లోకాభిరామం - బ్యాడల పుళి
బ్యాడల పుళి
నేను పాలమూరు వాణ్ని. అంటే మహబూబ్‌నగర్
వాడినని అర్ధం. మాకు కర్నాటకలోని రాయచూరు దగ్గర. జిల్లా అంచుల లోని మక్తల్, నారాయణపేట ప్రాంతాల్లో మాట్లాడే తెలుగు
చిత్రంగ ఉంటుంది. కన్నడము కలయికతో అది వింతగ తోస్తుంది. పప్పును బేడలు అనడం మాకు
అలవాటు. మా ఇంట్లో బేడల పుళి అని ఒక వంటకం ఉంటుంది. అందులోని బేడలంటే కన్నడ బేళె.
అనగా పప్పు. ఇక పుళికి, చారల, కోరల పులికి సంబంధం లేదు. పచ్చి
తెలుగులో చెప్పాలంటే అది చింతపండు పులుసు. కన్నడలో అది హుళి. తెలుగులో ‘ప’ వాడే
చోట్ల కన్నడంలో హకారం వస్తుంది. హాలు అంటే
పాలు. హాడు అంటే పాట. హావు అంటే పాము. కనుక అది బేళెహుళి (కన్నడం) గాక పుళి
అయింది. తమిళంలో పుళియ మరం అంటే చింత చెట్టు. పుళి అంటే పులుపు. ఇంతకూ మా
వంటకాన్ని పప్పు పులుసు అనవలె. అట్ల అంటే మా వాళ్లకు కోపం వస్తుంది. చాలా మాటలకు
తమిళం గాని తమిళం వాడాలె. లేకుంటే సాంప్రదాయం పాడయింది అంటరు. మా ఇండ్లలో
పచ్చిపుళి కూడ ఉంటుంది. మా ఇండ్లలో పెట్టే దేవుని దీపం పేరు పెరుమాండ్ల తిరువళికె.
పెరుమాళ్ అంటే దేవుడు. తిరువిళక్కు అంటే శ్రీదీపము. అది తిరువళికె అయింది.
ఇక్కడ నాకు సంబంధం లేని సంగతి ఒకటి
చెప్పాలె అనిపిస్తున్నది. ‘రాజ్యాలు పోయినా పూసలు పోలేదు’ అని ఒక మాట ఉన్నది.
శ్రీకృష్ణదేవ రాయల బొమ్మను అందరు చూచి ఉంటరు. పుస్తకాలలో ఆయన పొట్టివాడని, స్ఫోటకం మచ్చలు గలవాడని రాసి ఉంది.
బొమ్మల్లో, విగ్రహాల్లో
మాత్రం ఆయనను ఆజానుబాహువుగా చూపిస్తరు. అది వేరే సంగతి. అట్ల పక్కన బెడుదుము.
ఆయనకు కిరీటము గాని కిరీటము ఒకటి ఉంటుంది. అది పౌరాణికం సినిమా తరహా బంగారు కిరీటం
కాదు. పట్టుబట్టతో తలపాగా చుట్టి, ముందు
బాసికము వంటి అలంకరణ బిగించి ఉంటుంది. అందముగ వుంటుంది. అయినా అది కూడ మనకు ఇక్కడ
అది చర్చనీయాంశము కాదు. కిరీటము ముందు భాగము లో ఒక పక్కన ముత్యాలు, లేదా అటువంటి వెలగల పూసల గుత్తి ఒకటి
అమర్చి ఉంటుంది.(ఎడమ వేపా, కుడి
పక్కనా? కుడి
అయ్యుండాలె!) ప్రభువులు కదులుతుంటే అవి కదులుతూ,
కంటి పక్కన ఆడుతుంటయి. కృష్ణదేవరాయలు
కూడ రాజ్యము పోగొట్టుకున్నడు. కానీ ఈ మాట ఆయన గురించి చెప్పినదని నేను అనుకోను.
పూసల గుత్తి కిరీటం గల ఒకానొక రాజు గారికి కిరీటం పోయింది. అంటే రాజ్యం పోయింది.
ఆయనకు కనుకొలుకులలో పూసల కదలాట కనిపించడం లేదు. రాజ్యము గురించిన బాధ ఉండనే ఉంది.
ఆ రాజ్యాన్ని అనుక్షణం గుర్తు చేసే పూసలు లేకుండడము మాత్రం ప్రభువులకు ఎంతమాత్రం
నచ్చలేదు. ఉత్త తలపాగా కట్టుకుని, అందులో
పూసల గుత్తి పెట్టుకుని సంతృప్తి పడినడట ఆ అమాయక చక్రవర్తి. అదే రాజ్యాలు పోయినా,
పూసలు పోలేదు అంటే. మా తమిళ సంప్రదాయం కూడ అట్లనే మిగిలింది.
అన్నము వడ్డించు’ అనడాన్ని ‘సాదం’
పరిమారండి అనాలె. అట్లంటే మా తమిళ వైష్ణవ సాంప్రదాయపు మాట కింద లెక్క. మొన్న
మొన్నటి వరకు ‘అన్నము’ అంటే ‘మాటలు రావా? అని
పెద్దలు గద్దించే వారు. తమిళనాట అందరు ‘సాదము’ అని అంటరు. అని నేనంటే, నీవు చార్వాకుడవు అన్న వారున్నరు.
సంప్రదాయమంటే, అదేమిటి
అని అడిగే దినములు వచ్చినవి. గుడిలో కూడ వైట్‌రైస్‌లు, బఫే పద్ధతిలో వడ్డిస్తున్నరు. అయినా
మావాండ్లు ఇంకా కొన్ని మాటలను వదలలేదు. వదిలితే నిజంగానే మూలాల గురించిన సోయి
లేకుండ అవుతుందేమో?
సాపాటు అనాలె. భోజనం అన్నది అలవాటు
లేదు. సాపాట్ల వ్యాళ (సమయంలో) హిందీ, ఉరుదూ
మాటలు తప్పు అని ఒక సంప్రదాయము. దేశంలో మిగత ప్రాంతాలలో అందరు ఉరుదూ (ఉర్దూ అనాలె)
కలిసిన హిందీ మాత్రమే మాట్లాడతరని నేను అంటే అది వితండవాదన కింద లెక్క. కానీ నా
అనుమానాలు నాకు ఉండనే ఉన్నయి. ఉత్తర భారతంలో కూడ సాంప్రదాయ పరులు, సంస్కృత పదాల వాడకాన్ని కోరుకుంటరన్నది
అందులో ఒకటి. జల్దీ అంటే ఉర్దూ. త్వరగా, తొందరగా
అని అర్థం కానీ ఉత్తరప్రదేశ్ బ్రాండ్, శుద్ధ్
హిందీ వారు, తురంత్, శీఘ్ర్ అనే మాటలు వాడుకుంటరు. ఈ కల్తీ
సమస్య అక్కడ కూడ ఉండేది. ఉంది అని నా అనుమానం.
హైదరాబాద్ స్టేట్‌లో ఉరుదూ ప్రభావం బాగ
ఎక్కువ. ‘విస్తరి ఫరోఖ్త్‌గ ఉండంగ చట్నీ కినారాలో వడ్డించిన సబబేమి’ అన్నడట ఒక మొగుడు పెళ్లాన్ని, పెండ్లామును నిలదీస్తూ. ఆకు ఖాళీ (ఖర్మ, ఇది ఉర్దూ మాట!)గ ఉంటే పచ్చడి (తొక్కు)
అంచున వేయడానికి గల కారణం ఏమి అని భావము. ఆమె ఏం సంజాయిషీ (ఖర్మన్నర, ఇదీ ఉర్దూ మాటనే!) ఇచ్చుకున్నదో
తెలువదు. తెలువదు అంటే తప్పు. తెలియదు అనాలె (ఖర్మ!) (కర్మ వేరు ఖర్మ వేరు. ఖర్మ!
ఖర్మ!)
హైదరాబాదులో ఈ పక్క జిల్లాలలో కన్నడము
మాట్లాడే వాండ్లు చాలమంది ఉన్నరు. మేము పాలమూరులో,
ఒకానొక గుడిపక్కన ఉన్న గదులలో కిరాయికి
ఉన్నము. కిరాయి అన్నది ఉర్దూ మాట. బాడుగకు, అద్దెకు
అనే మాటలు మా ప్రాంతంలో ఎవరికీ అర్థం కావు. ఆ గుడిలో ఆంజనేయులు, శివుడు ఇద్దరు ఉంటరు. ఇద్దరు వేరువేరుగ
ఉంటరు. మధ్వులకు లేక మధ్వలకు భీముడు, ఆంజనేయ
స్వామి ఆరాధ్య దైవములు. ఆ గుడిలో పూజారులు ముందు నరసింహభట్టు, ఆ తరువాత నారాయణభట్టు. వాండ్లిద్దరు
కన్నడిగులు. అంటే కన్నడ మాట్లాడే వారు. అంటే కన్నడ ప్రాంతము వారు. కనుకనే, ఈ రకము సహజీవనము కారణముగనే మాకు కొంత కన్నడము
అర్థము అవుతుంది. నారాయణభట్టు గారిని చుట్టు పక్కల ఇండ్లవారు తమ ఇండ్లలో పూజలు, వ్రతాలు చేయించేందుకు పిలిచే వారు. ఆయన
గారి తెలుగు అన్యాయంగ ఉండేదంటె అన్యాయం కాదు. నారాయణ భట్టు పూజలో భాగంగా
సత్యనారాయణ కథ చెప్పే తీరు విని తీరవలసిందే. ఈ రకం ప్రభావాల కారణంగనే నేను భాషల
పట్ల ఆసక్తి కలవాడినిగ అయినట్లున్న. ఆయా భాషలు విని నేర్చుకునేందుకు అన్నిటి కన్నా
మంచి మార్గము రేడియో. కన్నడ వార్తలు, ఉపన్యాసాలు
అనే ప్రసంగాలు వింటే శుద్ధమయిన భాష గురించి తెలుస్తుంది. నాటకము, సినిమాలతో ప్రజల భాష తెలుస్తుంది.
