Thursday, December 9, 2010

Dr. Dilavar - Book

Here is a review of a fine book by Dr. Dilavar of Paloncha, Khammam.
Yes, I have written this review!
And it was published in Andhra Bhoomi Sunday!
దూరాల చేరువలో మనం! -వి.జి

దూరాల చేరువలో... ప్రపంచ సాహిత్యం- కొన్ని పుటలు: - డా.దిలావర్,
వెల: రూ.100/-లు,
ప్రతులకు: డాక్టర్ దిలావర్,
ఎఐఐఎల్ క్యాంపస్, గాంధీనగర్, పాల్వంచ, ఖమ్మం జిల్లా- 507514.
--------------------------

దేశంలో ఎన్నారయ్ తలిదండ్రులు ఎక్కువయ్యారు. వాళ్లందరూ ఎప్పుడో ఒకసారి విదేశాలకు వెళతారు. తమ పిల్లలకు సాయపడి (ముఖ్యంగా పురుళ్లలో) నాలుగు ప్రదేశాలను చూచి తిరిగి వస్తారు. డా.దిలావర్ కూడా రెండుసార్లు అమెరికా వెళ్లారు. ఆయన అక్కడ గోళ్లుగిల్లుతూ కూచోలేదు. పుస్తకాల దుకాణాలు (బ్యార్నెస్ అండ్ నోబుల్ అనాలేమో?) లైబ్రరీలను ఆశ్రయించారు. ఆయన మాటల్లో ‘‘పరీక్షకు కూచునే విద్యార్థిలా, మిక్కిలి శ్రద్ధగా, పుస్తకాల్లో పూర్తిగా నిమగ్నమై’’ చదివారు.

దిలావర్ తెలుగు పండితులు, పరిశోధకులు, స్వతహాగా కవి. కనుక ఆయన అక్కడ ఉన్న సంవత్సర కాలంలోనూ ‘ప్రపంచ కవితను’ అందునా సమకాలీన కవితను బాగా చదివారు. పరీక్షకు గదా చదివింది! కనుక నోట్స్ రాసుకున్నారు. తిరిగి వచ్చి తెలుగులో వ్యాసాలు రాసి, వివిధ పత్రికల్లో ప్రచురించారు. ఇప్పుడు అలాంటి 18 వ్యాసాలను ఒకచోట చేర్చి పుస్తకంగా అందించారు. పుస్తకం పేరు ‘దూరాల చేరువలో...’ ప్రపంచ సాహిత్యం, కొన్ని పుటలు అని మరో చిన్న పేరు. సాహిత్యప్రియులు, అందునా కవితా పిపాసువులకు ప్రపంచంలోని వివిధ దేశాలు కవిత ఈ పుస్తకంతో చేరువయింది.

ఇలాంటి వ్యాసాలు, ఇంత మంచి వ్యాసాలు, పుస్తకంగా వచ్చినందుకు సాహిత్యప్రియులందరూ సంతోషిస్తారు.

‘ననె్నందుకు ముందుమాట రాయమన్నాడు?’ అంటూనే ప్రఖ్యాత కవి వరవరరావుగారు ‘ప్రపంచ సాహిత్య వీధుల్లో..’అనే శీర్షికతో చాలా మంచి ముందుమాట రాశారు. అది పుస్తకం విలువను మరింత పెంచేదిగా ఉంది. వరవరరావుగారు కొన్ని మాటలు చాలు, పుస్తకం గురించి తెలుసుకోవడానికి.

‘‘ఆయన ప్రపంచ సాహిత్యాలన్నిటినీ ఒక సమాహారంగా చూసాడు. దేశ భాషా విభిన్నత్వమే తప్ప మానుష, భావ భిన్నత్వాలు లేవు.’’

‘‘సార్వజనీనమయిన మానవాంశాలు అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో ఇంచుమించు ఒకే తీరుగా ఉండడాన్ని ఆయన పట్టుకోగలిగాడు.

‘ఫలానా దేశంలో, ఫలానా కాలంలో మన అనుభవం వంటిదే ఉన్నదే, అనుకోవడమే దూరాలు చేరువ కావడం!’

‘వ్యాసాల్లో కవిత్వ పరిచయం కాకుండా ఉన్నవి రెండే’’

ఇక గమనించవలసిన విషయాలు మరిన్ని ఉన్నాయి. పరిచయం చేస్తున్న వివిధ భాషా కవితలను చక్కగా తెలుగులో రాసి అందించడం దిలావర్‌గారి కవితా శక్తికి ఒక నిదర్శనం.

‘ఓ క్షితిజరేఖా, ఓ కష్టతరమయిన స్వప్నమా!

అవిశ్రాంతంగా ముందుకు వెళుతూనే ఉంటావా? అన్నా

అది నా కళ్లలోని జ్వాల,

నా పలువరుసలోని మెరుపు,

నా నడుములోని వూపు,

నా పాదాలలోని సొగసు,

నేను స్త్రీ...

అన్నా, మనకు ఒక తెలుగు కవిత చదువుతున్న అనుభూతి కలుగుతుంది.

దిలావర్ మంచి కవి మాత్రమే కాదు. అనువాదకులు కూడా.

ఇక దిలావర్ స్ర్తి జన పక్షపాతి. బలహీన పక్షాల వకీలు, వేదన తెలిసిన మనిషి. స్ర్తిల సమస్యల గురించిన కవితలు ఎంచి అందించిన తీరుతో, అట్టమీద బొమ్మ అందుకు మరో ఉదాహరణ. ఆయనలోని వినయం, నిబద్ధత ‘ఆగుమాగుము తెరువరీ!’ అంటూ పుస్తకం చివరలో తన పరిచయాన్ని అందించడంతో తెలిసిపోతుంది. జపాను కవితలను గురించిన వ్యాసంలో ఆయన అలవోకగా ‘మనువులకు దేశకాలాదులతో పనిలేదు’. అని రాశారు. ‘అన్ని కాలాలలోనూ మనువులంటారని ఎంత సులభంగా, ఎంత బలంగా చెప్పారీయన’ అనిపించింది.

పాలస్తీనా, ఆఫ్రికాల కవిత, వియత్నాం, ఇరాక్, మెక్సికో, చైనా, అరబ్ మధ్యలో మవులాలీ జలాలుద్దీన్ రూమీ! ఎన్ని దూరాలు, ఈ పుస్తకంలో మనకు చేరువయ్యాయి.

అక్కడక్కడ అచ్చుతప్పులు ‘యానోభద్రా’, ‘తీన్‌మెయిన్’ తప్పలేదు. మొత్తానికి ‘దూరాల చేరువలో...’ అందరూ జాగ్రత్తగా చదవవలసిన పుస్తకం. దాంతో మనకు, ప్రపంచంతో పరిచయం పెరుగుతుంది.

Let us enjoy some good books!
&&&&&

No comments: