I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Friday, February 20, 2026
అగ్గి మనిషి - A story in Telugu about human nature
అనగనగనగా ఒకప్పుడు ఒకానొక మనిషి ఉండేవాడు. ఆయనకు నిప్పు తయారు చేయడం తెలిసి ఉండేది. అతనికి గల ఆ అద్భుతమైన శక్తిని చూచి ఆయన ఊరులోని వాళ్ళందరూ ఎంతో అబ్బుర పడేవాళ్లు. అతను మొట్టమొదటిసారిగా నిప్పు తయారు చేశాడు. వాళ్లందరికీ దాని గురించి ఏమనాలో తెలియలేదు. దాంతో ఏం చేసుకోవాలో అంతకన్నా తెలియలేదు. నిజానికి ఉన్న మాట చెప్పాలంటే, వాళ్లందరూ కొంచెం భయపడిపోయారు కూడా.
Thursday, February 19, 2026
గౌతముడు - గణితం : Buddha and Mathematics
గౌతముడు - గణితం
Buddha and Mathematics
గౌతముడు - గణితం
ద యూనివర్సల్ హిస్టరీ ఆఫ్ నంబర్స్ అని ఒక పుస్తకం. రచయిత పేరు జార్జెస్ ఇఫ్రా. అందులో గౌతముడు (తరువాత గౌతమ బుద్ధుడు) చూపిన గణిత నైపుణ్యం గురించి ఒక కథ. ఆ కథ ‘లలిత విస్తార సూత్ర’ అనే పుస్తకంలోనుంచి తీసినదట.
గౌతముడు గోప అనే అమ్మాయి కోసం మిగతా యువకులతో పోటీ పడ్డాడని కథలో చెప్పారు. కానీ అది మనకు ఇక్కడ అంత ముఖ్యం కాదు. సిద్ధార్థుడు, అంటే గౌతముడు అర్జునుడు అనే లెక్కల నిపుణునితో పోటీ పడ్డాడు. పోటీలో ఏమి చెయవలె? ‘ఒక పెద్ద అంకెను, ఒక మరీమరీ చిన్న అంకెను గణించి చెప్పవలె!’ ‘ఆ పని అంత కష్టమా’ అని ప్రశ్న. ఒక యోజనాన్ని విభజిస్తూ పోయి చివరకు అణువు పరిమాణం వరకు చెప్పడం కష్టమే!
యోజనం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు కూడా మరో ఇంగ్లీషు పుస్తకంలో జవాబు దొరికింది. పుస్తకంపేరు ‘హియర్ ఈజ్ లుకింగ్ అట్ యూక్లిడ్. రచయిత అలెక్స్ బెలోస్. యోజనమన్నది పాతకాలంలోని నిడివి కొలత అని, అది సుమారు పది కిలోమీటర్లకు సమం అవుతుందని బెలోస్ చెప్పాడు. ఇప్ప్పుడు అసలు ప్రశ్న ‘పది కిలోమీటర్లలో ఎన్ని అణువులను పరచవచ్చు?’
అని వస్తుంది.
ఈ ప్రశ్నకు గౌతముడు ఇచ్చిన జవాబు. (ఇది బహుశః సంస్కృత శ్లోకాలలో ఉండి ఉంటుంది.కానీ ఆంగ్లరూపం మాత్రమే దొరికింది.)
యోజనములో నాలుగు క్రోశములు
క్రోశములో వెయ్యి చాపములు,
చాపములో నాలుగు మూరలు
మూరలో రెండు జానలు
జానలో పన్నెండు కణుపులు
కణుపులో ఏడు గింజలు
గింజలో ఏడు ఆవగింజలు
ఆవగింజలో ఏడు గోధూళి కణాలు
గోధూళి కణంలో ఏడు గొర్రెదుమ్ము కణాలు
గొర్రెదుమ్ము కణంలో ఏడు కుందేటి దుమ్ము కణాలు
కుందేటి దుమ్ము కణంలో ఏడు గాలిలో తేలే దుమ్ము కణాలు
ఆ దుమ్ము కణంలో ఏడు మరింత చిన్న దుమ్ము కణాలు.
అందులో ఏడు మరింత సూక్ష్మమయిన ధూళి కణాలు, అందులో ఏడు అణువులు!
ఈ లెక్కన చూస్తే గౌతముడు అణువు పరిమాణాన్ని చాలా దగ్గరగా అంటే, ప్రస్తుతం మనకు తెలిసిన అణువు పరిమాణానికి దగ్గరగా సూచించాడని రచయితలు అభిప్రాయపడ్డారు. వాళ్లకు లెక్కలోని మొదటి కొలతల కన్నా వేలి కణుపుల తర్వాతి భాగం సులభంగా అర్థమయ్యింది. ‘ఒక వేలు నాలుగు సెంటి మీటర్లు పొడుగు ఉంది అనుకుందాం. ఆ నాలుగు సెంటి మీటర్లను 7తో పదిసార్లు విభజించాలి. అంటే 0.04 మీ I 7 టు ద పవర్ ఆఫ్ మైనస్ 10. ఆ లెక్క తీస్తే ఒక విలువ 0.000 000 000 01416 మీటర్లు. ఇది ఇంచుమించు కార్బన్ అణువు పరిమాణానికి సమానం! ఈ లెక్కను గణిత నిపుణులే తేల్చారు.
గౌతమునికి ఆధ్యాత్మిక దృష్టితో బాటు అంతకన్నా నిశితంగా ప్రపంచ దృష్టి, శాస్త్ర దృష్టి ఉండేదన్నమాట. ఈ కథ, ఈ లెక్క, ఎక్కడయినా మన పుస్తకాల్లో వచ్చిందా,
అన్న అనుమానం మాత్రం ఇంకా మిగిలే ఉంది. పాశ్చాత్యుల దృష్టిలో, ఆనాటి భారతదేశానికి ఈ రకమయిన లెక్కల గురించి ధ్యాసే లేదని కద! భారతీయులంతా అంతర్ముఖులయి,
తత్వం గురించి మాత్రమే పట్టించుకున్నారని ప్రపంచానికి ఒక ధారణ ఉంది. కానీ వారు పదార్థ ప్రపంచ తత్వం గురించి కూడా ఇంతగా ఆలోచించారన్నది, పాశ్చాత్యులకే కాదు మనకూ ఆశ్చర్యం కలగజేస్తుంది.
ఇంత గణితం చెప్పిన సంస్కృతి నుంచి బౌద్ధం వంటి సిద్ధాంతం కూడా రావడం అసలు గుర్తించవలసిన విషయం. ఈ కథలో, లెక్కలో పాశ్చాత్యులను గొప్పగా ఆకర్షించిన విషయం మరొకటి ఉంది. సూక్ష్మాన్ని కేవలం ‘సూక్ష్మం’ అని చెప్పి వదలక, దాన్ని రకరకాల కొలతలలో చెప్పడం నిజంగా మనకూ ఆశ్చర్యం కలిగించే అంశమే. గోధూళి, మేష ధూళి, శశక ధూళి అనే కొలతలు ఎంతమందికి తెలుసు? ఇందులో గణితంతోబాటు ఒక రకమయిన కవితా ధోరణి కనబడుతుంది. ఈ విభజన గణితంలో గొప్ప మిస్టరీ ఉంది. గొప్ప అందం ఉంది.
ఈ నాటి రసాయన శాస్త్రంలో కూడా మరీ చిన్న పరిమాణంగా క్వార్కు గురించి చెపుతుంటారు. ఆ పేరు ‘జేమ్స్ జాయ్స్’ అనే రచయిత నుంచి వచ్చిందని ఎంత మందికి తెలుసు?
Tuesday, February 17, 2026
లోకాభిరామం - కష్ట షకారం మరెన్నో సంగతులు...
లోకాభిరామం - కష్ట షకారం
మరెన్నో సంగతులు...
కష్ట షకారం
హొటేల్లో (హోటల్ అంటే తప్పు తెలుసా?) దోసె తినడానికి పోయిన ఒకతను ‘బాగ పల్చగ వేయాలె. అంచులు కూడ బాగ కాలాలె. పచ్చిమిర్చి తక్కువగ ఉండాలె’ అని తన మనసును బయటపెట్టుకున్నాడు. సర్వర్మహాశయుడు మాత్రం లోపలికి పోయి ‘ఒక సాదా!’ అని ఆర్డరు ఇచ్చాడు. అదీ మన ఒకతనికి వినిపించే పద్ధతిలో!
ఇంగ్లీషులో దోసె పేరు
దోస అని రాస్తరు. డొస్సా అని పలికిన వారిని నేను చూచి పుణ్యం కట్టుకున్నాను. దోస
అన్నది కూరగాయలలో ఒకటి. వాటిలో ముల్లుదోస, ఏటిగడ్డ దోస, కీరా దోస అని రకాలుంటాయి. ఏటిగడ్డ దోస అన్నది
కర్బూజలంత తీపిగా పండడం, కర్బూజకన్నా మెత్తగా వెన్నలాగ లోని గువ్వము (గుజ్జు) ఉండడము గుర్తుంది. మాకు
చిన్నప్పుడు బుడుమ కాయలు తినడం అలవాటు. అవి దోసకాయలకన్నా చిన్నవి. గుండ్రంగా
ఉండేవి. వీటిలో కొంత పులుపు ఎక్కువ. గింజలలో పులుపు మరీ ఎక్కువ. గింజలలో అనేకన్నా, వాటి చుట్టు ఉండే
పదార్థంలో ఈ పులుపు ఉంటుంది కనుక, గింజల చుట్టు పులుపు అనాలి. పప్పులోనయితే
గింజలతోబాటు ముక్కలు వేస్తే, ఇక పులుపే పులుపు.
ఈ బుడుమ కాయలలో
కొన్ని చేదుండేవి. అమ్మ వాటిని చిన్న ముక్కలుగా తరిగి, కొంత చింతకాయ తొక్కు
వేరే తీసి, అందులో కలిపి పెట్టేది. నాలుగయిదు దినాలయితే ఆ ముక్కలు చేదు పోయి, ఉప్పు, పులుపు కలిసిన గొప్ప
రుచిలోకి మారేవి!
ఇనుప బొచ్చెల కాలం:
మా ఊళ్లో చాలా మంది అన్నం, పప్పు, కూరలు అన్నీ మట్టిపాత్రలలోనే వండుకునేవారు. మా ఇంట్లో మాత్రం నాగరికత పేరున, అన్నం కంచు, ఇత్తడి గుండీల్లో
వండేవారు. చారు, పప్పు మాత్రం మట్టికుండలోనే. కొంతకాలానికి జనం సత్తు అనే అల్యూమినం వాడడం
నేర్చుకున్నారు. దాన్ని జర్మన్ సిల్వర్ అనేవారు. మా ఇంట్లో ‘చాయ’కు మాత్రం
సత్తుగిన్నె వాడడం గుర్తుంది. మట్టికుండలో వండిన పప్పు, చారు రుచి మరో రకంగా
ఉండేవి.
పాడి కూడా మొత్తమంతా
మట్టి కుండలలోనే! నేలలో ఒక గుంత ఉంటుంది. దాని పేరు దాలిగుంత. అందులో పిడకలు వేసి, మీద ఒకటి రెండు
నిప్పు కణికలు వేసి, రాజుకున్న తరువాత పాల కుండ పెడతారు. మీద ఒక పీట పెడతరు. పాలు దినమంత అందులో
సన్నని సెగ మీద కాగి, కాగి చిక్కబడతయి. వాటి రంగు తెలుపు నుంచి మారిపోతుంది. పిడకల పొగ కారణంగా
వాటికొక చిత్రమయిన వాసన వస్తుంది. కిటుకు తెలిసినవారు అమర్చిన పిడకల వల్ల రాత్రి
వరకు వేడి పోతుంది. ఆ గుంటలోనే కుండలో తోడు పెడితే, తెల్లవారేసరికి చిక్కని కమ్మని పెరుగు సిద్ధం.
నిజానికి ఆ పాత్రను కుండ అనకూడదు. దుత్త, అటికె లాంటి పేర్లుంటాయి వాటికి. వెడల్పు మూతి, ఎత్తు తక్కువ కలిగిన
గిన్నెలాంటివవి! పెరుగును రాచ్చిప్ప (రాతి చిప్ప) లోకి మార్చిన తర్వాత, అడుగున పాత్రను
కౌచిప్ప (ఆల్చిప్ప)తో గోకాలి. మాడీ మాడని గోకు వస్తుంది. అమ్మ ఎప్పుడు ‘గోకు’
పెడుతుందోనని ఎదురుచూడడం గుర్తుంది.
ఇనుప బొచ్చెల కాలం
వచ్చింది. తిండిలో రుచి పోయింది. పొయ్యి తీరు మారింది. తిండి తిండి గాకుండ
పోయింది!
గొట్టికాయలు: పల్లెలో
ఆవులు, బర్రెలకన్న మేకలు ఎక్కువగ ఉండేవి. మేకలను పెంచడములోని ఇకనామిక్స్ నాకు తరువాత
గాని అర్థం కాలేదు. (ఎకనామిక్స్, ఎలెక్ట్రాన్, ఎలెక్ట్రిసిటీ లాంటి మాటలు ఇ అనే అక్షరంతో మొదలు
కావాలట తెలుసా!) మేక పాలు కొంత వాసన! కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. మా
ఎదురింటి రాములు వాండ్లకు బోలెడన్ని మేకలు. వారి దగ్గర జీతము చేసే ఒక పిల్లవాడు, పాలను సూటిగ నోటిలోకి
పిండుకుని తాగుతుంటే చూడడము మాకొక సరదా! గొర్లు (గొర్రెలు) మేకలను గుంపులుగ తెచ్చి
పంట పొలాలలో రాత్రి ‘మందలాపుతరు’. మందలుగా ఆపుతరని భావము. వాటి చుట్టు వల దడి.
కుక్క కావలి కూడ. మేకలు, గొర్లు రాత్రి మొత్తము అక్కడే నెమరు వేసి, మలమూత్రములను వదులతయి. అది పొలానికి బలము. ఎరువు!
ఎంత సులభమయిన, చక్కని పద్ధతి! ఇప్పుడంతా కృత్రిమమే!
మేకలు, గొర్లు సాధారణముగ
అడవిలోకి పోయి అక్కడ కనిపించిన చెట్లన్నిటినీ కరకర నమిలి తింటాయి. ‘మేక మేయని ఆకు’
అని ఒక చెట్టు, దాని ఆకులు ఉంటాయంటే చిత్రంగదూ! మిగతా మొక్కలు, చెట్ల ఆకులు, కాయలు, కొమ్మలన్నింటినీ అవి
హాయిగా తినేస్తాయి. అయితే, కొన్ని కాయలలోని గింజలను, అవి అరిగించుకోలేవు. కాయ లేదా పండులోని గువ్వము
(కండ) శుభ్రంగా అరుగుతుంది. గింజ అంత శుభ్రంగానూ మిగిలిపోతుంది. ఈ గింజలు, పెంటికలతో బాటు బయటకు
వస్తయి. వాటినే గొట్టికాయలు అనేవారు. చెట్టునుబట్టి అందులో రకాలు. నూనె
గొట్టికాయలు, నున్న గొట్టికాయలు గుర్తున్నయి. మిగతా వాటి రుచి మాత్రం గుర్తుంది. అంటే ఆ
గింజలను పగలగొట్టి లోపలి పలుకులను తిన్నామనే గద అర్థం! చాలా రోజులపాటు పల్లెలో
మేకలున్న ఇంటి పిల్లలకు, వారి దోస్తులకు ఇదొక కార్యక్రమం. లేచిన వెంటనే చెరువుకు
పోవాలె. అక్కడ ఒకటి, రెండు, పండ్లు తోముట ముగుస్తయి. తరువాత మేకల దొడ్డిలో గొట్టికాయల వేట! నిజం చెప్పాలి.
ఆ గింజల రుచి నాకు ఇవాళటికీ గుర్తుంది!
ఇసుర్రాయి: ఇసిరే
రాయి అని విగ్రహము. ఇసరడము అంటే విసరడము కాదు. రాయిని దూరానికి విసిరేస్తాము. కానీ
రెండు గుండ్రని రాతి పలకల నడుమ ధాన్యమును విసురుతాము. కింది రాతిలో నడుమ ఇనుప
బొడ్డు, పై రాతిలో మధ్యమధ్యన గింజలు నింపేందుకు రంధ్రాలు. ఒక చేతితో రాతిని తిప్పుతూనే
మరొక చేతితో గింజలు వేయడము ఒక నైపుణ్యత. పసుపు, చక్కెర కూడ ఈ పద్ధతిన ఇసరడము గుర్తున్నది. రొట్టెలు
ఎక్కువగ తినే వాండ్ల ఇండ్లలో ఇసుర్రాయిని నేలలో ఒకచోట పాతి ఉంచడము గుర్తున్నది.
కింది రాయి కదులుతుందన్న బాధ లేదన్నమాట. కరెంటు లేని కాలంలో ఇంటింటా ఈ ఇసిరే
చప్పుడు గంటల పాటు వినిపించేవి. దారితోబాటే కిష్టమ్మ పాడిన ‘వొస్తుంటి శెల్లెల!
వోగడ్డమాయె!’ అన్న జానపదం పాట గుర్తున్నది. ఇసరడము లాగనే పాట కూడ మహ సాగదీసి
నడిచేది! పాలమూర్లో యాపశెట్ల కాడ గిర్నీలు వచ్చినయి. అంటే వేపచెట్ల ప్రాంతంలో పిండిమరలు వెలిసినయని
గ్రహించవలసినది. వేపచెట్లు అన్నవి ఒక
ప్రాంతమని అర్థమయ్యే ఉంటుంది. జొన్నల వంటి గింజలు సంచులలో పోసుకుని పోయి, పిండి పట్టించుకుని
తేవడము కొందరికి అలవాటయింది. ఈ పేరున పాలమూరికి పోవచ్చు. నేను గూడ పోవాలని నాకు!
అమ్మ నవ్వేది. ఎందుకయ్యా నీకా నడక, మోత కష్టం? అనేది. అయినా ఒక శేరు జొన్నలు, దానికి గిర్నీ కూలి
అణాపైసలు సాధించి, మిగతా పిల్లలతో యాత్ర. అప్పట్లో అది సింద్‌బాద్‌కు మించిన సాహసయాత్ర!
కష్ట షకారం: ‘నాతో
మాట్లాడడమే ఎడుకేషన్’ అంటాడు గిరీశం (కన్యాశుల్కంలో). కొందరితో మాట్లాడితే
నిజంగానే బోలెడు కొత్త సంగతులు తెలుస్తాయి. పాషాణభేది గోపాలకృష్ణ గారు అట్లాంటి
మనుషుల్లో ఒకరని నిస్సందేహంగా చెప్పగలను. ‘ఎల్లమ్మకు ఎల్లయ్యకు పెండ్లంట.
ఎవరింట్లో వాండ్లకు విందంట!’ అని ఒక కవిత లాంటి మాట చెప్పా రాయన. దీనికి మూలం
తమిళంలో ఎక్కడో ఉన్న ట్టుంది. గోపాలకృష్ణగారు సిపి బ్రౌన్ గురించి పరిశోధించి
పుస్తకం రాశారు. స, శ, షలను గుర్తుంచు కునేందుకు బ్రౌన్ చెప్పిన సూత్రం ఒకటి ఆయనవల్లే నాకు
తెలిసింది. సులభ సకారం, శాంతి శకారం, కష్ట షకారం అని ఆ సూత్రం. మా అమ్మ పేరు శేషమ్మగారు. పల్లెలో అందరూ ఆమెను
సేసమ్మ అని మాత్రమే అనేవారు.
కన్యాశుల్కం
చదువుతుంటే షకారం గురించి ఇంకో సంగతి కనబడుతుంది. ఏమిటిష? అంటే ఏమిటట? ఏమిటిషలో షకారం ట
అన్న అక్షరానికి బదులుగా వచ్చిందని అర్థం. బాగా మాట్లాడుతున్నా మనుకుని విజయనగరం
ప్రాంతంలోని అలనాటి బ్రాహ్మలు అనవసరంగా షకారం వాడుకున్నారన్న మాట.
మన వాళ్లకు చాలా
మందికి స శ ష తేడా తెలియదు. పలకదు. మధ్య భారతం వారు ఈ విషయంలో మనకన్నా అన్యాయం.
వాళ్లకు ష పలకదు. లేక పలకరు. అన్నింటికీ మామూలు స వచ్చేస్తుంది. అచ్చమయిన ఇంగ్లీషు
స్టేషన్‌ను స్టేసన్ అంటారు. ఆ సంగతి వాళ్లకు తెలియదనుకోండి. మన నాయకులలో ఒకాయన బాగా మాట్లాడుతున్నా ననుకుని
అన్నీ షకారాలే పలుకుతుంటాడు. ఆయన బహుశా విజయనగరం వాళ్లను విన్నారని మీకనిపిస్తే
నేనేమీ చేయలేను. అచ్చంగా వాళ్లలాగానే ఈయన కూడా కేవలం బాగా మాట్లాడుతున్నానని
అనుకుంటారు. అంతే. పలకవలసిన చోట ష పలకదు. అనవసరమయిన చోట మాత్రం అది
వచ్చేస్తుంది. ‘కష్టం’ కదూ!
Saturday, February 14, 2026
Friday, February 13, 2026
గాలి గురించి - కొన్ని విశేషాలు - About the air around us!
గాలి గురించి - కొన్ని విశేషాలు
ప్రతి కుటుంబంలోను ఆ ఇంటివాళ్లకు మాత్రమే అర్థమయ్యే మాటలు, జోకులు కొన్ని ఉంటయి. మా ఇంట్లో కూడా మామూలుగానే మాటలు, జోకులు కొన్ని ఉన్నాయి. కొత్తగా తెలియని తిండి పదార్థం ఏదో ఒకటి ఒకనాడు బల్లమీదికి వచ్చినట్టుంది. మా అమ్మాయి ‘దీన్ని ఏమంటరు?’ అని అడిగింది. మామూలుగనే సరదాగ మాట్లాడే మా అబ్బాయి చటుక్కున ‘ఏమీ అనరు! తింటరు!’ అన్నడు. ఆ తరువాత మేము చాల సందర్భాలలో ప్రశ్న అడగకుండ తింటరు అంటూ తింటుంటము.
ఏదో కొత్త వస్తువు ఎదురుగ వస్తుంది.
ఒకప్పుడయితే, దీన్ని దేనితో చేసినరు అని అడగడం అలవాటు.
చాలకాలం వరకు మనిషి చేసిన వస్తువులన్నీ లోహం, కర్ర లేదంటే రాయిలాంటి వాటితో తయారయ్యేవి. మధ్యలో పింగాణి వచ్చింది. ఆ తరువాత
చూస్తుండగానే ఫైబర్ గ్లాస్ వచ్చింది. బేకలైట్ వంటి రకరకాల కాంపోజిట్ బోర్డులు
వచ్చినయి. ఇక వచ్చిన వేలాది ప్లాస్టిక్‌ల గురించి వేరుగ చెప్పుకోవలసి ఉంటుంది.
మొత్తానికి ఎదురుగ వచ్చిన వస్తువు ఏ రకమయినది అని అర్థం చేసుకోవడానికి అందరూ తికమక
పడిపోతున్నరు. చేతికందిన సీసా లేక గ్లాసు ఎలాంటిది తెలుసుకోవాలంటే ఒకతను సూది
కాల్చి గుచ్చి చూడమన్నడు. ప్లాస్టిక్ అయితే కాలి రంధ్రం పడుతుంది మరి. ఎవరు
మాత్రం కావాలని తన వస్తువులో రంధ్రాలు పొడుచుకుంటరు? కనుక పాత్ర సంగతి అర్థంకాకుండనే ఉండిపోతుంది. కొత్తగ కొన్న గుడ్డ కృత్రిమంగ
తయారయిందా లేక సహజంగా పండిన పత్తినుంచి వచ్చిందా తెలుసుకోవాలంటే దానిలోని ఒక చివరన
నిప్పు పెట్టిచూడాలె. ప్రపంచం ఇట్లాగయ్యింది.
చేతికి ఏదో అంటుకుంటుంది. మరోవేలితో ముట్టుకుని
చూస్తే అది జిగురుగ ఉంటుంది. ‘శాణకు మూడుచోట్లు’ అని మాకొక మాట ఉంది. అంటిందేదో మొదటిచోటు.
కంటిముందు పెట్టుకుంటే రెండవచోటు. దాని వాసన కూడా చూస్తే మూడవచోటు. ఇక చివరికి ఆ
అంటిన వస్తువు అసహ్యమయినదని తెలిస్తే అప్పుడు అసలు బాధ మొదలవుతుంది. దాన్ని
వదిలించుకోవాలె. అందుకోసం సబ్బు వాడాలె. అన్నట్టు ఏం చేసి సబ్బు ఒంటికి అంటిన
మకిలిని వదిలిస్తుంది? ఈ ప్రశ్నకు జవాబు అడగకుండనే అందరూ సబ్బును
వాడుకుంటున్నరు. కొందరు సబ్బు కూడ వాడకుండా అదేపనిగ కేవలం నీళ్లతోనే ముఖాన్ని
రుద్దేసుకుంటరు. నిజానికి సబ్బు అణువుకు రెండు కొండ్లు అంటే కొక్కాలు ఉంటయి.
వాటిలో ఒకటి నీటి అణువును పట్టుకుంటుంది. మరొకటి చమురు అణువును పట్టుకుంటుంది. ఈ
రకంగా సబ్బు అణువు చమురును పట్టుకుని, నీటితో తేలుతూ
చేతినుంచి లేదా గుడ్డనుంచి దూరం పోతుంది. అంటినది చమురు కాకుంటే సబ్బుతో కూడ
వదలదని అర్థం.
ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న పదార్థాలలో గాలి
విచిత్రమయినది. పుట్టిన మరుక్షణం నుంచి చచ్చేవరకు మనం గాలి పీలుస్తనే ఉంటము. గ్రహం
చుట్ట గాలిలేకపోతే మనం ఇట్లాగ ఉండగలిగే వాళ్లం కాదు. వాతావరణం అంటే చుట్టుకున్న
గాలి అని అర్థం. ఇంత ముఖ్యమయినది అయినా గాలి గురించి ‘ఇది దేనితో తయారయింది?’
అని మాత్రం అడగకుండనే మనమంతా దాన్ని పీల్చేసి బతుకుతున్నము.
మనం ఒక్కసారి గాలి పీలిస్తే, అందులో అప్పటివరకు బతికిన మనుషులందర ఒక్కొక్కరు వదిలిన ఒక్క
అణువయినా ఉంటుందట. మరింత గట్టిగ లెక్కచెప్పాలంటే ఇప్పటికి పుట్టి గిట్టిన వాళ్లందరు,
ప్రస్తుతం బతికి ఉన్న వాళ్లలో కనీసం ఆరేళ్ల వయసు గలవాళ్లందరు
ప్రపంచం మొత్తంమీదట పీల్చి వదిలిన గాలిని మనం ప్రతి శ్వాసలోను పంచుకుంటమట. ఒకరు
వదిలిన గాలి మొత్తం భూమి వాతావరణంలో వ్యాపించి కలవడానికి ఆరు సంవత్సరాలు పడుతుంది.
కనుకనే ఈ లెక్కలో ఆరేళ్ల కన్న చిన్న పిల్లలను చేర్చలేదని అర్థం చేసుకోవాలె. మనకు
ఆరేళ్లు నిండిన నాటినుంచి మనం వదిలిన గాలిలోని ఒక్కొక్క అణువును ఈ ప్రపంచంలోని
వారంత అణుక్షణం పీలుస్తున్నరని వేరుగ చెప్పనవసరం లేదు. గాలి గురించి ఒక్కసంగతి
చెపితేనే బుర్రతిరిగి పోయే తీరుగ ఉంది. ఇంకా లోతుకు వెళితే ఎన్నెన్ని ఆశ్చర్యాలు
ఎదురవుతయో తెలియదు.
పరిణామం జరుగుతుంటే ఒకప్పుడు కొన్ని జంతువులు
మొప్పల పద్ధతిని పక్కనబెట్టి ఊపిరి తిత్తులతో నేరుగ గాలి పీల్చడం మొదలయింది.
అప్పటి నుంచి ఈ గాలి పంపకం జరుగుతునే ఉన్నది. ఇప్పటి మనలాగే అప్పటినుంచి ఎవరూ గాలి
గురించి పట్టించుకోలేదు. సుమారు ఓ వందేళ్ల క్రితం మాత్రం ఇద్దరు పరిశోధకులు ఈ
విషయంగా బుర్రలు చించుకున్నరు. కనిపించని గాలి గురించి కనిపించని అంశాలను
తెలుసుకోవాలని ప్రయత్నించినరు. అయినాసరే వాళ్లు కనుగొన్న సంగతులు ఎవరికీ
పట్టకుండనే ఉండిపోయినయి. వాతావరణం గురించి మనం పట్టించుకోము. ఈ వాతావరణం లేకుంటే
మనం బతకలేము. కానీ జీవం పుట్టిననాటి నుంచి వాతావరణం ఒకేరకంగ కాకున్నా ఉండను మాత్రం
ఉంటున్నది. మన ప్రాణాలను ప్రశ్నలడగకుండ
అది నిలబెడుతనే ఉన్నది. అయితే మామూలుగ జరిగే ఏ విషయాన్ని మనిషి ప్రశ్నించడు.
సూర్యుడు రోజూ కనిపిస్తడు. కనుక అందులో ఆశ్చర్యం లేదు. అనుక్షణం గాలి పీలుస్తము.
కనుక అందులో ఆశ్చర్యం లేదు. సూర్యుడు కనిపించని రోజున కనీసం వెలుగు కనిపిస్తుంది.
గాలి మామూలుగా లేనిచోట్ల కూడా ఏదో గాలి ఉండనే ఉంటుది. కనుక మనకు వాటి సంగతి
పట్టదు.
ఇప్పుడు గాలి గురించి మరొక విచిత్రమయిన సంగతి
చెపితే ముక్కున వేలు వేసుకుంటరో, పక్కకు తిరిగి
కనుబొమ్మలు ఎగరేస్తరో మీ ఇష్టం. పుట్టిన నాటినుంచి ఊపిరి ఆగేవరకు అంటే ప్రాణం పోయేవరకు
మనం పీల్చేగాలిలో మనకు ఏ రకంగాను పనికిరాని నైట్రోజన్ అనే నత్రజని ఎక్కువగ
ఉంటుంది. చుట్టూ ఉన్న గాలిలో మరి ఆ వాయువు 78 శాతం ఉంటుంది. అంత నత్రజనిని ఊపిరితిత్తులలోకి పీల్చినా మనకు అపాయం మాత్రం
జరగదు. దానివల్ల సాయం జరగకపోతే అది వేరే సంగతి. దూరం నుంచి వినిపించే పాటలాగ అది
చికాకు కాదు, పనికి వచ్చేది అంతకన్నా కాదు.
గాలిలో ఇంచుమించు అయిదో భాగం వరకు ప్రాణవాయువు
అనే ఆక్సిజన్ ఉంటుంది. ఈ పేరు వినిపించగానే మన ప్రాణాలకు అదే ఆధారం అని అందరూ
భుజాలు ఎగరేస్తరు. మూలకాలలో అన్నిటికన్నా ఎక్కువ ప్రచారం ఉన్నది ప్రాణవాయువేనేమో.
ఈ మధ్యన ఆక్సిజన్‌ను అంగళ్లలో అమ్ముతున్నరట కూడా. కాలుష్యం కారణంగ సాయంత్రం కల్ల
అలసటకు గురయిన వారు ఆక్సిజన్ బార్లకు చేరి అక్కడ కాసేపు శుభ్రమయిన వాయువును
పీల్చి తేరుకుంటున్నరు. ఈ విశ్వంలో అన్నిటికన్న ఎక్కువగ ఉండే మూలకాలను లెక్కబెడితే
ఆక్సిజన్ మూడవ స్థానంలో వస్తుంది. అది మన భూగ్రహం మీద మరింత ఎక్కువగ ఉంటుంది. మరింత
చిక్కగనూ ఉంటుంది. ప్రాణవాయువు ప్రతి మూలన ఉంటుంది. చివరికి మరే వాయువుకు వీలులేని
చోట కూడా ప్రాణవాయువు దూరి చేరుకుంటుంది. ప్రతి ఇసుక కణానికి ప్రాణవాయువు
చుట్టుకుని ఉంటుంది. ప్రాణవాయువు కారణంగనే మన శరీరాల వయసు పెరుగుతున్నది అంటే
నమ్మగలరా.
ఈ విశ్వంలో ఇంతగా ప్రాణవాయువు నిండుకున్న
వాతావరణంగల నిర్మాణం భూమికాక మరొకటి లేదు. విశ్వంలోని మరే గోళంమీద చెట్లు లేవు.
చెట్లు ప్రాణవాయువును వదులుతయని మీకు తెలిస్తే సంతోషం. తెలియకుంటే తెలుసుకోవాలె.
చెట్లున్నయి కనుకనే భూవాతావరణంలో చిక్కగ ప్రాణవాయువు నిండి ఉంది. దూరంనుంచి చూస్తే
ప్రాణవాయువు నుంచి ఒక రకమయిన ఆకుపచ్చని వెలుగు విరజిమ్ముతుంది. విశ్వంలోని
అణువులకన్న చిన్న కణాల తాకిడి కారణంగా వాయువు ఈ రకంగ వెలుగుతుంది. ఈ రకమయిన
ఆకుపచ్చ వెలుగు విశ్వంలో మరెక్కడయినా కనిపిస్తే అక్కడ కూడా భూమి మీదలాంటి జీవం
ఉండవచ్చునని సులభంగా ఊహించవచ్చు. విశ్వంలో చెట్లు ఎక్కడ ఉన్నా ఈ రకమయిన వెలుగుతో
తమ ఉనికిని ప్రకటించుకుంటాయని చెప్పవచ్చు.



