Thursday, February 5, 2026

సముద్రతీరం - అనువాద కథ - మూలం - ఆర్నాల్డ్ జ్వైగ్ (జెర్మన్)


సముద్రతీరం

 అనువాద కథ - మూలం - ఆర్నాల్డ్ జ్వైగ్ (జెర్మన్)


సముద్రతీరం

ఆర్నాల్డ్ జ్వైగ్ (జర్మనీ)

బీచ్ లో పరుగులు పెడుతూ కాంగ్ మొట్టమొదటిసారి సముద్రాన్ని చూచింది. అది ఎంతో ఉత్సాహంతో మొరగసాగింది. నీలిరంగు నీళ్లమీదనుంచి తుంపరలు మళ్లీమళ్లీ దాన్ని తాకుతున్నాయి. కానీ ఆ నీళ్లలో దూకడానికి లేదు. ఆ ఎయిర్ డేల్ టెర్రియర్ జాగిలానికి పట్టరాకుండా ఉంది. దాని ప్రాణానికి ఒక దేవుడున్నాడు. వాడి పేరు విల్లీ. దాన్ని వదలడు. అయితే కావలసినంత వేగంగా తడిసిన ఇసుక మీద పరుగులు పెట్టవచ్చు. విల్లీ అరుస్తూనే ఉంటాడు. కుక్క, దాని ఎనిమిదేళ్ల యజమాని తీరును ఇంజినియర్ గ్రోల్ గమనిస్తున్నాడు. బీచ్ కుర్చీలో కూర్చున్న వాళ్లు, బేదింగ్ హౌసెస్ లోని వాళ్లు అందరూ ఆ ఇద్దరిని చూస్తున్నారు. వరుస చివర్లో అంతులేని ఆకాశం పేలవంగా ఉంది. తలమీద మాత్రం అది నీలంగా ఉంది. కావలసినంత ఆనందం, విరామం, బలాలను పట్నం వారికి అందరికీ పంచుతున్నది. కానీ అందులో ఎక్కడో ఒక తిరకాసు మొదలవుతున్నది. బక్కపలుచని విల్లీ ఏమీ పట్టనట్టు నిలబడి ఉన్నాడు. కుక్కను కాలర్ సాయంతో పట్టుకుని ఉన్నాడు. గ్రోల్ త్వరత్వరగా అక్కడికి వెళ్ళాడు. ఈతదుస్తులు వేసుకున్న మనుషులు అందరూ ఒకే రకంగా కనబడుతున్నారు. అన్నిరకాల, అన్నివర్గాల వారు కలగలిసినట్టు ఉన్నారు. తలలలో తేడా. ఆ తలకు ఆధారంగా ఉన్న శరీరాలన్నీ ఊబగా రంగు కలిసినట్టు ఉన్నారు. చలికాలం అంతా మందం దుస్తులు వేసుకుని, చీకటి వదిలి ఇల్లు కదలనందుకు మరీ పాలిపోయిన ఆ శరీరాలరంగు ఎండ అలవాటు లేనిదిగా కనబడుతున్నది. చారల గుడారం పక్కన ఒక లావుపాటి మనిషి కూర్చుని ఉన్నాడు. చుట్ట కాలుస్తూ అతను నెమ్మదిగా ముందుకు వంగుతున్నాడు.

కుక్క నీదేనా?” నెమ్మదిగా అడిగాడు

ఆయనతో ఒక చిన్న అమ్మాయి, పదేళ్ళుంటాయేమో, ఉంది. ఆమె తన కిందపెదవిని కొరుకుతున్నది. నీళ్ళు నిండిన ఆమెకళ్ళలో కుక్క, దాని యజమాని పట్ల అసహ్యం మెరుపులాగ కనిపించింది.

కాదు అన్నాడు గ్రోల్ ప్రశాంతంగా. ఆ స్వరం అతని ఎదలో ప్రతిధ్వనించినట్టు వినిపించింది. కుక్క ఆ అబ్బాయిది, ఆ అబ్బాయి మావాడు.

గొలుసు లేకుండా కుక్కలను వదలకూడదు. మీకు తెలిసే ఉంటుంది. కుక్క మా అమ్మాయిని అదరగొట్టింది. ఆమె వేసుకున్న కాలువలను పాడు చేసింది. పైగా ఆమె పార మీద నిలబడి ఉంది,” అతను ప్రశాంతంగా చెపుతున్నాడు.

గ్రోల్ నవ్వాడు. విల్లీ! కుక్కను లాక్కో!అన్నాడు. అయ్యా మీరన్నది నిజమే. కానీ కుక్క పట్టు తప్పించుకున్నది. అయినా ప్రమాదం ఏమీ జరగలేదు గదా! అన్నాడు.

విల్లీ కుక్కను పక్కకు నెట్టాడు. పారను పైకి ఎత్తాడు. గౌరవంగా వంగుతూ దాన్ని ఎదుటివాళ్లకు అందించ బోయాడు. ఎదుటివారిలో ఒక అందమైన ఆవిడ ఉంది. ఆమె టెంట్ లో అటు చివరన కూర్చొని ఉంది. ఆమె అమ్మాయికి అమ్మ అనడానికి లేదని గ్రోల్ నిశ్చయించుకున్నాడు. గవర్నెస్ అనడానికి కుదరకుండా ఆవిడ మరీ హుందాగా ఉంది.

అబ్బాయి అందించిన పారను ఎవరూ తీసుకోలేదు. విల్లీ ముఖం మాడ్చుకుని ఆటవస్తువును అమ్మాయి ముందు ఇసుకలో గుచ్చాడు.

ఇవాళ వాతావరణం చాలా బాగుంది. పేచీ ముగిసిందని అనుకుంటాను,” అంటూ గ్రోల్ కూచోబోయాడు. కాళ్లు వెనుకకు చాచి, మోచేతులను ఇసుక మీద ఆన్చి, అరచేతుల్లో ముఖం పెట్టుకుని అతని పడుకున్నాడు. ఎదురుగా ఉన్న ముగ్గురిని చూచాడు. విల్లీ గౌరవంగానే వ్యవహరించాడు. కాంగ్ ను పట్టుకుని చక్కగా కనిపిస్తున్నాడు. కుక్కమాత్రం శాంతి కోరడం లేదని అర్థమవుతున్నది. గుర్రుమంటున్నది అది. మెడమీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. అది కూడా కూర్చున్నది.

అతగాని కుక్కను షూట్ చేయాలి‌ నాన్నా! అమ్మాయి దృఢంగా అన్నది. అది నన్ను చాలా భయపెట్టింది, మాట జోడించింది. చేతి మణికట్టు మీద విలువైన పాతకాలపు బ్రేస్ లెట్ ఉండడం గ్రోల్ గమనించాడు. మూడు వరుసల తీగలను పాము రూపంలో అల్లినట్టు ఉందది. వీళ్ళకు ఒక పాఠం అవసరం...... అది నేనే చెప్పాలి.

గ్రోల్ ధైర్యం చెబుతున్నట్టు బాబు వైపు చూచాడు. వాడు మాత్రం అవమానంగా భావించి కుక్కను తనవైపు లాక్కుంటున్నాడు. ముగ్గురిలోనూ అమ్మాయి మాటే బలంగా ఉంటుందని, శాసిస్తుంది అని గ్రోల్ కు తోచింది. కనుక తర్వాతి మాటల కోసం వేచి ఉన్నాడు. విలువగల చుట్ట కాలుస్తున్న పెద్దమనిషి ఒకవేళ ధైర్యం చేయకపోతే బాబును ఒక మాట అనడానికి తాను ఉండనే ఉన్నాడు మరి!

నా కుక్కను ఎవరూ షూట్ చేయడానికి లేదు భయపెడుతూ అన్నాడు విల్లీ. వాడు పిడికిలి బిగబట్టాడు. వాడి వైపు చూడకుండానే అమ్మాయి కుక్కను కొనెయ్ నాన్నా!ఇదుగో నా చెక్ బుక్ అంటూ ఆమె నిజంగానే సన్నని చెక్ బుక్ అందించింది. టెంట్ నుండి తెచ్చిన సంచిలోనుంచి బంగారు క్లిప్ గల పెన్ కూడా తీసి ఇచ్చింది.

నామాట జరగలేదంటే డిన్నర్ లో సూప్ ప్లేట్ విసిరేస్తాను. నా గురించి తెలుసు కదా నాన్నా!” ఆమె గుసగుస లాడినట్టు అంటున్నది. ఆమె మొత్తం శరీరం, ఎండలో సుద్దలాగా రంగుపోయి కనబడుతున్నది. కళ్ళు నీలం, అందులో సముద్రం రంగు ప్రతిఫలిస్తున్నది. అవి భయంకరంగా కనబడుతున్నాయి.

పది పౌండ్లు ఇస్తాను అన్నాడు పెద్దాయన.

గ్రోల్ లేచి కూర్చుని పద్మాసనం వేసుకున్నాడు. ఏం జరుగుతుంది అని ఆత్రంగా ఉన్నాడు.

కుక్క నాది కాదు. మా అబ్బాయిని అడగాలి. అది వాడిది.

నేను కుర్రవాడితో బేరాలు చేయను. పదిహేను పౌండ్లు ఇస్తాను. అది ఎక్కువే అన్నాడతను. తను పెద్దకొడుకు మనసు తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం అనుకున్నాడు గ్రోల్. ఈ అయ్యగారు నీ కుక్కను పదిహేను పౌండ్లకు కొంటారట. తర్వాత దాన్ని షూట్ చేస్తారనుకుంటా. పోయిన సంవత్సరం నుంచి బైసైకిల్ కావాలి అనుకుంటున్నావు. ఆ డబ్బులతో కొనవచ్చు. నేను ఎలాగూ ఇప్పట్లో కొనలేను. మనం అంత కలిగిన వాళ్ళం కాదున్నాడతను కొడుకును చూస్తూ.

విల్లీ తండ్రి వైపు చూశాడు. నిజంగానే అంటున్నాడు అని అనుమానం ఉంది. తండ్రి ముఖంలో సరదా కనిపించలేదు. ఇక జవాబుగా వాడు కాంగ్ మెడమీద చేయివేసి దాన్ని దగ్గరగా తీసుకున్నాడు. నేను అమ్మడం లేదు నాన్నా!” అన్నాడు నవ్వుతూ.
ఈత దుస్తులు, పాలిపోయిన చర్మంగల పెద్దమనిషి గ్రోల్ వైపు తిరిగాడు.వాదం నచ్చినట్టు కనబడుతున్నది. ఒప్పించండి! ఇరవయి పౌండ్లు ఇస్తాను అన్నాడు.

ఇరవయి పౌండ్లు. బైసికిల్ తో పాటు కనో బోట్ కూడా కొనవచ్చు. పొద్దున్న చూచి బాగుంది అన్నావు కదా విల్లీ. రెండు తెడ్లుగల ఆకుపచ్చని కనో. అది నీళ్లమీదయితే, నేల మీద తిరగడానికి బైసికిల్. హెడ్ లైట్ లు, బ్యాటరీ, కొత్త టైర్లతో. గడియారానికి కూడా డబ్బు మిగులుతుందేమో. చేయవలసిందల్లా ముసలి కుక్కను వదిలించుకోవడమే. గొలుసు ఆయనగారికి అందిస్తే పోతుంది”.

నేను గనక పది అడుగుల దూరం పోయానంటే కాంగ్ అతగాడిని కింద తోసి నా వద్దకు వచ్చేస్తుంది, అన్నాడు విల్లీ కోపంగా.

అందమయిన ఆవిడగారు మొదటిసారి మాట్లాడారు. అదేమీ కుదరదు లే, ఆమె స్పుటంగా, తీయగా వెక్కిరిస్తున్నట్టు అన్నది. ఆకర్షణగల మనిషి అనుకున్నాడు గ్రోల్. ఆమె తన సంచీ నుంచి చిన్న బ్రౌనింగ్ రివాల్వర్ బయటకు తీసింది. ఇది కుక్కను ఆపుతుంది అన్నదామె.

పిచ్చిమనిషి అనుకున్నాడు గ్రోల్. ఆ కుక్క మంచి జాతిజాగిలం. చక్కని శిక్షణ పొందిన రకం అన్నాడు.

ఆ సంగతి తెలుస్తూనే ఉన్నది

యాభయి పౌండ్లు నాన్నా! బేరం కుదిరించు.

యాభయి పౌండ్లు అన్నాడు గ్రోల్. అతని గొంతు వణికింది. ఇక్కడికి వచ్చిన ఖర్చుతోబాటు, వాడు అవునంటే వాళ్ళ అమ్మ ఆరోగ్యం సంగతి కూడా చూడవచ్చు. శానిటోరియం ఖరీదైనది. తనకు అందుబాటులో లేదు. యాభయి పౌండ్లట విల్లీ, బైసికిల్, వాచ్, టెంట్! తాళ్లు, కుచ్చులూ, అవీ అన్నింటితో. మిగిలిన డబ్బులతో, నీవు అవునంటే అమ్మను ఆసుపత్రికి పంపవచ్చు. ఆలోచించు! తరువాత యానిమల్ వెల్ఫేర్ సొసైటీకి వెళ్లి మూడు షిల్లింగ్ లకు మరో కాంగ్ ను తేవచ్చు.

కాంగ్ అంటే ఒకటే ఉంటుంది. నేను దాన్ని అమ్మడం లేదు!

వంద పౌండ్లు ఇద్దాం నాన్నా! నేను ఆ కుక్కను షూట్ చేయాల్సిందే! ఈ వ్యవహారం తీరు నాకు నచ్చదు!”

లావుపాటి పెద్దాయన ఒక్కక్షణం తటపటాయించాడు. వంద పౌండ్లు బొంగురుగా అన్నాడు. అదృష్టం ఎదురయితే కాదంటున్నారేమో?”

నా చేతుల్లో లేదండీ!” అంటూ గ్రోల్ కొడుకు వైపు తిరిగాడు. చూడు బాబూ! వందపౌండ్లు. మదుపు చేస్తే పదేళ్లలో నీ పై చదువులకు అంది వస్తుంది. కాదంటే నువ్వు చిన్నకారు కొని అందులో బడికి వెళ్లొచ్చు. అందరూ నిన్నే చూస్తారు. అమ్మను బజార్ కు తీసుకుపోవచ్చు. అది చాలా డబ్బు. కుక్కకు వంద పౌండ్లు, అన్నాడు.

ఆ మాటల వెనుక భావాన్ని గమనించిన విల్లీ భయపడిపోయాడు. వాడికి ఏడుపు వచ్చేసింది. తాను చిన్న కుర్రవాడు. తన కుక్కను అడుగుతున్నారు. కన్నీళ్లను ఆపుకుంటూ కానీ కాంగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. కాంగ్ కు నేనంటే ఇష్టం. నేను దాన్ని వదులుకోలేను, అనగలిగాడు.

వంద పౌండ్లు. ఒప్పించండి. లేకుంటే నా కూతురు నా బ్రతుకు దుర్భరం చేస్తుంది. మీకు అర్థం కాదు. అమ్మాయి అఘాయిత్యం ఎంత దూరం వచ్చింది?” ఆయన నిట్టూర్చాడు.

ఆ అమ్మాయి నా కూతురే కనక అయ్యుంటే రెండు చెంపల మీద పాఠంగా గుర్తులు వదిలి ఉండేవాడిని. అనుకున్నాడు గ్రోల్. ముఖం మాడ్చుకుని కన్నీళ్లు ఆపుకోవటానికి ప్రయత్నం చేస్తున్న తన కొడుకువైపు చూచాడు. ఆ తరువాత ఇక ఇప్పుడైనా వ్యవహారం ముగిసింది అనుకోవచ్చా?” అన్నాడు గట్టిగా. ప్రశాంతంగా, స్ఫుటంగా. మాట ముగించి అమ్మాయి ముఖంలోకి చూశాడు.

అప్పుడు అనుకోని ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆ అమ్మాయి నవ్వడం మొదలు పెట్టింది. అబ్బాయి తండ్రి తీర్పు ఆమెకు నచ్చినట్లుంది. అతను లెంపలు వాయించేయాలని అనుకున్న సంగతి అర్థమయిందేమో?

సరే నాన్నా, అతను మంచి అబ్బాయి. కనుక మనం చెక్ బుక్ తిరిగి సంచిలో పెట్టేద్దాము. అంతా సరదాగా అని నీకు కూడా అర్థమయ్యే ఉంటుంది అన్నది పాప గట్టిగా.

పెద్దాయన భారం తీరినట్టు చిరునవ్వాడు. అమ్మాయి మాట నిజమే అన్నాడు. ఇంత మంచిరోజు అంతా సరదాగానే జరగాలి అన్నాడు. గ్రోల్ కు నమ్మకం కుదరలేదు. అతను మనుషులను అర్థం చేసుకునే తీరు వేరు.

విల్లీ తీరుకూడా మారింది. ముక్కు చీదుతున్నట్లు నటిస్తూ కన్నీళ్లు తుడుచుకున్నాడు. వాడు కాంగ్ పక్కనే ఇసుకలో వాలిపోయాడు. కుక్కను తన మీదకు లాక్కున్నాడు. దానితో కుస్తీ మొదలు పెట్టాడు. కుక్క కాళ్లు కుర్రవాడు చేతులు బాగా కలిసినట్టు ఉంది.

పరిచయం లేని పెద్దమనిషి అందించిన సిగార్ ను, లైటర్ ను గ్రోల్ ఇష్టం లేకుండానే తీసుకున్నాడు. నిశ్శబ్దంగా సముద్రం నీళ్లను చూడసాగాడు. అది ఎదుట ఎంతోదూరం పట్టుబట్ట పరిచినట్లు కనబడుతున్నది. వెలిగిపోతున్నది. గ్రోల్ ఆలోచనలో పడిపోయాడు. బీదవాళ్ళ గతి ఇంతే. రెండేళ్ల క్రితం తన పరిస్థితి అన్యాయంగా ఉండేది. ఈ ఆఫర్ అప్పుడు గనుక వచ్చి ఉంటే అప్పట్లో ఏదో మామూలు ఇంట్లో ఉంటూ ఇప్పుడు లాంటి ఇంటిగురించి కలలు కంటూ కాలం గడిచింది. పాపం విల్లీ. ఇవాళటి పరిస్థితి అప్పుడు వస్తే పర్యవసానం మరోరకంగా ఉండేది. కుక్కకోసం తపన, ప్రేమ, ధైర్యం, దానగుణం అన్నిఏమయ్యేవో? చేతిలో నాలుగు కాసులుంటే చేసే నిర్ణయాలు మరో రకంగా ఉంటాయి.

అమ్మాయి పార పట్టుకుని టెంట్ ముందు ఇసుకలోకి మళ్లీ వచ్చింది. కాలువ తోడడానికి సాయం చేద్దువు గాని రా!” అంటూ విల్లీని పిలిచింది. పిలుస్తూనే అనుమతి కోసం అబ్బాయి తండ్రి ముఖంలోకి చూసింది.

మళ్లీ కాలువలు తోడుకుందాం. మళ్లీ కుక్క వాటిని తొక్కేస్తుంది! తొక్కితే పోయేదేముంది? మళ్లీ తోడుకుందాం!” అంటూ అమ్మాయి కాంగ్ వైపు చూసింది.

దూరంగా రేవులోకి వస్తున్న స్టీమ్ బోట్ శుభం అన్నట్టు కూసింది.

No comments: