సైన్స్ కూడా నమ్మకమే
సైన్సు- గండుచీమ : నాకు సంగీతం చీమ కుట్టిందని, ఒకానొక సారి అన్నట్టు గుర్తు. నాకు సాహిత్యం చీమ కూడా కుట్టింది. వీటన్నింటికీ మించి సైన్సు అనే గండుచీమ రక్తం వచ్చేదాకా కుట్టింది. ‘మీరు కొందరిని మతోన్మాదులు అంటున్నారు. వారు మనలను సైన్సు ఉన్మాదులు అంటారేమో చూడండి’ అని అడిగేంత ఘాటుగా కుట్టింది ఆ చీమ. ఈ మధ్యన ఏదో రాతకు తయారవుతున్న ప్రయత్నంలో భాగంగా, మనం మేలుకుని ఉన్నా, నిద్ర పోయినా, అంతా బయోకెమిస్ట్రీ, అని వాక్యం రాసుకున్నాను. నాకు ఈ ప్రపంచమంతా సైన్సుగానే కనపడుతుంది. మిగతావారికి అట్లాగ ఎందుకు కనిపించడం లేదని, అనుమానం కూడా వస్తుంది.
మనం ఉందనుకుంటున్న ఈ విశ్వం,
అందులో సౌరమండలం, అందులో భూమి, అందులో జీవం,
అందులో మనం మొదలైనవన్నీ మన,
(మనలాంటి వారే అయిన తరతరాల మనుషుల) మెదడుల్లో నుంచి
పుట్టిన అవగాహనలు. ఆలోచనలు పుడతాయి. వాటి గురించి ప్రయోగాలు జరుగుతాయి. కొన్ని
విషయాలకు రుజువులు దొరుకుతాయి. అవన్నీ కలిపి సైన్సుగా నిలుస్తాయి. భౌతిక ప్రపంచంలో
కూడా పదార్ధంగా, యదార్ధంగా ఉన్నవాటిని
గురించిన సైన్సు ఒక భాగం. కేవలం అనుభవంలో మాత్రమే ఉండే ఆలోచనలు,
సిద్ధాంతాలు కూడా ఒక భాగం! ఇది కూడా సైన్సే!
వీటన్నింటికీ, ప్రపంచమంతటా ఆయా
పరిస్థితుల్లో ఒకేరకమైన అనుభవాలు, ఆధారాలు దొరుకుతాయి.
కనుక అది ఒక సైన్సు!
ఈ మన మెదడు (మెదడుల)లోనే మరికొన్ని
ఆలోచనలు మొదలవుతాయి. అవి అందరికీ ఒకే రకంగా అనుభవంలోకి రాక పోవచ్చు. వాటికి
ఆధారాలు అందరికీ ఒకే రకంగా అందవు కూడా! ఆలోచన ధోరణి, మెదడు మొదలైన సైకాలజీ దీనికి మొదటి ఉదాహరణేమో?
విశ్వం ఉందని అందరూ అంటున్నారు గనుక
మనమూ ఉందంటున్నాం. అది నిజంగా ఉందని ఎవరూ చూడలేదు. ఉందన డానికి చెపుతున్న లెక్కలు,
ఆధారాలు మొదలైనవి అందరికీ ఒకేలాగ అర్థం కావడంలేదు.
సైన్సు చదువుకున్న వారికి కూడా సైన్సు అర్థం కాలేదు. సైంటిస్టులం అంటున్నవారు కూడా
సైన్సు వేరు, బతుకు వేరు
అనుకుంటున్నారు. నమ్మకాలు మెదడు లోనే పుడతాయి. అనుభవాలూ మెదడులోనే పుడతాయి. వాటిలో
ఒకదానికి ఒకటి జోడించి చూడడం చేతగాదు. అంతా గజి బిజి గందర గోళం అవుతుంది. ఏది ఉంది,
ఏది లేదు తేల్చుకోలేము. బతుకంటే భౌతిక శాస్త్రం,
కెమిస్ట్రీ అంటే నవ్వుతారు మరి. నవ్వేవారి తప్పు
లేనేలేదు. వారలకు అంతగా చీమ కుట్టలేదు మరి. సైన్సయినా,
మరోటయినా ఉందనుకుంటే ఉంది. లేదను కుంటే లేదు.
ఒక మిత్రుడెవరో చాలాకాలం తరువాత
కనబడతారు. ఎవరెవరి గురించో అడుగుతాము. ఫలానా వాడు ఎక్కడా?
అంటే ‘అయ్యో! తెలియదా?
వాడుపోయి నాలుగేళ్లయింది!’ అంటాడా మిత్రుడు. మనమేమో
ఆ ‘ఫలానా’ ఇంకా ఎక్కడో ఉన్నాడనే అనుకుంటున్నాము. ఆయన పోయి నాలుగేళ్లయినా,
మనకు మాత్రం ఆ క్షణాన్నే పోయాడు. అసలా సంగతి
గురించి ఇంకా నమ్మకం కుదరదు. భౌతికమైన మనిషి సంగతే ఇట్లాగయితే,
ఉన్నామో లేదో, ఎవరికీ తెలియని
అనుభవైక వేద్యాల సంగతేమిటి?
తరం-తరం: మా తాతయ్య పుస్తక
ప్రియులు. ఆయన వదిలి వెళ్లిన పుస్తకాలే అందుకు నిదర్శనాలు. ఎనిమిది రకాల
రామాయణాలున్నాయి ఆయన లైబ్రరీలో. తాతయ్య పుస్తకాలలో టూరిజం,
సైన్సు(!) రకం పుస్తకాలున్నాయని గమనించాను. ఆ
కాలంలోనే ఆధునిక వైద్యం, ఆరోగ్యం లాంటి విషయాల
మీద పుస్తకాలు వచ్చాయని, వాటిని తాతయ్య తెచ్చి
చదువుకున్నాడని తెలిస్తే ఈ ‘తిక్కదనం’ నాటి నుంచీ ఉందని అర్ధమైంది. మ్యాజిక్,
గుర్రాల పెంపకం, ఆయుర్వేదం, చిట్కా వైద్యం లాంటి విషయాల గురించి కూడా తాతయ్య
పుస్తకాలు సేకరించి పెట్టుకున్నాడు. నాకు చేతనయినంత కాలం ఆయన పుస్తకాలను నేను కాపాడుకున్నాను.
చదువు పేరిట ఇల్లు వదిలి, తిరిగి వచ్చేసరికి,
ఇంట్లో పుస్తకాలు మిగలలేదు. మిగిలినవి పుస్తకాల లాగ
లేవు. అది గమనించి నేను పడ్డ బాధ వర్ణనాతీతం.
నాన్న సంప్రదాయ విద్య బాగా
చదువుకున్న వ్యక్తి. కాని ఎందుకో ఆయన లైట్ రీడింగ్ మీద మాత్రమే మనసు పెట్టినట్టు
గమనించాను. ఆయన కొన్న పుస్తకాలన్నీ ఇంచుమించు అదే రకం. అవి కూడా మిగలలేదు.
సంవత్సరాల తరబడి సేకరించిన చందమామలు, నవలలు మాయమయినవి.
నాన్న, నేనూ ఆ విషయంగా పెద్ద
బాధపడినట్టు లేదు.
నాన్న సాంప్రదాయం మనిషే. అయినా
పిసరంత కూడా ఛాదస్తం లేదు. ఎమ్మెస్సీలో క్లాస్‌మేట్స్ (గరల్స్) ప్రోద్బలంతో నేను
మీసాలు పెంచుకున్నాను. ఇంటికి వెడితే అది చూచి తంతారేమోనని భయం. తలవంచుకుని
ఇంట్లోకి వెళుతున్నాను. అరుగు మీద కూచున్న నాన్న నా ముఖంలోకి చూసి ‘భేష్ బాగుందిరా
నాన్నా!’ అని నిజంగా మెచ్చుకున్నారు. మూన్ ఫేస్ అంటారే! ఇంచుమించు అమ్మాయి ముఖం
నాది. పైగా రంగు. మీసాలతో మగతనం కనిపించిందని వ్యాఖ్య! అదీ నాన్న పద్ధతి.
చిన్నప్పుడు నన్ను భుజం మీద ఎత్తుకుని ఇల్లంతా తిరుగుతుంటే నేను ఎడతెరిపి లేకుండా
‘అదేమి? ఇదేమి’ అని ప్రశ్నలడగాలి. ఆయన సమాధానాలు చెబుతారు. కొన్ని
ప్రశ్న తరువాత ‘చల్ బే (పోరా!)’ అంటారు. అది మాకు ఒక ఆట! నాకు బాగా గుర్తుంది! ఆ
రకంగా ఆయన వెంట తిరుగుతూ ఎన్ని సంగతులు తెలుసుకున్నానో మరి! డిటెక్టివ్ నవలలు
చదివితే పరిశీలన, విశ్లేషణ
అలవాటవుతాయని నాన్న చెప్పాడు. పైగా నాన్న చర్చకు, ప్రశ్నలకు అవకాశం కల్పించాడు. నాకు మరీ ధైర్యం ఎక్కువైంది
కూడా. కొన్ని సందర్భాల్లో ‘నాకు తెలిసింది ఇంత. మా పెద్దలు చెప్పింది, వారికి తెలిసింది ఇంతే!’ అని
ఓటమిని కూడా అంగీకరించే వాడు నాన్న! నాన్నకు నేనివాళ కృతజ్ఞత చెప్పగలనా?
నాకు ఎమ్మెస్సీలో గోల్డ్‌మెడల్
వచ్చిందని అమ్మ ఒక పండుగ పథకం వేసింది. బంధువులు మిత్రులు అందరూ వచ్చారు. పూజ
(సత్యనారాయణ వ్రతమా?) ఏర్పాట్లు అయినయి.
‘రా! కూచో!’ అన్నది అమ్మ! ‘అమ్మా, నాకు మనస్థిమితం
కుదరదు. పిచ్చి ఆలోచనలు వస్తాయి. అట్లా చేయడం తప్పుగాదా?
అని అడిగాను. అందరూ నచ్చచెప్పే ప్రయత్నాలు
చేస్తున్నారు. నాన్న మాత్రం ‘వాణ్ని వదిలిపెట్టండి’ అని అమ్మతో తాను పూజకు
కూర్చున్నాడు. ‘మా వెనక కూచుని చూడు!’ అన్నారు అంతే! నాన్న ఒకనాడు కూడా ‘ఈ విషయం
మీరు చేసి తీరాల్సిందే’ అని చెప్పిన గుర్తులేదు మాకెవరికీ!
తరం మారింది: సైన్సు ప్రకారం
బతకడమని ఒకటుందని చాలామంది సైంటిస్టులకే తెలియదు. సంపూర్ణ సూర్యగ్రహణం గురించి
పరిశోధించడానికి వెళ్లిన ఒకాయన బురద నీళ్లలో స్నానం చేశాడని యూనివర్సిటీ రోజుల్లో
చెప్పుకున్నారు. అట్లాగని, మతాన్ని,
నమ్మకాలను కాదనడం సైన్సనుకుంటున్నారేమో?
మతం వ్యక్తిగతం, సైన్సు సార్వజనీనం! పరిశీలన, ప్రయోగం లాంటి అంచెలతో సాగుతుంది సైన్సు పద్ధతి! అది
వంటబట్టడానికి సైన్సు చదవనవసరం లేదు.
నాకొడుకు మరీ చిన్నవాడుగా
వున్నప్పుడు, వాడూ, నేనూ మాత్రమే మహబూబ్‌నగరం దాకా బస్సులో ప్రయాణం చేయవలసి
వచ్చింది. ఇప్పుడు ఇంట్లో నిశ్శబ్దంగా ఉంటుంది గానీ, పిల్లలిద్దరూ చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు వారితో నేను తెగ గోల
చేసేవాడిని. బస్సులో గోల చేయలేదు గానీ! నేనూ నా కొడుకు మాట్లాడుతునే ఉన్నామని
తర్వాత అర్థమైంది. వాడికి బయట తిరగడం అదే కొత్త! కనిపించిన ప్రతి సంగతి గురించీ
ప్రశ్నలడుగుతాడు. నాకు తెలిసింది నేను చెబుతాను. పాలమూరు అనే మహబూబ్‌నగర్ దగ్గరయింది.
పక్కనకూచున్న పెద్దాయన, ఊరి మొదట్లోనే
దిగడానికి సిద్ధమయ్యాడు. దిగబోతూ నావేపు చూచి ‘ఒక మాట చెప్పనా’
అన్నాడు. ‘చెప్పండి’ అన్నాను. ‘మీ కొడుకుకు చాలా
తెలివి ఉంది. మీకు అంతకన్నా ఎక్కువ ఓపిక ఉంది’ అన్నాడాయన! నేనీ సంగతి గురించి
వ్యాఖ్యానించను.
కవిసమ్మేళనం-కొబ్బరి పచ్చడి: పుస్తక
మేళాలో ఈ సంవత్సరం స్టాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలామంది మిత్రులు కనిపించారు
కూడా. అక్కడ కవిసమ్మేళనం జరుగుతుందని మైకులో చెపుతున్నారు. పాల్గొంటున్న కవులందరూ
మిత్రులు, కనీసం పరిచితులు. ఈ
సంగతే నాతో ఉన్న మా అమ్మాయితో చెప్పాను కూడా. వేదిక ముందుకు వెళ్లేసరికి కవులంతా
వేదికను అలంకరించారు. అంటే వేదికను ఎక్కారని అర్థం. కొంచెంసేపు ఉండి
వెళ్లిపోదాములే! అంటున్నాను అమ్మాయితో. ఇంతలో ఫోను మోగింది. దూరం వచ్చి వింటే
‘ఇడ్లీలోకి కొబ్బరి పచ్చడి చేయమంటారా సార్’ అని ప్రశ్న. వంటాయన! రామాయణంలో పిడకల
వేటలాంటి టైటిల్ గుర్తువచ్చింది. సైన్సుకూ, ఈ ముక్కకూ సంబంధం
లేదని మనవి!
No comments:
Post a Comment