Monday, August 30, 2010

Maya Civilisation

మాయా నాగరికత అంటే ఏమిటి?




మనకు సింధు నాగరికత తెలుసు. గ్రీకు, రోము నాగరికతలు తెలుసు. సుమేరులను గురించి కూడా బహుశః కొంత తెలుసు. కానీ, ఈ మాయా అన్నమాట మన పుస్తకాలలోకి చేరలేదు. నిజానికి దీన్ని మయ్యా అని పలకాలి. ఈ మాటకు, మనకు తెలిసిన మాయ (మంత్రాల మాయ) కు సంబంధం లేదు.

దక్షిణ అమెరికాలోకి యూరోపియనులు రాకముందు, మాయా నాగరికత వ్యాప్తిలో ఉంది. అది మనకు తెలిసిన మిగతా నాగరికతలంత పాతది కాదు. అయినా అంతగానూ అభివృద్ధి చెందింది. క్రీస్తు శకం 300 నుంచి 900 మధ్యకాలంలో మాయా నాగరికత పతాక స్థాయిలో ఉంది. వారు గొప్ప పిరమిడులను, గుడులు, శిల్పాలను నిర్మించారు. గణితం, ఖగోళశాస్త్రం రంగాలలో గొప్ప ప్రగతిని సాధించారు. వేల సంవత్సరాల తర్వాత, లేదా ముందు, ఒకతేదీ, ఏ వారం అయ్యిందీ వారు లెక్కించ గలిగారు. వారు సున్నాను వాడుకున్నారు. అయితే, సున్నాను గురించిన ఆలోచన వారికి స్వంతంగా కలిగిందని మాత్రం మనం గుర్తించాలి.

మిగతా అన్ని నాగరికతలోలాగే మాయా వారు కూడా వ్యవసాయంతోనే జీవనం గడిపారు. వ్యవసాయ దేవతలను, వర్షదేవతను పూజించారు. వారికి దేవతలు, వారి శక్తుల మీద గొప్ప నమ్మకం ఉండేది. వారు పంచాంగాలను తయారు చేశారు. ఊరికి మధ్యలో పిరమిడ్ ఆకారంలో నిర్మాణాలు చేసి వాటి మీద ఆలయాలను కట్టుకున్నారు. టికాల్ వంటి ప్రాంతాలలో జరిపిన తవ్వకాలలో మాయా నాగరికత అవశేషాలు ఎన్నో బయట పడ్డాయి.

వారు కనీసం 30 లక్షల మంది, 70 నగరాలలో బతికారని అంచనా. కోపాన్ అన్నది వారి ముఖ్య నగరం. ప్రస్తుతం హొండురాస్ అని పిలువబడే ప్రాతంలో ఉండేదది. కోపాన్ బంగారు నిక్షేపాలు అద్వితీయమయినవని పేరు పొందాయి. తవ్వకాలలో ఒక వింత విషయం తెలిసింది. కోపాన్ అభివృద్ధీ, అక్కడి నిర్మాణ కార్యక్రమాలూ ఒక్క సారిగా ఆగిపోయినయి. అందుకు కారణం మాత్రం ఇంకా పరిశోధకులకు కూడా అంతు పట్టలేదు. జనాభా పెరుగుదల, బహుశః ఈ నాగరికత అంతరించడానికి కారణమయి ఉండవచ్చునని అభిప్రాయం.

మాయా నాగరికతలోనూ రాజులూ, రాజ్యాలూ, వైభవాలూ ఉండేవి. వారు ఎన్నో అసాధ్యాలను సాదించారు. మాడ్రిడ్ కోడెక్స్ లాంటి చిత్రభాషలను తయారు చేసుకున్నారు. మాయాలను గురించి చెప్పుకోవడానికి చాలా విశేషాలున్నాయి. అటువంటి నాగరికత ఒకటి ఉండేదని తెలియని వారు చాలా మంది ఉన్నారు. అది ఆశ్చర్యం.

I don't propose to translate this post!
There is enough about the topic on the net for people who know English!
######

No comments: