Thursday, June 18, 2026

ఆనందం : నా కవిత Anandam - My poem in Telugu

 




ఆనందం : నా కవిత

Anandam - My poem in Telugu


ఆనందం

 

ఎంత కాలంగానో ఒంటరితనం అలవాటయింది.

అందులో కూడా ఆనందం పరుచుకున్న తీరును వెతకడం,

అందు గురించి ఆలోచించడం అలవాటయింది.

ఆనందం అమాంతంగా రాదు.

అది ఎవరో తెచ్చి ఇచ్చే వీలు లేదు.

చూస్తుండగా ఒక మొక్క పెరిగినట్టు

అది కంటికి కనబడకుండా జరుగుతుంది.

మొక్క పెరగడం ఎవరికీ కనిపించదు

అయినా అందులోపల ఒక వరుస కణాలు

కొత్తగా తయారవుతుంటాయి

వేళ్ళు భూమిలోకి చొచ్చుకుని పోవడం

ఆ అంధకారంలోనే జరుగుతుంది

బిగ్ బ్యాంగ్ అనే పేలుడును

ఎవరూ వినలేదు కదా

వేరు జరుపుతున్న ప్రళయాన్ని కూడా

ఎవరూ వినజాలరు.

అంతా లోలోపలే జరుగుతుంది

అంతు పట్టకుండా జరుగుతుంది

మొక్క మాత్రం నానాటికి పెరుగుతుంది

ఆకులు, పువ్వులు ఆగకుండా వచ్చేస్తాయి

అందంగా మెరుస్తాయి

 

గంటలు గంటలు ప్రశాంతంగా కూర్చుని ఉంటే

ఆనందం కూడా అందులోనించే ముందుకు వస్తుంది

ఒంటరితనంలో నుంచి వేడి లేని మంటల లాగా

వెలుగుతూ ఆనందం వస్తుంది

గురగురలాడుతున్న రిఫ్రిజిరేటర్

గరగర లాడుతున్న గరుకు నేల

ఆ ఒంటరి ఇంట్లో కంటికి కనబడకుండా

ఏదో చేస్తుంటాయి

గాలికి పరదాలు కదులుతుంటాయి

గదిలో వస్తువులు ఎగురుతుంటాయి

అలమరలో పుస్తకాలు, గూగుల్ హోమ్ లో పాటలు

బల్లమీద చిందరవందరగా వస్తువులు

రంగు వెలసిన గోడలు

ఇవి చాలాబాగా మనకు తోడుగా ఉండడానికి

వాటి మధ్యన కూచుని నా పని నేను చేస్తూనే ఉన్నానుగా

పెరిగే మొక్కలాగా లోని సంగీతాన్ని

పంచుకుంటూనే ఉన్నానుగా

 

ప్రశాంతంగా ఉండడం కంటే కావలసిన ఆనందం వేరే ఏముంది

కదలకుండా అక్కడే పడి ఉన్న సోఫా పాతదయింది నిజమే

మూలన కూర్చున్న చీపురు కూడా చిన్నదయింది

కానీ పట్టుదలగా నాకోసమేనేమో అన్నట్టు

అవి అక్కడే ఉన్నాయి

ఎంతకాలమయింది గమనించనే లేదు

గాలి మాత్రం కదులుతూనే ఉంది

గదిలో కాక మదిలో కూడా కదలికలు సాగుతూనే ఉన్నాయి

కలలు పరుచుకుంటూనే ఉన్నాయి

ఆకులు పువ్వులు మెరుస్తూనే ఉన్నాయి

కనీసం గుర్తుకు వచ్చినప్పుడు వాటికి నీళ్లు పోయాలి

అవి తలెత్తి పలకరించిన భావం కలుగుతుంది

అంతకన్నా ఆనందం మరి ఏం కావాలి

 

నా ఆలోచనలను మరెవరు విన గలుగుతారు

నా ఆనందాన్ని మరెవరు అనుభవించ గలుగుతారు

లోనికి మరలి బతుకుతున్న నేను మరెవరికి అర్థమవుతాను

గాలి చాలదా పలకరించడానికి

కిటికీలోంచి కనిపించే పాత దృశ్యాలలోనే

కొత్తదనాన్ని వెతుక్కోవాలి

ఆనందం వెతికితే దొరకదు

నీ తీరును బట్టి అదే వద్దన్నా వస్తుంది

No comments: