Sunday, December 28, 2025

కరబావోల కథ - వియెత్నాం జానపద కథ : Vietnamese Folk Story

కరబావోల కథ

వియెత్నాం జానపద కథ

కరబావోల కథ

వియెత్నాంలో కరబావో అనే నీటి దున్నలను వరి పొలాలలో పనిచేయడానికి వాడుకుంటారు. దున్నలు ఎలాగుంటాయో అందరికీ తెలుసు. అయితే కరబావో మూపురం పెద్దగా ఉంటుంది. దాని రంగు నీలం కలిసిన బూడిదగా ఉంటుంది. కొమ్ములు వెనక్కు మళ్లి చదునుగా ఉంటాయి. అవి మెడవెంట వంపు తిరిగి ఉంటాయి. కరబావో బురదలో పడి దొర్లడం ఇష్టపడుతుంది. రెండు కరబావోలను నిలిపి వాటి భుజాల మీద ఒక కాడి పెడతారు. దానికి నాగలి కడతారు. దున్నలు సులభంగా బురదలో దున్నుతూ ముందుకు కదులుతాయి.

చాలా సంవత్సరాల క్రితం కరబావోలు కూడా అడవులలో అన్ని అడవి జంతువులతో పాటు కలిసి బతికేవి. అయితే అవి బద్ధకం గల ప్రాణులు. మిగతా జంతువులు తిరిగిన దారులలో అవి కూడా తిరిగేవి. మిగతా జంతువులు వెతికిన గడ్డిని తినేసేవి. నీళ్లను తాగేసేవి. అప్పట్లో దున్నలు నీళ్లను తాగేవి మాత్రమే. అందులో దిగి బురదలో దొర్లడం వాటికి అసలు తెలియదు. నిజానికి అప్పుడు వాటికి తడి కావడం ఇష్టం లేదు. వానకాలంలో అవి తడికాకుండా తప్పించుకోవడానికి నీడలలోకి వెళ్లిపోయేవి. బురదలో అసలు తిరిగేవి కావు. ఇక కరబావోలు కంపు కొట్టేవి అంటే వింతగా వినిపించదు మరి. అయినాసరే అవి అందమయిన జంతువులు. అప్పట్లో వాటి కొమ్ములు కూడా అన్ని జంతువుల కొమ్ములలాగే పొడుగ్గా, పదునుగా పైకి మళ్లి ఉండేవి. శరీరాలు నునుపుగా కండలు దేలి ఉండేవి.

కరబావోలకు కావలసినంత బలం ఉండేది. అవి కంపు కూడా కొట్టేవి. కనుక మిగతా జంతువులు వాటి దగ్గరకు వచ్చేవికావు. ఒకనాడు జంతువులన్నీ అలవాటు ప్రకారం నెలసరి సమావేశం జరుపుకుంటున్నాయి. ఆ సమావేశంలో ఎవరో కరబావోలను గురించి ఫిర్యాదు చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఏనుగు తొండం ఎత్తి ఫీుంకరించింది. అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడది చెప్పసాగింది. ‘‘ఈ ప్రాణులను గురించి ఏదో చేయవలసిన సమయం వచ్చినట్టే ఉంది. ఎవరయినా సలహాలు ఇవ్వగలరా?’’ అన్నది ఏనుగు. ఎన్నో ఆలోచనలు, మరెన్నో అభిప్రాయాలు బయటకు వచ్చాయి. అయితే జింక చెప్పినది మాత్రం చాలా మంచి పథకం అనిపించింది. ‘‘మనలోని ఒక బలంగల సభ్యుడిని మన ప్రతినిధిగా ఎంచుకుందాము. అందుకు బహుశా పులిగారు తగిన ప్రాణి. ఆయన మన సందేశాన్ని కరబావోలకు వినిపిస్తాడు. వాటిని స్నానం చేయమంటాడు. మన తిండి, నీళ్లను దొంగిలించకూడదని హెచ్చరిస్తాడు. అందరిలాగే పనిలోకి వచ్చి సాయం చేయాలని సలహా ఇస్తాడు. వాళ్లు వింటే సరేసరి. కాదంటే మాత్రం అందరము కలిసి మన దేశంనుండి వాటిని తరిమేద్దాము’’ జింక చెప్పిన మాటలు ఇవి.

ఇక పులి బయలుదేరింది. కరబావోల కోసం వెతికింది. అవి కనిపించాయి. అప్పుడు పులి ఒక చెట్టు ఎక్కింది. ఆ తరువాత మాత్రమే వాటిని పిలిచింది. ‘‘ఓహోయ్‌ కరబావోలూ! వినిపిస్తున్నదా నా మాట?’’ అన్నది. ఆ జంతువులు ఆశ్చర్యంలో మునిగాయి. తల ఎత్తి అటు ఇటూ చూచాయి. వాటిలోనుంచి బలంగా ఉన్న ఒక దున్న మాట్లాడింది. ‘‘అవునవును, వినిపిస్తున్నది. ఇంతకూ తమరెవరు? ఏం కావాలి?’’ చెట్టుమీద నుంచి పులి నెమ్మదిగా జవాబు ఇచ్చింది. ‘‘అడవిలోని జంతువులన్నీ సమావేశం చేశాయి. అక్కడినుంచి మీకు ఒక సందేశం పంపాయి. వినండి. మీరంతా మాతోబాటే కలిసి పనిచేయాలని మేము కోరుకుంటున్నాము. గడ్డి సేకరించడంలో మీరు సాయంగా ఉండాలి. అంతకన్నా ముందు మీరు స్నానం చేయడం మొదలుపెట్టాలి. జంతు ప్రపంచానికి మీవల్ల చెడ్డపేరు వస్తున్నది అని మా భావన.’’ బలిసిన దున్న అంతే బలిసిన పద్ధతిలో పట్టించుకోకుండా జవాబిచ్చింది. ‘‘పో పోవయ్యా, ఇక్కడ మీకు నచ్చకపోతే అందరూ కలిసి మరెక్కడికయినా వెళ్లిపోండి. వెళ్లి మీ నేస్తాలకు ఈ మాట చెప్పు. మేమేమీ మామూలు జంతువులం కాము. చాలా బలంగల ప్రాణులము. మా బతుకు మాకు తెలుసు. మాకు చెప్పగలవారు ఎవరు లేరు. మళ్లీ మమ్మల్ని చికాకు పెట్టారంటే అందరినీ మేము నాశనం చేస్తాము.’’

పులి తిరిగి వచ్చేసింది. మళ్లీ సమావేశం పెట్టి తన నివేదిక తెలియజేసింది. జంతు సంఘం సభ్యులకు గొప్ప ఆత్రం పుట్టింది. అన్నీ ఒకేసారి మాట్లాడడం మొదలుపెట్టాయి. ఏనుగుగారు మళ్లీ తొండం ఎత్తి ఫీుంకరించి అందరినీ నిశ్శబ్దంగా ఉండమన్నారు. అప్పుడు ఇలా మాట్లాడారు. ‘‘మిత్రులారా, మనం మార్గం చెప్పమని పై వాడిని అడుగుదాము. అందరమూ ప్రార్థన చేద్దాము.’’ ఆ సలహా ప్రకారం అందరూ ప్రార్థన చేశారు. అది కూడా ముగిసింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు అశరీరవాణి పలికింది. ‘‘జంతువులారా! మీ భావన సరయినదే. కరబావోలు చాలాకాలం పాటు కంగాళీగా బతుకుతున్నాయి. తమ దారిని మార్చుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు. వాటికి శిక్ష తప్పదు. పులులన్నీ కలిసి వాటి గుంపుమీద దాడి చేయండి’’ అది సందేశం.

ఇక పులులన్నీ కలిసి సందేశం ప్రకారం కరబావోల వేటకు బయలుదేరాయి. త్వరలోనే వాటి గుంపు కనిపించింది. జాగ్రత్తగా ప్రణాళిక వేసి దాడి మొదలు పెట్టాయి. యుద్ధం ముగిసింది. ఒక్క పులికి కూడా గాయాలు కలగలేదు. కరబావోలు మాత్రం అన్యాయంగా మిగిలిపోయాయి. వాటిని చూస్తే ఎవరికయినా జాలి వేస్తుంది. వాటి కొమ్ములన్నీ వెనక్కు అదుముకు పోయాయి. ఒంటినిండా గాయాలయ్యాయి. చావకుండా మిగిలిన కరబావోలు పక్కనే ఉన్న ఒక ప్రవాహం లోకి దిగాయి. అక్కడే లోతులేని నీటిలో మునిగి ఉండి తమ గాయాలకు చికిత్స చేసుకున్నాయి. కొంతకాలానికి వాటికి నయం అయింది. కొంచెం బలం పుంజుకున్న తరువాత కరబావోలు కూడా సమావేశం పెట్టుకున్నాయి. చేయవలసిన పనులను గురించి ఆలోచించాయి. అనుభవంగల పెద్ద జంతువులు ముందుకు వచ్చి సలహా ఇచ్చాయి. ఆ ప్రాంతంనుండి తరలిపోతే మంచిది అన్నాయి. కుర్ర కరబావోలు మాత్రం అక్కడే ఉండి మిగతా జంతువులతో యుద్ధం చేయాలి అన్నాయి. వాదన కొనసాగింది. గోల జరుగుతుండగా ఒక కొత్త గొంతు వినిపించింది. జంతువులకు సలహా ఇచ్చిన అశరీరవాణి ఇక్కడ కూడా మళ్లీ ఏదో చెపుతున్నది. ‘‘కరబావోలూ, మీ పద్ధతికి తగినట్టుగా శిక్ష జరిగింది. అయితే ఇంతటితో ముగియలేదు. ఇక మీదట మీరు బద్ధకంగా ఉండడం కుదరదు. కష్టించి పనిచేయనిదే మీకు తిండి దొరకదు. అందంగా ఉన్నామని గర్వపడ్డారు కనుక అనాకారులుగా మారారు. ఇక బురదలో పడి దొర్లుతూ ఉంటారు. మురికిగా ఉండడం మీకు ఇష్టం కదా! కనుక మీరు వెంటనే దగ్గరలోని పల్లెకు వెళ్లండి. అక్కడ రైతులను ఆశ్రయించండి. బురద వరి పొలాలలో వాళ్ల నాగళ్లు లాగండి. కలకాలం ఆ బురదలోనే బతకండి’’ అది సందేశం.

కనుకనే నీటి దున్నలు అనే కరబావోలు మూపురం గల వెన్నుతో వెనుకకు మళ్లిన పనికిరాని కొమ్ములతో ఈనాటికీ కనబడతాయి. అవి ఈనాటికీ వరిపొలాలలో నాగళ్లు లాగుతూ బురదలో బతుకుతుంటాయి.



No comments: