Thursday, March 5, 2026

కుక్క - మానవుడు మొదట్లో...


కుక్క - మానవుడు మొదట్లో...


కుక్క - మానవుడు

మనిషి, ఆరడుగుల ఎత్తున్న మరో మనిషిని నమ్మడు. అంగుళం తాళాన్ని నమ్ముతాడు. అంతకన్నా ఎక్కువగా తన కుక్కను నమ్ముతాడు. మనిషి జాతికి మరో జంతువు గురించి పట్టనప్పటి నుంచి కుక్క తోడుగా ఉంది. పదిహేనువేల సంవత్సరాల క్రితం, అంటే వ్యవసాయం కూడా అంతగా రాని నాటినుంచే కుక్కలు సాయంగా వచ్చాయి. అయినా, మానవ నాగరికతలో కుక్క పాత్ర గురించి తెలిసింది తక్కువ. అటు వేటలో, తరువాత పశుపోషణలో కుక్కలు ఎంతో సాయం చేశాయన్నది నిజం.

కుక్కలను గురించి పరిశోధకులు చాలామంది పట్టించుకున్నారు. డార్విన్‌ కుక్కల నడవడిని పరిశీలించాడు. తన నాచురల్‌ సెలెక్షన్‌ సిద్ధాంతానికి వాటిని ఉదాహరణలుగా వాడుకున్నాడు. 20వ శతాబ్దంలో నొబేల్‌ గ్రహీత కాన్రాడ్‌ లోరెంజ్‌ కుక్కల గురించి విస్తృతంగా పరిశీలనలు సాగించాడు. స్కాట్‌, ఫుల్లర్‌ అనే జన్యుశాస్త్రవేత్తలు కుక్కల నడవడిని విశ్లేషించారు. ఇటీవలి కాలంలో మాత్రం కుక్కల గురించి పరిశోధనలు అంతగా జరగేలదనాలి. 21వ శతాబ్దం వచ్చిన తర్వాత మాత్రం వాటి మీదకు మరోసారి చూపు మరలింది. తోడేళ్ల నుంచి కుక్కలుగా మార్పులో జరిగిన అంశాలు, వాటి తెలివి, భావావేశాల గురించి ఎంతో పరిశోధన జరిగింది, జరుగుతున్నది కూడా. కనుక, కుక్కల గురించి ఎన్నో కొత్త అంశాలు తెలియవస్తున్నాయి.

పెంపుడు జంతువుగా కుక్క : నిజానికి మానవుడు కుక్కలను ప్రయత్నించి మచ్చిక చేయలేదు. వేట పద్ధతి నుంచి జీవన విధానం మారుతున్న రోజులలో కుక్కలు వాటంతటవే మనిషి పంచన చేరాయి. తోడేళ్లు, క్రమంగా కుక్కలుగా మారాయని, డి ఎన్‌ ఏ విశ్లేషణలో బయటపడింది. ఇప్పటి తోడేళ్లను గమనిస్తే, రాతియుగం మానవుడు వాటిని, చేరదీసి మచ్చిక చేసిన వీలు కనిపించదు. అంటే, వెనుక కాలంలో తోడేళ్లు మరింత మెత్తని స్వభావం కలిగి ఉండేవని అర్థం చెప్పవచ్చు. ఆ జాతి గతించింది. వారసులుగా మన కుక్కలు మిగిలి ఉన్నాయి. అప్పటి తోడేళ్లు మనుషుల ప్రాంతాలతో తిండి కోసం తిరిగాయి. వాటి పిల్లలను మనుషులు చేరదీశారు. అప్పటి మానవులకు జంతువుల కూనలను తెచ్చి పెంచుకోవడం అలవాటు! అట్లా మనుషుల మధ్య పెరిగిన జంతువులను మచ్చిక చేసి పనులు నేర్పడం సులభం. ఆ దారిలో మనిషికి కుక్కల సాయం మొదలయింది. కాపలా, వేటలాంటి లక్షణాలు కూడా నేర్చిన తర్వాత వాటి సాయం పెరిగింది. అంటే కుక్కలను మచ్చిక చేయడం, అనుకోకుండా జరిగిన పని! కానీ, దానివల్ల అటు తోడేళ్లకు, ఇటు మనుషులకు మంచి జరిగింది. సహవాసం సాగింది.

మచ్చిక క్రమం : ఉత్తర ఇజ్రాయెల్‌లో ఒక సమాధిలో, ఒక వ్యక్తి కుక్కమీద చెయ్యి వేసి ఉండడం కనిపించింది. ఆ కుక్క పిల్లకు, అప్పటి తోడేలు పిల్లలకూ ఎంతో తేడా ఉంది. ముఖ్యంగా దాని దంతాలు పూర్తిగా వేరుగా ఉన్నాయి. అంటే, ఆ కాలానికి తోడేళ్లు కొన్ని, కుక్కలుగా మారినట్లు లెక్క. కుక్క పిల్లను మనిషితోబాటు, ఖననం చేశారంటే పరస్పర సంబంధం, ప్రేమ అర్థమవుతాయి. 12వేల సంసవత్సరాల నాటి ఈ సమాధి, కుక్కల చరిత్రలో ఒక గొప్ప సూచనగా నిలిచింది. కానీ, అంతకుముందు, ఎక్కడ, ఏ రకంగా, కుక్కలు మచ్చికయిందీ చెప్పగల ఆధారాలు, నేటివరకు అందలేదు.

గడచిన సంవత్సరం, సైబీరియాలో జరిపిన తవ్వకాలలో ఒకచోట కుక్క పుర్రె దొరికింది. అది 33వేల సంవత్సరాలు నాటిదని లెక్క తేలింది. పుర్రె నిర్మాణం కుక్కల పుర్రెలాగున్నా, పళ్లు మాత్రం తోడేలు పద్ధతిలో ఉన్నాయి. గతంలో బెల్జియంలో దొరికిన ఒక పుర్రె కూడా 31వేల ఏండ్ల వాటిదని ఈ మధ్య నిర్ణయించారు. ఇవి బహుశ: ఈనాటి కుక్కల పూర్వీకుల జాతికి చెందనవని అభిప్రాయం, అనుమానం వచ్చాయి. కానీ, ఈనాటి కుక్కలు ఈ క్రమంలోనివి కావని ఆధారాలు కూడా అందాయి. 24,000 నుంచి 13,000 సంవత్సరాల మధ్యన, భూమిమీద మంచుయుగం వచ్చింది. అప్పుడు మానవులు దక్షిణ ప్రాంతాలకు తరలివచ్చారు. మునపటి కుక్కలు వారితో రాలేదు. మచ్చిక కార్యక్రమం మరోసారి మొదలయింది.

మచ్చిక ఎక్కడ? : పురాతత్వ పరిశోధనలో అందిన ఆధారాల ప్రకారం, కుక్కల మచ్చిక మునుముందు పడమటి ఆసియా ప్రాంతంలో మొదలయింది. ఆ ప్రాంతాలను ఇప్పుడు మిడిల్‌ ఈస్ట్‌ (మధ్యప్రాచ్యం) అంటున్నారు. 2005లో కుక్కల డి ఎన్‌ ఏ నిర్మాణ క్రమాన్ని (జీనోమ్‌) పూర్తిగా గుర్తించారు. అంతకుముందు దొరికిన, కుక్కలు, వాటి పూర్వీకులనుకున్న తోడేళ్ల జన్యు పదార్థాలను కూడా తరచి చూస్తే, పరిణామం, మచ్చికల గురించి మరెంతో తెలుస్తుంది. ఇలాంటి పరీక్షలు జరిగాయి. కుక్కలన్నింటిలోనూ మిడిల్‌ఈస్ట్‌ పద్ధతి జన్యు నిర్మాణమే కనిపించింది. కనుక పురాతత్వ పరిశోధన వెల్లడించిన చరిత్ర సరయినదేనని గట్టిగా తెలిసింది. స్వీడన్‌ పరిశోధకులు పీటర్‌ సవొరైనెన్‌ మాత్రం కుక్కల పుట్టుకస్థానం ఆగ్నేయ ఆసియా అంటున్నాడు. జీవజాతులు వేరువేరు చోట్లకు చేరిన కొద్దీ, వాటి జన్యువులలో వైవిధ్యం తగ్గి, మొదటి రూపం వస్తుంది. యాంగ్జీ నది ప్రాంతపు కుక్కలలో మాత్రం ఆ లక్షణం కనిపించ లేదు. యూరోపియన్‌ కుక్కలలో కూడా మధ్యప్రాచ్యం డి ఎన్‌ ఏ లక్షణాలు అంతగా కనిపించలేదట. కనుక పరిణామచరిత్రలో ఇంకా ప్రశ్నలు మిగిలాయి.

కుక్కల శక్తియుక్తులు : మనుషులకు సాయం చేయడంలో మరొక జంతువేదీ కుక్కలకు సాటిరాదు. చింపాజీలకు కూడా మనుషుల శరీరం కదలిక సూచనలు అంతబాగా అర్థం కావు. వేలు చూసినా అర్థం చేసుకోవడం ఒక్క కుక్కలకే చేతనయింది. కుక్కలకు ‘నేర్చుకునే శక్తి, కోరికలు’ చాలా ఎక్కువ. మనుషుల నడవడిని అవి మరీమరీ పరిశీలించి, అర్థాలు తెలుసుకుంటాయి. కుక్కలకు మనుషుల ముఖ కవళికలు ఎంతో నచ్చుతాయి. కోపం, మెచ్చికోలు సులభంగా అర్థమవుతాయి. అసలు, ఆ ముఖం ఎటువేపు ఎందుకు చూచేదీ వాటికి అర్థమవుతుంది. కళ్లులేని వారికి, కుక్కలు తోడుగా ఉంటున్నాయని తెలుసు. ఆ రకం కుక్కలను గురించి ఫ్లోరెన్స్‌ గానేట్‌ వంటి జంతుశాస్త్రజ్ఞులు లోతుగా పరిశోధించారు. కళ్లులేని వారి ‘చూపును’ కూడా కుక్కలు, చురుకుగా అర్థం చేసుకో గలుగుతాయని ఆమె అంటున్నారు.

కుక్కలకు తమ పరిసరాలను గురించి అంతగా తెలియదని ఒక్కోసారి అనిపిస్తుంది. బ్రిటా ఓస్ట్‌హౌస్‌ అనే పరిశోధకురాలు ఈ అంశం గురించి పరిశోధిస్తున్నారు. ఆమె చేసిన ప్రయోగంలో రెండు హాండిల్స్‌ ఉంటాయి. వాటిలో ఒకదాని నుంచి కట్టిన దారం అటు చివరన మాంసం ముక్క ఉంటుంది. అయినా కుక్కలు, ఆ దారం సంగతి పట్టించుకోకుండా, తిండికి దగ్గరగా ఉన్న హ్యాండిల్‌ను లాగాయి. కుక్కలకు కాలంలో వెనక, ముందుల గురించి కూడా అంతగా తెలియదని అర్థమయింది. గతం అనుభవాలను అవి గుర్తుంచుకోవు. రానున్న కాలం కొరకు జాగ్రత్తలూ వాటికి తోచవు. అందుకే ఒంటరిగా వదిలిన కుక్కలు మరీ సమస్యలకు గురవుతాయి. సమస్యలకు కారణమూ అవుతాయి. వదిలివెళ్లిన యజమాని ఏదో ఒకనాటికి తిరిగి వచ్చే సంగతి వాటికి తోచదు.

కుక్కల ముక్కు, వాసన శక్తి ఎంతో ప్రత్యేకమన్న సంగతి తెలిసిందే. మనుషుల వాసన శక్తి, కుక్కలతో పోలిస్తే, చాలా తక్కువ. మనుషులకు సూచనగా కూడా తెలియని వాసనలను కుక్కలు పసిగడతాయి. మనిషి రక్తంలో, డయబెటిస్‌ కారణంగా, చక్కెరలు ప్రమాద స్థాయికి చేరుకుంటే కుక్కలు గుర్తించి హెచ్చరిక చేయ గలుగుతున్నాయి. అవసరమయితే, అర్థరాత్రి కూడా, ఆ మనిషిని నిద్రలేపి, హెచ్చరించే రకంగా, కుక్కలకు శిక్షణ ఇవ్వగలిగారు. కుక్కలలో వాసనకు సంబంధించి వోమెరో నేసల్‌ ఆర్గన్‌ అనే, రెండవ (అదనపు) వ్యవస్థ ఉంటుంది. పై వరుస కోరపళ్ల మీద నుంచి ఒక డక్ట్‌ ఉండి, ముక్కులలోకి తెరుచుకుంటుంది. ఈ దారి వెంట కూడా వాసనలు తెలుస్తుంటాయి. ఈ వ్యవస్థ గురించి మరింత పరిశోధన జరగవలసి ఉంది. మిగతా కుక్కల వాసనను గుర్తించడం దీని పని అని పరిశోధకులు భావిస్తున్నారు.

అనుకోని నిజాలు

కుక్కల మధ్య బంధం : మచ్చికయిన తర్వాత కుక్కల కుటుంబం పద్ధతి పూర్తిగా మారిపోయింది. తోడేళ్లకు ప్రపంచమంటే కుటుంబం ఒకటే. తల్లి, తండ్రి, వాటి పిల్లలు కలిసి గుంపుగా తిరగడం వాటికి బాగా అలవాటు. పెరిగిన పిల్లలు కూడా, తల్లిదండ్రుల తోనే ఉండిపోతాయి. తమ తరువాత పుట్టిన పిల్లలను పెంచడంలో అవి సాయపడతాయి. తోడేళ్లనుంచి వచ్చిన కుక్కలకు మాత్రం ఈ కుటుంబం పద్ధతి ఏ మాత్రం చేతగాదు. కుక్కల మధ్యన ప్రేమ, కలిసి ఉండడంలాంటివి కనిపించవు. అడవులలో పెరిగే కుక్కలు కూడా కుటుంబాలుగా ఉండవు. ఆడతోడును ఎంచుకోవడంలో వాటికి ఒక పద్ధతి లేదు. ఇక పెంపుడు కుక్కలకు, యజమాని, ఆ కుటుంబం మాత్రమే స్వంత కుటుంబంగా కనబడుతుంది. మిగతా కుక్కల సంగతి పట్టనే పట్టదు. నిజానికి, కుక్క, మనిషికి తేడా కుక్కలకు తెలియదంటారు. మనిషితో కలిసి మనిషినే జట్టు నాయకులుగా గుర్తించి బతుకుతాయవి!




 

No comments: