Friday, December 12, 2025

ఆమె కథ పాలస్తీనా జానపద కథ - Palastine folk tale told in Telugu

ఆమె కథ

పాలస్తీనా జానపద కథ


ఆమె కథ

ఒకావిడ ఉండేది. ఆమె పేరు కన్ఫ్యూషియా. ఒకసారి ఒక దర్వేష్‌ ఆమె ఇంటిముందు నుంచి వెళుతున్నాడు. ఆయన మెడలో ఒక పెద్ద జపమాల వేసుకుని ఉన్నాడు. బాగా ఒళ్లు పెరిగి నవనవలాడుతూ ఉన్నాడు. కన్ఫ్యూషియా ఆయనను చూచింది. కొంత ఆశ్చర్యంతో పిలిచి ‘ఏం అమ్ముతున్నావు?’ అని అడిగింది.

పేర్లు’ అతను జవాబిచ్చాడు.

పేర్లా?’ కన్ఫ్యూషియా మళ్లీ అడిగింది.

అవును. నేను పేర్లు అమ్ముతాను.’

ఒక పేరుకు ఎంత తీసుకుంటావు?’ కన్ఫ్యూషియా అడిగింది.

అయిదు నూర్ల దీనార్లు’ అన్నాడతను.

కన్ఫ్యూషియా కూడబెట్టుకున్న డబ్బులు సరిగ్గా అయిదు నూర్లే ఉన్నాయి. ఆమె లోపలికి వెళ్లి అయిదు నూర్ల దీనార్లు తెచ్చి దర్వేష్‌కు ఇచ్చేసింది. ‘ఇవాళ నుంచి నీ పేరు ఫేర్నీ’ అన్నాడు అతను.

సాయంత్రం కన్ఫ్యూషియా వాళ్లాయన ఇంటికి వచ్చాడు. కన్ఫ్యూషియాను పిలిచాడు. ‘కన్ఫ్యూషియా, కన్ఫ్యూషియా! బయట బండి నిలబడి ఉంది. సరుకులు దింపుకో!’ అన్నాడు.

కన్ఫ్యూషియా మాత్రం జవాబు ఇవ్వలేదు.

భర్త మళ్లీ కన్ఫ్యూషియాను పిలిచాడు. జవాబు మాత్రం రాలేదు.

కన్ఫ్యూషియా, ఏమిటి సంగతి? ఎందుకు బదులు పలకడం లేదు?’ అతను అడిగాడు.

నా పేరు ఫేర్నీ!’ కన్ఫ్యూషియా చెప్పింది.

ఫేర్నీయా!’

అవును ఫేర్నీ’ అన్నది కన్ఫ్యూషియా.

ఈ పేరు ఎవరు పెట్టారు?’ భర్త అడిగాడు.

ఒక ఫకీరు. ఆయన ఇటుగా వెళుతున్నాడు. పేర్లు అమ్ముతున్నాడు. అయిదు నూర్ల దీనార్లు ఇచ్చి ఆయన దగ్గర పేరు కొన్నాను’ జవాబుగా కన్ఫ్యూషియా చెప్పింది.

అయిదు నూర్లే!’ కన్ఫ్యూషియా మొగుడు ఆశ్చర్యంతో అడిగాడు.

జవాబుగా ఆమె తల ఆడించింది.

భర్తకు చాలా కోపం వచ్చింది. అతను మళ్లీ కోటు తొడుక్కున్నాడు. ‘నేను వెళుతున్నాను. నీకన్నా పిచ్చి ఆడమనిషి మరొకరు కనిపించేదాకా మళ్లీ ఈ ఇంటిముందుకు రాను’ అని గట్టిగా చెప్పాడు.

అతను ఇంటి నుంచి బయలుదేరాడు. చాలా రోజులు ఆలా తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడయినా ఒక ఫకీరు కనిపిస్తే, వెళ్లి పేర్లు అమ్మే దర్వేష్‌ నీవేనా? అని అడుగుతాడు. ఆ మనిషి కాదంటాడు.

ఒకనాడు అతను దారి వెంట నడుస్తున్నాడు. ఒక ఆడమనిషి కనిపించింది. ‘మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు?’ అని ఆమె అడిగింది.

నరకం నుంచి’ జవాబుగా అన్నాడతను.

అక్కడ మీకు మా నాన్న కనిపించాడా?’ ఆ ఆడమనిషి అడిగింది.

, ఆయనను చూచాను’ జవాబిచ్చాడు.

ఎలాగున్నాడు?’

పరిస్థితేమీ బాగోలేదు.’

మీరు తిరిగి అక్కడికి వెళుతున్నారా?’ ఆడమనిషి అడిగింది.

అవును’ ఇతను చెప్పాడు.

కొన్ని వస్తువులు తీసికెళ్లి నాన్నగారికి ఇస్తారా?’ ఆమె అడిగింది.

ఎందుకివ్వను.’

ఆడ మనిషి అతడిని ఇంటిదాకా తీసుకుపోయింది. కొంత వెన్న, కొన్ని డబ్బులు, భర్తగారి ఒక కోటు తెచ్చి ఇచ్చింది. అతను అన్ని వస్తువులను చక్కగా మూటగట్టుకుని బయలుదేరాడు.

ఆ ఆడమనిషి భర్త ఇంటికి వచ్చాడు. భోజనం చేశాడు. అతనికి బయటకు వెళ్లి నేస్తాలతో కబుర్లు చెప్పాలని అనిపించింది. పెళ్లాన్ని పిలిచాడు. కోటు తెచ్చి ఇమ్మన్నాడు.

ఆమె కోటు ఎవరో ఒకాయనకు ఇచ్చేశాను అని చెప్పింది. భర్త ఆశ్చర్యంతో ఎందుకు అని అడిగాడు.

ఆయనేమో నరకం నుంచి వచ్చానన్నాడు. అక్కడ మా నాన్నగారిని చూచావా అని అడిగాను. అవును చూచాను అన్నాడు. కష్టాలలో ఉన్నాడు అని కూడా చెప్పాడు. అందుకనే నేను ఆయనకు కొంచెం వెన్న, కొన్ని డబ్బులు, నీ కోటు ఇచ్చేశాను, నాన్నకు ఇమ్మన్నాను.

బాప్‌రే, అతను ఎటువేపు వెళ్లాడు?’ అన్నాడు ఆ మనిషి.

ఆమె సైగచేసి చూపించింది. వెంటనే అతను బయటికి పరుగు పెట్టాడు. గుర్రం ఎక్కాడు. అదే దారిలో బయలు దేరాడు. కొన్ని గంటలు పోయిన తరువాత ఒక మనిషి కనిపించాడు. అతను నిజంగానే కన్ఫ్యూషియా మొగుడు. ఇతను రావడం చూచి అతను పక్కనే ఉన్న ఒక గోడ రంధ్రంలో తన చేతిలోని మూటను దాచేశాడు. అమాయకంగా గోడకు ఆనుకుని నిలబడ్డాడు.

వచ్చినతను కన్ఫ్యూషియా మొగుడి దగ్గరకు వెళ్లి అడిగాడు.

వెన్న, కోటు తీసుకుపోతున్న ఒక మనిషిని ఎవరినయినా చూచావా తమ్ముడూ?’

అవునండీ’ కన్ఫ్యూషియా మొగుడు జవాబుగా అన్నాడు.

చాలాదూరం వెళ్లి ఉండడు. నేను అతడిని పట్టుకోగలనంటావా?’

తప్పకుండా. కానీ మీరు గుర్రం దిగి నడకలో పోతే, పట్టుకోగలరు.’

అదెట్లా?’

గుర్రానికి నాలుగు కాళ్లుంటాయి. మనిషికి రెండే కాళ్లుంటాయి. రెండు కాళ్లు ఉంటే వాటి మధ్యన పొంతన చాలా బాగుంటుంది. మరి నాలుగు కాళ్లు ఉంటే, పొంతన కలగాలంటే ఎక్కువ కాలం పడుతుందిగదా? నాలుగు కాళ్ల్లు ఒక పద్ధతిలో ముందుకు కదలకపోతే, మరి ఆ మనిషి చాలా దూరం వెళ్లిపోతాడు కదా?’

అయితే, అప్పటివరకూ, నా గుర్రాన్ని జాగ్రత్తగా చూస్తావా? నేను తిరిగి వచ్చేదాకా?’ అంటూ అతను గుర్రం మీది నుంచి దిగి అన్నాడు.

ఎందుకు ఉండను?’ జవాబుగా ఈ మనిషి అన్నాడు.

అతను కంటికి కనిపించకుండా పోయేదాకా కన్ప్యూషియా మొగుడు అక్కడే ఉన్నాడు. ఆ తరువాత మూటతో సహా గుర్రమెక్కి వేగంగా బయలుదేరాడు. ఇంటికి చేరుకున్నాడు. ఇల్లు చేరగానే బయటినుంచే గట్టిగా అరిచాడు.

ఫేర్నీ, నేను వచ్చేశాను’ అని.

(పాలస్తీనా జానపద గాధ)

నేను ఈ కథను ఉర్దూ నుంచి నేరుగా అనువదించిన.

No comments: