Friday, May 29, 2026

నక్షత్రాలు ఏమయినయి ?


నక్షత్రాలు ఏమయినయి?


చిన్నతనంలోనూ, కొన్నేళ్ల క్రితం కూడ పల్లెకు పోయి ఆరుబయట పండుకుంటే ఆకాశంలో నక్షత్రాలు ధాన్యం ఆరబోసినట్టు చిక్కగా కనిపించేటివి. పట్నం జేరిన తరువాత నక్షత్రాలు కనిపించడం కరువయిపోయింది. అందుకు కారణం కాంతి కాలుష్యం అని సులభంగనే చెప్పవచ్చు. మనుషులు ఏర్పాటు చేసుకున్న వెలుగులు ఆకాశంలోకి కూడ వెదజల్లబడి అక్కడ చుక్కలు మనకు కనిపించకుండ చేస్తున్నయి. ఈ వెలుగుల కారణంగ ఆకాశం వెలుగుతున్నది అని అర్థం.
నక్షత్రాలను, అంతరిక్షంలోని ఇతర అంశాలను పరిశీలించే ఖగోళ శాస్త్రజ్ఞులకు, ఇదంతా పెద్ద సమస్యగ చాల కాలంగనే తెలుసు. కనుక అంతరిక్షంలో నుంచి ఈ కాంతి కాలుష్యాన్ని కొలతలు వేసి చూచినరు. అయితే అంతరిక్షంలోని ఉపగ్రహాలు కాంతిని మనిషి కళ్ళు చూచినట్టు చూడలేవు. కనుక వాటికి కనిపించే అంశాలు మనకు కనిపించే అంశాలకంటే వేరుగ ఉంటయి. మనిషి వెలుగులు మరి ఆకాశంలో ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నయి అన్న ప్రశ్న గురించి పరిశోధనలు అంటే ప్రయోగాలు మొదలయ్యనయి.
జర్మనీ దేశంలో క్రిస్టఫర్ కైబా అనే పరిశోధకుని నాయకత్వంలో ఒక జట్టు ఈ అంశం గురించి బాగ పరిశీలిస్తున్నది. నక్షత్ర పటాలను వారు తయారు చేస్తున్నరు. అటువంటి ఒక పట్టణంలో ఆకాశం బాగ వెలుగుతుంటే పెద్ద నక్షత్రాలు మాత్రమే కనిపిస్తయి. ఆ తరువాత అంతగా వెలుగులేని నక్షత్రాలు కూడా కనిపించే పటం ఒకటి ఉంటుంది. వాటిని మామూలుగ మనిషి కండ్లు గూడ చూడగలుగుతయి అంటున్నరు. కనుక మనుషులు ఆకాశంలోకి తొంగి చూచి ఈ పటాలలో కనిపించే తీరు వారికి కనిపిస్తున్నదా లేదా అన్న అంశాన్ని బేరీజు వేసుకుంటరు.
2011 సంవత్సరంలో మొదలయ్యి మొన్న మొన్నటి దాకా సాగిన ఈ ప్రయత్నంలో ప్రపంచమంతటా కనీసం 50,000 మంది పౌర పరిశోధకులు పాల్గొన్నరు. ఎక్కడికక్కడ ఆకాశంలో వెలుగులను నక్షత్రాలను వాళ్లంతా లెక్కలు వేశినరు. ప్రాంతానికి ప్రాంతానికి మధ్య తేడాలు ఉండడం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. యూరోప్ ఖండంలో కాంతి కాలుష్యం ఏటేటా ఆరున్నర శాతం పెరుగుతున్నదని వాళ్లంతా లెక్క తేల్చినరు. అటు ఉత్తర అమెరికాలో ఈ కాలుష్యం 10% కంటే ఎక్కువగ ఉంది. అవును మరి, అక్కడ వెలుగులు కూడ చాల ఎక్కువ గద. మొత్తానికి మొత్తం ప్రపంచంలో సగటున ఏటేటా తొమ్మిది శాతం వరకు కాంతి కాలుష్యం పెరుగుతున్నట్టు కనుగొన్నరు.
మామూలుగ ఆలోచిస్తే ఇదేమంత గొప్ప విషయం కాదు అనిపించవచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం అంచెలంచెలుగ పెరిగిపోతుంది. అదేదో చక్రవడ్డీ పెరిగినట్టు పెరుగుతుంది. ఏటా పది శాతం కాంతి కాలుష్యం అంటే ప్రతి ఏడు ఎనిమిది సంవత్సరాలకు నక్షత్రాలు కనిపించడం సగానికి సగం తగ్గుతుంది అని అర్థమట.
కైబా గారు అనుచరులతో కలిసి ఈ మధ్యనే సైన్స్ అనే పత్రికలో ఒక పరిశోధన పత్రాన్ని ప్రకటించినరు. ఒకరికి ఎవరికో మొదటి రోజుల్లో 250 నక్షత్రాలు కనిపిస్తే ఆ వ్యక్తికి 18 సంవత్సరాలు వయసు వచ్చే లోపల కేవలం 100 నక్షత్రాలే కనిపిస్తయి అని లెక్క తేల్చినరు. ఆ సమయంలో ఆకాశంలో వెలుగు నాలుగంతలు పెరిగిపోయిందని అర్థం.
అటు అంతరిక్ష నౌకలో వారు మాత్రం, ఏటేటా రెండు శాతం పెరుగుదలను మాత్రమే గమనించినట్లు చెప్పినరు. అది అసలు నిజం పరిస్థితి కానే కాదు. ఉపగ్రహాలు తమ లెక్కలలో చాలా తక్కువ మార్పులు మాత్రమే చూపిస్తున్నయి, అని కైబా బృందం వారు నిస్సందేహంగ తేల్చివేశినరు. అసలు కొంతకాలం పోతే ఆకాశంలో నక్షత్రాలు కనిపించని కనిపించవేమో అంటున్నరు.
టెక్నాలజీ లో వస్తున్న మార్పుల కారణంగ ఈ కాలుష్యం బాగ పెరుగుతున్నది అని పరిశోధకులు తేల్చినరు. ఒకప్పుడు వీధి దీపాలలోని ఎర్రని వెలుగు ఒక రకంగ ఉండేది. ఇప్పుడు ఎల్ఈడి బల్బులను వాడుతున్నరు. అందులో నుంచి వచ్చే కాంతి కొంత నీలంగ ఉంటుంది. నీలం వెలుగు సులభంగ పరుచుకుంటుంది. భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు మాత్రం ఈ రకం వెలుగును అంతగా చూడలేవు. పైగా అవి నగరాలలోని వెలుగును మాత్రమే బాగా చూడగలుగుతయి. ఇళ్లలో నుంచి కిటికీలోనుంచి బయటకు వచ్చి అదే తలంలో పరుచుకునే వెలుగును మనుషులు బాగా చూడగలుగుతరు. దాని ప్రభావానికి సులభంగా గురవుతరు.
ఇటువంటి వెలుగు ప్రభావం అక్కడ ఉండే మనుషుల మీద చాలా ఉంటుంది. అక్కడి జంతువులు మొక్కల మీద కూడా ఈ వెలుగు ప్రభావం బాగ ఉంటుంది. వెలుగు వల్ల గజిబిజిపడ్డ పక్షులు తమ వలస మార్గాలను సరిగ్గా అనుసరించలేకపోతయి. చివరకు మిణుగురు పురుగులు కూడ ఈ వెలుగుకు తికమక పడతయి. మనుషులకు కలిగే ఆరోగ్య ప్రభావాలలో నిద్రలేమి అన్నిటికంటే ముఖ్యంగ ఉంటుంది.
వాతావరణం వేడెక్కుతున్నది అని ఒక పక్కన గోల చేస్తున్నరు. ఈ వెలుగు కాలుష్యం కూడా అదే పద్ధతిలో ప్రపంచమంతటా పరుచుకుని ఉంటుంది. ఎవరికి వారు దీని నుంచి బయటపడే మార్గం లేనేలేదు. వాతావరణం వేడెక్కడం కూడ ఇదే పద్ధతిలో ఏటా పది శాతం ప్రకారం పెరిగి ఉంటే తప్పకుండ దానిమీద తీవ్రమైన ప్రయత్నాలు జరిగి కొంతవరకు అదుపు కూడా వీలయి ఉండేది. ఈ కాంతి కాలుష్యాన్ని ఎవర పట్టించుకోవడం లేదు.
నిజానికి రాత్రిపూట ఎక్కువ వెలుగు ఉంటే భద్రతగ ఉంటుంది అని చాలామంది భ్రమ పడుతున్నరు. వెలుగు బాగ ఉన్నందుకు రాత్రిపూట దారుల మీద ప్రమాదాలు తక్కువ కావచ్చు, నిజమే. అయితే ఆ రకమైన రక్షణ అనుకున్నట్టు జరగడం లేదు అని పరిశోధకులు అభిప్రాయం. పుడుతున్న ఈ వెలుగులు నిటారుగ ఆకాశంలోకి వెదజల్లబడతయి కానీ, మామూలుగ కిందికి సాగవు.
ఆకాశం మళ్ళ మొదటిలాగ కనిపించాలంటే ఏం జేయాలె అన్నది ఒక ప్రశ్న.
అంతర్జాతీయ చీకటి ఆకాశం సంఘం అనేది ఒకటి తయారయి ఉందని, అది తీవ్రంగ పనిచేస్తున్నదని మామూలు మనుషులకు తెలియకపోవచ్చు. వెలుగులను మరింత తెలివిగ వాడుకోవాలని వారు ఎక్కడికక్కడ ప్రచారం చేస్తున్నరు. వీధి దీపాల కాంతి పైకి పోకూడదు కిందకు మాత్రమే రావాలె అని వారు సలహా ఇస్తున్నరు. విద్యుత్తును ఆదా చేయగల బల్బులను వాడాలని కూడ చెబుతున్నరు.
వెలుగు కాలుష్యం గురించి అందరికీ తెలియజేయడం చాల అవసరం. ఇంటి బయట రాత్రంత అనవసరంగ వెలుగుతున్న బల్బులను స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ఇటువంటి ఏర్పాట్లను ఎక్కడికక్కడ స్థానికంగ చర్చించి అక్కడి పరిస్థితులకు అనుకూలంగ ఏర్పాటు చేసుకోవాలె. అందర చీకటిలో బతకండి అని మాత్రం కానే కాదు.
కాంతి కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలను తక్కువగ అంచనా వేసేందుకు లేదు. ప్రకృతి అందం పాడుగాకుండ ఈ వెలుగులను వాడాలె. రాత్రిపూట ఆకాశం అన్నిటికన్న అందమైన దృశ్యం. దాన్ని చేతనయినంతవరకు కాపాడుకోవాలె. చుక్కలు అంటే ఉల్కలు రాలిపడడం, చంద్రగ్రహణం వంటి వాటిని అందమైన దృశ్యాలుగ గుర్తించి పరిశీలించాలె. రాత్రిపూట ప్రకృతిని పరిశీలించే అదృష్టం గలవారు ఆ అందం గురించి ఎంతయినా చెప్పగలుగుతరు. రాత్రి ఆకాశం నిజంగా అందమయినది.
కాంతి అన్నది పరిశోధకులకు మాత్రమే సమస్య కాదు. పట్టణాలలో బతికే వారికి ఈ సమస్య గురించి అసలు తెలియనే తెలియదు. ఆకాశంలో నక్షత్రాలు ఉంటయి అన్న సంగతి వాళ్ళు మరిచిపోయినరు. రాత్రి చీకటి ఆకాశము మనకెంతో అవసరం. పొద్దు మూకితే చాలు ఆ అందాలు కనిపించే ఏర్పాట్లను మనం జాగ్రత్తగ చేసుకోవాలె. వీలయినప్పుడంత నగరాల వారు కూడ దూరంగా వెళ్లి నక్షత్రాలను చూచి ఆనందించడం నేర్చుకోవాలె.



 

No comments: