Tuesday, June 9, 2026

అక్షయ పాత్ర : భూటాన్ జానపద కథ


అక్షయ పాత్ర : భూటాన్ జానపద కథ


అక్షయ పాత్ర

డాంగ్ భూ థిక్ నాకి వెండా, డింగ్ బూ కిమథిక్ నాకి వెండా, అంటే అనగనగా ఒకప్పుడు అని అర్థం. అటువంటి ఒకప్పుడు ఒక లోయ ఉండేది. అందులో విశాలమైన ఒక నది ఉండేది. నది పక్కన మంచి పొలాలు ఉండేవి. అక్కడ కోయడానికి సిద్ధంగా పంటలు కనిపించేవి. కొండ చరియలమీద సాగుచేసి పంట నాటడానికి సిద్ధంచేసి ఉంటుంది. త్వరలోనే రైతులు వచ్చి నాట్లు మొదలు పెడతారు. కానీ వీధి చివరన పూరిగుడిసెలో ఉండే చిన్నపిల్లవాడికి మాత్రం ఆ అవకాశం లేదు. అతను విత్తనాలుగా నాటడానికి ధాన్యం మిగిలించుకోలేక పోయాడు. ఇంట్లో ఉన్న ధాన్యం మొత్తం తినేసాడు. దీనంగా ఉన్న అతని పరిస్థితి చూసి చుట్టుపక్కలవారు అతనికి ఒక పిడికెడు విత్తనాలు జమచేసి ఇచ్చారు. వాళ్లకు ధన్యవాదాలు చెపుతూ ఆ కొంచెం విత్తులను అతను తనకు ఉన్న కొద్దిపాటి నేలలో నాటుకున్నాడు. అతని పొలం పైన్ అడవుల పక్కన ఉంటుంది.
విత్తనాలు నాటిన కొద్దికాలానికే పిచ్చుకల గుంపు ఒకటి, పెద్దది వచ్చేసింది. కిచకిచలాడుతూ ఎగర సాగింది. చూస్తుండగానే నాటిన విత్తనాలు అన్నింటిని పొడిచి పొడిచి అవి తినేశాయి. బీద బాలుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. అతను బిత్తరపోయి ఉన్నాడు. కొంచెం సేపటికి తేరుకున్నాడు. పట్టరాని కోపం వచ్చింది. పిచ్చుకలను తరమ సాగాడు. ఆ పిచ్చుకల గూళ్ళు, ముళ్ళు నిండిన పొదలలో ఉన్నాయి. అక్కడ, ఆరు ఎగరడం చేతకాని చిన్న పక్షులు కూడా ఉన్నాయి. వెళ్ళిపోతున్న అబ్బాయి ఆ గూళ్ళను తగలబెట్టడానికి పూనుకున్నాడు. ఒక్కసారిగా పిచ్చుకలు అన్ని అతని ముందుకు వచ్చి తమను తమ పిల్లలను ప్రాణాలతో వదిలేయమని ప్రాధేయపడ్డాయి. నా గింజలు మీరు తినేశారు. నేను ఏం తిని బతకాలి? మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు, అన్నాడు అబ్బాయి. తండ్రి పిచ్చుక ముందుకు వచ్చింది. ఒక అక్షయపాత్ర గిన్నెను తెచ్చి అబ్బాయికి ఇచ్చింది. ఈ గిన్నె నీతో ఉంటే ఇక నీవు ఎన్నడు పని చేయవలసిన అవసరం ఉండదు. నీవు ఏమి అడిగితే వాటిని ఈ గిన్నె నీకు ఇచ్చేస్తుంది. ఇక మిమ్మల్ని వదిలిపెట్టు, అన్నది.
కుర్రవాడు గిన్నె తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. నిజంగానే గిన్నె మహిమ గలది. అది ప్రతినిత్యం అబ్బాయికి అన్నిరకాల తిండి పదార్ధాలను అందజేస్తున్నది. పంచభక్ష్య పరమాన్నాలు పెడుతున్నది. అడగడమే ఆలస్యం. ఆ బాబు మునుపటివలె ధనికుల ఇళ్లకు బిచ్చం ఎత్తడానికి వెళ్లడంలేదు. అట్లాంటి ఒక కలవారి ఇల్లు బాబు ఇంటి పక్కనే ఉన్నది. ఆ ఇంటి యజమానురాలికి అనుమానం మొదలయింది. దొంగచాటుగా వెళ్లి ఆమె రహస్యం తెలుసుకునే ప్రయత్నం చేసింది. చూస్తుండగానే అబ్బాయి పాత గిన్నెను నడుముకు కట్టుకున్న గుడ్డలో నుంచి బయటకు తీసి ముందు పెట్టుకున్నాడు. ఇవాళ నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నం, మంచి మాంసం కూర కావాలి. ఎర్ర బియ్యం అన్నం కావాలి. సింగ్ చాంగ్ కూడా కావాలి, అన్నాడు.
కళ్ళు మూసి తెరిచేలోగా అడిగినవన్నీ అబ్బాయి ముందు ఉన్నాయి. బాంగ్ చుంగ్  నిండా వేడివేడి ఎర్ర అన్నం ఉంది. అన్నం మెతుకులు మిలమిలలాడుతున్నాయి. ఆమె అటువంటి అన్నం అంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఇక డాపా కంచంలో రకరకాల మాంసం కూరలున్నాయి. పచ్చని, ఎర్రని మిరపకాయలు కూడా ఉన్నాయి. సన్నగా తరిగిన ముల్లంగి ముక్కలు కూడా ఉన్నాయి. మొత్తం వంట ఆవిర్లు కక్కుతున్నది. అంటే అప్పుడే వండినట్టు ఉన్నది. అబ్బాయి మాత్రం ఆశ్చర్యం కనపరచకుండా తిండి తింటున్నాడు. లొట్టలు వేస్తూ రుచిని అనుభవిస్తూ పట్టినంత తినేశాడు. అందమైన బామై రూచుంగ్ పాత్రలో సింగ్ చాంగ్ పోసుకున్నాడు. హాయిగా దాన్ని తాగేశాడు. పక్క ఇంటి యజమానురాలికి పట్టరాని అసూయ కలిగింది. ఎలాగైనా ఆ గిన్నెను తాను కాజేయాలని ఆమె పథకం వేసింది. బీద పిల్లవాడిని పిలిచి ఏదో పని చెప్పి పక్క ఊరికి పంపించింది. ఆ ఊరు పక్కలోయలో ఉంది. బాబుతో బాటు ఆమె తన కొడుకును కూడా పంపించింది. పక్క లోయకు వెళ్లాలంటే వాళ్లు ఎన్నో వాగులు, వంకలు దాటాలి. అలా ప్రయాణం కొన్ని రోజులపాటు సాగుతుంది. అంత కాలం పాటు అతని గిన్నెను తాను దాచి ఉంచుతానని ఆమె బాబుకు చెప్పింది. అతను అమాయకంగా నమ్మి గిన్నెను ఇచ్చాడు.
కొన్నిరోజుల తరువాత అబ్బాయిలు ఇద్దరు తిరిగివచ్చారు. యజమానురాలు ఒక గిన్నెను బాబుకు తిరిగి ఇచ్చింది. నిజంగా జరిగింది ఏమంటే, అక్షయపాత్రను ఆమె దాచుకుని అటువంటిదే మరొక గిన్నెను బాబుకు ఇచ్చింది. బీద అబ్బాయి తన ఇంటికి వెళ్ళాడు. తిండికోసం గిన్నెను అడిగాడు. ఒక్కసారి కాదు, పదేపదే అడిగాడు. ఈ గిన్నె తిండి పెట్టలేదు. బాబుకు కోపం వచ్చింది. గిన్నె తీసుకుని పిచ్చుకల వద్దకు వెళ్ళాడు. గిన్నె పనిచేయడం లేదని కోపంగా చెప్పాడు. ఈసారి పిచ్చుకల తండ్రి, బాబుకు ఒక మేకపిల్లను ఇచ్చాడు. మేకపిల్లకు స్నానం పోసి తడితే చాలు, అది నీకు కావలసినంత డబ్బు ఇస్తుంది. దానితో నీవు తిండి కొనవచ్చు, అని చెప్పాడు.
కుర్రవాడు ఇంటికి వెళ్లగానే మేకపిల్లకు స్నానం పోసి తట్టాడు. దాని ఒంటినుండి బంగారం, వెండి నాణేలు రాలాయి. హాయిగా బతక సాగాడు. పక్కింటి యజమానురాలికి మళ్ళీ అనుమానం పుట్టింది. ఆమె మేకపిల్ల సంగతి గమనించింది. అది తనకు కావాలి, అనుకున్నది. పన్నాగం చేసి ఒక మామూలు మేకపిల్లను అంటగట్టింది. మేకపిల్ల డబ్బులు ఇవ్వడంలేదని గమనించిన బాబు, మళ్లీ పిచ్చుకల వద్దకు వెళ్ళాడు. నేను ఇచ్చిన రెండు బహుమానాలను నీవు జాగ్రత్తగా ఉంచుకోలేక పోయావు. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంకా ఏమీలేదు. ఒక దుడ్డుకర్ర మాత్రం ఉన్నది. అది కూడా, ఏదో రకంగా పనికి వస్తుంది. తీసుకువెళ్ళు. మళ్లీ మాత్రం నా వద్దకు రావద్దు. ఇప్పటికే నీకు చాలా ఇచ్చాను, అన్నది తండ్రి పిచ్చుక.
అబ్బాయి నిరాశలో మునిగి, ఇంతకూ ఈ కర్ర ఏం చేస్తుంది అని అడిగాడు. ఎవరినైనా కొట్టమంటే కొడుతుంది, అన్నాడు పిచ్చుకల తండ్రి.
దానికి నిత్యం పూజ చెయ్యి. మూడుసార్లు దండం పెట్టు. ఎవరిని కొట్టాలో చెప్పు. అప్పుడది వాళ్లను కొడుతుంది, పిచ్చుక మాటలు అవి.
బీద కుర్రవాడు ఇంటికి వచ్చాడు. ఈసారి ఏమి తెచ్చాడని చూడడానికి పక్కింటావిడ కూడా వచ్చింది. అప్పటికే కుర్రవానికి తన గిన్నె, మేక ఏమైంది అన్న సంగతి అర్థమయింది. కొంచెం ఆగితే అది ఏం చేస్తుందో చూపిస్తాను అని, దుడ్డు కర్రను చూపించాడు.
ముసలావిడకు మహా ఆత్రంగా ఉంది. ఈలోగా అబ్బాయి దుడ్డుకర్రకు పూజ చేశాడు. దానికి ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఏం జరుగుతుందో తెలిసేలోగా కర్ర ముసలామె వైపు వచ్చి అదేపనిగా కొట్టసాగింది. ఆమె తన ఇంట్లోకి పరుగు పెట్టింది. అయినా కర్ర వెంటబడి కొడుతూనే ఉన్నది. ఆవిడ పడుతూ లేస్తూ బాబోయ్, తప్పు తెలిసింది. నీ వస్తువులు నీకు ఇచ్చేస్తాను. ఈ కర్రను వెనుకకు పిలువు, అంటూ మొర పెట్టుకున్నది.
బాబు కర్రను వెనుకకు పిలిచాడు.
పక్కింటి యజమానురాలు దొంగిలించిన గిన్నెను, మేక పిల్లను తెచ్చింది. బాబుకు ఇచ్చింది. చేతులు జోడించి మళ్లీ దుడ్డుకర్రను మాత్రం నా మీదికి పంపకు అన్నది.
పిచ్చుకలు ఇచ్చిన మూడు బహుమానాలు మళ్ళీ పిల్లవాడికి దొరికాయి. తరువాత అతను హాయిగా బతికాడు.

 




 

Monday, June 8, 2026

పన్నిద్దరు - ఇంగ్లండ్ జానపద కథ

 


పన్నిద్దరు - ఇంగ్లండ్ జానపద కథ



ఇది నా చేతిరాత అని చెప్పాలా?





Sunday, June 7, 2026

లోకాభిరామం : తోలుబొమ్మలాట

 


లోకాభిరామం : తోలుబొమ్మలాట


తోలుబొమ్మలాట
మా ఊరు పాలమూరు అనే మహబూబ్‌ నగరానికి దగ్గరగ ఉన్నది. కనుక మా దగ్గర పోరగాండ్లకంత సీన్మ చూడడం బాగ అలవాటు. సీన్మకు వోదమా అన్నది ప్రశ్న అయితే నాతానైతే దుడ్లులేవు. ఇయాల నీవు వెట్టు. మల్ల వొయినప్పుడు నేను వెడుత, అంటూ సాగేవి. అయినా ఆ సినిమాలు అందరికీ అర్ధ్థమవుతయి కనుకనా. లవకుశ లేదంటే ఓ మైరావణ వంటి సినిమా వస్తే అందరికీ అర్థమవుతుంది. రాము అని ఒక సీన్మ వచ్చింది. అందులో ఒక తండ్రి, తల్లిలేని పిల్లగాణ్ణి పెంచునేందుకు నానా యాతన వడతడు. ఎద్దులబండ్లు కట్టుకుని వల్లెలనుంచి కూడ మనుషులు వచ్చి ఆ సినిమాను చూసి చేతనైనంత ఏడ్చి ఎళ్లిపొయినరు. అంతేగాని మరేవో పిచ్చి సీన్మలు వస్తే అవి అర్ధం అయి చావవు గద!
కనుకనే వల్లెలో చిరుతల రామాయణం అంటాని ప్రతిరాత్రి కాలక్షేపం కొంతకాలం గడిచింది. బైండ్ల కథలు, జముకుల కథలు లాంటి వినోద కార్యక్రమాలు గూడ పల్లెలో వుష్కలంగ ఉండేటివి. ఇక ఏనుగొండ అనే మా వల్లెకు మరింత ప్రత్యేకత ఉంది. బోగమాట అనే వీధినాటకం మాపల్లెలో బాగ పెరిగింది. కేశవయ్యగారు అనే ఒక పెద్దమనిషి వీధి నాటకాలు రాసేవాడు. వాటికి వరుసలు కట్టేవాడు. అవసరమైన దుస్తులు కుట్టేవాడు. కిరీటాలు, భుజకీర్తులు తయారు చేసేవాడు. ఈ రకంగా ఆయన ఒకే మనిషి అన్ని కళలకు కేంద్రంగా ఉండి, ఊళ్లో పిల్లలను, పిల్లలేనేమి పెద్దలను గూడ చేరదీసి బోగమాట నేర్పించెటోడు. మూడున్నర వజ్రం అని ఒగ ఆట ఉండేది. దాని అస్సలు పేరు కృష్ణగారడీ. అటువంటి ఆట నుంచి మొదలు మా ఊర్లె గూడ లవకుశ ఆడేవాండ్లు. బబ్రువాహన ఆడేవాండ్లు. ఎన్నెన్నో కథలు ఆడేవాండ్లు. పండుగ లేక ఎవరన్న పెద్దఇంట్లో పెండ్లిగాని వచ్చిందంటే ఊళ్లో కేంద్రంలో బోగమాట ఏర్పాటు అవుతుంది. దానికి కావలసిన ఖర్చును ఎవరో ఒకరు భరిస్తరు. ఫలానివాండ్లు ఆట చెప్పినరు అని ఊరంతా పాకి పోయేది. ఇక రాత్రంతా కూసోని ఆట చూచేందుకు అందరు సిద్ధం.
ఇది ఇట్లుండంగ చిన్నప్పుడు నేను అప్పుడో ఇప్పుడో తోలుబొమ్మలాట చూసిన గుర్తు. ఈ తోలుబొమ్మలాట వాండ్లు
స్థానికులు కాదు. రాయలసీమ నుంచి వస్తరని తరువాత తరువాత తెలిసింది. ఈ ఆటకు పెద్ద గుడారం అవసరం లేదు.
ఆడేవాళ్లు మాత్రం గుడ్డలతోటి తడుకలతోటి ఒక గది వంటిది కడతరు. దానికి ఒక వైపున బట్టతో తెర ఏర్పాటు చేస్తరు.
ఆ లోపల కళాకారులు ఉంటరు. వాళ్ల దగ్గర ఇంచుమించు మనిషి ఉండేటంత ఆకారంలో ఉండే బొమ్మలుంటయి. ఆ బొమ్మలను కర్రల సాయంతోని తెరమీద అదిమివట్టుకుని వెనకనుంచి పడే ఎలుతురులో ఆ బొమ్మలు తెర మీద కనిపించేటు చేసి ఆట సాగించేవాండ్లు. చక్కగ పాటలు డైలాగులు గూడ ఉంటయి. తోలుబొమ్మలాటలో భారతం కన్న రామాయణం ఎక్కువ చూసినట్లు గుర్తు ఉంది. హనుమంతుడు వస్తడు. దశకంఠుడు వస్తడు. అతని ముందు ఆంజనేయుడు తోక చుట్టుకోని అల్లంత ఎత్తున ఎక్కి కూర్చుంటాడు. రావణునికి పది తలలు ఉంటయి. తెరమీద సగం వెడల్పు అతనే కనిపిస్తడు. అంత ఎత్తు కూడా ఉంటడు. వెనుక వాండ్లు పాటలు పాడుకుంటు కింద పెట్టిన సానరాళ్ళ మీద కాలితోటి దరువులు ఏసుకుంటు చక్కగ కథను రక్తి కట్టించేవాండ్లు. హనుమంతుడు ఏసిన కుప్పిగంతులు వాళ్లు తెర మీద చూపించిన తీరు ఏంతో ప్రత్యేకంగ ఉండేది. నాకు నిజానికి వాళ్లు పాడిన పాటలు జ్ఞాపకం లేవు. అయితే తోలుబొమ్మలాట లోని ఒక అంశం మాత్రం గట్టిగ గుర్తు ఉన్నది.
హాస్యం పేరిట తోలుబొమ్మలాటలో మధ్యన అత్త, పిల్లోడు అని రెండు పాత్రలు వస్తయి. పిల్లోడు అనే అల్లుని చేత అత్త పని
చేయించాలంటని ప్రయత్నిస్తుంది. గడ్డి తీసుకు రమ్మంటది. తిండి ఆశ పెడుతది. తాటి బెల్లం, తమిద రొట్టెలు పెడత
అయ్య పోరా గడ్డికి, మా అయ్య పోరా గడ్డికి అంటుంది. వాడు ఆమెకు అయ్య కాదు. వాని ద్వారా నాటకంలో బండ బూతులు
పలికించేవాండ్లు. ఆ కాలంలో హాస్యం అంటే బూతు లేకుండ గడిచేది కాదేమో. మూడు రొట్టెలు ముడ్డికి, నా మొ.... పోత
గడ్డికి, అంటూ వాడు పాడతడు. ఇక చూడవచ్చిన వాళ్ళ ఆనందానికి అంతు ఉండదు. నాకు కూడా ఈ ఒక్క పాట జ్ఞాపకం. అంతటితో ఆగకుండా పిల్లోని పాత్రకు పొడుగాటి బెల్లకాయ కూడ ఉన్నట్టు చూపించేవారు. అప్పట్లో అది బూతుగా
అనిపించలేదేమో? నాకు ఇవ్వాళటికి ఆ నంగతి అర్థం గాదు.
ఈ మధ్యన ఎక్కడ తోలుబొమ్మలాట వాండ్లు కనిపిస్తున్న జాడ లేదు. సురభి వాండ్ల నాటకం కంపని హైదరాబాద్‌ కు చేరింది గాని రాయలసీమలోనే ఉన్న తోలుబొమ్మల వాండ్లు మాత్రం పట్నం చేరినట్టు లేదు. అక్కడనో ఇక్కడనో తోలుబొమ్మలాట పద్ధతిలోనే మరేమో వస్తువులను తయారు చేసి అమ్ముతున్నట్టు కనిపించింది. చిన్న చిన్న బొమ్మలు కూడా అమ్మకానికి కనిపించినయి. మొత్తం నాటకం జరగాలంటే పెద్ద జట్టు ఉండాలె గద? అది బహుశా వీలవుతున్నట్టు లేదు.
నిజానికి తోలు బొమ్మలు తయారు చేయాలంటే, అదొక పెద్ద తతంగం. దాని గురించి ఎక్కడనో చదివే అవకాశం కూడా దొరికింది. చాలాకాలంపాటు బొమ్మల కోస్రం జింక చర్చం వాడేవాండ్లట. జింకలను వేటాడడం ఇప్పుడు కుదరదు. అసలు అవి ఉన్నాయో లేదో గూడ తెలువదు. కనుక ఆ మధ్యన బొమ్మల కోస్రం మేక చర్మాన్ని వాడడం మొదలయిందట.
పెద్ద సైజు బొమ్మలను తయారు చేయాలంటే ఒక మేక చర్మం సరిపోదు. రావణానురుని బొమ్మకు మూడు మేకల చర్మం అవుసరం అవుతుందట. అందుట్లో ఒక మేక పది తలకాయలకు పోతే, ఒకటి కాళ్లకు పోతే, మరొకటి శరీరానికి సరిపోతుంది. ముందు ఆ చర్చాన్ని పారదర్శకంగ వచ్చేట్టు తయారు చేయాలె. ఆ తరువాత దానిమీద బొమ్మ ఆకారం కత్తిరించాలె. దుస్తుల ప్రకారం బొమ్మ గీసి అందుట్లోనుంచి వెలుగు బయటకు కనిపించేటట్టు రంధ్రాలు వేయాలె. ఆ రంధ్రాల వెంట గీతలు గీసి రంగులు వూయాలె. నిజంగనే పాత కాలంలో రంగులు కూడా వాండ్లే తయారు చేసుకునేవారు. ఉదాహరణకు మోదుగు వువ్వులనుంచి అవసరమైన పనువు, ఎరుపు రంగును తయారు చేసే వాండ్లట. ఇప్పుడు అదంతా కుదిరే పరిస్థితి కాదు. కనుక రసాయనం రంగులను వాడక తప్పదు.
అసలు ముందు చర్మాన్ని బొమ్మలకు అనుగుణంగ పారదర్శకంగ తయారు చేయడమే పెద్ద కళ. దాన్ని బొమ్మలు ఆడించే వాండ్లే చేసుకుంటరు అంటే అంతకంటే ఆశ్చర్యం లేదు. కనుకనే ఈ కళ రానురాను మరుగున వడుతున్నది. కొన్ని బొమ్మలు కేవలం నలుపు తెలుపు రంగులో ఉండడం కూడా నేను చూసిన. అటువంటి బొమ్మలు ఆడించినవుడు అంత ఆకర్షణీయంగా ఉ౦డవేమో.
నేను ఆ మధ్యన కాకిపడిగెలు అనే ఇంకో రకం బొమ్మలాట చూసిన. ఇందులో తెర, దీవం నీడలు మరో రకంగా ఉంటయి.
కథ పటాల వలే చిత్రించి ఉంటుంది. దీవం వట్టుకొని పటాలముందు బొమ్మలు చూపిస్తూ కథలు చెబుతంటరు.
జానపద కళలు మరుగున పడుతున్నయి. ఈ విషయం నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శాస్త్రీయ సంగీతం లాంటివి కూడ కొందరికి మాత్రమే అందుబాటులో ఉన్నయి. అందరికీ అందుబాటులో ఉన్నయి అనుకున్న పనులు కూడా లేకుండ పోతే ఇక చివరికి మిగిలేది ఏమిలేదు. ఆ సినిమా ఎవరికి కావాలె? చాలామందికే గావాలె. వాండ్లుకు మరి పాతకాలపు కళల
గురించి తెలియదు.
బైండ్ల కథలు, జముకుల కథలు, బుర్రకథ మొదలైనవి ఆయా పద్ధతులను వృత్తిగా చెప్పేవాండ్లు మాత్రమే నేర్చుకుని మిగతా
వారికి అందిస్తారు. ఔత్సాహికులు వీటిని నేర్చుకోని అందరిముందు ప్రదర్శించడం కుదిరేదికాదు. చుక్క సత్తయ్య లాంటివారు
ఒకతను అందరికీ నేర్పించే ప్రయత్నం చేసినట్టు ఉన్నరు. మిగతావాటి గురించి ఈ రకమైన ప్రయత్నాలు కనిపించవు.
కానీ మా చిన్నతనంలో మా ఊరికి ఒక పంతులు వచ్చి ఉండిపోయినడు. అతను పల్లెలోని యువకులందరినీ ఒక చోటచేర్చి చిరుతల రామాయణం అనే ఒక పద్ధతి జానపద ప్రదర్శనను నేర్పించినడు. అందులో సుమారు 50 మంది పాత్రధారులు. రామాయణం కథ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పాడినట్టు గుర్తుంది. ప్రదర్శన వారం రోజులపాటు సాగినట్టు గుర్తుంది. యువకులందరూ ఒకటికి రెండు పాత్రలు నేర్చుకుని రోజు రోజుంతా ఆ పాటలను కూనిరాగాలుగా తీయడము నాకు ఇవ్వాళటికి గుర్తుంది. మొత్తానికి చిరుతల రామాయణం ప్రదర్శన చాలా బాగ జరిగింది. దీనికి ఒక వేదిక అంటని లేదు. కళాకారులు చుట్టూ గుండ్రంగా నిలబడతరు. చేతులలో చిరుతలు అనే వాయిద్యాన్ని వట్టుకోని దానితో లయబద్ధంగా వాయిస్తూ పాటలు పాడుతుంటరు. ఆ సందర్భంలో కథ జరుగుతున్న పాత్రలు మధ్యలోకి వచ్చి తమతమ సంభాషణలను వినిపించినట్టు గుర్తున్నది.
కళాప్రదర్శనలలో ఈ రకంగా పాల్గొన్న యువత నిజంగ గొప్ప ప్రేరణ పొందిన భావం నాకు మిగిలి ఉంది. ఇప్పుడు పల్లెల్లో
ఎవరికైనా ఇటువంటి పనులు గుర్తున్నయా? అడగడానికి నేనెవరిని? నేను కనీసం చూడడానికి కూడా పల్లెకు పోవడం లేదు. పల్లె పట్టణానికి వచ్చే అవకాశం లేనే లేదు. ఆ మధ్యన ఆయనెవరో ఒక 12 తీగల వాయిద్యం వాయిస్తడని పాలమూరు నుంచి వచ్చినడు. అతని గురించి ఫేస్బుక్ లో ట్విట్టర్‌ లో దుమారం రేగింది. అంతేగాని అతని ప్రదర్శన వలుచోట్ల పెట్టి చూసినవాళ్లు ఎంత మందో నాకు తెలియదు.
కథలు మారిపోతున్నయి. కళలు మారిపోతున్నయి. కాలాలు మారిపోతున్నయి. పాత పద్ధతులు ఎవరికి వట్టవు. అవి పరిశోధన పుస్తకాలలో మాత్రమే మిగిలి పోతయేమో. జానపద నంగీతం పరిస్థితి కూడ ఇంచుమించు అట్లగే ఉంది. ఈ మధ్యన జానపద శైలిలో వచ్చే సంగీతాన్ని జానపదం అనుకుని అందరూ ఆనందంగ వింటున్నరు. అసలు జానపదుల పాటలు ఏమయ్యినయి అర్ధం గాదు. ఆ సంగతి చెప్పినా ఎవరికీ వట్టదు. నేనిక్కడ ఒక విషయం గురించి ఏడవాలని ప్రయత్నించడం లేదు. గుర్తుకు వచ్చిన కొన్ని అంశాలు ఎక్కడైనా మిగిలి ఉన్నయేమో తెలుసుకుందం అని ఒకటే నా ఆశ.




Thursday, June 4, 2026

Moula Sahib Interview in Telugu

 


Moula Sahib Interview in Telugu


We Heard his Nadaswaram so much!
Now listen to his words!
He speaks of Artists, art, Nadaswaram, Technique and many things!



Wednesday, June 3, 2026

Tuesday, June 2, 2026

గలోష్ - మిఖయిల్ మిఖయిలోవిచ్ జోషెంకో కథ (రష్యా)


గలోష్ 

మిఖయిల్  మిఖయిలోవిచ్ జోషెంకో రచన 1927   (రష్యా)

గలోష్

మిఖయిల్ మిఖయిలోవిచ్ జోషెంకో

 

(గలోష్ అంటే చలి దేశాలలో బూట్లమీదుగా వేసుకునే ఒక ప్లాస్టిక్ తొడుగు)

 

అది నిజంగానే సులభం, ట్రామ్‌లో ఒక గలోష్‌ను పోగొట్టుకోవడం గురించి చెపుతున్నాను.
ముఖ్యంగా నీవొకవేపును పిండేస్తూ ఉంటే ఇక మరొక దుర్మార్గుడు వెనకనుంచి నీ కాలును తొక్కేస్తూ ఉంటే మరీను. ఒక్కసారిగా ` గలోష్ మాయం.
గలోష్‌ను పోగొట్టుకోవడం అంటే కేవలం చాలా సింపుల్.
నా గలోష్ ఊరికే ఊడి వచ్చింది. రెప్పపాటు, అంటే కంటిరెప్పపాటులోగా అని, మీరు అనవచ్చు.
నేను ట్రామ్‌లోకి ఎక్కానా ` రెండు గలోష్‌లు ఉన్నాయి. వాటిని ఇంకా నేను చూడగలను. ఎక్కుతూ ` స్థిరం చేసుకోవడానికి అన్నట్టు నేను వాటిని ముట్టుకున్నాను కూడా.
అయినాసరే, నేను దిగే సమయానికి ` ఒకే గలోష్, కనబడుతూనే ఉంది, ఒక కాలిమీద ఉంది, కానీ మిగతా గలోష్ పోయంది. నా బూటు అక్కడే ఉంది. ఇక సాక్‌ను కూడా చూడగలుగుతున్నాను. ఇక నా లాగూ కూడా తన చోట్లోనే ఉంది. కానీ గలోష్ లేదు.
ఇక ట్రామ్‌వెంట పరుగెత్తడం, వీలుకాదుగా.
మిగిలిన గలోష్‌ను తీసేశాను, దాన్ని న్యూస్‌పేపర్‌లో చుట్టాను ` ఇక నా దారిన వెళ్లిపోయాను. ‘పని ముగిసిన తరువాత కొంచెం పట్టించుకుంటాను’ అనుకున్నాను. ‘దాన్ని అంత సులభంగా వదిలివేయజాలను. అది ఎక్కడున్నా సరే, వెదికి పట్టుకోవాల్సిందే’.
పని ముగిసిన వెంటనే, ప్రారంభించాను. నాకు తెలిసిన ఒకానొక ట్రామ్ డ్రైవర్‌తో మొట్టమొదట మాట్లాడాను.
అతను నా నమ్మకాన్ని మరింత గట్టి చేశాడు.
‘నిన్ను నీవు అదృష్టవంతుడిగా లెక్కపెట్టుకో. నీవు దాన్ని ట్రామ్‌లో పోగొట్టుకున్నావ్. మరేదయినా చోటనయితే ఇంత గట్టిగా చెప్పగలిగేవాడిని కాదు. కానీ, ట్రామ్‌లో మాత్రం నీ గలోష్ ఇప్పటికే దొరికినట్టు లెక్క! మాకు పోగొట్టుకుపోయిన వస్తువుల గురించి ఒక ప్రత్యేకమయిన ఆఫీసు ఉంది, తెలుసా కేవలం అక్కడికి వెళ్లు, తెచ్చేసుకో. అది దొరికినట్టే’ అతను అన్నాడు.
‘సరే, థాంక్యూ, నా మెదడులోనుంచి బరువు దిగిపోయింది. గలోష్ నిజానికి కొత్తది తెలుసా. దాన్ని ఓ రెండు సంవత్సరాలుగా మాత్రమే వేసుకుంటున్నాను’ నేనన్నాను.
మరుసటి నాడు నేను ఆ ఆఫీసుకు వెళ్లాను. ‘అన్నలారా, నా గలోష్ నాకు తిరిగి దొరికే అవకాశం ఏమయినా ఉందా? అది ట్రామ్‌లో నానుంచి దూరమయింది’ అడిగాను.
‘తప్పకుండా, ఏ రకం గలోష్ అది?’ వాళ్లు అడిగారు.
‘ఒక మామÖలురకం గలోష్. సైజు పన్నెండు’ నేను చెప్పాను.
‘మా దగ్గర పన్నెండువేలు, పన్నెండు సైజువి ఉన్నాయని మా వాళ్లన్నారు. గుర్తించడానికి వీలుగా ఏదయినా చెప్ప్పు.’
దాన్ని గుర్తించడానికి లక్షణాలు చాలా మామÖలు రకం. మడమ దగ్గర కొంచెం మురికి పట్టింది. ఇక లోపల లైనింగ్ లేదు. లైనింగ్ అరిగిపోయింది.
‘మా దగ్గర, అటువంటి గలోష్‌లు వెయ్యి ఉన్నాయని, మా వాళ్లంటున్నారు. గుర్తించడానికి ప్రత్యేకంగా ఏమయినా సమాచారం ఉందా?’
‘ఉన్నాయి, ప్రత్యేకమయిన లక్షణాలు. వేళ్ల దగ్గర ఇంచుమించు చిరిగి ఉంది ` అది వేలాడుతున్నట్టు ఉంది. ఇక మడమ ఉండీలేనట్టు ఉంది. అడి బాగా అరిగిపోయింది. కానీ సైడ్స్ మాత్రం మరీ అంత పాడవలేదు. అవి ఇంకా ఒక్క ముక్కగానే ఉన్నాయి’ నేనన్నాను.
‘కాసేపు కూచో, వెంటనే వెళ్లి చూస్తాం’ వాళ్లన్నారు.
కొంచెంసేపయినా కాకముందే వారు నా గలోష్‌తో వెనక్కు వచ్చేశారు. నాకు పట్టరాని సంతోషం అయ్యింది. మరీ కదిలిపోయాను. ‘అవును, వీళ్ల పద్ధతులు చాలా బాగా పని చేస్తున్నాయి. ఎంత మర్యాదగల మనుషులు వీళ్లు’ అనుకున్నాను. ‘ఒక్క గలోష్ కొరకు ఇంత కష్టపడుతున్నారు’ అనుకున్నాను.
‘అంతులేని థాంక్స్, నేను బతికి ఉన్నంతకాలం’ నేనన్నాను. ‘దయచేసి నాకిచ్చేసేయండి, వెంటనే కాలికి వేసుకుంటాను. నిజంగా ధన్యవాదాలు’
‘లేదు, డియర్ కామ్రేడ్,’ వాళ్లన్నారు. ‘అంత సులభంగా కుదరదు. మాకు ఎలా తెలియాలి’ వాళ్లన్నారు కదా. ‘ఇది నీవు పోగొట్టుకున్నదే అని’
‘అది తప్పకుండా నాదే.  నా గౌరవం సాక్షిగా మాట ఇస్తున్నాను’ నేను అన్నాను.
‘మేం నిన్ను నమ్ముతాము. ఇక మీ పట్ల మా సానుభూతి కూడా ఉంది. కానీ బహుశా నీవు పోగొట్టుకున్నది ఇదే గలోష్ కావచ్చు. కానీ, మేం దాన్ని అలాగ ఇవ్వడానికి లేదు. నీవు నిజంగా గలోష్ పోగొట్టుకున్నట్టు సర్టిఫికెట్ మాకు అవసరం. ఈ సత్యాన్ని నీవు మీ హౌస్ మేనేజ్‌మెంట్ ఆఫీసు నుంచి ధృవీకరించుకురావాలి. అప్ప్పుడు ఇక ఏ ఆలస్యమÖ లేకుండా, నీవు న్యాయంగా పోగొట్టుకున్న వస్తువును నీకు తిరిగి ఇస్తాము.’
‘కానీ అన్నలారా, ప్రియమయిన నా కామ్రేడ్‌లారా, ఈ వాస్తవం గురించి ఆఫీసులో ఎవరికీ తెలియదు. వాళ్లు సర్టిఫికేషన్ ఇవ్వకపోవచ్చు’ నేను చెప్పాను.
‘అవును, ఇస్తారు, అదే వాళ్లపని. మరి ఇక వాళ్లు ఉన్నది దేనికి?’ వాళ్లన్నారు.
నేను గలోష్ వేపు మరోసారి చూచి వచ్చేశాను.
మరుసటినాడు నేను మా ఆఫీసు పెద్ద దగ్గరికి వెళ్లాను.
‘నాకు ఒక డాక్యుమెంట్ ఇవ్వండి, లేదంటే నా గలోష్ పోయినట్టే’ అన్నాను.
‘ఆహా, నీవు నిజంగా దాన్ని పోగొట్టుకున్నావా లేక తమాషా చేస్తున్నావా? ఊరికే ఒక ముక్కను సంపాదించుకోవాలని పథకం వేస్తున్నావేమో?’ ఆయన అన్నాడు.
‘దేవుని మీద ఒట్టు, దాన్ని నేను పోగొట్టుకున్నట్టు’ నేను చెప్పాను.
‘కేవలం నీ మాట ఆధారంగా, నేను ఇవ్వలేనన్నది, చెప్పనవసరం లేని సంగతి’ ఆయన అన్నాడు. ‘ఇక ఇప్ప్పుడు నీవు ట్రామ్ డిపోనుంచి గలోష్ పోగొట్టుకున్నట్టు ఒక సర్టిఫికేషన్ తీసుకువస్తే, నీకు నేను ఒక డాక్యుమెంట్ ఇవ్వగలుగుతాను. లేకుంటే, నా వల్ల కాదు.’
‘కానీ వాళ్లే నన్ను మీ దగ్గరికి ఊరికే పంపించారు.’
‘మరయితే, ఒక స్టేట్‌మెంట్ రాయి’ అన్నాడాయన.
‘ఏమని రాసేది?’
‘ఫలానా ఫలానా రోజున ఒక గలోష్ పోయింది అని రాయి, ఇక విషయం తేలేవరకు నేను పైన ఇచ్చిన చిరునామాలోనే ఉంటానని మాట ఇస్తున్నాను అని కూడా రాయి’ చెప్పాడాయన.
నేను స్టేట్‌మెంట్ రాశాను. మరుసటి నాడు నాకు అఫీషియల్‌గా సర్టిఫికేషన్ అందింది.
దానితో నేను ఆఫీసుకు వెళ్లాను, ఇక అక్కడ, మీరు ఊహిస్తారో లేదో, ఏ మాత్రం నస లేదా ఆలస్యం లేకుండా, వాళ్లు నా గలోష్‌ను నాకు ఇచ్చివేశారు.
కానీ ఇక నా గలోష్ నా కాలిమీదికి వచ్చిన తరువాత నేను మరీ పొంగిపోయాను. అవును, వీళ్ల పద్ధతి బాగా ఇంకా నిజంగా పని చేస్తుంది! అనుకున్నాను. ఒక వెనకబడిన దేశంలో నా గలోష్ గురించి వీళ్లు ఇంతకాలం, కష్టం ఖర్చు చేయడం గురించి మీరు ఊహించగలరా? లేదు,  వాళ్లు దాన్ని ట్రామ్‌లోనుంచి బయటకు విసిరి ఉండవచ్చు ` అంత సులభంగాను. కానీ ఇక్కడ మాత్రం, ఒక వారంలోపల అది నాకు తిరిగి చేరింది. ఎంత మంచి వ్యవస్థ!
కానీ కష్టం ఏమిటంటే, వారం రోజుల పాటు ఈ రావడం, పోవడాలతో, నేను మొదటి గలోష్‌ను పోగొట్టుకున్నాను.
న్యూస్‌పేపర్‌లో చుట్టి దాన్ని చంకలో పెట్టుకుని మోస్తూనే ఉన్నాను. ఇక దాన్ని ఎక్కడ వదిలానన్నది మాత్రం గుర్తులేదు. ట్రామ్‌లో మాత్రం కాదు ` అదే పెద్ద సమస్య. దాన్ని నేను ట్రామ్‌లో పోగొట్టుకోలేదన్నది నిజంగా సిగ్గుచేటు ` ఇక ఇప్ప్పుడు నేను దాన్ని ఎక్కడ వెతకాలి?
కానీ మిగతా గలోష్ నాకు చిక్కింది. దాన్ని నేను అల్మారామీద పెట్టాను.
కాస్త మనసు బాగా లేనప్ప్పుడు, నేను గలోష్ వేపు చూస్తాను. ఇక నా మనసు తేలికవుతుంది. వ్యవస్థ చాలా గొప్పదని నాకు నేనే చెప్ప్పుకుంటాను.

(1927లో ప్రచురించిన కథ)




 

Monday, June 1, 2026

లోకాభిరామం : సైన్స్ కూడా నమ్మకమే


సైన్స్ కూడా నమ్మకమే

సైన్సు- గండుచీమ : నాకు సంగీతం చీమ కుట్టిందని, ఒకానొక సారి అన్నట్టు గుర్తు. నాకు సాహిత్యం చీమ కూడా కుట్టింది. వీటన్నింటికీ మించి సైన్సు అనే గండుచీమ రక్తం వచ్చేదాకా కుట్టింది. ‘మీరు కొందరిని మతోన్మాదులు అంటున్నారు. వారు మనలను సైన్సు ఉన్మాదులు అంటారేమో చూడండి’ అని అడిగేంత ఘాటుగా కుట్టింది ఆ చీమ. ఈ మధ్యన ఏదో రాతకు తయారవుతున్న ప్రయత్నంలో భాగంగా, మనం మేలుకుని ఉన్నా, నిద్ర పోయినా, అంతా బయోకెమిస్ట్రీ, అని వాక్యం రాసుకున్నాను. నాకు ఈ ప్రపంచమంతా సైన్సుగానే కనపడుతుంది. మిగతావారికి అట్లాగ ఎందుకు కనిపించడం లేదని, అనుమానం కూడా వస్తుంది.

మనం ఉందనుకుంటున్న ఈ విశ్వం, అందులో సౌరమండలం, అందులో భూమి, అందులో జీవం, అందులో మనం మొదలైనవన్నీ మన, (మనలాంటి వారే అయిన తరతరాల మనుషుల) మెదడుల్లో నుంచి పుట్టిన అవగాహనలు. ఆలోచనలు పుడతాయి. వాటి గురించి ప్రయోగాలు జరుగుతాయి. కొన్ని విషయాలకు రుజువులు దొరుకుతాయి. అవన్నీ కలిపి సైన్సుగా నిలుస్తాయి. భౌతిక ప్రపంచంలో కూడా పదార్ధంగా, యదార్ధంగా ఉన్నవాటిని గురించిన సైన్సు ఒక భాగం. కేవలం అనుభవంలో మాత్రమే ఉండే ఆలోచనలు, సిద్ధాంతాలు కూడా ఒక భాగం! ఇది కూడా సైన్సే! వీటన్నింటికీ, ప్రపంచమంతటా ఆయా పరిస్థితుల్లో ఒకేరకమైన అనుభవాలు, ఆధారాలు దొరుకుతాయి. కనుక అది ఒక సైన్సు!

ఈ మన మెదడు (మెదడుల)లోనే మరికొన్ని ఆలోచనలు మొదలవుతాయి. అవి అందరికీ ఒకే రకంగా అనుభవంలోకి రాక పోవచ్చు. వాటికి ఆధారాలు అందరికీ ఒకే రకంగా అందవు కూడా! ఆలోచన ధోరణి, మెదడు మొదలైన సైకాలజీ దీనికి మొదటి ఉదాహరణేమో?

విశ్వం ఉందని అందరూ అంటున్నారు గనుక మనమూ ఉందంటున్నాం. అది నిజంగా ఉందని ఎవరూ చూడలేదు. ఉందన డానికి చెపుతున్న లెక్కలు, ఆధారాలు మొదలైనవి అందరికీ ఒకేలాగ అర్థం కావడంలేదు. సైన్సు చదువుకున్న వారికి కూడా సైన్సు అర్థం కాలేదు. సైంటిస్టులం అంటున్నవారు కూడా సైన్సు వేరు, బతుకు వేరు అనుకుంటున్నారు. నమ్మకాలు మెదడు లోనే పుడతాయి. అనుభవాలూ మెదడులోనే పుడతాయి. వాటిలో ఒకదానికి ఒకటి జోడించి చూడడం చేతగాదు. అంతా గజి బిజి గందర గోళం అవుతుంది. ఏది ఉంది, ఏది లేదు తేల్చుకోలేము. బతుకంటే భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ అంటే నవ్వుతారు మరి. నవ్వేవారి తప్పు లేనేలేదు. వారలకు అంతగా చీమ కుట్టలేదు మరి. సైన్సయినా, మరోటయినా ఉందనుకుంటే ఉంది. లేదను కుంటే లేదు.

ఒక మిత్రుడెవరో చాలాకాలం తరువాత కనబడతారు. ఎవరెవరి గురించో అడుగుతాము. ఫలానా వాడు ఎక్కడా? అంటే ‘అయ్యో! తెలియదా? వాడుపోయి నాలుగేళ్లయింది!’ అంటాడా మిత్రుడు. మనమేమో ఆ ‘ఫలానా’ ఇంకా ఎక్కడో ఉన్నాడనే అనుకుంటున్నాము. ఆయన పోయి నాలుగేళ్లయినా, మనకు మాత్రం ఆ క్షణాన్నే పోయాడు. అసలా సంగతి గురించి ఇంకా నమ్మకం కుదరదు. భౌతికమైన మనిషి సంగతే ఇట్లాగయితే, ఉన్నామో లేదో, ఎవరికీ తెలియని అనుభవైక వేద్యాల సంగతేమిటి?

తరం-తరం: మా తాతయ్య పుస్తక ప్రియులు. ఆయన వదిలి వెళ్లిన పుస్తకాలే అందుకు నిదర్శనాలు. ఎనిమిది రకాల రామాయణాలున్నాయి ఆయన లైబ్రరీలో. తాతయ్య పుస్తకాలలో టూరిజం, సైన్సు(!) రకం పుస్తకాలున్నాయని గమనించాను. ఆ కాలంలోనే ఆధునిక వైద్యం, ఆరోగ్యం లాంటి విషయాల మీద పుస్తకాలు వచ్చాయని, వాటిని తాతయ్య తెచ్చి చదువుకున్నాడని తెలిస్తే ఈ ‘తిక్కదనం’ నాటి నుంచీ ఉందని అర్ధమైంది. మ్యాజిక్, గుర్రాల పెంపకం, ఆయుర్వేదం,  చిట్కా వైద్యం లాంటి విషయాల గురించి కూడా తాతయ్య పుస్తకాలు సేకరించి పెట్టుకున్నాడు. నాకు చేతనయినంత కాలం ఆయన పుస్తకాలను నేను కాపాడుకున్నాను. చదువు పేరిట ఇల్లు వదిలి, తిరిగి వచ్చేసరికి, ఇంట్లో పుస్తకాలు మిగలలేదు. మిగిలినవి పుస్తకాల లాగ లేవు. అది గమనించి నేను పడ్డ బాధ వర్ణనాతీతం.

నాన్న సంప్రదాయ విద్య బాగా చదువుకున్న వ్యక్తి. కాని ఎందుకో ఆయన లైట్ రీడింగ్ మీద మాత్రమే మనసు పెట్టినట్టు గమనించాను. ఆయన కొన్న పుస్తకాలన్నీ ఇంచుమించు అదే రకం. అవి కూడా మిగలలేదు. సంవత్సరాల తరబడి సేకరించిన చందమామలు, నవలలు మాయమయినవి. నాన్న, నేనూ ఆ విషయంగా పెద్ద బాధపడినట్టు లేదు.

నాన్న సాంప్రదాయం మనిషే. అయినా పిసరంత కూడా ఛాదస్తం లేదు. ఎమ్మెస్సీలో క్లాస్‌మేట్స్ (గరల్స్) ప్రోద్బలంతో నేను మీసాలు పెంచుకున్నాను. ఇంటికి వెడితే అది చూచి తంతారేమోనని భయం. తలవంచుకుని ఇంట్లోకి వెళుతున్నాను. అరుగు మీద కూచున్న నాన్న నా ముఖంలోకి చూసి ‘భేష్ బాగుందిరా నాన్నా!’ అని నిజంగా మెచ్చుకున్నారు. మూన్ ఫేస్ అంటారే! ఇంచుమించు అమ్మాయి ముఖం నాది. పైగా రంగు. మీసాలతో మగతనం కనిపించిందని వ్యాఖ్య! అదీ నాన్న పద్ధతి. చిన్నప్పుడు నన్ను భుజం మీద ఎత్తుకుని ఇల్లంతా తిరుగుతుంటే నేను ఎడతెరిపి లేకుండా ‘అదేమి?  ఇదేమి’ అని ప్రశ్నలడగాలి. ఆయన సమాధానాలు చెబుతారు. కొన్ని ప్రశ్న తరువాత ‘చల్ బే (పోరా!)’ అంటారు. అది మాకు ఒక ఆట! నాకు బాగా గుర్తుంది! ఆ రకంగా ఆయన వెంట తిరుగుతూ ఎన్ని సంగతులు తెలుసుకున్నానో మరి! డిటెక్టివ్ నవలలు చదివితే పరిశీలన, విశ్లేషణ అలవాటవుతాయని నాన్న చెప్పాడు. పైగా నాన్న చర్చకు, ప్రశ్నలకు అవకాశం కల్పించాడు. నాకు మరీ ధైర్యం ఎక్కువైంది కూడా. కొన్ని సందర్భాల్లో ‘నాకు తెలిసింది ఇంత. మా పెద్దలు చెప్పింది, వారికి తెలిసింది ఇంతే!’ అని ఓటమిని కూడా అంగీకరించే వాడు నాన్న! నాన్నకు నేనివాళ కృతజ్ఞత చెప్పగలనా?

నాకు ఎమ్మెస్సీలో గోల్డ్‌మెడల్ వచ్చిందని అమ్మ ఒక పండుగ పథకం వేసింది. బంధువులు మిత్రులు అందరూ వచ్చారు. పూజ (సత్యనారాయణ వ్రతమా?) ఏర్పాట్లు అయినయి. ‘రా! కూచో!’ అన్నది అమ్మ! ‘అమ్మా, నాకు మనస్థిమితం కుదరదు. పిచ్చి ఆలోచనలు వస్తాయి. అట్లా చేయడం తప్పుగాదా? అని అడిగాను. అందరూ నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. నాన్న మాత్రం ‘వాణ్ని వదిలిపెట్టండి’ అని అమ్మతో తాను పూజకు కూర్చున్నాడు. ‘మా వెనక కూచుని చూడు!’ అన్నారు అంతే! నాన్న ఒకనాడు కూడా ‘ఈ విషయం మీరు చేసి తీరాల్సిందే’ అని చెప్పిన గుర్తులేదు మాకెవరికీ!

తరం మారింది: సైన్సు ప్రకారం బతకడమని ఒకటుందని చాలామంది సైంటిస్టులకే తెలియదు. సంపూర్ణ సూర్యగ్రహణం గురించి పరిశోధించడానికి వెళ్లిన ఒకాయన బురద నీళ్లలో స్నానం చేశాడని యూనివర్సిటీ రోజుల్లో చెప్పుకున్నారు. అట్లాగని, మతాన్ని, నమ్మకాలను కాదనడం సైన్సనుకుంటున్నారేమో? మతం వ్యక్తిగతం, సైన్సు సార్వజనీనం! పరిశీలన, ప్రయోగం లాంటి అంచెలతో సాగుతుంది సైన్సు పద్ధతి! అది వంటబట్టడానికి సైన్సు చదవనవసరం లేదు.

నాకొడుకు మరీ చిన్నవాడుగా వున్నప్పుడు, వాడూ, నేనూ మాత్రమే మహబూబ్‌నగరం దాకా బస్సులో ప్రయాణం చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఇంట్లో నిశ్శబ్దంగా ఉంటుంది గానీ, పిల్లలిద్దరూ చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు వారితో నేను తెగ గోల చేసేవాడిని. బస్సులో గోల చేయలేదు గానీ! నేనూ నా కొడుకు మాట్లాడుతునే ఉన్నామని తర్వాత అర్థమైంది. వాడికి బయట తిరగడం అదే కొత్త! కనిపించిన ప్రతి సంగతి గురించీ ప్రశ్నలడుగుతాడు. నాకు తెలిసింది నేను చెబుతాను. పాలమూరు అనే మహబూబ్‌నగర్ దగ్గరయింది. పక్కనకూచున్న పెద్దాయన, ఊరి మొదట్లోనే దిగడానికి సిద్ధమయ్యాడు. దిగబోతూ నావేపు చూచి ‘ఒక మాట చెప్పనా’ అన్నాడు. ‘చెప్పండి’ అన్నాను. ‘మీ కొడుకుకు చాలా తెలివి ఉంది. మీకు అంతకన్నా ఎక్కువ ఓపిక ఉంది’ అన్నాడాయన! నేనీ సంగతి గురించి వ్యాఖ్యానించను.

కవిసమ్మేళనం-కొబ్బరి పచ్చడి: పుస్తక మేళాలో ఈ సంవత్సరం స్టాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలామంది మిత్రులు కనిపించారు కూడా. అక్కడ కవిసమ్మేళనం జరుగుతుందని మైకులో చెపుతున్నారు. పాల్గొంటున్న కవులందరూ మిత్రులు, కనీసం పరిచితులు. ఈ సంగతే నాతో ఉన్న మా అమ్మాయితో చెప్పాను కూడా. వేదిక ముందుకు వెళ్లేసరికి కవులంతా వేదికను అలంకరించారు. అంటే వేదికను ఎక్కారని అర్థం. కొంచెంసేపు ఉండి వెళ్లిపోదాములే! అంటున్నాను అమ్మాయితో. ఇంతలో ఫోను మోగింది. దూరం వచ్చి వింటే ‘ఇడ్లీలోకి కొబ్బరి పచ్చడి చేయమంటారా సార్’ అని ప్రశ్న. వంటాయన! రామాయణంలో పిడకల వేటలాంటి టైటిల్ గుర్తువచ్చింది. సైన్సుకూ, ఈ ముక్కకూ సంబంధం లేదని మనవి!