ప్రభుత్వం గుమాస్తా మరణం
ఆంటన్ చెఖో(హో)వ్ కథ
అది ఒక అందమయిన రాత్రి. ద్మిత్రిష్ కూడా అందమయిన మనిషే. అతను ఓపెరా గ్లాస్‌ల
సాయంతో నాటకం చూస్తూ స్టాల్స్‌లోని రెండవ వరసలో హాయిగా కూచుని ఉన్నాడు. రంగస్థలం
వేపు అదే పనిగా చూస్తున్నాడు. ఈ ప్రపంచంలో తన కన్నా ఆనందంగల మనిషి
లేడనుకుంటున్నాడు. అంతలో ఉన్నట్టుండి ..... (సాధారణంగా కథల్లో మనకు ఈ ఉన్నట్టుండి
అన్నమాట తరుచూ ఎదురవుతూ ఉంటుంది. అంతవరకు బాగానే ఉంది. మరి రచయితలు బతుకులో
అనుకోకుండా ఉన్నట్టుండి జరిగే విషయాలను గురించి కూడా పట్టించుకోవాలి కదా!)
ఒక్కసారిగా, అప్పుడు అతని ముఖం బిగుసుకుపోయింది.
కళ్లు గుండ్రంగా తిరిగాయి. ఊపిరి ఒక్కక్షణం ఆగిపోయింది. ఓపెరా అద్దాలు
ముక్కుమీద నుంచి పడిపోయాయి. అతను తన సీట్లో చతికిల పడిపోయాడు. ఇక... ఆచ్ఛూ! అంటూ
పాఠక మహాశయులు గమనించినట్టే, అతను ఒక తుమ్ము తుమ్మాడు.
నిజం చెప్పాలంటే తుమ్ముకు వ్యతిరేకంగా ఎటువంటి నిబంధనలు, చట్టాలను విధించి
ఉండలేదు. అందరూ తుమ్ముతారు. అటు రైతులు మొదలు పోలీస్ ఇన్స్‌పెక్టర్‌లు, చివరికి రాజకీయ
ప్రతినిధులు కూడా తుమ్ముతారు. అందరూ తుమ్మే వారే. కనుకనే చెర్వియకోవ్ కూడా ఏమంత
పట్టించుకోలేదు. జేబురుమాలు తీసుకుని నెమ్మదిగా ముక్కు తుడుచుకున్నాడు. ఇక మంచి
నడవడి గల మనిషిగా అతను తన వల్ల ఎవరికయినా అసౌకర్యం కలిగిందేమో చూడాలన్నట్టు చుట్టూ
కలియజూచాడు. అతనికి కొంత అసంతృప్తి ఎదురయింది. ముందు వరసలో సరిగ్గా తన ముందు
కూచుని ఉన్న ఒక పెద్ద మనిషి తన బట్టతలను, మెడను గ్లవ్స్ సాయంతో
తుడుచుకుంటున్నాడు. తనలో తానే ఏదో గొణుగుతున్నాడు. ఆ పెద్ద మనిషిని చెర్వియకోవ్
గుర్తించాడు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో చాలా ఉన్నతాధికారి అయిన బ్రిజలోవ్‌గారు
అతనేనని అర్థమయింది.
‘నేను ఆయన మీద తుమ్మాను!’ అనుకున్నాడు చెర్వియకోవ్.
‘ఆయన నా ప్రత్యక్ష అధికారి కాకపోవచ్చు. అయితేనేమట. ఎంత అసహ్యంగా ప్రవర్తించాను.
నేను క్షమాపణలు చెప్పక తప్పదు’ అనుకున్నాడతను.
చెర్వియకోవ్ కొంచెం దగ్గాడు. ముందుకు వంగాడు. జనరల్‌గారి చెవులలో మాత్రమే
వినిపించేట్టు ‘మహాప్రభూ! నేను తుమ్మాను. అది అనుకోకుండా జరిగిందని నా భయం... ’
అంటున్నాడు.
‘ఏం పట్టించుకోకు’
‘నన్ను క్షమించండి. దేవుని పేరున క్షమించండి.
నిజానికి నాకేమాత్రం ఉద్దేశ్యం...’
‘మాట్లాడకుండ కూచో! నన్ను నాటకం విననీ!’
చెర్వియకోవ్ గతుక్కుమన్నాడు. అర్థం లేకుండా ఒక నవ్వు నవ్వాడు. తన దృష్టిని
కూడా రంగస్థలం మీద నిలపడానికి ప్రయత్నం సాగించాడు. అక్కడ నటులను చూస్తుంటే మాత్రం,
అతనికి ఇప్పుడు, మానవులలో కెల్లా తానే అందరికన్నా సంతోషంగా ఉన్నవాడన్న భావం కలగడం
లేదు. అతనికి లోలోపల గొప్ప ఆత్రం మొదలయింది. నాటకంలో ఇంటర్వెల్ వచ్చింది. ఆ
సమయంలో మనవాడు బ్రిజలోవ్‌ను వెతికి పట్టుకున్నాడు. కాసేపు అతని చుట్టూ తచ్చాడాడు.
చివరికి ధైర్యం కూడగట్టుకుని ముందుకు వెళ్లి ‘ప్రభూ, నేను మీమీద తుమ్మాను.
నన్ను క్షమించండి. నేను అనుకోకుండా ....’
‘ఓహో! ఏమిటిదంతా?’ జనరల్
విరుచుకుపడ్డాడు. ‘నేను ఆ వ్యవహారం ఎప్పుడో మరిచిపోయాను’ అన్నాడాయన కింద పెదవిని
ఓపికలేనట్టు కదలిస్తూ.
‘అతను వ్యవహారం గురించి మరిచినట్టున్నాడు. అయినా ఆ
కళ్లలో మాత్రం ఏదో భావం కనిపించింది’ అనుకున్నాడు చెర్వియకోవ్. జనరల్ వేపు చాలా
అనుమానంగా చూచాడు కూడా. ‘అతను నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. నేను ఏ మాత్రం
దురుద్దేశ్యం లేనివాడినని వివరించవలసిన బాధ్యత ఇంకా మిగిలే ఉంది. తప్పెవరిదీ లేదు.
అంతా ప్రకృతి సిద్ధం. అయినా అతను, నేను అతని మీదకు కావాలని తుంపర పంపించానని
అనుకునే అవకాశం ఉంది. అది ఇప్పుడు జరగకవపోవచ్చు. ఆయనకు గుర్తుకువచ్చినప్పుడు అంటే
తరువాత ఎప్పుడో అది జరగకమానదు’
అతను ఇల్లు చేరుకున్నాడు. వచ్చీ రాగానే జరిగిన వ్యవహారం గురించి భార్యకు
చెప్పాడు. కానీ ఆమె దాన్ని అంతగా పట్టించుకోలేదని అతడికి తోచింది. నిజానికి మధ్యలో
ఒకసారి ఆమె ముఖంలో భయం కనిపించింది. అయినా బ్రిజలోవ్ మరొక శాఖలోని అధికారి అని
అర్థం చేసుకున్న తరువాత ఆమె ముఖంలో మళ్లీ ప్రశాంతత కనిపించింది.
‘అయినా సరే, నీవు వెళ్లి క్షమాపణ చెప్పాలి.
లేకుంటే నీకు పదిమందిలో ప్రవర్తించవలసిన తీరు గురించి తెలియదని ఆయన అనుకుంటాడు’
అన్నది ఆమె.
‘నా బాధ అదే. నేను ఇప్పటికే క్షమాపణ చెప్పాను. అయినా
ఆయన చిత్రంగా ప్రవర్తించాడు. ఆయన మాటలకు అర్థం తెలియలేదు. అసలు నాకు వివరించడానికి
సమయమే ఇవ్వలేదు....’
మరుసటి రోజు చెర్వియకోవ్ తన కొత్త ఫ్రాక్ కోట్‌ను తొడుక్కున్నాడు. అప్పటికే
అతను, జుట్టు చక్కగా కత్తిరించుకుని వచ్చాడు. ఇక బ్రిజలోవ్‌కు క్షమాపణలు
చెప్పడానికని అతను బయలుదేరాడు. జనరల్‌గారి ముందు గదిలో పిటిషన్‌లతో వచ్చిన వారు
చాలామంది ఉన్నారు. జనరల్ అక్కడే నిలబడి వారి ఫిర్యాదులను వింటున్నాడు. చాలామంది
మాటలనే విన్నాడు అంతలో కళ్లెత్తి చెర్వియకోవ్‌ను చూచాడు. గుర్తించాడు కూడా.
‘మహాప్రభో, తమరికి గుర్తుంటే నిన్న....
ఆర్కేడియా థియేటర్‌లో .... నేను తుమ్మాను. అయ్యా, అనుకోకుండా వచ్చిన ఆ
తుమ్ముతో మీ మీద కొంత తుంపర పడినట్టుంది...’
‘అర్థంలేని మాటలు. ఇక తరువాత ఏం జరుగుతుందో ఎవడికి
తెలుసు. ఇంతకూ నన్నేం చేయమంటావు?’ ఒక్కసారిగా జనరల్ ఎదురు తిరిగాడు.
ఆ తరువాత పట్టించుకోకుండా మరో మనిషితో మాటలలోకి దిగాడు.
‘ఈయన నాతో మాట్లాడే పద్ధతిగా లేదు. నా మీద బాగా
కోపంగా ఉన్నాడు. నేను వ్యవహారాన్ని ఇలా వదిలేస్తే బాగుండదు. ఆయనకు నేను సంజాయిషీ
చెప్పుకోవాలి’ మొఖం వెలవెలబోతుండగా, చెర్వియకోవ్ ఆలోచించసాగాడు.
జనరల్ తనను చూడవచ్చిన పిటిషనర్‌లు అందరితోనూ మాట్లాడాడు. ఇక తన గదిలోకి
వెళ్లిపోవడానికని సిద్ధపడుతున్నాడు. అప్పుడిక చెర్వియకోవ్ ఆయన ముందుకు వేగంగా
వెళ్లి గొణగనారంభించాడు. ‘మహాప్రభూ, తమరిని ఒక్క క్షణంపాటు చికాకు
పెట్టక తప్పదు. నా మనసులో తమరి ముందు పూర్తి విధేయత, అంతకుమించిన అపరాధ
భావం పొంగి పొరలుతున్నాయి.... అంతా అనుకోకుండా జరిగింది.... అందుకు నన్ను
క్షమించాలి....’
జనరల్ కళ్లనీళ్ల పర్యంతం అయ్యే పరిస్థితి కనిపించింది. చేతితో సైగ చేసి
ఇతగాడిని వెళ్లిపొమ్మన్నాడు.
‘మీరు నన్ను అపహాస్యం చేస్తున్నారండీ!’ అన్నాడు.
కానీ, జనరల్ వెంటనే తన గదిలోకి వెళ్లి ధడాలున తలుపు వేసుకున్నాడు.
‘అయితే నేను ఆటపట్టిస్తున్నానన్నమాట. నిజంగానా? ఇందులో నవ్వడానికి
ఏముంది? ఆయనగారు ఒక జనరల్. అంతకుమించి ఏమీ తెలియదు. ఇక నేను ఆ ముసలి భడవ ముందు
ప్రాధేయపడే ప్రయత్నం మానుకుంటాను. దెయ్యాలు వాడిని తీసుకుపోను! ఒక ఉత్తరం
రాస్తాను. ఆ తరువాత మళ్లీ ఆయన ముఖం చూడను. దేవుని పేరున మళ్లీ ఏ రకంగానూ
విసిగించను’ చెర్వియకోవ్ ఆలోచనలు సాగుతున్నాయి.
ఇంటిదారి పొడువునా చెర్వియకోవ్ అట్లా ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ అతను జనరల్‌కు
లేఖ రాయలేదు. అతను ఆలోచించాడు. మరింత ఆలోచించాడు. కానీ ఉత్తరంలో రాయవలసిన మాటలు
మాత్రం తోచనే లేదు. మరుసటి నాడు అతను క్షమాపణలు చెప్పడం కోసం, మళ్లీ జనరల్
ముందుకు వెళ్లాడు.
‘నిన్నటి రోజున నేను ప్రభువులను కష్టపెట్టడానికి
ప్రయత్నించాను’ తన వేపు ప్రశార్థకంగా చూస్తున్న జనరల్ ముందు అతను ఏదో గొణిగాడు.
‘మహాప్రభూ! తమరిని ఆటపట్టించాలన్న ఉద్దేశ్యం నాకు ఎంతమాత్రం లేదని నమ్మకంగా
చెపుతున్నాను. తుమ్మినందుకు, మీమీద తుంపర పడినందుకు క్షమాపణ చెప్పడానికి మాత్రమే
నేను ఇక్కడికి వచ్చాను. ప్రభువుల గురించి సరదా చేయడం అన్న ఆలోచన నా మనసులో అసలే
లేదు. నాకు అంతటి ధైర్యం లేదు. అది ఏనాటికీ ఉండదు. మనం ఒకరి గురించి ఆకతాయిగా
మాట్లాడితే ఇక వ్యక్తుల గౌరవం ఏమయిపోతుందని నేను మిమ్మల్ని అడుగుతున్నాను’ ఏవేవో
అన్నాడతను.
‘గెట్ అవుట్ ఆఫ్ హియర్’ గర్జించాడు జనరల్. ఆయన
కోపంతో ఊగిపోతున్నాడు.
‘అయ్యా ఏమన్నారు?’ చెర్వియకోవ్
గొణిగాడు.
‘గెట్ అవుట్!’ జనరల్ మళ్లీ అదే మాట అన్నాడు.
కాలితో నేలమీద గట్టిగా కొట్టాడు.
సజీవంగా ఉన్న చెర్వియకోవ్ శరీరంలో ఎక్కడో ఏదో తెగింది. తలుపువేపుగా
దారిపట్టిన అతనికి ఏమీ వినిపించడం లేదు. ఏమీ కనిపించడం లేదు. అతను వీధిలోకి
వచ్చేశాడు. నెమ్మదిగా తమాయించుకుంటూ నడుస్తున్నాడు. అనుకోకుండా ఒక కాలిముందు మరొక
కాలు పడుతున్నది. అలా అతను ఇల్లు చేరుకున్నాడు. ఫ్రాక్‌కోట్ విప్పకుండానే అతను
దివాను మీద పడిపోయాడు. అలాగే చనిపోయాడు.
` జులై 1883 (చెర్‌వ్యాక్ అంటే ఒక
నులిపురుగు అని అర్థం)
No comments:
Post a Comment