I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Monday, October 19, 2026
Saturday, August 8, 2026
మంచు కురిసింది - ఐజక్ బషేవిష్ సింగర్
మంచు కురిసింది
ఐజక్ బషేవిష్ సింగర్
ఛెల్మ్ అన్నది
వెర్రివాళ్ల ఊరు. అక్కడ పెద్దా చిన్నా అంతా
గొప్పవాళ్లే. ఒక రాత్రి అక్కడ ఎవరికో
నీళ్ల తొట్టిలో చంద్ర బింబం కనిపించింది. చంద్రుడు ఆ తొట్టిలో పడిపోయాడని
చూచినవాళ్లు అనుకున్నారు. తొట్టిమీద గట్టిమూత పెట్టి,
మరు రోజు సంగతి చూడాలి అనుకున్నారు. పొద్దున్న మూత తీసి
చూస్తే, చంద్రుడు లేడు! ఎవరో దొంగిలించి
ఉంటారని తేల్చుకున్నారు. పోలీసులను పిలిచారు. కానీ దొంగ దొరకలేదు. ఛెల్మ్వాళ్లంతా
చాలా బాధపడ్డారు.
ఒకసారి,
పండగరోజుల్లో సాయంత్రం మంచు కురిసింది. ఊరు ఊరంతా
వెండిగుడ్డ కప్పినట్టు అయ్యింది. చంద్రుడు వచ్చాడు. నక్షత్రాలు మిలమిలమన్నాయి.
కురిసిన మంచు ముత్యాలు, రత్నాలలాగ మెరిసిపోయింది.
ఛెల్మ్లో అక్కడి
పెద్దమనుషుల సంఘం అందరికన్నా తెలివి గలవాళ్లు. వాళ్లు ఊళ్లో అందరికన్నా ఎక్కువ
వయసు గలవారు. వాళ్లదే అక్కడ అధికారం. పెద్దలకంతా పెద్ద గడ్డాలు ఉంటాయి. మరీ
ఆలోచిస్తారు గనుక నుదుళ్లు కూడా వెడల్పుగా ఉంటాయి. ఆ సాయంత్రం ఏడుగురు పెద్దలు ఒకచోట చేరి ముఖం
మీద ముడతలు పడేటట్లు ఆలోచన మొదలు పెట్టారు. ఛెల్మ్కు నిధులు కావాలి. ఎట్లా
సంపాయించాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా గ్రోనామ్ ఆక్స్ గట్టిగా అరిచాడు. అందరూ
ఆశ్చర్యపడేట్లు అతను ‘మంచు అంతా వెండి!’ అంటూ అరిచాడు.
'నాకు మంచులో ముత్యాలు
కనపడుతున్నాయి!’ అన్నాడు ఇంకొకాయన.
'నాకు ఏకంగా రత్నాలే
కనపడుతున్నాయి!’ మూడవ పెద్దాయన అరిచాడు.
మొత్తానికి ఛెల్మ్
పెద్దలకు తమ ఊళ్లో నిధి వర్షంగా కురిసిందని తెలిసిపోయింది. అంతలోనే వాళ్లకు చింత
కూడా మొదలయింది. ఛెల్మ్లో అందరూ రాత్రిపూట తిరుగుతూ ఉంటారు. నిధిని వాళ్లు
కాళ్లతో కసపిసా తొక్కుతారు. మరి ఏం చెయ్యాలి? ఒక పెద్దమనిషికి ఆలోచన రానే
వచ్చింది.
'అన్ని ఇళ్లకు వార్త
పంపిద్దాము. ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలని చెబుతాము. వెండి,
ముత్యాలు, రత్నాలను ఏరిన తరువాతే రావాలని
ప్రకటిస్తే సరి’.
పెద్దలకంతా మాట బాగా
నచ్చింది. అందుకే అరచేతులు రుద్దేసి ఆ సంగతి తెలియజేశారు. అప్పుడు మత్తు
లెకిష్ మరో మాట అన్నాడు. ‘వార్త అందించే
మనిషి మరి నిధిని తొక్కుతాడు కదా' అన్నాడు.
లెకిష్ మాట సత్యమని
పెద్దలకు అర్థమయింది. మళ్లీ నుదుట ముడతలు పడేట్టు ఆలోచనలు మొదలయ్యాయి.
'తోచింది!’ అన్నాడు
గ్రోనామ్ ఎద్దు. ‘చెప్పు మరి’ అడిగారు అందరు.
'వార్త మనిషి నడుస్తూ
వెళ్లకూడదు. అతగాడిని ఒక బల్లమీద పెట్టి పంపితే, అతను మంచును
తొక్కడు!’
గ్రోనామ్ చాలా
తెలివిగలవాడు. ఆ తెలివికి సంతోషించి పెద్దలందరూ ఈసారి చప్పట్లు చరిచారు.
వెంటనే గింపెల్ కోసం
వంటశాలకు పంపించారు. కుర్రవాడు వచ్చాడు. వాడిని ఒక బల్లమీద ఎక్కించారు. మరి ఆ బల్ల
ఎట్లా కదులుతుంది? వంటశాలలో వంటాయన ట్రైటెల్,
దుంపచెక్కులు తీసే బెరెల్, సలాడ్ కలిపే యూకేల్,
యోంటెల్ అక్కడే ఉన్నారు. వాళ్లంతా మేకలకు మేత వేస్తున్నారు.
ఆ నలుగురూ కలిసి గింపెల్ ఎక్కిన బల్లను ఎత్తుకుపోవాలని నిర్ణయించారు. వాళ్లు
బల్లకాళ్లు తలొకరూ పట్టుకున్నారు. గింపెల్ చేతిలో కర్రసుత్తి పట్టుకుని
నిలబడ్డాడు. దానితో అతను ఇళ్ల కిటికీల మీద కొడతాడు. ఇక అందరూ బయలుదేరారు.
ప్రతి ఇంటి కిటికీ
మీద సుత్తెతో కొట్టి గింపెల్ ‘ఈ రాత్రి
ఎవరూ ఇంట్లోనుంచి బయటకు రాకూడదు. బయట నిధి కురిసింది. దాన్ని తొక్కకూడదు’ అని
చెప్పసాగాడు.
ఛెల్మ్లో వాళ్లకు
పెద్దలమీద గౌరవం ఎక్కువ. అందుకే ఎవరూ ఇళ్లలో నుంచి బయటికి రాలేదు. ఇక అక్కడ
పెద్దలు మాత్రం నిధిని సేకరించడం గురించి, దాన్ని వాడడం గురించి ఆలోచనలో
ఉన్నారు. నిధిని అమ్మి, బంగారు గుడ్లు పెట్టే బాతును కొంటే
బాగుంటుందని ఒక పెద్దాయన చెప్పాడు. ఇక ఒకరోజు కాదు, నిత్యమూ నిధి
దొరుకుతుంది.
మత్తు లెకిష్కు మరో
ఆలోచన వచ్చింది. ఛెల్మ్లో వాళ్లకంతా కళ్లజోళ్లు కొని ఇవ్వాలి. ఇక ఇళ్లు,
వీధులు, దుకాణాలు అన్నీ పెద్దవిగా
కనిపిస్తాయి! ఛెల్మ్ మొత్తం పెద్దదిగా కనిపిస్తే మరి పెద్దదే అవుతుంది. అది పల్లె
పోయి పట్నం అవుతుంది.
ఇంకా మంచి మంచి
ఆలోచనలు వచ్చాయి. అవి కొనసాగుతుండగానే ఉదయం కూడా వచ్చింది. సూర్యుడు వచ్చాడు.
పెద్దలంతా కిటికీలోనుంచి బయటకు చూచారు. ఆశ్చర్యం. కురిసిన మంచును ఎవరో కసకసా
తొక్కనే తొక్కారు. ఎవరని చూస్తే,
బల్ల మోసిన నలుగురి కాళ్లు అని తెలిసింది.
ఛెల్మ్ పెద్దలు తమ
తెల్లగడ్డాలు పట్టుకుని పీక్కుంటూ, తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఆ
నలుగురినీ నడిపించకుండా వాళ్లను ఎత్తుకుని పొమ్మని మరో నలుగురికి చెబితే
బాగుండునేమో అనుకున్నారు!
మళ్లీ పండుగకు మళ్లీ
నిధి కురిస్తే అప్పుడయినా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటినుంచే నిశ్చయించుకున్నారు.
ఛెల్మ్లో వాళ్లకు
నిధి మిగలలేదు. కానీ, మళ్లీ సంవత్సరం అది కురుస్తుందని ఆశ
మాత్రం మిగిలింది. పెద్దలు చెప్పిన మాట ఎప్పుడూ తప్పు పోదుకదా!
Sunday, July 19, 2026
దారి దోపిడీ : మారూన్ అబ్బూద్
దారి దోపిడి
మారున్ అబ్బూద్ (లెబనాన్)
బూ ఖట్టర్ దుమ్ము కొట్టుకుని, జుట్టు, గుడ్డలు రేపుకుని
ఇంటికి తిరిగి వచ్చాడు. రైఫిల్ ను దాని స్థానంలో వెళ్ళాడదీశాడు. పిస్టల్ పక్కనే
ఉన్న గూట్లో పెట్టాడు. చొక్కాలో, జేబుల్లో, పటకాలో దాచుకున్న
వస్తువులను షెల్ఫ్ లోని బండమీద బోర్లించాడు. కాళ్లు ముడుచుకుని కూచున్నాడు. పొయ్యి
పక్కనే అతను మామూలుగా కూచునే స్థలం అది.
భార్య బర్ సిత్తా ఒక జగ్, ఒక పళ్లెం తీసుకుని వచ్చింది. అతను
అక్కడే తల వెంట్రుకలు, ముఖం కడుక్కోసాగాడు. అయితే అంత సేపు అతను
మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పుడప్పుడు ఆపి ఆమెను ఒక ప్రశ్న అడుగుతాడు. ముఖం మీద
నరుగును పట్టించుకోడు. పైకి చూస్తే, అది అతని కళ్ళలోకి
పోయి మండుతుంది. కళ్ళు మూసుకుని మళ్లీ తెరుస్తాడు. మాటలు ఆగకుండానే, కళ్ళు మాత్రం
మామూలు కావాలి మరి. అట్లా చాలా సేపు అతను మాట్లాడాడు. బర్ సిత్తా నీళ్ళు పోయడంలో
కొంత పొరపాటు జరిగితే, అతను ఒళ్లంతా కదుపుతూ కేకలు వేస్తాడు. అంతలోనే
తప్పు చేశానని తెలుసుకొని, క్షమా ప్రార్ధనలు మొదలు పెడతాడు. ముఖం తుడుచుకుంటూ కూడా
అతను మాట్లాడుతూనే ఉన్నాడు. సమాధానం గురించి పట్టించుకోడు. అందుకోసం ఎదురు చూడడు
కూడా. ఇక మీసాలు మెలిపెట్టే సమయం వచ్చింది.. జానపద కథలో ఒకతనిలాగా అతను వాటిని
సర్దుకుంటాడు. అప్పుడు నిశ్శబ్దంగా ఉండవలసిన అవసరం ఉంటుంది.
కొంతసేపు తరువాత కుటుంబం అంతా ఎత్తు ఉండని భోజనాల బల్లచుట్టూ చేరుకున్నారు.
ఒక్కొక్కరికి ఒక పెద్ద రొట్టె, మడతపెట్టిన చేతిగుడ్డలాగ ఉండేది,
అందింది. దాన్ని వాళ్లంతా తొడ మీద పెట్టుకుంటారు. తిండి తినే సమయంలో మాట్లాడడానికి
తండ్రి అనుమతించడు. ఎవరయినా ఒక ప్రశ్న అడిగితే, సూటిగా జవాబు అందుతుంది.
మిగతావాళ్లంతా తమ భోజనంమీద మాత్రమే దృష్టిపెట్టాలి. ఒక గిన్నెలో అత్తిపళ్ళు, లేదా మొలాసెస్
ఉంటాయి. అక్కడ మాత్రం చేతులు కలిసే అవకాశం ఉంటుంది.
తిండి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పిన తర్వాత బూ ఖట్టర్ సలహాలు, నియమాలు చెబుతాడు.
ఆరోజు జరిగిన తప్పుల గురించి చెబుతాడు.(బూ అంటే అబూ, అంటే తండ్రి.) ముందు
భార్యకు, తర్వాత పిల్లలకు. చివరకు అతను తన ఇద్దరు సేనానాయకుల వేపు తిరుగుతాడు. వాళ్లే
అతని కొడుకులు. వాళ్ల పేర్లు ఖట్టర్, షల్హూబ్. పనిచేయవలసిన పద్ధతి
చెబుతాడు. ఆనాడు వాళ్లు ఏదైనా పొరపాట్లు చేసిఉంటే వాటిగురించి విమర్శ
వినిపిస్తాడు.
‘నువ్వు వెనకనుంచి
అతని వద్దకు వెళ్లావు. ముందు నుంచి వెళ్లి ఉండవలసింది. సొమ్మంతా యిమ్మని అడిగి
వేచి ఉన్నావు. అతడిని ఆశ్చర్యంలో ముంచెత్తితే మరింత బాగుండేది. అతడిని కొట్టి
ఉండాలి. కనీసం గట్టిగా అరచి ఉండాలి. చచ్చేట్టు భయపెట్టి ఉండాల్సింది. ఇక షల్హూబ్, నీ సంగతి’ అతను కొనసాగించాడు. ‘నేను చెప్పినట్టు
నాలుగు దారులు కలిసే చోట నిలబడితే, ఆ పందిగాడు తప్పించుకుపోయేవాడు
కాదు. వాడి దగ్గరే డబ్బంతా ఉందని పందెం వేయవచ్చు. పోనీ లే, ఇప్పుడు అనుకుని
లాభంలేదు. మళ్లీ అవకాశం వస్తుంది. అప్పుడన్నా జాగ్రత్తగా ఉండు.
ఇవాళ ఏమీ కలిసి రాలేదు, అన్నాడు అతను భార్యవేపు తిరిగి. మా మీద నీకు కోపం
వచ్చి ఉండాలి. ఉమ్ ఖట్టర్ మెల్లగా నవ్వింది. (ఉమ్ అంటే అమ్మ అని అర్థం). బూ ఖట్టర్
మరేవో విషయాల గురించి మాట్లాడాడు. నిట్టూర్చాడు. ప్రార్థనకు సిద్ధం కండి, అన్నాడు. అంతా
మోకరిల్లారు.
అతను నిటారుగా స్తంభంలా లేచి నిల్చున్నాడు. కొడుకుల్లో ఒకడు మోకరిల్లిన తీరు
పద్ధతిగా లేదు. వాడిని వెళ్లి పొమ్మ న్నాడు. తండ్రి, పెద్ద కొడుకుల
నాయకత్వంలో ప్రార్థన జరిగింది. కన్నెమాత ప్రార్థన అయింది. బూ ఆమెకు జయం అంటూ, హెయిల్ మేరీ
చెప్పాడు. మరుసటి రోజు అదృష్టం కలిగించమని ఆమెను ప్రార్థించాడు.
అతనిక నేరుగా పడక చేరుకున్నాడు.
వెల్లకిలా పడుకున్నాడు. దుప్పటి కప్పుకుంటూ ‘బర్ సిత్తా!’ అని పిలిచాడు. ‘మాకోసం రేపు
మధ్యాహ్నానికి తిండి కట్టి ఉంచాలి. శుక్రవారం మధ్యాహ్నభోజనం! మరువ వద్దు. ఆలూ
ఉడికించి పెడితే చాలు. కొంచెం సేపు తర్వాత దండు మీదనుంచి తల పైకి ఎత్తాడు. నా
ప్యాంట్ కూడా చిరిగింది. విన్నావా? ఏమంటావు? నా కోటు
పిగిలిపోతున్నది. వాడు కనిపించాలి గాని! ఈసారి వదలను’ గొణుగుతున్నాడు.
దుప్పటిలో కొంతసేపు మాత్రమే గడిచింది. ముడతలు పడ్డ బట్టతల మళ్లీ బయటకు
వచ్చింది. ‘కత్తులు సానపెట్టండి. తుపాకులు శుభ్రం చేయండి.
తుపాకీ మందు ఆరబెట్టండి. మళ్లీ ఇవాళ వలె జరగకూడదు’ అన్నాడు కొడుకులతో.
ఆశ్చర్యంగా ఉమ్ ఖట్టర్ ‘ఏమిటి సంగతి?’ అన్నట్టు సైగ
చేసింది. తండ్రి నిద్రపోయేదాకా ఆగమని కొడుకు సైగ చేశాడు. కొంతసేపు తర్వాత అబ్బాయి
వివరించాడు. ‘ఇవాళ ఇద్దరు మనుషులు దొరికారు. ఒకడిని దోచాము.
రెండవ అతను తప్పించుకుపోయాడు. అతను మంచి ధైర్యం, ఉత్సాహం గల యువకుడు.’
అబ్బాయి ఒక వెండి ఉంగరం చూపించాడు. దానిమీద అక్షరాలు చెక్కి ఉన్నాయి. దాన్ని
చూడగానే తల్లి ముఖంలో కోపం కనిపించింది. అది పాపం ప్రియురాలికి కానుకగా
చేయించింది. ఎలా దొంగిలించారు? అన్నది. ఖట్టర్ తండ్రి వైపు
చూపించాడు. ‘నాకు కాదు. ఆయనకు చెప్పు’, అన్నాడు. ‘నేను కాదంటే, జాలి గురించి చెబితే, కోపగించుకుంటాడు, తిడతాడు. ఏదో అడ్డు
చెపుతావు. వాళ్ల పెద్దలు పాడుగాను! మన పని మనం చేయాలి’ అంటాడు. అది అబ్బాయి వివరణ.
