Wednesday, February 25, 2026

అత్తగారు - లుయిజీ పిరాండెల్లో ఇటాలియన్ కథ


అత్తగారు

లుయిజీ పిరాండెల్లో ఇటాలియన్ కథ


అత్తగారు
లుయిజీ పిరాండెలో
నిజం చెప్పాలంటే వాళ్లగురించి ఎక్కువగా ఆలోచించిన కొద్దీ అంటే మిస్టర్‌ పోన్‌జా, ఆయన అత్తగారి గురించి ఆలోచిస్తే వాళ్లిద్దరిలో ఎవరు వెర్రివాళ్లన్న సంగతి  అంత తక్కువగా అర్థమవుతున్నది.
వాళ్ల ఇద్దరిలో ఒకరికి తప్పకుండా పిచ్చి. వల్‌డానాలో అందరూ ఈ సంగతి ఒప్పుకుంటారు. అయితే ఇద్దరిలో ఎవరికి? అసలు సంగతేమిటంటే...
కానీ నేను ముందుగా ఒక విషయం చెప్పాలి. వల్‌డానా మనుషులలో నేను పూర్తిగా కొత్తవాడిని. కొత్తగా ఆ మనుషులిద్దరూ ప్రశాంతంగా సాధారణంగా ఆనందంగా ఉన్న ఈ చిన్న పట్టణంలోకి వచ్చినప్పుడు వీళ్లు పడ్డ చికాకు గురించి నాకు సానుభూతి తప్ప మరో భావం కలగలేదు. నేను వాళ్ల పట్ల సానుభూతి కలిగి ఉంటాను. ఎందుకో చెపుతాను. వాళ్లిద్దరిలో ఒకరినొకరు బుర్రలేనివారుగా మారిపోయే తీరుగురించి నాకు సంబంధం లేదు. కానీ వాళ్లిద్దరూ ఒక మొత్తం నగరాన్ని సస్పెన్స్‌లోను బాధలోను పెట్టి అలా ప్రవర్తించడం సరైంది కాదని నేను అనుకుంటాను. వాళ్లిద్దరిలో ఎవరు నిజం చెపుతున్నారు? ఎవరు భ్రమల ప్రభావంలో ఉన్నారు అన్నది అంతు పట్టకుండా చేస్తున్నారు. మేము వాళ్లను ప్రతినిత్యం వీధిలో కలుస్తామంటే మీరు నమ్మగలరా? (వల్‌డానాలో ఉండేది ఒకటే ప్రధాన వీధి. అక్కడే అందరమూ కలుస్తాం) వాళ్లిద్దరిలో ఒకరికి పిచ్చి అని తెలుసు. వాళ్ల ముఖాలను పరీక్షించి స్థూలంగా ఎవరికి పిచ్చి పట్టిందని తేల్చడం కుదరడంలేదు. ఒక్కోసారి ఎవరికి వారే ` అదిగో ఆవిడకు ` అనుకుంటారు. కానీ ఆ తరువాత వెంటనే అందుకు వ్యతిరేకం ఏమో అనుకుంటారు. నాకు పోలీసులతో ఏ కొంచెం ప్రమేయం ఉన్నా ఆ ఇద్దరినీ ఊరు వదిలి వెళ్లిపొమ్మని ఆర్డర్‌ జారీ చేస్తాను.
కానీ నేను పోలీసును కాను. ఇక జరిగింది ఇది. మూడు మాసాల క్రితం సిన్యోర్‌ పోంజా అనే గవర్నమెంట్‌ ఉద్యోగంగల ఆయన రోమ్‌నుంచి పంపబడి వల్‌డానాలో దిగాడు. వెంటనే ‘తేనెపట్టు (ద బీహైవ్‌)’ అనే సరికొత్త పెద్దభవంతి అయిదవ ఫ్లోర్‌లో చిన్న ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. భవంతి నగరం అంచుల్లో ఉంటుంది. పెద్ద బాల్కనీ నుంచి చూస్తే పొలాలు కనిపిస్తాయి. ఇక మిగతా మూడు చిన్న కిటికీలు పెరట్లోకి తెరుచుకుంటాయి. ఈ కిటికీల్లో ఒకానొక దానిముందు ఒక పలుచని తాటికి కట్టిన ఒక బుట్ట వేలాడుతూ ఉంటుంది. ఆ బుట్టను కిందకు దించి వ్యాపారులు అందించే చిన్న పొట్లాలు, మిగతా సరుకులను పైకి చేదుకోవచ్చు. ఇక అన్ని మెట్లు ఎక్కడమనే శ్రమ తగ్గుతుంది.
కానీ సిన్యోర్‌ పోంజా మరొక ఫ్లాట్‌ను కూడా అద్దెకు తీసుకున్నాడు. ఈసారి అది పట్నం మధ్యభాగానికి దగ్గరగా ఉంది. అందులో సిన్యోరా ఫ్రోలా అనే తన అత్తగారు ఉంటారని ఆయన అన్నాడు.
దీంతో వల్‌డానా ప్రజలు ఆశ్చర్యంలో పడిపోయారు. రెండు ఫ్లాట్‌లు ఎందుకు? ఒక తల్లి తన పెళ్లయిన కూతురితో ఉండలేకపోతే వెళ్లి తన అల్లుడితో ఉంటుంది. కానీ ప్రస్తుత కేసులో వలె ఆమె తన కూతురి వెంటపడి అదే నగరానికి వచ్చింది. అయినా వేరే ఫ్లాట్‌లో ఉండాలని నిర్ణయించింది. ఆ కుటుంబంలో ఏదో ఉందన్న సంగతి శుభ్రంగా బయటపడుతున్నది. ‘ఆ మనిషి మొరటురకం అయి ఉంటాడు’ వల్‌డానాలోని అందరూ అలాగే అనుకున్నారు. ఇక అందరూ ఆ ఆడమనిషి పట్ల అనుకోకుండానే సానుభూతి చూపించసాగారు. కానీ, ఆమెలో కూడా ఏవో లోపాలు ఉండవచ్చు, అని వారన్నారు. అయినప్పటికీ గౌరవంగల పెద్దమనిషి ఎవరయినా అత్తగారు తన ఫ్లాట్‌లో ఉండకూడదని అంటాడా? పోతే సిన్యోర్‌ పోంజా కనిపించే తీరు అదోరకంగా ఉంటుంది. పొట్టి, కొంచెం లావు ఇంచుమించు ఆఫ్రికన్‌ల వంటి నల్లని చాయ, ఉంగరాల జుట్టు, దళసరి కనుబొమ్మలు, భయ పెడుతున్నట్టు బుర్రమీసాలు, మొత్తానికి మొట్టమొదటిసారి చూచినవారికి వెంటనే అతనిపట్ల సానుభూతి కలగదన్నది మాత్రం తప్పనిసరి వాస్తవం. ఇక అందుకు వ్యతిరేకంగా ఆ చిన్న మధ్యవయస్సు తెల్లజుట్టు ఆడమనిషి మరీ పీలగా ఉంది. దు:ఖంగా కనబడుతోంది. ఆమెను చూస్తే దయాదాక్షిణ్యాలకు రూపం అనిపిస్తుంది. అటువంటి మనిషితో ఆమె భయంకరమయిన అసంతోషానికి గురయి ఉంటుందని అందరూ అనుకుంటారు. అతడు ఆమెను కూతురు ఫ్లాట్‌లోకి రానివ్వడని కూడా అందరూ కనుగొన్నారు.
అయితే వ్యవహారం మరింత విచిత్రంగా మారేటట్టు ఆ ముసలావిడ ఒక్కసారి కూడా అల్లునికి వ్యతిరేకంగా ఒక్కమాట అనడం ఎవరూ వినలేదు. పైగా ఆయన గురించి ఎవరయినా తప్పుగా అనుకుంటారన్న ఆలోచనతోనే ఆమెకు బాధ కలుగుతుంది. అల్లుడు తన కూతురికి చాలా మంచి భర్త, తనకు అతను, అంకితమయిన కుమారుడు లాంటివాడు, అని చెప్పడానికి ఆమె ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. అవును, అతను అంకితమయిన అబ్బాయే. విపరీతమయిన మంచి మనసుగల కొడుకు. ఉన్న లోపం అంతా ` అది లోపమయితే ` ఒకే ఒక్కటి. అతనికి తన భార్యపట్ల గల ప్రేమ బహుశా మరీ విపరీతం. కానీ ఆమె వెంటనే అంటుంది, ఒక భర్త తన భార్య తనకే సొంతం కావాలనుకుంటే, ఆ విషయంలో భార్య తల్లిపట్ల అసూయ కలిగి ఉంటే అందులో తప్పేముంది, అని. అసూయా కాదు, అది అలాంటి ఇలాంటి మామూలు అసూయ కాదు. అది పూర్తిగా వేరొకభావం. అది తీవ్రమయిన ప్రేమభావం. దాన్ని లోపం అనడానికే లేదు. అయితే అది మరి స్వార్థమా, అసలు కాదు. ఒక మనిషి తన భార్యకు సంపూర్తిగా అంకితమయి ఉంటే దాన్ని స్వార్థమనవచ్చా? లేదు అతను ఆ స్త్రీ చుట్టూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. అందులోకి ఆమె తల్లిని కూడా దూసుకుని రానివ్వడు. అందుకే మరి ఆమె కూతురి నుంచి దూరంగా ఉండాలని తేల్చేసుకున్నది. ప్రతిరోజు ఒకసారి వాళ్ల పెరట్లోకి వచ్చి అక్కడి నుంచే కాసేపు మాట్లాడితే చాలు అనుకున్నది.
ఇవాళ ఎలాగున్నావు, టిల్డీనా?’
బాగున్నాను, అమ్మా, మరి నీవు?’
ఎక్స్‌లెంట్‌ డార్లింగ్‌. ఇక మరి బుట్ట కిందకు దింపు.’
ఇక ఆ చిన్నబుట్ట ఆనాటి వార్తగల నోట్‌ను మోస్తూ కిందకు వస్తుంది. వాళ్ల మీటింగ్‌ అంతటితో ముగుస్తుంది. నాలుగు సంవత్సరాలు ఇలాగే కొనసాగింది. ప్రతినిత్యం ఆ ముసలావిడ రావడం, బుట్టలో అందిన కాగితాన్ని తీసుకుపోవడం, కూతురుకు గుడ్‌బై చెప్పడం, వీధి చివరలో మాయం కావడం, సంతృప్తిగా అంగీకరించడం.
అయితే వల్‌డానాలో ఎవరూ ఈ వింత కథను నమ్మలేకపోతున్నారు. నగరంలోని మహిళలు (ముఖ్యంగా ఆమె అల్లుని తోటి ఉద్యోగుల భార్యలు) సిన్యోరా ఫ్రోలా ఇంటికి వెళ్లారు. కబుర్లు మొదలు పెట్టారు. చివరకు మాటల సంగతి సిన్యోర్‌ పోంజా దాకా వెళ్లింది. అతని గురించి ఒక ముఖ్యమయిన వెల్లడింపు బయటపడుతుందని వాళ్లంతా భయపడ్డారు. తన అత్తగారితో మరీ నేస్తంగా ఉన్నట్టు తెలిసిన మహిళలకు ఆయన కబురు పంపించాడు. వాళ్లను కలుస్తానన్నాడు. అతను భావావేశంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. అతని కళ్లు మరింత లోతుగా మరింత బాధతో కనిపించాయి. పట్టిన చెమటను తుడుచుకోవడానికి అతని చేతిలో ఒక తెల్లని కర్చీఫ్‌ను పట్టుకున్నాడు. ఒక రహస్యాన్ని కాపాడాలి అంటూ ఆడవాళ్లను వేడుకున్నాడు. అది ఎంతో ముఖ్యమయిన రహస్యం అన్నాడు. వీలయితే దాన్ని తనలోనే దాచుకోవాలని అనుకున్నాడు గానీ, ఇప్పుడు బయట పెట్టవలసిన పరిస్థితి బలవంతం చేస్తున్నది. తన అత్తగారికి, పిచ్చిపట్టిందని ఆయన చెప్పాడు. ఆమె నాలుగు సంవత్సరాల క్రితం పిచ్చిదిగా మారింది. తన కూతురు పోయిందన్న వార్త తెలిసిన తరువాత అది జరిగింది. ఆమెకు కలిగిన షాక్‌ చాలా గొప్పది. ఆనాటినుంచి తన కూతురు శాశ్వతంగా పోయిందన్న విషయాన్ని నమ్మడానికి ఆమె ఒప్పుకోదు. కూతురు బతికే ఉందని గట్టిగా అంటుంది. ఆమెకు నచ్చచెప్పడం అసలు కుదరడం లేదు. బాధలో ఉన్న ఒక తల్లికి సాయం చేయాలన్న మంచి ఉద్దేశ్యంతో ఆమె భ్రమలను అలాగే కొనసాగించడమే తెలివిగల పని అతను అనుకున్నాడు. తన మొదటి భార్య ఇంకా బతికే ఉందని ఆ తల్లి అనుకున్నా ఫరవాలేదన్నాడు. ఇప్పుడు తనతో ఉంటున్న రెండవ భార్య ఆమె కూతురు కానేకాదని అతను వివరించాడు. ఈ రెండవ భార్య ముసలావిడ మీద జాలికొద్దీ ప్రతినిత్యం కిటికీ దగ్గర కనిపించడానికి, చిన్న నోటు రాయడానికి అంగీకరించింది. విషయం బయటపడకుండా తనను తాను ఫ్లాట్‌లోనే బంధించుకోవడానికి కూడా సిద్ధమయింది. ‘ఇది అసలు నిజం’ కళ్లలో నీళ్లు తిరుగుతుండగా అతను ముగించాడు.
నగరంలోని మహిళలంతా విస్తుపోయారు. వారిలో చాలామంది తమ ఆవేశాన్ని దాచుకోలేకపోయారు. అందరూ సిన్యోర్‌ పోంజా పట్ల సానుభూతి చూపించారు. రహస్యాన్ని తమలోనే దాచుకుంటామని మరీమరీ మాట ఇచ్చారు. వాళ్ల మంచి మాటలతో కొంత ఉపశమనం కలిగి సిన్యోర్‌ పోంజా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ అతనలా వెళ్లాడో లేదో సిన్యోరా ఫ్రోలా ప్రవేశించింది.
ఆమె దగ్గరా ఒక రహస్యం ఉంది, ఒక గొప్ప రహస్యం. వాళ్లు తమ పెదవులను కట్టి ఉంచుతామని ఒట్టు పెట్టుకోవాలి. లేకుంటే, ప్రపంచంలో తనకు అందరికన్నా ఇష్టమయిన మనిషి నాశనమయిపోతాడు. అతను తన అల్లుడే. ‘సంగతి బయట తెలిస్తే అతని బ్రతుకు బహుశా సర్వనాశనం అవుతుంది’ అన్నది ఆమె బాధగా. ఇక ఆ రహస్యం ఏమిటంటే, సిన్యోర్‌ పోంజా ` కష్టపడి పనిచేసే, ప్రశాంత స్వభావంగల ప్రభుత్వ అధికారి ` పిచ్చివాడు. నాలుగు సంవత్సరాల క్రితం అతని మెదడులోకి తన భార్య చనిపోయిందన్న ఆలోచన దూరింది. అప్పటినుంచి అతను పిచ్చివాడయ్యాడు. అతనికి కలిగిన బాధ చాలా గొప్పది. ఆనాటి నుంచి అతను అందరికీ తన భార్య పోయిందని, ఆమె మరణం కారణంగా అత్తగారు పిచ్చిదయిందని చెపుతూ ఉంటారు. ‘పాపం తన భార్య నర్సింగ్‌హోమ్‌కు పోయింది, అక్కడి నుంచి తిరిగి రానేలేద’ని అతనికి గట్టి నమ్మకం. ఆమె ఏడుస్తూ ఈ మాట చెప్పింది. ‘ఆ మాట అతని మనసులో నాటుకుపోయింది. ఆమె నిజానికి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు బంధువులు, మిత్రులను పిలిచి మరో పెళ్లి చేయవలసి వచ్చింది. తాను ఈ మధ్యనే మరొక అమ్మాయిని నిజంగా పెళ్లి చేసుకున్నాడని అతనికి నమ్మకం కలిగింద’ని అంటూ సిన్యోరా ఫ్లోరా కథ ముగించింది. పట్టలేక ఆమె మరింత చెప్పసాగింది. ‘పరిస్థితి మరీ దిగజారింది. అతను మళ్లీ తేరుకున్నాడని, తన భార్య అంటే మొదటి భార్యే అని అనుకుంటున్నాడని నేను నమ్మాను. కానీ అతని అసూయ మరీ దూరం పోయింది. ఎవరిని భార్య దగ్గరికి రానివ్వడు. చివరకు వాళ్ల అమ్మను కూడా. ఆ అమ్మాయిని ఫ్లాట్‌లో ఒంటరిగా బంధించాడు. లేకుంటే ప్రస్తుతం తన భార్యకు తల్లి కాని ఒక అత్తగారి మీద అతను చూపే దయకు అర్థం లేదు. అయితే ఈలోగా మరో దురదృష్టకరమయిన విషయం జరిగింది’ నిట్టూరుస్తూ కొనసాగించింది ఆమె. ‘నా కూతురు తను తానే కాదంటూ అందరినీ ఒప్పించాలి. ఇక నేను పిచ్చిదాన్నని అందరినీ ఒప్పించాలి. నా కూతురు బతికి ఉంది అన్నందుకు నేను పిచ్చిదాన్ని. ఒక తల్లిగా తన కూతురిని కిటికీలోంచి మాత్రమే చూచి సంతృప్తిపడే ఒక తల్లి దుర్భర పరిస్థితిని మీరు అర్థం చేసుకోగలరా? నేనిక నా అల్లుడితో ఉన్నది మరెవరో ఆడమనిషి అని ఆయనకు నమ్మకం కలిగించాలి. అయినా నాకు ఇంకో మార్గం తోచలేదు. ఇక మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. నాకు పిచ్చిదని పేరు పెట్టారు. నిజంగా పిచ్చిపట్టిన వారి కొరకు నేను పిచ్చిదానిగా బతకాలి. అర్థమయిందా మీకంతా?’
అవును మరి, ఆ మహిళలకు ఏమీ అర్థం కాలేదు. ఎవరికీ ఏమీ అర్థంకాలేదు. ఈ సమస్యను విడదీయాలని ఎంత ప్రయత్నించినాగానీ నాకు కూడా అర్థం కాలేదు. వెళ్లి ఆ అమ్మాయిని అడగవచ్చుగదా అని మీరు అంటారేమో. నిజమే, కానీ ఆమె తాను రెండవ భార్యనని అందరికీ చెపుతుండగా ఆమె మాటలను నమ్మడమెలాగ? ఆమె కూడా భర్తలాగే భ్రమలో పడిపోయిందేమో? అయినా ఆమె ఇంటి తలుపు తెరవనని భీష్మించుకు కూచుంటే ఎవరు మాత్రం ఆమె దగ్గరకు వెళ్లగలుగుతారు. ఆ మనిషి సిన్యోరా ఫ్రోలా అంటే తనకు భయమంటున్నదాయె!
ఈలోగా సిన్యోర్‌ పోన్‌జా కూడా తన భావాలను వెల్లడించసాగాడు. ‘త్యాగం, కేవలం త్యాగం’ అంటున్నాడాయన. కానీ ఆయనకు నిజంగా పిచ్చేమో. పట్నంలోని వారందరికీ పరిస్థితి గురించి తెలుసుకోవాలని పట్టుదల. వాళ్లిద్దరూ ఒకరిమీద ఒకరు అంత మంచితనం కనబరుస్తూ అంత సఖ్యంగా ఉంటున్నారు. ఇక వారిలో ఒకరికి పిచ్చి ఉందని ఎవరూ అనుకోవడానికి లేదు. లేక ఇద్దరికీ పిచ్చిపట్టిందా ఏమి?
సిన్యోరా ఫ్రోలా తరచుగా సిన్యోర్‌ పోన్‌జా ఆఫీస్‌కు వెళుతుంది. ఇద్దరూ కలిసి షాపింగ్‌కు లేదా వాక్‌కు వెళ్లిపోతారు. వాళ్లిద్దరూ చాలా హాయిగా కలిసి ఉన్నారు. ఒకరితో ఒకరు సంతోషంగా ఉన్నారు. ఒకరిమీద ఒకరికి సానుభూతి ఉన్నప్పుడు మాత్రమే వీలయ్యే పద్ధతిలో చక్కని మర్యాదలు పాటిస్తున్నారు. నడుస్తూ ఆమె అలిసిపోతే, ఆయన చేతిని పట్టుకుంటుంది. అతనిమీద వాలుతుంది. ఇద్దరూ కలిసి నడుస్తూ ఉంటారు. వందల కళ్లు తికమకగా, ఆశ్చర్యంగా వాళ్లను చూస్తూ ఉంటారు. వీరిలో పిచ్చి ఎవరికి? ఇందులో నిజం ఎక్కడుంది? నీడ ఎక్కడుంది? లేక ఇందులో ఒకటికాక ఎక్కువ నిజాలున్నాయా? జవాబు చెప్పాలంటే ముందుగా మరో జవాబు వెతకాలి. పిచ్చి పట్టింది పోంజాగారికా, వాళ్ల అత్తగారికా? సాధారణంగా ప్రశాంతంగాను, సంతోషంగాను ఉండే వల్డానా పట్టణంలో ఈ సమస్య అందరినీ ఇంకా తికమక పెడుతూనే ఉన్నది.


 

No comments: