Friday, May 2, 2008

A friend wrote this!

నాకు ఇస్తారి గాడనేటి ఒక దోస్తు ఉన్నాడు. గానికి పెద్ద రైటర్‌ గావాలని బడేకాయిష్‌ క్యాలెండర్‌ను జూసి గాడు కత రాసెతందుకు మూర్తం బెట్టుకుండు. బజార్కు బోయి దస్త కాయితాలు గొన్నడు. ఎందుకన్న మంచిదని గుల్లెకుబోయి దేవునికి మొక్కిండు. ఇంటికొచ్చినంక పెండ్లాన్ని బిల్సి `` ఇగో నేను కత రాద్దా మనుకుంటున్న. ఎవలొచ్చినా నన్ను బిల్వకు, పొరగాల్లను గడ్‌బిడ్‌ జెయ్యనివ్వక. అద్దగంట కొక్క పారి ఛాయ్‌ దెచి ఇయ్యి'' అని జెప్పిండు.
`` మంచిది'' అని గాని పెండ్లాం అన్నది. ఇస్తారి ఒక అరల్ర గూసుండు. పెన్ను, కాయితాలు దీస్కోని మీదికి సూసుకుంట ఆలోచన జెయ్యబట్టిండు. ఎంతకు ఆనికి ఒక్క ఐడియ రాలేదు. కూసుంటే లాబంలేదని గాడు అరల్రనే అటిటు దిర్గ బట్టిండు. ఇంతల గాని పెండ్లాం చాయ్‌ దీస్కోని ఒచ్చింది.
`` ఏమయ్యా కథ రాస్తనని జెప్పి గిట్ల దిర్గుతున్నవేంది'' అని గామె అడిగింది.
`` కతరాయుడంటె పిండిరుబ్బుడనుకుంటున్నవా. ఎంత ఆలోచన జెయ్యాలె ఎన్ని చాయ్‌లు దాగాలె'' అని ఇస్తారి గాడు అన్నడు.
``గదంత నాకెర్కలేదు. పొయ్యి మీద పాటు బెట్టి ఒచ్చిన'' అనుకుంట గాని పెండ్లాం ఒంటింట్లకు బోయింది.
ఇస్తారి చాయ్‌ దాగిండు. పెన్ను దీస్కోని రాసుడు షురుజేసిండు. ఒక రాజు ఉండె. గా రాజుకు ఒక కొడ్కు ఉండె, అని రాసి గొట్టేసిండు. గిసుంటి కతలు గిప్పుడెవు్వ్ల సద్వరని గాని దోస్తు ఒకటు ఇంతకు ముందు జెప్పి ఉండె. గా సంగతి ఆన్కి యాదికొచ్చింది. ఏ కత రాస్తె బాగుంటదని గాడు మల్ల ఆలోచన చెయబట్టిండు. ఐడియ రాక పెన్ను ఇదిలిచ్చిండు. ఇదిలిచ్చెతల్కె పెన్నుల కెల్లి జెరంత శాయి కాయితాల మీద బడ్డది. తూత్తెరికీ అనుకుంట గాడు శాయి బడిన కాయితాలను జింపిండు. సరింగ గప్పుడే ఇస్తారి గాని పోరలు అరల్రకు ఒచ్చిండ్రు.
`` నాయనా! బిస్కిట్‌ పుడ గొనుక్కుంట పైసలియ్యే'' అని పెద్ద పొరగాడంటె.
``ముందుగాల్ల అవుతలకు బోండ్రి. లేకుంటె మీ ఈపు బల్గ జీర్త'' అని ఇస్తారి గాల్ల మీద కోపం జేసిండు.
పోరగాల్లు బుగులుబడి అవుతలకు బోయిండ్రు. ఏమే నేను కత రాస్తున్న పోరగాల్లను అరల్రకు రానియ్యొద్దని ఒక్క తీర్గజెప్తి గదా'' అని ఇస్తారి లాసిగ ఒల్లిండు.
`` ఒంటపని జేస్తున్న. పొరగాల్లు ఎప్పుడొచ్చిండ్రో లాసిగ ఒల్లింది.
జెరసేపైనంక చాయ్‌ దెచ్చి ఇచ్చింది. ఇస్తారి చాయ్‌ దాగి కాయితాల ముంగట సకిలం ముకిలం ఏస్కోని గూసున్నడు. పెన్ను బట్టుకొని ఆలోన జెయ్యబట్టిండు ఛమక్‌మని గానికో ఐడియ ఒచ్చింది. పౌరన్‌ గాడు లేసి నిలబడ్డడు. తనబ్బి కాడ్కి బోయిండు. తనబ్బిలకెల్లి ఒక పాత పుస్తకం దీసిండు. జెట్ట జెట్ట కతరాసి పారేసిండు. రాసిన కతను ఒక పత్రికకు బంపిచ్చిండు.
నెల దినాలైనంక గా కత ఒక పత్రికల ఒచ్చింది. కత పత్రికలమరాంగానే ఇస్తారి గాలి బుగ్గ లెక్క ఉబ్బిండు. గా పత్రికలను చేత్ల బట్కోని దిరుక్కుంట పెద్ద రైటర్‌ లెక్క పోజిడ్వ బట్టిండు. ఎవలన్న ఒచ్చి నాకు సన్మానం జేస్తె బాగుండు అని అనుకోబట్టిండు. కత పత్రికల ఒచ్చినందుకు ఇస్తారి గాని పెండ్లాం కూడ బడె కుషైయ్యింది.
`` ఒదినే! నా మొగుడు రాసిన కత పత్రికల ఒచ్చింది'' అక్కా! గింతసదివిన వానే అని అనుకుంట వాడకట్టలున్న ఆడోలదరితోనని గామె ఇస్తారి గాడు రాసిన కతను సద్విపిచ్చింది. గంతే గాకుంట పసుబ్బొట్టుకు బిల్సింది.
కత పత్రికల ఒచ్చినందుకు ఇస్తారి వాడకట్టోలందరిని దావత్కు బిల్సిండు. గాని పెండ్లాం పాసెం ఒండింది. బిర్యాని జేసింది. అందరు బార్యాని దింటుండగా ఇస్తారి కత సద్వి ఇనిపిచ్చిండు. కత అంత ఇన్నంక కొందరు ``శాన బాగ రాసినవు'' అని ఇస్తారి గాన్ని మెచ్చుకున్నారు.
గింత మంచికత ఎన్నడు ఇనలేదు. సద్వలేదు అని కొందరు అన్నారు.
దావత్‌ అంత అయ్యింది. అందరు ఒస్తమని జెప్పి ఇండ్లకు బోబట్టిండ్రు. ఆకర్కి ఒక ముస్లాయిన ఇస్తారి గాని తాన్కి ఒచ్చిండు.
`నువు్వ సద్విన కత 1950ల డంక పత్రికల ఒచ్చిందిగదా. నీకెర లేదేమో, గాకతరాసింది నేనే అని గాయిన అన్నడు. ఏమన శాత గాక ఇస్తారి గాడు కింది మీదికయ్యిండని వేరే జెప్పాల్నా.

No comments: