చెవిటి మనిషి : పొరుగు మనిషి
రూమీ చెప్పిన కథలు
చెవిటి మనిషి - పొరుగు మనిషి
ఒక మనిషికి రాను రాను చెవులు వినిపించడం
తగ్గిపోతున్నది. కానీ అతనికి తన లోపం గురించి అందరి ముందు అంగీకరించడానికి
మనస్కరించడం లేదు. అతను మరి గర్విష్టి. ఏమీ జరగనట్టే నటిస్తూ బతుకుతున్నాడు.
ఒకనాడు అనుకోకుండా, ఒక నేస్తం కలిశాడు. ఆ పక్కనే ఉన్న
ఇంటిలో ముసలాయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు, అతని వద్దకు వెళ్లి
పరామర్శిస్తే బాగుంటుంది కదా, అని అతను అన్నాడు. పక్కింటి పెద్ద
మనిషిని పలకరించడానికి బంధువులు కూడా ఎవరూ లేరు, అంటూ
పలకరించమని ప్రోత్సహించాడు. ఈ చెవిటి మనిషి, ఏదో రకంగా అతని మాటలు అర్థం
చేసుకున్నాడు. పొరుగంటి మనిషిని తప్పకుండా వెళ్లి పలకరిస్తానని, నిజానికి
ఆ రోజునే వెళతానని మాట ఇచ్చాడు కూడా.
ఇంతకు ఆ పొరుగింటి మనిషి దగ్గరకు
వెళ్లడం ఎట్లాగా? అతను నిజంగా అనారోగ్యంతో తీసుకుంటూ ఉంటే, మాట
బలహీనం అయిపోయి ఉంటుంది. అతను చెప్పేదేదో తనకు వినిపించదు. అయినా వెళ్ళక
తప్పేటట్టు లేదు. కనుక తప్పకుండా వెళ్లాలి. ఆరోగ్యం గురించి ఏదో అడగాలి. తప్పదు
అని నిర్ణయించుకున్నాడు. ఎదుటి మనిషి మాట్లాడుతున్నప్పుడు, అతని
పెదవుల కదలికను బట్టి, ఏం మాట్లాడుతున్నది అర్థం చేసుకోవచ్చు
కదా, అనుకున్నాడు.
అయినా ఏదో జాగ్రత్తగా ఉండాలి కనుక, ఏం ప్రశ్నలు అడగాలి, వాటికి
ఏమీ జవాబులు వస్తాయి, తర్వాత మరి ఏమి అడగాలి, అన్న
విషయాలను అతను ముందే మనసులో మననం చేసుకున్నాడు.
తాను వెళతాడు. 'ఒంట్లో ఎలా ఉంది?' అని అడుగుతాడు. అనారోగ్యంగా ఉన్న మనిషి 'ఏదో దేవుడి దయవల్ల, లాగతీసుకు వస్తున్నాను,' అంటాడని
ఊహించాడు. జవాబుగా 'చాలా గొప్ప విషయం,' అని
తాను అంటాడు. వెంటనే తాను, 'ఈ పూట మరి ఏమి తిన్నావు' అని అడుగుతాడు. అతను ఏదో తిన్నాడని జవాబు చెబుతాడు. 'భలే భలే, బాగుంది మరి,' అని
తాను అంటాడు. అప్పుడిక మూడవ ప్రశ్నగా, 'మందులు ఎవరి దగ్గర
తీసుకుంటున్నావు?' అని అడగాలి. అతను ఊర్లో ఏదో ఒక
వైద్యుడి పేరు చెబుతాడు. మళ్ళీ తను 'భలే భలే' అంటాడు. 'అతను చాలా గొప్పవాడు, నాకు
తెలుసు,' అని
కూడా అంటాడు.
ఈ రకంగా ముందే పథకం వేసుకొని, చెవుడు
పెరుగుతున్న ఆ మనిషి వెంటనే పక్క ఇంటికి వెళ్ళాడు. ముసలతని పక్కనే కూర్చున్నాడు.
నిజానికి అక్కడ మంచం లేదు. ముసలతను నేల మీదనే ఏదో గుడ్డలు పరుచుకుని పడుకున్నాడు.
వెళ్లిన ఈ మనిషి, 'పెద్దాయనా! ఎలా ఉన్నావు?' అని
అడిగాడు.
'చస్తున్నాను!' అన్నాడు
ఆ ముసలి మనిషి. ముందు అనుకున్నట్టే చెవిటి మనిషి 'చాలా గొప్ప
విషయం,'
అనేశాడు.
పథకం ప్రకారం,
'ఇంతకు ఏం తిన్నావు' అని అడిగాడు.
ఆరోగ్యం సరిగా లేని మనిషి విసిగిపోయి ఉన్నాడు. 'విషం,' అన్నాడు. 'భలే భలే, బాగుంది
మరి,' అన్నాడు
మన చెవిటి మనిషి. మరి పథకం అదే కదా.
ముసలి మనిషికి చికాకు తలకెక్కింది. కానీ
తమాయించుకుని పెదవి కొరుక్కున్నాడు. వచ్చిన మనిషిని తిడితే గౌరవంగా ఉండదు
అనుకున్నాడు. ఇక పథకం కొనసాగింది. 'ఏ వైద్యుడి
దగ్గర మందులు తీసుకుంటున్నావు?' అన్న ప్రశ్న వచ్చేసింది.
చికాకుగా ఉన్న ముసలి మనిషి, 'మృత్యుదేవత
దగ్గర!' అన్నాడు. మరి మన చెవిటి పెద్దమనిషి 'భలే భలే! అతను
చాలా గొప్పవాడు, నాకు తెలుసు,' అనేశాడు.
'అతని దగ్గరికి వెళ్లిన వాళ్లందరికీ ఇకపైన కష్టాలు అంటూ ఉండవు' అని కూడా చేర్చాడు.
అన్న మాటల ప్రభావం గురించి
పట్టించుకోకుండా అతను పెద్దాయన చేయి పట్టుకుని, సెలవు అన్నట్టు ఒకసారి ఊపి, గట్టిగా
నొక్కి, వచ్చేశాడు.
తాను వచ్చి ముసలి ఆయనకు ఎంతో మంచి చేశాను అని మాత్రమే అతను మనసులో అనుకుంటున్నాడు.
జరిగిన విషయం గురించి అతనికి ఏ మాత్రం అనుమానం లేదు. తర్వాత ఏమైంది మనకు తెలియదు.
No comments:
Post a Comment