I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Monday, June 15, 2026
పడుచుదనం Japanese Folk tale Retold in Telugu
పడుచుదనం
Japanese Folk tale Retold in Telugu
అనగనగా ఒకప్పుడు ఎక్కడో ఒకచోట కొండల మధ్యన ఒక
కట్టెలు కొట్టే మనిషి తన భార్యతోపాటు ఉండేవాడు. వాళ్లు నిజానికి చాలా ముసలివాళ్లు.
కానీ పిల్లలు మాత్రం లేరు. మొగుడు ప్రతినిత్యం ఒంటరిగా అడవిలోకి వెళతాడు. కట్టెలు
కొట్టి తెస్తాడు. పెళ్లాం ఇంటిపట్టునే ఉంటుంది. నేతపని చేస్తుంది. ఒకరోజున ముసలతను అడవిలో అలవాటు కన్నా
ఎక్కువలోతుకు వెళ్లాడు. ఒక ప్రత్యేకమయిన కర్రకోసం చూస్తూ అతను అలా వెళ్లాడు. అక్కడ అతనికి ఒక్కసారిగా
అనుకోకుండా ఒక చక్కని నీటిబుగ్గ కనిపించింది. దాన్ని అతను అంతకుముందెన్నడూ చూచి
ఎరుగడు. బుగ్గలోనుండి చిమ్ముకువస్తున్న నీరు చిత్రంగా చాలాబాగుంది. చల్లగా కూడా ఉంది. అప్పటికే అతనికి బాగా దప్పిగా
ఉంది. ఆనాడు ఎండబాగా కాస్తున్నది. అతను కష్టించి పనిచేశాడు.
కనుక వెంటనే ముసలాయన తన గడ్డిటోపీ పక్కన పెట్టాడు. మోకాళ్లమీద కూచుని ముందుకు
వంగాడు. కావలసినన్ని నీళ్లు తాగాడు. నీళ్లు చాలా బాగనిపించాయి. అవి మామూలుగా లేవు,
అనిపించాయి. నీటిలో ముసలతనికి తన ముఖం కనిపించింది. అతను
ఒక్కసారిగా వెనక్కు తగ్గాడు. అది నిజంగా తన ముఖమే. కానీ పాత అద్దంలో ఇంటిదగ్గర
ప్రతినిత్యం కనిపించే ముఖంమాత్రం కాదు. అందులో ఒక అందమయిన యువకుడు
కనిపిస్తున్నాడు. ముసలాయన తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. అతను రెండు చేతులను ఎత్తి తలమీద
పెట్టుకున్నాడు. ఒక క్షణం కిందవరకు అది బట్టతల. దానిమీద వెంట్రుకలు లేనేలేవు.
ఇప్పుడు మాత్రం నల్లని, చిక్కని జుట్టు చేతికి తగిలింది. ముఖం కూడా
చిన్నపిల్లవాని ముఖంవలె నునుపుగా తాకింది. ముదుసలి ముడతలన్నీ మాయమయ్యాయి. అదే సమయంలో అతనికి ఒంట్లో గొప్ప శక్తికూడా
వచ్చినట్టు తోచింది. ఆశ్చర్యంగా తన కాళ్లు, చేతులవేపు అతను చూచుకున్నాడు. అంతకుముందు వరకు అవి ముసలితనానికి గుర్తులుగా
ఉండేవి. ఇప్పుడు మాత్రం నిండుగా కండరాలు తేలి కనబడుతున్నాయి. అనుకోకుండానే అతను
పడుచుదనం బుగ్గ నుండి నీరు తాగాడు. పడుచువాడు అయ్యాడు. నీళ్లు అతనిని
మార్చివేశాయి. విషయం అర్థం అయింది. వెంటనే అతను సంతోషంతో ఒక
కేక వేశాడు. గాలిలోకి ఎగిరాడు కూడా. వీలయినంత వేగంగా అంతకుముందు ఎన్నడూ లేనంత
వేగంగా ముసలతను ఇంటికి పరుగెత్తాడు. ఇంట్లోకి కాలుపెడితే ఎదురయిన పెళ్లాం భయంతో
వెనుకకు తగ్గింది. ఎవరో కొత్త మనిషి వచ్చాడని ఆమె జడుసుకున్నది. కానీ జరిగిన
ఆశ్చర్యాన్ని అతను వివరించాడు. ఆమె నిజానికి నమ్మలేకపోయింది. కొంతసేపటికిగానీ అతను భార్యను తాను తానే అని
నమ్మించలేకపోయాడు. ఎదురుగా ఉన్నది తన మొగుడేనని ఆమె నమ్మిన తరువాత పడుచుదనం
నీటిబుగ్గ గురించి కూడా అతను చెప్పాడు. ఆమెను వెళ్లి ఆ నీరు తాగమన్నాడు. ‘‘నీవు పడుచువాడివి అయ్యావు. అందగానివి అయ్యావు.
ఇక మరి నా వంటి ముసలి మనిషిని ప్రేమించలేవు. కనుక నేను కూడా ఆ నీటిని వెంటనే తాగక
తప్పదు. అయితే ఇల్లు వదిలి ఇద్దరం ఒకేసారి వెళ్లడం అంత మంచిది కాదు. నేను
వెళ్లివస్తాను. నీవు ఇక్కడే ఉండు’’ అన్నది ముసలామె. ఆమె పరుగు పెడుతూ అడవిలోకి
వెళ్లిపోయింది. ముసలమ్మకు నీటిబుగ్గ కనిపించింది. ఆమె కూడా
దాని పక్కన మోకరిల్లి నీళ్లు తాగసాగింది. ఆహా!, నీళ్లు ఎంత చల్లగా, ఎంత కమ్మగా ఉన్నాయి! ఆమె అదే పనిగా తాగసాగింది.
మధ్యలో ఆగి ఊపిరి పీల్చుకున్నది. మళ్లీ నీళ్లు తాగ సాగింది. ఇక ఇంట్లో అటు ఆమె భర్త ఓపిక లేకుండా ఎదురు
చూస్తున్నాడు. అందంగా పడుచు పిల్లగా మారి తన పెళ్లాం తిరిగి రావాలని చూస్తున్నాడు.
ఎంతసేపయినా ఆమె రానేలేదు. అతనికి ఆత్రం పెరిగింది. ఇంటి తలుపు మూశాడు. పెళ్లాన్ని
వెతుకుతూ బయలుదేరాడు. పడుచుదనం నీటిబుగ్గ దగ్గరికి వచ్చేశాడు. అక్కడ ఆడమనిషి జాడ
కనిపించలేదు. ఇక నిరాశగా అతను వెనుతిరిగాడు. అప్పుడే అతనికి గడ్డిలోనుండి సన్నని
గొంతుక ఏడుస్తున్నట్టు వినిపించింది. అతను వెళ్లి వెతికాడు. అక్కడ తన భార్య
దుస్తులయితే ఉన్నాయి గానీ, వాటిలో ఒక చిన్నపాప
ఉంది. ఆ పాప నిజంగా చిన్నది. బహుశా ఆరు మాసాల వయసు ఉంటుందేమో! ముసలమ్మ పడుచుదనం నీటిని మరీ ఎక్కువగా తాగింది.
యవ్వనం కంటే ఎక్కువగా వయసు తగ్గేటట్టు తాగేసింది. కనుకనే మాటలు రాని పసిపాపగా
మారిపోయింది. చేసేది లేక పడుచు మనిషి తన పెళ్లాం పాపను
చేతిలోకి తీసుకున్నాడు. ఆమె అతనివేపు ఆశ్చర్యంగానూ, దు:ఖంగానూ చూచింది. ఏదో గొణుగుతూ అతను పాపను ఇంటికి తీసుకువచ్చాడు. హాయిగా
పెంచుకున్నాడు.
No comments:
Post a Comment