Monday, December 20, 2010

Medha 06-12-2010

Here is the content of the Medha page published on 6th December 2010

చక్కెర - కొన్ని సంగతులు.
December 6th, 2010


భారతదేశంలో రెండువేల సంవత్సరాల క్రితం నుంచే చెరుకు నుంచి చక్కెర తయారు చేశారు. అలెగ్జాండరుతో బాటు వచ్చిన వారు తేనెటీగలు లేని తెనెను చూచి ఆశ్చర్యపోయార్ట.


బీట్‌రూట్‌లో కూడా చెరుకులో ఉన్నలాంటి చక్కెర ఉంటుందని 1747లో జెర్మన్ రసాయనశాస్తవ్రేత్త ఆండియస్ మార్‌గ్రఫ్ కనుకొన్నాడు.


చక్కెరకు బదులుగా సకారిన్, ఆహ్పార్లేమ్ అనే రసాయనాలను వాడుతున్నారు. కానీ వాటిని అలా వాడాలని మాత్రం ఎవరూ పరిశోధించి తయారు చేయలేదు. మరేదో పరిశోధన చేస్తున్న వారు వాటిని తిని చూడడం, రుచి బాగుండడంతో అవి వాడకంలోకి వచ్చాయి.


లుగ్డునేమ్ అనే ఒక రసాయనం అన్నింటికన్నా తీయనిదని గమనించారు. మామూలు చక్కెర కన్నా అది రెండు లక్షల రెట్లు ఎక్కువ తీపిగా ఉంటుంది!


చక్కెరలన్నీ కార్బన్, హైడ్రోజెన్, ఆక్సిజన్‌ల కలయికతో తయారవుతాయి. ఈ మూడు మామూలుగా అంతటా ఉండే రసాయనాలు. వాటికి తీపి ఉండనే ఉండదు.


అమెరికాలో ఒక్కొక్కరు ఏటా సగటున 61 పౌండ్ల చక్కెర తింటారట. అందులో సుమారు సగం ‘కాండీ’ రూపంలో తింటారు.


చక్కెర ఎక్కువగా తింటే ముఖంమీద ముడతలు త్వరగా పడతాయి.



ఏరోసోల్ కాలుష్యం.
December 6th, 2010

ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా భారతదేశం మీది గాలులలో ఏరోసోల్ కాలుష్యం మరీ ఎక్కువయిందని పరిశోధకులు గుర్తించారు. అందులో కొంత పరిశ్రమలు, వ్యవసాయాల కారణంగా వస్తున్నది. మిగతాది ప్రకృతి నుంచి వస్తుంది. ఏరోసోల్ కాలుష్యం మోతాదు, ఆ కణాల సైజు, అవి వచ్చే తీరు మొదలయిన అంశాలు రుతువులను బట్టి మారుతున్నట్లు ఈ సంవత్సరం జరిగిన పరిశోధనల్లో తెలిసింది. ఏరోసోల్స్ అంటే సూక్ష్మమయిన దుమ్ము, ద్రవం కణాలు. అవి అగ్నిపర్వతాలు, ఇసుక, తుఫానులు, ఉప్పు, సముద్రంలోని తుంపరులు మొదలయిన కారణాల వల్ల గాలిలో చేరుకుంటాయి. ఏరోసోల్స్‌లో 90 శాతం వరకు ఈ రకంగా ప్రకృతి నుండి వచ్చేవే. అవన్నీ పెద్ద కణాలుగా ఉంటాయి. మిగతా ఏరోసోల్స్ మనిషి చేస్తున్న పనులవల్ల వస్తాయి. సల్ఫేట్స్, నల్లని బ్రౌన్ రకాల కార్బన్, శిలాజ ఇంధనాలయిన పెట్రోల్, డీజెల్ వాడకంవల్ల వచ్చేవి, చివరగా వ్యవసాయం కారణంగా గాలిలో చేరేవి, ఈ రకం కిందికి లెక్కలోకి వస్తాయి. మనుషుల వల్ల పుట్టే ఈ రకం ఏరోసోల్ కణాలు చిన్నవిగా ఉంటాయి. వాటివల్ల మన ఊపిరితిత్తులకు ఎంతో హానీ కలుగుతుంది. ఇలినాయిస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు సాజ్ఞిక్ డే, లారీ ఉగిరొలామో కలిసి తొమ్మిది సంవత్సరాలు ఏరోసోల్ సమాచారాన్ని సేకరించి, పరిశీలించారు. సీజన్, ప్రదేశాల ప్రకారం వాటి మార్పులను లెక్క వేశారు. జ్హ్జీ వారు నిర్ణయించిన మోతాదుకన్నా భారతదేశం మీద ఈ కాలుష్యం బాగా ఎక్కువగా ఉందని తెలిసింది. అది పరిమితకన్నా రెండు నుంచి అయిదు రెట్లు ఎక్కువ ఉంటున్నది. వర్షకాలానికి ముందు సముద్రం మీద నుంచి గాలులు భూమి మీదకు వస్తాయి. అప్పుడు ఆఫ్రికా, అరేబియన్ ద్వీపకల్పం దుమ్ము ఇక్కడికి చేరుతుంది. వర్షాలకు ముందు కాలుష్యం మరీ ఎక్కువవుతుంది. ఇందులో దుమ్ముతో బాటు, మనిషి కారణంగా వచ్చే కాలుష్యం కూడా భారీగా ఉంటుంది. వర్షాలతో ఈ దుమ్ము, మనికిందకు వచ్చేస్తాయి. అప్పుడిక మనిషివల్ల జరిగే కాలుష్యం ప్రభావం మరింత ఎక్కువవుతుంది. చలికాలంలో సముద్రం మీదకు వీచే గాలుల కారణంగా కాలుష్యం, దేశంమీద అన్ని భాగాలకు పరుచుకుంటుంది. నాసావారి టెర్రా అనే అంతరిక్ష నౌకలోని కెమెరాల సాయంతో సమాచారం సేకరించి చిత్రాలుగా తయారు చేశారు. ఎరుపురంగుగల చిత్రంలో ఏరోసోల్ పరుచుకునే మందం కనబడుతుంది. మరో చిత్రంలో ఆ కాలుష్యం, ప్రకృతి నుంచి, మనిషి కారణంగా వచ్చే తీరు కనబడుతుంది. కాలుష్యం గురించి కనీసం తెలిసి ఉంటే, జాగ్రత్తల సంగతి తర్వాత వస్తుంది.


నీటి దశలు....December 6th, 2010



సహజంగా ఓకేసారి ఘన, ద్రవ, వాయు రూపాలలో కనిపించేది నీరు ఒకటే. ఈ స్థితుల వేడిమి, ఒత్తిడిలులో
తేడా కూడా తక్కువే. యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ (యు.ఎస్)లోని ఈ దృశ్యం మనకు ఆశ్చర్యం కలిగించక మానదు!

నవ సయిన్స్!.
December 6th, 2010

అది కాలాపానీ లాంటి అధ్వాన్నమయిన జైలు. అందులోని ఒక సెల్‌లో ఒక ముసలాయన ఉన్నాడు. అదే సెల్‌లోకి మరొక కుర్రవాడిని కూడా తెచ్చి తోశారు. కుర్రవాడు అస్తమానమూ తప్పించుకోవడం గురించి ఆలోచిస్తుంటాడు. రకరకాల ప్లానులు చెపుతుంటాడు. కొన్ని నెలలు గడిచాయి. ఒక రోజున అతను తప్పించుకు పారిపోయాడు. ఒక వారం రోజులయింది. పోలీసులు అతడిని మళ్లీ లాక్కుతెచ్చి అదే సెల్‌లో తోశారు.


అతను సగం చచ్చి ఉన్నాడు. ఆకలి దప్పితో నకనక లాడుతున్నాడు. తన ప్రయత్నం ఎంత నిరర్దకంగా ఉందని పెద్దాయనకు వివరించసాగాడతను. దారి దొరకలేదని, ప్రాణం మీదకు వచ్చిందనీ ఏవేవో చెప్పాడు. పెద్దాయన అంతా విని ‘నాకు తెలుసు!’ అన్నాడు. ‘ఎలాగంటావా? నీవు వేసిన పథకాలను 20 ఏళ్ళ క్రితమే నేను ప్రయోగించి చూశానన్నాడు. ‘్ఛ! మరి నాకు చెప్పలేదు ఎందుకని?’ అన్నాడు కుర్రవాడు. ముసలతను భుజాలెగరేసి ‘నెగెటివ్ రిజల్ట్స్‌ను ఎవరూ పట్టించుకోరుగద!’ అన్నాడు. (జోకును వివరించడం కన్నా జోకు మరోటి ఉండదు. సైన్సులో ప్రయోగాలు చేసి ఫలితాలను ప్రత్యేక పత్రికలలో ప్రచురించడం పరిశోధకులకు అలవాటు. అలాంటి పత్రికలలో మామూలుగా ‘పని చేయని ప్రయోగాలను’ గురించి అంతగా పట్టించుకోరు!).

ప్ర: ఒక లైటు బల్బును మార్చడానికి ఎంతమంది నాసా యింజినీర్లు అవసరం?


జ: పది మంది. ఒకరు బల్బు మార్చడానికి. తొమ్మిది మంది లెక్కలు కట్టడానికి! (మళ్లీ జోకుకు వివరణ! మరి జోకు పేలాలి గద! ఈ లైటు బల్బును మార్చడం గురించి లెక్కలేనన్ని జోకులున్నాయి. ఉదాహరణలు చూడండి. మీకే అర్థమవుతుంది).


ప్ర: లైట్ బల్బును మార్చడానికి ఎంతమంది పొలిటీషియన్స్ అవసరం?


జ-1: ఇద్దరు! ఒకరు బల్బు మార్చడానికి. ఇంకొకరు దాన్ని తీసేయడానికి!


జ-2: నలుగురు. ఒకరు బల్బు మార్చడానికి. మిగతావారు అసలేం మారలేదని స్టేట్‌మెంట్స్ యివ్వడానికి.


ప్ర: లైటు బల్బు మార్చడానికి ఎంతమంది ఎంపీలు అవసరం?


జ: 21 మంది. ఒకరు బల్బు మార్చడానికి. 20 మంది ఆ విషయంగా పార్లమెంటరీ కమిటీలో పని చేయడానికి!



వాతావరణంతో(లో) మార్పులు.December 6th, 2010

ప్రపంచ వాతావరణం వేడెక్కుతున్నందుకు అంతటా నష్టమే కలుగుతుందనడానికి లేదు. కొన్నిచోట్ల ఈ ప్రభావంవల్ల మంచి జరుగుతుందట! చూడండి!

బారతదేశంలోని పశ్చిమ భాగంలో, వాతావరణంలో తేమ తగ్గుతుంది. కనుక అక్కడ దోమలు తగ్గుతాయి.. మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులతో బాటు మరికొన్ని వ్యాధులు కూడా తగ్గుతాయని సూచన.

ఉత్తర అమెరికా, యూరపులలోని స్కీ (మంచుమీద జారే ఆట) రిసార్ట్‌లు కొండలమీద మరింత ఎత్తులకు వెళ్లవలసి ఉంటుంది. దిగువ ప్రాంతాలలో మంచుకరుగుతుందన్నమాట! ఇప్పుడున్న రిసార్ట్‌లలో మంచులేక అవన్నీ స్పా లేక కెసనోలుగా మారుతాయి. భారతదేశంలో స్కీ రిసార్ట్‌లు మొదలవుతాయని గతంలోనే ఊహించారు. అంటే ఇక్కడ వాతావరణం ఈ ఆటకు అనుకూలంగా మారుతుందని అర్థం! ఇక మంచిదో చెడ్డదో చెప్పలేని పరిస్థితులు మరికొన్ని ఉన్నాయి.

భారతదేశంలో మాన్‌సూన్ అనే రుతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తాయి. ఈ పవనాలు తీరు మారిపోయిందని ఇప్పటికే గుర్తించారు. పైగా హిమాలయాల మీద మంచు కరిగితే, ఉత్తర భారతపు నదుల తీరు కూడా మారుతుంది. మన దేశం, చైనాల చివరికి మంచి నీటి కోసం సముద్రం మీద ఆధారపడవలసి ఉంటుంది. అప్పుడు సముద్రం నీటి నుంచి మంచినీటిని తయారు చేసే డీసెలైనేషన్ కంపెనీలకు గిరాకీ పెరుగుతుంది!

చలి దేశాల వారికి ఇళ్ళను వేడిగా ఉంచుకోవడానికి ఎక్కువగా చమురు అవసరం. రష్యాలో నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి గనుక, యూరోపియన్ దేశాలు రష్యా బెదిరింపులకు తల ఒగ్గుతుంటారు. చలి తగ్గితే చమురు అవసరం తగ్గుతుంది. రష్యా బెదిరింపులకు తావుండదు.

ఈలోగా జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ‘పొడి ప్రదేశాల’వుతాయి. అప్పుడు మంచినీరు ఎక్కువగా ఉన్న దేశాలకు గౌరవం, ఆదాయం పెరుగుతాయి. కెనడాకు డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం చమురు దేశాలున్న స్థితికి కెనడా చేరుతుంది.

కాలుష్యం కలిగించని ఇతనాల్‌కు ఇంధనంగా గిరాకీ పెరుగుతుంది. బ్రెజిల్ ప్రస్తుతం ఎక్కువగా ఇతనాల్‌ను తయారు చేస్తున్నది. వేడి కారణంగా కెనడా, రష్యా, గ్రీన్‌లాండ్‌లలో పంటపొలాల విస్తీర్ణం పెరిగిపోయి, అక్కడా చెరుకు పండిస్తారు. అక్కడా ఇతనాల్ తయారు చేస్తే వారికి ఆర్థికంగా మంచిరోజులు వస్తాయి.



అటుకుల రుచి చెడలేదు!.December 6th, 2010

వంటింట్లో వెతుకుతుంటే అప్పుడప్పుడూ చాలా కాలంగా అందరూ మరచిపోయిన తిండి వస్తువు ఏదో కనిపిస్తుంది. పాతది, కనుక, పనికిరాదని మనం అలాంటి వాటిని పడవేస్తాము. అలా పడవేయనవసరం లేదని, కొన్ని రకాల తిండి పదార్థాలు వాటి తేదీ ముగిసిన తర్వాత కూడా తినడానికి పనికివచ్చేవిగానే ఉంటాయని, సైంటిస్టులు అన్నారు. ఈ విషయం వండిన వస్తువుల గురించి మాత్రం కాదని వేరుగా చెప్పనవసరం లేదు!

సరిగ్గా సీల్ చేసి ఉంచిన తిండి పదార్థాలు, ముఖ్యంగా తడిలేనివి ఎంత కాలమయినా పాడుగాకుండా ఉంటాయని పరిశీలకులు గమనించారు.

‘తిండి వస్తువులు, మనం అనుకున్నదానికన్నా చాలా ఎక్కువ కాలం ఉంటాయి’ అంటారు ప్రోవో విశ్వవిద్యాలం పరిశోధకులు ఆస్కార్ పైక్! కరువు కాలంతో తినవచ్చునని ఒక పండితుడెవరో తమిద (రాగి) పిండితో గోడలు కట్టి పెట్టారని, పిన్నవయసులో విన్న కథ ఈ సందర్భంగా గుర్తుకు వచ్చింది.

చక్కెర, ఉప్పు లాంటి పదార్థాలను ఎంతకాలయినా నిలువచేసి పెట్టుకోవ్చునని తెలుసు. కానీ కూరగాయలు, పళ్ళవరుగల లాంటివి కూడా ఎంతకాలమయినా దాన్ని తినవచ్చనే వారూ ఉన్నారు. అత్యవసర పరిస్థితులలో తినడానికి తిండి దొరకనప్పుడు, కొన్ని రకాల తిండి ఉపయోగపడుతుంది. అది తాజా తిండితో పోల్చదగినది కాకపోవచ్చు. కానీ పడవేయవలసిన అవసరం కూడా లేదు.

తిండి వస్తువులను తేమ తగలకుండా ఉంచితే, ఎంతకాలమయినా ఉంటాయి. ఇక రెండవ సంగతి - వెలుగు, వేడిమి తగలకుండా ఉంచగలగడం ఈ రకంగా తిండిని దాచితే వాటిలోని ఆహారపు, పోషక విలువలు తరగకుండా ఉంటాయంటారు పరిశోధకులు. గాలి తగలకుండా సీల్ చేసి ఉంచిన పదార్థాలకు పురుగులు, బూజులు సోకవని తెలుసు.

ఓట్స్‌తో తయారు చేసిన అటుకులను 28 సంవత్సరాలు దాచి ఆ తర్వాత టెస్టర్ల చేత తినిపించి, నాణ్యతను పరిశీలించారు. ముప్పావు వంతు టేస్టర్లు ‘తాజాగా లేకపోవచ్చు గానీ ఈ అటుకులను తినడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు’ అన్నారు. అలాగే 20 సంవత్సరాల నాటి పాలపొడి గురించి కూడా పరిశీలనలు జరిగాయి. అదీ తినడానికి ‘బాగానే’ ఉందని తెలిసింది.

ఉప్పు, చక్కెరల్లాగే కొన్ని రకాల గింజలు, గోధుమలు వంటి వాటిని ఎంతకాలమయినా నిలువ ఉంచవచ్చని పరిశోధకులు అంటూనే ఉన్నారు. గింజలు వేరు, అటుకుల వంటివి వేరు గనుక ప్రాసెస్ చేసిన తిండి వస్తువుల గురించి పరిశోధించాలన్న ఆలోచన ఆహార శాస్తవ్రేత్తలకు వచ్చింది. అప్పుడు ఈ 28 సంవత్సరాల నాటి అటుకుల పరిశోధన మొదలయింది.

అటుకుల వాసన, చేతికీ నోటికీ తగిలే తీరు, రుచి, నోట్లో మిగిలేరుచి మొత్తంమీద తినడానికి యోగ్యత అనే అంశాలను చెప్పవలసిందిగా ‘రుచి’ నిపుణులను అడిగారు. పదార్థంలోని పోషక విలువల స్థాయిని కూడా పరిశీలించారు. అటుకులకు 48 నుంచి 67 వరకు మార్కులు పడ్డాయి.

ఇంతకూ ఈ రకమయిన తిండి వస్తువులు ఎందుకు పాడవుతాయి అన్నది ప్రశ్న! వాటిని తయారు చేసిన పద్ధతి ఒక ఎత్తు నిలువ ఉంచిన తీరు మరొక ఎత్తు. తిండి వస్తువులకు వేడి, ప్రాణవాయవు ఎక్కువ తగిలితే వాటి నాణ్యత సులభంగా తరిగిపోతుంది. పండ్ల పదార్థాలను నిలువ ఉంచాలంటే చక్కెర పానకంలో పెడతారు. కొన్ని పదార్థాలను ఉప్పు కలిపి ఉంచుతారు. మన దేశంలో ఉప్పువరుగులు, ఉసిరి వడలు మొదలయినవి ఎంత కాలమయినా పాడవకుండా ఉండడం తెలుసు. కొత్త పద్ధతులు వచ్చిన తర్వాత ఫ్రిజర్వేటివ్స్, ఆంటి ఆక్సిదాంట్స్ అనే రసాయనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్నింటిని వాడడం వల్ల ఆరోగ్యానికి హానీ కలుగుతుందని నిర్ణయించి నిషేధించారు. కొన్నింటిని అనుమతించారు.

మన దేశంలో ఇంకా డబ్బాలలో సీల్‌చేసి తిండి పదార్థాలను దాచడం అంతగా అలవాటు కాలేదు. తేమ, వేడి ఎక్కువ గనుక మన దగ్గర తిండి త్వరగా పాడవుతుంది. ఇక సంవత్సరాల పాటు తిండి తాచడం గురించి మనకు ఆలోచనే రాదేమో!

Let us enjoy learning!
$$$$$

No comments: