Showing posts with label discussion. Show all posts
Showing posts with label discussion. Show all posts

Monday, June 1, 2026

లోకాభిరామం : సైన్స్ కూడా నమ్మకమే


సైన్స్ కూడా నమ్మకమే

సైన్సు- గండుచీమనాకు సంగీతం చీమ కుట్టిందని, ఒకానొక సారి అన్నట్టు గుర్తు. నాకు సాహిత్యం చీమ కూడా కుట్టింది. వీటన్నింటికీ మించి సైన్సు అనే గండుచీమ రక్తం వచ్చేదాకా కుట్టింది. ‘మీరు కొందరిని మతోన్మాదులు అంటున్నారు. వారు మనలను సైన్సు ఉన్మాదులు అంటారేమో చూడండి’ అని అడిగేంత ఘాటుగా కుట్టింది ఆ చీమ. ఈ మధ్యన ఏదో రాతకు తయారవుతున్న ప్రయత్నంలో భాగంగా, మనం మేలుకుని ఉన్నా, నిద్ర పోయినా, అంతా బయోకెమిస్ట్రీ, అని వాక్యం రాసుకున్నాను. నాకు ఈ ప్రపంచమంతా సైన్సుగానే కనపడుతుంది. మిగతావారికి అట్లాగ ఎందుకు కనిపించడం లేదని, అనుమానం కూడా వస్తుంది.

మనం ఉందనుకుంటున్న ఈ విశ్వం, అందులో సౌరమండలం, అందులో భూమి, అందులో జీవం, అందులో మనం మొదలైనవన్నీ మన, (మనలాంటి వారే అయిన తరతరాల మనుషుల) మెదడుల్లో నుంచి పుట్టిన అవగాహనలు. ఆలోచనలు పుడతాయి. వాటి గురించి ప్రయోగాలు జరుగుతాయి. కొన్ని విషయాలకు రుజువులు దొరుకుతాయి. అవన్నీ కలిపి సైన్సుగా నిలుస్తాయి. భౌతిక ప్రపంచంలో కూడా పదార్ధంగా, యదార్ధంగా ఉన్నవాటిని గురించిన సైన్సు ఒక భాగం. కేవలం అనుభవంలో మాత్రమే ఉండే ఆలోచనలు, సిద్ధాంతాలు కూడా ఒక భాగం! ఇది కూడా సైన్సే! వీటన్నింటికీ, ప్రపంచమంతటా ఆయా పరిస్థితుల్లో ఒకేరకమైన అనుభవాలు, ఆధారాలు దొరుకుతాయి. కనుక అది ఒక సైన్సు!

ఈ మన మెదడు (మెదడుల)లోనే మరికొన్ని ఆలోచనలు మొదలవుతాయి. అవి అందరికీ ఒకే రకంగా అనుభవంలోకి రాక పోవచ్చు. వాటికి ఆధారాలు అందరికీ ఒకే రకంగా అందవు కూడా! ఆలోచన ధోరణి, మెదడు మొదలైన సైకాలజీ దీనికి మొదటి ఉదాహరణేమో?

విశ్వం ఉందని అందరూ అంటున్నారు గనుక మనమూ ఉందంటున్నాం. అది నిజంగా ఉందని ఎవరూ చూడలేదు. ఉందన డానికి చెపుతున్న లెక్కలు, ఆధారాలు మొదలైనవి అందరికీ ఒకేలాగ అర్థం కావడంలేదు. సైన్సు చదువుకున్న వారికి కూడా సైన్సు అర్థం కాలేదు. సైంటిస్టులం అంటున్నవారు కూడా సైన్సు వేరు, బతుకు వేరు అనుకుంటున్నారు. నమ్మకాలు మెదడు లోనే పుడతాయి. అనుభవాలూ మెదడులోనే పుడతాయి. వాటిలో ఒకదానికి ఒకటి జోడించి చూడడం చేతగాదు. అంతా గజి బిజి గందర గోళం అవుతుంది. ఏది ఉంది, ఏది లేదు తేల్చుకోలేము. బతుకంటే భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ అంటే నవ్వుతారు మరి. నవ్వేవారి తప్పు లేనేలేదు. వారలకు అంతగా చీమ కుట్టలేదు మరి. సైన్సయినా, మరోటయినా ఉందనుకుంటే ఉంది. లేదను కుంటే లేదు.

ఒక మిత్రుడెవరో చాలాకాలం తరువాత కనబడతారు. ఎవరెవరి గురించో అడుగుతాము. ఫలానా వాడు ఎక్కడా? అంటే ‘అయ్యో! తెలియదా? వాడుపోయి నాలుగేళ్లయింది!’ అంటాడా మిత్రుడు. మనమేమో ఆ ‘ఫలానా’ ఇంకా ఎక్కడో ఉన్నాడనే అనుకుంటున్నాము. ఆయన పోయి నాలుగేళ్లయినా, మనకు మాత్రం ఆ క్షణాన్నే పోయాడు. అసలా సంగతి గురించి ఇంకా నమ్మకం కుదరదు. భౌతికమైన మనిషి సంగతే ఇట్లాగయితే, ఉన్నామో లేదో, ఎవరికీ తెలియని అనుభవైక వేద్యాల సంగతేమిటి?

తరం-తరం: మా తాతయ్య పుస్తక ప్రియులు. ఆయన వదిలి వెళ్లిన పుస్తకాలే అందుకు నిదర్శనాలు. ఎనిమిది రకాల రామాయణాలున్నాయి ఆయన లైబ్రరీలో. తాతయ్య పుస్తకాలలో టూరిజం, సైన్సు(!) రకం పుస్తకాలున్నాయని గమనించాను. ఆ కాలంలోనే ఆధునిక వైద్యం, ఆరోగ్యం లాంటి విషయాల మీద పుస్తకాలు వచ్చాయని, వాటిని తాతయ్య తెచ్చి చదువుకున్నాడని తెలిస్తే ఈ ‘తిక్కదనం’ నాటి నుంచీ ఉందని అర్ధమైంది. మ్యాజిక్, గుర్రాల పెంపకం, ఆయుర్వేదం,  చిట్కా వైద్యం లాంటి విషయాల గురించి కూడా తాతయ్య పుస్తకాలు సేకరించి పెట్టుకున్నాడు. నాకు చేతనయినంత కాలం ఆయన పుస్తకాలను నేను కాపాడుకున్నాను. చదువు పేరిట ఇల్లు వదిలి, తిరిగి వచ్చేసరికి, ఇంట్లో పుస్తకాలు మిగలలేదు. మిగిలినవి పుస్తకాల లాగ లేవు. అది గమనించి నేను పడ్డ బాధ వర్ణనాతీతం.

నాన్న సంప్రదాయ విద్య బాగా చదువుకున్న వ్యక్తి. కాని ఎందుకో ఆయన లైట్ రీడింగ్ మీద మాత్రమే మనసు పెట్టినట్టు గమనించాను. ఆయన కొన్న పుస్తకాలన్నీ ఇంచుమించు అదే రకం. అవి కూడా మిగలలేదు. సంవత్సరాల తరబడి సేకరించిన చందమామలు, నవలలు మాయమయినవి. నాన్న, నేనూ ఆ విషయంగా పెద్ద బాధపడినట్టు లేదు.

నాన్న సాంప్రదాయం మనిషే. అయినా పిసరంత కూడా ఛాదస్తం లేదు. ఎమ్మెస్సీలో క్లాస్‌మేట్స్ (గరల్స్) ప్రోద్బలంతో నేను మీసాలు పెంచుకున్నాను. ఇంటికి వెడితే అది చూచి తంతారేమోనని భయం. తలవంచుకుని ఇంట్లోకి వెళుతున్నాను. అరుగు మీద కూచున్న నాన్న నా ముఖంలోకి చూసి ‘భేష్ బాగుందిరా నాన్నా!’ అని నిజంగా మెచ్చుకున్నారు. మూన్ ఫేస్ అంటారే! ఇంచుమించు అమ్మాయి ముఖం నాది. పైగా రంగు. మీసాలతో మగతనం కనిపించిందని వ్యాఖ్య! అదీ నాన్న పద్ధతి. చిన్నప్పుడు నన్ను భుజం మీద ఎత్తుకుని ఇల్లంతా తిరుగుతుంటే నేను ఎడతెరిపి లేకుండా ‘అదేమి?  ఇదేమి’ అని ప్రశ్నలడగాలి. ఆయన సమాధానాలు చెబుతారు. కొన్ని ప్రశ్న తరువాత ‘చల్ బే (పోరా!)’ అంటారు. అది మాకు ఒక ఆట! నాకు బాగా గుర్తుంది! ఆ రకంగా ఆయన వెంట తిరుగుతూ ఎన్ని సంగతులు తెలుసుకున్నానో మరి! డిటెక్టివ్ నవలలు చదివితే పరిశీలన, విశ్లేషణ అలవాటవుతాయని నాన్న చెప్పాడు. పైగా నాన్న చర్చకు, ప్రశ్నలకు అవకాశం కల్పించాడు. నాకు మరీ ధైర్యం ఎక్కువైంది కూడా. కొన్ని సందర్భాల్లో ‘నాకు తెలిసింది ఇంత. మా పెద్దలు చెప్పింది, వారికి తెలిసింది ఇంతే!’ అని ఓటమిని కూడా అంగీకరించే వాడు నాన్న! నాన్నకు నేనివాళ కృతజ్ఞత చెప్పగలనా?

నాకు ఎమ్మెస్సీలో గోల్డ్‌మెడల్ వచ్చిందని అమ్మ ఒక పండుగ పథకం వేసింది. బంధువులు మిత్రులు అందరూ వచ్చారు. పూజ (సత్యనారాయణ వ్రతమా?) ఏర్పాట్లు అయినయి. ‘రా! కూచో!’ అన్నది అమ్మ! ‘అమ్మా, నాకు మనస్థిమితం కుదరదు. పిచ్చి ఆలోచనలు వస్తాయి. అట్లా చేయడం తప్పుగాదా? అని అడిగాను. అందరూ నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. నాన్న మాత్రం ‘వాణ్ని వదిలిపెట్టండి’ అని అమ్మతో తాను పూజకు కూర్చున్నాడు. ‘మా వెనక కూచుని చూడు!’ అన్నారు అంతే! నాన్న ఒకనాడు కూడా ‘ఈ విషయం మీరు చేసి తీరాల్సిందే’ అని చెప్పిన గుర్తులేదు మాకెవరికీ!

తరం మారింది: సైన్సు ప్రకారం బతకడమని ఒకటుందని చాలామంది సైంటిస్టులకే తెలియదు. సంపూర్ణ సూర్యగ్రహణం గురించి పరిశోధించడానికి వెళ్లిన ఒకాయన బురద నీళ్లలో స్నానం చేశాడని యూనివర్సిటీ రోజుల్లో చెప్పుకున్నారు. అట్లాగని, మతాన్ని, నమ్మకాలను కాదనడం సైన్సనుకుంటున్నారేమో? మతం వ్యక్తిగతం, సైన్సు సార్వజనీనం! పరిశీలన, ప్రయోగం లాంటి అంచెలతో సాగుతుంది సైన్సు పద్ధతి! అది వంటబట్టడానికి సైన్సు చదవనవసరం లేదు.

నాకొడుకు మరీ చిన్నవాడుగా వున్నప్పుడు, వాడూ, నేనూ మాత్రమే మహబూబ్‌నగరం దాకా బస్సులో ప్రయాణం చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఇంట్లో నిశ్శబ్దంగా ఉంటుంది గానీ, పిల్లలిద్దరూ చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు వారితో నేను తెగ గోల చేసేవాడిని. బస్సులో గోల చేయలేదు గానీ! నేనూ నా కొడుకు మాట్లాడుతునే ఉన్నామని తర్వాత అర్థమైంది. వాడికి బయట తిరగడం అదే కొత్త! కనిపించిన ప్రతి సంగతి గురించీ ప్రశ్నలడుగుతాడు. నాకు తెలిసింది నేను చెబుతాను. పాలమూరు అనే మహబూబ్‌నగర్ దగ్గరయింది. పక్కనకూచున్న పెద్దాయన, ఊరి మొదట్లోనే దిగడానికి సిద్ధమయ్యాడు. దిగబోతూ నావేపు చూచి ‘ఒక మాట చెప్పనాఅన్నాడు. ‘చెప్పండి’ అన్నాను. ‘మీ కొడుకుకు చాలా తెలివి ఉంది. మీకు అంతకన్నా ఎక్కువ ఓపిక ఉంది’ అన్నాడాయన! నేనీ సంగతి గురించి వ్యాఖ్యానించను.

కవిసమ్మేళనం-కొబ్బరి పచ్చడి: పుస్తక మేళాలో ఈ సంవత్సరం స్టాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలామంది మిత్రులు కనిపించారు కూడా. అక్కడ కవిసమ్మేళనం జరుగుతుందని మైకులో చెపుతున్నారు. పాల్గొంటున్న కవులందరూ మిత్రులు, కనీసం పరిచితులు. ఈ సంగతే నాతో ఉన్న మా అమ్మాయితో చెప్పాను కూడా. వేదిక ముందుకు వెళ్లేసరికి కవులంతా వేదికను అలంకరించారు. అంటే వేదికను ఎక్కారని అర్థం. కొంచెంసేపు ఉండి వెళ్లిపోదాములే! అంటున్నాను అమ్మాయితో. ఇంతలో ఫోను మోగింది. దూరం వచ్చి వింటే ‘ఇడ్లీలోకి కొబ్బరి పచ్చడి చేయమంటారా సార్’ అని ప్రశ్న. వంటాయన! రామాయణంలో పిడకల వేటలాంటి టైటిల్ గుర్తువచ్చింది. సైన్సుకూ, ఈ ముక్కకూ సంబంధం లేదని మనవి!


 

Thursday, April 30, 2026

సినీమానసం - On cinemas and my feelings!





సినీమానసం

చందమామలు - ప్రేమకథలు

మా వాళ్లలో పెద్ద పండితులు లేరంటే తప్పే. చాలా బాగా చదువుకున్న వారున్నరు. కానీ, లౌక్యం మాత్రం బాగ తక్కువ. గొప్ప పండితులు కూడ ప్రపంచం పట్టకుండ వ్యవసాయంతోటి కాలం గడిపి పోయినరంటే ఆశ్చర్యంగ ఉంటుంది. దూర దేశాలకు పోయి బాగ చదువుకున్నవారు గూడ ఏమీ తెలియని వారిలాగే బతకడం నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కంచి చంద్రశేఖరేంద్ర స్వామి పాలమూరు వచ్చినరు. కలెక్టరు సభ చేయించినరు. అక్కడ మావారొకరిద్దరు వేదం చెప్పినరు. స్వామికి కలిగిన సంతోషం అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. మరోవేపు కొంతమంది మాత్రం ఉద్యోగానికి సరిపడ చదువు, సగటు బతుకుకు సరిపడ వైదికం ఉంటే చాలనుకున్నరు. సమకాలీన సాహిత్య, సంగీతాలు పట్టించుకున్న వారు మాకు చాలా తక్కువమందే ఉన్నరు. నాటికీ, నేటికి కూడ! అలాంటి చిన్నాయినగారు ఒకాయన, పిల్లవాడు ‘చందమామ చదువుతున్న’ అంటే, ‘చందమామలు, ప్రేమకథలు’ కాలయాపన! అన్నరంటే ఆశ్చర్యం ఏముంది.

నూచి వాడూ - గైడూ: నూచివాడంటే మా ఒకానొక అన్నయ్య శ్రీనివాసు. ఈ శ్రీనివాసుడన్న పేరు ఎన్ని రకాల మారిందో గమనిస్తే సరదాగ ఉంటుంది. నాకొక నివాస్‌ తెలుసు. ఒక సీను, మరొకరు శ్రీను. ఇక చీనులు, చీనాలు ఎంతోమంది ఉన్నారు. చీను మామ చీమా అవుతాడు. మా అమ్మ తనకన్నా వయసులో పెద్దయినా, వరుసకు మాత్రం అల్లుడయ్యే ఒక పెద్దాయనను శీనువాచార్లు అనేది (నా మీద అనునాసికం పలకాలి. అరుసున్నలేమయినయి?) అలై ఓసై అనే తమిళ నవలకు మిత్రులు వాకాటి చేసిన అనువాదాన్ని ఈ మధ్య చదివాను. అందులో ఒక చీమాచ్చువయ్యర్‌ ఉంటాడు. శ్రీనివాస య్యర్‌ అన్నమాట! ఇతిశ్రీనివాస చర్చా! అథాతో గైడు జిజ్ఞాసా? (శ్రీనివాసుని ముచ్చట ఆపుదము. గైడు గురించి తెలుసుకుందము!)

మా చీమాచ్చువయ్యంగార్‌. కాదుకాదు నూచి వాడు గైడ్ అను చిత్రరాజము ఊర్లో ఆడినన్ని నాళ్లు నిత్యం ఒకసారి చూచినట్లున్నడు. మరోసారి చూచినా నాకు చెప్పలేదేమో? అది దిలీప్‌కుమార్‌, దేవానంద్‌, రాజ్‌కపూర్ల యుగం. ఈ దిలీప్‌కుమార్‌ అన్నాయన ఇవాళటి మేటి హీరోలలాగే ఒక ఖాన్‌ సాహిబ్‌. కానీ ఎందుకో పేరు మార్చుకున్నడు. ఈ ముగ్గుర్లోనూ దేవానంద్‌ది విచిత్రమయిన ధోరణి. ఆయన దుస్తుల తీరు, మాటల జారు (జారుడు), అంతా ప్రత్యేకంగ ఉండేది. సాహిత్య రుచి తగిలిన వారలము గనుక, అప్పటికే ఆర్‌కే నారాయణ్‌ రచనల రుచి తెలుసు. ఆయన కలం నుంచి రూపుపోసుకున్న గైడ్‌ ఎట్లాగుంటడని ఒక కుతూహలం. నూచివానికి ఉన్న వెసులు బాటు నాకు లేదు. నా దగ్గర పైసలుండవు. ఎవరినీ అడగడం ఇష్టం లేదు. నేను ‘మేరానాం జోకర్‌’ అనే సినిమా చూడడానికి ప్రయత్నించి కూడా చూడలేక పోయిననంటే నమ్మగలరా? నేనా సినిమా ఇవాళటికీ చూడలేదు. గైడ్‌ మాత్రం చూచిన. చాలా గొప్ప చిత్రం. నూచివాని పైసలతో ఒక హిందీ వర్షన్‌ పుస్తకం కొన్నము. సులభంగ చదివినము.

ఒకరి లక్షణాలు మరొకరికెవరికయిన వచ్చినయని, సహవాసం వల్లనయితే మరింతగ, చెప్పేందుకు మా వాండ్లు ‘వాని గుడ్డ వీని మీద పడింది’ అంటరు. సాధువులెవరో, చలిలో వణుకుతున్నందుకు కప్పిన గుడ్డ కారణంగ దేవానంద్‌ ఈ సినిమాలో స్వామీజీ అవుతడు. వర్షాల కోసం అతను ఉపవాస దీక్ష చేయవలసి వస్తుంది. మీకు హిందీ అర్థంకానీ, కాకపోనీ, ఈ సినిమా ఎట్లాగయిన చూడమని మనవి! అంత బాగుంటుందది. సూపర్‌ పాటలుంటయి. ఆర్కియాలజీ తప్ప మరొకటి తెలియని ముసలి మొగుడు ప్రొఫెసర్‌కు, అందంగా ఉండి, అద్భుతంగ నాట్యం చేయగల భార్య. హైదరాబాద్‌ అమ్మాయి వహీదా రహమాన్‌ (పేరు మార్చుకోలేదు) వేసింది ఆ పాత్ర. మొగుడు గుహల్లో శిథిలాలు వెదుకుతుంటే, ఈమె మన రాజూ గైడ్‌తో ప్రేమను వెదుకుతుంది. ఇద్దరూ కలిసి పారిపోతరు. డాన్స్‌షోలు చేసి పేరు, పైసా సంపాయిస్తరు (ఆ కాలంలో సినిమా హీరో లందరికీ పాత్ర పేరు రాజు అని ఎందుకు ఉండేది?) కథ అంతా చెపితే బాగుండదు. కానీ దేవానంద్‌ జైల్లో పడతడు. ఆ తరువాత స్వామీజీ అవుతడు. నేను కూడా సినిమా ఒకటికి రెండుసార్లు చూచిననేమో గుర్తులేదు. కానీ, ‘అంగ్రేజీ ఆతీతోనా?’ లాంటి డయలాగులు ఎన్నో మాకు నిత్యం అనుకోకుండనే నోటెంబడి వచ్చేస్తుండేవి. చివరికి దేవానంద్‌ మెరిసే శాలువా ఒకటి కప్పుకుని తెర నిండ కనిపిస్తడు. మాకేమో, మనం కూడా శాలువా కప్పుకుంటే, రాజూ గైడ్‌ అయిపోతమోనని ఆశ! ఏదీ శాలువా దొరకదే! అదీ పసుపురంగుది!

ఆ సినిమాలో ‘గాతా రహే మేరా దిల్‌’ అని గొప్ప యుగళ గీతం ఒకటి ఉంటుంది. దేవానంద్‌ ఒక కొండ మీద నుంచి ‘గాతా రహే మేరా దిల్‌’ అంటడు. మరో కొండ మీద నుంచి వహీదా ‘తూహీ మేరీ మంజిల్‌’ అంటుంది. తరువాతి చరణం పాడే సమయానికి ఇద్దరూ ఒకచోటనే ఉంటరు. వాస్తవికత మరీ తలకెక్కిన నాకు, వాళ్లట్ల ఎందుకు చూపించినరని, నాటికీ, నేటికీ అసంతృప్తి.

నవల - హిందీలో: సినిమా గొప్పగ ఉంది. కానీ, నవల మాత్రం అట్ల ఉండదని మాకిద్దరికీ అనుమానం వచ్చింది. గొప్ప చెప్పుకోవడం లేదు గానీ, ఒక పుస్తకం చదివినా, సినిమా చూసినా, దాన్ని గురించి బాగ వివరంగ ఆలోచించడం, చర్చించడం చిన్నప్పటి నుంచీ మాకు అలవాటు. ‘గైడ్‌’ నవల అప్పటి వరకు చదవలేదు. పాలమూరులో పుస్తకాల దుకాణాలే తక్కువ. వాటిలో బడి పుస్తకాలుంటయి గానీ, నవలలూ, ఆధునిక సాహిత్యం ఉండవు. (బహుశ పరిస్థితి ఇవాళటికీ అట్లనే ఉండి ఉండాలె! మా వాండ్లకు సంగీతం, సాహిత్యం ఆమడ దూరం!) హైదరాబాద్‌ అంటే అప్పటికి ఇంకా పట్నం! అంటే అందుబాటులో లేని ఆశాద్వీపం! మొత్తానికి వెతకగా వెతకగా మాకు ఒకే ఒక్క కాపీ హిందీ వర్షన్‌ దొరికింది. హిందీ చదవడం, అర్థం చేసుకోవడం బాగానే చేతనవుతుంది గనుక ఆ హిందీ పుస్తకం తెచ్చి ఏకబిగిని చదివినము. సినిమా కథకు, పుస్తకంలోని కథకు ఎంతో తేడా ఉందంటే నమ్మగలుగుతరా? తరువాతెప్పుడో తెలిసింది ఆర్‌.కే. నారాయణ్‌గారు, సినిమా చూచి ‘జన్మలో నా నవలలు సినిమా వారికి ఇవ్వన’ని నిర్ణయించుకున్నరని. అందుకు ఒకే ఒక్క మినహాయింపు ఉంది. సినిమా కాదు గానీ, టీవీలో ‘మల్‌గుడి డేస్‌’ అనే సీరియల్‌ వచ్చింది. స్వంతం తమ్ముడు లక్ష్మణ్‌ (కార్టూనిస్ట్‌) పక్కనుండి తీయిస్తనంటే, కొన్ని కథలు మాత్రం ఇచ్చినరు నారాయణ్‌.

ఏకవీర: నవల సినిమాగ రావడమంటే వెంటనే విశ్వనాథ వారి ‘ఏకవీర’ గుర్తొస్తుంది. నవలలాగే సినిమా కూడ చాల కళాత్మకంగ, బాగ వచ్చింది. అది తమిళ ప్రాంతానికి చెందిన కథ. వైగై తీరపు కథ. కుట్టన్‌ సేతుపతి, వీర భూపతి అన్న పాత్రలలో అన్నగారు నందమూరి వారు, కాంతారావుగారు ఎంతో బాగ చేశినరు. సినారె పాటలు, కథకు అతికినట్టున్నయి. మామూలు ప్రేమకథ. కానీ మహాకవి దాన్ని మహత్తర కావ్యంగా మలిచారు.

విశ్వనాథ వారు నాకు ఆరాధ్యులయిన, కొద్ది మందిలో ఒకరు. వారి గురించి ఎంతో ఉంది చెప్పుకోనడానికి. వారి కుమారులు పావని, నాకు మిత్రులు. ‘సీరియల్‌కు ఏ నవల బాగుంటుంది?’ అడిగారు. ‘రత్నావళి’ అన్నాను. ఆయన! భలే! అనడం గుర్తుంది. వేయి పడగలు తీసినట్టున్నరు. పండలేదన్నరు. ‘పులిముగ్గు’ లిస్టులో చూచిన. బాగా గ్రాఫిక్స్‌ కావాలె దానికి. అదసలు రానే లేదు!

గైడ్‌ సినిమాలో ఆర్కియాలజీ ప్రొఫెసర్‌గ నటించిన వారు, సినీ దర్శకుడు కిశోర్‌ సాహూ! ఆయన ‘పర్‌దే కే పీఛే’ అనే పేరుతో ఒక నవల రాశినరు. ‘తెర వెనుక’ అనే పేరుతో ఆ నవలకు తెలుగు రూపాంతరం ఏనాడో వచ్చింది. అది ఈ మధ్యన ఎక్కడ కనిపించ లేదు. దొరికితే బాగుండును, అని ఎన్నిసార్లు అనుకున్ననో. సినిమా రంగంలో జీవితాలు, ముఖ్యంగా స్త్రీల బతుకులను గురించిన మహత్తరమయిన రచన అది. పెద్దలు, అయినా మిత్రులు రావూరి భరద్వాజ గారి ‘పాకుడు రాళ్లు’ కూడ ఈ రకం ఇతివృత్తంతో వచ్చిన రచనే!

స్మితా పాటిల్‌ హీరోయిన్‌గ వచ్చిన ‘భూమిక’ అన్న సినిమా కూడ ఒక నటి బతుకు గురించే! ఆ కథ అంతకు ముందు నవలగ వచ్చిందేమో తెలియదు. ఒక మామూలు ఇంటి ఆడకూతురు మహత్తర నటిగా మారి పడిన కష్టాలు ఆ సినిమాలో చాల బాగ చూపించినరు. ఎవరో మరాఠీ నటి జీవితమని అన్నట్టు గుర్తు.

ఈ మధ్యనే గతించిన మిత్రులు (అల్లుడు, నన్ను మామయ్యా అనే వారాయన!) భరద్వాజ నవల పాకుడు రాళ్లు కూడ సినీ నటి బతుకు గురించే. భరద్వాజ మద్రాసు సినీ మాయా ప్రపంచంలో చూచిన సంగతులు నవలగ రాసి ఉంటరు. ఆ నవల మరి సినిమాగ వచ్చిందా? తెలుంగులో అటువంటి ‘బొమ్మ’ తీసే ఎవరన్న చూస్తరా? మనకంతా బాయ్‌ మీట్స్‌ గరల్‌తోనే గద బతుకంత!