Thursday, December 4, 2025

Prapanchatantram ప్రపంచతంత్రం - ఒక పరిశీలన

 ప్రపంచతంత్రం - ఒక పరిశీలన


ఆధునిక ప్రపంచంలో బతుకుతున్నాం. అన్ని హంగులూ వాడుకుంటున్నాం. అయితే, ప్రపంచం గురించి,  హంగుల గురించి ఆలోచన మాత్రం తక్కువయినట్లు కనపడుతుంది. గేదె ఉంటుందని తెలియదు. పేడ వేస్తుందని తెలియదు. పాలు ఇస్తుందని తెలియదు. తెల్లవారేసరికి తలుపు ముందర పాలప్యాకెట్లు మాత్రం ఉండాలి. పల్లెలలో కూడా కొంతమంది పరిస్థితి ఇట్లాగే ఉంది. పల్లెలకు, పట్నాలకు తేడా కనిపించడం లేదు. నీళ్లు ఇక్కడా లేవు, అక్కడా లేవు. కార్లూ, టెలివిజన్‌లు, సెల్‌ఫోన్‌లు అంతటా ఉన్నాయి. అవి లేనిదే కాలం గడవడంలేదు. కరెంటు లేకున్నాసరే యంత్రాలను పనిచేయించేందుకు, జనరేటర్లు, ఇన్‌వర్టర్లు ఎక్కడచూచినా కనపడుతున్నాయి.

          మొదటినుంచి మనిషి బాధంతా సౌకర్యం కొరకే. ఆ సౌకర్యం ఎట్లా అమరుతున్నది అన్న ప్రశ్న అందరి మెదళ్లలోనూ పుట్టదు. నాడి చూచి, కుప్పె అరగదీసి మందు నాకించే కాలం పోయింది. జలుబయింది అన్నా సరే బోలెడన్ని పరీక్షలు జరగాలి. స్కాన్‌లు, గందరగోళం జరగాలి.

          ఒక్కసారి తలపైకెత్తి చూస్తే అంతులేని ఆకాశం కనపడుతుంది. ఇంకా లోతుకు పోతే అనంతమయిన అంతరిక్షం ఉందట, అదంతా కలిసి విశ్వం అంటారట. కొంతమంది చాలా తెలుసు అన్నట్టు ఈ విషయాలను గోలగోలగా చెప్తుంటారు. లక్షలు, కోట్ల సంవత్సరాలకు ముందు పేలుడు జరిగిందంటారు. కొత్త పరిశోధకులు వచ్చి అదేమీ లేదంటారు. రాబోయే లక్షల సంవత్సరాల గురించి ఏదేదో చెప్పి భయపెడుతుంటారు. ఈ విశ్వం ఒక పెద్ద పేలుడు జరిగినందుకు మొదలయిందా? ఎవరు చెప్పాలి? లేదంటున్నారు కూడా! అది ఎప్పుడూ ఉన్నదే అంటున్నారు.

          మన గురించి, మన ఉనికి గురించి, మన పరిసరాలను గురించి కొంతమంది గట్టిగానే ఆలోచించారు. బోలెడంత సమాచారాన్ని ఒకచోట చేర్చారు. అందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో సిద్ధాంతాలను, సూత్రాలను తయారు చేశారు. కొంతకాలానికి ఇవన్నీ కలిసి సైన్స్‌ అనే ఒక అర్థంకాని జ్ఞానభాండాగారం పుట్టింది. అర్థంచేసుకోగలిగినవారికి కూడా అందులో విషయాలు, వైవిధ్యం అడ్డుతగులుతున్నాయి. ఇక వాటి గురించి పట్టించుకోకుండా, తన బతుకంటే సైన్స్‌ అని తెలియకుండా బతుకుతున్నవారికి సైన్స్‌కన్నా గందరగోళం మరొకటి లేదు అనిపించే పరిస్థితి వచ్చింది.

          సైన్స్‌ అంటే ఇంతకుముందు అన్నట్టు సమాచారం కుప్పగా కూడిన ఒక లైబ్రరీయా? అందులోకి తొంగిచూచేందుకు అందరికీ అవకాశం ఉండదా? ఈ ప్రశ్నలు ఎవరు అడగాలి? అడిగినవారికి జవాబులు ఎవరు అందించాలి? సైన్స్‌ అన్నది  అంతంలేని ఒక అన్వేషణ. ఒక కార్యక్రమం. ఒక ప్రక్రియ. ప్రశ్నల పరంపర. అర్థం అయినవాటి గురించి, కానివాటి గురించీ, అనుమానాలను పెంచుకుని, ఎందుకు? ఎట్లా? అని ప్రశ్నలు అడగాలి. వాటికి జవాబులు వెతకాలి. అదే సైన్స్‌.  ఒకప్పుడు సైన్స్‌ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. ప్రపంచాన్ని పరిశీలించినవారే మనిషి ఆలోచనలను కూడా పరిశీలించారు.  అంటే, సైన్స్‌కు సైకాలజీకి అప్పట్లో తేడా లేదు. ప్రశ్నల సంఖ్య పెరిగింది. వాటికి జవాబులు కుప్పతిప్పలుగా ఎదురయ్యాయి.  చర్చ మొదలయింది. శాఖలు మొదలయ్యాయి. ఒక్కొక్కరకం ప్రశ్నలకు సైన్స్‌లోనే ఒక్కొక్కశాఖ మొదలయింది. కొంతకాలానికి ప్రశ్న అడిగినవారికి కూడా అర్థంకాని జవాబులు, అంశాలు ఎదురయ్యాయి. మొదటవచ్చిన ప్రశ్న మరీ అమాయకంగా కనిపించింది. ఆ రంగంలో లోతు ఎక్కువయింది. ఆ లోతులోకి దిగినవారికి మిగతా లోతుల అంతు అసలు ఉందని కూడా తోచని పరిస్థితి వచ్చేసింది. అప్పుడు మామూలు మనిసికి, సైన్స్‌కూ మధ్య ఒక అగాధం ఏర్పడింది.  సైన్స్‌ అనే ప్రపంచం మనది కాదన్న భావం మొదలయింది.

          ప్రశ్నలకు జవాబులు కనుగొనే ఆనందంలో సైంటిస్టులు కూడా తాము మామూలు మనుషులమన్న మాట మరచిపోయారు. ఎదురయిన సైన్స్‌ ప్రశ్నలకే జవాబులు వెతికారు. తమ బతుకులలోనే మరిన్ని ప్రశ్నలు ఉన్నాయన్న సంగతి మరిచిపోయారు. ఎదురయిన సైన్స్‌ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. వెతుకుతున్నారు కనుక సమాధానం దొరుకుతుంది. సమాధానంతో సంతృప్తి మాత్రం కలగదు. ఈ సమాధానం నిజమని తేల్చుకునేది ఎట్లాగ? అన్నది మరొక గొప్ప ప్రశ్నగా ఎదురవుతుంది. ఒకసారి ఒక ప్రశ్నతోనే తలబద్దలు కొట్టుకోవాలి. అన్ని ప్రశ్నలూ అడిగితే, గజిబిజి తప్ప మరేమీ మిగలదు. ఆ క్రమంలో ప్రశ్నలు వచ్చాయి, జవాబులు వచ్చాయి. బతుకు కొంత అర్థమయింది. సైన్స్‌ మరింత అర్థమయింది. అది తెలిసినవాళ్లకు ఇది పట్టకుండా ఉంది. సైన్స్‌ అర్థమయినవాళ్లకు మిగతా ప్రపంచం పట్టకుండా ఉంది. లైబ్రరీలు మరీ పెద్దవయిపోయాయి. పుస్తకాలు ఉన్నాయని తెలుసు. ఏ పుస్తకం ఎక్కడ ఉందో వెతకడమే ఒక పెద్ద సమస్య. ఆ పుస్తకంలో ఉన్న సంగతిని పట్టించుకుని అర్ధం చేసుకోవడం అంతకన్నా పెద్ద సమస్య.

          దినపత్రికలు చదవడం అలవాటున్నవాళ్లకు ఆ మధ్యన అందరూ దైవకణం గురించి గోల చేయడం గుర్తు ఉండే ఉంటుంది. అంతకుముందు కొంతకాలం ఎయిడ్స్‌ గురించి గొడవ గొడవగా చెప్పుకున్నారు. అప్పుడప్పుడు సైన్స్‌లో ఏదో  ఒక సంచలనాత్మక విషయం తలెత్తుతుంది. అప్పుడు మొత్తం ప్రపంచం అటువేపు మళ్లి ‘సైన్స్‌ ఉంది’ అనుకుంటారు. భూకంపం వచ్చినప్పుడు అందరికీ హైదరాబాద్‌లోని నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ గుర్తుకు వస్తుంది. మామూలు పరిస్థితిలో అది ఉందని కూడా ఎవరికీ గుర్తుండదు. అక్కడ పనిచేసేవాళ్లకు తప్ప!

          ఎవరు ఏ విషయం పట్టించుకున్నా, పట్టించుకోకున్నా బతుకులు కొనసాగుతాయి. బతుకంటే సైన్స్‌ కనుక సైన్స్‌ కూడా కొనసాగుతుంది. బతుకులో సంగతులను అర్థంచేసుకోవడానికి ప్రయత్నించినవాళ్లకు సైన్స్‌ ఉందన్న భావం అప్పుడప్పుడు కలుగుతుంది. న్యూటన్‌ తలమీద ఆపిల్‌ పడితే, ఆయన ఒక దారిని చూపించి అవగాహన కలిగించాడు. డార్విన్‌కు ప్రపంచమంతా పరిణామక్రమంగానే కనిపించింది. జీవులలో లక్షణాలు వంశక్రమంలో వస్తాయని మరొకాయన చెప్పాడు. ఆవిరితో ఇంజన్‌ నడుపుతానన్నాడు మరొక పెద్ద మనిషి. స్థలం, కాలం వంపు తిరిగాయి అన్నాడు ఇంకొకాయన. ఇవన్నీ వాళ్లు కాకుంటే, మరొకరు ఎవరో ఎప్పుడో కనుగొని ఉండేవారే. కానీ, చాలా విషయాలను చాలామంది కనుగొన్నారు.  కొంతమంది కొత్తదారులు వేశారు. కొంతమంది ఆ దారులలో నడిచారు. దారులు వేసినవారు మన జ్ఞాపకాల నుంచి మరుగున పడి ఉండవచ్చు. కొంతమంది మాత్రం వద్దన్నా, గుర్తుకు వస్తుంటారు.

          విద్యుత్తు వాడుతున్నాం. లైట్‌ బల్బులు వాడుతున్నాం. సెల్‌ఫోన్‌ వాడుతున్నాం. మరెన్నో సదుపాయాలను వాడుకుని  బతుకులను సుఖమయం చేసుకున్నాం. అందిన సుఖాలకు ప్రతిఫలంగా కనీసం కృతజ్ఞత చెపుదామంటే, ఎవరికి చెప్పాలి?  ఏ ఒక్క సదుపాయమూ మంత్రం వేసినట్టు ఒక్క క్షణంలో ప్రత్యక్షం కాలేదు. రేడియోతరంగాలు ఉన్నాయని కనుగొన్నారు.  సమాచారాన్ని తరంగాలుగా మార్చవచ్చునని మరొకచోట కనుగొన్నారు. అందుకు కావలసిన హంగులను ఇంకెక్కడో కనుగొన్నారు. సెల్‌ఫోన్లో మాటా, పాటా మాత్రమే కాక, బొమ్మలను కూడా పంపగలుగుతున్నాం. ఇవాళ మన జేబులో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ చేయగలిగిన పనిని నాలుగు దశాబ్దాల క్రితం ఒక పెద్ద గదినిండా పరిచిన కంప్యూటర్‌కూడా చేయగలిగేది కాదు. అంటే, ఆశ్చర్యం లేదు. ఎలక్ట్రానిక్స్‌ అని ఒక రంగం వచ్చింది. అందులో పరికరాలు రాను రాను చిన్నవిగా మారుతున్నాయి. సర్క్యూట్లు, బ్యాటరీలు, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ ఇవన్నీ నిజానికి పూర్తి వేరు వేరు రంగాలు. అవన్నీ కలిసి సైల్‌ఫోన్‌గా మనముందుకు వచ్చి మురిపిస్తున్నాయి. ఎవరయినా ఒకప్పటి వేలితో తిప్పే పాత టెలిఫోన్‌ను గురించి ఆలోచిస్తున్నారా? ఇవాళ వేలితో ఫోన్‌ తెరమీద మనం చేస్తున్న విన్యాసాలు, జానపదం సినిమాలో మాంత్రికుని ‘హాం ఫట్‌’ కన్నా ఆశ్చర్యకరంగా ఉన్నాయని అనుకుంటున్నారా?

          అది సైన్స్‌ గొప్పదనం! సైన్స్‌ ఆధారంగా పెరిగిన సాంకేతికశాస్త్రం గొప్పదనం! వాటి గురించి ఎంత తెలుసుకుంటే, అంతగా ఆనందం, ఆశ్చర్యాలు సొంతమవుతాయి. వాడుతున్న సౌకర్యం వెనుకనున్నవారందరికీ ధన్యవాదాలు చెప్పాలంటే, కుదరదు. కానీ, వారి కృషి గురించి అర్థంచేసుకోవడం మాత్రం కొంతవరకయినా వీలవుతుంది.

          ప్రశ్నలు అడిగితే, జవాబులు దొరుకుతాయి. ప్రశ్నలను సైన్స్‌ పద్ధతిలో అడిగితే, సైన్స్‌ పద్ధతిలో జవాబులు కూడా దొరుకుతాయి.  ప్రశ్న అడగడానికి ముందు పరిశీలను అవసరం. ఆ పరిశీలనలోనుంచి అనుభవం వస్తుంది. అందులోనుంచి  అనుమానాలు వస్తాయి. చాలామందికి ఈ అనుమానాలు రాలేదన్న భావం ఉంటుంది. ప్రశ్నలు అడిగే స్వభావాన్ని మనమంతా  ప్రయత్నించి అణగదొక్కుతున్నాం. అడగడానికి లక్షల ప్రశ్నలు ఉన్నాయి. అడిగితే, ఆశ్చర్యకరమయిన సమాధానాలు      ఉన్నాయి. సమాధానాలతోబాటు ప్రపంచం గురించిన మన అవగాహనలు విస్తరిస్తాయి. మరిన్ని ప్రశ్నలు పుడతాయి. మరిన్ని సంగతులు తెలుస్తాయి. సంగతులు తెలిసినకొద్దీ ప్రపంచం మనకు మరింత తెలిసిందిగాను, అర్థమయినట్టుగానూ కనబడడం మొదలవుతుంది. కొన్ని విషయాలు కొత్తగా అర్థమయినప్పుడు మనమేదో కనుగొన్నామన్న ఆనందం కూడా కలుగుతుంది. ఈ రకంగా సైన్స్‌తో పరిచయం పెంచుకోవడానికి మనము సైంటిస్టులను కానవసరం లేదు. ఆ పద్ధతిలో ఆలోచించడం నేర్చుకుంటే సరిపోతుంది.

 

No comments: