Wednesday, December 31, 2025

శోకనాయిక మీనాకుమారి - 2 : Tragedy Queen Meena Kumari Part 2

శోకనాయిక మీనాకుమారి - 2 

2

చంద్రుడు ఒంటరి అన్న కవితలో ఆమె చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలు. ఆమె చివరి సినిమా పాకీజా మహత్తరమైన విజయాలను సాధించింది. దాన్ని భర్త కమాల్‌ తీశాడు. దానికి ఆమె మనసులోని భావాలను దాచుకుని అతనితో సహకరించి చిత్ర నిర్మాణానికి చేతనైనంత ఊతం ఇచ్చింది. ఆ సినిమాలో సాహెబ్‌ జాన్‌ అనే పాత్ర నిజంగా మీనా కుమారి నిజజీవితానికి అద్దం పడుతున్నట్టు ఉంటుంది. చిత్రం ఈనాటికీ అందరికీ అభిమానపాత్రంగా ఉండిపోయింది. ఆ చిత్రం ఘన విజయాన్ని చూడకుండానే 40 ఏళ్ల వయసులోనే మీనాకుమారి కన్ను మూసింది. ప్రేక్షక ప్రపంచం ఇవ్వాళటి వరకు ఆమెను తలచుకుని కుములుతూనే ఉంది. ఆమెకు నివాళి అర్పిస్తూనే ఉన్నది. అటువంటి మరొక నటి కోసం ఎదురు చూస్తున్నది. బతుకు బరువులోని బాధను మనకు సరదాగా అందించడానికి మళ్లీ మరొకరు రావాలి అనుకోవడం మన అత్యాశ.

మీనా కుమారి సినిమాలను గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఒక చిత్రమైన క్రమం కనిపిస్తుంది. ఆమె 40 దశకంలో ముఖ్యంగా పౌరాణిక చిత్రాలలో నటించింది. గణేశ్‌, హనుమాన్‌ పాతాల్‌ వంటి సినిమాలలో కనిపిస్తున్న అమ్మాయి హైందవి కాదని ఎవరికీ తోచనే లేదు. నటిగా ఆమెకు గుర్తింపు వచ్చినది మాత్రం విజయ్‌ భట్‌ 1952లో తీసిన బైజూ బావరా అనే చిత్రంతోనే. అందులో అప్పటికే ప్రసిద్ధిగాంచిన నటుడు భరత్‌ భూషణ్‌ హీరోగా వేశాడు. బైజూ బావరా వంటి వ్యక్తి చరిత్రలో ఉన్నాడు కాని సినిమా కథ మాత్రం ఇంచుమించు కల్పితం బైజూ అంటే బైద్యనాథ్‌. అతను మామూలు మనిషి కాదు. బావరా అంటే వెర్రివాడు అని అర్థం. బైజూకు తెలిసింది సంగీతం మాత్రమే. అతను నేరుగా సంగీత ప్రపంచంలో మకుటం లేని మహారాజు, అక్బర్‌ పాదుషా ఆస్థానంలోని పండితుడు మియా తాన్సేన్‌ తో పోటీ పడతాడు. అతనికి ఒక చిన్ననాటి స్నేహితురాలు ఉన్నట్టు కథ కల్పించారు. బైజూను పెంచిన జాలరి కూతురు ఆమె అని సినిమాలో చూపించారు. పిల్లలు ఇద్దరు పెరిగి పెద్దవాళ్లు అవుతారు. చుట్టూ వాతావరణం చాలా బాగుంటుంది. రాధాకృష్ణుల పద్ధతిలో వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఇక్కడ మీనాకుమారి వేసిన పాత్ర పేరు గౌరీ. ఈ గౌరి హైందవి కాదన్న సంగతి ఎవరికీ పట్టలేదు. అప్పటికి పిన్నవయసులో ఉన్న మీనాకుమారి ఈ పాత్రలో చాలా సహజంగా కనిపించింది. కథ కూడా సరదాగా నడుస్తుంది కానీ చివరికి దుఖం మొదలవుతుంది. బైజూ పల్లె వదిలి వెళ్ళిపోతాడు. సంగీతం గురువు కోసం నానా తంటాలు పడుతుంటాడు. ఇక్కడ గౌరీ మాత్రం ఒంటరిగా మిగిలిపోయి మోహే భూల్‌ గయే సావరియా (నన్ను మరచితివి ప్రియతమా) అంటూ పాటలు పాడుతూ ఉంటుంది. బైజూ నిజానికి తన ప్రియురాలిని మరవలేదు. అతను తిరిగి పల్లెకు వస్తాడు. కానీ అప్పటికే ఆమెకు బలవంతంగా పెళ్లి కుదిర్చి ఉంటారు. బైజూ వస్తున్న బోటు నదిలో మునుగుతుంది.  ఇక శోకానికి కరువే లేదు. ఈ చిత్రంలో పాటలు నేటికీ అందరి మనసులలో నిలిచి ఉన్నాయి. మీనాకుమారి శోకదేవత అవతారానికి ఇక్కడే బీజం పడింది.

పరిణీత అనే సినిమాను ఈ మధ్యన మళ్లీ తీశారు. దాన్ని మొదటిసారి తీసినప్పుడు నాయికగా మీనాకుమారి  నటించిందని ఇప్పటివారికి తెలియకపోవచ్చు. ఇక్కడ కథలోనే కావలసినంత ఏడుపు కలగలిసి ఉంది. ఇక మీనా నటనతో అది మరింత పండింది.ఆ తరువాత కమాల్‌ అమ్రోహీ, దాయరా అనే సినిమా తీశాడు. దానితో మీనా శోకనాయికగా స్థిరపడిపోయింది.

అరవై దశకంలో శారద, ఆర్తి, దిల్‌ అప్నా ఔర్‌ ప్రీత్‌ పరాయి, మజిలీ దీది లాంటి సినిమాలు వరుసపెట్టి వచ్చాయి. వీటన్నిటిలోనూ మీనా కుమారి ఏడుపు హీరోయిన్‌ గానే కనిపించింది. ఆ తరువాత ముస్లిం సంస్కృతి కథలతో సినిమాలు కొన్ని వచ్చాయి. చాందిని చౌక్‌, నూర్జహాన్‌, బహూ బేగం, బేనజీర్‌ లాంటి సినిమాలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

 ఇంతకూ హిందీ సినిమారంగం మీనా కుమారి లోని శోకదేవతను మాత్రమే గుర్తించిందా? ఆమెకు వివిధ పాత్రలలో నటించడం వీలుకాదు అనుకున్నారా? అదేమీ లేదు. నిజానికి మీనా కుమారి కొన్ని సరదా సినిమాలలో కూడా నాయికగా వేసింది. శరత్‌, నిజాం లాంటి సినిమాలను ఆ వరసలో చెప్పుకోవచ్చు. ఆజాద్‌ అన్నది అటువంటి మరొక సినిమా నయా అందాజ్‌, కోహినూర్‌ అన్నవి తరువాత వచ్చిన మామూలు సినిమాలు. వీటిలో పెద్దగా ఏడుపులు లేవు.

మీనాకుమారి ఏడుపు పద్ధతి గురించి ఆలోచిస్తే గురుదత్‌ నిర్మించిన సాహిబ్‌, బీవీ ఔర్‌ గులాం అనే సినిమాను ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇది బెంగాలీ కథ. అందులో మీనాకుమారి పాత్ర ఛోటీ బహూ. అంటే చిన్న కోడలు. జమీందారీ వ్యవస్థ దిగజారిపోతున్న రోజుల కథ అది. భర్త పట్టించుకోడు. సానివాడల వెంట తిరిగి తన మగతనాన్ని ప్రదర్శించాలని అనుకుంటాడు. చిన్నకోడలు అన్ని రకాల కుమిలిపోతూ ఉంటుంది. ఏడుపు పాటలు పాడుతూ ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో చాలా పేరుతెచ్చుకున్నది. న జావొ సయ్యా, ఛుడాకె బయ్యా, భవర బడా నాదాన్‌ హై లాంటి పాటలు నేటికీ పాడుకునే వాళ్లు ఉన్నారు.

చెపుతూపోతే ఇటువంటి సినిమాల వరుస పాకీజాతో తారస్థాయికి చేరుతుంది. అదే ఆమె నటించిన చివరి చిత్రం. మీనా కుమారి 1952లో కమాల్‌ అమ్రోహీని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నది. అతను అప్పటికే మంచి పేరుగల దర్శకుడు. జంట మధ్యన ఎంతో ప్రేమ పండింది. కానీ కమాల్‌ ఆమెను ఎప్పుడు తనతో సమానురాలు అనుకోలేదు అంటారు. వాళ్లు విడిపోయారు. కొంతకాలం తరువాత మళ్ళీ కలిశారు. అప్పటికే ఆమె ఆరోగ్యం బాగా పాడయింది. మరొకసారి వాళ్లు విడిపోయారు. ఆ తరువాత ఆమెకు ఆనందం పూర్తిగా కరువైంది. పట్టించుకోకుండా వదిలేసిన భర్త కొరకు ఆమె పాకీజాలో నటించింది. పాపం మీనాకుమారి 1972లో మార్చి 31న గతించింది. తన చివరి సినిమా విజయం గురించి ఆమె చూడలేకపోయింది. ఇటు జీవితంలోను అటు సినిమా పాత్రలలోనూ శోకం నిండిన ఆ ఆడకూతురు కవిత్వాన్ని ఆలంబనగా చేసుకుని బ్రతికింది అంటే ఆశ్చర్యం లేదు. మీనా కుమారి బతుకు ఒక్కసారిగా దిగజారిన పద్ధతి కనిపించదు. ఆమె బాధలు క్రమంగా పెరిగినట్టు తోస్తుంది. పాకీజా నాటికి ఆమె ఆరోగ్యం పూర్తి అన్యాయంగా ఉంది. అయినా ఆమె నటించడానికి  ముందుకు వచ్చింది.

No comments: