నిద్ర – మెలుకువ
నిద్ర
– మెలుకువ
మా పక్కింటాయన నేను
నిద్రలేచే సమయానికి చక్కగా స్నానం ముగించుకొని మరికొన్ని పనులు కూడా చేసి ఆనాటి
పనికి సిద్ధంగా ఉంటాడు. అసలు మొదటినుంచి త్వరగా నిద్రకు ఉపక్రమించి, పొద్దున్నే
త్వరగా లేచే వాళ్ళు, ఆరోగ్యంగానూ, ఆనందంగానూ ఉంటారు అని అన్ని భాషల్లో రకరకాలుగా
చెప్పేవారు. అయితే అందరికి ఆ రకంగా ఉండడం వీలు కాదు అన్న సంగతి కూడా అందరికీ
తెలుసు. అర్లీ బర్డ్ క్యాచెస్ ద వర్మ్, అని కూడా ఒకమాట ఉంది. అంటే త్వరగా
నిద్రలేస్తే పని బాగా జరుగుతుంది అని భావం. కనుకనే అందరూ త్వరగా నిద్రలేవాలి
అనుకుంటారు.
కానీ కొంతమంది మాత్రం,
రాత్రి చాలా సేపు వరకు పనిచేసి, ఉదయాన కొంచెం నెమ్మదిగా నిద్ర లేస్తారు. ఈ రకం
తేడాలను పరిశోధకులు క్రోనోటైప్స్ అని గుర్తిస్తుంటారు. వారు మాత్రం త్వరగా
నిద్రలేచేవారు గొప్పవారు, మిగతావారు కారు అన్న విషయాన్ని అంత సులభంగా అంగీకరించరు.
అన్నిటికన్నా ముందు
గుర్తించవలసిన విషయం మరొకటి ఉంది. కనీసం 60% మంది అటు రాత్రి పని చెయ్యరు, ఇటు
ఉదయాన త్వరగా లేవరు. వాళ్ళ పద్ధతి రెండు పద్ధతుల కలగలుపుగా ఉంటుంది. క్రోనోటైప్స్
అన్నది కేవలం నిద్రకు ఉపక్రమించడం, ఉదయాన నిద్రలేవడం అన్ని లక్షణాల మీదనే ఆధారపడి
లేదు అంటున్నారు పరిశోధకులు. రాత్రి పనిచేసే వాళ్లను గుడ్లగూబలు అంటారు. త్వరగా
నిద్రలేచే వాళ్ళను భరత పక్షులు అంటారు. అది ఇంగ్లీష్ లో అని వేరుగా చెప్పనవసరం
లేదు. ఈ తేడాలకు రకరకాల కారణాలు ఉంటాయి అని కూడా వారు చెబుతున్నారు. కొన్ని
ఉద్యోగాలలో రాత్రి పని చేయవలసి వస్తుంది. కొంత మందికి అవసరం ఉండదు.
పరిశోధకులు చెబుతున్న
ప్రకారం సాధారణంగా ఆడవాళ్ళు రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉంటారు. మగవాళ్లు ఎక్కువగా
ఉదయాన త్వరగా లేస్తారు అనే అర్థం అవుతున్నది. ఈ తేడాలకు మరొక కారణంగా వయసు కూడా
ఉంది. కుర్రవాళ్లు గబ్బిలాలుగా రాత్రి ఎక్కువసేపు మేల్కొని ఉంటారట. వయసు
పెరుగుతున్న కొద్దీ, త్వరగా పడుకుని త్వరగా లేవడం అలవాటు అవుతుందట.
ఇంతకూ నిద్ర మెలకువల
కారణంగా ఆనందంగా బతకడం గురించి చాలా పరిశోధనలు జరిగాయి. ఉదయాన త్వరగా లేచేవారు
దినమంతా హుషారుగా, సాధారణంగా ఆనందంగా ఉంటారు అని తెలిసింది. టర్కీలోని ఒక
విశ్వవిద్యాలయంలో ఈ మధ్యన పెద్ద ఎత్తున ఒక పరిశోధన జరిగింది. అక్కడ కూడా త్వరగా
నిద్ర లేచేవాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉన్నట్టు ఫలితాలు కనిపించాయి. విద్యార్థులు
త్వరగా నిద్రలేస్తే పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తున్నారు అని కూడా తెలిసింది.
ముఖ్యంగా విద్యార్థులలో
26.6% మంది గబ్బిలాలు అంటే రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉంటారు. అటువంటి వారికి
ఆనందం తక్కువగా ఉందట. భరత పక్షులు అనిపించుకున్న పిల్లలు చురుకుగా ఉన్నారట.
అంతేకాదు సంతోషంగా కూడా ఉన్నారట. ఇక జర్మనీలో లైప్చిష్ యూనివర్సిటీలో కూడా ఈ మధ్య ఇటువంటి
పరిశోధన జరిగింది. త్వరగా నిద్రలేచే వాళ్ళకు జీవితాలలో మంచి సంతృప్తి ఉంటుంది అని
తెలిసింది. ఇక రాత్రి ఎక్కువ కాలం మెలుకువ ఉండేవారిలో డిప్రెషన్, కాలానుగుణంగా మరి
కొన్ని మానసిక సమస్యలు, మత్తుపదార్థాల వాడకం వంటి సమస్యలు కనిపించాయి.
విషయం అనుకున్నంత
సజావుగా లేదు. రాత్రి ఎక్కువ కాలం మెలకువగా ఉన్నవాళ్లు, అసలు తక్కువ కాలం
నిద్రపోతున్నట్టు తెలుస్తున్నది. త్వరగా నిద్రలేవడం కన్నా నిద్ర సమయం ఎక్కువ
సమస్యగా ఉంటున్నది. త్వరగా నిద్రలేచే వారికి తమ మీద తమకు మంచి నియంత్రణ ఉన్నట్టు
కూడా కనిపించింది.
ఈ విషయాలన్నీ
గమనిస్తుంటే ముఖ్యమైన ప్రశ్న మరొకటి ముందుకు వచ్చింది. నిద్రలో ఈ తేడాలు అసలు ఏ
కారణంగా మొదలవుతాయి అన్నది ఆ ప్రశ్న. సహజంగా ఉన్న ఈ పరిస్థితిని ప్రయత్నించి
మార్చడానికి వీలు కుదురుతుందా అన్నది మరో ప్రశ్న. ఈ అంశం గురించి వార్విక్
విశ్వవిద్యాలయంలో వివరంగా పరిశోధనలు జరిగాయి. అక్కడ వారికి ఈ క్రోనోటైప్స్ అంటే
నిద్ర పద్ధతికి, మనిషి వ్యక్తిత్వానికి మధ్య సంబంధాలు ఉన్నట్లు కనిపించింది. తమను
తాము చక్కని క్రమశిక్షణతో నియంత్రించుకోగలవారు త్వరగా పడుకొని త్వరగా నిద్రలేస్తారు,
అని గమనించారు. అసలు వ్యక్తిత్వంలో స్వయం నియంత్రణ, చక్కని క్రమపద్ధతి, ఆశా భావం
ఉంటే నిద్ర వారి నియంత్రణలో ఉంటుంది అని గమనించారు. ఇక సులభంగా మనసును బయటపెట్టి
గలగలా మాట్లాడేవారు, రహస్యాలు దాచుకోకుండా ఉండేవారు రాత్రి ఎక్కువ కాలం మెలుకువగా
ఉంటున్నారని గమనించారు. జన్యు పరంగా వ్యక్తిత్వ లక్షణాలు వచ్చేవారు, దాని ఆధారంగా
నిద్ర విషయంగా కూడా తేడాలు కనబరుస్తారని తెలిసింది.
అన్నిటికి మించి
మరొక్క విషయం గుర్తించాలి. క్రోనోటైప్స్ అంటే గుడ్లగూబలు (రాత్రి పని చేసేవారు), భరత
పక్షులు (త్వరగా నిద్రలేచేవారు) అన్న లక్షణాలు, శిలాక్షరాలుగా గట్టిగా నిలిచి
ఉండవు అంటున్నారు. ఈ పరిస్థితి జన్యుపరంగా కాక మరెన్నో లక్షణాల కారణంగా
స్థిరమవుతుంది, అని పరిశోధకులు గమనించారు. కుటుంబంలోని అలవాట్లు, ఉద్యోగం ప్రకారం
వచ్చే అవసరాలు, మామూలుగా బతుకు తీరు ఆధారంగా కూడా ఈ నిద్ర పరిస్థితులు
నిర్ణయమవుతాయి, అంటున్నారు పరిశోధకులు. కేవలం జన్యు కారణాల వల్లనే కాక నిద్ర తీరు
మీద మరెన్నో ప్రభావాలు ఉన్నాయి అన్న అంశం గట్టిగా తేలింది. కనుక ఈ లక్షణాలు కొంత
ప్రయత్నిస్తే మార్చే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా
వార్విక్ విశ్వవిద్యాలయంలో ఈ మార్పు గురించి మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరగా
నిద్ర లేవదలుచుకున్నవారు, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు, ఫోన్, కంప్యూటర్ వంటి
ఎలక్ట్రానిక్ పరికరాలతో ఎక్కువగా పని చేయకుండా ఉండటం మంచిది, అంటున్నారు
పరిశోధకులు. ఉదయాన త్వరగా నిద్రలేచినందుకు చక్కని బహుమతి కూడా ఉండేట్లు ఏర్పాటు
చేసుకోవాలి, అని వారి సలహా. నిద్ర లేవగానే హాయిగా వేడి వేడి కాఫీ తాగడం కూడా
అటువంటి బహుమతులలో ఒకటి కావచ్చు. లేదంటే త్వరగా లేచినందుకు హాయిగా వాకింగ్ వెళ్లి
రావచ్చు. తమ కోసం ప్రత్యేకంగా మరొక రకంగా కాలం గడపవచ్చు.
వార్సా యూనివర్సిటీ
లో ఈ అంశం గురించి మరికొన్ని పరిశోధనలు జరిగాయి. రుతువుల ప్రకారం కూడా ఈ విషయంలో
మార్పులు వస్తాయి అని అక్కడ గమనించారు.
మొత్తానికి త్వరగా
నిద్రలేచినందుకు, బతుకు ఆనందంగా గడుస్తుంది అన్న గ్యారంటీ మాత్రం లేదు, అని అర్థమయింది.
నిద్ర లేచినందుకు బతుకులో హాయి, బతుకులో హాయిగా ఉన్నందుకు నిద్ర లేచే తీరూ, ఇటు
నుంచి అటు, అటు నుంచి ఇటు కూడా ప్రభావాలు చూపుతాయి. ఫలితంగా సంతృప్తి కలుగుతుంది,
అని కూడా అంటున్నారు. దినమంతా చురుకుగా పని చేయాలి, బ్రతుకులో మంచి గమ్యాలు ఉండాలి,
అప్పుడు సమయానికి నిద్ర వస్తుంది. కావాలనుకున్నప్పుడు మెలకువ కూడా వస్తుంది. అది
చివరగా అర్థం చేసుకోవాల్సిన సూత్రం.
No comments:
Post a Comment