Showing posts with label Language. Show all posts
Showing posts with label Language. Show all posts

Saturday, September 5, 2026

లోకాభిరామం : నవలా తరంగం - శిలాహాసం On a Tamil novel by LaSaRa

 


నవలా తరంగం - శిలాహాసం

నాకు పుస్తకాలు కొనే అలవాటు ఉంది. లేదు. నాలుగయిదు భాషలు చదువుతాను. కనుక నేను కొనదలచుకున్న పుస్తకాలకు సరిపడేన్ని పైసలు నా దగ్గర లేవు. కొన్న పుస్తకాలకు తగిన స్థలం ఇంట్లో లేదు. అయినా, ఫుట్‌పాత్‌ మీద మొదలు, పెద్ద అంగళ్లలో వరకు పుస్తకాలను చూస్తూ తిరగడం మాత్రం మానలేదు. అట్లనే వాల్డెన్‌ అనే ఒక అంగట్లోకి పోతిని (ఈ వాల్డెన్‌ అనే మాటకు అడవులు అని అర్థం ఉందని నా అనుమానం! జెర్మన్‌!) అక్కడ బెస్ట్‌ సెల్లర్స్‌ ఉండనే ఉంటయి. వాటి గురించి ఫ్లిప్‌కార్ట్‌, క్రాస్‌వర్డ్‌ వంటి వారంత ఊదరగొడుతునే ఉంటరు. వాల్డెన్‌లో ఒకచోట కొన్ని పుస్తకాల ధరలు తగ్గించి అమ్ముతున్నట్లు కనిపించింది. అనుకోకుండా అందులో ‘కథ’ అనే సంస్థ వారు వేసిన మంచి పుస్తకాలు కనిపించినయి. ఒకటి అనుకున్నవాణ్ని, అయిదు పుస్తకాలు తెచ్చి కూచుని చదివిన. అవన్నీ తమిళ రచనలకు ఇంగ్లీషు అనువాదాలు. వాటిల్లో ఒకటి రెండు చిరు నవలల జమిలి పుస్తకం.

రచయిత పేరు ‘లాసరా’ అని ఉంది. లోపల వివరంగా చూస్తే ఆ పెద్దాయన పేరు లాల్‌గుడి సప్తర్షి రామామృతం అని అర్థమయింది. (ఈ తమిళుల తస్సదియ్య సంస్కృతాన్ని కొమ్ములు విరిచి, చెవులు నులిమి ఎంత చెయ్యాలెనో అంత చేస్తరు. పేరును ‘లాల్‌గుడి సప్తరిషి రామామిర్తం’ అని రాసుకున్నారు. ఈ పుస్తకంలో లాసరా రాసిన రెండు చిరు నవలలున్నాయి. ఒకటి కల్‌ సిరిక్కిరదు, అంటే రాయి నవ్వింది, రెండవది ప్రాయశ్చిత్తం. ఈ రెండూ కలిసి నిజానికి ఒకటే నవల. మొదటి నవల అనువాదంలో 72 పేజీలు చదివి వదిలేస్తే, బాగనే ఉంది. తరువాతి నవల 80 పేజీలు చదివిన తరువాత మరింత బాగుంది. ఈ కథలో రాయి అంటే అమ్మవారి విగ్రహం. ఆమె మొదటి కథలో నవ్విందేమో తెలియదు. రెండవ భాగంలో ఆ సంగతి అర్థమవుతుంది. కమలాంబిక నవ్వుతుంది. కానీ, ప్రాయశ్చిత్తం ఎవరికి, ఏమో తెలియదు. రెండవ భాగంలో నిజానికి కొత్త పాత్రలు కొన్ని వచ్చి కొంప ముంచింది లేదు. కానీ, కథ ముందుకు సాగుతుంది. ప్రాయశ్చిత్తం తరువాత కూడా కథ మరింత ముందుకు నడుస్తుందేమో? నడిస్తే బాగుండునన్న భావం మిగులుతుంది. ఈ రెండు చిరు నవలలను కలిపిన నవల గురించి వ్యాఖ్యానించడానికి నాకు మనస్కరించడం లేదు. అయినా వాటిని గురించి అందరికీ చెప్పాలన్న భావం మాత్రం బలంగ మిగిలింది. ఈ రచయిత మరో బోలెడన్ని నవలలు, కథలు రాసినరు. అందులో కొన్ని ఉచితంగ నెట్‌లో అందుబాటులో ఉన్నయి. నాకు ధారాళంగ తమిళం చదవడం రాదు. ఎవరయినా చదివి వినిపిస్తే అర్థం చేసుకోగలను. లాసరా రచనలు కడు సరళంగ సాగుతయి కనుక మరింత సులభంగ, అర్థమవుతయని నమ్మకం. ఇంతకు ఒకటి రెండు సందర్భాలలో తమిళం చదువు అభ్యాసం చెయ్యలేదే, అని అనిపించడం వాస్తవం. ఈ అనువాద నవల చదివిన తరువాత ఆ భావం మరింత బలంగ మరోసారి కలిగింది.

నవలలో ధర్మరాజన్‌ గారని ఒక నడివయసు కూడ దాటిన పెద్దాయన నాయకుడు. ఆయనను ఆదర్శంగ చూడడమా, మెచ్చుకోవడమా, జాలి పడడమా, అసహ్యించుకోవడమా, మనకు, కనీసం నాకు అంతుపట్టలేదు. ఇటువంటి ఒక పాత్ర మరెక్కడో ఒక్కచోట మాత్రం ఎదురయిందని అనుమానం. ‘తెరచిరాజు’లోనా?

కథాక్రమంబెట్టిదనిన: నాకు కథ చెప్పాలనిపించడం లేదు. అంత కలగాపులగంగ గుర్తొస్తున్నది. అది కావాలని, రచయిత పన్నిన పన్నాగమని నాకర్థమవుతున్నది. ధర్మరాజన్‌కు తలిదండ్రులు లేరు. పెద్దనాయన దగ్గర బుద్ధులు నేర్చి, ఆయన చెప్పినందుకు ప్రపంచం మీద పడతడు. మంచి ఉద్యోగమే చేస్తడు. కానీ, వ్యక్తిగతంగ నాకులాగే, ఎక్కడా నిలకడ లేదు. ధర్మరాజన్‌ను చూచి అందరూ గౌరవిస్తరు. తలకెత్తుకుంటరు. ఆయన మాత్రం జారిపోయి కష్టాలలో మునిగిపోతడు. ఆయన దగ్గర ఉద్యోగం చేసిన ఒక అమ్మాయి, వివాహిత, ఆమెకు కొడుకు కూడ ఉంటడు. కానీ, ఆమెకు సుఖం లేదు. మొగుడు ఎందుకూ పనికిరాని సన్నాసి. ఆ అమ్మాయికి, ధర్మరాజన్‌కు బిడ్డ-తండ్రి వంటి ప్రేమ. ధర్మరాజన్‌కు ధర్మత: కమలాంబిక గుడిలో పూజారితనం హక్కుగ ఉంటుంది. అక్కడ పెదనాయన కొడుకు ఉన్నడు. పని చేయడం ఇష్టమే. పైసలు మాత్రం వద్దు. ఒక మార్వాడీ ఇంట్లో వంటవానిగ పనికి చేరుతడు మన నాయకుడు. కథలోని అమ్మాయి నగలు ఆ మార్వాడీ దగ్గర కుదువబెట్టి ఉన్నయి. వాటినీయన దొంగిలిస్తడు. సేఠ్‌ చని పోతడు. మన హీరో జెయిలు పాలవుతడు. తిరిగి బయటకి వస్తడు. కథ సాగుతుంది.

చెప్పిన గద, కథ చెప్పాలని లేదని! సినిమాకు కుదరదేమో గానీ, టీవీ సీరియల్‌కు బాగ పనికివచ్చే రచన యిది. ఇన్ని మలుపులు, ఇన్ని రకాల పాత్రలు, మామూలుగ మనకు నవలల్లో కనపడవు! ఇంగ్లీషు, నవలలు చదవడం అలవాటున్న వాండ్లందరు, ఈ పుస్తకం సంపాయించి చదవాలని నాకనిపించింది. ఇది గొప్ప నవల కాదు. గొప్ప నవల అంటే ఎట్లుంటుందో నాకు తెలియడము లేదు. ఆ చర్చలోకి పోయే సంకల్పము ప్రస్తుతము లేదు. కానీ, లాసరా రచనలు అందరూ చదవదగినవి. ఈ మాట నేననడం లేదు.

డా.గాబ్రియేలా అయిషింజర్‌ ఫెరొ-లుజీ అనే భాషావేత్త, ద్రావిడ భాషల గురించి పరిశోధించినరు. ఆమె ఈ రచయితను ఆకాశానికెత్తింది. ఆమె చెప్పిన ఒక సంగతి మాత్రం నాకు ముఖంలో గుద్దినట్లుగ తగిలింది. లాసరా ప్రతీకలను అర్థం చేసుకోవాలంటే బ్రాహ్మల బ్రతుకు తీరు, వారి సంప్రదాయాలు తెలిసి ఉండాలంటుంది ఆమె. శ్రీపాద గురించి, మల్లాది రామకృష్ణ శాస్త్రి గురించి ఈ మాట ఎవరయినా అని ఉండవచ్చు. అనకున్నా, ఇప్పుడు నేనంటున్న. ఈ మహా రచయితల ఎక్స్‌ప్రెషన్‌ సిసలయిన బాపనితనం నిండినదే.

ఒక రచయిత నాలుగయిదు రచనలు చదివితే, రచయితను గుర్తించగలగడం నిజంగా ఒక ఫీటు. లాసరా విషయంలో ఇది నిజమంటారు మరో తమిళ విమర్శకులు. లాసరా కాస్త కఠినమయిన రచయిత. ఆయన చెప్పినదంత అర్థమయిందని నేను అనలేను అంటారు గాబ్రియేలా! ఆయన వాక్యాలు సింపుల్‌కన్న సింపుల్‌. భాష తప్పకుండా సింపుల్‌. ఎక్కడ ప్రయత్నించినా కాంప్లెక్సిటీ కనిపించదు. కానీ, ఆ పాత్రలు, అవి చేసే పనులు, అనే మాటలు మనలను ఆలోచనల్లో ముంచుతయి. ధర్మరాజన్‌ ఒకనాడు దారి పక్కన కూచుని, ముందు ఉత్తరీయం పరిచి, పిల్లంగ్రోవి మీద సంగీతం వాయించడం మొదలుపెడతడు. ఆయనకు ఆ పని చేయవలసిన అవసరం ఏమి? అర్థంకాదు. కానీ, దాంతోనే ‘ప్రాయశ్చిత్తం’ మొదల వుతుంది. ‘చదువరులారా, రండి. కన్నీళ్ల కలయిక, నదులన్నిటి సంగమంకన్న గొప్పది. అక్కడ ఇక మన అవసరం లేదు. మనం వాళ్లని వదిలేద్దము! సరేనా!’ అంటూ ముగుస్తుంది రెండవ నవల, తరువాత కమలాంబ నవ్వుతుంది!!

అనువాదం: అనువాదం విషయంలో ఎందరో పెద్దలు సిద్ధాంతాలు చేసినరు. నాకవేవీ పట్టలేదు. నా సిద్ధాంతాలు నేను చేసుకుని కొన్ని అనువాదాలు చేసిన. తిట్లు దీవెనలు, రెండూ తిన్న. నన్ను అర్థం చేసుకోలేని వారున్నరని అర్థమయింది. అనువాదం చేస్తున్నది కాల్పనిక సాహిత్యమయితే, మూల రచయిత, దయ్యమయి మనకు పట్టాలె. వారి శైలి కూడ విషయమంత బలంగ, అనువాదంలో ప్రతిబింబింప వలె. ఇది నా పద్ధతి. కల్‌ సిరిక్కిరదు, తమిళ ప్రతి చదవడానికి ప్రయత్నించిన తరువాత, పద్మా నారాయణన్‌ అనువాదం బాగుందని తోచింది గాని, భాష, భావం కలయిక, అంటే అభివ్యక్తి మూలానికి ఎంత సమీపంగ ఉన్నదీ తెలియలేదు. అనువాదం చదువుతుంటే, అడుగడుగున, మూలభాష గుర్తుకు రావాలని నాకనిపిస్తుంది. రచన అసలయిన ఇంగ్లీషు ఇడియంతో సాగుతుంటే నాకు అసౌకర్యంగ తోస్తుంది. ఈ విషయం గురించి చాల మందితో, చాల చర్చించిన. ఇంకా అది కొనసాగవలసి ఉంది.

ప్రాయశ్చిత్తం: తిరిగి గోమతి యింట్లో, ఆయన తన పెట్టెను పరీక్షించాడు. తాళం బదులు ఒక తీగ చుట్టి ఉంది. తన బట్టలన్నీ ఉన్నాయని గమనించాడు. కాఫీ ఫిల్టరు, స్టీలుగ్లాసు కూడా. పాస్‌బుక్‌, ఎఫ్‌డీ రసీదు, చెక్కుబుక్కు లేవు. పోలీసు వాళ్లు తీసేసుకుని ఉంటారు. ఒక వస్తువు కంటికి కనపడింది. అది గుడ్డలో చుట్టి ఉంది. ఆకారం వల్ల అదేమిటో తెలిసింది - తన పిల్లంగ్రోవి. ఆయన దాన్ని తీశాడు. శుభ్రంగా తుడిచాడు, కళ్లతో తడిమాడు.. ఆయన తన పరిసరాలను మరిచిపోయాడు.

మూడున్నర సంవత్సరాలు... మొదటి స్వరపు తీయని గాలి వెలికివచ్చి గుండెను తడిపింది. ఆయన సర్వస్వాన్ని ముంచెత్తింది. లోపల ఒక పచ్చని చిగురు తలయెత్తింది.

అక్కడ రచయిత రాసిన మాటలు మనసులో కుచ్చుకుంటయి. అదే రచన యొక్క సక్సెస్‌కు గుర్తింపు. అట్లని రచన గొప్పది కానవసరం లేదు.

ఈ జమిలి నవల నిజంగా ఒక మసాలా మిక్స్‌! కానీ మసాలా నవల్లో ఇలాంటి మాటలుంటయా? ఏమో?


Friday, August 14, 2026

అర్థం తెలుసా? దేశభక్తి, వందేమాతరం మరిన్ని విషయాల గురించి... On patrotism, and such matters


 

విషయానికి రాగలగడం చాలా గొప్ప విషయం — మెక్‌ లియోడ్‌ జి ప్రెస్టన్‌ (ఈయనగారెవరో తెలియదు. కానీ చాలా గొప్ప

మాట అన్నారు.)

అర్థం తెలుసా?

ఒక అనర్ధం జరుగుతుంది. దేశం మొత్తం ఒక్కటి అవుతుంది. ఆ భావన కొంత కాలం నిలుస్తుంది. ముందే ఎన్నికల

కాలం. పులి మీద పుట్ర లాగా పుల్వామా అనర్ధం ముంచుకు వచ్చింది. అది నిజంగా అనర్ధం. యుద్ధాలు, సేనలు అంటే

ఒకరి మీద ఒకరు పడి కొట్టుకు చావడానికే కదా? యుద్ధం అన్న పద్ధతిని మొదలు పెట్టిన వారు ఎవరో తెలియదు.

అంతకన్నా అర్ధంలేని పద్ధతి మరొకటి లేదు. తెలివి గల మనిషి ఆ తెలివిని ఉపయోగించుకుని సమస్యలకు

సమాధానాలు వెతకవచ్చు. అంతేకాని పాశవికంగా, రాక్షసంగా ఎదురుపడి చంపుకుని అందులో బలాబలాలు

తేల్చుకుంటాం అంటే అంతకన్నా అమానుషం మరొకటి లేదు. అయినా చరిత్ర అంటేనే యుద్ధాల వరుస. ప్రస్తుతం

యుద్ధం జరగడం లేదు. కానీ ఇరు దేశాల మధ్యన పొంతన లేదన్న సంగతి కూడా మరవడానికి లేదు.

హ్యాపీమోన్‌ జేకబ్‌ అనే జె ఎన్‌ యు ప్రొఫెసర్‌ ఒకాయన ఈ మధ్యన ఒక పుస్తకాన్ని వెలువరించాడు. దానిపేరు లైన్‌

ఆఫ్‌ కంట్రోల్‌. జేకబ్‌ అసలే మంచి పేరు లేని ఆ విశ్వవిద్యాలయంలో, రాజకీయాలు బోధిస్తూ ఉంటాడు. మౌలికాంశాలను

బోధిస్తూ ఉంటే చిక్కు లేదు. ఈ పెద్దమనిషి భారత - పాకిస్తాన్‌ సంబంధాల మీద నిపుణుడు. ఈ విషయం గురించి రెండు

దేశాలలోనూ చర్చలు సమావేశాలు జరుగుతుంటాయి, అంటే మనలాంటి వాళ్లకు కొంచెం విచిత్రంగానే తోస్తుంది. సైన్యం

దారి సైన్యం చూస్తుంటే, విద్యావంతులు, పరిశోధకులు మరో పక్కన మాటలు, మంతనాలు సాగిస్తున్నారు, అన్నమాట.

తన రంగం గురించి బాగా తెలుసుకోవాలి కనుక ఈ ప్రొఫెసర్‌ గారు భారతదేశంలోని సైనిక అధికారులను చాలామందిని

కలిసి విషయ సేకరణ చేస్తుంటాడు. పదవిలో ఉన్నవారు అంత సులభంగా మాట్లాడారని, రిటైర్‌ అయినవారు

సులభంగానే ఎన్నో విషయాలు చెబుతారని ఈ పరిశోధకుడు తన పుస్తకంలో వెల్లడిస్తాడు. నేను ఆ పుస్తకాన్ని

కొన్నాను. రెండు మూడు పత్రికలలో సమీక్ష చదివిన తరువాత ఆ పుస్తకం చదవాలి అనిపించింది. కనుక కొన్నాను.

చదివాను కూడా!

పరిశోధకుడు దేశంలో సైన్యాధికారులను మెప్పించి, ఒప్పించి లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వెంట కొంతకాలం

గడిపి అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకున్నాడు. ఈలోగా అటువేపు వారిని కూడా రకరకాలుగా బుజ్జగించి,

పాకిస్తాన్‌ వెళ్లడానికి పర్మిషన్‌ తెచ్చుకున్నాడు. అంతేకాదు, సరిహద్దు వెంట అధికారంలో ఉన్న అత్యున్నత స్థాయి

వారితో కలిసి మంతనాలు చేయడానికి కూడా కావలసిన అనుమతులను సంపాదించాడు.

మనదేశంలో లాగే అటు పాకిస్తాన్‌ లో కూడా ప్రజలకు పక్క దేశం ప్రజల మీద నిజంగా ఏవగింపు లాంటివి లేవు.

అయితే రాజకీయంగా అవసరం గనుక, మీడియా వారు అంతకన్నా చేయగలిగింది లేదు గనుక, రకరకాల మార్గాల

ద్వారా అవతలి దేశం మీద అందరికీ గుండెలనిండా అసహ్యం కలిగే పరిస్థితులను, కావాలని తయారు చేస్తున్నారంటే

ఆశ్చర్యం కాదు. ప్రజలకు ప్రజలకు మధ్యన వైరుధ్యం ఉండవలసిన అవసరం లేదు. నేను ఈ రకం మాటలు చెబితే

నన్ను కూడా దేశభక్తి లేనివాడు అని తన్ని తగలేస్తారు. ఇక్కడ దేశభక్తి గురించిన ప్రసక్తి లేనే లేదు. అవతలి దేశంలో

ఉంటున్నవాళ్ళు కూడా మనుషులే. కానీ దేశాన్ని నడిపిస్తున్న వారు మాత్రం బహుశా మనుషులు కారు. ఇది రెండు

వైపులా సత్యమే. వీళ్లకు తగినట్టే మిలిటరీ ఉంటుంది. నిష్కారణంగా లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వెంట ఇరువైపుల నుంచి

కాల్పులు జరుగుతుంటాయని, అమాయకుల ప్రాణాలను బలికొంటారని అర్ధం కానివ్వరు. హ్యాపీమోన్‌ జేకబ్‌ పుస్తకం

మొత్తం చదివితే విషయం అర్థమవుతుంది.

నిజానికి ఈ వ్యాసంలో నేను చెప్పదలచుకున్నది పాకిస్తాన్‌, భారత దేశాల మధ్యన ఉన్న సంబంధాలను గురించి

కానేకాదు. అందుకే విషయానికి రావడం కష్టం, అన్న ఒక మంచి మాటను ముందే ఉటంకించాను. దేశంలో అందరికీ ఈ

మధ్యన కొంచెం మరుపు పాలయిన దేశభక్తి ఒక్కసారిగా ఉప్పొంగింది. పంద్రాగస్టు, ఛబ్బీస్‌ జనవరి వచ్చాయంటే

పాటలు పాడుతూ, వీధుల వెంట ఊరేగింపులు చేసిన చిన్నతనపు అనుభవాలు గుర్తుకువస్తాయి. తలుచుకుంటే ఒళ్లు

గగుర్పొడుస్తుంది. తరువాత జరిగిన చైనా, పాకిస్తాన్‌ యుద్ధాల సందర్భంగా, దేశవ్యాప్తంగా ప్రదర్శితమైన దేశభక్తి,

మరొకసారి కళ్లముందు మెదులుతుంది. అప్పటికి నేను అవగాహన లేని కుర్రవాడిని. అయినా దసరా, దీపావళి లాగే

స్వాతంత్రదినం కూడా ఇవ్వాళటికి నాకు పండుగలాగా కనిపిస్తుంది. దసరా, దీపావళి గురించి తెలియని నేటి

యువతరానికి ఇక దేశభక్తి గురించి ఎవరు చెప్పాలి?

మొత్తానికి అందరికీ ఈ గడ్డు సమయంలో, సైనికుల పట్ల తమకు గల భావాలను వ్యక్తం చేయ వలసిన అవసరం ఉందని

అర్ధమయింది. మా వీధి చివరన కూడలిలో బహుశా ఆటోవాళ్లు, మరికొంత మంది కలిసి ఒక జెండా ఎగురవేసి, అక్కడ

దేశభక్తి పాటలు వినిపించారు. కానీ సందర్భానికి తగినట్లు కాకుండా వాళ్లంతా హాయిగా జోకులు వేసుకుని

నవ్వుకుంటున్నారు. అసలు విషయం చెప్పడానికి వాళ్లకు తగిన నాయకత్వం లేదు. నాలాంటివాడు ఎవడైనా

ముందుకు వెళ్లి చెబుతానంటే, బహుశా వాళ్ళు వినే లక్షణం కనిపించదు. వాళ్లను వదిలి పెట్టవలసిందే. ఒక సాయంత్రం

మా కాలనీలోని ఆడవాళ్లు కొంతమంది చేరి, కొవ్వొత్తులు వెలిగించి, వీధుల వెంట నినాదాలు చేస్తూ తిరిగారు.

( నేను వాడిన ఆడవాళ్లు అన్నమాట నాకే బాగుండ లేదు.) స్త్రీ జనం అనడం కన్నా ఇదే కొంత మేలు అనుకున్నాను. వీళ్ళ భావన చాలా బాగుంది. కానీ వీరిలో కూడా సందర్భానికి అవసరమైన సమాచారదృష్టి మాత్రం లేదు. మరేమీ తోచ లేదు

కనుక అదేపనిగా భారత్‌ మాతాకీ జై అంటూ ఉన్నారు వాళ్ళు. అప్పుడప్పుడు ఎవరో కలుగజేసుకుని వి వాంట్‌ జస్టిస్‌ అని

కూడా నినాదాన్ని ఇస్తున్నారు. వాళ్లకు ఏమి న్యాయం కావాలి అన్నది వాళ్లకే తెలియదు. మృతవీరులకు నివాళులు

అర్పిస్తున్నారు కనుక, వారి గురించి నినాదాలు ఉండాలి. చిత్రంగా మన దగ్గర ఏ నినాదం కావలసి వచ్చినా, అది మరొక

భాషలో ఉండాలి. కార్మికుల ఐక్యత వర్థిల్లాలి అనడానికి మజ్దూర్‌ యూనియన్‌ జిందాబాద్‌ అంటారు. ముర్దాబాద్‌ అనే

మాట మరొక చోట వాడుకుంటారు. లేదంటే ఇంగ్లీషులో నినాదాలు చేస్తారు. మన భాష మీద మనకు పట్టు లేదు.

కనుకనే పెద్దపెద్ద మాటలు సంస్కృతం నుంచి అరువు తెచ్చుకుని వాడుకునే పద్ధతి చాలాకాలంగా కొనసాగుతున్నది.

ఇక నినాదాల విషయానికి వస్తే సంస్కృతంలో నినాదాలు ఇచ్చేవారు ఎవరూ, బహుశా అందుబాటులో లేరు. వీర జవాన్‌

అమర్‌ రహే అంటే సరిపోయేది. ఆ రెండు ముక్కలు కూడా వీరికి దొరకలేదు. భారత్‌ మాతాకి జై అన్నారు. ఎవరు ఈ

బారత్‌ మాత? ఇది నా ఇవాళటి విషయం.

విషయానికి చేరుకునే సరికే నాకు అందుబాటులో ఉన్న ఈ పేజీ అడుగుకు చేరుకున్నాను. అయినా మునిగింది లేదు.

భారతమాత అన్నమాట ఒక భావన మాత్రమే. తెలుగులో కొంతమంది భరతమాత అని కూడా రాస్తారు. సంస్కృతం,

వ్యాకరణం తెలిసినవారికి ఇక్కడ ఒక చిక్కు ఎదురవుతుంది. భరతుని మాత భారతమాత. అంటే శకుంతల. ఆమెను

కాదు మనం ప్రార్థిస్తున్నది. భారతదేశం అనే మాతను ఊహించుకుని పూజించుకుంటున్నాము. మాతృదేశం అన్న

భావన మనలో గట్టిగా ఉంటుంది. దేశమంటే మట్టి కాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌ అన్నారు గురజాడ! మరి

ఇప్పుడు ఎవరు ఈ భారతమాత?

భక్తి కావాలంటే అందుకు ఒక ఆలంబన కావాలి. నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు, అజాయమానుడు అని

ఆయన గురించి ఒక పక్కన చెప్పుకుంటూనే ఆయనకు వేలాది ఆకారాలను ఆపాదించుకుని, అర్చావతారములు

అంటూ పూజలు చేస్తున్నాము. అందులో ఒక దేవుడు సరిపోక లెక్కలేనన్ని దేవుళ్లను తయారు చేసుకున్నాము.

కనుక గజిబిజి పుట్టింది. తెలియజెప్పే వారు లేక కొంతమందికి విషయం అర్థం కావడం లేదు.

అచ్చంగా ఇదే పద్ధతిలో దేశం మీద అభిమానం ఉండాలంటే, ఆ దేశాన్ని ఒక మనిషిగా చూడగలగాలి. దేవుడిని కూడా

మనిషిగా చూసిన మనం, దేశాన్ని, ఒక తల్లిగా చూచి పూజించుకోవడంలో ఆశ్చర్యం లేదు. అభ్యంతరం అంతకన్నా

ఉండకూడదు.

ఇంకొక తికమక గురించి ఇక్కడే చెప్పుకుంటే పోతుంది. వందేమాతరం అంటూ బంకించంద్రుడు తన నవలలో

వాడుకున్న ఒక పాటను జాతీయగీతం, నేషనల్‌ సాంగ్ గా వాడుకుంటున్నాము. ఏవో కొన్ని విశేషణాలు ఉన్న మొదటి

భాగాన్ని మాత్రమే అవసరం వచ్చినప్పుడు పాడుకుంటున్నాము. సప్త కోటి కంఠ కలకల నినాద అంటూ తరువాత సాగే

చరణాలు ఉన్నాయి, అని కూడా చాలా మందికి తెలియదు. ఇక అసలైన జాతీయగీతానికి వస్తే జనగణమన అధినాయక

అంటూ ఒక పురుషుడిని ప్రార్థిస్తున్నాము. రవీంద్రుని దృష్టిలో ఈ పురుషుడు జార్జి చక్రవర్తి అని నేను ఇవాళ అంటే

అందరూ నన్ను తన్ని తగలేస్తారు. ఎవరు ఈ అధినాయకుడు? భారత మాత అనే భావన ఒక పక్కన ఉండగా ఎందుకు

ఒక పురుషుడిని ప్రార్థించడం? ఆ పురుషుడు ఒక దేవుడు అనుకుందామా? అప్పుడు అంతకన్నా పెద్ద చిక్కు

మొదలవుతుంది? ఆ దేవుడు ఏ మతానికి సంబంధించిన వాడు? రవీంద్రుడు ఏ మతానికీ చెందని ఒక దేవుని గురించి

పాడుకున్నాడు. ఆంత భావనాబలం మనకు ఉన్నదా చెప్పండి! ఈ విషయం గురించి ఇక్కడ నేను ఇంతకన్నా ఎక్కువ

ప్రస్తావించ దలుచుకోలేదు.

అందరూ నాకంటే ఎక్కువ తెలిసిన వారే! ఆలోచించండి! ఆలోచన లేని వారికి కనీసం మీరైనా చెప్పండి! తికమకలో

పడి తెలియకుండా ముందుకు సాగేకన్నా, ఉన్నచోట నిలబడి ఆలోచించడం మేలు కదా!

Saturday, August 8, 2026

మంచు కురిసింది - ఐజక్ బషేవిష్ సింగర్


మంచు కురిసింది

 

ఐజక్ బషేవిష్ సింగర్

 

            ఛెల్మ్ అన్నది వెర్రివాళ్ల ఊరు. అక్కడ పెద్దా చిన్నా అంతా గొప్పవాళ్లే. ఒక రాత్రి అక్కడ ఎవరికో నీళ్ల తొట్టిలో చంద్ర బింబం కనిపించింది. చంద్రుడు ఆ తొట్టిలో పడిపోయాడని చూచినవాళ్లు అనుకున్నారు. తొట్టిమీద గట్టిమూత పెట్టి, మరు రోజు సంగతి చూడాలి అనుకున్నారు. పొద్దున్న మూత తీసి చూస్తే, చంద్రుడు లేడు! ఎవరో దొంగిలించి ఉంటారని తేల్చుకున్నారు. పోలీసులను పిలిచారు. కానీ దొంగ దొరకలేదు. ఛెల్మ్‌వాళ్లంతా చాలా బాధపడ్డారు.

         ఒకసారి, పండగరోజుల్లో సాయంత్రం మంచు కురిసింది. ఊరు ఊరంతా వెండిగుడ్డ కప్పినట్టు అయ్యింది. చంద్రుడు వచ్చాడు. నక్షత్రాలు మిలమిలమన్నాయి. కురిసిన మంచు ముత్యాలు, రత్నాలలాగ మెరిసిపోయింది.

         ఛెల్మ్‌లో అక్కడి పెద్దమనుషుల సంఘం అందరికన్నా తెలివి గలవాళ్లు. వాళ్లు ఊళ్లో అందరికన్నా ఎక్కువ వయసు గలవారు. వాళ్లదే అక్కడ అధికారం. పెద్దలకంతా పెద్ద గడ్డాలు ఉంటాయి. మరీ ఆలోచిస్తారు గనుక నుదుళ్లు కూడా వెడల్పుగా ఉంటాయి.  ఆ సాయంత్రం ఏడుగురు పెద్దలు ఒకచోట చేరి ముఖం మీద ముడతలు పడేటట్లు ఆలోచన మొదలు పెట్టారు. ఛెల్మ్‌కు నిధులు కావాలి. ఎట్లా సంపాయించాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా గ్రోనామ్ ఆక్స్ గట్టిగా అరిచాడు. అందరూ ఆశ్చర్యపడేట్లు అతను ‘మంచు అంతా వెండి!’ అంటూ అరిచాడు.

         'నాకు మంచులో ముత్యాలు కనపడుతున్నాయి!’ అన్నాడు ఇంకొకాయన.

         'నాకు ఏకంగా రత్నాలే కనపడుతున్నాయి!’ మూడవ పెద్దాయన అరిచాడు.

         మొత్తానికి ఛెల్మ్ పెద్దలకు తమ ఊళ్లో నిధి వర్షంగా కురిసిందని తెలిసిపోయింది. అంతలోనే వాళ్లకు చింత కూడా మొదలయింది. ఛెల్మ్‌లో అందరూ రాత్రిపూట తిరుగుతూ ఉంటారు. నిధిని వాళ్లు కాళ్లతో కసపిసా తొక్కుతారు. మరి ఏం చెయ్యాలి? ఒక పెద్దమనిషికి ఆలోచన రానే వచ్చింది.

         'అన్ని ఇళ్లకు వార్త పంపిద్దాము. ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలని చెబుతాము. వెండి, ముత్యాలు, రత్నాలను ఏరిన తరువాతే రావాలని ప్రకటిస్తే సరి’.

         పెద్దలకంతా మాట బాగా నచ్చింది. అందుకే అరచేతులు రుద్దేసి ఆ సంగతి తెలియజేశారు. అప్పుడు మత్తు లెకిష్  మరో మాట అన్నాడు. ‘వార్త అందించే మనిషి మరి నిధిని తొక్కుతాడు కదా' అన్నాడు.

         లెకిష్ మాట సత్యమని పెద్దలకు అర్థమయింది. మళ్లీ నుదుట ముడతలు పడేట్టు ఆలోచనలు మొదలయ్యాయి. 

         'తోచింది!’ అన్నాడు గ్రోనామ్ ఎద్దు. ‘చెప్పు మరి’ అడిగారు అందరు.

         'వార్త మనిషి నడుస్తూ వెళ్లకూడదు. అతగాడిని ఒక బల్లమీద పెట్టి పంపితే, అతను మంచును తొక్కడు!’

         గ్రోనామ్ చాలా తెలివిగలవాడు. ఆ తెలివికి సంతోషించి పెద్దలందరూ ఈసారి చప్పట్లు చరిచారు.

         వెంటనే గింపెల్ కోసం వంటశాలకు పంపించారు. కుర్రవాడు వచ్చాడు. వాడిని ఒక బల్లమీద ఎక్కించారు. మరి ఆ బల్ల ఎట్లా కదులుతుంది? వంటశాలలో వంటాయన ట్రైటెల్, దుంపచెక్కులు తీసే బెరెల్, సలాడ్ కలిపే యూకేల్, యోంటెల్ అక్కడే ఉన్నారు. వాళ్లంతా మేకలకు మేత వేస్తున్నారు. ఆ నలుగురూ కలిసి గింపెల్ ఎక్కిన బల్లను ఎత్తుకుపోవాలని నిర్ణయించారు. వాళ్లు బల్లకాళ్లు తలొకరూ పట్టుకున్నారు. గింపెల్ చేతిలో కర్రసుత్తి పట్టుకుని నిలబడ్డాడు. దానితో అతను ఇళ్ల కిటికీల మీద కొడతాడు. ఇక అందరూ బయలుదేరారు.

         ప్రతి ఇంటి కిటికీ మీద సుత్తెతో కొట్టి గింపెల్  ‘ఈ రాత్రి ఎవరూ ఇంట్లోనుంచి బయటకు రాకూడదు. బయట నిధి కురిసింది. దాన్ని తొక్కకూడదు’ అని చెప్పసాగాడు.

         ఛెల్మ్‌లో వాళ్లకు పెద్దలమీద గౌరవం ఎక్కువ. అందుకే ఎవరూ ఇళ్లలో నుంచి బయటికి రాలేదు. ఇక అక్కడ పెద్దలు మాత్రం నిధిని సేకరించడం గురించి, దాన్ని వాడడం గురించి ఆలోచనలో ఉన్నారు. నిధిని అమ్మి, బంగారు గుడ్లు పెట్టే బాతును కొంటే బాగుంటుందని ఒక పెద్దాయన చెప్పాడు. ఇక ఒకరోజు కాదు, నిత్యమూ నిధి దొరుకుతుంది.

         మత్తు లెకిష్‌కు మరో ఆలోచన వచ్చింది. ఛెల్మ్‌లో వాళ్లకంతా కళ్లజోళ్లు కొని ఇవ్వాలి. ఇక ఇళ్లు, వీధులు, దుకాణాలు అన్నీ పెద్దవిగా కనిపిస్తాయి! ఛెల్మ్ మొత్తం పెద్దదిగా కనిపిస్తే మరి పెద్దదే అవుతుంది. అది పల్లె పోయి పట్నం అవుతుంది.

         ఇంకా మంచి మంచి ఆలోచనలు వచ్చాయి. అవి కొనసాగుతుండగానే ఉదయం కూడా వచ్చింది. సూర్యుడు వచ్చాడు. పెద్దలంతా కిటికీలోనుంచి బయటకు చూచారు. ఆశ్చర్యం. కురిసిన మంచును ఎవరో కసకసా తొక్కనే తొక్కారు.  ఎవరని చూస్తే, బల్ల మోసిన నలుగురి కాళ్లు అని తెలిసింది.

         ఛెల్మ్ పెద్దలు తమ తెల్లగడ్డాలు పట్టుకుని పీక్కుంటూ, తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఆ నలుగురినీ నడిపించకుండా వాళ్లను ఎత్తుకుని పొమ్మని మరో నలుగురికి చెబితే బాగుండునేమో అనుకున్నారు!

         మళ్లీ పండుగకు మళ్లీ నిధి కురిస్తే అప్పుడయినా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటినుంచే నిశ్చయించుకున్నారు.

         ఛెల్మ్‌లో వాళ్లకు నిధి మిగలలేదు. కానీ, మళ్లీ సంవత్సరం అది కురుస్తుందని ఆశ మాత్రం మిగిలింది. పెద్దలు చెప్పిన మాట ఎప్పుడూ తప్పు పోదుకదా!