింపజొచ్చెను. రామారావుగారు సాలమను మొదలగు ప్రముఖుల యాశీర్వాదమునొంది యజంటాకేగి యచ్చటి మనోహర ప్రాచ్య శిల్ప చిత్తరువులగాంచి కలకత్తాకేగి జగద్వ్యిఖ్యాతి గాంచిన భారతీయ చిత్రకళాచార్యులగు అవనీంద్ర నాధటాగూరు, గగనేంద్ర నాధటాగూరు, నందలాల్‌బోసు మొదలగు శేముషీ దురంధరుల దర్శించి పావనగోదా నరీసలిలముల పవిత్రమగుచున్న రాజమహేంద్ర పురమున స్వగృహమునందు చిత్రరచనకు గడంగిరి. వీరురచించిన గోదావరి చిత్తరువునొక దానిని శారద, యందు బ్రచురించు యుంటిమి. ఆ చిత్తరువు పాఠకుల మిక్కుటముగ నాకర్షించియుంట యతిశయోక్తిగాదు. రాజమహేంద్రవరము కాకినాడ పురములయందు జరిగిన ప్రదర్శనములయందు వీరికి ప్రధమ బహుమానము వచ్చెను.

                1922 సంవత్సరమున కలకత్తాయందు జరిగిన ప్రాచ్యశిల్ప ప్రదర్శనమును గాంచుట కేగియుంటిమి. అప్పుడేమఱి యొకచోట గవర్ణమెంటువారొక శిల్ప ప్రదర్శనమును బెట్టిరి. అందు రామారావుగారి చిత్తరువులకు ప్రధమ బహుమానము. వచ్చుటయే కాక, ఈతనినామధేయము కలకత్తాయందంతటను మారు మ్రోగెను. కొందఱు స్నేహితులు రామారావుగారి చిత్రములగూర్చి మాతో ప్రసంగింపుచు, నాతని కళానిపుణతను శతముఖముల వెల్లడిరచిరి ` అండను నందు జరిగినవెంబ్లీ యెగ్జిబిషను నందు వీరి 
చిత్తరువులు గణకెక్కెను. కెనడా యెగ్జిబిషనునకు వీరి బొమ్మలలో కొన్నిటి నెన్నిరి `


                శుక్లపక్ష చంద్రుని బోలినది దినాభివృద్ధి గాంచుచున్న రామారావుగారి స్వర్గారోహణ పర్వమువలన గలిగిన దీరనిదుఃఖమునకు వీరి కుటుంబమునకును, బంధు బాంధవులకును మాహృదయ పూర్వకముగు సానుభూతిని దెల్పుచు, రామారావుగారి యాత్మకు శాంతిని గలిగించు గాతయని పరమేశ్వరుని బ్రార్ధింపుచున్నాము.