త్వరలోనే ఇల్లు ప్రశాంతమయింది. బూ ఖట్టర్ గురకలు మాత్రం లయగా పడి
లేస్తున్నాయి. అతను నిద్రలో మాట్లాడుతున్నాడు. ఎవరినో భయపెడుతున్నాడు.
లొంగిపొమ్మంటున్నాడు. ‘సోదా చెయ్యి!’ అని కొడుకుకు చెబుతున్నాడు.
అతను మామూలుగానే ఉదయాన్నే లేచాడు. చాలాసార్లు క్రాస్ చేసుకున్నాడు. పడకలోనే
కన్నెమాత ప్రార్థనలు చేశాడు. అది చాలాకాలం సాగుతుంది. తప్పులు క్షమించమని ఆమెను
ప్రార్థిస్తాడు. క్షమాపణలు చెబుతాడు. దొరికిన సొమ్ములో పావుభాగం యిస్తానని
మొక్కుకుంటాడు. చర్చ్ లో షాండెలియర్, ఒక కొవ్వొత్తి స్టాండ్, ధూపం లేదా
కొవ్వొత్తులు ఇస్తానని మొక్కుకుంటాడు. నిజంగా మంచి లాభం దొరికితే ఏకంగా పోత గంట
చేస్తానంటాడు.
గంటసేపు ప్రార్థనలు సాగిన తర్వాత వాళ్లు దారిలో తమ మామూలు చోటుకి చేరుకుంటారు.
తిండి మూట పట్టుకుని కడగొట్టు కొడుకు చివరన వస్తున్నాడు.
బూ ఖట్టర్ తన జపమాల తేవడం ఎన్నడూ మరిచిపోడు. అతని జపం జరుగుతూనే ఉంటుంది. ఒక
పూస తప్పినట్టు అనుమానం వస్తే చాలు, మళ్ళీ లెక్కింపు మొదటికి చేరుతుంది.
ప్రార్థన లెక్క చక్కగా ఉండాలన్నది అతని కోరిక. అందులో పొరపాట్లు ఉండకూడదు. మరి
అనుగ్రహం అందే దారి మరొకటి గాని ఉందా?
అతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. విధి తన ముందుకు ఇవాళ ఎవరిని పంపుతుంది, అని
ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నాడు. అంతలో ప్రార్థన గంట మోగింది. అతను క్రాస్
చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళనందుకు క్షమాపణలు చెప్పుకున్నాడు. మనసులో మాత్రం తాను
అక్కడే ఉన్నట్టు భావించాలి, అని వేడుకున్నాడు.
సూర్యోదయం సమయానికి తన మాటు దగ్గరకు చేరుకున్నాడు. పూజ గంట అదేపనిగా
మోగుతున్నది. ఫెజ్ టోపీని నుదురు మీదనుంచి కొంచెం వెనుకకు కదిలించాడు. భూమి మీద
మోకరిల్లాడు. కొడుకులతోబాటు, ప్రార్థన సాగించాడు. మళ్లీ అంతా పొంచి ఉన్నారు.
నిత్యం సంపాదన కొరకు ఎదురు చూస్తున్నారు. వర్జిన్ కనికరిస్తుందని బూ ఖట్టర్ కు
నమ్మకంగా ఉంది.
ఎవరో పాడుతూ రావడం వినిపించింది.
బూ ఖట్టర్ ఇద్దరు కొడుకులను సిద్ధంగా ఉండమని సైగ చేశాడు. వస్తున్న మనిషి
భద్రంగా ఉన్నానని సంతోషంగా ఉన్నాడు. చేతిలో జపమాల పట్టుకుని ప్రార్థన చేస్తున్న
మనిషి అతనికి కనిపించాడు. గతుక్కుమన్నాడు అతను. భయం అతనికే ఆశ్చర్యం కలిగించింది.
కనిపించిన మనిషి ప్రార్థనలో ఉన్నాడు. ధైర్యం నటిస్తూ అతను నమస్కారం చేశాడు
గౌరవంగా. బూ ఖట్టర్ తన ఎర్రని ఉబ్బిన కళ్ళతో కోపంగా చూచాడు.
ఆ చూపులను తప్పించుకుని అతను ముందుకు నడుస్తున్నాడు. జపమాల పైకెత్తి బూ ఖట్టర్
ఆగమని సైగ చేశాడు. అతను పట్టకుండా నడిచి పోతున్నాడు. ‘చూడూ! తరువాత బాధపడే పని ఏది నా చేత చేయించకు. నా ప్రార్థన ముగియనీ!’ అతను గట్టిగా అన్నాడు.
తాను అతని చేతికి చిక్కిపోయినట్టు ఆ మనిషికి అర్థమయింది. అతనే! అనుకున్నాడు ఆ
వ్యక్తి.
బూ ఖట్టర్ ప్రార్థన సాగించాడు. వ్యక్తి వేచి ఉన్నాడు. చివరకు దగ్గరకు వచ్చాడు.
వేలెత్తి చూపిస్తూ, ‘ఉన్నదంతా వలిచి
ఇచ్చేయ్!’ అన్నాడు బూ ఖట్టర్.
‘నా దగ్గర ఏమీ లేదు.
బూ ఖట్టర్’
‘నీ దగ్గర ఏమీ లేదా? నేను బూ ఖట్టర్ అని
ఎవరు చెప్పారు?’
‘నేను గుర్తుపట్టాను’
‘దేవుడు నీ కళ్ళు
పోగొట్టా! సరే, ఉన్నదంతా ఇచ్చేసెయ్!’
‘పిల్లల కొరకు పిండి
కొందామని పది మజీదులు అరువు తెచ్చుకున్నాను.’
‘దేవుడు నీకు మళ్ళీ
యిస్తాడు గాని, అవి ఇచ్చేయ్!’
‘నన్ను వాటిని
ఉంచుకోనీ, కన్నెమేరీ పేరున!’
బూ ఖట్టర్ తల ఊపాడు. డబ్బు యిమ్మని సైగ చేశాడు.
బోలెడంత ఏడుపు, అరుపు, వేడుకోలు తరువాత మేరీమాత పేరున
డబ్బు పంచుకోవడానికి బూ ఖట్టర్ సరేనన్నాడు. జరగవలసిన దాంట్లో సగమే జరిగిందన్న
సంతృప్తితో ఆ మనిషి గొణుగుతూ వెళ్ళిపోయాడు.
బూ ఖట్టర్ డబ్బుతో క్రాస్ చేసుకున్నాడు. తర్వాత జేబులో వేసుకున్నాడు. ‘ఏం బోనీ!’ అన్నాడతను పవిత్రంగా.
కన్నెమేరీని ప్రార్థిస్తూ అతను ఆకాశం వైపు చూచాడు. ‘నీ కళ్ళ కోసమే అతనిమీద దయ చూపించాము. మరి మాకు ఏదో
ఇవ్వు’, అన్నాడతను.
గాడిదలను అదిరిస్తూ కొంతమంది రావడం కనిపించింది. ధరల గురించి, వాతావరణం గురించి, మరెన్నో సంగతుల
గురించి వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ‘అదిగో మన అదృష్టం, వస్తున్నది’ అన్నాడు బూ ఖట్టర్ కొడుకులతో. ‘బోలెడంత మంది ఉన్నారు’ అని కూడా అన్నాడు.
ఖట్టర్ రైఫిల్ సిద్ధం చేశాడు. షల్హూబ్ కత్తి తీశాడు. శత్రువు ఎదుట ఉన్నట్టే
దాన్ని ఎత్తి పట్టుకున్నాడు.
గాడిదలను తోలుతూ ముగ్గురు మనుషులు ఉన్నారు. బూ ఖట్టర్. గట్టి కేక వేశాడు. అది
నదిలో ప్రతిధ్వనించి మరింత గట్టిగా వినిపించింది. ‘సరే పెద్దమనుషులూ!
ఉన్నదంతా ఇచ్చేయండి! లేదంటే....’ ముగ్గురిలోనూ ఒకడు
పొగరు మోతు కుర్రాడు. మొరటుగా ఏదో అన్నాడు. అమ్మను తిట్టాడు. వాడిని భయపెట్టడానికి బూ ఖట్టర్ తుపాకీ పేల్చాడు. అతనూ పేల్చాడు.
కానీ చివరి షాట్ మాత్రం బూ ఖట్టర్ రైఫిల్ నుంచి వచ్చింది. సంగతి తేలిపోయింది.
యువకుడు పడిపోయాడు. మిగతా వాళ్ళు లొంగిపోయారు. వాళ్ల దగ్గర ఉన్నదంతా దోపిడీ
అయింది. చివరకు దుస్తులు, తిండి కూడా!
సంతోష దినాన సంపాదన లెక్కించడానికి బూ ఖట్టర్ కూచున్నాడు. ముప్ఫయి అయిదు
బంగారం ముక్కలు, కొన్ని రియాల్స్, నాణాలతో నిండిన పెద్ద
సంచి ఒకటి. అది చాలా బరువుగా ఉంది. ఎత్తడానికి బూ ఖట్టర్ మూలగ వలసివచ్చింది.
కొల్లగొట్టిన మిగతా వస్తువులను చూచాడు. నగిషీ గల కంచు గొడ్డలి, ఒక కత్తి, ఒక మాంసం చీల్చే
కత్తి, మరొక రైఫిల్.
దేవుడు ఇచ్చిన దానికి కృతజ్ఞతగా అతను నేలను ముద్దాడాడు. ‘మీరు నేలను
ముద్దాడండి! కృతజ్ఞత చెప్పాలని కూడా తెలియదు!’ కొడుకులతో అన్నాడు. ‘డబ్బు, ఆయుధాలు. అదృష్టం అంటే అది! అతను నవ్వాడు.
దొంగ సొమ్మును చూస్తూ అతను కన్నెమేరీతో సరదా మాటలు మొదలు పెట్టాడు. ‘అమ్మా, ధన్యవాదాలు! దేవుడు నీకు దీర్ఘాయువు ఇచ్చుగాక! ఇవాళ నీవు బూ ఖట్టర్ కు వాని
అవకాశం ఇచ్చావు. ఎక్కడా లేని గంట చేయిస్తాను. నీకు! పిల్లలూ, వాళ్ల తిండి సంచి
విప్పండి! తిండి తీయండి.’
నది మధ్యలో ఒక బండ మీద ముగ్గురూ కూచున్నారు. విజయం తరువాత ఎక్కడలేని ఆనందంతో
ఆకలితో బాగా తిన్నారు. చిన్నవాడు దొంగిలించిన సంచి నుంచి జున్ను ముక్క
తీసుకున్నాడు. బూ ఖట్టర్ వాడి చెంప వాయించాడు.
‘గౌరవం చూపించాలి, గాడిదా! ఇవాళ
శుక్రవారం! కొవ్వు ఎట్లా తింటావూ! వాళ్లు ఈ సంగతి పట్టించుకోలేదు కనుకనే మనకు
దొరికారు’, అన్నాడతను.
Tuesday, June 30, 2026
Sunday, June 28, 2026
చెవిటి మనిషి : పొరుగు మనిషి Katha
చెవిటి మనిషి : పొరుగు మనిషి
రూమీ చెప్పిన కథలు
చెవిటి మనిషి - పొరుగు మనిషి
ఒక మనిషికి రాను రాను చెవులు వినిపించడం
తగ్గిపోతున్నది. కానీ అతనికి తన లోపం గురించి అందరి ముందు అంగీకరించడానికి
మనస్కరించడం లేదు. అతను మరి గర్విష్టి. ఏమీ జరగనట్టే నటిస్తూ బతుకుతున్నాడు.
ఒకనాడు అనుకోకుండా, ఒక నేస్తం కలిశాడు. ఆ పక్కనే ఉన్న
ఇంటిలో ముసలాయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు, అతని వద్దకు వెళ్లి
పరామర్శిస్తే బాగుంటుంది కదా, అని అతను అన్నాడు. పక్కింటి పెద్ద
మనిషిని పలకరించడానికి బంధువులు కూడా ఎవరూ లేరు, అంటూ
పలకరించమని ప్రోత్సహించాడు. ఈ చెవిటి మనిషి, ఏదో రకంగా అతని మాటలు అర్థం
చేసుకున్నాడు. పొరుగంటి మనిషిని తప్పకుండా వెళ్లి పలకరిస్తానని, నిజానికి
ఆ రోజునే వెళతానని మాట ఇచ్చాడు కూడా.
ఇంతకు ఆ పొరుగింటి మనిషి దగ్గరకు
వెళ్లడం ఎట్లాగా? అతను నిజంగా అనారోగ్యంతో తీసుకుంటూ ఉంటే, మాట
బలహీనం అయిపోయి ఉంటుంది. అతను చెప్పేదేదో తనకు వినిపించదు. అయినా వెళ్ళక
తప్పేటట్టు లేదు. కనుక తప్పకుండా వెళ్లాలి. ఆరోగ్యం గురించి ఏదో అడగాలి. తప్పదు
అని నిర్ణయించుకున్నాడు. ఎదుటి మనిషి మాట్లాడుతున్నప్పుడు, అతని
పెదవుల కదలికను బట్టి, ఏం మాట్లాడుతున్నది అర్థం చేసుకోవచ్చు
కదా, అనుకున్నాడు.
అయినా ఏదో జాగ్రత్తగా ఉండాలి కనుక, ఏం ప్రశ్నలు అడగాలి, వాటికి
ఏమీ జవాబులు వస్తాయి, తర్వాత మరి ఏమి అడగాలి, అన్న
విషయాలను అతను ముందే మనసులో మననం చేసుకున్నాడు.
తాను వెళతాడు. 'ఒంట్లో ఎలా ఉంది?' అని అడుగుతాడు. అనారోగ్యంగా ఉన్న మనిషి 'ఏదో దేవుడి దయవల్ల, లాగతీసుకు వస్తున్నాను,' అంటాడని
ఊహించాడు. జవాబుగా 'చాలా గొప్ప విషయం,' అని
తాను అంటాడు. వెంటనే తాను, 'ఈ పూట మరి ఏమి తిన్నావు' అని అడుగుతాడు. అతను ఏదో తిన్నాడని జవాబు చెబుతాడు. 'భలే భలే, బాగుంది మరి,' అని
తాను అంటాడు. అప్పుడిక మూడవ ప్రశ్నగా, 'మందులు ఎవరి దగ్గర
తీసుకుంటున్నావు?' అని అడగాలి. అతను ఊర్లో ఏదో ఒక
వైద్యుడి పేరు చెబుతాడు. మళ్ళీ తను 'భలే భలే' అంటాడు. 'అతను చాలా గొప్పవాడు, నాకు
తెలుసు,' అని
కూడా అంటాడు.
ఈ రకంగా ముందే పథకం వేసుకొని, చెవుడు
పెరుగుతున్న ఆ మనిషి వెంటనే పక్క ఇంటికి వెళ్ళాడు. ముసలతని పక్కనే కూర్చున్నాడు.
నిజానికి అక్కడ మంచం లేదు. ముసలతను నేల మీదనే ఏదో గుడ్డలు పరుచుకుని పడుకున్నాడు.
వెళ్లిన ఈ మనిషి, 'పెద్దాయనా! ఎలా ఉన్నావు?' అని
అడిగాడు.
'చస్తున్నాను!' అన్నాడు
ఆ ముసలి మనిషి. ముందు అనుకున్నట్టే చెవిటి మనిషి 'చాలా గొప్ప
విషయం,'
అనేశాడు.
పథకం ప్రకారం,
'ఇంతకు ఏం తిన్నావు' అని అడిగాడు.
ఆరోగ్యం సరిగా లేని మనిషి విసిగిపోయి ఉన్నాడు. 'విషం,' అన్నాడు. 'భలే భలే, బాగుంది
మరి,' అన్నాడు
మన చెవిటి మనిషి. మరి పథకం అదే కదా.
ముసలి మనిషికి చికాకు తలకెక్కింది. కానీ
తమాయించుకుని పెదవి కొరుక్కున్నాడు. వచ్చిన మనిషిని తిడితే గౌరవంగా ఉండదు
అనుకున్నాడు. ఇక పథకం కొనసాగింది. 'ఏ వైద్యుడి
దగ్గర మందులు తీసుకుంటున్నావు?' అన్న ప్రశ్న వచ్చేసింది.
చికాకుగా ఉన్న ముసలి మనిషి, 'మృత్యుదేవత
దగ్గర!' అన్నాడు. మరి మన చెవిటి పెద్దమనిషి 'భలే భలే! అతను
చాలా గొప్పవాడు, నాకు తెలుసు,' అనేశాడు.
'అతని దగ్గరికి వెళ్లిన వాళ్లందరికీ ఇకపైన కష్టాలు అంటూ ఉండవు' అని కూడా చేర్చాడు.
అన్న మాటల ప్రభావం గురించి
పట్టించుకోకుండా అతను పెద్దాయన చేయి పట్టుకుని, సెలవు అన్నట్టు ఒకసారి ఊపి, గట్టిగా
నొక్కి, వచ్చేశాడు.
తాను వచ్చి ముసలి ఆయనకు ఎంతో మంచి చేశాను అని మాత్రమే అతను మనసులో అనుకుంటున్నాడు.
జరిగిన విషయం గురించి అతనికి ఏ మాత్రం అనుమానం లేదు. తర్వాత ఏమైంది మనకు తెలియదు.


