ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో
గురించి నా వ్యాసం 2వ భాగం
2
ఇస్మత్ చుగ్తాయి
లాగే మంటో కూడా సంచలనాలకు కారణమయి కోర్టు దాకా వెళ్లాడు. అయినా, ఇద్దరిదీ ఒకటే పద్ధతి. నిజాన్ని ఉన్నది ఉన్నట్టు
ఎత్తి చూపడం మా ధర్మం అంటారు ఇద్దరు.
మంటో బతుకుకూడా అదుపులేకుండానే జరిగింది. అతను తెగ
తాగేవాడంటారు. ఒక వ్యాసంలో అతనే రోజుకు ఒక
సీసా మాత్రమే తాగానని రాసుకున్నాడు. ఒక కథలో మాత్రం ఒకేనాడు పదిహేను కాయలు
లాగించినట్టు కూడా రాస్తాడు. బతుకు, రచనలు అతడిని భయపెట్టిన జాడలు కనిపించవు. ‘అవలక్షణాలు, అనారోగ్యాలు, అపభ్రంశాలు అన్నీ కలగలసి ఉన్న నా
పాత్రలను నేను నావిగా అంగీకరిస్తున్నాను’ అంటాడు మంటో. అతను 42 సంవత్సరాల వయసులోనే వెళిపోయాడు. అయినా, ఇవాళటి వరకూ అందరినీ తన గురించి ఆలోచించే రకంగా రచనలను
వదిలి వెళ్లాడు. చదువుకున్నది అంతంతే అయినా, ఇంగ్లీష్ మీద వల్లమాలిన అభిమానం చూపించాడు. ఫ్రెంచ్,
రష్యన్ సాహిత్యాన్ని కూడా
అంత అభిమానంగానూ చదివాడు. పుస్తకాలు కొనడానికి డబ్బులు లేకపోతే, రైల్వే స్టేషన్‌లో బుక్‌స్టాల్ నుంచి పుస్తకాలను
దొంగిలించాడు కూడా! విక్టర్ హ్యూగో, ఆస్కార్ వైల్డ్, ఆంటన్ చెహోవ్
రచనలను అనువదించాడు కూడా. ఆ తరువాత అతనికి వాళ్లలాగ తాను కూడా రాయవచ్చును
అనిపించినట్టు ఉంది. ఇక ఆగకుండా 24 సంవత్సరాలపాటు 22 కథా సంకలనాలు,
5 రేడియో నాటకాల సంకలనాలు,
3 వ్యాస సంకలనాలు
ప్రచురించాడు. బొమ్మలు కూడా గీశాడు. ఒక నవల రాశాడు. ఏడు, ఎనిమిది సినిమాలకు కథ, మాటలు రాశాడు. అంత తక్కువ కాలంలో అన్ని రచనలు చేశాడంటే,
అతనికి అడుగడుగునా కథావస్తువు కనిపించి ఉంటుంది. సమాజంలో అంతటా కుళ్లు ఉండనే
ఉన్నది. దాన్ని గురించి అంత విస్తృతంగానూ, వివరంగానూ రాయగలగడం అసలు గొప్ప! ఆ పని చేశాడు గనుకనే, మంటో రచనలను వదలకుండా
చదువుతున్నారు. వాటి గురించి చర్చిస్తున్నారు.
ఉర్దూ కథా సాహిత్యంలో సాదత్ హసన్ మంటో స్థానం
గురించి వర్ణించడం సులభం కాదు. మంటోతో సమానంగా ప్రభావం చూపిన రచయితలు మరెవరూ
కనిపించరు. సాహిత్యంలో అతని తిరుగుబాటు పద్ధతి మరెవరికీ చేతకాలేదు. అతను రాసిన భాష, అతని పేరు తప్ప అతడిని ఒక మతానికి పరిమితం చేయడానికి
ఆధారాలు కనిపించవు. నిజానికి ఉర్దూ ఒక మతానికి సంబంధించిన భాష కాదు. అది సైనికుల
అవసరాలకోసం పుట్టిన ఆధునిక భాష. అందులో అభివ్యక్తి అందుకే సులభంగా వీలయింది! ఆ
భాషను వాడుకుని మంటో అన్ని మతాలలోని నమ్మకాలను కడిగే ప్రయత్నం చేశాడు. అతనికి మతమంటూ ఉంటే అది మానవత్వం మాత్రమే.
బడుగు మనుషులు అతనికి దగ్గరివాళ్లు. బాధలు అతను ఎత్తి చూపిన సత్యాలు. మంటో దేశ
విభజనను ఒక మతం దృష్టి నుంచి చూడలేదు. ఒక భాష దృష్టి నుంచి అంతకన్నా చూడ లేదు. కేవలం విభజనను ఒక బాధాకర సంఘటనగా మాత్రమే చిత్రించాడు. అప్పుడు జరిగిన దుండగాలు, రక్తపాతాలు, మానభంగాలు, నగరాల నాశనాలు, అతడిని భూకంపంలా
కదిలించాయి. అదే కాలంలో అప్పటి పరిస్థితులను గురించి కిషన్ చందర్, రాజిందర్ సింగ్ బేదీ, అహ్మద్ నదీమ్ ఖాస్మీ, ఇస్మత్ చుగ్తాయి లాంటివాళ్లు చాలా రచనలు చేశారు. అయినా,
అప్పటి పరిస్థితులు మంటో
రచనలలో కనిపించినంత స్ఫుటంగా మరెవరి రచనల్లోనూ రాలేదు. మతం పేరిట మనుషులను విడదీయడం మంటోకు నచ్చలేదు. సంస్కృతిని, నాగరికతను, కళలను, మాట, ఆట, పాటలను పంచుకోవడం కుదరదన్నది అతని వాదన. ఆ విషయాలనే తన
పద్ధతిలో చెప్పాడు. ‘టోబా టేక్‌సింగ్’ అన్న కథను ఇవాళటి వరకు ప్రపంచం
మరవలేకపోతున్నది.
మంటో కథలన్నీ ఇంటర్‌నెట్‌లో దొరకుతున్నాయంటే,
అతని ప్రభావం గురించి,
అది నేటి వరకూ కొనసాగుతున్న
తీరు గురించి అర్థమవుతుంది. మంటో మాత్రం ఈ ప్రభావాలను గురించి ఆలోచించనే లేదు.
తాను నమ్మిన విషయం గురించి దేవునితోనయినా తలపడేందుకు సిద్ధమేనన్నాడు. ‘లక్షమంది
ముస్లింలు, లక్షమంది
హిందువులు ఆ సమయంలో హతులయ్యారు అనకండి. రెండు లక్షలమంది మానవులు పోయారు అనండి’
అంటాడు అతను ఒకచోట. దేశం విడిపోయి నప్పుడు అంతమంది చావవలసిన అవసరం ఏమిటో అర్థం
కాదు. అందునా, ఏ సంబంధమూ లేని
అమాయకులు చావడం అంతకన్నా అర్థంకాదు. ఒక మతం వారిని చంపిన మరొక మతం వారు, ఆ మతాన్నే
చంపిన భావంతో సంబరం చేసుకున్నారేమో! కానీ, మతాన్ని తుపాకులతో చంపడం వీలయ్యే పనికాదు అని కూడా మంటో అంటాడు.
మంటో మాటలు సూటిగా ఉంటాయి. అక్కడ తెరలు, పొరలకు చోటు లేదు. చెప్పవలసిన మాట చెప్పవలసిన
బలంతో చెప్పడమే అతని రచనలలోని బలం! ఉదాహరణగా చెప్పడానికి లెక్కలేనని కథలు ఉన్నాయి.
ఆ కథల గురించి ఎంత చర్చ జరిగినా తక్కువే.
‘దేఖ్ కబీరా రోయా’ (చూచి, కబీర్ ఏడ్చాడు) అన్న కథ నభూతో నభవిష్యతి. కథలో కబీర్ లక్ష్మి విగ్రహాన్ని చూచి
ఏడుస్తాడు. కాలే కడుపులతో కూడా సైనికులు ఆజ్ఞలను పాటించవలసి వచ్చింది, అని కూడా
ఏడుస్తాడు.
అతని కథలు అప్పట్లో చాలామందికి అర్థం కాలేదన్న
అనుమానం పుడుతుంది. ప్రభుత్వంవారు మాత్రం బూతులు అంటూ ప్రతిబంధకాలు వేశారు. అటు
రచయితకు, ఇటు పాఠకునికి అనవసరంగా
కాలయాపన అన్నారు. కోర్టు కేసులు చాలాకాలం
నడిచాయి. ఇస్మత్ కూడా లాహోర్ వెళ్లి మంటోతోబాటు అక్కడే తన కేసు గెలిచింది. మంటోకు
పెద్ద జుర్మానా వేశారు. జుర్మ్ అంటే నేరం. నేను నేరం చేయలేదంటూ మంటో మళ్లీ
కోర్టుకెక్కాడు. ఆ కేసు నిర్ణయించవలసిన
జడ్జ్ మంటో మతానికి చెందినవాడే. సముద్రంగా చేరిన రక్తంలో నుంచి పశ్చాత్తాపం
అనే ముత్యాలు కనీసం బయటికి రావాలన్నాడు మంటో. ఆ మాట ప్రజలకు పట్టలేదు. మొత్తానికి
జడ్జ్ కేసును కొట్టివేశాడు. లేకుంటే, ఒక గడ్డం వాడు నాకు శిక్ష వేశాడని
మంటో ఒక కథ రాస్తాడు అంటూ, ఆ జడ్జ్ చమత్కరించాడు.
1955లో మంటో మరణించాడు. అంతకు కొంతకాలం ముందే అతను
‘పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్లు తనను మెచ్చి
తన శవపేటిక మీద ఒక మెడల్ పెడతారంటూ, అది తనకు అవమానంగా నిలుస్తుంది’ అంటూ వ్యాఖ్యానించాడు.
నిజంగానే పాకిస్తాన్ ప్రభుత్వం అంతపనీ చేసింది! మంటో శతజయంతి సంవత్సరంలో అతనికి
‘నిషాన్`ఎ`ఇమ్‌తియాజ్’ అనే
బిరుదుతో పతకాన్ని ఇవ్వనే ఇచ్చింది. మంటో భారతీయుడు కాడంటే అన్యాయం. అతను పాకిస్తానీ
అన్నా అన్యాయమే. మంటోకు ఒక దేశం లేదు. ఒక మతం లేదు. మానవత్వమే అతని మతం. మంచి
అన్నదే అతని తీరు.
ఈ ప్రపంచంనిండా సమస్యలు మాత్రమే కాదు, కుళ్లు నిండుకుని ఉన్నది. దాన్ని ఎత్తి
చూపించకుంటే, అది ఎవరికి
పట్టకుండా కొనసాగుతుంది. ఈ సంగతి అందరికీ తెలుసు. అయినా, ఎవరూ దాన్ని గురించి మాట్లాడరు. రచనలు అంతకన్నా చేయరు. ఏవో
మంచి మాటలతో కాలక్షేపం చేస్తారు. వివాదాలను సృష్టించి, సమాజాన్ని నిద్ర నుంచి మేల్కొల్పాలి, అనుకునే రచయితలు
అరుదుగా మాత్రమే కనపడతారు. అక్కడక్కడ కొందరు రచయితలు ధైర్యం చేసినా, విషయాన్ని
కొన్ని సమస్యలకే పరిమితం చేస్తారు. సమాజంలో అట్టడుగువర్గాలుగా ఉన్న
పనివాళ్లు, సానివాళ్లు,
దురలవాట్లకు లోనయి
కుళ్లుతున్నవాళ్లు కథా వస్తువులుగా కనిపించడం అరుదే! యమకూపం అనే పేరుతో తెలుగులో
వచ్చిన రష్యన్ నవల ‘యామా`ద పిట్’ వంటి రచనలకు మన సాహిత్యంలో చోటు ఉందా? సాదత్ హసన్ మంటో కథలలో కొన్నింటిని గురించి చర్చించే ధైర్యం
మనకు మిగలి ఉందా? మంటో రచనలలో
అందమయిన మనుషులకు చోటు లేదు. కథ ఎంత అందంగా నడిచినా, అందులో విషయం ఆనందకరంగా మాత్రం ఉండదు. మంటో రచనలలో సెక్స్
మరీ బాహాటంగా కనిపిస్తుంది. ఆడవాళ్ల వర్ణనలు కూడా కనిపిస్తాయి. కానీ, చదవరికి అవి గిలిగింతలు పెట్టవుకాక పెట్టవు. పైగా,
అసహ్యం కలిగిస్తాయి!
ఆలోచనలేని పాఠకునికి మంటో వెకిలి రచయితగా కనిపించవచ్చు. కానీ, మంటో మనసులోని బాధ అందితే మాత్రం, ఆ తరువాత కొంత
కాలం అది దెయ్యంలా వెంటాడుతుంది. మంటో గొప్ప కథలు తెలుగులో సంకలనాలుగా
వచ్చినట్టున్నాయి. రాకుంటే మాత్రం ఆ దిశగా ప్రయత్నం జరగాలి. ఆయన రచనల్లో అందరూ
చదివి తీరవలసినవి కొన్ని ఉన్నాయి. వాటి మీద గట్టి చర్చలు జరగాలి. ఆ లోగా మంటో తీరు
గురించి పరిచయం చేసుకోవడం సాహిత్యాభిమానుల, మానవతావాదుల కనీస కర్తవ్యం.
No comments:
Post a Comment