Monday, December 29, 2025

లోకాభిరామం - నాణానికి అటు ఇటు : ఆర్వీయార్ గురించి Lokabhiramam - Two sid...

లోకాభిరామం - నాణానికి అటు ఇటు

ఆర్వీయార్ గురించి

ఆర్వీయార్‌

నాకు ముగ్గురు ఆర్వీయార్‌లతో మంచి పరిచయమైంది. ముగ్గురి గురించీ చెప్పవలసింది శాననే ఉంది. ఈ ముగ్గురిలో ఒకాయన నిజానికి ఉట్టి ఆర్వీయార్‌ కాదు. ఆయన పూర్తి పేరు ఆర్వీయార్‌ చంద్రశేఖరరావు. ఆయన గురించి నా బ్లాగు లోకాభిరామంలో 2007లోనే రాశాను. ఆయనతో నిజానికి నాకు అంతగా పరిచయం లేదు. పరిచయం కలగడం అదొక అనుభూతి. అనుభవం. అప్పట్లో చంద్రశేఖరరావు గారు ఎ.పి. ఓపెన్‌ యూనివర్సిటీకి వైస్‌ చాన్సలర్‌గా ఉన్నారు. ఆ యూనివర్సిటీ వారు, నన్ను ఒక పాఠం చెప్పమని పిలిచారు. నేను జంతుశాస్త్రం చదువుకున్నాను. రెండేండ్లు పాఠాలు చెప్పడానికి చేసిన ప్రయత్నం నిజానికి చేదు అనుభవంగా మిగిలింది. అయినా సరే మిత్రులను నొప్పించలేక పాఠం చెప్పడానికి వెళ్లాను. అక్కడ విద్యార్థులుండరు. పాఠం రికార్డు చేసి, అవసరమైన చోట వినిపిస్తారు. రికార్డింగ్‌ ముగిసింది. మిత్రులు ఉమాపతి వర్మ, మా వీసీ గారిని కలుద్దాం. ఆయన సంతోషిస్తారు అన్నాడు. ఆయన మరీ పెద్ద మనిషి. జగమెరిగిన వ్యక్తి. నేనొక కుర్ర ఆఫీసరును మాత్రమే. ఆయనను కలవడానికి కొంచెం జంకినట్లే గుర్తు. ఆశ్చర్యంగా ఆయనకు నా గురించి అప్పటికే తెలుసు! అదీ పెద్దవాళ్ల పద్ధతి! అనిపించింది.

మాటల్లో పడ్డాము. వర్మగారు లేరక్కడ. పెద్దాయన, నేను ఇద్దరమే మిగిలాము. కాసేపు తరువాత ఆయన తన టేబుల్‌ దగ్గర కుర్చీలోంచి లేచి వచ్చి సోఫాలో కూర్చున్నారు. నేనూ అక్కడికే చేరాను. ఆ తరువాత మరెవరూ ఆ గదిలోకి రాలేదు. ఏ కాయితాలు, ఫైళ్లు తేలేదు. అది ఆయన పద్ధతి అయ్యుంటుందని అనుకున్నాను. చాలాసేపు మాట్లాడుకున్నాము. చాలా సంగతులు మాట్లాడుకున్నాము. నాకు నా వయసు పెరిగిన భావం కలిగింది. చివరికి వెళ్లిపోయే సమయం వచ్చింది. ‘మీ విలువైన సమయం పాడు చేసినట్లున్నాను’ అన్నాను

వినయంగా, ‘కాదు. సత్సంగం. మళ్లీమళ్లీ దొరకదు’ అన్నారాయన. నా నోట మాట రాలేదు.

ఆ తరువాత నేను వారి ఆఫీసుకు వెళ్లినట్టు గుర్తు లేదు. ఆయన మాత్రం ఎప్పుడు మా ఆఫీసుకు, ఆఫీసు వేపు వచ్చినా నా దగ్గరకు వచ్చి కూచునేవారు. ఆయన అన్ని రకాల పెద్దమనిషి. తమ్ముని వలె నన్ను అభిమానించారు. ఒకసారి ఆయన వచ్చినప్పుడు నా ముందర, ఒక సీడీ ఎన్‌సైక్లోపిడియా ఉంది. పాతకాలం మనిషి గనుక ఆయనకు అది కొత్తగా కనిపించింది. ఆయన చిన్నపిల్ల వాడయిపోయి, ప్రశ్నలడగడం మొదలు పెట్టారు. వంద ప్రశ్నలడిగారు. అంతటి వ్యక్తికి నేనేదో కొత్తగా చూపుతున్నానన్న సంతోషం నన్ను ముంచె త్తింది. ఇద్దరమూ కంప్యూటర్‌ ముందర ఎంతో కాలం గడిపాము.

ఆయన ఉన్నట్టుండి ‘లాస్ట్‌ సప్పర్‌’ అనే పెయింటింగ్‌ ఉంటుందా, ఇందులో?’ అని అడిగారు. అది నిజంగా ఉంది. రావుగారికి చిత్రకళ మీద చాలా అభిమానం, ఆసక్తి ఉన్నట్లున్నాయి. ఆయన ఒక సర్వస్వంగా మారిపోయి, జీసస్‌ లాస్ట్‌ సప్పర్‌ గురించి చెప్పసాగారు. (ఎన్‌సైక్లోపిడియా బ్రిటానికాలో ఆంధ్ర ప్రదేశ్‌ గురించిన వ్యాసం ఆయన రాశారని నాకు తరువాత తెలిసింది) లాస్ట్‌ సప్పర్‌ పెయింటింగ్‌లో ఒక మనిషి బొమ్మను తుడిపేశారని రావుగారు చూపిస్తుంటే, ఆశ్చర్యం నావంతయింది. ఆ తరువాత ఆ విషయం గురించి చాలానే చదివాను. పెయింటింగ్‌ సంగతేమో గానీ, చంద్రశేఖరరావుగారిలోని ఆ కుతూహలం, ప్రశ్నలడిగిన తీరు, నన్ను ఎంతగా ప్రభావితుడిని చేసినయో చెప్పలేను.

నేను కొంతకాలం హైదరాబాద్‌ వదిలి వెళ్లవలసి వచ్చింది. రావుగారు కెనడాలో కామన్వెల్త్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ అనే అంతర్జాతీయ సంస్థలో పెద్ద హోదాలో వెళ్లి పని చేశారు. నేను తిరిగి హైదరాబాద్‌ వచ్చాను. ఆయన కూడా వచ్చారు. నాకాయన గుర్తుండడంలో గొప్ప లేదు. కానీ ఆయన నన్ను గుర్తుంచుకున్నారు. చెప్పాపెట్టకుండా మా ఆఫీసుకు వచ్చారు. నా పి.ఎ. దగ్గరకు వెళ్లి నా గదిలోకి రావడానికి అనుమతి అడుగుతున్నారు. నా గుండె గొంతుకలోకి వచ్చింది. లేచి ఎదురెళ్లి లోనికి తెచ్చాను. ఆయన అదే ఉత్సాహంతో పిల్లవానివలె ముచ్చట సాగించారు. ‘ఏం చదువుతున్నావు?’ అని అడిగారు. తాము చదువుతున్న పుస్తకం చూపించి, నీవూ చదువు, నేను ముగించిన తరువాత ఇస్తాను’ అన్నారు. నేను పుస్తకాలు చదువు తానని ఆయన గుర్తుంచుకున్నారు. అంతటి మహానుభావుడు నన్ను వెతుకుతూ వచ్చినందుకు నాకు కలిగిన భావాలను వర్ణించలేను. తరువాత ఆ లాస్ట్‌ సప్పర్‌ పెయింటింగ్‌ను మరెక్కడో చూచిన వెంటనే, ఆయన గుర్తొచ్చారు. బ్లాగు ఎంట్రీ రాశాను. అది చదివి, ఆయన విద్యార్థి ఒకరు మంచి కామెంటు రాశారు. ఇంకా కాలం గడిచింది. నేనే పనికిరాని వాణ్ణి. ఆయన ఎక్కడున్నారని కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు.

కూలి పని - కథ: 

బ్లాగులోకి పోతే చిత్రమైన కథ ఒకటి గుర్తొచ్చింది. మీరూ చదవండి. ఈ కథను ఆనా మారియా అనే ఆర్జెంటీనా రచయిత్రి రాసింది!!

మామూలు మనుషులు మా పనిని గురించి రకరకాలుగా ఆలోచిస్తారు. కానీ మా పని మాత్రం చాలా మామూలు రకం. అది, మీరు సినిమాల్లో చూచినట్టు మాత్రం ఉండదు. మా మొదటి అవకాశాలు మాత్రం మాకు బాగా గుర్తుండిపోతాయి. అందరూ అనుకున్నట్లు గాక, మాలో కూడా, అనుభవం గలవాళ్లు, అనుకూలం గాని పనులను, కష్టమైన వాటిని, అంతగా నచ్చని వాటిని ఒప్పుకోరు. అది మామూలుగానే కొత్త వారికి అందుతాయి. ఓ వంద డాలర్లిస్తే, ముసలాడి గొంతు పిసికేందుకు సిద్ధంగా ఉండే కుర్రవాళ్లు ఎప్పుడూ దొరుకుతారు మరి.

నేను నా మొదటి క్లయంట్‌, శ్రీమతి మెర్సిడస్‌ ఉల్లోవా గారి ముందు కూచున్నప్పుడు నిజంగా పనిలోకి కొత్తగా వచ్చినవాణ్ణి. నాకు కాస్త జంకుగా ఉందింకా. అంతకు ముందు కొంతమంది ప్రాణాలు తీశాను. నిజమే. కానీ అది దొంగతనాలు, కొట్లాటలలో భాగంగా మాత్రమే. ఈ వృత్తిలోకి దిగడంలో నాకు మరో గొప్ప వెసులుబాటుంది. నేనెప్పుడూ పట్టుబడింది లేదు.

నేనావిడను, వాళ్లింట్లో రాత్రిపూట కలిశాను. క్లయంట్లు సాధారణంగా మాతో నేరుగా మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ, ఈ డిజిటల్‌ యుగంలో, సాక్ష్యాలు మిగలకుండా ఉండడానికి, నేరుగా కలవడం కన్నా మంచి మార్గం ఇంకొకటి లేదు. నేను ఇంట్లోకి రావడం, ఎవరూ చూచే అవకాశమే లేదు. ఆవిడ నా కోసం తలుపు తెరిచే ఉంచింది. గంట మోగించాల్సిన అవసరం కూడా రాలేదు.

ఇంట్లో ఒక జంటకు సంబంధించిన కథలు చెపుతున్నట్లు బోలెడు ఫోటోలున్నాయి. మెర్సిడిస్‌ నీడగా ఉన్న తన గదిలో బల్ల ముందు కూచుని ఉంది. బొమ్మల్లో ఉన్న మనిషి ఆవిడేనని గుర్తించడం కష్టం కాదు. ఆవిడ ముసలిగా, వాచిపోయినట్టు ముతకగా ఉంది. కంపు గొడుతున్నది కూడా. ఆవిడ ఏ మాత్రం కాలయాపన చేయలేదు. సగం డబ్బు అప్పటికే బల్ల మీద పెట్టి ఉంది. ఆ గదినిండా వికారమయిన తీపి వాసన నిండి ఉంది. ‘నువ్వు నా భర్తను చంపేయాలి. బాత్‌ టబ్‌లో ముంచేయాలి.’ నేను అడ్డు తగిలాను. కారణాలతో నాకు పనిలేదు. ‘సరే! మరో రెండు రోజుల్లో...!’ ‘ఇప్పుడే!’ ‘అదిగో బాత్‌రూమ్‌’ ‘పిచ్చి ఆడది!’ అనుకున్నాను నేను. ఒకర్ని బాత్‌ టబ్‌లో చంపడమంటే, మురికి, కష్టంతో కూడుకున్న పని. కాళ్లను పాదాల దగ్గర పట్టుకుని మనిషిని చేతయినంతగా పైకి ఎత్తాలి. తల నీళ్లలో మునుగుతుంది. అలా మునిగిపోతున్న మనుషులు కాళ్లు చేతులు గట్టిగా కొట్టుకోవడం మామూలే. కానీ ఈ మనిషి ముసలతను. నాకదే బాధ. ఇక ఆలోచించకుండా, డబ్బులు జేబులో ఉంచుకుని పనిలోకి దిగాను. నా అనుమానం మాట అటుంచి పని అలా అలా ముగిసిపోయింది. బయటికి వచ్చేసరికి నా దుస్తులు తడిసి ఉన్నాయి. మిగతా డబ్బులు సిద్ధంగా బల్ల మీద ఉన్నాయి. నేను నా క్లయంట్‌ కోసం అటుయిటు చూచాను. కానీ ఆవిడ వెళ్లిపోయింది. బాత్‌రూం చప్పుళ్లు వినదలచుకోలేదేమో! ముసలతను ప్రమాదవశాత్తు చచ్చాడని నిర్ణయించడం కష్టం కాలేదు. వార్తాపత్రికల్లో రావడానికి అదేమంత ఆసక్తికరమయిన సంగతి కాదు. ప్రమాదవశాత్తు ఒక ముసలతను చచ్చాడని చాలా రోజుల తరువాత రాశారు. అతను కనిపించకపోయే సరికి పక్కింటి వాళ్లు పోలీసులకు ఫోన్‌ చేశారు. కుళ్లిన శవం దొరికింది. అతను ఒంటరి మనిషి. పిల్లలూ లేరు.

ఉల్లోవా కంపు గొట్టిందంటే ఆశ్చర్యం లేదు మరి-

అదీ కథ! - ఇంతకూ నాకు ఈ కథ ఎందుకు నచ్చింది? మీకు నచ్చిందా? నచ్చితే ఎందుకని?

కవిత: 

కఠినతర తర్క వాక్ప్రసంగముల వలన

కావ్య నిర్వచనము, సేయ పరుగుటెల్ల 

గడ్డపారలు, గొడ్డండ్లు, గదలు దెచ్చి

ముక్కుపోగు నమర్చెడు ముచ్చటగను

 - విద్వాన్‌ విశ్వం.



ఇసుక నురుగ 1 - ఖలిల్ జిబ్రాన్ కవితలు : Kahlil Gibran - Sand and Foam 1


ఇసుక   నురుగ 1 

ఖలిల్ జిబ్రాన్ కవితలు


Sand and Foam - ఇసుక నురగ

by Kahlil Gibran - ఖలిల్ జిబ్రాన్

 

I AM FOREVER walking upon these shores,

Betwixt the sand and the foam,

The high tide will erase my foot-prints,

And the wind will blow away the foam.

But the sea and the shore will remain

Forever.

 

నేను నిరంతంరం తీరాల మీద నడుస్తున్నాను

ఇసుక నురగల మధ్యన

అలలు పోటెత్తి నా అడుగుజాడలను తుడిపేస్తాయి.
ఇక గాలి నురగను ఊదేస్తుంది.
కానీ, సముద్రం తీరం మాత్రం ఉండిపోతాయి.

కలకాలమూనూ.

 

Once I filled my hand with mist.

Then I opened it and lo, the mist was a worm.

And I closed and opened my hand again

and behold there was a bird.

And again, I closed and opened my hand,

and in its hollow stood a man with a sad face, turned upward.

And again, I closed my hand, and

when I opened it there was naught but mist.

But I heard a song of exceeding sweetness

 

ఒకప్పుడు నా చేతిని తుహినజలంతో నింపుకున్నాను.చెయ్యి తెరిస్తే ఆశ్చర్యం,

నీరంతా ఒక పురుగయింది.ఇక మరో సారి నేను నా చేతిని మూసి తెరిచాను,

చూస్తే అందులో ఒక పక్షి ఉంది.
ఇక మరో సారి నేను నా చేతిని మూసి తెరిచాను,

  ఖాళీలో ఒక మనిషి ఏడుపుముఖంతో నిలుచున్నాడు, పైకి చూస్తూ.
ఇక మరో సారి నేను నా చేతిని మూశాను, దాన్ని

తెరిచినప్పుడు అందులో నీరు తప్ప మరేమీలేదు..

కానీ అంతులోని మాధుర్యంగల పాటవినబడింది.


It was but yesterday I thought myself

a fragment quivering without

rhythm in the sphere of life.
Now I know that I am the sphere, and all life in

rhythmic fragments moves within me.

 

నిన్ననేగదా నన్నునేను, జీవనగోళంలో

లయలేకుండా కదులుతున్న

శకలం అనుకున్నాను.ఇప్పుడు

నాకు, నేనే గోళాన్నని తెలుసు.

జీవమంతా లయబద్ధ శకలాలుగా

నాలోనే కదులుతుందనీ తెలుసు.


They say to me in their awakening, "You and the world you live

in are but a grain of sand upon the infinite shore of an infinite sea."

And in my dream I say to them, "I am the infinite sea, and

all worlds are but grains of sand upon my shore."

 

వాళ్లంతా మెలుకువగా ఉన్నప్పుడు నాతో చెపుతారు, నీవు, నీవుంటున్న ప్రపంచం,

అంతులేని సముద్రపు అంతులేని తీరం మీద ఒక్క ఇసుకరేణువు మాత్రమేనని.
ఇక నేను నా కలలో వారికి చెపుతాను, నేనే అంతులేని సముద్రాన్నని,

ప్రపంచాలన్నీ నా తీరం మీద ఇసుకరేణువులు మాత్రమేననీ.


 

Only once have I been made mute.

It was when a man asked me, "Who are you?"

 

నేనొక్కసారి మాత్రమే అవాక్కయ్యాను.

ఒక మనిషి నన్ను నీవెవరు అని అడిగినప్పుడు.


 

The first thought of God was an angel.

The first word of God was a man.

దేవుని మొదటి ఆలోచన ఒక దేవదూత.

దేవుని మొదటి పలుకు ఒక మనిషి.

 

We were fluttering, wandering, longing creatures

a thousand thousand years before the sea and

the wind in the forest gave us words.

Now how can we express the ancient of days in us

with only the sounds of our yesterdays?

 

 

మనమంతా, వేలవేల సంవత్సరాల క్రితం, సముద్రం, గాలీ, అడవి మనకు

మాటలు నేర్పక ముందు, కొట్టుమిట్టాడుతూ, తిరుగాడుతూ,

కోరికలు గల జీవులుగా ఉన్నాం.
ఇక మనం ఇప్పుడు, మనలోని దినాల పాతదనాన్ని,

నిన్నటి మాటలతో ఎట్లా తెలుపగలుగుతాం


 

The Sphinx spoke only once, and the Sphinx said,

"A grain of sand is a desert, and a desert is a grain of sand;

and now let us all be silent again."

I heard the Sphinx, but I did not understand.

 

స్ఫింక్స్ ఒకేసారి మాటాడింది, స్ఫింక్స్ అన్నదిగదా, ఒక్క ఇసుకరేణువే

ఎడారి, ఇక ఎడారి అంటే ఒక్క ఇసుకరేణువు మాత్రమే,

ఇక ఇప్పుడు మనం మళ్లా మౌనంగా ఉందాం అని.
నేను స్ఫింక్స్ మాటలు విన్నాను, కానీ నాకు అర్థంకాలేదు.