Sunday, December 7, 2025

Lokabhiramam లోకాభిరామం - పోగాలము

లోకాభిరామం

పోగాలము

పోగాలము

వానికి గోపియను పేరుబెట్టిరి. వాడు వాస్తవముగనే ముక్కుమీద గోపము గలవాడాయెను. వాడు నాకు చాలా గొప్ప పేరున్నదనును. ఆ పేరెక్కడనున్నదని ప్రశ్న బుట్టును. కొందరికి వారి పేరు గోడమీద నుండును. గోడ మీదకన్నను, గోడకు తాపితము జేసిన నొక జెక్క మీద చెక్కబడి యుండుననిన కడు సమంజసముగా నుండును. వీనికట్టి పేరు లేదు. అట్లున్న పేరు గొప్ప పేరెట్లగును? అది చెక్క మీద పేరగును. ఒకనికి గొప్ప పేరున్నదన్న నేమి భావము? వాని ప్రతిష్ఠ ఘనముగా నున్నదని గదా! అందుకే పేరు ప్రతిష్ఠలను నొక సమాసమేర్పడినది. అందొకటి యున్న రెండవది గూడ తోడుగా నుండునని భావము.

వానికి తలిదండ్రులు బెట్టిన పేరు గోపాలము. తెనుగున పేరల జివరన డుమువులుండవలెనని గదా వ్యాకరణము. వాడు గోపాలుడు. తమిళమున గోపాలన్‌ అందురు. అది యేకవచనమే. గోపాలర్‌ అన్న గాని బహువచనము గాదు. తెనుగున డు అన్న నేకవచనము. అది యందరికి నచ్చదు. నీవొక్కరివే. కాని నిన్నెవరో ‘మీరు’ అని సంబోధించిన నొక గౌరవము, ఒక యానందము. ఒకప్పుడొకడు నా వద్దకు వచ్చి యేదో ఫిర్యాదు చేయనుండెను. వాడు మాటిమాటికి ‘మేము’ అనుచుండెను. నాకు కొంచెము తిక్క. అది కొంచెము గాదు, పుష్కలముగనున్నది. వానిని ‘ఏదీ, కొంచెము పక్కకు జరుగుమంటిని. వానికర్థము గాలేదు. యేలయని యడిగెను. ‘కొంచెము జరుగుమని మరల యంటిని. నేనధికారిని, అతడు సేవకుడు. కనుక జరిగెను. ఒక్కనివే యుంటివి. మాటిమాటికి మేమనుచుంటివి. నీవసలే స్థూలకాయుడవు, వెనుకనెవ్వరయిన యుండిరో చూడవలెనని, జరగమంటిని’ అని వారించితిని. వానికి కొంత అర్థమయినది. కొంత గాలేదు.

డుమువులలో రెండవది ము. రాముడను వాడు ‘రామము’గా మారును. అది యేకవచనమా? ఎన్ని పదములున్నవను యనుమానమేరికిని గలుగదు. అదియును ఒకనినే సూచించును. అయినను, అవగాహనము కొరవడినందుకు అందొక సౌలభ్యము దోచును. ఈ గోపియను కోపికి, గోపాలము అనిపేరు వడినది. పట్నము పాపమని యెవ్వరును వ్రాయుట లేదు. పట్నం అని వ్రాయుచున్నారు. ఎక్కడికి బదులుదేరితివని ప్రశ్న. పట్నమునకని ఉత్తరువు. అంత పట్టింపు లేనివారు ‘పట్నానికి’ అని బదులిత్తురు. ఈ మధ్యన పుస్తకములు, పత్రికలలో గూడ ‘పట్నంకు’ అను ప్రయోగము గనుపించుచున్నది. సంస్కృతమున విభక్తి ప్రత్యయములున్నవి. నగరం అన్న మాటలో నగరమునకు అను నర్థము గూడ నిమిడియున్నది. నగరమునందు, అనుటకు నగరే యనవలయును. మన వారు నగరంనందు యని నగుబాట్లగుదురేమో? భాషయననది ప్రవహించు నది వంటిది. మారుచుండ వలెను. నిజమే. కానీ మార్పు వలననెవరికో కొంత వెసులు బాటుండదగును. గోపాలము, తన పేరు గోపాలం అని వ్రాయును. నా పేరు, నా యిచ్చ యనుకొన్నాడేమో? డుమువులున్నంత కాలమది తెనుగు పేరు. అవి లేకున్ననది దెగులు పేరు.

ఒక గాయకుడు వచ్చెను. భజరే గోపాలం, అని పాటబాడెను. గోపాలుని భజింపుమని గదా పాట యర్థము? రామ శబ్దమకారాంతము. రామముగా వ్రాసిననది డుమువులు పద్ధతిలో పేరు. రామం అని వ్రాసినచో నది సంస్కృత శబ్దమగును. రామునికను నర్థమిచ్చును. ఈ గోపాలమను వాడు బ్రౌను దొర రాసిన తెనుగు నిఘంటువును అచ్చునకు తయారు జేయు కార్యక్రమమునందు పాలుగొనెను. యంత్రమునందు అక్షరముల పొందిక జేయునపుడు, పదముల యంతమందుండు ము వర్ణమును పూర్ణానుస్వారముగ మార్చవలెనని ప్రచురణకర్తలు ప్రస్తావన దెచ్చిరి. వీడు, ఎంతమాత్రము కుదరదనెను. మనము నిఘంటవును, పరిష్కరించుట లేదు. మన యిచ్చవచ్చినట్టు మార్పులు జేయుట తగదని వారికి నచ్చజెప్పెను. అంతటి యాలోచనము గలిగిన వానికి స్వకీయ నామధేయము గురించి మాత్రము సత్యము దోచియుండ లేదెందులకు?

ప్రథమ విభక్తి యందు మూడవ యక్షరము ‘వు’. ప్రభు శబ్దము దెనుంగన ప్రభువుగా మారును. వధూ శబ్దము వధువుగా పరివర్తనము జెందును. సేతువు తీతువు అను మాటలున్నవి తీతువనగా తీయుదువని గాదు. తీతువనునది యొకానొక పక్షివిశేషము. గోపాల శబ్దమునకు మాత్రము వ్యాకరణమున నియమము లుండవు. ఇప్పుడు సమాజమున గరణములు లేరు. ఉన్నను వారు గరణీకము జేయుటలేదు. భాషల యందు వ్యాకరణమును నట్లే మృగ్యమగుచున్నది. ఆంగ్లమును గూడ నడుము విరిచి, ఎవరి చేతయిన రీతిని వారు వ్రాయుచున్నారు.

భాషయనునది భావ వినిమయ మాధ్యమము. ఎదుటి వారికి నీవు జెప్పునట్టిదేదో తలకెక్కిన చాలునని యర్థము. బిచ్చగానిని కొందరు పైకి బొమ్మందురు. అనగా మరియొక యింటికని వారి లెక్క. పైకి బోవుట యన్న ప్రాణము బోవుట యనుట గూడనున్నది. జనుల భాష ఈ తీరున నానాటికి తీసికట్లగుచుండగా, పత్రికలు, టెలివిజనుల వారు మరింత కృతకమయిన భాషను వాడకలోకి దెచ్చియుండిరి. ‘లోతట్టు ప్రాంతములు జలమయమయినవి. జనము తీవ్ర ఇబ్బందులకు గురయి వాపోవుచున్నారం’దురు. వాపోవుటయనగా వానికి దెలియునా? నోరంతయు దెరిచి బొబ్బబెట్టుట. జనులు ‘వా’ యని యంగలార్చుచుండిరా? తీవ్ర యిబ్బందులనునది సరియగు సమాసము గాదు. అటువంటివే, నేపథ్యము, పరిస్థితి వంటి మాటలు లేక వారికి వాక్యము వీలుగాదు. తెలుగు నేర్పెడి గొప్ప పండితుడొకడు సమయలేమి, లేదా అటువంటి మాటయేదో వాడెను. ఆయనకు ఎవరు జెప్పవలెను? తప్పు దెలుసుకొనుట ఒక ఎత్తు. దానిని అంగీకరించుట మరియొక ఎత్తు. ఈ రెంటి తరువాత సరిదిద్దుటయను స్థాయి వచ్చును.

భాష పరిణామశీలము. ఇది సత్యము. పరిణామమనగా, ఏదియో యవసరము, వెసులుబాటు కొరకు కొన్ని మార్పులు రావచ్చును. కడుపుగోసినను మాటరాని వారి వలన భాష భ్రష్టువట్టిన యది పరిణామ మనబడదు!

గోపాలమునకు మద్రాసను, చెన్నపట్నమునుంచి ఉత్తరమొకటి వచ్చెను. దాని మీద వీని పేరు ‘కపాలమ’ని వ్రాసియున్నది. కొత్త పేరు దొరికినదని వాడెంతో సంతసించెను. అట్టి వానికి, వాని పేరు సరిగా లేదని జెప్పుట ఎట్లు?

ఇందొక విషయమున్నది. ఒకటి యనగా రెండు. మొదటిది గోపాలమనువాని పేరును గురించిన వాక్యార్థము. వాని పేరెట్లున్నను కడమ వారికి పట్టదు. కనుకనే పోగాలము అన్ననుగూడ వాడు బహుశా పలుకును. పేరు ఎవరికి వారు ఇష్టపూర్తిగా పెట్టుకొనునది కాదు. తల్లిదండ్రులు నిర్ణయింతురు, ఆ పేరుతో పిలుచుచుందురు. కొంతకాలము వరకు అది తన పేరని ఏరికిని ధ్యాసయే యుండదు. కొన్ని వందల సార్లు అందరును అదే పేరుతో పిలిచినందుకు, ఇది నా పేరను నిర్ధారణము కలుగును. ఈ గోపాలమను వాడు ఈ మధ్య వరకు తన పేరు గురించి అంతగా పట్టించుకోలేదనునది సర్వవిదితము. కానీ ఈ మధ్య వాడు తన పేరును ‘విజయగోపాలుడని’ వ్రాసుకొనుచున్నాడు. ఇందొక విషయమున్నది. వాని భార్యామణి పేరు విజయ. ఆపె వలన వీనికి కడు విజయములు చేతికందినవి. కనుక వాడట్లు పేరు పెట్టుకొనెను.

మరి రెండవ విషయముండవలెను గద! అది భాషకు సంబంధించినది. తెలుగనునది యిట్లు గూడ యుండెనని అందరు మరిచిరి. చిన్నయసూరి పద్ధతి తెలుగు మరొక రకము. అనవుడు, నావుడు అను మాటలకర్థము తెలియక బడి పంతుండ్లు కూడ తికమక పడిన సంగతి చెప్పుచుందురు. అది తెలుగు కాదనుటకు లేదు. అందులోని కమ్మదనము అందిన వారికి అది అమృతోపమానముగ దోచును. ఇక ప్రాంతములను బట్టి మాట తీరనునది గూడ మరియొక విశేషము. యాస, భాష అను రెండు మాటల మధ్యన అంతరము తెలుసుకొనవలెను. ఈ రెంటిలో ఏదయినను భాషలో మాధుర్యము, భావము  పలికినంత వరకు అది యంగీకార యోగ్యమే. కానీ మిడిమిడి జ్ఞానము వలన తప్పులు వ్రాయుటను మాత్రము సహించకూడదు,. ఈ మధ్యన ఎటుచూచినను జనము పోటెత్తుచుండిరట. నీరు కూడ పోటెత్తునట. ఏదో జరిగినది అని చెప్పుటకు జరిగిన పరిస్థితి అనుట ఒక యాచారమయినది. ఇట్లు చాల విషయములు మాట్లాడవచ్చును. వాటిని మరొకసారి చూతముగాక.

No comments: