Showing posts with label wisdom. Show all posts
Showing posts with label wisdom. Show all posts

Monday, August 3, 2026

తిండి పిండి ఎన్నో సంగతులు 2 On Food and Starch


తిండి - పిండి

అందరమూ మూడు పూటల బుద్ధిగా కూర్చుని తింటాము.  మరి ఆ తిండి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. అదేమన్నమాట? కష్టపడి సంపాదించుకుంటున్నాము. తింటున్నాము అనుకోవచ్చు. ఆలోచన మరింత ముందుకు పోతే తినడానికి పంటలు, జంతువులు ఉన్నాయి కదా అనుకోవచ్చు! పంటలు, జంతువులు ఎక్కడినుంచి వస్తున్నాయి? ఎందుకు అంతగా దొరుకుతున్నాయి? ఎట్లా ఆ విధంగా అవి పెరుగుతున్నాయి? అన్నవి ఆ తరువాత రావాల్సిన ప్రశ్నలు!

ఈ భూమిమీదికి మనకన్నా ముందు మొక్కలు వచ్చాయి. అవి పెరిగి చెట్లు అయ్యాయి. ఒక చెట్టును గమనిస్తే దాని నిండా రక రకాల ఆకులు ఉంటాయి. అరటి చెట్టు ఆకులు వెడల్పుగా ఉంటాయి. చింత చెట్టు ఆకులు చిన్నవైనా చాలా ఎక్కువగా ఉంటాయి. మొత్తం కలిసి ఒక పెద్ద విస్తీర్ణాన్ని అవి ఏర్పాటు చేసుకుంటాయి. ఈ ఆకులు మనకు తిండి పెట్టే కర్మాగారాలు అన్న సంగతి చాలామందికి అర్థం అయి ఉండదు. అందుకే మనం సైన్స్‌ గురించి తెలుసుకోవాలి. తినే తిండి గురించి తెలియని వాళ్లకు ఇంకా మిగతా విషయాలు ఏం తెలిసినట్టు లెక్క?

ఆకులలో ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా పిండి పదార్థం తయారవుతుంది. ఇది అటువంటి ఇటువంటి అద్భుతం కాదు! అద్భుతాల కే అద్భుతం! ఆ పిండి కారణంగానే మొక్కలు, పొదలు, చెట్లు, మహా వ ృక్షాలు అన్ని అంతలేసి గా పెరుగుతాయి. ఆ మొక్కలను తిని కొన్ని రకాల జంతువులు పెరుగుతాయి. ఆ జంతువులను మరి కొన్ని జంతువులు తింటాయి. కొన్ని జంతువులు మొక్కలను, జంతువులను అన్నింటినీ తింటాయి. ఇక మనిషి అనే మన జాతి మాత్రం దొరికిన ప్రతి చెత్తా తినే రకం. చాలా రకాల జంతువులు కూడా తినని కొన్ని పదార్థాలను మనం తింటాము. ఈ మాట అంటున్నప్పుడు అసలు సిసలైన సర్వ మానవ సౌభ్రాత ృత్వం కనబడుతున్నది. మనుషులలో కూడా కొంతమంది శాకాహారులు ఉంటారు. శాకము అంటే కూర. ఈ సంగతి వ్యాసం టైప్‌ చేస్తున్న కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ కూడా తెలిసినట్టు లేదు. అది నన్ను కష్టపెట్టి ఏవేవో మాటలు చూపిస్తున్నది. వాళ్ళు కూర సంగతి మరిచిపోయి, కొమ్మలు తింటున్నాము అనుకుని శాఖాహారము అని రాసుకుంటారు. అది తప్పు.

 

మొత్తానికి ప్రపంచంలోని మొక్కల నుండి మహావ ృక్షాలు వరకు, చీమల నుండి మహా మ ృగాల వరకు అన్నింటికీ తిండి పెట్టేది ఆకులు అన్న సంగతి మనం మొట్టమొదట గుర్తించాలి. ప్రాణదాతలు గా గుర్తించి అన్ని రకాల చెట్లకు వినయ విధేయతలను ప్రదర్శించాలి.

ఆకులలో పచ్చని రంగు ఉండడం మరొక అద్భుతం. ఆ పచ్చని రంగును ఆకుపచ్చ రంగు అనే వరకు అది వ్యాపించింది. ఆ రంగు కారణంగానే మనకు పిండి పదార్థం, అంటి తిండి పదార్థం దొరుకుతున్నది అన్నది మరొక అద్భుతం. ఇది కూడా మామూలు అద్భుతం కాదు. మొత్తం జీవ ప్రపంచానికి ఆధారం గా నిలిచిన అద్భుతం. ఆకుపచ్చ రంగుకు కారణం క్లోరోఫిల్‌ అనే పదార్థం. మొదట ఆకులు సూర్యుని వెలుతురును గ్రహిస్తాయి. ఈ విషయాన్ని మనం పట్టించుకున్నట్లు కనిపించలేదు. నీడలో వేసిన మొక్కలు చక్కగా పెరగవు. గోడ పక్కన వేసిన మొక్కలు ఎండ ఎటువైపు ఉంటే అటు పెరుగుతాయి. గోడ వైపు కొమ్మలు కూడా ఎండ వైపు తిరుగుతాయి. ఈ సంగతి ఇంతకుముందు గమనించకుంటే ఇక మీద అయినా గమనించి చూడండి. ఈ ప్రపంచమంతా, కనీసం ఆకు పచ్చని చెట్ల ప్రపంచమంతా సూర్యుని వైపు చూచి పెరుగుతున్నట్టు అర్థమవుతుంది. ఎండ మరీ వేడిగా ఉంటుంది. అది నేలను చేరే వరకు కొంత చల్లబడుతుంది. అట్లా చల్లబడిన ఎండ ఆకులకు ఉపకరిస్తుంది. అక్కడ జరిగే కార్యక్రమం వివరాలు ఈరోజు వరకు కూడా పూర్తిగా అర్థం కాలేదు.

1866లో ఆస్ట్రియా దేశంలో ఒక పరిశోధకుడు మొక్కలకు వేడికి గల సంబంధాన్ని మొట్టమొదటిసారి గుర్తించాడు. ఎండా, వేడి ఉంటే కానీ, మొక్కలు పెరగవు అని చెప్పాడు. సముద్రంలో పరచుకొని ఉన్నడెస్మిడ్స్‌, డయటమ్స్‌ వంటి  కొన్ని రకాల చిన్న మొక్కలు మొదలు, మహావ ృక్షాలు దాకా ఈ ఆకు పచ్చని ఆకులు, వెలుగు సహాయంతో పనిచేసే రసాయన కర్మాగారాలు, అంటే కొత్త పదార్థం తయారయ్యే చోట్లు, అని అతను తేల్చి చెప్పాడు. అందరికీ అది వింతగా వినిపించింది. ముందు ఎవరికీ నమ్మకం కలగలేదు.

ఇంటి మీద ఫోటో వోల్టాయిక్‌ సెల్స్‌ పెట్టి సోలార్‌ ఎనర్జీని  గ్రహించి కరెంట్‌ గా వాడుకోవడం కొంతమంది చూసి ఉంటారు. ఇందుకు అసలుసిసలైన నమూనా ఆకులు. వాటిలో కరెంటు పుట్టదు. పిండి పదార్థం పుడుతుంది. ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు కూడా ఆశ్చర్య పడని వారికి ఈ ప్రపంచంలో మరే విషయము ఆశ్చర్యకరంగా కనిపించదు. వారి బతుకులు చాలా పొడిపొడిగా నడుస్తాయి. సైన్స్‌ రుచి తెలియని చీకటి బతుకులను గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే! చీకట్లో కూడా కనిపిస్తున్న భావంతో మనకు తిండి గురించి తెలుసు అనుకుని తింటున్నాము. కానీ పత్రహరితం అనే క్లోరోఫిల్‌ గురించి తెలుసుకుని, ఆకులలో జరుగుతున్న అద్భుతాన్ని అర్థం చేసుకుని అప్పుడు తిన్నది అన్నం అయినా, లేక మరొకటి అయినా అందులో కొత్త రుచి కనబడుతుంది. దాని పేరే సైన్స్‌ రుచి!

వృక్ష శాస్త్రం అని ఒక ప్రత్యేక విజ్ఞాన శాఖ ఉంది. అది నిన్నమొన్న పుట్టలేదు. కలకాలం గా ఉంది. కానీ అందులోని వారికి చాలా రోజుల వరకు మొక్కలు పెరగడానికి వెలుగు అవసరం, అన్న విషయం అర్థం కాలేదు. ఇంతకన్నా విచిత్రమైన విషయం ఇంకొకటి ఉండదు. సైన్స్‌ తీరు అలాగే ఉంటుంది. ఒక విషయాన్ని ముందుగా ఊహించి, ఆ తరువాత అందుకు సంబంధించిన వివరాలను సేకరించి, ఆ వివరాలలోని సంబంధాలను, వాటికి గల పూర్వాపరాలను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ విషయం అర్థమవుతుంది. ఆహా! అనిపిస్తుంది. ఒక కొత్త సూత్రం పుడుతుంది. ఒక కొత్త అవగాహన కలుగుతుంది. అది సైన్స్‌ రుచి!


 

Monday, July 20, 2026

పువ్వులకు రంగులు ఎందుకు?


వువ్వులకు రంగులు ఎందుకు?

ఒక్క గులాబీలే లెక్కలేనన్ని రంగుల్లో ఉండడం చాలామందికి తెలియకపోవచ్చు. నల్లని గులాబీలు కూడా ఉన్నాయి. నెదర్లాండ్స్‌ వంటి యూరప్‌ దేశాలలో పనిగట్టుకుని ట్యూలిప్‌ పువ్వులను రకరకాల రంగులలో పోటీపడి తయారు చేస్తుంటారు. కొత్త రంగులు తయారు చేయడానికి సంకరకరణం అనే పద్ధతిని వాడుకుంటారు.

ఈ ప్రపంచంలో ఎన్ని రకాల, ఎన్ని రంగుల పువ్వులు ఉన్నాయన్నది ఊహకందని ప్రశ్న. ఆ రంగుల అవసరం మాత్రం ఒకే ఒక్కటి. అది పునరుత్పత్తి. ఈ ప్రపంచంలోని జీవులన్నింటికీ తమ జాతి కొనసాగవలెనన్నది ఏకైక కార్యక్రమం. మొక్కలకు కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది. మొక్కలు కదలజాలవు. తమ పువ్వులలోని పరాగం మరొక పువ్వులోకి చేరాలి. అప్పుడే పళ్లు వస్తాయి. విత్తనాలు మరిన్ని పద్ధతులతో విస్తరిస్తాయి. మొత్తానికి కొత్తమొక్కలు పుడతాయి. తాము కదిలి వెళ్లడానికి వీలులేని మొక్కలు తమ పరాగం మరొకచోటికి చేరాలంటే కీటకాలు, పక్షుల మీద ఆధారపడాలి. కనుకనే వాటిని ఆకర్షించడానికి పువ్వులకు అన్ని రకాల రంగులు ఉంటాయి.

పువ్వులు ఎరుపు, పసుపు రంగుల్లో ఎక్కువగా ఉండడం సులభంగానే గమనించవచ్చు. నీలం రంగులు పువ్వులు మాత్రం చాలా అరుదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. పువ్వులలో నీలంరంగు రావాలంటే వాటికి అందే రసాయనాలు ప్రత్యేకంగా ఉండవలసిన అవసరం వస్తుంది. గులాబీలలో కూడా ఇప్పటివరకు నీలం రకం రాలేదనే చెప్పాలి. పువ్వులకు నీలంరంగు రావాలంటే రకరకాల పరిస్థితులు ఏర్పడాలి. అవన్నీ కలిసి పనిచేయాలి. వాటిలోని ఆమ్లత, క్షారత అనే లక్షణాలు సరిగా ఉంటే గానీ నీలం పువ్వులు రావు. రంగులకు అవసరం అయ్యే పిగ్మెంట్స్‌ అనే రసాయనాలు కొన్ని ప్రత్యేకమయిన లోహాలను కలిగి ఉండాలి.

హైడ్రాంజియాస్‌ అనే మొక్కలు పెరుగుతున్న నేలలో తగిన మోతాదులో అల్యూమినం ఉంటేగానీ నీలం పువ్వులు పెరగవు. పువ్వులలో నీలం రకాలు ఎక్కువగా లేకపోవడానికి పరిణామపరమయిన కారణాలు కూడా ఉన్నాయంటారు పరిశోధకులు. పక్షులు సులభంగా ఎర్రని పువ్వుల మీదకు వెళ్లిపోతాయి. కొన్నిరకాల కీటకాలు లేతరంగులను చూడ గలుగుతాయి. తేనెటీగ జాతులకు ఎరుపురంగు కనిపించదు. అవి తెలుపు, పసుపు రంగులున్న పువ్వుల మీదకు ఎక్కువగా వెళతాయి. చెట్ల ఆకులు నీలంగా ఉంటాయన్నది తెలుసు. ఆ ఆకుల మధ్యన తెలుపు, పసుపు లేదా ఎరుపు రంగుల పువ్వులుంటే అవి బాగా కనపడతాయి. ఆకుపచ్చని ఆకుల మధ్యన నీలం పువ్వులు కనిపించకపోవచ్చు. కనుకనే పువ్వులు సులభంగా కనిపించే రంగులలో ఎక్కువగా ఉంటాయి.

జంతువులయినా, మొక్కలయినా మనుగడ కొరకు తమ శరీరాలలో, బతుకుతీరులో రకరకాల పద్ధతులను ఏర్పాటు చేసుకుంటాయి. మొక్కలకు పువ్వులు ఉండడం, కొత్తతరం పుట్టడానికి జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రమే. వాటి రంగులు కూడా ఆ కార్యక్రమం కోసమే. చివరికి పండ్లు కూడా పునరుత్పత్తి కొరకే. మనం రకరకాల పువ్వులను, రకరకాల జీవులను చూచి ఆనందిస్తాము. మొక్కలను, జంతువులను ఆహారంగా వాడుకుంటాము. అంటే వాటి పునరుత్పత్తికి స్వార్ధంకొద్దీ మనం అన్యాయం చేస్తున్నామని అర్థం.

 

 

మరిన్ని విశేషాలు

హార్స్‌ చెస్ట్‌నట్‌ అనే పువ్వులలో  పుప్పొడి అవసరం ఇక లేదనుకుంటే పువ్వుల మీద మరకలు మొదలవుతాయి. అంటే ఇక పురుగులను, పక్షులను ఆకర్షించవలసిన అవసరం లేదన్నమాట. అవసరం ఉన్నంతకాలం మంచి రంగును కనబరిచిన పూలు ఆ అవసరం తీరిన తరువాత మారిపోవడం కూడా కొన్ని రకాలలో కనిపిస్తుంది.

 

మరిన్ని విశేషాలు

పెద్ద మొక్కలు పరాగవ్యాప్తి కొరకు పురుగులు, వక్షుల మీద ఆధారపడతాయి. అయితే కొన్ని మొక్కలకు ఈ అవసరం లేదు. గడ్డిజాతి మొక్కలకు వరపరాగ నంపర్కం గాలి ఆధారంగానే జరుగుతుంది. అందుకే ఆ రకం మొక్కలలో వువ్వులు

ఉన్నప్పటికీ వాటికి ఆకర్షణీయమయిన రంగులు ఉండవు. నేలబారున పెరుగుతున్న చిన్న మొక్కల పూలన్నీ తెలుపుగానే ఉంటాయి. కొంచెం ఎదిగిన మొక్కలన్నింటి పూలు రకరకాల రంగుల్లో ఉంటాయి.


 

Monday, June 29, 2026

పెరుగు - సైన్స్ : Science in curds.


పెరుగు - సైన్స్


పెరుగు - సైన్స్‌

ఈ మధ్యన నాలుగైదు రోజులుగా పెరుగు సరిగా తోడు కోవడం లేదు. అవును మరి! నాలుగైదు రోజులుగా వాతావరణం మళ్ళీ కొంచెం చల్లబడింది. చలికాలం అంటూ లేకుండానే ఎండకాలం మారుతున్న తరుణంలో మళ్ళీ కొంచెం చలి మొదలయింది. చలి దుస్తులు తెచ్చుకున్న వాళ్లకు సంతోషం కలిగింది. వాటిని ప్రదర్శించడానికి అవకాశం దొరికింది.

ఉన్నట్టుండి మళ్లీ చలి మొదలు కావడం వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. వాటిని పట్టించుకుంటే వాతావరణ శాస్త్రం అని చెబుతారు. సముద్రంలో మార్పులు, అక్కడి నుండి వచ్చే గాలిలో మార్పులు, ఆ గాలికి కొండలు అడ్డు రావడం, ఈలోగా మబ్బులు తయారుకావడం, మొత్తానికి వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గడం, ఇవన్నీ కలిస్తే వాతావరణ శాస్త్రం అవుతాయి. తత్వం చెప్పినట్టు ఇక పరబ్రహ్మమును గూర్చి తెలుసుకొందము గాక అని మొదలు పెడితే, చాలామంది చెవులు మూసుకుంటారు. వాతావరణ శాస్త్రం చెబుతాను అని మొదలు పెడితే ఎవరు వినరు. ఎవరూ చదవరు.

ఎక్కడ మొదలు పెట్టాము? పెరుగు దగ్గర మొదలు పెట్టాము! మొదటి మాటల్లోనే వాతావరణ శాస్త్రంలోకి వెళ్ళిపోయాము. అందులో బోలెడంత భౌతిక శాస్త్రం, మరింత రసాయన శాస్త్రం కలగలిసి ఉంటాయని చెబితే, ఆశ్చర్య పడని వాళ్ళు, ఇంకేం చెప్పినా ఆశ్చర్యపడరు. మళ్లీ పెరుగు దగ్గరికి వెళ్లి పోతాము. పాలలో, కొంచెం పెరుగు లేదా మజ్జిగ వేస్తే మరునాటికి అది పెరుగుగా మారుతుంది. ఏం పెరిగిందని, పాలు, పెరుగుగా మారినవి? జవాబు వినడానికి కొంతమందికి ధైర్యం అవసరం. పెరుగు లేదా మజ్జిగలో లాక్టోబాసిల్లస్‌ అనే సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి కారణంగానే పెరుగు పెరుగు అవుతుంది. కొంచెం పెరుగును పాలలో వేస్తే, అక్కడ సూక్ష్మజీవులు పెరుగుతాయి. సంఖ్యలో విపరీతంగా పెరుగుతాయి. కనుక దాని పేరు పెరుగు అవుతుంది. పప్పు తినేవాళ్ళకు తాము సూక్ష్మజీవులను మహా ఇష్టంగా తింటున్నాము అని తెలిస్తే బహుశా కడుపులో తిప్పవచ్చు. అందుకని పాలు పెరుగు లేని, వేగన్ తిండి అని ఒకటి వచ్చింది. దీని గురించి ప్రస్తుతం మనకు అవసరం లేదు. మొత్తానికి పెరుగు తయారీలో జీవశాస్త్రం, అందులో సూక్ష్మజీవశాస్త్రం ప్రత్యక్షంగా మన ముందు పని చేస్తున్నదని అర్థం చేసుకోవాలి. అందుబాటులో సూక్ష్మదర్శిని అనే మైక్రోస్కోప్‌ ఉన్నవాళ్లు ఒక పెరుగు చుక్కను స్లైడ్‌ మీద వేసి దాని కింద పెట్టి చూడాలి. లుకలుకలాడుతూ కావలసినన్ని సూక్ష్మజీవులు కనిపిస్తాయి. పప్పు తినే వాళ్ళు ఇక ఆ తరువాత పెరుగు తినడానికి అనుమానం రావచ్చు. ఇది కూడా ప్రస్తుతం మన చర్చనీయాంశం కాదు.

పెరుగులో, కనీసం పెరుగు తయారీలో, కావలసినంత రసాయన శాస్త్రం, మరింత భౌతిక శాస్త్రం కూడా ఉన్నాయి. పాలలో ఉండే ప్రోటీనులు, వాటిని కలిపి ఉంచే నీళ్లు, మిగతా అంశాలు ఒక రకంగా ఉంటాయి. సూక్ష్మజీవులు వచ్చి పెరుగుతున్నప్పుడు అక్కడి వాతావరణంలో తేడాలు వస్తాయి. ఆమ్లాలు పుడతాయి. కనుక పాలలోని తీపి పోయి, పెరుగులోని పులుపు మొదలవుతుంది.

ఇక భౌతిక శాస్త్రం సంగతి! సూక్ష్మజీవులు పెరగడానికి, ఒక రకమైన ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. ఉంటేనే అవి నిజంగా పెరుగుతాయి. అప్పుడు పాలు పెరుగుగా మారతాయి. చలికాలం వస్తే, అవసరమైన వేడిమి ఉండదు. కనుక పాలు తోడుకోవు. ఉత్తర భారతదేశంలో తోడు పెట్టిన పాల గిన్నెకు, స్వెటర్లు, దుప్పటి ముక్కలు చుట్టి ఇంటి బయట పెట్టడం చాలామందికి అలవాటు. కొంచెం వెచ్చదనం కలిగి పెరుగు తొందరగా తయారవుతుందని వారి ప్రయత్నం. మన దగ్గర ఉండే ఈ కొంచెం చలికి మాత్రమే, పాలు తోడుకోవడం కష్టం అయితే, ఉత్తర భారతదేశంలోని వణికించే చలిలో, సూక్ష్మజీవులు పెరగడం, పాలు పెరుగుగా మారడం, ఇంచుమించు అసాధ్యం అవుతుంది. అలవాటుగా తరతరాలుగా, లేదంటే యుగాలుగా జరుగుతున్న ఈ పెరుగు కార్యక్రమంలో పెరుగుతున్నవి సూక్ష్మజీవులు అని తెలిస్తే, అద్భుతం అనిపించడం లేదా? అది సైన్స్‌ లోని ఆనందం! అడుగడుగున, చూడగల ప్రతి అంశంలోనూ, సైన్స్‌ దాగి ఉంటుంది. అది అర్థం అయినప్పుడు సైన్స్‌ రుచి మొదలవుతుంది. అందులో ఒక ఆనందం కలుగుతుంది. మనవాళ్లు పాత కాలంలోనే, విజ్ఞానం కన్నా అది అర్థం అయినప్పుడు కలిగే ఆనందము అసలైన పరబ్రహ్మము అని చెప్పారు. అయితే వాళ్లు చెప్పిన పద్ధతి మరొక రకంగా ఉండి మనకు అర్థం కాలేదు.

సైన్స్‌ రుచి తెలిసిన వాళ్ళు, చిన్న పెద్ద, ప్రతి అంశం వెనుక ఉన్న సైన్స్‌ గురించి వెతుకుతారు. వాళ్లకు అది ఒక అలవాటుగా మారుతుంది. అప్పుడు రుచి మరింత పెరుగుతుంది. ప్రపంచం ఎంతో అద్భుతంగా కనబడుతుంది. ప్రకృతి చేస్తున్న మహిమలు తెలుస్తాయి. బ్రతుకు మరింత ఆశాజనకంగా కనబడుతుంది. బ్రతుకు అర్థం తెలిస్తే, పెరుగు తయారయ్యే పద్ధతి తెలిస్తే గొప్పగా ఉంటుంది అన్న విషయంలో అనుమానం లేనేలేదు!


 

Monday, June 22, 2026

లోకాభిరామం : తరం - ఉత్తరం : యాది సదాశివ సారు


లోకాభిరామం : తరం - ఉత్తరం 
 - ఉత్తరం

రంగువేసిన కవితా?

‘ప్రపంచంలోని కవితలన్నీ కృష్ణశాస్త్రికి వచ్చు, అయినా చూడలేను ఆయన రంగు వేసిన బొచ్చు!’ అవును, ఈ కవిత అచ్చంగా దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి గురించి రాసిందే. అయితే ఆ రాసిన మనిషి సాహితీవేత్త మాత్రం కాదు. నిజానికి తెలుగు చదవనూ, రాయనూ రాని మనిషి. కృష్ణశాస్త్రిగారి తల ముగ్గుబుట్టలాగ పండిపోయింది. ఆయన దానికి రంగు వేసేవారు. అయితే బద్ధకించి మధ్యలో తెలుపు కనిపిస్తున్నా అలాగే వదిలేసేవారు. రామాయణంలో కాకపక్షం అని వర్ణించినట్టు రెండు వేపులా పెరిగిన జుట్టు, నడిమి పాపిట్లో నుంచి మాత్రం కొంతదూరం తెల్లని తెలుపు. అది చూడలేక ఆలిండియా రేడియోలోనే పనిచేస్తున్న వేణు విద్వాంసులు, తరువాత నాకు ప్రాణమిత్రులయిన ఎన్‌ ఎస్‌ శ్రీనివాసన్‌ ఈ కవిత చెప్పారు. ఆగ్డెన్‌ నాష్‌ లిమరిక్కుల ప్రభావంతో, సరదాగా చెప్పిన కవిత అది. కృష్ణశాస్త్రికి మాత్రం తాను ప్రపంచ కవితలను కాపీగొట్టి తెలుగులో రాస్తున్నాడని ఎత్తిపొడిచిన భావం కలిగిందట ఈ కవిత విని. కాటూరి వెంకటేశ్వరరావు గారితో ఆ మాట అన్నారట కూడా. తెలుగే తెలియని కుర్రవాడు సరదాగా మాత్రమే చెప్పాడు, అని సర్ది చెపితే కోపం తగ్గించుకున్నాడట ఆయన.

రూమీ-సదాశివ: నేను ఈ కాలమ్‌లోనే పారసీక కవి, తాత్వికుడు రూమీ గురించి రాశిన. నా మూర్ఖత్వాన్ని బయట పెడుతూ, రూమీకి తెలుగు అనువాదాలు వచ్చినయా అని ఏదో రాసినట్టున్న. మిత్రులు, పెద్దలు స్వర్గీయ సామల సదాశివ, కుమారులు శ్రీవర్ధన్‌, రాజవర్ధన్‌ ఇద్దరు అదే రోజు ఫోన్‌లో ఆదిలాబాద్‌నుంచి నాతో మాట్లాడినరు. సదాశివగారు రూమీ మస్నవీని తెలుగు చేసినరని చెప్పినరు. ఈ సంగతి నాకు సూచనగా తెలుసు. ఎందుకు మరిచిననో తెలియదు. సదాశివ సారు, రూమీ మస్నవీని పద్యాలలోకి రాసినరు. ఆ పద్యాలు ఆణిముత్యాలు. రాజవర్ధన్‌ ఈమధ్యన ఆ పద్యాల పుస్తకం ఫోటో కాపీ చేయించి నాకు పంపించినడు. దానితోబాటు సారు గురించి వేసిన జయంతి ప్రత్యేక సంచిక, సదాశివ స్మృతి అనే పుస్తకాలు కూడ పంపినడు. రాజవర్ధన్‌కు నేను ధన్యవాదాలు చెపితే రుణం తీరదు. వాండ్ల నాయన గారికి నామీద ఉండిన అభిమానం తనకు తెలుసు!

చిత్రం: రాజవర్ధన్‌ తన పరిశోధనలో మధురాంతకం రాజారాంగారి కథల గురించి కృషి చేసినడు. నాయనగారి సలహా మేరకు, రాజారాం గారి వద్దకు స్వయంగ పోయి, చర్చించి, వాళ్లింట్లో ఒకడయిపోయి, అప్పుడు సిద్ధాంత వ్యాసం రాసినడు. కానీ, ఒక సంగతి రాజవర్ధన్‌కు తెలిసి ఉండక పోవచ్చునని నా అనుమానం. సదాశివ సారుకు చాలామంది తోటి ఉత్తరాల ద్వారా మైత్రి సాగేది. వారిలో కొందరిని ఆయన కలవనే లేదు. అందులో మధురాంతకం రాజారాం గారు, వాకాటి పాండురంగారావుగారు కూడ ఉన్నరు. హైదరాబాద్‌, సిటీ సెంట్రల్‌ లైబ్రరీ, వివేక్‌నగర్‌లో ఒక కథకుల సమ్మేళనం జరిగింది. అప్పుడప్పుడే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న రాజారాం గారు అక్కడికి వచ్చినరు. ఇంకా ఎంతోమంది కూడా వచ్చినరు. కార్యక్రమం బాగ జరిగింది. అసలింతకు ఆ ప్రసక్తి ఎందుకో చెప్పాలెగద. కార్యక్రమం ఇంకా మొదలు గాలేదు. నేను అందరినీ పలుకరించుకుంటు తిరుగుతున్న. సదాశివ సారువచ్చి వెనుక వరసలో కూచున్నరు. నేను ఆదిలాబాదులో ఉద్యోగం చేసినందుకు మిగతా ఏమి ఒరిగిందో తెలియదు గాని, రెండు ఉపకారాలు జరిగినయి. మొదటిది, నాకు నౌకరీ మీద సంపూర్ణమయిన ఏవగింపు కలిగింది. రెండవది నాకు సదాశివగారి పరిచయము, మైత్రి ప్రాప్తించినయి. ఆ బలంతో నేను పరుగున పోయి, ‘ఇక్కడుంటే ఎట్ల? మీరు ముందరికి రావాలె’ అన్నట్లున్న. ‘నన్నెవరు గుర్తుపట్టరు గద. ముందరికొచ్చి ఏంజేస్త?’ అని అడిగినరాయన.

‘అట్లగాదు, రాండి’ అని చెయ్యి పట్టుకుని తీసుకుపోయి వాకాటికి, రాజారాంగారికి, ఆయన పేరు చెప్పిన అంతే. వారికి పరిచయం చేసిన, అని గనుక నేను అంటే, అంతకంటే పెద్ద అబద్ధం ఇంకొకటి ఉండదు. వాండ్ల ముఖాలలో కనిపించిన ఆనందం నేను మరువలేను. అందరము, కిందకు వచ్చి, ముందున్న లాన్‌లో కూచుని ముచ్చట్లు పెట్టినము. ఆ కాలంలో ఈ సెల్‌ఫోన్‌లు లేవు, వాటిలోగానీ, నేరుగా గానీ, మా దగ్గర కెమెరాలు లేవు. ఫోటోగ్రాఫరు వచ్చేలోపల రాజారాం గారికి పిలుపు వచ్చి హాలులోకి వెళ్లినరు. మేమంత ఫోటో తీయించుకున్నము. చిత్రం గదా!

తెలుగు పత్రికల్లో హిందూస్తానీ సంగీతం: వాకాటికి, సదాశివగారి పట్ల గొప్ప గౌరవం. అందులో విచిత్రం లేదు. కానీ, ఆయన ఒక పత్రిక సంపాదకుడు. తలుచుకుంటే తలుచుకున్న సంగతి గురించి, తలుచుకున్న వారి చేత రాయించి ప్రచురించగలరు. అదే జరిగింది. హిందూస్తానీ సంగీతం గురించి, తెలుగు పాఠకులు చదువుతరా? అని అనుమానం మొదట్లో వచ్చిందేమో? కానీ సదాశివసారు రాసిన సంగతులను అందరూ తలకెత్తుకున్నరు. ఆయనను, సంగీతం గురించి రాయమని ఒత్తిడి చేసిన వాండ్లలో నేను మొదటి వాణ్ని అని నేను చెప్పుకోవలసి రావడం, నా దురదృష్టం. ఆదిలాబాద్‌లో ఉన్నప్పుడు మేము సంగీతం గురించి, సాహిత్యం గురించి ఎన్ని గంటలు మాట్లాడుకున్నమో, రాజవర్ధన్‌ వంటి వారికి గుర్తుండే ఉంటుంది. ‘సాయంత్రం రాండి, ఒక కొత్త చీజ్‌ వినిపిస్త’ అని చిన్న చీటీ వచ్చేది నాకు. నేను రెక్కలు కట్టుకుని వాలేవాణ్ని. ఇక్కడి ఈ చీజ్‌ ఇంగ్లీషులో తినేది కాదు. ఉరుదూలో వినేది. సదాశివగారికి హిందుస్తానీ మీద గురి ఎక్కువ. నాకు కర్నాటకంతో ఉన్న పరిచయం హిందుస్తానీతో లేదు. ఇప్పటికీ లేదు. కానీ వినడం మాత్రం హిందూస్తానీయే సుఖంగా జరుగుతుంది. ఈ సంగతి గురించి ఎంతో చర్చ జరిగింది. అక్కడ వచ్చిన సంగతులు, ఆయన లోనే మిగలకూడదు. అందరూ వినాలని నా వాదం. చివరికది గెలిచింది.

నేనున్నాను: సదాశివ సారు తమ పుస్తకాల్లో నా పేరు కూడ ఒకటి రెండు చోట్ల రాసినరు. అది నాకు గొప్ప. అంతకంటే గొప్ప ఇంకొకటి ఉన్నది. చెప్పాల్నో, చెప్పగూడదో తెలియదు. సదాశివ సారు, నేను ఉత్తరాలు చాలానే రాసుకున్నము. కానీ ఆయనకు రాను రాను రాత వీలుగాకుండ అయింది. ఫోన్‌ చేస్తే కూడ ఎక్కువసేపు మాట్లాడలేకపోవడం గమనించిన.

పేపర్లో ‘సదాశివకు అవార్డు’ అన్న వార్త చూచిన. పెద్దాయనను ఇంత పొద్దున్నె చికాకు పెట్టేదేమి అని వెంటనే ఫోన్‌ చేయలేదు. అంతలో ఫోన్‌ మోగింది. ‘ఇంత అన్యాయముంటదా? ముబారక్‌ చెప్పరా!’ ఇవి ఆయన అక్షరాలా అన్న మాటలు. ఏవో మాటలు నడిచినయి. అయినా మీరు లేకుంటే, ఆ పుస్తకాలు ఎక్కడినుంచి వస్తుండే, గానీ’ అన్నారాయన. నా కళ్లలో నీళ్లు సుడులు తిరిగినయి. ఇంతటి మంచితనమా? నా గొంతు వణికింది. ‘ఇంక టిఫిన్‌ దింట. పెట్టేస్తున్న’ అన్నది ఆయన నోట నేను విన్న చివరి మాట. ఆదిలాబాదుకు పొయ్యి సారును చూడాలెనని మనసు పీకుతునే ఉన్నది. ఇద్దరు దోస్తులతోటి ఈ సంగతి మీద మాటలు కూడ నడిచినయి. మనువడు కార్తీక్‌ పెండ్లికి, సారు, హైదరాబాద్‌ వస్తరనుకుంటే రాలేక పోయిరి. ‘నేను రాకుంటెనేమి. మీరు పెండ్లికి పోవాలె’ అని ఫోన్లోనే చెప్పినరు. పెండ్లికి పోయినప్పుడు రాజ వర్ధన్‌తో ‘ఆదిలాబాద్‌కు వస్తము’ అని కూడ చెప్పినట్లున్న.

నేను ఉద్యోగం ఏనాడో వదిలిన. సారు లోకాన్ని వదిలినరు. ఆదిలాబాద్‌లో ‘యాది’ మిగిలింది. ఆదిలాబాద్‌ యాదిలో మిగిలింది. సారు కొడుకులు తేనెతుట్టె రేపినరు. ఆలోచనలు ముసురుకుంటున్నయి.

ఉత్తరం: యాది సదాశివసారు ఉత్తరం రాస్తే, అదొక వ్యాసం. అందులో ఒకటి రెండు తప్ప వ్యక్తిగతం మాటలుండవు. ఆయన ప్రభావం మనసులో ఉందనుకుంట. ఆశారాజు కవితా సంకలనం ‘పాగల్‌ షాయర్‌’ వచ్చిన తరువాత నేనొక ఉత్తరం రాసి బ్లాగులో పెట్టిన (2010లో). మీరూ చదవవచ్చు దాన్ని. ‘రాజూ! కలంతోని గాక, మనసుతో, మాటలను మాలగట్టిన వాండ్లంత పాగల్‌ గాక మరేమవుతరు? నీ ఒక్క పహిల్వాన్‌ పోయెం జాలు. ఓ గ్యానపీఠం ఇయ్యవచ్చు దానికి. ‘ఇప్పుడు శత్రువుక్కూడా మిత్రుడిని.’ ఎంత మాటన్నవు అన్నా! నిన్ను భుజంమీద ఎక్కించుకుని గల్లీ గల్లీ జులూస్‌ చేయాలనిపించింది. రాజూగైడ్‌, ఒగరు, పాగల్‌ షాయర్‌లలో నీ ఎక్స్‌ప్రెషన్‌ ఒక ఉన్నత శిఖరానికి చేరింది. కిందికి దిగకు.’ అంటూ సాగుతుంది ఆ ఉత్తరం. నిజానికి నేను రాసిన ఉత్తరం పోస్టు చేయలేదు. ఆ సంగతి నాకు తరువాత తెలిసింది. కానీ ఆశారాజు నా ఉత్తరాన్ని చదివినడు. ఇప్పటికీ కనిపించినప్పుడంత ఇద్దరమూ మాటలు పంచుకుంటము. అభిమానాన్ని అంతకంటే ఎక్కువగ పంచుకుంటము.  




 

Sunday, June 14, 2026

లోకాభిరామం - బ్యాడల పుళి (On languages and me)


లోకాభిరామం - బ్యాడల పుళి 


బ్యాడల పుళి

నేను పాలమూరు వాణ్ని. అంటే మహబూబ్‌నగర్ వాడినని అర్ధం. మాకు కర్నాటకలోని రాయచూరు దగ్గర. జిల్లా అంచుల లోని మక్తల్, నారాయణపేట ప్రాంతాల్లో మాట్లాడే తెలుగు చిత్రంగ ఉంటుంది. కన్నడము కలయికతో అది వింతగ తోస్తుంది. పప్పును బేడలు అనడం మాకు అలవాటు. మా ఇంట్లో బేడల పుళి అని ఒక వంటకం ఉంటుంది. అందులోని బేడలంటే కన్నడ బేళె. అనగా పప్పు. ఇక పుళికి, చారల, కోరల పులికి సంబంధం లేదు. పచ్చి తెలుగులో చెప్పాలంటే అది చింతపండు పులుసు. కన్నడలో అది హుళి. తెలుగులో ‘ప’ వాడే చోట్ల కన్నడంలో హకారం వస్తుంది.  హాలు అంటే పాలు. హాడు అంటే పాట. హావు అంటే పాము. కనుక అది బేళెహుళి (కన్నడం) గాక పుళి అయింది. తమిళంలో పుళియ మరం అంటే చింత చెట్టు. పుళి అంటే పులుపు. ఇంతకూ మా వంటకాన్ని పప్పు పులుసు అనవలె. అట్ల అంటే మా వాళ్లకు కోపం వస్తుంది. చాలా మాటలకు తమిళం గాని తమిళం వాడాలె. లేకుంటే సాంప్రదాయం పాడయింది అంటరు. మా ఇండ్లలో పచ్చిపుళి కూడ ఉంటుంది. మా ఇండ్లలో పెట్టే దేవుని దీపం పేరు పెరుమాండ్ల తిరువళికె. పెరుమాళ్ అంటే దేవుడు. తిరువిళక్కు అంటే శ్రీదీపము. అది తిరువళికె అయింది.
ఇక్కడ నాకు సంబంధం లేని సంగతి ఒకటి చెప్పాలె అనిపిస్తున్నది. ‘రాజ్యాలు పోయినా పూసలు పోలేదు’ అని ఒక మాట ఉన్నది. శ్రీకృష్ణదేవ రాయల బొమ్మను అందరు చూచి ఉంటరు. పుస్తకాలలో ఆయన పొట్టివాడని, స్ఫోటకం మచ్చలు గలవాడని రాసి ఉంది. బొమ్మల్లో, విగ్రహాల్లో మాత్రం ఆయనను ఆజానుబాహువుగా చూపిస్తరు. అది వేరే సంగతి. అట్ల పక్కన బెడుదుము. ఆయనకు కిరీటము గాని కిరీటము ఒకటి ఉంటుంది. అది పౌరాణికం సినిమా తరహా బంగారు కిరీటం కాదు. పట్టుబట్టతో తలపాగా చుట్టి, ముందు బాసికము వంటి అలంకరణ బిగించి ఉంటుంది. అందముగ వుంటుంది. అయినా అది కూడ మనకు ఇక్కడ అది చర్చనీయాంశము కాదు. కిరీటము ముందు భాగము లో ఒక పక్కన ముత్యాలు, లేదా అటువంటి వెలగల పూసల గుత్తి ఒకటి అమర్చి ఉంటుంది.(ఎడమ వేపా, కుడి పక్కనా? కుడి అయ్యుండాలె!) ప్రభువులు కదులుతుంటే అవి కదులుతూ, కంటి పక్కన ఆడుతుంటయి. కృష్ణదేవరాయలు కూడ రాజ్యము పోగొట్టుకున్నడు. కానీ ఈ మాట ఆయన గురించి చెప్పినదని నేను అనుకోను. పూసల గుత్తి కిరీటం గల ఒకానొక రాజు గారికి కిరీటం పోయింది. అంటే రాజ్యం పోయింది. ఆయనకు కనుకొలుకులలో పూసల కదలాట కనిపించడం లేదు. రాజ్యము గురించిన బాధ ఉండనే ఉంది. ఆ రాజ్యాన్ని అనుక్షణం గుర్తు చేసే పూసలు లేకుండడము మాత్రం ప్రభువులకు ఎంతమాత్రం నచ్చలేదు. ఉత్త తలపాగా కట్టుకుని, అందులో పూసల గుత్తి పెట్టుకుని సంతృప్తి పడినడట ఆ అమాయక చక్రవర్తి. అదే రాజ్యాలు పోయినా, పూసలు పోలేదు అంటే. మా తమిళ సంప్రదాయం కూడ అట్లనే మిగిలింది.
అన్నము వడ్డించు’ అనడాన్ని ‘సాదం’ పరిమారండి అనాలె. అట్లంటే మా తమిళ వైష్ణవ సాంప్రదాయపు మాట కింద లెక్క. మొన్న మొన్నటి వరకు ‘అన్నము’ అంటే ‘మాటలు రావా? అని పెద్దలు గద్దించే వారు. తమిళనాట అందరు ‘సాదము’ అని అంటరు. అని నేనంటే, నీవు చార్వాకుడవు అన్న వారున్నరు. సంప్రదాయమంటే, అదేమిటి అని అడిగే దినములు వచ్చినవి. గుడిలో కూడ వైట్‌రైస్‌లు, బఫే పద్ధతిలో వడ్డిస్తున్నరు. అయినా మావాండ్లు ఇంకా కొన్ని మాటలను వదలలేదు. వదిలితే నిజంగానే మూలాల గురించిన సోయి లేకుండ అవుతుందేమో?
సాపాటు అనాలె. భోజనం అన్నది అలవాటు లేదు. సాపాట్ల వ్యాళ (సమయంలో) హిందీ, ఉరుదూ మాటలు తప్పు అని ఒక సంప్రదాయము. దేశంలో మిగత ప్రాంతాలలో అందరు ఉరుదూ (ఉర్దూ అనాలె) కలిసిన హిందీ మాత్రమే మాట్లాడతరని నేను అంటే అది వితండవాదన కింద లెక్క. కానీ నా అనుమానాలు నాకు ఉండనే ఉన్నయి. ఉత్తర భారతంలో కూడ సాంప్రదాయ పరులు, సంస్కృత పదాల వాడకాన్ని కోరుకుంటరన్నది అందులో ఒకటి. జల్దీ అంటే ఉర్దూ. త్వరగా, తొందరగా అని అర్థం కానీ ఉత్తరప్రదేశ్ బ్రాండ్, శుద్ధ్ హిందీ వారు, తురంత్, శీఘ్ర్ అనే మాటలు వాడుకుంటరు. ఈ కల్తీ సమస్య అక్కడ కూడ ఉండేది. ఉంది అని నా అనుమానం.
హైదరాబాద్ స్టేట్‌లో ఉరుదూ ప్రభావం బాగ ఎక్కువ. ‘విస్తరి ఫరోఖ్త్‌గ ఉండంగ చట్నీ కినారాలో వడ్డించిన సబబేమి’ అన్నడట ఒక మొగుడు పెళ్లాన్ని, పెండ్లామును నిలదీస్తూ. ఆకు ఖాళీ (ఖర్మ, ఇది ఉర్దూ మాట!)గ ఉంటే పచ్చడి (తొక్కు) అంచున వేయడానికి గల కారణం ఏమి అని భావము. ఆమె ఏం సంజాయిషీ (ఖర్మన్నర, ఇదీ ఉర్దూ మాటనే!) ఇచ్చుకున్నదో తెలువదు. తెలువదు అంటే తప్పు. తెలియదు అనాలె (ఖర్మ!) (కర్మ వేరు ఖర్మ వేరు. ఖర్మ! ఖర్మ!)
హైదరాబాదులో ఈ పక్క జిల్లాలలో కన్నడము మాట్లాడే వాండ్లు చాలమంది ఉన్నరు. మేము పాలమూరులో, ఒకానొక గుడిపక్కన ఉన్న గదులలో కిరాయికి ఉన్నము. కిరాయి అన్నది ఉర్దూ మాట. బాడుగకు, అద్దెకు అనే మాటలు మా ప్రాంతంలో ఎవరికీ అర్థం కావు. ఆ గుడిలో ఆంజనేయులు, శివుడు ఇద్దరు ఉంటరు. ఇద్దరు వేరువేరుగ ఉంటరు. మధ్వులకు లేక మధ్వలకు భీముడు, ఆంజనేయ స్వామి ఆరాధ్య దైవములు. ఆ గుడిలో పూజారులు ముందు నరసింహభట్టు, ఆ తరువాత నారాయణభట్టు. వాండ్లిద్దరు కన్నడిగులు. అంటే కన్నడ మాట్లాడే వారు. అంటే కన్నడ ప్రాంతము వారు. కనుకనే, ఈ రకము సహజీవనము కారణముగనే మాకు కొంత కన్నడము అర్థము అవుతుంది. నారాయణభట్టు గారిని చుట్టు పక్కల ఇండ్లవారు తమ ఇండ్లలో పూజలు, వ్రతాలు చేయించేందుకు పిలిచే వారు. ఆయన గారి తెలుగు అన్యాయంగ ఉండేదంటె అన్యాయం కాదు. నారాయణ భట్టు పూజలో భాగంగా సత్యనారాయణ కథ చెప్పే తీరు విని తీరవలసిందే. ఈ రకం ప్రభావాల కారణంగనే నేను భాషల పట్ల ఆసక్తి కలవాడినిగ అయినట్లున్న. ఆయా భాషలు విని నేర్చుకునేందుకు అన్నిటి కన్నా మంచి మార్గము రేడియో. కన్నడ వార్తలు, ఉపన్యాసాలు అనే ప్రసంగాలు వింటే శుద్ధమయిన భాష గురించి తెలుస్తుంది. నాటకము, సినిమాలతో ప్రజల భాష తెలుస్తుంది. మొత్తానికి భాషతో పరిచయము పెరుగుతుంది. హైదరాబాదు వచ్చిన తరువాత బసంత్ టాకీసులో కన్నడ సినిమాలు చాలనే చూచినట్టు జ్ఞాపకముంది. గిరీష్ కార్నాడ్, గిరీష్ కాసర వల్లి, లంకేష్ మొదలయిన వారి సినిమాలు చాల శ్రద్ధగ చూచిన. కార్నాడ్ సినిమాల గురించి గంటల పాటు చర్చలు జరిపిన గుర్తు కూడ ఉన్నది.
ఝలక్ : యూనివర్సిటీ దినాలలో గురురాజ రావు అని ఒక మిత్రుడు ఉండేవాడు. అతను పాలమూరు మండలానికి చెందినవాడేనని అనుకుంటున్న. జెనెటిక్స్‌లో ఎమ్మెస్సీ చదివినడు. పరిశోధన వదిలేసి విదేశాంగ శాఖలో పెద్ద ఉద్యోగాలు చేసినట్టు అతని గురించి విన్నాను. గురురాజరావు అన్న పేరుతోనే అతను కన్నడిగుడని తెలిసిపోతుంది. నాకు కన్నడము వచ్చునని గురురాజ్‌కు నా మీద కావలసినంత అభిమానము. కన్నడము మీద అంతకన్న అభిమానము. అతను వచ్చి మామూలుగ నన్ను కన్నడములో ఏదో ప్రశ్న అడుగుతడు. నేను అంతే మాములుగ, అంతే వేగముగ తెలుగులో జవాబు (ఉర్దూ మాట) అనే సమాధానము చెపుత. గురు తిరిగి కన్నడములో మాట్లాడతడు. నేను తెలుగులో మాట్లాడత. మమ్ములను గమనించిన ఒక మిత్రుడు ‘మీరిద్దరు కన్నడములో, లేదా తెలుగులో మాట్లాడవచ్చు గద. ఈ రెండు భాషల సంభాషణ ఏమి? అని అడిగనడు. గురు అంటే గురురాజరావుకు తెలుగు కూడ బాగ వచ్చును. నాకు మాత్రము కన్నడ వ్యాకరణమును తొక్కి ముక్కలు చేస్తనేమోనని అనుమానము. అందుకనే కన్నడములో మాట్లాడను. మొన్ననొక వదినగారితో కన్నడము మాట్లాడవలసిన అవసరము వచ్చింది. ఆమెకు కన్నడము తప్ప మరొక భాష రాదు.  అప్పుడు నాకు ఎంతగా ఆ భాషను మరిచిపోయిననన్న సంగతి అర్థమయింది. చుట్టుపక్కల కన్నడవారెవరూ లేరు. ఈ మధ్యన కన్నడ దేశానికి తిరిగినది కూడ తక్కువే. అది అట్లుండగ, తమిళ ప్రభావం మరీ ఎక్కువయింది. తమిళ దేశానికి తిరగడం కూడ నిజంగనే ఎక్కువయింది. కన్నడము మాట ప్రయత్నిస్తే తమిళము అడ్డముగ వస్తున్నది.
నిజానికి హైదరాబాదులోనే తమిళ, కన్నడ, మళయాళ సంపర్కం వీలవుతుంది. ఒకప్ప్పుడు ఈ భాషల సినిమాలు కూడా వచ్చేవి. ఇప్ప్పుడు టీవీ ఛానల్స్ కావలసినన్ని ఉన్నయి. కానీ చూడడము ఇష్టం ఉండదు.
నేను ఉర్దూ నేర్చుకున్న. జర్మన్ భాష మూడు డిప్లొమాల వరకు చదువుకున్న జర్మన్ ఇప్పుడు గుర్తు లేదు. ఆ సంగతులు మరొకసారి విన్నవించుకుంట.