Saturday, November 21, 2026

కాకి పాట 2

 


కాకి పాట

 

కాకీ కాకీ కమ్మల కాకీ

కాకి నోట్లో దీపం

దీపం దీస్కపొయి అమ్మాకిస్తే

అమ్మా నాకు అటుకులు వెట్టె

అటుకులు దీస్కపొయి ఆవుకు వెడితే

ఆవూ నాకు పాలూ యిచ్చే

పాలూ దీస్కపొయి పంతులుకిస్తే

పంతులు నాకు పద్యం జెప్పే

పద్యం దీస్కపొయి మామాకిస్తే

మామా నాకు పిల్లానిచ్చే

పిల్లా పేరు మల్లే మొగ్గా

నా పేర్ తైసిల్దార్

 

 

 

 

కలవల కాకి

 

కాకి కాకి కలవల కాకి

కాకిని బట్టి గంగలో ముంచితె

గంగా నాకు గంధామిచ్చె

గంధం తెచ్చి ఆవూకిస్తే

ఆవు నాకు పాలు ఇచ్చే

పాలు తెచ్చి అమ్మాకిస్తే

అమ్మ నాకు జున్ను పెట్టే

జున్ను తెచ్చి పంతులు కిస్తే

పంతులు నాకు పద్యం చెప్పే

పద్యం మామకు ఒప్పగిస్తే

మామ నాకు పిల్లనిచ్చే

పిల్ల పేరు మల్లె మొగ్గ

నా పేరు సర్దార్

 


Friday, November 20, 2026

చంద్రుని మీద కాలం కొలత


చంద్రుని మీద కాలం కొలత
కె.బి గోపాలం 98490 62055
చంద్రయాన్ విజయవంతంగా చంద్రగోళాన్ని చేరి దానిమీద ఒక యంత్రాన్ని వదిలింది. అందులో నుంచి రోవర్ దిగి అక్కడి పరిస్థితులను పరిశీలించింది. ఈ సంగతులు నిజంగా గొప్పవి. కనుకనే దేశమంతా పండుగ చేసుకున్నాము. అంటే మునుమందు చంద్ర గోళం మీద మరెన్నో కార్యక్రమాలు జరుగుతాయి అని అర్థం.
2025
సంవత్సరం నాటికి మళ్ళీ మనుషులు చంద్రుని మీద దిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ పరిశోధన కేంద్రాలను స్థాపించాలని కూడా ప్రణాళికలు తయారవుతున్నాయి. వాటిలో నేరుగా మనుషులు ఉండకపోవచ్చు. కానీ మరమనుషులు తప్పకుండా ఉంటారు. ఆ యంత్రాలు అక్కడ బయట తిరిగి ఖనిజ వనరులను గురించి పరిశీలనలు, పరిశోధనలు కొనసాగిస్తాయి. వాటి కొరకు మనుషులు కూడా అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వస్తుంటారు. అంటే, భూమి మీద లాగే అక్కడ కూడా కార్యక్రమాలన్నీ, ఒక కాలం ప్రకారం పద్ధతిగా జరగవలసిన అవసరం వస్తుంది, అన్నమాట.
చంద్రుని మీద పరిశోధనల కొరకు, సాంకేతిక విధానాలను, భూమి మీదే తయారు చేస్తారు. వాటిని తీసుకుపోయి రెండు లక్షల 39వేల మైళ్ళ దూరంలో, పని చేయించే ప్రయత్నం చేస్తారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు, ఈ దిశగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగిన ఉపగ్రహాలను అప్పుడే తయారు చేస్తున్నారు కూడా. యుఎస్ లో కూడా ఆర్టెమిస్ పేరుతో మరొక కార్యక్రమం జరుగుతున్నది. ఈ వ్యాసం పాతది అని అర్థమయి ఉండాలి. ఆర్టెమిస్ మీద ఈ మధ్యనే మనుషులు చంద్రమండలం దాకా వెళ్లి వచ్చారు. వాళ్లది కూడా ఇదే ప్రయత్నం. మొత్తానికి చంద్రుని మీద కాలం లెక్కలు ఏరకంగా ఉండాలి అన్నది, ముఖ్య సమస్యగా వీరి ముందు నిలిచింది.
అపోలో వ్యోమగాములు చంద్ర గోళం మీద దిగారు. తమ పని తాము ముగించి తిరిగి వచ్చేసారు. అక్కడ వారికి కాలం కొలతలతో అవసరం రాలేదు. కానీ శాశ్వతంగా అక్కడి కేంద్రాలు ఉంటాయంటే మాత్రం, తప్పకుండా కాలం లెక్కలు అవసరం అవుతాయి. భూమి మీద ఏదో ఒక ప్రాంతంలో ఉన్న పద్ధతిలోనే, సమయాన్ని లెక్కించే పద్ధతిని అక్కడ కూడా వాడవలసి ఉంది. ఈ మాట అనడానికి సులభంగా ఉన్నా, అటు సాంకేతికపరంగానూ, ఇటు రాజకీయపరంగానూ గొప్ప సమస్యగా నిలబడింది. అసలు చంద్రుని మీద కాలం లెక్కకు ఆధారం ఏమిటి ?
భూమి మీద ఒక సెకండ్ అంటే ఎంత కాలం అనే లెక్క తెలుసు. అందరూ తెలుసు అనుకుంటున్నారు, కానీ అసలు లెక్క ఒకటి ఉంది. అది అంత సులభంగా తలకెక్కదు. ఎక్కినా, మన దినసరి జీవితంలో దాన్ని వాడే అవకాశం ఉండదు. ఒక గడియారాన్ని సరయిన సమయానికి మార్చాలన్నా, అంటే సెట్ చేయాలన్నా, మరి ఏ పని చేయాలన్నా ఒక పద్ధతి అవసరం. భూమి మీద మనకు ఆ పద్ధతి అలవాటయింది. మానవుల శరీరాల కూడా ఆ పద్ధతి ప్రకారమే పనిచేస్తున్నాయి.
భూమి తన చుట్టు తాను తిరిగే కాలం మనకు తెలుసు. అది సూర్యుని చుట్టూ తిరిగే సమయం కూడా తెలుసు. వీటి ఆధారంగానే మన కాలం కొలతలు కొనసాగుతున్నాయి. చంద్రగోళం మాత్రం తన చుట్టూ తాను, భూమితో పోలిస్తే, చాలా నెమ్మదిగా తిరుగుతుంది. ఆ గోళం మీద కొంత ప్రాంతం, వెలుగు లేకుండానే ఎక్కువ కాలం ఉండిపోతుంది. చంద్రగోళం ఒకసారి తాను తన చుట్టూ తిరగడానికి 29.5 భూమి దినాలు పడుతుంది. చంద్రగోళం తిరుగుతున్నట్టు భూమి మీద మనకు కనిపించదు. మనకు ఎప్పుడూ చంద్రుని మీది ఒక దిక్కు మాత్రమే కనపడుతుంది. ఇది చాలా ముఖ్యంగా గమనించవలసిన విషయం. చంద్రగోళం తను తిరుగుతున్న వేగంతోనే భూమి చుట్టూ కూడా తిరుగుతుంది. కనుక ఎప్పుడూ ఆ గోళం మీద ఒక భాగం మాత్రమే, మనకు కనబడుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి కొంత ప్రయత్నం అవసరం.
మనకు భూమి మీద సూర్యోదయం, అస్తమానం లాంటి కొలతలు ఉన్నాయి. చంద్రుని మీద ఈ కొలతలు వేరుగా ఉంటాయి. అంటే చంద్రగోళం మీద, కాలం కొలతలు అంత సులభంగా కుదరవు, అని అర్థం. కనుకనే వాటి గురించి పరిశోధకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
చంద్రగోళం మీదకి బహుశా మన దేశం వాళ్లు కూడా వెళతారు. మరెన్నో దేశాల వాళ్ళు వెళతారు. కనుక అందరికీ అంగీకారమయ్యే లెక్కలు రావాలి. అక్కడికి వెళ్లిన అంతరిక్ష యాత్రికులు, తాము ఏ సమయంలో, ఏ ప్రదేశంలో, ఎంత కాలం పాటు ఉన్నాము, అన్న సంగతులను లెక్క వేసుకోగలగాలి. భూమి మీద ఇటువంటి ఏర్పాట్లు ఇప్పటికే ఉన్నాయి. కొత్త కదలిక వేగాల ఆధారంగా చంద్రగోళం మీద కూడా ఇటువంటి కొలతలు రావాలి. ఇందుకు కావలసిన సాంకేతిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి, అంటున్నారు పరిశోధకులు.
మొత్తం మీద కొత్త రకం కాలం కొలతలు వచ్చేస్తున్నాయి, అని మాత్రం అర్థం చేసుకోక తప్పదు. మానవ చరిత్ర మొత్తం మీద ఒక పద్ధతి కొనసాగింది. ఇప్పుడు మాత్రం మరొక పద్ధతి వస్తున్నది, అంటున్నారు పరిశోధకులు.

 


 

Wednesday, November 18, 2026

గ్రనాడా తాపీ మేస్త్రీ కథ : టేల్స్ ఆఫ్ అల్హ్ంబ్రా నుంచి


తాపీ మేస్త్రి కథ

వాషింగ్టన్ ఇర్వింగ్ రాసిన టేల్స్ ఆఫ్ అల్హంబ్రా పుస్తకం నుంచి

అనగనగా ఒకప్పుడు గ్రనాడాలో ఒక బీద తాపీ మేస్త్రి ఉండేవాడు. ఇటుకలు చేయడం, వాటిని పేర్చి గోడ కట్టడం అతని పని. అతను బుద్ధిగా మహామహుల జ్ఞాపకార్థం ఉపవాసాలు ఉంటాడు. పూజలు చేస్తాడు. అంత భక్తి గలవాడయినా అతని పరిస్థితి మాత్రం రాను రాను అధోగతికి దిగజారింది. ఇంట్లో బోలెడు మంది ఉంటారు. వాళ్లకు తిండి సంపాదించడమే గగనమయి పోయింది. ఒకనాడు రాత్రి పడుకున్న తర్వాత కొంతసేపటికి అతనికి మెలుకువ వచ్చింది. అందుకు కారణం బయట ఎవరో తలుపు తట్టడం. అతను వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా ఒక ఎత్తయిన మనిషి నిలబడి ఉన్నాడు. అతను శవంలా పాలిపోయి ఉన్నాడు. నిజానికి అతడు ఒక ప్రీస్ట్ అంటే పూజారి.

ఏమోయ్ మిత్రమా! అంటూ అతను ప్రేమగా పలకరించాడు. నీవు చాలా బుద్ధిమంతుడైన క్రిస్టియన్ వని నేను గమనించాను. నిన్ను సులభంగా నమ్మవచ్చు. ఈ రాత్రి నాతో వచ్చి ఒక పని చేయగలవా? అడిగాడతను.

మనసుపెట్టి పనిచేస్తానండి! గురువుగారు! అయితే ఒక షరతు. నాకు మీరు తగినంత డబ్బు ఇవ్వాలి. అన్నాడితను.

అందుకే లోటుండదు. అయితే పనిచోటికి వెళ్లే దాకా నీకు కళ్ళకు గంతలు కడతాను.

తాపీ మనిషి ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. కళ్ళకు గంతలు కట్టిన తరువాత వచ్చిన పెద్దమనిషి అతనిని సంధులు గొంతులో గుండా నడిపించి, ఎన్నో మలుపులు తిప్పి, ఒక ఇంటి ద్వారం ముందుకు చేర్చాడు. జేబులో నుంచి తాళం చెవి తీసి, కిరకిరమంటున్న తాళం తెరిచాడు. ఆ తలుపు కూడా బాగా చప్పుడు చేసింది. వాళ్లు లోపలికి వెళ్లి తలుపు బిడాయించారు. మళ్లీ లోపల కూడా పూజారి రకరకాల దారుల గుండా నడిపిస్తూ, నడవల గుండా ముందుకు సాగి, భవనం లోపలికి చేరాడు. తాపీ అతని వెంట వెళ్లాడు. అప్పుడు అతని కంటి మీద పట్టి తీసేసాడు పూజారి. వారు అప్పుడు బయట కప్పు ఉన్న స్తంభాల నడవలో ఉన్నారు. . అక్కడ ఒకే ఒక్క దీపం వెలుగుతున్నది కనుక అంతా మసక చీకటిగా ఉంది. అక్కడి మధ్యప్రదేశంలో నీళ్లు లేని ఒక తొట్టి ఉంది. అందులో ఒక ఫౌంటెన్ కూడా ఉంది. అది పాత మూరిష్ కాలపు నమూనాలో ఉంది. ఆ తొట్టి ఉన్నచోట ఒక రహస్య గది కట్టాలని ప్రీస్ట్ అడిగాడు. అవసరమైన ఇటుకలు మిగతా సామాగ్రి అంతకుముందే ఏర్పాటయి ఉంది. ఇక మేస్త్రి రాత్రి మొత్తం పని చేశాడు. తెల్లవారే సమయానికి పని మాత్రం ముగియలేదు. ఇక కొంతసేపటికి సూర్యోదయం అవుతుంది అనగా, పూజారి మేస్త్రీ చేతిలో ఒక బంగారు నాణెం ఉంచాడు. మళ్లీ గంతలు కట్టి ఇంటికి చేర్చాడు.

మరోసారి తిరిగి వచ్చి పని పూర్తి చేయాలంటే అంగీకారమేనా? అడిగాడు పూజారి.

సంతోషంగా గురువుగారు! అయితే నాకు ముదరా మాత్రం చెల్లించాలి! అన్నాడతను.

సరే మంచిది. రేపు మధ్యరాత్రి సమయానికి మళ్ళీ వస్తాను.

మరుసటి రాత్రి అలాగే జరిగింది. పని కూడా పూర్తయింది.

నీవు కట్టిన గదిలో కొన్ని శరీరాలను భద్రపరచాలి. అందులో నీవు నాకు సాయం చేయాలి. అన్నాడు ప్రీస్ట్.

ఆ మాటలు విన్న తాపీ మేస్త్రీకి మేడ మీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. అయినా పెద్దాయన వెంట వెళ్లాడు. అతని అడుగులు తడబడుతున్నాయి. ఆ భవనంలోని ఒకానొక గదిలోకి వాళ్ళు వెళ్లారు. అక్కడేదో భయంకరమైన మరణ దృశ్యం కనబడుతుంది అనుకుంటున్నాడు మేస్త్రి. అలాంటిదేమీ లేదు. ఆ గదిలో కొన్ని పెద్ద పెద్ద బానలు ఉన్నాయి. అవన్నీ ఒక మూలన సర్ది ఉన్నాయి. తప్పకుండా వాటి నిండా ధనం ఉండి ఉంటుంది. ఇద్దరు కలిసి వాటిని, నానా కష్టాలు పడుతూ కొత్తగా కట్టిన రహస్యం గది దగ్గరకు తరలించారు. ఆ గది ఆ బానలకు సమాధి. గదిని మూసివేశారు. పైన గుర్తులు ఏవీ తెలియకుండా చేశారు. అక్కడ నిజానికి ఏదో పని జరిగింది అన్న అనుమానం రాకుండా మొత్తం మరమ్మతు చేశారు. మేస్త్రి కళ్ళకు గంతలు కట్టడం, అతడిని ఇంటికి చేర్చడం జరిగింది. అయితే వచ్చిన దారినే మాత్రం వెళ్ళినట్టు లేదు.

రకరకాల సందులు గొందుల గుండా, చాలాకాలం నడిచిన తర్వాత, చివరికి వారు ఆగారు. మళ్లీ  ప్రీస్ట్ మేస్త్రి చేతిలో బంగారు నాణాలు ఉంచాడు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకు. కొంతసేపు ఇలాగే ఉండు. కతీడ్రల్ లో గంట మోగుతుంది. అప్పుడు వెళ్ళు. ఆ లోగా గంతలు గాని విప్పుకుంటే, నీకు చెప్పరాని చేటు కలుగుతుంది. అని చెప్పి ప్రీస్ట్ వెళ్ళిపోయాడు. మేస్త్రి బుద్దిగా గంట మోగే వరకు వేచి ఉన్నాడు.చేతిలోని బంగారాన్ని ఎగరేస్తూ కాలం గడుపుతున్నాడు. గంట మోగనే మోగింది. అతను గంతలు విప్పుకున్నాడు. చూస్తే అతను నది పక్కన ఉన్నాడు. ఇంటికి దగ్గరే కనుక, వెంటనే వెళ్ళిపోయాడు. ఇక ఒక రెండు పారాలపాటు ఇంట్లో పండుగలా గడిచింది. రెండు రాత్రులు పని చేసినందుకు రెండు వారాలపాటు సరదా. ఆ తర్వాత మళ్లీ, అతను అతని బీదతనం ఉండనే ఉన్నాయి.

అతను ఎంతో కొంత పనిచేస్తున్నాడు. ప్రార్థనలు కూడా బాగా చేస్తున్నాడు. ఉపవాసాలు సెలవు దినాలు, సంవత్సరం తర్వాత సంవత్సరం చేస్తూనే ఉన్నాడు. కుటుంబం పెరిగింది. వాళ్లను చూస్తే దేశ దిమ్మరులు అనుకునే పరిస్థితి వచ్చింది. ఇల్లు అనే ఆ కొంప ముందు ఒక సాయంత్రం కూర్చుని ఉన్నాడు. అక్కడికి బాగా కలిగిన బాబు ఒకతను వచ్చాడు. ఆయనకు చాలా ఇల్లు ఉన్నాయని చాలామందికి తెలుసు. కలిగినవాడు అతను. ఆ డబ్బు గలాయన మన తాపీ మేస్త్రి వైపు ఒకసారి చూచాడు. గుబురయిన కనుపమలు గల కళ్ళను బాగా విప్పి చూచాడు.

నీవు కడుగు బీదవాడవు అంటున్నారు అందరూ, అన్నాడు.

ఆ మాట నిజమే కదండీ. చూస్తేనే తెలుస్తుంది కదా!

అయితే నేను అనుకున్నట్టే, నీకు పని దొరికితే బాగుంటుంది కదా? అది తేలికగా చవకగా!

గ్రనాడాలో ఏ మేస్త్రి అయినా ఎంత చవకగా వస్తాడో అలాగే నేను వస్తాను.

నాకు కావాల్సింది అదే. నా పాత ఇల్లు ఒకటి మరీ పడిపోతున్నది. దాన్ని మరమ్మతు చేయించాలంటే అయ్యే ఖర్చు, దాని మొత్తం విలువ కంటే ఎక్కువయ్యేటట్టుంది. అందులో ఎవరు ఉండలేరు. కనుకనే, ఎంత వీలయితే అంత తక్కువ ఖర్చుతో, దాన్ని నిలబెట్టాలి అన్నది నా కోరిక.

ఇక మేస్త్రిని వెంటబెట్టుకుని ఆ పెద్దమనిషి ఒక పెద్ద పాడుపడిన ఇంటి వద్దకు తీసుకుపోయాడు. అందులో ఎన్నో ఖాళీ హాళ్ళు, నడవలు, గదులు ఉన్నాయి. అట్లా ముందుకు సాగి వాళ్ళు మధ్యభాగంలోకి వెళ్లారు. అక్కడ కనిపించిన పాత మూరిష్ ఫౌంటెన్, మేస్త్రీని చకితుడిని చేసింది. అతను ఒక్క క్షణం నిర్ఘాంత పోయాడు. కలలో లాగా అతనికి ఏవో గుర్తులు కళ్ళ ముందు కదలాడాయి.

అయ్యా! ఈ ఇంట్లో ఇంతకుముందు ఎవరు ఉండేవారు? పట్టలేక అడిగాడతను.

వాడి బండ బడా! ఒక పీనాసి పూజారి ఉండేవాడు! ఉరుముతున్నట్టు చెప్పాడు పెద్దమనిషి. అతనికి తాను తప్ప మరెవరు పట్టరు. అతని దగ్గరేమో చాలా డబ్బు ఉంది అని అందరూ అన్నారు. బంధువులు కూడా ఎవరూ లేరు. పోయిన తర్వాత ఆస్తి మొత్తం చర్చికే చెందుతుంది అన్నారు. అతను ఉన్నట్టుండి చనిపోయాడు. ఆస్తినంతా హస్తగతం చేసుకుందామని మిగతా పూజారులు, అధికారులు ఒక్కమాటుగా వచ్చారు. ఒక తోలు పర్స్ లో ఏవో కొన్ని డుకాట్లు తప్ప అక్కడ మరేమీ దొరకలేదు. నిజానికి దురదృష్టవంతుడిని నేను! అతను పోయాడు. ఇల్లు మాత్రం అతనికిందే ఉంది. బాడుగ ఇచ్చే వారెవరూ లేరు. చచ్చిన మనిషి మీద నేను వ్యాజ్యం వేయడానికి కూడా లేదు. ముసలి పూజారి పడుకునే చోటు నుంచి కాసుల గలగల చప్పుడు వినిపిస్తున్నదని చుట్టుపక్కల మనుషులు చెబుతున్నారు. అతను ఏదో డబ్బులు లెక్క పెడుతున్నట్టు! అప్పుడప్పుడు మూలుగులు, మాటలు కూడా వినపడుతున్నాయట! నిజమో కాదో తెలియదు కానీ, నా ఇంటికి మాత్రం చెడ్డ పేరు వచ్చింది. ఇక అద్దెకు ఎవడూ రావడం లేదు!

చెప్పింది చాలయ్యా! అన్నాడు తాపీ మేస్త్రి. మరెవరో దొరికే దాకా నేను నీ ఇంట్లో ఉంటాను. అద్దె మాత్రం ఇవ్వలేను. చేతనయినంత మటుకు ఇంటిని మరమ్మతు చేస్తాను. ఆ పెద్దాయన ఆత్మకు కూడా శాంతి కలుగజేస్తాను. మీకు తెలుసు కదా నేను మంచి క్రిస్టియన్ను! పైగా బీదవాడిని! దయ్యాలు కూడా నన్ను ఏమీ చేయలేవు. అతని ఏదో డబ్బు సంచి రూపం లో నా ముందుకు వస్తే తప్ప నాకు పోయేదేమీ లేదు!

తాపీ మేస్త్రి మంచివాడు గనుక ఇల్లు గల ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. మేస్త్రీ ఆ ఇంట్లోకి కుటుంబంతో సహా వచ్చి చేరాడు. చేతనేనంత పని కొనసాగించాడు. కొంచెం కొంచెంగా ఇంటిని మొత్తం బాగు చేశాడు. పాత కళ మళ్ళీ వచ్చింది. పోయిన పూజారి గదిలో నుంచి నాణాల చప్పుడు ఎవరికీ వినిపించడం లేదు. ఇంట్లో ఉంటున్న మేస్త్రీ జేబులో మాత్రం నాణాల చప్పుడు వస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే, అతని వద్ద క్రమంగా డబ్బు చేరింది. చుట్టుపక్కల వాళ్ళందరూ అతడిని గౌరవించసాగారు. కొంతకాలంలోనే అతను గ్రనాడా మొత్తంలో ధనికులలో ఒకడు అనిపించుకున్నాడు. చర్చ్ కు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చాడు. అందులో అనుమానమే లేదు. అతని అంతరాత్మ మరి శాంతించాలి కదా! దాచిన నిధిని గురించి అతను నోరు విప్పి ఎవరికీ చెప్పలేదు, చనిపోయే ముందు అంటే మరణశయ్య మీద తన కొడుకుకు, మిగతా ఒకరిద్దరికి తప్ప!


 

Monday, November 16, 2026

లోకాభిరామం - ఇల్లు కట్టి చూడు

 


ఇల్లు కట్టి చూడు..

Published Saturday, 15 June 2019

 

ఈ మధ్యన మా వీధిలో మా ఇంటికి ఎదురుగ ఉన్న ఒక ఇంటిని స్వంతదారులు అమ్ముకున్నరు. భార్యాభర్తలు ఇద్దరే కనిపించేవారు. బహుశా పిల్లలు విదేశాలలో ఉండే ఉంటరు. నా పిల్లలలాగే. నాకు ఇంకా ఆ పరిస్థితి రాలేదు కానీ, ఈ దంపతులు ఇల్లు అమ్ముకుని వెళ్లిపోయినట్టు ఉన్నరు. మా వీధిలో ఉన్న ఇళ్లు చాలామటుకు ఒకటికన్న ఎక్కువ అంతస్తులు గలవి. ఈ ఇల్లు మాత్రం ఒకే అంతస్తు ఉండేది. వెనుక ఒక పెద్ద మామిడిచెట్టు ఉండేది. ముందు మరేదో చాలా పెద్ద చెట్టు ఉండేది. చూస్తుండగ ఆ చెట్లను నరికి పడేయడం కనిపించింది. కొత్తగ ఇల్లు కొన్నవారు, ఉన్న నిర్మాణాన్ని పడగొట్టి మళ్లీ కట్టుకుంటరు అని అర్థం అయింది. అందుకని చెట్లు నరకవలసిన అవసరం ఉందా అనే అనుమానం వచ్చింది కానీ, అసలు తతంగం చూసిన తరువాత విషయం అర్థమయింది. కొంతకాలం ఇల్లు ఖాళీగ ఉండిపోయింది. చెట్లు పడగొట్టినప్పుడు గోడ, కొంత పాడయింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. అంటే దాన్ని కూడ పడగొడతరు అని అర్థం. ఒకనాడు ఇద్దరు ముగ్గురు పనివాళ్లు చేరి సుత్తెలు తీసుకుని మెట్ల గదిని పడగొట్టడం మొదలుపెట్టినరు. ఒక రెండు మూడు గంలయినా వాళ్లు కొంత మాత్రమే పడగొట్టగలిగినరు. మొత్తం ఇల్లు పడగొట్టేసరికి సుత్తిదెబ్బలు, నా నెత్తి మీద పడ్డట్టు ఉంటుంది, అని అనుమాన పడుతున్న. వాళ్లు పని మానుకుని మధ్యాహ్నమే వెళ్లిపోయినరు. మరునాడు ఉదయం ఒక రణగొణ ధ్వని వినిపించింది. ఇది రణము యొక్క గుణము గల ధ్వని, కనుక రణగుణ ధ్వని అయి ఉంటుంది అని నా అనుమానం. అటువైపు వెళ్లను, కొమ్మ దూకను. అంటే విషయం మార్చను. బయటకు వెళ్లి చూస్తే, అంటే నా ఐదవ అంతస్తు బాల్కనీలో నుంచి చూస్తే, ఒక భారీ యంత్రం కనిపించింది. దానికి ఒక ఎద్దుకున్నట్టు పెద్ద తల ఉంది. ఆ తలలో నాలుగు గడ్డపారలు కలిపినంత లావు గడ్డపార ముక్కు ఉంది. అది ఆవేశంగ అటు ఇటు కదులుతున్నది. ప్రాణమున్నట్టు కనిపించింది. దానికి పేరు ఏమయిన ఉందేమో తెలియదు. బుల్ డోజర్ అనే మాట విన్న కానీ, ఇది దాని తాతలాగ ఉన్నది. ఉదయం తొమ్మిది ప్రాంతంలో వచ్చిన ఆ యంత్రం ఆరు గంటలకల్ల మొత్తం ఇంటిని నేలమట్టం చేసింది. కోటలు మింగే వానికి తలుపులు అప్పడాలు అన్నట్టు, కాంక్రీట్ స్తంభాలను ముక్కుతో పొడిచి పడగొట్టగల ఆ యంత్రానికి మామూలు గోడలు, ఏమనాలో తెలియడం లేదు, అసలు అడ్డమే రాలేదు. అటువంటిదే మరొక యంత్రం వచ్చి ఆ మట్టిని లారీలకు ఎత్తింది. మరునాటి సాయంత్రం లోపల అసలు అక్కడ ఇల్లు ఉండిందా అని అనుమానం వచ్చే రకంగ శుభ్రమైన ప్లాట్ మిగిలింది.

ఇక తరువాతనయినా విషయం మామూలుగ జరగకపోతుందా అని నేను ప్రతినిత్యం, బాల్కనీలోకి పని లేకుండ వెళ్లి గంట గంటకు ఆ ఇంటి వైపు చూడడం అలవాటు అయింది. ఈ మాటలు రాయడానికి ముందు కూడ అక్కడికి పొయ్యి చూసి వచ్చిన. ఎండల పేరున ఇన్ని రోజులు పని మానేసిన వారు, ఇవాళ కాంక్రీట్ స్తంభాలు వేయడానికి చువ్వలను ఏర్పాటు చేస్తున్నరు. ఈలోగా జరిగిన తతంగం గురించి చెప్పకపోతే, మీకు అంత ఇల్లు కట్టడం గురించి ఏం తెలుస్తుంది? నేను ఇక్కడ ఎంతో నేర్చుకుంటున్న అన్న సంగతి ఏం అర్థం అవుతుంది?

వెనకట ఇల్లు కట్టాలంటే గదులు, గోడలు ఉండే ప్రకారం పునాదులు తోడేవారు. వీటిని హిందీ, ఉర్దూ భాషలలో బునియాద్‌లు అంటారు. పునాదులు బదులు మా దగ్గర తెలుగు వాళ్లు కూడ బునాదులు. వీలయితే నా మీద ఒక యావత్తు కూడా కలుపుతారు. బహుశా ఇప్పుడు ఆ పద్ధతి మారిపోయి ఉంటుంది. అసలు ఎవరూ పునాదులు వేయడం లేదు అని నాకు ఈ ఎదురింటి వలన అర్థం అయింది. మట్టిని తోడి లారీలకు ఎక్కించిన మధ్యరకం యంత్రం మళ్లీ వచ్చింది. అది నేలలో అటు ఆరు, ఇటు ఆరు, అడుగుల గుంటలు తోడింది. చెబితే నమ్మరు, ఒకరోజులో ఎనిమిది గుంటలు తోడింది. మామూలుగా గడ్డపారలు తీసుకోని తవ్వుతూ ఉంటే మిగత వాళ్లు ఆ మట్టిని తరలిస్తరు. ఆ పద్ధతిలో అయితే ఈ గుంటల వ్యవహారం ఎన్ని రోజులు సాగేదో ఆలోచించిన. కాలం మారిపోయింది. ఇల్లు కట్టే పద్ధతి మారిపోయింది. ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు కట్టినప్పుడు కూడా ఇవే పద్ధతులు అమలులోకి వచ్చినయి. గుంటలలో ఒక కాంక్రీట్ పొర వేసి నేలకన్న కొంచెం పై ఎత్తు వరకు స్తంభాలు వేసినరు. గుంతలు పూడ్చేసినరు. అసలు ఆశ్చర్యం మొదలయింది. పునాదులు లేవు. పునాదుల స్థానంలో కేవలం అడుగు లోతు మాత్రం తవ్వినరు. అందులో కంకర పరిచినరు. ఆ మీద నుంచి సిమెంటు ఇసుక కలిపిన మిశ్రమం పోసినరు. దిమ్మిస వేసినరు. ఒకరోజు వదిలేసినరు. ఇంత కొంచెం పునాదులు భవనాన్ని నిలబెడతయా అనిపించింది. అప్పుడు అసలు నాటకం మొదలయింది. సాధారణంగా మిద్దె ఎత్తులో వేసే కాంక్రీటు దూలాల వంటివి నేల ఎత్తులో వేసినరు. ఇది నాకు తెలిసిన సంగతి కాదు. ఈ మధ్యన అన్ని నిర్మాణాలు ఇట్లగే జరుగుతున్నయట. ఒకటికన్న ఎక్కువ అంతస్తులు ఉండే భవనం గట్టిగ నిలబడాలంటే, మరి ఇటువంటి ఆధారం ఉండడం చాల బాగుంటుంది. ఈ రకమైన కొత్త పద్ధతి పునాదులు, దూలాల రూపంలో ముగిసిన తరువాత వాటి ఎత్తు వరకు మట్టి నింపినరు. అందులో చేతనయినంత నీళ్లు కట్టినరు. గడ్డపారలతో రంధ్రాలు వేసి నీళ్లు కట్టినరు. అంటే మట్టి చేతనయినంత కాంపాక్ట్ అయ్యింది అని అర్థం. ఆ మీద మళ్లీ కంకర పరిచి సిమెంటు ఇసుక మిశ్రమం కూడా పరిచి, ఒక చక్కని ఫ్లోర్ తయారుచేసినరు. ఇప్పుడు గాని స్తంభాల పని మొదలు పెట్టలేదు. ఇంత తతంగం జరగడానికి పాతకాలపు పద్ధతులు అయితే చాలాకాలం పట్టేది. ఇక్కడ చూస్తుండగనే పనులు జరిగిపోతున్నయి. అన్నిటిలోను యంత్రాల ప్రమేయం ఉంటున్నది.

అన్నిటికన్న ఆశ్చర్యం ఆ ఇంట్లో వేసిన బోరు సంగతి. నిజానికి ఈశాన్యం మూలలో ఒక నీటి సంపు ఉన్నట్టు కనిపించింది. కానీ ఒకరోజు పొద్దున్నే బోరు యంత్రం వచ్చింది. ఇక ఇవాళ ప్రశాంతత ఉండదు, చదువు, రాత, సాగవు. రాత్రి కూడ బహుశా నిద్ర ఉండదు అనుకుంటున్న. అయితే అనుకోకుండా ఆనాటి సాయంత్రం ఎక్కడికో వెళ్లవలసి వచ్చింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి బాగ రాత్రి అయింది. సాయంత్రం వెళ్లేటప్పుడు బోరు యంత్రం ఇంకా పని చేస్తునే ఉన్నది. అందులో నుంచి పెద్ద ఎత్తున నీళ్లు చిమ్మిన జాడ కనిపించలేదు. బహుశా వీళ్ల బోర్ ఫెయిల్ అయింది అనుకున్న నేను. రాత్రి వచ్చేసరికి బోర్ యంత్రం లేదు. పాపం నీళ్లు పడలేదు అనుకున్న. మనసులో నాకు కొంత బాధ కలిగింది. ఎవరికి అపజయం కలిగినా నాకు నచ్చదు. అందరూ బాగుండాలె. అంత ఇల్లు కట్టుకోవాలె అనుకునే వాళ్లకు నీళ్లు లేకుండ ఎట్ల సాగుతుంది? నా మంచితనం నాది.

నిజానికి ఇల్లు కట్టడం మొలయిన తరువాత నాకు ఒక రహస్యం తెలిసింది. ఒకనాడు ఒక పెద్ద మనిషి వచ్చి ఒక పొడుగాటి తాటికి బరువు కట్టి, ఆ బోరులోకి వదులుతున్నడు. అంటే దాని లోతును, అందులో నీళ్లు ఉన్న లోతును పరీక్షిస్తున్నడు అని అర్థం. అతని పరీక్ష ముగిసింది. ఆ సాయంత్రానికి మరో నలుగురయి దుగురు వచ్చినరు. సరంజామా ఏదో తెచ్చినరు. బావిలో సబ్మర్సిబుల్ రకం పంపు బిగించినరు. గొట్టంలోంచి ఆశ్చర్యంగ అంత దూరం నీళ్లు చిమ్ముతున్నయి. మామూలుగ అయితే బోరు బావిలో నీళ్లు పడితే వీధి వీధంత బురద అయ్యేది. మరి ఇక్కడ అట్ల బురద కాకుండనే, బావిలో నీళ్లు ఎట్ల పడినయి అన్నది నాకు ఇవాళటి వరకూ అర్థం కాలేదు. ఇన్ని రోజులుగా ఆ బోర్‌ల నుంచే పనివాళ్లు నీటిని పుష్కలంగ వాడుకుంటున్నరు. నాకు ఏదో సంతృప్తిగ ఉంది. ఆ ఇంటి వాళ్లు నీళ్లు లేక బాధ పడరు అన్న భరోసా కలిగింది. పాలమూరులో నీళ్ల కరువుతో చాలా కష్టపడ్డము. పద్మారావు నగర్‌లో కూడా నీళ్లు కొంతవరకు కరువే అనవచ్చు. ఇప్పుడు ఉంటున్న ఇంటికి వచ్చిన తరువాత నీళ్ల సమస్య మాత్రం లేదు.

మాకు నిజానికి ఒకటి, రెండు ప్లాట్లు ఎక్కడో ఉన్నట్లున్నయి. వాటిలో ఇల్లు కట్టుకోవాలి అన్న కోరిక మాత్రం అంత బలంగ లేదు. నాకు అసలే లేదు. ప్లాట్ లేకుండ, నేల మీద ఇల్లు కట్టుకుని, కావలసినన్ని మొక్కలు పెంచుకుని, వీలైతే ఒక బర్రెను కూడ పెట్టుకుని పల్లెటూరి పద్ధతిలో బతకాలని నాకు ఉంటుంది. అయితే నా కోరికలు తీరడానికి, అసలు అవి తీరాలని నేను అనుకునేందుకు వీలు లేదు. మోక్షం గురించి చెప్పుతూ, స్వజ్ఞానం, ప్రాపక జ్ఞానం, ప్రాప్త జ్ఞానం ఉండాలె అంటుంది శాస్త్రం. నాకు అది జీవితంలోని అన్ని రంగాలకు వర్తిస్తుంది అనిపిస్తుంది. నా గురించి నాకు తెలుసు. నాకు గల ప్రాపకం గురించి తెలుసు. వాటికి తగినంత కన్న ఎక్కువే నాకు దొరికింది అని కూడ తెలుసు. ఇక నేను ఒక సొంత ఇల్లు కావాలె, అని కోరిక పెట్టుకోగల స్థితిలో లేను అన్న సంగతి కూడా తెలుసు. కానీ రకరకాల ఇళ్లు కట్టంగ చూచి, ఇల్లు కట్టడంలో చేయకూడని పనులు నాకు చాల తెలుసు అనిపిస్తుంది. ఇప్పుడు గానీ నా చేత ఎవరయినా ఇల్లు కట్టే ధైర్యం చేయిస్తే, లేదా వారి ఇల్లు కట్టే బాధ్యత నాకు అప్పగిస్తే, మంచి ఇల్లు కట్టగలను అని నా మీద నాకు నమ్మకం ఉంది.

 

చిన్న ఉదాహరణ చెబుత. చిన్న బెడ్‌రూమ్ తలుపు బాల్కనీలోకి తెరుచుకుంటుంది. వర్షం వస్తే బాల్కనీలోకి బలంగా నీళ్లు వస్తయి. బెడ్‌రూమ్ తలుపు లోపలికి తెరచుకునే విధంగ బిగించినరు కనుక, వాన నీళ్లు నేరుగ గదిలోకి వెళ్లిపోతయి. అదే తలుపు బాల్కనీలోకి తెరుచుకునేటట్లు బిగించి ఉంటే, వాన నీరు లోపలికి వచ్చే వీలు ఉండేది కాదు. ఈ సంగతి కాంట్రాక్టర్‌కు తోచలేదు. అప్పట్లో నాకు కూడా తోచలేదు. ఇప్పుడు ఆ సంగతి అర్థం అయింది. బాత్రూం విషయంలో కూడా మేము కొన్ని పొరపాట్లు చేసినము. ఇంజనీరింగ్ వాళ్లు దానికి ఏదో ఒక కిటుకు చెప్తరు కానీ, బాత్రూం మిగతా గదిలో నేల కన్న ఎత్తుగ ఉండటం ఎంత మాత్రం సరయిన పద్ధతి కాదు. పాతకాలం పద్ధతి కమోడ్‌లు బిగించడానికి గది కన్నా స్నానాల గదిలో నేల ఎత్తుగ ఉండటం అవసరం. కానీ ఈ కాలంలో అటువంటి అవసరం లేని కొత్త కొత్త నమూనాలలో కమోడ్‌లు దొరుకుతున్నయి. వాటిని తెచ్చుకుంటే ఇల్లంతా ఒకే ఎత్తులో నేల ఉండవచ్చు. పాలరాతి నేలను నీళ్లు పెట్టి కడిగే పద్ధతి ఉండదు. కనుక బాత్‌రూమ్ ఎత్తు ఎక్కువగ ఉన్నా పర్వాలేదు. అమ్మ 86 సంవత్సరాల వయసులో పోయే ముందు ఒక సంవత్సరంపాటు నా దగ్గర ఉన్నది. ఆ సమయంలో ఆమె స్నానాల గదిలోకి వెళ్లాలంటే, ఆ కొంచెం ఎత్తు కూడా ఎక్కలేక పడిన కష్టాలు నాకు కళ్లల్లో కనిపిస్తయి. ఇటువంటి సంగతులు ఇల్లు కట్టేటప్పుడు సాధారణంగ ఎవరూ ఆలోచించరు. కట్టిన తరువాత దాన్ని మార్చడం అసలు వీలు కాని పరిస్థితులు ఉంటాయి.

 


Friday, November 13, 2026

సైన్స్ గురించిన ఆసక్తి : Interest in Science


సైన్స్ - ఆసక్తి

 సైన్స్ అంటే ఏమిటి? అని కొంతమందిని అడిగి చూడండి. అదేదో ఉంది గానీ, ఆ సంగతి మనకు ఎందుకు? అంటారు చాలామంది. సైన్స్ అంటే అది మన గురించి అన్న ఆలోచన ఇంకా చాలమందికి రాలేదని అర్థమవుతుంది. సైన్స్ అంటే మన గురించిన సంగతులే. అయితే వాటిని చెప్పే తీరు కారణంగ వాటితో మనకు సంబంధం లేదు అనిపించింది. అయినా అందరూ తెలిసి తెలియక సైన్సును వాడుకుంటారు.

తెల్లవారుతుంది. పొద్దుమూకుతుంది. రాత్రి అయితే చీకటి వస్తుంది. వెన్నెల ఉంటే రాత్రి కూడా వెలుగు ఉంటుంది. కనుక చుక్కలు ఒకటి రెండు మాత్రమే కనబడతయి. ఆలోచించి చూస్తే ఇదంతా సైన్సే గదా? వానలు, ఎండలు, మళ్లీ ఒక పద్ధతిలో వస్తయి. పంటలు ఒక పద్ధతిలో పండుతయి. పూలు ఒక పద్ధతిలో పూస్తయి. పూలు అందమైన రంగులలో ఉంటయి. పూలు, పంటలకు ఆ పద్ధతులు, రంగులు ఎందుకు అవసరం అన్నది ఎవరికి తోచదు. ఎందుకట్ల? కొంతమందికి మెదడులో ప్రశ్నలు పుడతయి. ఆ సంగతుల గురించి పరిశీలన, ప్రయోగాలు మొదలవుతయి. కొన్ని సంగతులు అందరికీ అర్థమయ్యే పద్ధతిలో తెలుస్తయి. పూలు అందంగ, ఆకర్షణ ఉండవు అనుకునే వాండ్లు ఉంటరా? చూచే వారిని బట్టి అందం ఉంటుందని ఒక మాట ఉంది. అయినా పూలు అందరికీ అందంగనే కనవడతయి. ఆ రంగుల అవసరాన్ని, తీరును గురించి పట్టించుకుని పరిశీలించే వారిని సైంటిస్ట్ లు అంటున్నరు.

ఒక సంగతి వెనుక లోతయిన కారణాలు ఉంటయి. అవి తెలియనంత సేపు ఆ సంగతులు అర్థం కానట్టే ఉంటుంది. కొంచెం ప్రయత్నం చేస్తే ఏ సంగతి అయినా అర్థమవుతుంది. ఎండాకాలంలో బట్టలు ఎందుకు తొందరగ ఎండుతయి? పట్టించుకోలేదు అంటే ప్రశ్న అట్లనే మిగులుతుంది. కొంచెం ఆలోచిస్తే సంగతి తెలుస్తుంది. గాలిలో తేమ తక్కువగ ఉండడం అందుకు కారణం! ఆశ్చర్యం లేదు!! ఈపాటి ఆలోచన ఉంటే ఏ సంగతి అయినా అర్థమవుతుంది. అట్ల అర్థమయిన సంగతులను సైన్స్ అంటరు. అన్నింటిని గమనించాలె. కొంచెం ఆలోచించాలె. అంతమాత్రాన అందరూ సైంటిస్టులు కావాలని లేదు. ఆ సంగతి అర్థమయితే చాలుగదా!

ఈ అర్థం చేసుకునే తీరు గురించి ఒక ఉదాహరణ తీసుకుందము. సాయంత్రం వాన కురిసి వెలిసింది. కొంత ఎండ వచ్చింది. అప్పుడు ఆకాశంలో తూర్పు దిక్కున ఇంద్రధనుస్సు కనబడుతుంది. ఇంద్రధనుస్సు అందంగ ఉంటుంది. నిజమే! కానీ అది ఎందుకు కనబడింది అన్న సంగతి చెపితే విషయంలో మజా పెరుగుతుంది. కాదు, తరుగుతుంది అన్నరు కొందరు. కీట్స్ అని ఒక కవి. న్యూటన్ పరిశీలన తరువాత ఇంద్రధనస్సు రంగుల వివరం చెప్పినడు. ఈయన ఎవరో వచ్చి అందం గురించిన భావనను అంతం చేసినడు! అన్నడు ఆ కవి. నిజంగ సైన్సును అర్థం చేసుకోని ఆలోచిస్తే ఇంద్రధనుస్సు రహస్యం తెలిసి ఆనందం కలుగుతుంది గదా!

వానలు ఇంద్రుని వలన కురుస్తయని మనవారు నమ్మినరు. కనుక ఆయన బాణం అక్కడ కనిపించింది, అనుకుంటే అది అమాయకత్వం. ఇంద్రుడు లేడు, రాలేదు. ఆయన ఆయుధం విల్లు, అమ్ములు అనే కాదు. ఇంద్ర ధనుస్సు అనే అందం అన్నది, చూచే వాండ్ల కండ్లలో ఉంది గానీ, అసలు అక్కడ చేతితో తాకి చూడగలిగిన పదార్థం లేనేలేదు. అది పుట్టలో పుట్టింది అని మనవాండ్లు కథలు చెప్పినరు. సింగిడి అనే వంకర వెలుగు ఎందులోనూ పుట్టలేదు. అది అందరికి కనబ డుతుంది. అయితే ఎవరి సింగిడి వారిదే. ఒక్కొక్కరు నిలబడిన చోటును బట్టి ఇంద్రధనస్సు కనబడుతుంది. అక్కడ అది ధనుస్సు ఆకారంలో ఉండదు. వృత్తంలో పైభాగం వలె గుండ్రముగ ఉంటుంది.

సైన్స్ గురించి చెప్పే ప్రయత్నంలో గొప్ప సైంటిస్టులు, రచయితలు, కార్ల్ సేగన్, రిచర్డ్ డాకిన్స్, జిమ్ అల్ ఖలీలీ, అందరు సింగిడినే ఉదాహరణగ చెప్పినరు. ఈ ఇంద్రధనస్సు రావాలంటే ఎండ ఉండాలె. వాన గూడ ఉండాలె. ఎండ, వాన కలిసి ఉంటే పిట్ట పెండ్లి అని మా చిన్నప్పుడు చెప్పినరు. పిట్టలకు పెండ్లి జరగదు. కనుక మనము సైన్సు దారిలో ఆలోచనను ముందుకు సాగించే ప్రయత్నం చేతము. ఈ సైన్స్ ఆలోచన ఇంద్రధనస్సు కంటే అందముగ ఉంటుంది. సింగిడి సాయంత్రమే కనబడుతుంది. సూర్యుని వెలుగు పడమటి దిక్కు నుంచి పడుతుంటుంది. మధ్యలో ఆకాశంలో వాతావరణంలో లక్షల నీటి చుక్కలు ఉంటయి. వెలుగు వాటిలో నుంచి దూరి, విడిపోయి అవతల తూర్పు ఆకాశంలో ఒక వరుసలో కనబడతుంది. అదే, మధ్యాహ్నం వాన తరువాతే ఎండ వస్తే, నడి నెత్తిన ఉన్న సూర్యుని చుట్టు, అసలయిన వృత్తముగ రంగులు కనబడతయి. దాన్ని వరదగూడు అంటరు. అది అంత తరచుగ కనిపించే సంగతి కాదు.

వెలుగు అద్దం మీద పడితే వెనుకకు వస్తుంది. అది పరావర్తనము. నీటి మీద, పట్టకము మీద పడితే వక్రీభవనము చెందుతుంది. అంటే దాని దారి మారుతుంది. నీటి బొట్టులో నుంచి దూరిన వెలుగు, ఆ బొట్టు అవతలి దిక్కు నుంచి బయటపడే సమయంలో రంగులు విడిపోతయి. అదే సింగిడిగ, ఇంద్రధనస్సుగ మనకు కనబడుతుంది. ఆ రంగు కిరణాలు నలభయి నుంచి నలభయిరెండు డిగ్రీల కోణంలో బయటికి వస్తయి గనుక, రంగులు ఒకదాని తరువాత ఒకటి వరుసగ కనబడతయి. ఎక్కువ వంగిన వయోలెట్ రంగు అన్నింటికన్న కింద, ఆ తరువాత ఇండిగో, నీలం, ఆకుపచ్చ, పసుపు, ఆరెంజ్, చివరకు పై అంచున ఎరుపు కనబడతయి.

సూర్యకాంతిలో ఈ రంగులన్నీ కలగలిసి ఉంటయని రకరకాల ప్రయోగాలతో ఋజువు చేసినరు. మనం భూమి మీద నుంచి చూస్తము గనుక వృత్తంలో పైసగం మాత్రమే చూడగలుగుతము. ఇందులో ధనుస్సును తాకలేము! అందులో ఉండేది వెలుగు మాత్రమే! పదార్థం కాదు. సహజ వాతావరణం, మనిషి మెదడు కలిస్తేనే అది కనబడుతుంది. ఇంత చెప్పినా ఇది ఒక రకం ఇంద్రధనస్సు గురించి మాత్రమే. యాభయి, యాభయిమూడు డిగ్రీలు వంగిన రంగు కిరణాలతో తిరగబడిన రంగుల ధనుస్సు కూడా కనబడుతుంది. అంటే ఒకేసారి రెండు సింగిడిలు పడుతయి.

ఆలోచన చేసేందుకు ఓపిక ఉంటే, ఇది ఒకటే కాదు, ఈ ప్రపంచంలోనే అన్ని సంగతులు అర్థం చేసుకోవచ్చు. మనిషి మొదటి నుంచి ఇదే ప్రయత్నంలో ఉన్నడు. తెలిసిన ఎన్నో సంగతులు, వర్గీకరణకు గురయి, భౌతిక, రాసాయనిక, జీవ, భూగోళ వంటి శాస్త్ర విభాగాలు పుట్టినయి. ఆ తరువాతనే, సైన్సు మనకు కాదు అన్న భావన మొదలయింది.

సైన్స్ అంటే మనం, మన ప్రపంచం, పరిసరాల గురించిన తెలివి. ఇది సత్యం!