I don't have to tell that I am contributing the page!
ఎందుకొచ్చిన ఎత్తుమడమలు?.October 25th, 2010
ఎత్తుమడమల బూట్లంటే, ఎవరికిమాత్రం ఇష్టం ఉండదు? ఈ ప్రశ్నకు జవాబు ఎవరు చెపుతున్నారన్నది అసలు కిటుకు. మగవాళ్లు, ఎదుటనున్న అమ్మాయిలు ఏరకం జోళ్లు వేసుకున్నారని, మామూలుగా గమనించరు. అవును, ఈ విషయం గురించి కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.
ఎత్తుమడమల జోళ్లు వేసుకోవడం, మధ్య యుగం కాలంలో యూరపులో మొదలైందట. అప్పట్లో, కార్లూ వగైరా లేవు. చాలాదూరం నడుస్తూ తిరగడమే. బజార్లో ఉండే బురద, దుమ్ములనుంచి తప్పించుకునేందుకు ఈ పద్ధతి మొదలైంది. మనిషి మరికాస్త ఎత్తుగా, కాళ్లు మరింత అందంగా కనిపించే వీలుంది కనుక అది ఫాషన్ అయి కూర్చుంది.
కానీ అప్పటినుంచి అమ్మాయిలందరికీ ఈ ఫ్యాషన్‌లో నున్న కష్టం తెలుస్తునే ఉంది. మడమలో, పాదంలో నొప్పి పుడుతుంది. ఆ జోళ్లు వదిలేసి నడుస్తుంటే మనిషి నిలబడే తీరులో చిక్కులుంటాయి.
బోస్టన్ విశ్వవిద్యాలయంలోని పబ్లిక్ హెల్త్ శాఖలో 1900 మంది ఆడవారు, 1500మంది మగవారిని వలంటీర్లుగా వాడి, ఎత్తుమడమల బూట్లతో వచ్చే నొప్పి గురించి పరిశోధనలు చేశారు.
కాళ్లకు సరిగా పట్టని షూస్‌తోనే నొప్పి పుడుతుందనీ, హైహీల్స్ వల్ల ఆ నొప్పి మరింత ఎక్కువగా వుంటుందని తెలిసింది.
ఈ పరిశోధకులు బూట్లను మొత్తం మూడురకాలుగా విడదీసారు. మంచి, చెడ్డ, మధ్య రకాలనేవి ఈ మూడు రకాలు!
మంచిషూస్ అంటే, సోల్ గట్టిగా ఉంటుంది, మడమకు మంచి ఆధారం, పట్టు ఉంటాయి. చెడ్డరకానికి హైహీల్డ్ షూస్ శాండల్స్, స్లిప్పర్స్ ఉదాహరణలు. మధ్యరకంలో మెత్తని సోల్స్‌గల షూస్‌ను చేర్చారు.
కాళ్లనొప్పి, ఏదో ఒక సమయంలో అందరికీ వస్తుంది. నాలుగింట మూడువంతుల వారికి అది బాగా తెలుస్తుంది. అందునా అమ్మాయిలకు ఈ పాదం నొప్పి మరింత ఎక్కువ. ఎత్తు మడమల షూస్
వేసుకునే అమ్మాయిలకు నొప్పి మరీ మరీ ఎక్కువ. మంచి షూస్ వేసుకునే వారికి నొప్పి తక్కువగా వుంటుంది.
ఈ మధ్యన ఎక్స్‌పెరిమెంటల్ బయాలజీ అనే పరిశోధన పత్రికలో ఎత్తుమడమల జోళ్ల గుంచి ఇంగ్లండ్‌లో జరిగిన రిసెర్చ్ ఫలితాలు వచ్చాయి. ఎత్తుమడమల జోళ్ల కారణంగా చీలమండల దగ్గర కండరాలు, టెండన్స్ దెబ్బతింటాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. పిక్కలోని కండరం మొత్తం మీద మారకున్నా అందులోని కణాలు మాత్రం పొట్టివిగా మారుతున్నట్టు ఎమ్‌ఆర్‌ఐ పరీక్ష వల్ల తేలింది. ఇలాగే కొంతకాలం కొనసాగితే, చీలమండ వద్ద కీళ్ల కదలికలు తగ్గిపోతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
అప్పుడప్పుడు మార్చి మార్చి మామూలు జోళ్లు వాడాలి. లేదంటే మడమ కండరాలతో మంచి ఎక్స్‌ర్‌సైజ్ చేయాలి. హై హీల్స్ వల్ల కాలివేళ్ల మీద కూడా ఒత్తిడి పడుతుంది. మనిషి నడిచేటప్పుడు
గరిమనాభి కనీసం 10 సెంటీమీటర్ల ముందుకు మారుతుంది. దాంతో వీపులో కండరాల మీద అదనంగా బరువు పడుతుంది. వీపునొప్పితోపాటు మెడనొప్పికి కూడా ఈ పరిస్థితి దారి తీస్తుంది.
షూస్ కొనదలుచుకున్న వారికి ఆస్ట్రేలియన్ పోడియేటరీ అసోసియేషన్ వారు కొన్ని సలహాలిస్తున్నారు.
షూస్ పొడుగ్గా ఉండాలి. మడమమీద వేళ్లమీద ఒత్తిడి పడకుండా వుండాలి. మడమ కింద ఆధారం వెడల్పుగా ఉంటే మంచిది. దానివల్ల పాదం మీద ఒత్తిడి తగ్గుతుంది జారిపోయే షూస్‌కన్నా లేసులు, వెల్‌క్రో ఉండే రకాలు మేలు. కాలివేళ్లు ముడుచుకుకుండా లోపల కదిలే రకంగ ఉండడం అవసరం. షూ సోల్స్ జారిపోకుండా ఉండే పదార్ధతో చేసినవయితేనే మంచిది.
అట్లాగని పాతపద్ధతిని ఒక్కసారిగా మార్చుకుంటారా ఎవరైనా? కానీ, పెద్ద వయసునాటికి సమస్యలు ఉండగూడదంటే, ఈ సలహాలను పాటించడమే మంచిది!
తేనేటీగల తీరు!.October 25th, 2010
నగరాల్లో ఎత్తయిన ఇళ్ల బాల్కనీలలో కూడా తేనెపట్టులుంటున్నాయి. కానీ, నిజానికి తేనెపట్టుకోసం సరైన చోటు వెదికేందుకు తేనెటీగలకు గట్టి పద్ధతులున్నాయి. సరైన వాతావరణం రాగానే, గుంపులో మూడింట రెండు వంతుల వర్కర్ తేనెటీగలు, రాణిగారితో బాటు బయలుదేరతాయి. అన్నీ వెళ్లి ఏ చెట్టుమీదనో కూచుంటాయి. అక్కడినుంచి కొన్ని డజన్ల తేనెటీగలు మాత్రం బయలుదేరి చుట్టు ప్రాంతంలో అనువైన చోట్లను సర్వే చేస్తాయి. చెట్ల తొర్రలు, మిగతా చోట్లను అవి వెతుకుతుంటాయి. స్థలం దొరికిందంటే చాలు, ఆ తేనెటీగలు మిగతా గుంపు దగ్గరకు వచ్చి,
ఎత్తున, నాట్యమాడతాయి! ‘మా ప్రతాపం చూడండి!’ అన్నట్టు ఉంటుందా డాన్స్!
అనుకూలమైన ప్రదేశం అనడానికి ప్రతి చోటికీ కొన్ని లక్షణాలుండాలి. అలాంటి చోటిని కనుగొన్న తేనెటీగ ఎంతగా నాట్యమాడినా గుంపు సులభంగా ఒప్పుకోదు. ఈ పద్ధతిని చూస్తే మనుషులకన్నా తేనెటీగలే మేలనిపించక మానదు. నిర్ణయం చేసే ముందు కొంత ‘చర్చ’, పరీక్ష కూడా జరుగుతాయి. దొరికేది ఒకే స్థలం కాదు. మరి దొరికిన వాటిలో అన్నిటికన్నా మంచిది ఏది? ఈ సంగతి తెలుసుకోవడానికి మరో జట్టు బయలుదేరి, అన్ని ప్రదేశాలనూ మళ్లీ పరిశీలిస్తుంది. నిర్ణయం జరగడానికి కొన్ని గంటలనుంచి, కొన్నిరోజులదాకా పడుతుందంటే ఆశ్చర్యం. అసలు
కొన్ని గుంపులకు సరైన చోటు దొరకదు. చూస్తుండగా చలికాలం ముంచుకు వస్తుంది. అప్పుడా తేనెటీగలన్నీ అన్యాయంగా చనిపోతాయి. తేనెటీగలో గుంపులోని వర్కర్స్ అన్నీ, రాణిగారి స్వంత సంతానమే. వాటికి స్వార్ధ బుద్ధి ఏమాత్రం ఉండదు. ఒక్కొక్క తేనెటీగనూ లెక్కపెట్టి చూస్తే అవి ఏమంత తెలివిగల ప్రాణులు కావు. కానీ, సమష్టి విజ్ఞానాన్ని వాడుకుని ఈ కీటకాలు సుఖంగా బతుకుతాయి.కార్నెల్ యూనివర్సిటీ కీటక శాస్త్ర పరిశోధకుడు తామస్ సీలీ గత 30 సంవత్సరాలుగా తేనెటీగలను గురించి పరిశోధిస్తున్నారు.
ఆయన ఈ మధ్యన తేనెటీగల బతుకు తీరులను గురించి మంచి పుస్తకం రాశారు. దానిపేరు ‘హనీబీ డెమాక్రసీ’. అంటే తేనెటీగల ప్రజాస్వామ్యం! మనషుల్లో కనీసం తన డిపార్ట్‌మెంట్‌లో నిర్ణయాలకు, తేనెటీగల పద్ధతి పనికిరావడం లేదంటారు సీలీ. మనుషులంటే తీరేవేరు! మనమంతా ఒక తల్లి పిల్లలం కాము. అయినా కీచులాడుకుంటాము. మనలను ముందుకు నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. అన్నీ కుదిరినా మనిషిలోని స్వార్ధం, మిగతా మంచినంతా తుడిచిపెడుతుంది!
పోస్ట్‌మార్టమ్!.October 25th, 2010
పేషెంట్ చెప్పేది జాగ్రత్తగా వింటే రోగ నిర్థారణ తేలిగ్గా చేయవచ్చనేది వైద్య శాస్త్రంలో సాధారణంగా ప్రాచుర్యంలో ఉన్న నానుడి! నేటి స్పీడు యుగంలో ఎంత మంది డాక్టర్లు దీన్ని అనుసరిస్తున్నారనేది ప్రశ్న! అయతే చికిత్సా విధానంలో ఎవరి పద్ధతి వారికున్నప్పటికీ, రోగి చెప్పేది జాగ్రత్తగా వినకపోతే ఎంతటి నిపుణుడైన డాక్టరైనా తప్పులో కాలేయక తప్పదు. ప్రస్తుతం వివిధ కారణాల వల్ల మరణించిన వారి డైరీలను పరిశీలించి వారు ఏఏ వ్యాధులకు లోనయంది తెలుసుకొనే కార్య్రకమం ముమ్మరంగా సాగుతోంది. ఈ వివరాలు రోగనిర్ధారణలో మార్గదర్శనం
చేస్తాయని పరిశోధకుల భావన కావచ్చు!!
------------------------------------------------------------
‘పేషంటు చెప్పేది జాగ్రత్తగా వినండి! వాళ్ల రోగ నిర్ధారణ వాళ్లే చేసుకుంటారు!’ అని వైద్య రంగంలో ఒక సూక్తి ఉంది. అయితే, ఆ పేషంటు చనిపోయి ఉంటే?
‘వినవలసిందే’! అంటారు ఫిలిప్ మెకోవియాక్ అనే బాల్టిమోర్ ప్రొఫెసర్ గారు. ఆయన గత 15 సంవత్సరాలుగా ‘అల్టిమేట్ పోస్ట్‌మార్టమ్’ అనే అంతర్జాతీయ సదస్సును పర్యవేక్షిస్తున్నారు. ఆ సదస్సులో పాల్గొనేవారు గతంలో గొప్ప పేరున్న వ్యక్తుల జీవిత చరిత్రలు, డయరీలు, ఇతర ఆధారాలను చదివి, ఆ వ్యక్తులు ఏ కారణంగా మరణించి ఉంటారనేది తేల్చి చెప్పాల్సి ఉంటుంది.
అక్కడ జరిగే పోస్ట్‌మార్టం కేవలం సిద్ధాంతపరమైందన్న మాట. ఆ రకంగా ఆలోచించడంవల్ల ప్రస్తుతం మరణించిన వారి గురించి కూడా సరైన నిర్ధారణలు చేయగలుగుతామని, ఆ సదస్సులో పాల్గొనే వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక వ్యక్తి గురించి పరిశీలించవలసినప్పుడు అతని సమకాలీన సామాజిక చరిత్రను గమనించాల్సి ఉంటుంది. ఉదాహరణకు పాశ్చాత్య శాస్ర్తియ సంగీతానికి పితామహుడు అనదగిన లుడ్విష్‌పాల్ బెథోలెన్ పెళ్లి చేసుకోలేదు. అతని రచనలలో వేశ్యల గురించిన ప్రసక్తి కొన్నిచోట్ల కనపడుతుంది. బెథోలెన్ సిఫిలిస్ అనే సుఖ వ్యాధితో చనిపోయాడని ఒ వాదం ఉంది. ఆ వ్యాధి కారణంగానే అతను చెవిటివాడయి ఉంటాడని కూడా ఈ ‘అల్టిమేట్ పోస్ట్‌మార్టమ్’లో తేల్చారు.
చరిత్రలో ఘనకీర్తిగల వ్యక్తులు, చాలా మామూలు కారణాలు, వ్యాధులతో మరణించడం, ప్రస్తుతం చిత్రంగా తోచవచ్చు. ప్రస్తుత కాలంలో అవసరమైన సందర్భాలలో వ్యక్తి శరీరాన్ని ఖండఖండాలు చేసి పరిశీలించి, మరణానికి కారణాలు కనుగొంటున్నారు. గతించిన వారు చరిత్రలో వ్యక్తులయితే చారిత్రక ఆధారాలనే అంత లోతుగానూ పరిశీలించవలసి ఉంటుంది. క్రీస్తుపూర్వం 73నుంచి 4 సంవత్సరాల మధ్యన జీవించిన జూడియా ప్రభువు హీరోదు రక్తనాళాలు గట్టిపడడంవల్ల మరణించాడట. ఆ కారణంగానే అతని గుండె ఆగి ఉంటుందని ఊహ.
అలెగ్జాండెర్ చక్రవర్తి (క్రీ.పూ 356-323) రానురాను శరీరం బలహీనమైందనే వాడట. అతనికి తీవ్రంగా కడుపునొప్పి వచ్చేదట. అతని మరణానికి కారణం టైఫాయిడ్ అయి ఉంటుంది అంటున్నారు.
అమెరికాను కనుగొన్న కొలంబస్ (క్రీ.శ 1451-1506) ఓడల్లో తిరిగేవాడు. అతనితో ఓడల్లో ఎన్నో చిలుకలుండేవి. వాటినుంచి కొలంబస్‌కు బ్యాక్టీరియా సోకాయి. దాంతో అతనికి ఆర్త్రయిటిస్ వచ్చింది. అదే అతనికి ప్రాణాంతకమైంది.
చరిత్రను తరిచి చూస్తే ఇలాంటి సంగతులు ఇంకా ఎన్నో తెలుస్తాయి.
రేపటి జపాన్ .October 25th, 2010
జపాన్ వాళ్లకు రానున్న కాలం ఎలాగుంటుంది ఊహించడం ఒక సరదా! 1997లో వాళ్లు ఇలాంటి ఒక సర్వే జరిపి, పరిశోధకులందరినీ అభిప్రాయాలు అడిగారు. ఆ సర్వేలో 2003 నాటికి ఇంటర్‌నెట్ ఫోన్ వచ్చేస్తుందని ఒక ఫలితం వచ్చింది. నిజంగానే ఆ సంవత్సరంలో స్కైప్ వచ్చింది. వారనుకున్న సంగతులు అన్నీ జరిగాయనడానికి కూడా లేదు. హెచ్‌ఐవీ టీకా విషయంలో వారి ఆలోచనలు తారుమారైంది. ప్రస్తుతం జపాన్‌వాళ్లు రానున్న 30 సంవత్సరాల గురించి ఒక ప్రకటన చేశారు. అందులో వివరాలు కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి.
2020-వార్తాపత్రికలకు బదులు పలచని ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేలు.
2022- కృత్రిమ రక్తం. అంటే, ఇక రక్తదానాల అవసరం వుండదు.
2023- క్యాన్సర్ ఏ రకంది అయినా దానికి తగిన మందు
2025- ఒకసారి ఛార్జి చేస్తే 300 మైళ్లపైన దూరం వెళ్లగల కార్లు. (లితియమ్ అయాన్ బ్యాటరీల విషయంలో జరుగుతున్న ప్రగతిని చూస్తే ఇలాంటి కారు 2018 నాటికే వీలవుతుంది. 2025లో అది సులభంగా నిజమవుతుంది అంటారు కార్ల నిపుణులు)
2033-స్టెమ్‌సెల్ పద్ధతులను వాడి, కృత్రిమ అంగాలను తయారుచేయడం (ఇప్పటికీ కనీసం 22 రకాల, శరీర భాగాలను గురించి పరిశోధనలు జరుగుతున్నాయి).
2031- భూమి చుట్టూ సరదా కోసం, అంతరిక్షంలో పర్యటన
2026- ఇంట్లో పనిమనుషులు బదులు మరమనుషులు
2035- విమానాలు అన్నీ పైలట్లు లేకుండానే నడుస్తాయి. (ఇందుకు అవసరమయిన సాఫ్ట్‌వేర్ పదేళ్లలోనే తయారవుతుంది. కానీ ప్రయాణ విమానాలను మాత్రం మనుషులే నడిపిస్తారు!
2035- సముద్రంనుంచి యురేనియం లాంటి ఖనిజాలను వెలికి తీయడం.
2037- భూకంపాలను ఏడాది ముందే గుర్తిస్తారు.
2040- మనుషులు చంద్రునిమీద నివాసం ఏర్పాటు చేసుకుంటారు.
....... ఈ పేజీని దాచి వరసగా ఏయే విషయాలు
నిజమైందీ గమనిస్తారా?
దంత వేదాంతం!.October 25th, 2010
మన దంతాలమీద పైపొరగా ఉండే ఎనామెల్, శరీరంలోని పదార్థాలు అన్నింటిలోకీ గట్టిది. అట్లాగని ఇష్టం వచ్చినట్లు అన్నింటినీ కొరికితే కుదరదు. ఎనామెల్ రాగికంటే కొంచెం గట్టిదనం గలది. కానీ స్టెయిన్‌లెస్ స్టీల్ కంటె మాత్రం మెత్తన. అందుకనే చెంచాలు, ఫోర్కులు కొరకడం మనకు చేతగాదు.
పళ్లమీది ఎనామెల్‌లో సన్నటి పగుళ్లు పుడుతుంటాయి. వీటివల్ల మన పళ్లకు ఉపకారమే జరుగుతుంది. ఈ పగుళ్ల కారణంగా, నమిలేటప్పుడు పళ్లమీద పుట్టే ఒత్తిడి తగ్గుతుంది. విమానాలను తయారుచేసేవారు, ఈ పగుళ్లను గురించి పరిశోధిస్తున్నారు. విమానం పైపొరకు గట్టిదనం కలిగించడంలో ఇలాంటి పద్ధతి వాడాలని వారి ప్రయత్నం.
ఒక తల్లికి ఎంతమంది ఎక్కువ పిల్లలు ఉంటే, అంత ఎక్కువగా పళ్లు ఊడిపోయే అవకాశం ఉంది. కడుపుతో ఉండే తల్లులకు జింజివైటిస్ అనే చిగుళ్ల జబ్బు వస్తుందట. అందుకు కారణం, ఆ సమయంలో శరీరంలోని హార్మోనులలో వచ్చే మార్పులు!
అయిదు వందల మిలియన్ సంవత్సరాలకు ముందు, దవడలు లేని చేపలకు, వాటి గొంతుల్లో దంతాలు ఉండేవట. తిండి నమలడం గొంతుతోనన్నమాట.
తూర్పు ఆఫ్రికా, మలావీ సరస్సులోని సికిలిక్ చేపలకు ఇప్పుడు కూడా గొంతులో పళ్లుంటాయి!
పెన్సిల్...... కొన్ని సంగతులు.October 25th, 2010
**16వ శతాబ్దంలో గ్రాఫైట్‌ను, ఇంగ్లండ్‌లోని కెస్విక్‌లో కనుగొన్నారు. 18వ శతా బ్దంలో ఎజి వెర్నర్ అనే జర్మన్ రసాయన శాస్తవ్రేత్త దీనికి గ్రాఫైట్ అని పేరు పెట్టారు. గ్రీకులో ఆ మాటకు ‘రాయడం’ అని అర్ధం!
** పెన్సిల్ అంటే మాత్రం (పెన్సిలన్) చిన్న తోక అని అర్ధం.** పెన్సిల్‌తో రాసినప్పుడు అంగుళంలో వెయ్యవ వంతు వుండే గ్రాఫైట్ స్ఫటికాలు కాగితానికి అంటుకుంటాయి. అదే రాతగా కనపడుతుంది.
**ఒక మామూలు పెన్సిలుతో 35 మైళ్ల పొడవుగీత గీయవచ్చునట.** రబ్బరుతో పెన్సిల్ గీతలను తుడపవచ్చునన్న ఆలోచన ఫ్రాన్సులో పుట్టింది. అంతకుముందు గీతలను తుడపడానికి బ్రెడ్‌ను వాడారు.
**పెన్సిళ్లను పెద్దఎత్తున తయారు చేయడం 1861లో యుఎస్‌లో మొదలైంది.
**అన్నిటికన్నా ఎక్కువగా పెన్సిళ్లను తయారుచేసే దేశం చైనా!
No comments:
Post a Comment