Monday, May 4, 2015

Kinnerasani Paatalu

This is an article by Kompella Janardhana Rao


కిన్నెరసాని పాట : కోకిలమ్మ పెళ్లి                  ఆ దొరకి కూతుళ్ళు ఇద్దరు, చిలకతల్లీ కోకిలమ్మానూ. చిన్ననాడే పలుక మొదలెట్టి తండ్రికి మేను పులకరింపించిన చిలకతల్లి వేదపనసలు చెప్పుకొనే బ్రాహ్మణుణ్ణి తనలో నిలిపివేసింది. ఇంట్లో నిరాదరము పాలయి, చెప్పుకొనేటందుకు నోరయినా లేక ప్రకృతి తల్లితోపాటు తల్లీ వెదకుకుంటూ వచ్చి కౌగిలించింది. దీవించి పెళ్ళి చేసింది.
                ‘చిలకతల్లి మహాన్వయంబున
                నిలిచినవి సాంస్కృతిక వాక్కులు
                కోకిలమ్మా తెనుగుపలుకూ
                కూడ బెట్టిందీ.
                కావ్యమంతా చెక్కినధ్వని యిక్కడ కోకిలమ్మ తెనుగుపలుకులో ముడివడి కావ్యం ముగింసింది. ఈ కథ (వొట్టిది) జరిగేటప్పటికి ఈ తెలుగులంతా గొప్పయెకివిూళ్ళు.
                ‘దొంగ నాగరికతలో దేశం
                తూలిపో లేదోయ్‌
                అందుకే యిద్దరు కూతుళ్లే అయినారు తెలుగురాజుకి ఇద్దరమ్మలనూ వలపించగలయీ కవివాక్కు కోకిలమ్మ పెళ్ళికి తెలుగు తీపులు పట్టి అడివిని, సెలయేరునూ, ఆలాటి సామగ్రిని తలపించే ప్రాకృతగతులతో మనస్సును గుంజుతూ నడిచింది. గురజాడ అప్పారావుగారి తీయని లేత నడకలు దాటి వీరి ముత్యాలసరం, కవితా సంపన్నమయిన్ని, పాకరహితమైన విరగబాటు చేపట్టింది, వస్తువు తలచి, అసలు సత్యనారాయణగారి కవిత జాగ్రత్తతోడి దిద్దుబాటుకంటె ఉద్రేకముతోడి విరగబాటే యెక్కువ విందు పెట్టుతుంది. మరికొన్ని మెలకువలు ఈ పొంగులలో అందాలు తెరుస్తవి.
                ‘కోకిలమ్మ పెళ్ళికంటె విరివి అయిన కిన్నెరసాని పాటలువీరి కవితా సంపదను మిక్కిలిగా ప్రవహించినవి. అసలు కథాకల్పనమే హృద్యమైనది. అత్తగారి అపనిందకు అనిష్టమైన అడవుల పరుగులువారి, ప్రేమకల మగని అనునయ కౌగిలిలో కరిగి నీరై పారిన భార్య కిన్నెరసానికై అతడు శిల అయిన క్రమము అంతా కవి చెప్పక, అతనినోటనే.
                ‘ఈ యేడుపు రొదలోపల
                నా యొడలే నే నెరుగను
                నా యీ దేహ మదేమో
                రాయివోలె నగుచున్నది
                అనిపించి చూపిన సొగసు వీరి విలక్షణమైన కళావిహార చాతుర్యమును చూపుతుంది. ఈ కావ్యములో ఈ దీనకథలో కొన్ని ఘట్టాలు కంట నీరు పెట్టకుండా చదవడం కష్టం: రసస్ఫూర్తిని గూర్చి మాటాడగల సహృదయానుభవమంతా ఇందలి కళాజ్యోతికి తృప్తి పడ తీరుతుంది. కిన్నెరసానిని ఒక వీరవనితగా , తెలుగు జాతి మనస్సులో ప్రవహించగల నాయికగా సృష్టిచేసి నిజమైన కావ్యసంపత్తి నిర్వహించినాడు కవి. నవ్యకవితలో మొదటి పంక్తిని నిలువగల కొలది కావ్యాలలో కిన్నెరసాని పాటలుఒకటి. ఇందు ప్రకృతి ఎంతో విస్తృతముగా జీవము పట్టి అనుభవానికి రసశుద్ధి తేగలుగుతున్నది.
                ‘తలిరాకువంటి మె
                త్తని యెర్ర పెదవితో
                తార్చి నామోము నద్దగ రావు కాబోలు
                నాయొడల్‌ మిగుల నందపుకుప్ప యని చెప్పి
                ఎల్లతావులను ముద్దిడ రావు కాబోలు
                ‘అని సన్న గొంతుతోపతికై వసరిన కిన్నెరసాని యేడ్పుతో ఎంతో సన్నిహితమై గాఢమైన అనుభవము సాధారణీకృతికి రావడమేకాక, రచనయున్నూ అస్వాద్యముగా నడిచింది. ఈ పాకములు కిన్నెరసానిలో తరుచుగా పూచినవి. కొకిలమ్మ పెళ్ళిలో అడవీ, అక్కడ తిరిగే కోకిలా కనిపిస్తే ఇక్కడ కోకిలమ్మ పాటలు పుష్పించి ప్రకృతి అంతటా మ్రోగించింది. కిన్నెరనడకలురసమయమై, ‘గోదావరీ సంగమముశిల్ప విలసితమై మరీ హృదములై నఘట్టాలు. అసలు గోదావరిలో కలిసిపోయిన కిన్నెర ప్రసంగములో సముద్రుని పాత్రము కల్పించడం కవి నాటకీయ ప్రతిభ చాటుతుంది. తన గొంతుతో కవి తానుపాడిన ఒక పాట కాక, ఎన్నో పాటలు రూపాలుకట్టి వచ్చి దీనికి మహాకావ్యత్వము సంపాదిస్తున్నవి.
                కొన్ని అతిధోరణులు (వీరు ముక్తసరుగా పాడరు,) పచ్చిగా ఎండుగాపడితే, అవీ వీరి ఉద్రేకము తాలూకు విశిష్టతను తెలుపుతవి. అట్టివి కూడా కావ్య గతిలో విడిచిన విచ్చలవిడితనమే కొన్ని ఉన్ముక్తములైన సౌందర్య విభ్రమాలకు పూచీ, వహిస్తుందని స్మరిస్తే అది కవిని అంతటా సమర్ధించడం కాదు గమనించడం.

                ఛందోగతుల అందాలు కలుపుకోడంలో స్వరకలితమైన సంగీతాభిజ్ఞత అవసరమని చెప్పేవారము కవులు ఒప్పుకోనక్కరలేదు. చరిత్ర ఒప్పుకోదుకాని, కొందరిపట్ల ఆజ్ఞానము అందుకు తోడ్పడ్డదవుతుందంటే ప్రతిఘటించనక్కరలేదు. కవితయందు ఏర్పడే సంగీతమే గమనించానా, సత్యనారాయణగారు పెళ్ళిపోకడలుగా ఛందోగతులు నడిపించి అందాలు కురిపించారు.

Thanks to friend for this material.