Friday, December 3, 2010

Medha -5

Visit the Medha page in Andhrabhoomi.

Medha Page

Here is the contnt form the fifth edition.

వేడి, వెలుగు, కదలిక


November 14th, 2010

స్విచ్ వేస్తే లైటు వెలుగుతుంది. ఇస్ర్తి వేడెక్కుతుంది. టీవీలో బొమ్మ వస్తుంది. మరోటి పాడుతుంది. ఎలెక్ట్రిసిటీ, (మనకు అలవాటయిన పేరు కరెంటు) లేకుంటే జగము చీకటి, బ్రతుకు భారం! కానీ యింతకూ కరెంటు ఎట్లా పని చేస్తుందో తెలుసా? విద్యుత్తుతో పనిచేసే ఏ పరికరమయినా సరే, స్విచ్ వేయగానే ఒకటి మాత్రం తప్పకుండా జరుగుతుంది. తీగల్లోని ఎలక్ట్రానులన్నీ వరసలో ఆడడం మొదలు పెడతాయి. అందుకే దానికి కరెంటు, విద్యుత్తు ప్రవాహం అని పేరు. ఆ రకంగా ఎలక్ట్రానులు వరుసగా ఆడుతుంటే అక్కడ వేడి పుడుతుంది. అంతకన్నా ఆశ్చర్యంగా తీగ, అయస్కాంతంగా మారుతుంది. వేడితో బల్బులు వెలుగుతాయి. ఇస్ర్తి, గీజరు వేడెక్కుతాయి. ఇక అయస్కాంతం కారణంగా రకరకాల కదలికలు వీలవుతాయి. ఈ అంశాలను ఆధారంగా చేసుకుని రకరకాల పరికరాలన్నీ విద్యుత్తుతో పనిచేస్తాయి. తీగలన్నీ లోహాలతో తయారవుతాయి. లోహాలలో వేడి ఎలక్ట్రానులుంటాయి. ఆ ఎలక్ట్రానులను ఒక క్రమంలో పెట్టగలిగితే అది కరెంటు అవుతుంది. ఈ పని బ్యాటరీతో జరిగే కదలిక నెగెటివ్ నుంచి పాజిటివ్ ధృవం వేపు ఒకేరకంగా జరుగుతుంది. కనుక దాన్ని డైరెక్ట్ కరెంట్ (డీసీ) అంటారు. మామూలు కరెంటులో ఈ దిశ సెకండుకు వందసార్లుగా అటుయిటుగా మారుతూ ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానులు పరుగు పెట్టనవసరం లేదు. ఒకే చోట ఉండి, అటుయిటు కదులుతుంటే చాలు. అన్ని ఎలక్ట్రానులు, కవాతు సైనికుల లాగ ఒకడుగు ముందుకు, ఒకడుగు వెనక్కు వేస్తుంటాయి. (కవాతు సైనికులకు ఈ వెనకడుగు ఉండదు లెండి!) అందుకే దీన్ని ఆల్టర్నేట్ కరెంట్ (ఎసీ) అంటారు. తీగను ఒక క్రమంలో ఏర్పాటు చేసిన వలయాన్ని సర్క్యూట్ అంటారు. అందులో ఎలక్ట్రానులను ఒక క్రమంలో పనిచేయించడమే కరెంట్. అయితే మరి రకరకాల పనులెట్లా జరుగతాయి? వేడి: కరెంటు కదులుతుంటే ఏ తీగలయినా కొంత వేడుక్కుతాయి. ఎలక్ట్రానులు మిగతా అణువులతో గుద్దుకోవడమే యిందుకు కారణం. రాగి తీగలో ఈ వేడి తక్కువ. పరుగులెక్కువ. ఇక పరికరంలో వేడి కావాలంటే రాగితో బాటు నికిల్ లాంటి లోహాలను వాడితే సరి. గుద్దులాట, వేడి! కావలసినంత ఏర్పాటవుతుంది. టోస్టర్లు, హేర్ డ్రయర్లతో నికెల్, క్రోమియం కలిపిన తీగలను వాడుకుంటారు. బల్బుల్లో తీగ వెలుగుతుంది కూడా! తక్కువ వేడిమిలో ఎక్కువ వెలుగునిచ్చే వాయువులను వాడి ట్యూబ్ లైట్లను పనిచేయిస్తారు. అది వెలుగు విషయం. విద్యుత్తు పరికరాలతో వేడి, వెలుగు పుట్టించడం ఒక పద్ధతయితే, కదలికను పుట్టించడం మరో పద్ధతి. అందులో ‘మోటార్’ అనే మరో భాగం ఉంటుంది. వీటితో వేలాది రకాల యంత్రాలను పనిచేయిస్తుంటారు. కానీ, వాటిల్లో విద్యుత్తువల్ల జరిగేది ఒకే పని. అది ‘మోటార్’ తిరగడం. ఆ తిరిగే మోటార్‌కు రెక్కలు బిగిస్తే ఫ్యాను, మరోటి బిగిస్తే పిండిమర, వాషింగ్ మిషన్, ఎన్నయినా!


మరి కదిలే ఎలెక్ట్రానులే మోటార్‌ను తిప్పుతాయా? అసలు తిప్పవు! అవి తీగలను అయస్కాంతాలుగా మారుస్తాయి.


ప్రతి ఎలక్ట్రానూ ఒక అయస్కాంతమే. అవి జంటలుగా ఉండేసరికి తత్వం తెలియకుండా పోతుంది. ఇనుములాంటి లోహాల్లో, జంటలు పోగా, విడిగా కొన్ని ఎలక్ట్రాన్లుంటాయి. అవన్నీ ఒక దిక్కుకు తిరిగే సరకి, ఆ యినప ముక్క అయస్కాంతం అవుతుంది. దాంతో సూదిని ఆకర్షించడం అంటే సూదిలోని ఎలక్ట్రాన్లను ఆకర్షించడమని అర్థం! మొత్తానికి ఎలక్ట్రానుల వల్ల అయస్కాంతాలు పుడతాయి. ఒక లోహంలోకి విద్యుత్తు కరెంటును పంపితే అది తాత్కాలికంగా విద్యుదయస్కాంతగా మారుతుంది. అయస్కాంతంగా మారిన తీగను ఒక యినుప ముక్కకు చుడితే గట్టి అయస్కాంతం తయారవుతుంది.


రెండు అయస్కాంతాల చివరలను ఒకచోట పెడితే అవి దూరం జరుగుతాయి. సరిగ్గా ఈ అంశాన్ని ఆధారం చేసుకునే మోటార్లను పనిచేయిస్తారు. అక్కడ అయస్కాంతాలు ఒకదాని నుంచి మరోటి దూరంగా పోయే వీలు లేదు. కరెంటు ప్రవాహం మొదలవగానే అంటే స్విచ్ వేయగానే తీగ అయస్కాంతం అవుతుంది. లోపలి ఏర్పాటు కారణంగా కరెంటు ఆగేవరకు, ఎలక్ట్రో మాగ్నెట్ గిరగిరా తిరుగుతూ ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేయగానే తిరగడం ఆగిపోతుంది. తోసేందుకు విద్యుత్ ఉంటేనే గాలి, తీగల్లో, లోహం ముక్కల్లో ఎలక్ట్రానులు కదలవు. కరెంటు లేకుంటే అవి అయస్కాంతాలు కావు. అయస్కాంతం లేకుంటే కదలికా లేదు. మోటార్ తిరగదు. మోటార్‌కు బెల్టులు, గేర్లు పెట్టి రకరకాల యంత్రాలను పనిచేయిస్తారు. ఫ్యాన్‌గానీ, విద్యుత్తు రైలుగానీ, పెద్ద ఫ్యాక్టరీలో యంత్రాలు గానీ, అంతటా ఇదే పద్ధతి. కొంతకాలం కండరాల శక్తి యంత్రశక్తి అయింది. తరువాత ఆవిరితో యంత్రాలు కదిలాయి. ప్రస్తుతం కరెంటుతో కదులుతున్నాయి. అందుకే కరెంటు లేకుంటే వేడీ, వెలుగూ, కదలికా వుండవు. జగము చీకటి, బతుకు భారం అవుతుంది మరి!

వజ్రం అంటే ఏమిటి?

November 14th, 2010

ఈ ప్రశ్నకు ఒక్కమాటలో జవాబు చెపితే, విషయం తెలియని వారికి ముందు చిత్రంగా తోస్తుంది. కార్బన్ అనే రసాయనం ఒకటి ఉంది. అది రకరకాల రూపాలలో ఉంటుంది. చాలా కొన్ని రసాయనాలు మాత్రమే అలా రకరకాల రూపాలలో ఉంటాయి. మనకు బాగా తెలిసిన కార్బన్ రూపం బొగ్గు. రెండవది పెన్సిళ్ళలోనూ, బ్యాటరీ సెల్స్ మధ్యలోనూ ఉండే గ్రాఫైట్. ఇక మూడవది వజ్రం. బొగ్గు, వజ్రం ఒకటేనంటే ఎవరికయినా చిత్రంగానే అనిపిస్తుంది. కానీ వాటి అణువుల ఏర్పాటులో తేడా కారణంగా ఈ వస్తువుల భౌతిక లక్షణాలు పూర్తి వేరువేరుగా ఉంటాయి. బొగ్గుకు ఉండే ఏ ఒక్క లక్షణమూ వజ్రానికి లేదు. గ్రాఫైటు సంగతి కూడా అంతే. ఇది రసాయన ప్రపంచంలోనే ఒక విచిత్రం!


వజ్రాలు వాటి గట్టిదనానికి పెట్టింది పేరు. అందుకే నగలు, అలంకరణలతో బాటు, కొన్ని రకాల వజ్రాలను పరిశ్రమల్లో కూడా వాడతారు. ఉదాహరణకు గాజుపలకలు, అద్దాలను ముక్కలుగా కోసేందుకు వాడేది ఒకరకం వజ్రం ముక్క. అది ఉంగరాలలోకి చేరగల మేలిమి జాతి వజ్రం కాదు. యంత్రాలలో, గడియారాలలో కదిలే భాగాలు అరిగిపోకుండా చేతి గడియారాలలో కొన్ని జ్యుయెల్ వాడుతున్నామని ప్రకటించేవారు కదిలే భాగాల క్రింద ఎన్ని జ్యుయెల్స్ ఉంటే గడియారం అంత బాగా మన్నుతుందని లెక్క. ఆ జ్యుయెల్స్ కూడా చవకరకం వజ్రాలే. మొత్తానికి మనిషికి తెలిసిన పదార్థాల్లో అన్నిటికన్నా గట్టిది వజ్రం. ఈ ప్రపంచానికి వజ్రాలను పరిచయం చేసింది భారతదేశమని చెపితే మరింత చిత్రంగా తోస్తుంది. గోల్కొండ, ప్రపంచంలోనే పేరు పొందిన వజ్రాల మార్కెట్‌గా గుర్తింపు పొందిందంటే మరింత చిత్రంగా ఉంటుంది. 18వ శతాబ్ది తర్వాత మాత్రమే మిగతా ప్రపంచంలో వజ్రాలు దొరకడం మొదలవుతుంది. దక్షిణ ఆఫ్రికాలో, 1866లో ఆరెంజ్ నది పక్కన ఒక బాబుకు ఒక మెరిసే రాయి దొరికింది. తర్వాత అది 21 కేరట్ల మేలిమి వజ్రమని తెలిసింది. ఇక ఆ ప్రాంతంలో వజ్రాల వేట మొదలయింది. మెరుపు, పరిమాణం ప్రకారం ప్రపంచంలోనే గుర్తింపు పొందిన వజ్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కులినాన్, కోహినూర్ అన్నవి ముఖ్యమయినవి. గ్రేట్ మొగల్ అనే పేరుగల 240 క్యారెట్ల వజ్రం ఒకటి ఉండేదట. అదిప్పుడు ఎక్కడ ఉందో తెలియదు. 106 క్యారట్ల బరువు ఉండే కోహినూర్ వజ్రం అందులోని భాగమే నంటారు కొందరు. వజ్రాల కొలత క్యారెట్ 0.2 గ్రాములకు సమానం.

కాంతి - కొన్ని సంగతులు

November 14th, 2010

కాంతి వేగం సెకండుకు 1,86,2824 మైళ్ళు. కానీ ఆ వేగంతో కదల గలిగేది శూన్యంలో మాత్రమే. వజ్రంలో ప్రవేశించిన కాంతి వేగం సెకండుకు 77,500 మైళ్ళకు పడిపోతుంది.


మన కళ్ళ నుంచి వెలుగు పుడుతుంది. అందుకే మనకు వస్తువులు కనబడతాయి అనుకున్నాడు తత్వవేత్త ప్లేటో!


ప్లేటో ఆలోచనల్లో కొంత నిజం ఉంది. మానవశరీరాలలో వెలుగు ఉంది. అది మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా ఉంటుంది. శరీరంలో అన్నిటికన్నా బాగా వెలిగే భాగాలు, బుగ్గలు పెదవులు, ఫ్రీ రాడికల్స్ అనే రసాయనాలు ఈ వెలుగుకు కారణం.


సముద్రంలో 1500 అడుగులకన్నా లోతున జీవించే జంతువులలో 90 శాతానికి స్వయంగా వెలిగే లక్షణం ఉంటుంది. అక్కడ ఇదొక్కటే వెలుగు ఉంటుంది మరి!


కాంతికి ద్రవ్యరాశి లేదు. కానీ కదలిక ఉంది!


అపోలో వ్యోమగాములు చంద్రుని మీద కొన్ని అద్దాలను వదిలి వచ్చారు. వాటి నుంచి తిరిగి వస్తున్న లేజర్ కిరణాల ఆధారంగా, చంద్రుడు భూమి నుంచి ఏటా ఒకటిన్నర అంగుళం దూరం కదలుతున్నాడని లెక్క చేల్చారు.భూమి - అంకెల్లో!

భూమి వయసు: 4.6 బిలియన్ సంవత్సరాలు


ద్రవ్యరాశి: 13, పక్కన 24 సున్నాలు వేసినన్ని పౌండ్లు


భూగోళం దగ్గర చుట్టు కొలత: 24,901 మైళ్ళు


ధృవాల మీదుగా చుట్టు కొలత: 24,818 మైళ్ళు


నేలమీద అన్నిటికన్నా లోతుగా తవ్విన గుంట లోతు:


40,226 అడుగులు


(దీన్ని రష్యాలోని కోలా పెనిన్సులా తవ్వారు)


భూమి లోపల ఉందనుకుంటున్న వేడి:


12,600 డిగ్రీలు ఫారన్ హైట్


(ఇది సూర్యుని ఉపరితలం వేడికన్నా ఎక్కువ!)నాభి.. గరిమనాభి

November 14th, 2010

నారీస్తనభర నాభీదేశం, మెహావేశం కలిగిస్తుందని హెచ్చరించారు ఆది శంకరులు. పరిశోధకులు మాత్రం, నాభికి, గరిమనాభికి, పరుగు పందాలు, ఈత పోటీల్లో గెలుపులకు సంబంధాలు ఉన్నాయంటున్నారు.


పరుగుల పోటీల్లో, ఈతపోటీల్లో గెలిచే వాళ్ల శరీర నిర్మాణం గురించి వంద సంవత్సరాల రికార్డులన్నీ తవ్వి తీసిన పరిశోధకులు, ఒక కొత్త సంగతి తెలుసుకున్నారు. పోటీలో పాల్గొనే వాళ్ళ ఒడ్డూ పొడుగులతో బాటు వాళ్ళ శరీరంలో ‘బొడ్డు’కు ముఖ్యపాత్ర ఉందంటున్నారు. బొడ్డులోతుగా ఉందా, ఉబ్బెత్తుగా ఉందా అన్నది కాదు ఇక్కడి సమస్య. మొత్తం శరీరంతో పోలిస్తే బొడ్డు ఎక్కడ, ఎంత ఎత్తుదగ్గర ఉందన్నది ముఖ్యమట. ఇంటర్‌నేషనల్ జర్నల్ ఆఫ్ డివిజన్ అండ్ నేచర్ అండ్ ఈకోడైనమిక్స్ అన్న పత్రికలో ఈ విషయం ప్రచురించారు.


శరీరం గరిమనాభి. నాభిదగ్గర ఉంటుంది. పరుగు పోటీలో, ఈత పోటీలో ఒకే ఎత్తుగల ఇద్దరు వ్యక్తులు పాల్గొంటున్నారు అనుకుందాం. అందులో ఒకరు ఆఫ్రికా, మరొకరు యూరపు నుంచి వచ్చిన వారు అనుకుందాం. అసలు వాళ్ళ ఎత్తు గురించి పట్టించుకోనవసరం లేదు. వాళ్ళ బొడ్డు నేల నుంచి ఎంత ఎత్తున ఉందన్నది పట్టించుకోవాలి. అది శరీరం తాలూకు గరిమనాభిని నిర్ణయిస్తుంది. శరీర నిర్మాణం పద్ధతులను బట్టి, యారపువాళ్ళు కన్నా ఆఫ్రికన్ వారిలో బొడ్డు కొంచెం ఎక్కువ ఎత్తులో ఉంటుంది. అందుకే ఆఫ్రికావాసులు పరుగుల పోటీల్లో ఎక్కువగా గెలుస్తుంటారు. (ఆఫ్రికావాసులు అనడం కన్నా ఆఫ్రికన్ జాతివారు అనడం సమంజసంగా ఉంటుంది).


యూరోపియన్ క్రీడాకారులకన్నా, ఆఫ్రికన్ వారికి కాళ్ళు ఎక్కువ పొడుగ్గా ఉంటాయి. అంటే వాళ్ళ బొడ్డు కనీసం మూడు సెంటిమీటర్లు ఎక్కువ ఎత్తున ఉంటుంది. ఆ రకంగా ఆఫ్రికావారికి కనబడని ఎత్తు శరీరానికి కలిసినట్టు లెక్క. అది 3 శాతం ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. దానివల్ల వాళ్ళకు అదనంగా వేగం వీలవుతుందట. ‘ముందుకు కదలడమంటే, ముందుకు పడిపోవడమే. మరి ఎంత ఎత్తు నుంచి పడితే అంత వేగంగా పడతాం కనుక ఎత్తయినవారు వేగంగా ముందుకు కదులుతారు’ అంటారు డ్యూక్ యూనివర్శిటీ పరిశోధకులు ప్రొ. ఆంద్రే బెజాన్. ఆఫ్రికా జాతుల వారి పరుగుల రహస్యం అదన్నమాట.


ఇక ఈత కొలనులో పోటీ మరోరకంగా ఉంటుంది. అక్కడ యూరోపియన్ రకం శరీరాలకు అడ్వాంటేజ్ ఉందంటున్నారు బొడ్డుకన్నా పైభాగం శరీరం ఎక్కువ పొడవుండడం. అందుకు కారణం అంటే శరీరంలో బొడ్డు, తక్కువ ఎత్తులో ఉంటే ఈత బాగా కుదురుతుందని అర్థం! ‘శరీరంతో అలలను పుట్టించి, ఆ అలలమీద తేలుతు ముందుకు వెళ్ళడమే ఈత’ అంటారు బేజన్. అంటే, ఎంత పెద్ద అలను పుట్టించగలిగితే అంత వేగంగా, నీటిమీద ముందుకు సాగవచ్చునని అర్థం! శరీరంలో పై భాగం ఎంత పెద్దదయితే అంత పెద్ద అలను పుట్టించవచ్చు. ఇందాకటి లెక్కల ప్రకారం యూరోపియనుల శరీరంలో పైభాగం మూడు శాతం ఎక్కువ. అంటే వాళ్లవేగం కూడా అంత ఎక్కువేగదా! ఒకే ఎత్తున్నా, బొడ్డు తక్కువ ఎత్తున ఉన్న వాళ్ళు బాగా ఈదగలుగుతారని తేలింది.


ఆఫ్రికన్‌లు పరుగు పందాలలో, యూరోపియనులు ఈతకొలనులో విజయం సాధించడం వెనుక ఇంతటి రసహ్యం ఉందన్నమాట. ఇక మరి ఆసియావాసుల సంగతేమిటి? ఆసియావారికి కూడా యూరపు వారికి లాగే కాళ్ళకన్నా, శరీరంలో పై భాగమే ఎక్కువట. ఆ రకంగా ఇక్కడి వారు ఈతలకు బాగా పనికివస్తారని చెప్పవచ్చు. కానీ యూరోపియనులు సాధారణంగా ఎత్తరులు. గనుక ఆసియనులు వాళ్ళతో పోటీలో గెలవడం లేదు. ఇంతకాలం ఈ ‘బొడ్డు’ విషయం ఎందుకు రహస్యంగా ఉండిపోయిందో తెలుసా? నల్లజాతివారు పరుగులకు, తెల్లజాతివారు ఈతకు అంటూ జాతి గురించి చెప్పవలసి వస్తుందని, పరిశోధకులంతా ఈ అంశానే్న ఎత్తుకోలేదంట.


‘‘మేము క్రీడాకారుల ప్రాంతం. శరీర నిర్మాణం గురించి పట్టించుకున్నాము. వారి జాతి గురించి కానే కాదు’’ అంటున్నారు. బేజన్ బృందంవారు. వాషింగ్టన్‌లని హోవర్డ్ యూనివర్శిటీ ప్రొఫెర్ ఎడ్వర్డ్ జోన్స్, మరొక విద్యార్థి జోర్డన్ ఛార్ల్స్ ఈ పరిశోధనల్లో పాల్గొన్నారు.

Let us enjoy Science!
!!!!!


1 comment:

మాగంటి వంశీ మోహన్ said...

నాభి.. గరిమనాభి

Topic was very interesting. Thank you