మొత్తానికి భాషతో పరిచయము పెరుగుతుంది. హైదరాబాదు వచ్చిన తరువాత బసంత్ టాకీసులో
కన్నడ సినిమాలు చాలనే చూచినట్టు జ్ఞాపకముంది. గిరీష్ కార్నాడ్, గిరీష్ కాసర వల్లి, లంకేష్ మొదలయిన వారి సినిమాలు చాల
శ్రద్ధగ చూచిన. కార్నాడ్ సినిమాల గురించి గంటల పాటు చర్చలు జరిపిన గుర్తు కూడ
ఉన్నది.
ఝలక్ : యూనివర్సిటీ దినాలలో గురురాజ
రావు అని ఒక మిత్రుడు ఉండేవాడు. అతను పాలమూరు మండలానికి చెందినవాడేనని
అనుకుంటున్న. జెనెటిక్స్‌లో ఎమ్మెస్సీ చదివినడు. పరిశోధన వదిలేసి విదేశాంగ శాఖలో
పెద్ద ఉద్యోగాలు చేసినట్టు అతని గురించి విన్నాను. గురురాజరావు అన్న పేరుతోనే అతను
కన్నడిగుడని తెలిసిపోతుంది. నాకు కన్నడము వచ్చునని గురురాజ్‌కు నా మీద కావలసినంత
అభిమానము. కన్నడము మీద అంతకన్న అభిమానము. అతను వచ్చి మామూలుగ నన్ను కన్నడములో ఏదో
ప్రశ్న అడుగుతడు. నేను అంతే మాములుగ, అంతే
వేగముగ తెలుగులో జవాబు (ఉర్దూ మాట) అనే సమాధానము చెపుత. గురు తిరిగి కన్నడములో
మాట్లాడతడు. నేను తెలుగులో మాట్లాడత. మమ్ములను గమనించిన ఒక మిత్రుడు ‘మీరిద్దరు
కన్నడములో, లేదా
తెలుగులో మాట్లాడవచ్చు గద. ఈ రెండు భాషల సంభాషణ ఏమి?
అని అడిగనడు. గురు అంటే గురురాజరావుకు
తెలుగు కూడ బాగ వచ్చును. నాకు మాత్రము కన్నడ వ్యాకరణమును తొక్కి ముక్కలు
చేస్తనేమోనని అనుమానము. అందుకనే కన్నడములో మాట్లాడను. మొన్ననొక వదినగారితో కన్నడము
మాట్లాడవలసిన అవసరము వచ్చింది. ఆమెకు కన్నడము తప్ప మరొక భాష రాదు. అప్పుడు నాకు ఎంతగా ఆ భాషను మరిచిపోయిననన్న
సంగతి అర్థమయింది. చుట్టుపక్కల కన్నడవారెవరూ లేరు. ఈ మధ్యన కన్నడ దేశానికి
తిరిగినది కూడ తక్కువే. అది అట్లుండగ, తమిళ
ప్రభావం మరీ ఎక్కువయింది. తమిళ దేశానికి తిరగడం కూడ నిజంగనే ఎక్కువయింది. కన్నడము
మాట ప్రయత్నిస్తే తమిళము అడ్డముగ వస్తున్నది.
నిజానికి హైదరాబాదులోనే తమిళ, కన్నడ,
మళయాళ సంపర్కం వీలవుతుంది. ఒకప్ప్పుడు ఈ
భాషల సినిమాలు కూడా వచ్చేవి. ఇప్ప్పుడు టీవీ ఛానల్స్ కావలసినన్ని ఉన్నయి. కానీ
చూడడము ఇష్టం ఉండదు.
నేను ఉర్దూ నేర్చుకున్న. జర్మన్ భాష
మూడు డిప్లొమాల వరకు చదువుకున్న జర్మన్ ఇప్పుడు గుర్తు లేదు. ఆ సంగతులు మరొకసారి
విన్నవించుకుంట.
No comments:
Post a Comment