Tuesday, December 9, 2025

శోకనాయిక మీనాకుమారి - Tragedy Queen Meenakumari

శోకనాయిక మీనాకుమారి

మరొక శోకనాయిక మీనాకుమారి

Chand tanha hai aasman tanha, Dil mila hai kahan kahan tanha.

Bujh gayi aas, chhup gaya taara, Tharatharaata raha dhuaan tanha.

Zindagi kya isi ko kahate hain, Jism tanha hai aur jaan tanha.

Humasafar koi gar mile bhi kabhi, Donon chalte rahen kahaan tanha.

Jalti-bujhti-si roshani ke pare, Simata-simata-sa ek makaan tanha.

Raah dekhaa karega sadiyon tak, Chhod jayenge ye jahaan tanha. 

-Meena Kumari Naaz

*****

चाँद तन्हा है आसमाँ तन्हा 

दिल मिला है कहाँ कहाँ तन्हा II

बुझ गई आस छुप गया तारा 

थरथराता रहा धुआँ तन्हा II

ज़िंदगी क्या इसी को कहते हैं 

जिस्म तन्हा है और जाँ तन्हा II

हम-सफ़र कोई गर मिले भी कहीं 

दोनों चलते रहे यहाँ तन्हा II

जलती-बुझती सी रौशनी के परे 

सिमटा सिमटा सा इक मकाँ तन्हा II

राह देखा करेगा सदियों तक

छोड़ जाएँगे ये जहाँ तन्हा II

             मीना कुमारी नाज़

*****

چاند تنہا ہے آسماں تنہا

دل ملا ہے کہاں کہاں تنہا


بجھ گئی آس چھپ گیا تارہ

تھرتھراتا رہا دھواں تنہا


زندگی کیا اسی کو کہتے ہیں

جسم تنہا ہے اور جاں تنہا


ہم سفر کوئی گر ملے بھی کہیں

دونوں چلتے رہے یہاں تنہا


جلتی بجھتی سی روشنی کے پرے

سمٹا سمٹا سا اک مکاں تنہا


راہ دیکھا کرے گا صدیوں تک

چھوڑ جائیں گے یہ جہاں تنہا


                 مینا کماری ناز

*****



సంతోషంలో పాడుకున్న పాటలు సువాసనల లాగా గాలిలో తేలియాడుతూ ఎక్కడెక్కడికో వెళ్లిపోతాయి. దుఖంలో పాడుకున్నవి మాత్రం బరువుగా అక్కడే కిందకు దిగి, పాడిన వాళ్ళ మీద, పక్క వాళ్ళ మీద వాలిపోతాయి. ఈ ప్రపంచంలో కొన్ని బతుకులు ఈ బరువుల కింద నలిగి అలసి సొలసి పోతాయి. ఆనందంగా హాయిగా గడపవలసిన కలవారి జీవితాలు కూడా కలతలకు లోనై కవితలుగా మారి మొత్తం ప్రపంచాన్ని కలవరపెడతాయి. తెలుగు చిత్రసీమలో సావిత్రి బతుకు ఇలాంటిదే. అటు హిందీలో ఒక మీనాకుమారిని ఈ రకమైన బాధల బతుకుగా ఉదహరించవచ్చు. మరొక మార్లిన్‌ మన్రో కూడా అన్యాయంగా అనాదరణకు గురై అర్థం లేకుండా అంతమయింది. వీళ్లు ముగ్గురూ సాటిలేని అందగత్తెలు. గొప్ప నటీమణులు. తమ దుఖాలను కడుపులో దాచుకుని నటన ద్వారా ప్రపంచానికి ఆనందాన్ని పంచి ఇచ్చిన వారు.

 

వీళ్లలో మీనా కుమారిది మరీ ప్రత్యేకమైన స్థానం. ఆమె బీద ఇంట పుట్టింది. నటన అంటే ఏమిటో తెలియని నాడు చిన్నతనంలోనే నటిగా మారింది. ఆ తరువాత బతుకులో ఎడతెరపి లేనే లేదు. ఆనందం కూడా అంతకంటే లేదు. మనం తలుచుకున్న ముగ్గురిలో మిగతా ఇద్దరికీ చేతకాని పని  మీనాకుమారి తలకు ఎత్తుకున్నది. ఆమె కవితలు రాయడం మొదలుపెట్టింది. అలాగని ఆమె గొప్ప కవయిత్రి అనడానికి లేనేలేదు. మీనా కుమారి బ్రతికి ఉన్నంతకాలం ఆమెను కవయిత్రిగా ఎవరూ గుర్తించలేదు. ముషాయిరాలకు వెళ్ళింది లేదు. వెళ్లి గౌరవంగా తన కవిత వినిపించింది లేదు. ఆ కవితలలో బరువులు, బాధలు తప్ప మరొక సంగతి లేదన్నది ఆమె మరణించిన తరువాత మాత్రమే అందరికీ తెలిసింది.1972లో ఆమె పోయిన తర్వాత అందరి దృష్టి ఆమె కవితల మీద పడిరది. మిత్రుడు, సినిమా ప్రపంచం మనిషి గుల్జార్‌ ఆమె కవితలను సేకరించి అచ్చువేయించాడు. అలాగే మరొక పాత్రికేయుడు వినోద్‌ మెహతా ఆమె జీవిత చరిత్రను రాయడం మొదలుపెట్టాడు. చిత్రం ఏమిటంటే మెహతా ఎప్పుడు కూడా మీనాకుమారి ని చూచి మాట్లాడింది లేదు. అయినా రాయడానికి ప్రయత్నించి, చేతనైనంత మందితో మాట్లాడాడు. దొరికినదంత చదివాడు అతనికి ఆ నటి మీద వల్లమాలిన అభిమానం ఏర్పడిరది. ఇక జీవిత చరిత్ర బయటకు వచ్చింది. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జీవితాన్ని రాసిన కనీగేల్‌ కూడా ఇటువంటి భావనకే లోనయి చక్కని జీవిత చరిత్ర రాశాడు.

వినోద్‌ మెహతా ముందు కవిత్వం గురించి ఏమంటాడో చూడాలి. ఆమె కవిత్వంలో అంతట దుఖం, నిరాశ, ఇవి మాత్రమే, మీనా కుమారి  లాంటి మనిషి నుంచి అంతకన్నా మనం ఆశించ గలిగినది మరేమీ ఉంటుంది అంటాడు అతను.

------

 

నిస్సహాయురాలు మీనా కుమారి - ఆమెకు పట్టింది హృదయపు బీమారీ అని మీనా కుమారి తన గురించి తానే చిన్న కవిత చెప్పుకున్నది.

కవిత ప్రసక్తి మొదలైంది కనుక ఆమె ఆనాటి తన బ్రతుకులో ఒంటరితనాన్ని భరించిన తీరును గురించి రాసుకున్న కవితను ఒకసారి మనం చూడాలి. ఎందుకో నాకు ఈ కవితలోని మాటలు మారిపోయి గుర్తున్నాయి. కలకాలంగా వాటిని తప్పుగా పడుకుంటున్నాను.

చాంద్‌ తన్హా హై, ఆస్మా తన్హా అంటూ ఆమె కవితను మొదలుపెడుతుంది. మనవాళ్లు చంద్రునికి నక్షత్రాలన్నీ తోడు ఉన్నాయ ని అంటారు. జీవితంలో తాను కోరుకున్న  ప్రేమ, ఆదరణ నోచుకోని మీనాకుమారికి చంద్రుడు ఒంటరి వాడుగా కనిపించాడు. ఆకాశం ఒంటరిగా కనిపించింది.

అదే కవితలో మరింత ముందుకు సాగి ఆమె జీవితం అంటే ఇదేనా? శరీరం ఒంటరిగా ఉంది. ప్రాణం కూడా ఒంటరిగా ఉంది అంటుంది. బాట మీద నడవడానికి తోడుగా ఒక మనిషి దొరికినప్పటికి జంటగా కాక ఒంటరిగానే ఎవరికివారు నడుస్తున్నాము అంటుంది. అందరూ ఆమెను వాడుకున్న వారే. ఆమె కూడా అందరిని వాడుకున్నది అంటారు. అయినా ఆమె కోరిన ప్రేమ మాత్రం మీనా కుమారి కి అందలేదు. ఆమె రాతలనిండా అడుగడుగున ఆ భావమే కనబడుతుంది,

 

మీనా కుమారి తండ్రి అలీ బక్ష్‌ సంగీతకారుడు. పంజాబ్‌ నుంచి అతను సినిమా ప్రపంచంలో అవకాశాలను వెతుకుతూ బాంబే వచ్చాడు. అక్కడి బతుకును ఈడుస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. రవీంద్రనాథ టాగోర్‌ తమ్ముని మనవరాలు ఒక అమ్మాయితో అతనికి నేస్తం కుదిరింది. ఆమె కళాకారిణి . మొత్తానికి ఆటపాట తెలిసిన ఆ ఇంట్లో బీదతనంలో పిల్లలు పుట్టారు. వాళ్లలో రెండవ అమ్మాయి మెహజబీన్‌ బానూ. ఆమె తరువాత మీనాకుమారి నాజ్‌ అయింది. మెహజబీన్‌ అంటే మెరిసిపోయే నుదురు కలది అని అర్థం. నిజంగానే అమ్మాయి అందమైనది. మీనా అన్న మాటకు రకరకాల అర్థాలు ఉన్నాయి. ఆమె అందాన్నివాడుకుని తండ్రి అమెను నటనలో పెట్టాడు. నిజానికి అంతకన్నా ముందే పిల్లలను పెంచలేము అన్న భావంతో పాపను అనాధశరణాలయంలో చెప్పాపెట్టకుండా వదిలి వచ్చాడట. కానీ మనసులో బాధ కలిగి వెళ్లి పాపను మళ్లీ ఇంటికి తెచ్చుకున్నాడట. ఈ సంగతి మరి మీనాకుమారికి ఎవరు చెప్పారో తెలియదు కానీ, ఆమె దాన్ని మళ్లీమళ్లీ అందరిముందు చెపుతూ ఉండేదట. ఆ సంగతి ఆమె మనసులో లోతుగా నాటుకుని పోయిందని వినోద్‌ మెహతా అంటాడు.

మీనా కుమారికి నిజానికి బాల్యం అంటూ ఒక దశ అనుభవంలోకి రాలేదు. ఏడు సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రుల పట్టుదల కారణంగా ఆమె సినీ ప్రపంచంలోకి కాలు పెట్టింది. ఇల్లు గడవడానికి మరొక మనిషి సంపాదన అవసరం కనుక అది జరిగింది. అంతే కానీ, ఆమెలో ఇదో గొప్ప నటనాసక్తి ఉందని మాత్రం కాదు. 18 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి అప్పటికే ఆమె అందరికీ తెలుసు. ఆ వెలుగులలో గుర్తింపు రావడం ఆమెకు బాగానే నచ్చినట్టు కనబడుతుంది. బైజూ బావరాతో ఆమె నటిగా స్థిరపడిపోయింది. ఆ తరువాత రెండు దశాబ్దాల పాటు 50 కి పైగా చిత్రాలలో నటించింది. బ్రతుకంతా అసంతృప్తితోనే ముందుకు సాగింది. తనను ఈ ప్రపంచం స్వాగతించలేదు అన్న భావం ఆమెలో గట్టిగా మిగిలింది. ఆ అసంతృప్తిలో నుంచి ఆమె నటిగా అందరికీ ఆనందాన్ని పంచింది. ట్రాజెడీ క్వీన్‌ అన్న పేరు తెచ్చుకున్నది. హిందీ సినిమాల్లో అటుపక్కన దిలీప్‌ కుమార్‌ కు ట్రాజెడీ కింగ్‌ అని పేరు ఉండేది. వరుసపెట్టి వాళ్లు రకరకాల చిత్రాలలో తాము ధరించిన పాత్రల ద్వారా ప్రేక్షకులకు కంట నీరు తెప్పించిన నందుకు మిగిలిన బిరుదులు అవి. అయితే మీనా విషయంలో అది నటన కాక నిజంగా కూడా ఒక బిరుదుగా మారిపోయింది.



No comments: