మగునీ ఎద్దుల బండి
ఒరియా మూలం - గోదావరీష్ మొహపాత్ర
అనువాదం - కె. బి. గోపాలం
జననాలు, మరణాలు: రెండు లక్షల జనాభా
ఉన్న ఖాలీకోట్ లో తప్పనిసరిగా ఈ రెండు ఉండనే ఉన్నాయి. అయితే వాటి సమాచారం మాత్రం
కుటుంబాలు, పరిసరాల పరిధిని దాటి ఎన్నడూ ప్రయాణించింది లేదు. కానీ, మగునీ చనిపోయిననాడు
మాత్రం వార్త ఊరంతా వ్యాపించింది, మరింత దూరం కూడా పోయింది. విన్న వారంతా, కాసేపు మ్లానంగా
ఉండిపోయి, అయితే బీద వెధవ పోయాడన్నమాట! ఎంత అన్యాయం! అంటూ ఆశ్చర్యం
వెలిబుచ్చారు.
ఇంతకు ఎవరా మగునీ? ఖాలీకోట్ మహారాజా? లేక మరో పక్కరాజ్యం ప్రభువా? పరిపాలన యంత్రాంగంలో ప్రధాన అధికారియా? బాగా పన్నులు కట్టే ధనవంతుడా? లేక అప్పులు ఇచ్చే షావుకారా? స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న సత్యాగ్రహ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న కాంగ్రెస్ నాయకుడా? వెర్రిగా వచ్చే జనాలను ప్రభావితం చేస్తూ గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చాడా? కాదంటే వచ్చే వాళ్ళందరినీ ఆహ్వానించడానికి అందరికన్నా ముందు ఉండేటట్టు ఎంపికయ్యే ప్రధాన పౌరుడా? ఎవరతను? టౌన్ లోని వాళ్లంతా, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల అడవికి దగ్గరగా ఉండేదూరం పల్లెలవారు కూడా అతగాడిని ఎరిగినవారే!
మగునీ అసలు ముఖ్యమైన మనిషి కానేకాడు. అతను చేసిందల్లా బతుకు గడవడం కోసం ఒక ఎద్దుల బండిని నడిపించడం మాత్రమే. బతుకంతా కష్టపడ్డాడు. అదేదో దేశంకోసం, దేశం జనాలకోసం మాత్రం కాదు. కేవలం తనకోసం తాను కష్టపడ్డాడు. తన బతుకుదెరువు కోసం కష్టపడ్డాడు. అయితే ఉన్న ఆ రెండు ఎద్దులతో అతను ఏర్పరచుకున్న బంధంమాత్రం ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది.
ప్రతినిత్యం మగునీ తన బండితో రైల్వే స్టేషన్ కు వెళ్లి తీరుతాడు. అదేదో సూర్యుడు ఉదయించి సాయంత్రం టౌన్ కోటమీద అస్తమించినంత క్రమంగా వెళ్లి తీరుతాడు. గడియారంలాగా పని చేస్తాడు అని ప్రజలందరూ అనేవారు. వానకాలం నెలలలో, సూర్యుడు మబ్బుల చాటున దాగి ఉన్నప్పుడు, అతని రావడం పోవడంతో అందరికీ సమయం తెలిసేది. రుతువులు క్రమంగా రాకపోవచ్చు, వర్షాలు ఆలస్యం కావచ్చు, వేసవి మరీ వేడిగా లేకపోవచ్చు, మగునీ బండి గడగడలాడుతూ దారివెంట నడవకుండా ఒక రోజు కూడా గడవలేదు. శీతకాలపు మరీ చల్లని ఉదయాలలో కూడా అందరూ దుప్పట్లు చుట్టుకుని వరండాలలో కూర్చుని ఉంటే, మగునీ తన బండిని మాత్రం కొండల కింద పాములా మెలిదిరిగిన దారి వెంట, పెదాల మీద పాటతో సహా నడిపించడం తప్పదు.
ఖాలీకోట్ ప్రభువుగారి దగ్గర రెండు కార్లు ఉంటే మాత్రమే ఏమిటి? అంటూ, అతను ఒక్కొక్కసారి సరదాగా అనేవాడు. ఆయన దగ్గర తనవంటి డ్రైవర్ ఉన్నాడా? అని అడిగేవాడు. అతని ఎద్దులబండి కారులన్నింటికన్నా గొప్పది. కాలియా, కాసరాలను వాటి వెనుక భాగాన నెమ్మదిగా తట్టి ఇంజన్ ను హుషారు చేస్తే చాలు. బండి సాగుతుంది. దానితోపాటు ముక్కలు ముక్కలుగా పాట సాగుతుంది. అందరికీ తెలిసిన రామకథ అది. రాముడు, లక్ష్మణుడు మాయలేడి వెంటపడి మహ పరుగెత్తారు, అంటూ సాగుతుంది పాట. ఇక ఎద్దులు ఎగురుతున్నట్టే ముందుకు సాగుతాయి. పాట కొండల్లో ప్రతిధ్వనిస్తుంది. పక్షులు జంతువులను మేలుకొలుపుతుంది. అడవి కోళ్ళు అరుస్తాయి. ఊర కుక్కలు మొరుగుతాయి. బండి అలా ముందుకు సాగుతుంది.
టౌన్ లో పైనుంచి కింద దాకా, ఇటుపక్క నుంచి అటుపక్కదాకా, ఇంకా వెలుపలి ప్రాంతాల్లో కూడా, తన నోటి నుండి అంతులేని ప్రవాహంలాగా బతుకు కథలతో మగునీ అందరినీ పట్టి వేస్తాడు. తల్లిదండ్రులు ఎంతో బుజ్జగించి ప్రేమగా పెంచారు. అతని చిన్నతనం హాయిగా సాగింది. పడుకునేందుకు పరుపు, కడుపునిండా తిండి, అసలు ఏ పని చేసే అవసరం లేకపోవడం, అది పద్ధతి. తల్లీ, తండ్రీ పోయిన తర్వాత కూడా అతని బతుకు బాగానే సాగింది. పెరిగి పెద్దవాడయ్యాడు. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె మాటలు ఆమె పెదవుల లాగే తీపి. ఆమె ఊపిరి అసలైన సుగంధం. ఆమె నడిచిన చోట పూలు పూసేవి. బ్రతుకు కలలాగా సాగింది. ఆనందం, సంతోషాలు వెల్లి విరిశాయి. అయితే అది చాలాకాలం కొనసాగలేదు. అతని భార్య చిన్న వయసులోనే మరో లోకానికి వెళ్లిపోయింది. తన రోజులు ముగిసిన తరువాత తాను కూడా వెళ్లి ఆమెను కలుస్తాను, అని అతను అనుకునేవాడు.
ఈ విషయాలన్నీ అతను గంభీరంగా పాడుతూ, చెపుతూ ఉంటే అందరి కళ్ళు చెమర్చేవి. అతని కళ్ళు కూడా చెమర్చేవి. ఎవరికంటా పడకుండా కన్నీళ్లు తుడుచుకుని, అతను మాటమార్చి మరో సంగతి ఎత్తుకుంటాడు. ప్రయాణం ముగుస్తుంది. కథలు మాత్రం ముగియవు. ఖాలీకోట్ మహారాజు ఒక్కరు తప్పితే అందరూ మగునీ బండి ఎక్కినవారే. దీవాన్ గారి నుంచి మేనేజర్ దాకా, లాయర్ గారు, మార్వాడీ సేఠ్ నుండి మరి మహాత్మా గాంధీ అనయాయుల దాకా, ఒకసారి కాకపోతే మరోసారి అతని బండి ఎక్కినవారే. ఆ బండి ఎన్నింటినో చూచింది. చిన్న వయసులోనే మొగుణ్ణి పోగొట్టుకున్న ఆడకూతుర్లు అత్తారింటి నుంచి తల్లి గారి ఇంటికి తిరిగి రావడం, సంతోషంగా, చక్కనైన పెళ్ళికూతుళ్లు పుట్టినింటినుంచి మొగుడి ఇంటికి వెళ్లడం, మండల్ గ్రామంలోని గదా రౌల్, పన్నులు కట్టనందుకు బందిఖానాలో పడడం, ప్రపంచంలో అతనికి మిగిలిన వస్తువులన్నీ, చివరికి చీపురుదాకా ఈ బండిలోనే ప్రభువుగారి దర్బారుకు తరలింపబడడం, బెండాలియా వాసి మధూ రథ్ చెరసాలకు పంపబడడం, వాదించిన లాయర్లు, చేతులకు బేడీలు వేసిన పల్లెకారు నాయకులు ముఖాల మీద చిరునవ్వుతో అరెస్టు కావడం. మగునీ బండి ఎన్నెన్నో చూచింది. దుఃఖాన్ని చూచింది, సంతోషాన్ని చూచింది. ధారలుగా కారిన కన్నీళ్లు, గడ్డిమెత్తలను తడిపాయి. ఆనందంగా కొట్టిన కేరింతలు అదే విధంగా, బండి మంచె కట్టిన గడకర్రలను దడదడలాడించాయి. కనుక మగునీ మాట్లాడుతున్నాడు, అంటే అదొక చరిత్ర. అందులో ఆ టౌను కథలన్నీ వినిపిస్తాయి. అతను కథలలో ఎంతో హుషారును కలగలుపుతాడు. చివరకు ఎద్దులు వింటూవింటూ నెమ్మది ఆగిపోతాయి. నా కథలను ఇవి ఎలా వింటున్నాయో చూడండి, అంటాడతను. హాయిగా నవ్వుతాడు. ఆ ఎద్దుల మీద ఏనాడూ కర్రను ప్రయోగించింది లేదు.
అటుయిటు తిరగడానికి అందరికీ మరొక ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తున్నదని మగునీకి తెలిసేరోజు ఒకటి వచ్చింది. దారి మీదకు సింగ్ కుటుంబం వారు బస్సును ఒకదాన్ని తెస్తున్నారని తెలిసింది. అతను మాత్రం గలగలా నవ్వేశాడు. సుఖంగా తిని పెరుగుతున్న తన ఎద్దుల జంటకు పోటీగా ఒక బస్సు వస్తుందా? ఆ దిక్కుమాలిన బస్సు పేరున అందరూ తన బండిని వదిలిపెడతారా?
అందరూ అతగాడిని చూసి నవ్వారు. అతను మాత్రం అలాగే ఉండిపోయాడు.
నాలుగు నాళ్ళు పోయిన తర్వాత రాక్షసిలాంటి ఒక బస్సు రోడ్డు
మీదకు రానే వచ్చింది. మగునీ పని ముగిసింది, అన్నారు ఊరివాళ్లు. వాడి వ్యాపారం మడత
పడుతుంది. ఇరవయి మందిని గంటకు నలభయి మైళ్ళ వేగంతో తీసుకువెళ్లే బస్సుతో ఒక
ఎద్దులబండి ఎట్లా సమానంగా పోటీ పడుతుంది? అన్నారు.
మగునీ గుండె దిగజారింది. వాడికి భయం పట్టుకుంది. వాడు కిందపడి ఏడవడం మాత్రం మొదలు పెట్టలేదు, నిజమే. కానీ కళ్లలో నీళ్లు పెట్టుకున్నాడు. కొడోలాలో పెద్ద సభ జరుగుతుండగా తాను పక్కగా వెళ్లడం గుర్తుకు వచ్చింది. మనిషి చేతులకు మరయంత్రాలు సాటిరావని అక్కడ ఒక పెద్దమనిషి గట్టిగా చెబుతున్నాడు. అదే గనుక నిజమైతే, తన ఎద్దుల బండి మోటార్ బస్సు కంటే గొప్పది కాదా? ఆ మీటింగుకు హాజరయి ఆ మాటలు విన్న వాళ్ళ అందరి దగ్గరకు వెళ్లి అభ్యర్థిస్తాను అనుకున్నాడు. వాళ్లంతా తనను పట్టించుకోకుండా ఉంటారా? వాళ్లుగానీ, ఆ పని చేస్తే, తాను నేరుగా వాళ్ళ నాయకుడు మహాత్మా గాంధీ దగ్గరకు వెళ్లాలి అనుకున్నాడు. అతను బీదవారికి, భూమిమీది బడుగువారికి మహా మిత్రుడు అని అందరూ అనగా విన్నాడు. ఆయన కూడా మగునీని పంపించి వేస్తాడా? మగునీ నాశనమైతే, సింగ్ లు బాగుపడితే చూస్తూ ఊరుకుంటాడా?
మగునీ బండి నడిచే దారిమీదనే బస్ కూడా నడవసాగింది. ఒకరోజు తరువాత ఒక రోజు తరువాత ఒకరోజు బస్సు నిండుతున్నది. బండి ఖాళీగా ఉంటున్నది.
మగుని మధ్యరాత్రి లేచి, తన బండిని రైల్వే స్టేషన్ ముందర తెల్లవారక ముందే ఆపి ఉంచడానికి, బయలుదేరాడు. అయినా ప్యాసింజర్లు అందరూ బస్ కోసం కాచుకుని ఉన్నారు. అది తెల్లారిన తర్వాత ఎప్పుడో గాని రాలేదు.
బండిలోని గడ్డి పరుపులను తీసేసి, మగునీ జనపనార సీట్లను ఏర్పాటు చేశాడు. అయినా ప్రజలు బస్సు వేపే వెళ్లారు.
ఒక్కొక్కరిని చేతులు పట్టుకుని, బండి వద్దకు తెచ్చే ప్రయత్నం చేశాడు. అయినా అందరూ బస్సు వైపు వెళ్లారు.
రోజులు గడిచాయి, మరిన్ని రోజులు గడిచాయి.
మగునీకి సంగతి తెలిసిపోయింది. దినానికి రెండుసార్లు బదులు ఒకేసారి తినడం మొదలుపెట్టాడు.
మరి కొన్ని నాళ్ళు గడిచిన తర్వాత అతను భోజనం నుంచి గంజికి మారాడు.
ఇంకా కొన్ని నాలుగు గడిచాయి, గంజి రోజుకు ఒకసారి నుంచి రెండు రోజులకు ఒకసారికి మారింది.
మరెన్నో రోజులు గడిచాయి. చాలా రోజులపాటు అతని ఇంట్లో పొయ్యి వెలగలేదు. అసలు వండడానికి ఏమీ లేదు.
ఎద్దులు బక్క చిక్కిపోయాయి. వాటి ఎముకలు పొడుచుకు వచ్చాయి. మగునీ వాటి మెడలు వాటేసుకున్నాడు. ముగ్గురు కలిసి నిశ్శబ్దంగా కన్నీరు పెట్టుకున్నారు.
వాడి పని ముగిసింది, అన్నారు ఊరివారు. ఆకలి, దుఃఖంతో వాడు వెర్రెత్తిపోయాడు, అన్నారు.
మరికొంత కాలం గడిచింది.
ఒకానొక ఉదయాన జనం కలిసి మగునీ ఇంటి తలుపు పగలగొట్టవలసి వచ్చింది. అతని శరీరాన్ని బయటకు తెచ్చారు. చింకిచాపమీద అతని దేహం పడి ఉంది. చేతి కర్ర దానికిందే ఉంది.
అతని కోసం చితి పేర్చారు. నల్లని పొగ దట్టంగా ఆకాశంలోకి ఎగిసింది. ఆత్రంతో రెక్కలు తపతపలాడిస్తూ లెక్కలేనని పక్షులు అందులో ఎగిరాయి. వార్త ఊరంతా పాకింది. అక్కడి రెండులక్షల జనాభా వాపోయారు. పాపం బీద మగునీ పోయాడన్నమాట! ఎంతటి అన్యాయం? అన్నారు.
గోదావరీష్ మహాపాత్ర - ఒరియా(1899 – 1965) పద్నాలుగేళ్ల వయసులో మొదలైన సాహిత్యచరిత్రలో ఇతను 70 పుస్తకాలు వెలువరించాడు. కవిత, చిన్న కథ, నవల, హాస్య రచనలు, నాటికలు, బాల సాహిత్యం ఎన్నో రాశాడు. ము పాత్రికేయ రచనలు కూడా చేశాడు. ఒక సెటైరికల్ పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. మగునీ ఎద్దుల బండి అనే కథను చలనచిత్రంగా కూడా తీశారు. ఆ చిత్రానికి అవార్డు వచ్చింది.
No comments:
Post a Comment