Thursday, January 9, 2020

Stephen Hawking - A rememberance

Science for all...

I have recently written two books about this giant of a Scientist - Stephen Haking
I started feeling as if I know him very intimately.
Here is the recording and text of my tributes to the Genius that he was...

It is in Telugu...

Stephen Hawking Gurinchi


Here is the text of the talk....




మిత్రుడు హాకింగ్
నాకు మనిషి తెలివి పట్ల అంతులేని నమ్మకం ఉంది. తెలివి ఉండికూడా వాడని వారి పట్ల అంతగానూ అసహనం కనబరుస్తాను. అది నా బలహీనత. తెలివిని వాడుకుని మన గురించి ప్రపంచం గురించి తెలియజెప్పినవారంతా నాకు గురువులు. సైన్ల్ నాకు వేదం. వేదం అంటే తెలివిడి అని అర్థం. విజ్ఞానశాస్త్రంలో మరీ లోతయిన అంశాలను గురించి అవగాహన కలిగిచినవారు మరీ గొప్ప గురువులు. వారి గురించి, వారు చెప్పిన అంశాలను గురించి తోటివారికి నాకు అర్థమయినంతలో, చేతనయినంతలో అందించాలని రాస్తుంటాను. మాట్లాడుతుంటాను.

నేను ఈ మధ్యన ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలను గురించి పుస్తకాలు రాయవలసి వచ్చింది. వారు న్యూటన్, ఐన్ స్టైన్, స్టీఫెన్ హాకింగ్. ఆ తరువాత నాకు వాళ్లు ముగ్గురూ బాగా తెలిసిన మనుషులు అన్న భావన మనసులో గట్టిగా నాటుకుపోయింది. హాకింగ్ విషయంలో ఈ భావన మరింత ముందుకు వెళ్ళింది. అతను నాకు ఒక మిత్రుడు అనిపిస్తుంది. కానీ ఏనాడు మేము ఒకరిని ఒకరు పలకరించుకోలేదు. ఆయన ఉన్నాడు అని నాకు తెలుసు. నేను ఉన్నానని ఆయనకు తెలిసే అవకాశమే లేదు.

ఇద్దరమూ చదువు, పుస్తకాల మీద గౌరవం గల మామూలు కుటుంబంలో పుట్టిన వాళ్లమే. చదువు అవకాశం లేకున్నా చచ్చీ, చెడి బాగా చదువుకున్నాం. ఇద్దరికీ ఆరోగ్యం సర్వనాశనం అయ్యింది. అయినా అతను ఎన్నో గొప్ప పనులు చేశాడు. నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నా స్థాయిలో నేను ఇప్పటికి వందకు పైగా పుస్తకాలు రాశాను అంటే, హాకింగ్తో సమానంగా గొప్పవాడిని కాను కానీ, ఆ మార్గంలో నడవాలని ప్రయత్నిస్తున్న వారిలో ఒక్కడిని అని సగర్వంగా చెప్పుకుంటాను. హాకింగ్ చనిపోయినప్పుడు ఒక వ్యాసం రాశాను. కానీ ఆ నాటికి స్నేహితుడు అన్న భావన అంతగా బాధ పడలేదు. పుస్తకాలు రాయాలన్న అవసరంతో ఆయన గురించి దొరికిన సమాచారం అన్ని మూలల నుంచి వెతికి చదివాను. ఎన్నో ఫోటోలు సేకరించాను.

ఐజాక్ న్యూటన్ గురించిన పుస్తకం గడచిన సంవత్సరం బజారులోకి వచ్చింది. ఇక ఈ సంవత్సరం ఆల్బర్ట్ ఐన్ స్టైన్, స్టీఫెన్ హాకింగ్ లను గురించి రాశాను. నిజానికి హాకింగ్ గురించి రెండు పుస్తకాలు రాశాను. మొత్తానికి నాకు భౌతికశాస్త్రం లోని లోతయిన అంశాలను గురించి ఆలోచించడానికి అవకాశం దొరికింది.
విజ్ఞానశాస్త్రంలో సైంటిస్టులు అంతకు ముందు తమ రంగంలో జరిగిన పరిశోధనలు ఆధారంగా చేసుకుని మరిన్ని కొత్త ఆలోచనలకు దారి వేస్తారు. ఈ ప్రయత్నంలో కొన్ని విచిత్రాలు జరగడం మనం సులభంగా గమనించవచ్చు. ముందుగా న్యూటన్ గురించి కొన్ని ముచ్చట్లు.ఆపిల్ పండు అతని తల మీద పడ్డదో, లేదో తెలియదు. చాలామంది పడలేదు అన్నారు. ప్రపంచం మాత్రం పడ్డది అనుకుంటున్నది. ఆ సంగతి పక్కన పెడితే న్యూటన్ మూడువందల సంవత్సరాలనాడు ప్రపంచంలోని పరిశోధకుల ఆలోచనలను ఒక కొత్తదారిలోకి పెట్టాడు. భూమికి గల, అలాగే విశ్వంలోని పెద్ద నిర్మాణాలకు అన్నింటికీ గల ఆకర్షణశక్తిని గురించి ఆయన చెప్పాడు. చలనం ఇంటే కదలికలకు సంబంధించిన సిద్ధాంతాలను కూడా సిద్ధం చేసి చెప్పాడు. అంతకు ముందు ప్రపంచంలో కదలికలు లేవా, ఉన్నయి. కానీ వాటి పద్ధతి గురించి ఎవరికీ తెలియదు. మొత్తానికి దానితో భౌతికశాస్త్ర ప్రపంచమే కాక మామూలు ప్రపంచంలో కూడా ప్రపంచం గురించిన అవగాహన విషయంలో గొప్ప విప్లవాత్మకమైన మార్పులు మొదలయ్యాయి.
ఇక ఒక వంద సంవత్సరాల క్రితం ఆల్బర్ట్ ఐన్ స్టైన్ అనే మరో పరిశోధకుడు వచ్చాడు. న్యూటన్ చెప్పిన దాంట్లో పొరపాట్లు ఉన్నాయి అన్నాడు. న్యూటన్ స్థలకాలాలను ఒక రకమైన దృష్టితో అర్థం చేసుకున్నాడు. ఐన్ స్టైన్ మాత్రం కాలం విషయంగా కొత్త ఆలోచనలను ప్రతిపాదించాడు. అది కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు. ఇక స్థలం సంగతి ఏమిటి? మనకు స్థలం అంటే ఇళ్లస్థలాలు గుర్తుకు వస్తాయి. మన మానసిక పరిణతి అంతవరకే ఉన్నది. అయితే విశ్వం మొత్తంలోనూ ఉన్న ప్రదేశాన్ని స్థలం అన్నాడు ఈ పరిశోధకుడు. అది వంగి ఉన్నది అన్నాడు. ఈ విషయం మన ఆలోచనకు కూడా రాదు. భౌతిక శాస్త్రవేత్తలు దీనిని గురించి బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. మనం సమాంతరం అనుకుంటున్న గీతలు ఈ వంపు కారణంగా ఎక్కడో ఒకచోట ఒక దాని మీదుగా మరొకటి వెళ్లిపోతాయి. రైలు గ్రహాలుపట్టాలు మనకు తెలిసి కలవవు. కానీ కలుస్తాయి అన్నాడాయన.  గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి అంటే అందులో ఏదో అద్భుతం ఉంది అని చాలామంది అనుకున్నారు. స్థలం వంగి ఉన్నందుకే గ్రహాలు అలా తిరుగుతున్నాయి అని ఐన్ స్టైన్ చెప్పాడు. జాన్ వీలర్ అనే మరొక పరిశోధకుడు ఈ సంగతిని మరింత సులభంగా చెప్పాడు. విశ్వంలోని పదార్థం, స్థలం వంపు తిరిగే రీతిని నిర్ణయిస్తుంది. స్థలం ఆ పదార్థం కదిలే తీరును నిర్ణయిస్తుంది అన్నాడాయన. భౌతికశాస్త్రం ముందే మామూలుగా అర్థం కాదు. అది కేవలం ఆలోచించి అర్థం చేసుకోవలసిన విషయం. అందులో ఏదీ కళ్ళముందు కనిపించదు. వాళ్ళు చెబుతున్న విషయానికి సంబంధించి అనుభవాలు మాత్రమే కనిపిస్తాయి. వాటిని ఊహించగలగాలి. విశ్వంలోని స్థలం చదునుగా లేదు అంటే ఎట్లా ఊహించాలి, చెప్పడం చేత కాకుండా ఉంది. ఇటువంటి విషయాలను బడిలో కూడా చెప్పరు.
ఇక్కడికి కావలసినంత తికమక తయారయింది. ఇక స్టీఫెన్ హాకింగ్ అనే మరొక పెద్ద మనిషి వచ్చాడు. అతను నిజానికి మరేదో చేయాలి అనుకుని విశ్వం పుట్టుక గురించి పరిశోధించే వలసిన పరిస్థితిలోకి ఇరుక్కున్నాడు. కానీ అతను ప్రపంచానికి అందించిన ఆలోచనలు భౌతికశాస్త్ర రంగంలో వారిని మరి కొన్ని పదుల సంవత్సరాల దాకా పని లో పెట్టి, నిద్ర రాకుండా చేసే రకంగా ఉన్నాయి.
ప్రతి సంవత్సరం డిసెంబరులోలో హైదరాబాదులో పుస్తకాల సంత జరుగుతుంది. మామూలుగా నేను అక్కడికి వెళ్లాను. సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్మే అంగళ్ళు అందులో చాలా ఉంటాయి. అమ్ముడుపోని పుస్తకాలను చవకగా అమ్మే అంగళ్ళు కూడా ఉన్నాయి. అటువంటి అంగళ్లలో స్టీఫెన్ హాకింగ్ తన కూతురు లూసీతో కలిసి రాసిన ఐదు నవలలు నా కళ్ళ పడ్డాయి. వాటిని వందకు ఒక్కటి ప్రకారం అమ్ముతున్నారు. అంతకంటే అన్యాయం మరొకటి లేదు అనుకుని ఐదు పుస్తకాలను కొని తెచ్చుకున్నాను. వాటిలో మొదటి పుస్తకాన్ని నేను చాలా కాలం క్రితమే హాకింగ్ బతికి ఉండగానే తెలుగులోకి రాశాను, అది అచ్చయింది, ఆమ్ముడు అవుతున్నది అన్న సంగతి ఇక్కడ చెపితే అప్రస్తుతం కాదు అనుకుంటాను.
ఈలోగా స్టీఫెన్ పుట్టిన రోజు వచ్చింది అని ఒక మిత్రుడు నన్ను హెచ్చరించాడు. నా పుట్టినరోజు నాకు గుర్తుండదు. ఇక నేను మిగతావారి పుట్టినరోజులు ఎందుకని గుర్తుపెట్టుకుంటాను?
కానీ స్టీఫెన్ హాకింగ్ ను అంత సులభంగా మరిచిపోవడం వీలుకాదు. అతని బొమ్మ ఒకటి అచ్చు వేసుకుని గోడకు తగిలించి ప్రతినిత్యం పొద్దున్నే దండం పెట్టాలి అన్న ప్రయత్నంలో ఉన్నాను.
అక్కడ ఐన్ స్టైన్ బొమ్మ కూడా ఉంటుంది. అతని బతుకు నడిచిన తీరు ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందుకే నేను నా పుస్తకాలలో ముగ్గురు పరిశోదకుల విషయంలోనూ వాళ్ల సైన్స్ కన్నా బతుకు తీరు గురించి ఎక్కువగా రాసినట్లు ఉన్నాను. గొప్పవారు కావాలంటే వాళ్ల బతుకులు అవేవో మరొక మార్గంలో ఉంటాయి అన్న భావన నుంచి అందరూ బయట పడాలి అన్నది నా బాధ. ఈ ముగ్గురు పరిశోధకులూ విచిత్రమైన జీవితాలను గడిపారు. కానీ ఎవరికీ వీలుకాని సైన్సును, విశ్వం గురించిన అవగాహనను ప్రజలకు అందించి వెళ్లి పోయారు. ఆ సంగతి  అర్థం చేసుకోవడానికి మనం వాళ్లతో సమానంగా ఎత్తుకు ఎదగవలసి వస్తుంది. అది మనకు అంత సులభంగా వీలు కాదు అని నాకు తెలుసు. ముగ్గురూ మరెవరినీపట్టించుకోకుండా తమ దారిన తాము బతుకు సాగించారు. పరిశోధన సంగతీ అంతే.
స్టీఫెన్ హాకింగ్ బుర్ర నిండా ఆలోచనలతో ఉండేవి. అతనికి ప్రతి క్షణం చెప్పడానికి ఏదో ఒక విషయం కనపడుతూనే ఉండేది. 150  పరిశోధన పత్రాలు రాశాడు. వాటిలో కొన్ని మరీ పేరు పొందాయి. అసలు సంగతి అతని వయసు ఇరవయి ప్రాంతాలలో ఉండగా మరొక రెండేళ్లలో చనిపోతాడు అని చెప్పారు. నాలాగే అతను అంతంత ఆరోగ్యం మనిషి. నేను బాగానే ఉన్నాను. అతను మాత్రం మరీ కదలలేని స్థతికి చేరుకున్నాడు. కానీ నిక్షేపంలా గా 76 సంవత్సరాల వయస్సు వరకు బతికాడు. ఊరికే బతకలేదు. మహత్తరంగా బతికాడు. పిల్లలను కన్నాడు. అంతకన్నా గొప్పగా సైన్సు ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. అతని పరిశోధన కేవలం మనసులో జరిగింది. బతికినన్నాళ్లు అతను కదలలేక చక్రాల కుర్చీలో ఉన్నాడు అన్న సంగతి తెలియనివాళ్ళు బహుశా ఈ ప్రపంచంలోనే లేరేమో.
అతను ప్రపంచమంతా తిరిగి ఉపన్యాసాలు ఇచ్చాడు. టీవీ కార్యక్రమాల్లో కనిపించాడు. సినిమాల్లో నటించాడు. అందరికీ అభిమాన పాత్రుడయ్యాడు. పుస్తకాలు రాశాడు. అవి ప్రపంచంలోనే గొప్ప పుస్తకాలు అనిపించు కున్నాయి. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం అన్న పుస్తకం గురించి వినని వారు ఉండరు. ఎక్కడికి వెళ్లినా, ఏం మాట్లాడినా ప్రపంచమంతా నిలబడి అతడిని గమనించింది. తాను పరిశోధిస్తున్న మౌలిక భౌతికశాస్త్రం గురించి మాత్రమే కాకుండా అతను మరెన్నో విషయాలను గురించి పట్టించుకున్నాడు. తనలాంటి కదలలేని మనుషులకు సాయం చేయాలని ఎంతో ప్రయత్నించాడు. అణుయుద్ధం గురించి ప్రపంచాన్ని హెచ్చరించాడు. జెనెటిక్ ఇంజనియరింగ్ ద్వారా చేయదలుచుకున్న మార్పులను గురించి హెచ్చరించాడు. అది మన అదుపు తప్పి అపాయకరంగా మారే వీలు ఉందన్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కృత్రిమ జ్ఞానం మనం అనుకున్న మార్గాన కాక మరి ఎక్కడికో దారితీసే వీలు ఉంది అన్నాడు. ఇతర గ్రహాల నుంచి జీవులు ఇప్పటికే మన భూమిమీదికి వచ్చేశారేమో అన్నాడు. హాకింగ్ నిజంగా ఆసక్తికరమైన వ్యక్తి. అందరికీ ఆసక్తి కలిగించే విషయాలను గురించి అతను ఎన్నో వివరాలను చెప్పి వెళ్ళిపోయాడు.
విశ్వం పుట్టినప్పుడు, అంతకుముందు ఏమీ లేదు. అటువంటిది ఏమీలేదు లోనుంచి విశ్వాన్ని పుట్టించడానికి దేవుని అవసరం లేదు అని అతను గట్టిగా వాదించాడు. క్రైస్తవమతం వారికి మూల కేంద్రమైన వాటికన్ వారు అతడిని తమ విజ్ఞానశాస్త్ర కమిటీలోకి చేర్చుకున్నారు. అన్నిటికన్నా గొప్ప అవార్డు ఇచ్చారు. పోపు స్వయంగా లేచి వచ్చి హాకింగ్ ముందు మోకరిల్లి ముచ్చటించాడు. నిజానికి ప్రపంచంలో అందరూ పోప్ ముందు మోకరిస్తారు. ఇక్కడ సంగతి తారుమారైంది. చాలామందికది నచ్చలేదు. గగ్గోలు జరిగింది. ఈ సంగతులన్నీ పక్కనబెట్టి స్టీఫెన్ హాకింగ్ మాత్రం తన విశ్వాసాలను గురించి నిస్సందేహంగా అక్కడే చెప్పేశాడు. ఇక ప్రపంచమంతటా గోల మొదలైంది. కంటికి కనిపించని అంశాలను గురించి మానవులకు నమ్మకం ఎక్కువ. అది ఈ 21వ శతాబ్దంలో కూడా కొనసాగుతున్నది. భౌతికశాస్రం కూడా అటువంటిదే అన్నాను మరి. అయినా దీని దారి వేరు. స్టీఫెన్ హాకింగ్ లాంటి మనుషులు, అతడిని మనిషి అనకూడదు, అతను ఒక మహా మానవుడు, అటువంటి వారు చాలామంది రావాలి. అప్పుడుగాని ఈ ప్రపంచం మరొక వైపు తల తిప్పదు.
కొంతమంది తాము చేసిన ఏదో ఒకటిరెండు పనులవల్ల గొప్ప పేరు సంపాదించుకుంటారు. మరికొంతమంది చాలా గొప్ప విషయాలు అందించినప్పటికీ వాటికన్నా వాళ్ళ వ్యక్తిత్వమే ఎక్కువగా ప్రచారంలోకి వస్తుంది. అటువంటి వారిలో హాకింగ్ గురించి మొట్టమొదటి చెప్పుకోవాలి. సమకాలీన ప్రపంచంలో అతనికి మించిన శాస్త్రజ్ఞుడు లేడు అని అన్నారు. కానీ అతను చేసిన భౌతికశాస్త్రం మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. ఫిజిక్స్ రంగంలో వాళ్లే అతను చూపిన మార్గం మీద నడిచే ప్రయత్నంలో బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.
గురుత్వాకర్షణ గురించి న్యూటన్ చెప్పిన అంశాలను ఐన్ స్టైన్ కాదన్నాడు. ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం ఒక పెద్ద నక్షత్రం తన గురుత్వాకర్షణ శక్తికి తానే గురై కుంచించుకుపోతుంది. అటువంటి అవకాశం ఉంది. అక్కడ ఆలోచనకు అందని సాంద్రతతో ఒక నిర్మాణం తయారవుతుంది. దాన్ని సింగులారిటీ అన్నారు. అందులో నుంచి కనీసం కాంతి కూడా బయటకు రాదు. ఇటువంటి నిర్మాణాలు విశ్వంలో అంతటా విస్తరించి ఉన్నాయి అన్న సంగతిని చాలాకాలం ఎవరూ పట్టించుకోలేదు.50 దశకం తర్వాత వాటి మీదకు దృష్టి మళ్ళింది. వాటికి చిత్రంగా బ్లాక్ హోల్స్ అని పేరు పెట్టారు. హాకింగ్ వీటి విషయంగా కొత్తమార్గాన్ని చూపించాడు. పాత అవగాహగనలు పనికి రావు అన్నాడు.
బ్లాక్ హోల్స్ గురించి స్టీఫెన్ హాకింగ్ చేసిన పరిశీలన, ప్రతిపాదనలు ప్రపంచాన్ని కొత్త దారిలోకి తిప్పాయి.
స్టీఫెన్ మామూలు మనిషి కాదని ఎన్నిసార్లు చెప్పిన తక్కువ కాదు. ప్రపంచం గురించిన పూర్తి అవగాహన కోసం అతను ప్రయత్నించాడు. అందరూ బ్లాక్ హోల్స్ పుట్టుక గురించి ఆలోచిస్తూ ఉండగా అతను మాత్రం విశ్వం పుట్టుక గురించి ఆలోచన మొదలుపెట్టాడు. రోజర్ పెన్ రోజ్ అనే మరొక పరిశోధకులతో కలిసి విశ్వం గురించి పునరాలోచన సాగించాడు. విశ్వం అనే సినిమాను ఒక్కసారి వెనక్కు తిప్పి చూడగలిగితే సింగులారిటీ అనే చోటికి చేరుకుంటాం అని వాళ్లు ప్రతిపాదించారు. వాక్యం చివరలో పెట్టే చుక్క అంత నిర్మాణంలో నుంచి, ఈ విశ్వం అంతా పుట్టింది అని ఒక ప్రతిపాదన చేశారు. విశ్వం వ్యాప్తిని గురించి ఆలోచించే శక్తి మన బుర్రలకు లేదు అంటే ఆశ్చర్యం కాదు. అంతటి విశ్వాన్ని గురించి ఆలోచించగల బుర్ర స్టీఫెన్ హాకింగ్ కు మాత్రం ఉంది.
బ్లాక్ హోల్ లోకి వెళ్ళిన పదార్థం బయటకు రాదు అని అప్పటివరకు విజ్ఞాన శాస్త్ర ప్రపంచం అనుకుంటూ ఉన్నది. హాకింగ్ మాత్రం అందుకు వ్యతిరేకంగా ఆలోచించాడు. బ్లాక్ హోల్స్ కి పదార్ధాన్ని బట్టి పరిమాణం, సాంద్రత ఉంటాయి అన్నాడు. బ్లాక్ హోల్స్ గురించి ముందు జరిగిన పరిశోధన వివరం చెప్పుకోవాలంటే మనలాంటి వాళ్లకు అంత సులభంగా వీలుకాదు.
బ్లాక్  హోల్స్ లో వేడిమి ఉంటుంది అన్నాడు స్టీఫెన్. ఆ వేడిని అది బయటకు వెదజల్లుతుంది అని కూడా అన్నాడు. అలా బయటకు వస్తున్న వేడిమికి హాకింగ్ రేడియేషన్ అని పేరు పెట్టారు. అందులో నుండి వేడి బయటకు వస్తుంది కనుక కొంతకాలానికి బ్లాక్ హోల్ కుంచించుకుపోతుంది అని కూడా ఒక అద్భుతమైన విషయాన్ని ప్రపంచం ముందు హాకింగ్ ప్రతిపాదించాడు. బ్లాక్ హోల్స్ అంటే నల్లని రంధ్రాలు అని అర్థం. అవి నల్లనివి ఏమీ కావు అన్నాడు హాకింగ్. నిజానికవి రంధ్రాలు కూడా కావు. మరి ఆ పేరు ఎందుకు పెట్టినట్టు, తెలియదు. కొంతకాలానికి బ్లాక్ హోల్ లేకుండా ఇగిరి పోతుంది అని కూడా అన్నాడు. అయితే అందుకు పట్టే కాలం విశ్వం వయసు కన్నా ఎక్కువగా ఉంటుంది, అన్నాడు. మన వయసు గురించి సరిగా లెక్క తెలియని మనలాంటి వాళ్లకు, విశ్వం వయసు, బ్యాక్ హోల్ వయసు గురించి ఆలోచించడం కొంచెం కష్టమే.
అణువుల కన్నా చిన్న బ్లాక్ హోల్స్ ఉన్నాయి అన్నది అర్థం చేసుకోవలసిన మరొక సత్యం. లక్షల హైడ్రోజన్ బాంబులతో శక్తితో అవి  పేలడానికి అవకాశం ఉంది.
హాకింగ్ అందించిన ఇటువంటి అవగాహనలతో కాస్మాలజీ అనే అంతరిక్ష శాస్త్ర రంగంలో వారు అందరూ గట్టి కుదుపులకు గురయ్యారు. బ్లాక్ హోల్ సమాచారం అనేది ఒక సమస్యగా తయారయింది. ఉండు ఒక నక్షత్రం ఉంటుంది. అది కుంచించుకొని సింగులారిటీ తయారవుతుంది. అదే బ్లాక్ హోల్. మరి అటువంటి బ్లాక్ హోల్ సమసి పోతే నక్షత్రంతో పాటు అందులోకి వెళ్ళిన సమాచారం ఏమౌతుంది? అది ప్రశ్న. సమాచారం సమసి పోవడానికి వీలు లేదు. మనలాంటి మామూలు మెదళ్ళకు ఈ విషయాలు అర్థం కావు. అర్థం అయిన వారికి మాత్రం ఇక నిద్ర పట్టదు. అందులోని అంతేలే దాకా వాళ్ళు ఏదో చేస్తూనే ఉంటారు. సమాచారం కూడా నాశనం అవుతుంది అంటాడు హాకింగ్. అది భౌతిక శాస్త్ర సిద్ధాంతం ప్రకారం కుదరదు అంటారు మిగతా వాళ్ళు. ఆ మిగతా వాళ్ళలో ప్రెస్కిల్ అనే పరిశోధకుడు ఒకాయన 1997లో హాకింగ్తో ఈ విషయంగా పందెం వేసుకున్నా డు.2004లో ఈ విషయంగా తాను ఓడిపోయానని హాకీ ఒప్పుకున్నాడు. ఆయనలోని గొప్ప తనం అప్పుడు బయటపడింది. పందెం ప్రకారం ఒక విజ్ఞాన సర్వస్వాన్ని ప్రత్యర్థికి ఆయన అందించాడు. అయితే ఆ సర్వస్వం బేస్ బాల్ అనే ఆటకు సంబంధించింది. ఓడిపోయాడు. కానీ కూలి పోలేదు. బ్లాక్ హోల్ లో నుంచి వచ్చే సమాచారం నిష్ప్రయోజనం అయి ఉంటుంది అన్నాడు అతను. పుస్తకం బదులు దాన్ని కాల్చి బూడిదను ప్రత్యర్థికి ఇస్తే బాగుండేది అని చమత్కరించాడు.
స్టీఫెన్ హాకింగ్ జీవన ధోరణి గురించి నేను రాసిన పెద్ద పుస్తకం లోఎక్కువగా చెప్పడానికి నాకు అవకాశం దొరికింది. కదలలేని ఆ వ్యక్తి హాస్యప్రియుడు అంటే నమ్మకం కలగదు. కనుకనే అతను నాకు చాలా దగ్గరగా వచ్చినట్టు కనిపిస్తాడు. బ్రిటిష్ ప్రభుత్వం వారు తాను ఆశించిన సాయం చేయలేదు. తమ చక్రాల కుర్చీని మార్గరేట్ థాచర్ కాళ్ల మీదుగా నడిపించాలి అని హాకింగ్ చమత్కరించాడు. ప్రిన్స్ చార్ల్స్ తో ఇంచుమించు అంత పని చేశాడు.
ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం అన్న పుస్తకం గురించి చెప్పకుండా ముగిస్తే నా మానసిక మిత్రుడు హాకింగ్ కు అన్యాయం చేసిన వాడిని అవుతాను. హాకింగ్ కేవలం పరిశోధకుడు మాత్రమే కాదు. బతక నేర్చిన మనిషి. బతుకు గురించి చాలా ఆసక్తికరంగా ప్రపంచానికి చెప్పగలిగిన మనిషి. విశ్వం గురించి అతను రాసిన పుస్తకం చాలా సంక్షిప్త చరిత్ర అన్న పేరుతో ప్రపంచం ముందుకు వచ్చింది. లక్షల కాపీలు అమ్ముడైంది. వాస్తవం చెప్పాలంటే అది నాతో సహా ఎవరికీ అర్థం కాలేదు. అయినా సరే ఈ ప్రపంచంలో అతి గొప్ప పుస్తకాలలో ఒకటి గా నిలబడింది. హాకింగ్ మరెన్నో పుస్తకాలు రాశాడు. ఆశ్చర్యకరంగా కూతురుతో కలిసి నవలలు రాశాడు. విశ్వం గురించిన విశేషాలు చిన్న పిల్లలకు అర్థం అయ్యే రీతిలో కథా రూపంలో చెప్పిన తీరు అసామాన్యంగా ఉంటుంది.
ఏదో కొంచెం ఆరోగ్యం సమస్య గా ఉన్నందుకు నేను పనులన్నీ మానుకుని ఏ పని చేయకుండా  కాలం గడుపుతుంటారు. చెయ్యి కదిలించడానికి వీలుకాని స్టీఫెన్ మాత్రం  ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. న్యూటన్, ఐన్ స్టైన్ ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేశారు. అయితే అది కథనానికి సంబంధించిన విషయం. స్టీఫెన్ హాకింగ్ ప్రభావం మాత్రం రానున్న కాలానికి సంబంధించినది. అతని ఆలోచన ధోరణి, అందించిన పరిశోధనా అంశాలు ముందు ముందు చాలా కాలం వరకు ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తాయి.
మనుషులు చాలా మంది పుడతారు. పుట్టుక ఎందుకో తెలియకుండానే వెళ్లిపోతారు. కొంతమంది మాత్రం తమ అడుగుజాడలను ప్రపంచంలో స్థిరంగా వదిలి పోతారు. అటువంటివారిని అనుక్షణం ఆదర్శంగా భావించడం మన కర్తవ్యం. అంతకంటే ఎక్కువ మనం ఏమి చేయలేము. చేతులెత్తి నమస్కరించడం తప్ప.....