ఆలోచన - అవసరం వ్యాసం
ఆలోచన
తెలివి తెలిసి తెలియక ముందే బడిలో పడేస్తరు. పంతులు చెప్పిందే చదువు అన్న పద్ధతి అక్కడనే మొదలవుతుంది. భాషలు నేర్పుతరు. రాత, చదువు రావాలంటే అదే కదా మరి ఆధారము! లెక్కలు కొంతవరకు నేర్పుతరు. ఇంకా సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము మొదలైన పాత సంగతులు చెబుతరు. అన్నింటికి మించి చెప్పింది గుర్తుంచుకోవాలె అన్నది మొదటి పాఠం. వాటిని పరీక్షలో అప్పచెపితే మార్కులు వస్తయి. ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే అంత గొప్ప లెక్క. ఈ గొప్ప వాండ్ల బతుకులు తరువాత ఎంత బాగ సాగుతున్నయి అన్న సంగతి ఎవరికి పట్టదు. మొత్తం మీద ప్రశ్న అడుగగూడదు. లేనివి ఊహించగూడదు. ఆలోచన అసలే కూడదు. ఈ స్వంత ఆలోచన అన్న పద్ధతి ఏ బడిలోనన్న, ఏ కోర్సులోనన్న నేర్పుతున్నరా? అనుమానమే.
యద్భావం తద్భవతి
అని ఒక మాట ఉన్నది. ఏది భావించితే అదే జరుగుతుంది. నీకోసం ఆలోచనే లేకపోతే ఆ సంగతి
మరి వాస్తవము అయ్యే మార్గమేమి?
సాంఘిక శాస్త్రము,
సామాన్య శాస్త్రము అన్ని
తమంతతాము వచ్చి మన ఎదురుగ నిలిచినయా? అన్ని మనిషి అనుభవములో నుంచి వచ్చినవే గదా? వాటికి ఆధారమైన ఆ పద్ధతులు ఎంతమంది వాడుకుంటున్నరు? మొట్టమొదట పరిశీలన. ఎవరంతకు వారు గాక, కొంతమంది మనుషులు ఒకచోట కలిసి ఉంటే, తంటాలు పుడతయి. అందరూ ఒకే రకంగ అర్థం చేసుకోరు.
అందరూ ఒకే రకంగ ఆలోచించరు. కనుక ప్రతి సంగతి గురించి వేరువేరు అభిప్రాయాలు పుడతయి.
వాటిలో అనుకూలమైనవి, అనుసరించదగినవి
ఏవి అనే నిర్ణయము ఆలోచనతో మాత్రమే వీలవుతుంది. ఎక్కువమంది అవునన్నది శాస్త్రము
అవుతుంది. ఆ పద్ధతిని మార్చవలసిన పరిస్థితి వస్తే, మళ్ల ఆలోచన మొదటికి చేరుతుంది. సైన్స్ అయినా, మతం అయినా అంతే!
మనిషి మొదటి నుంచి,
పరిశీలన, ప్రయోగము, చర్చ, నిష్కర్ష, అనే పద్ధతులతో ఎంతో తెలివిని జమ చేసుకున్నడు. రాను
రాను బతుకు మారింది. అనుభవం పెరిగింది. పొద్దు పొడిస్తే వెలుతురవుతుంది. రాత్రి
అయితే చీకటవుతుంది. ఈ సంగతిని మొదట్లో గమనించిన మనుషుల భావములను గురించి
ఆలోచించండి. నిన్న మొన్నటి వరకు సూర్యోదయము, అస్తమానము గురించి అందరికీ ఒకే ఆలోచన. ఈమధ్య పిల్లలకు
సూర్యోదయము అబద్ధము. మనమే భూమితో పాటు తిరుగుతము. వెలుగులోకి మరొకసారి వస్తము అన్న
సంగతి అర్థమయింది. భూగోళము బొంగరమువలె తన చుట్టూ తాను తిరుగుతున్నది. అంటే,
ఇవాళటికి అందరికీ నమ్మకము
కలుగదు. మరి మనమెందుకు తిరుగుతు లేము? అని అడిగినవారు కొంత తెలివిని వాడినట్టు లెక్క. ప్రశ్నలు మరింత ముందుకు సాగితే
మరెన్నో సంగతులు తెలుస్తయి. అవునా? అవునుగదా? అనిపిస్తుంది.
ఆనందం అది సాటిలేనిది. అనుమానాలు, ప్రయోగాలు, ప్రశ్నలు, పరిశీలనలు, నిర్ణయాలు జరుగుతయి. కొత్త సంగతులు ఎన్నో అర్థమవుతయి.
కొంతమంది, మరింత తెలివిగ ఆలోచించి, మరింత ముందుకు నడిచి, ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తరు. వారికి కలిగే భావనలు,
మొత్తం ప్రపంచాన్ని ముందుకు
నడపగలుగుతయి. ప్రపంచం మారుతుంది. కొత్త అనుభవాలు తోడవుతయి. మళ్ళా ప్రశ్న, ప్రయోగం, ప్రయత్నం కొత్త భావనల వరుస! ఈ రకంగనే కదా! ఇవాళ ప్రపంచం ఈ పరిస్థితికి చేరింది?
ఒక్కసారి వెనుక
తిరిగి చూడగలిగితే కథ మరింత ఆసక్తికరమవుతుంది. నూరేండ్లనాటి, అంతకు ముందునాటి, పోనీ 1900ల సంవత్సరము నాటివరకు పోదాము చాలు! అప్పటి
దినపత్రిక ఒకటి దొరికింది, దొరికించు కుందము. అందులో రేడియో అనే మాట కనబడదు. ఇప్పటి పేపర్లో రేడియో
గురించి ఉండదు. మధ్యలో రేడియో వచ్చింది. అందరికీ సమాచారం, విద్య, అందం పంచింది. దాని రూపు ఇప్పుడు మారిపోయింది. ప్రతి ఫోన్ లో పాటలే, మాటలే, వార్తలే, విశేషాలే.
అలనాటి పత్రికలో
సినిమా, మూవీ అనే మాట కనిపించదు.
రేడియో, సినిమా, టీవీ అన్ని 1920 తరువాత ఎప్పుడోగాని రాలేదు.
వాటిని, వాటి పనితీరును గురించి
ఆలోచన గలవారు ఎంతెంతో భావించినందుకు, వాటి తీరు నమ్మరానంత మారింది. సెల్ ఫోన్, ఇంటర్నెట్, ఉంటే, ప్రపంచమంత జేబులో
ఇమిడిపోతుంది, ఇవాళ. కొందరు
భావించిన సంగతులు అందరికీ అనుభవంలోకి వచ్చినయి. అనుభవించే వారికంత ఒకనాడయినా,
ఏ రకంగా వీలైంది అని
అనుమానం, ప్రశ్న వచ్చిందా? రాలేదు. మన చదువు తీరు వలన కలిగిన స్తబ్ధత. ఆనాటి
పత్రికలో అప్పుడప్పుడే ఆటోమొబైల్ గురించి ప్రసక్తి వస్తున్నది. ఇవాళ మనిషి వేరు
గ్రహాలకు, సౌర మండలం అవతలకు నౌకలను
పంపగలుగుతున్నడు. అంటే అంతా, ప్రశ్న, ఆలోచన, భావనల వలననే గదా?
అందరికీ, ఆలోచించే మనసు ఉండాలె. ప్రశ్నలు వాడి సంగతులు
అర్థం చేసుకోవాలె. అప్పుడుగాని, ఉన్న అద్భుతాల గురించి అర్థం అవుతుంది. ఓహో! కదా! అనిపిస్తుంది.
1863 లో జూల్స్
వెర్న్ అనే రచయిత ఆలోచించి ఒక నవల రాసినడు. ప్యారిస్ ఇన్ ద ట్వెంటియత్ సెంచురీ,
అన్ననవలలో రానున్న కాలంలో
పారిస్ నగరంలో ఉండగల అద్భుత జీవితాలను గురించి రాసినడు. కానీ ఆ నవల 130 సంవత్సరాలు
మరుగున పడి ఉండిపోయింది. అది 1994లో అచ్చయింది.
రచయిత ఆ నవల రాసిన
కాలంలో రాజులు, రాజ్యాలు
ఏలుతుండేవారు. రైతులు శ్రమపడి తిండి పండించే వారు. అటు యూఎస్ లోలోపల యుద్ధాలు
జరుగుతున్నయి. రచయిత మాత్రం 1960లో పారిస్ నగరంలో ఆకాశాన్ని తాకే, అందాల, అద్దాల భవనాలు ఉన్నట్టు ఊహించుకున్నడు. ఎయిర్ కండిషనింగ్, టెలివిజన్, లిఫ్ట్ లు, రయిళ్లు, పెట్రోల్ వాహనాలు,
ఇంచుమించు ఇంటర్నెట్ లాంటి
వ్యవస్థ అన్నింటినీ ఊహించినడు. అతని భావనలన్నీ, పూర్తిగా నిజమయినయి. అంతా అతను అనుకున్నట్టే, పుస్తకం ప్రచురించిన నాటికి ప్రపంచం సాగుతున్నది.
అదేదో అనుకోకుండా జరిగిన సంగతి కాదు. వెర్న్ తన నవల ఆలోచన కొరకు ఎంతో మందితో
మాట్లాడి, ఎంతో సమాచారం సేకరించి,
ఆ తర్వాత మాత్రమే రాసినడు.
అతను, మానవుడు చంద్రగోళం మీదకు దిగినట్టు మరొక నవల
రాసినడు. ఆ సంగతి నూరేళ్ల తరువాత నిజమయింది. అయితే వెర్న్ తుపాకి మందును ఇంధనంగ
వాడుకునే రాకెట్ గురించి రాసినడు. ద్రవ ఇంధనం రాకెట్ అతనికి తోచలేదు. అది మరో
డెబ్భయి యేళ్లకు నిజమయింది.
మొత్తానికి
కావలసింది ఆలోచన! భావన! కలగంటే అది నిజమవుతుంది!
No comments:
Post a Comment