Showing posts with label cinema. Show all posts
Showing posts with label cinema. Show all posts

Thursday, April 30, 2026

సినీమానసం - On cinemas and my feelings!





సినీమానసం

చందమామలు - ప్రేమకథలు

మా వాళ్లలో పెద్ద పండితులు లేరంటే తప్పే. చాలా బాగా చదువుకున్న వారున్నరు. కానీ, లౌక్యం మాత్రం బాగ తక్కువ. గొప్ప పండితులు కూడ ప్రపంచం పట్టకుండ వ్యవసాయంతోటి కాలం గడిపి పోయినరంటే ఆశ్చర్యంగ ఉంటుంది. దూర దేశాలకు పోయి బాగ చదువుకున్నవారు గూడ ఏమీ తెలియని వారిలాగే బతకడం నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కంచి చంద్రశేఖరేంద్ర స్వామి పాలమూరు వచ్చినరు. కలెక్టరు సభ చేయించినరు. అక్కడ మావారొకరిద్దరు వేదం చెప్పినరు. స్వామికి కలిగిన సంతోషం అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. మరోవేపు కొంతమంది మాత్రం ఉద్యోగానికి సరిపడ చదువు, సగటు బతుకుకు సరిపడ వైదికం ఉంటే చాలనుకున్నరు. సమకాలీన సాహిత్య, సంగీతాలు పట్టించుకున్న వారు మాకు చాలా తక్కువమందే ఉన్నరు. నాటికీ, నేటికి కూడ! అలాంటి చిన్నాయినగారు ఒకాయన, పిల్లవాడు ‘చందమామ చదువుతున్న’ అంటే, ‘చందమామలు, ప్రేమకథలు’ కాలయాపన! అన్నరంటే ఆశ్చర్యం ఏముంది.

నూచి వాడూ - గైడూ: నూచివాడంటే మా ఒకానొక అన్నయ్య శ్రీనివాసు. ఈ శ్రీనివాసుడన్న పేరు ఎన్ని రకాల మారిందో గమనిస్తే సరదాగ ఉంటుంది. నాకొక నివాస్‌ తెలుసు. ఒక సీను, మరొకరు శ్రీను. ఇక చీనులు, చీనాలు ఎంతోమంది ఉన్నారు. చీను మామ చీమా అవుతాడు. మా అమ్మ తనకన్నా వయసులో పెద్దయినా, వరుసకు మాత్రం అల్లుడయ్యే ఒక పెద్దాయనను శీనువాచార్లు అనేది (నా మీద అనునాసికం పలకాలి. అరుసున్నలేమయినయి?) అలై ఓసై అనే తమిళ నవలకు మిత్రులు వాకాటి చేసిన అనువాదాన్ని ఈ మధ్య చదివాను. అందులో ఒక చీమాచ్చువయ్యర్‌ ఉంటాడు. శ్రీనివాస య్యర్‌ అన్నమాట! ఇతిశ్రీనివాస చర్చా! అథాతో గైడు జిజ్ఞాసా? (శ్రీనివాసుని ముచ్చట ఆపుదము. గైడు గురించి తెలుసుకుందము!)

మా చీమాచ్చువయ్యంగార్‌. కాదుకాదు నూచి వాడు గైడ్ అను చిత్రరాజము ఊర్లో ఆడినన్ని నాళ్లు నిత్యం ఒకసారి చూచినట్లున్నడు. మరోసారి చూచినా నాకు చెప్పలేదేమో? అది దిలీప్‌కుమార్‌, దేవానంద్‌, రాజ్‌కపూర్ల యుగం. ఈ దిలీప్‌కుమార్‌ అన్నాయన ఇవాళటి మేటి హీరోలలాగే ఒక ఖాన్‌ సాహిబ్‌. కానీ ఎందుకో పేరు మార్చుకున్నడు. ఈ ముగ్గుర్లోనూ దేవానంద్‌ది విచిత్రమయిన ధోరణి. ఆయన దుస్తుల తీరు, మాటల జారు (జారుడు), అంతా ప్రత్యేకంగ ఉండేది. సాహిత్య రుచి తగిలిన వారలము గనుక, అప్పటికే ఆర్‌కే నారాయణ్‌ రచనల రుచి తెలుసు. ఆయన కలం నుంచి రూపుపోసుకున్న గైడ్‌ ఎట్లాగుంటడని ఒక కుతూహలం. నూచివానికి ఉన్న వెసులు బాటు నాకు లేదు. నా దగ్గర పైసలుండవు. ఎవరినీ అడగడం ఇష్టం లేదు. నేను ‘మేరానాం జోకర్‌’ అనే సినిమా చూడడానికి ప్రయత్నించి కూడా చూడలేక పోయిననంటే నమ్మగలరా? నేనా సినిమా ఇవాళటికీ చూడలేదు. గైడ్‌ మాత్రం చూచిన. చాలా గొప్ప చిత్రం. నూచివాని పైసలతో ఒక హిందీ వర్షన్‌ పుస్తకం కొన్నము. సులభంగ చదివినము.

ఒకరి లక్షణాలు మరొకరికెవరికయిన వచ్చినయని, సహవాసం వల్లనయితే మరింతగ, చెప్పేందుకు మా వాండ్లు ‘వాని గుడ్డ వీని మీద పడింది’ అంటరు. సాధువులెవరో, చలిలో వణుకుతున్నందుకు కప్పిన గుడ్డ కారణంగ దేవానంద్‌ ఈ సినిమాలో స్వామీజీ అవుతడు. వర్షాల కోసం అతను ఉపవాస దీక్ష చేయవలసి వస్తుంది. మీకు హిందీ అర్థంకానీ, కాకపోనీ, ఈ సినిమా ఎట్లాగయిన చూడమని మనవి! అంత బాగుంటుందది. సూపర్‌ పాటలుంటయి. ఆర్కియాలజీ తప్ప మరొకటి తెలియని ముసలి మొగుడు ప్రొఫెసర్‌కు, అందంగా ఉండి, అద్భుతంగ నాట్యం చేయగల భార్య. హైదరాబాద్‌ అమ్మాయి వహీదా రహమాన్‌ (పేరు మార్చుకోలేదు) వేసింది ఆ పాత్ర. మొగుడు గుహల్లో శిథిలాలు వెదుకుతుంటే, ఈమె మన రాజూ గైడ్‌తో ప్రేమను వెదుకుతుంది. ఇద్దరూ కలిసి పారిపోతరు. డాన్స్‌షోలు చేసి పేరు, పైసా సంపాయిస్తరు (ఆ కాలంలో సినిమా హీరో లందరికీ పాత్ర పేరు రాజు అని ఎందుకు ఉండేది?) కథ అంతా చెపితే బాగుండదు. కానీ దేవానంద్‌ జైల్లో పడతడు. ఆ తరువాత స్వామీజీ అవుతడు. నేను కూడా సినిమా ఒకటికి రెండుసార్లు చూచిననేమో గుర్తులేదు. కానీ, ‘అంగ్రేజీ ఆతీతోనా?’ లాంటి డయలాగులు ఎన్నో మాకు నిత్యం అనుకోకుండనే నోటెంబడి వచ్చేస్తుండేవి. చివరికి దేవానంద్‌ మెరిసే శాలువా ఒకటి కప్పుకుని తెర నిండ కనిపిస్తడు. మాకేమో, మనం కూడా శాలువా కప్పుకుంటే, రాజూ గైడ్‌ అయిపోతమోనని ఆశ! ఏదీ శాలువా దొరకదే! అదీ పసుపురంగుది!

ఆ సినిమాలో ‘గాతా రహే మేరా దిల్‌’ అని గొప్ప యుగళ గీతం ఒకటి ఉంటుంది. దేవానంద్‌ ఒక కొండ మీద నుంచి ‘గాతా రహే మేరా దిల్‌’ అంటడు. మరో కొండ మీద నుంచి వహీదా ‘తూహీ మేరీ మంజిల్‌’ అంటుంది. తరువాతి చరణం పాడే సమయానికి ఇద్దరూ ఒకచోటనే ఉంటరు. వాస్తవికత మరీ తలకెక్కిన నాకు, వాళ్లట్ల ఎందుకు చూపించినరని, నాటికీ, నేటికీ అసంతృప్తి.

నవల - హిందీలో: సినిమా గొప్పగ ఉంది. కానీ, నవల మాత్రం అట్ల ఉండదని మాకిద్దరికీ అనుమానం వచ్చింది. గొప్ప చెప్పుకోవడం లేదు గానీ, ఒక పుస్తకం చదివినా, సినిమా చూసినా, దాన్ని గురించి బాగ వివరంగ ఆలోచించడం, చర్చించడం చిన్నప్పటి నుంచీ మాకు అలవాటు. ‘గైడ్‌’ నవల అప్పటి వరకు చదవలేదు. పాలమూరులో పుస్తకాల దుకాణాలే తక్కువ. వాటిలో బడి పుస్తకాలుంటయి గానీ, నవలలూ, ఆధునిక సాహిత్యం ఉండవు. (బహుశ పరిస్థితి ఇవాళటికీ అట్లనే ఉండి ఉండాలె! మా వాండ్లకు సంగీతం, సాహిత్యం ఆమడ దూరం!) హైదరాబాద్‌ అంటే అప్పటికి ఇంకా పట్నం! అంటే అందుబాటులో లేని ఆశాద్వీపం! మొత్తానికి వెతకగా వెతకగా మాకు ఒకే ఒక్క కాపీ హిందీ వర్షన్‌ దొరికింది. హిందీ చదవడం, అర్థం చేసుకోవడం బాగానే చేతనవుతుంది గనుక ఆ హిందీ పుస్తకం తెచ్చి ఏకబిగిని చదివినము. సినిమా కథకు, పుస్తకంలోని కథకు ఎంతో తేడా ఉందంటే నమ్మగలుగుతరా? తరువాతెప్పుడో తెలిసింది ఆర్‌.కే. నారాయణ్‌గారు, సినిమా చూచి ‘జన్మలో నా నవలలు సినిమా వారికి ఇవ్వన’ని నిర్ణయించుకున్నరని. అందుకు ఒకే ఒక్క మినహాయింపు ఉంది. సినిమా కాదు గానీ, టీవీలో ‘మల్‌గుడి డేస్‌’ అనే సీరియల్‌ వచ్చింది. స్వంతం తమ్ముడు లక్ష్మణ్‌ (కార్టూనిస్ట్‌) పక్కనుండి తీయిస్తనంటే, కొన్ని కథలు మాత్రం ఇచ్చినరు నారాయణ్‌.

ఏకవీర: నవల సినిమాగ రావడమంటే వెంటనే విశ్వనాథ వారి ‘ఏకవీర’ గుర్తొస్తుంది. నవలలాగే సినిమా కూడ చాల కళాత్మకంగ, బాగ వచ్చింది. అది తమిళ ప్రాంతానికి చెందిన కథ. వైగై తీరపు కథ. కుట్టన్‌ సేతుపతి, వీర భూపతి అన్న పాత్రలలో అన్నగారు నందమూరి వారు, కాంతారావుగారు ఎంతో బాగ చేశినరు. సినారె పాటలు, కథకు అతికినట్టున్నయి. మామూలు ప్రేమకథ. కానీ మహాకవి దాన్ని మహత్తర కావ్యంగా మలిచారు.

విశ్వనాథ వారు నాకు ఆరాధ్యులయిన, కొద్ది మందిలో ఒకరు. వారి గురించి ఎంతో ఉంది చెప్పుకోనడానికి. వారి కుమారులు పావని, నాకు మిత్రులు. ‘సీరియల్‌కు ఏ నవల బాగుంటుంది?’ అడిగారు. ‘రత్నావళి’ అన్నాను. ఆయన! భలే! అనడం గుర్తుంది. వేయి పడగలు తీసినట్టున్నరు. పండలేదన్నరు. ‘పులిముగ్గు’ లిస్టులో చూచిన. బాగా గ్రాఫిక్స్‌ కావాలె దానికి. అదసలు రానే లేదు!

గైడ్‌ సినిమాలో ఆర్కియాలజీ ప్రొఫెసర్‌గ నటించిన వారు, సినీ దర్శకుడు కిశోర్‌ సాహూ! ఆయన ‘పర్‌దే కే పీఛే’ అనే పేరుతో ఒక నవల రాశినరు. ‘తెర వెనుక’ అనే పేరుతో ఆ నవలకు తెలుగు రూపాంతరం ఏనాడో వచ్చింది. అది ఈ మధ్యన ఎక్కడ కనిపించ లేదు. దొరికితే బాగుండును, అని ఎన్నిసార్లు అనుకున్ననో. సినిమా రంగంలో జీవితాలు, ముఖ్యంగా స్త్రీల బతుకులను గురించిన మహత్తరమయిన రచన అది. పెద్దలు, అయినా మిత్రులు రావూరి భరద్వాజ గారి ‘పాకుడు రాళ్లు’ కూడ ఈ రకం ఇతివృత్తంతో వచ్చిన రచనే!

స్మితా పాటిల్‌ హీరోయిన్‌గ వచ్చిన ‘భూమిక’ అన్న సినిమా కూడ ఒక నటి బతుకు గురించే! ఆ కథ అంతకు ముందు నవలగ వచ్చిందేమో తెలియదు. ఒక మామూలు ఇంటి ఆడకూతురు మహత్తర నటిగా మారి పడిన కష్టాలు ఆ సినిమాలో చాల బాగ చూపించినరు. ఎవరో మరాఠీ నటి జీవితమని అన్నట్టు గుర్తు.

ఈ మధ్యనే గతించిన మిత్రులు (అల్లుడు, నన్ను మామయ్యా అనే వారాయన!) భరద్వాజ నవల పాకుడు రాళ్లు కూడ సినీ నటి బతుకు గురించే. భరద్వాజ మద్రాసు సినీ మాయా ప్రపంచంలో చూచిన సంగతులు నవలగ రాసి ఉంటరు. ఆ నవల మరి సినిమాగ వచ్చిందా? తెలుంగులో అటువంటి ‘బొమ్మ’ తీసే ఎవరన్న చూస్తరా? మనకంతా బాయ్‌ మీట్స్‌ గరల్‌తోనే గద బతుకంత! 

 

Wednesday, December 31, 2025

శోకనాయిక మీనాకుమారి - 2 : Tragedy Queen Meena Kumari Part 2

శోకనాయిక మీనాకుమారి - 2 

2

చంద్రుడు ఒంటరి అన్న కవితలో ఆమె చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలు. ఆమె చివరి సినిమా పాకీజా మహత్తరమైన విజయాలను సాధించింది. దాన్ని భర్త కమాల్‌ తీశాడు. దానికి ఆమె మనసులోని భావాలను దాచుకుని అతనితో సహకరించి చిత్ర నిర్మాణానికి చేతనైనంత ఊతం ఇచ్చింది. ఆ సినిమాలో సాహెబ్‌ జాన్‌ అనే పాత్ర నిజంగా మీనా కుమారి నిజజీవితానికి అద్దం పడుతున్నట్టు ఉంటుంది. చిత్రం ఈనాటికీ అందరికీ అభిమానపాత్రంగా ఉండిపోయింది. ఆ చిత్రం ఘన విజయాన్ని చూడకుండానే 40 ఏళ్ల వయసులోనే మీనాకుమారి కన్ను మూసింది. ప్రేక్షక ప్రపంచం ఇవ్వాళటి వరకు ఆమెను తలచుకుని కుములుతూనే ఉంది. ఆమెకు నివాళి అర్పిస్తూనే ఉన్నది. అటువంటి మరొక నటి కోసం ఎదురు చూస్తున్నది. బతుకు బరువులోని బాధను మనకు సరదాగా అందించడానికి మళ్లీ మరొకరు రావాలి అనుకోవడం మన అత్యాశ.

మీనా కుమారి సినిమాలను గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఒక చిత్రమైన క్రమం కనిపిస్తుంది. ఆమె 40 దశకంలో ముఖ్యంగా పౌరాణిక చిత్రాలలో నటించింది. గణేశ్‌, హనుమాన్‌ పాతాల్‌ వంటి సినిమాలలో కనిపిస్తున్న అమ్మాయి హైందవి కాదని ఎవరికీ తోచనే లేదు. నటిగా ఆమెకు గుర్తింపు వచ్చినది మాత్రం విజయ్‌ భట్‌ 1952లో తీసిన బైజూ బావరా అనే చిత్రంతోనే. అందులో అప్పటికే ప్రసిద్ధిగాంచిన నటుడు భరత్‌ భూషణ్‌ హీరోగా వేశాడు. బైజూ బావరా వంటి వ్యక్తి చరిత్రలో ఉన్నాడు కాని సినిమా కథ మాత్రం ఇంచుమించు కల్పితం బైజూ అంటే బైద్యనాథ్‌. అతను మామూలు మనిషి కాదు. బావరా అంటే వెర్రివాడు అని అర్థం. బైజూకు తెలిసింది సంగీతం మాత్రమే. అతను నేరుగా సంగీత ప్రపంచంలో మకుటం లేని మహారాజు, అక్బర్‌ పాదుషా ఆస్థానంలోని పండితుడు మియా తాన్సేన్‌ తో పోటీ పడతాడు. అతనికి ఒక చిన్ననాటి స్నేహితురాలు ఉన్నట్టు కథ కల్పించారు. బైజూను పెంచిన జాలరి కూతురు ఆమె అని సినిమాలో చూపించారు. పిల్లలు ఇద్దరు పెరిగి పెద్దవాళ్లు అవుతారు. చుట్టూ వాతావరణం చాలా బాగుంటుంది. రాధాకృష్ణుల పద్ధతిలో వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఇక్కడ మీనాకుమారి వేసిన పాత్ర పేరు గౌరీ. ఈ గౌరి హైందవి కాదన్న సంగతి ఎవరికీ పట్టలేదు. అప్పటికి పిన్నవయసులో ఉన్న మీనాకుమారి ఈ పాత్రలో చాలా సహజంగా కనిపించింది. కథ కూడా సరదాగా నడుస్తుంది కానీ చివరికి దుఖం మొదలవుతుంది. బైజూ పల్లె వదిలి వెళ్ళిపోతాడు. సంగీతం గురువు కోసం నానా తంటాలు పడుతుంటాడు. ఇక్కడ గౌరీ మాత్రం ఒంటరిగా మిగిలిపోయి మోహే భూల్‌ గయే సావరియా (నన్ను మరచితివి ప్రియతమా) అంటూ పాటలు పాడుతూ ఉంటుంది. బైజూ నిజానికి తన ప్రియురాలిని మరవలేదు. అతను తిరిగి పల్లెకు వస్తాడు. కానీ అప్పటికే ఆమెకు బలవంతంగా పెళ్లి కుదిర్చి ఉంటారు. బైజూ వస్తున్న బోటు నదిలో మునుగుతుంది.  ఇక శోకానికి కరువే లేదు. ఈ చిత్రంలో పాటలు నేటికీ అందరి మనసులలో నిలిచి ఉన్నాయి. మీనాకుమారి శోకదేవత అవతారానికి ఇక్కడే బీజం పడింది.

పరిణీత అనే సినిమాను ఈ మధ్యన మళ్లీ తీశారు. దాన్ని మొదటిసారి తీసినప్పుడు నాయికగా మీనాకుమారి  నటించిందని ఇప్పటివారికి తెలియకపోవచ్చు. ఇక్కడ కథలోనే కావలసినంత ఏడుపు కలగలిసి ఉంది. ఇక మీనా నటనతో అది మరింత పండింది.ఆ తరువాత కమాల్‌ అమ్రోహీ, దాయరా అనే సినిమా తీశాడు. దానితో మీనా శోకనాయికగా స్థిరపడిపోయింది.

అరవై దశకంలో శారద, ఆర్తి, దిల్‌ అప్నా ఔర్‌ ప్రీత్‌ పరాయి, మజిలీ దీది లాంటి సినిమాలు వరుసపెట్టి వచ్చాయి. వీటన్నిటిలోనూ మీనా కుమారి ఏడుపు హీరోయిన్‌ గానే కనిపించింది. ఆ తరువాత ముస్లిం సంస్కృతి కథలతో సినిమాలు కొన్ని వచ్చాయి. చాందిని చౌక్‌, నూర్జహాన్‌, బహూ బేగం, బేనజీర్‌ లాంటి సినిమాలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

 ఇంతకూ హిందీ సినిమారంగం మీనా కుమారి లోని శోకదేవతను మాత్రమే గుర్తించిందా? ఆమెకు వివిధ పాత్రలలో నటించడం వీలుకాదు అనుకున్నారా? అదేమీ లేదు. నిజానికి మీనా కుమారి కొన్ని సరదా సినిమాలలో కూడా నాయికగా వేసింది. శరత్‌, నిజాం లాంటి సినిమాలను ఆ వరసలో చెప్పుకోవచ్చు. ఆజాద్‌ అన్నది అటువంటి మరొక సినిమా నయా అందాజ్‌, కోహినూర్‌ అన్నవి తరువాత వచ్చిన మామూలు సినిమాలు. వీటిలో పెద్దగా ఏడుపులు లేవు.

మీనాకుమారి ఏడుపు పద్ధతి గురించి ఆలోచిస్తే గురుదత్‌ నిర్మించిన సాహిబ్‌, బీవీ ఔర్‌ గులాం అనే సినిమాను ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇది బెంగాలీ కథ. అందులో మీనాకుమారి పాత్ర ఛోటీ బహూ. అంటే చిన్న కోడలు. జమీందారీ వ్యవస్థ దిగజారిపోతున్న రోజుల కథ అది. భర్త పట్టించుకోడు. సానివాడల వెంట తిరిగి తన మగతనాన్ని ప్రదర్శించాలని అనుకుంటాడు. చిన్నకోడలు అన్ని రకాల కుమిలిపోతూ ఉంటుంది. ఏడుపు పాటలు పాడుతూ ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో చాలా పేరుతెచ్చుకున్నది. న జావొ సయ్యా, ఛుడాకె బయ్యా, భవర బడా నాదాన్‌ హై లాంటి పాటలు నేటికీ పాడుకునే వాళ్లు ఉన్నారు.

చెపుతూపోతే ఇటువంటి సినిమాల వరుస పాకీజాతో తారస్థాయికి చేరుతుంది. అదే ఆమె నటించిన చివరి చిత్రం. మీనా కుమారి 1952లో కమాల్‌ అమ్రోహీని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నది. అతను అప్పటికే మంచి పేరుగల దర్శకుడు. జంట మధ్యన ఎంతో ప్రేమ పండింది. కానీ కమాల్‌ ఆమెను ఎప్పుడు తనతో సమానురాలు అనుకోలేదు అంటారు. వాళ్లు విడిపోయారు. కొంతకాలం తరువాత మళ్ళీ కలిశారు. అప్పటికే ఆమె ఆరోగ్యం బాగా పాడయింది. మరొకసారి వాళ్లు విడిపోయారు. ఆ తరువాత ఆమెకు ఆనందం పూర్తిగా కరువైంది. పట్టించుకోకుండా వదిలేసిన భర్త కొరకు ఆమె పాకీజాలో నటించింది. పాపం మీనాకుమారి 1972లో మార్చి 31న గతించింది. తన చివరి సినిమా విజయం గురించి ఆమె చూడలేకపోయింది. ఇటు జీవితంలోను అటు సినిమా పాత్రలలోనూ శోకం నిండిన ఆ ఆడకూతురు కవిత్వాన్ని ఆలంబనగా చేసుకుని బ్రతికింది అంటే ఆశ్చర్యం లేదు. మీనా కుమారి బతుకు ఒక్కసారిగా దిగజారిన పద్ధతి కనిపించదు. ఆమె బాధలు క్రమంగా పెరిగినట్టు తోస్తుంది. పాకీజా నాటికి ఆమె ఆరోగ్యం పూర్తి అన్యాయంగా ఉంది. అయినా ఆమె నటించడానికి  ముందుకు వచ్చింది.