మంచు కురిసింది
ఐజక్ బషేవిష్ సింగర్
ఛెల్మ్ అన్నది
వెర్రివాళ్ల ఊరు. అక్కడ పెద్దా చిన్నా అంతా
గొప్పవాళ్లే. ఒక రాత్రి అక్కడ ఎవరికో
నీళ్ల తొట్టిలో చంద్ర బింబం కనిపించింది. చంద్రుడు ఆ తొట్టిలో పడిపోయాడని
చూచినవాళ్లు అనుకున్నారు. తొట్టిమీద గట్టిమూత పెట్టి,
మరు రోజు సంగతి చూడాలి అనుకున్నారు. పొద్దున్న మూత తీసి
చూస్తే, చంద్రుడు లేడు! ఎవరో దొంగిలించి
ఉంటారని తేల్చుకున్నారు. పోలీసులను పిలిచారు. కానీ దొంగ దొరకలేదు. ఛెల్మ్‌వాళ్లంతా
చాలా బాధపడ్డారు.
ఒకసారి,
పండగరోజుల్లో సాయంత్రం మంచు కురిసింది. ఊరు ఊరంతా
వెండిగుడ్డ కప్పినట్టు అయ్యింది. చంద్రుడు వచ్చాడు. నక్షత్రాలు మిలమిలమన్నాయి.
కురిసిన మంచు ముత్యాలు, రత్నాలలాగ మెరిసిపోయింది.
ఛెల్మ్‌లో అక్కడి
పెద్దమనుషుల సంఘం అందరికన్నా తెలివి గలవాళ్లు. వాళ్లు ఊళ్లో అందరికన్నా ఎక్కువ
వయసు గలవారు. వాళ్లదే అక్కడ అధికారం. పెద్దలకంతా పెద్ద గడ్డాలు ఉంటాయి. మరీ
ఆలోచిస్తారు గనుక నుదుళ్లు కూడా వెడల్పుగా ఉంటాయి. ఆ సాయంత్రం ఏడుగురు పెద్దలు ఒకచోట చేరి ముఖం
మీద ముడతలు పడేటట్లు ఆలోచన మొదలు పెట్టారు. ఛెల్మ్‌కు నిధులు కావాలి. ఎట్లా
సంపాయించాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా గ్రోనామ్ ఆక్స్ గట్టిగా అరిచాడు. అందరూ
ఆశ్చర్యపడేట్లు అతను ‘మంచు అంతా వెండి!’ అంటూ అరిచాడు.
'నాకు మంచులో ముత్యాలు
కనపడుతున్నాయి!’ అన్నాడు ఇంకొకాయన.
'నాకు ఏకంగా రత్నాలే
కనపడుతున్నాయి!’ మూడవ పెద్దాయన అరిచాడు.
మొత్తానికి ఛెల్మ్
పెద్దలకు తమ ఊళ్లో నిధి వర్షంగా కురిసిందని తెలిసిపోయింది. అంతలోనే వాళ్లకు చింత
కూడా మొదలయింది. ఛెల్మ్‌లో అందరూ రాత్రిపూట తిరుగుతూ ఉంటారు. నిధిని వాళ్లు
కాళ్లతో కసపిసా తొక్కుతారు. మరి ఏం చెయ్యాలి? ఒక పెద్దమనిషికి ఆలోచన రానే
వచ్చింది.
'అన్ని ఇళ్లకు వార్త
పంపిద్దాము. ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలని చెబుతాము. వెండి,
ముత్యాలు, రత్నాలను ఏరిన తరువాతే రావాలని
ప్రకటిస్తే సరి’.
పెద్దలకంతా మాట బాగా
నచ్చింది. అందుకే అరచేతులు రుద్దేసి ఆ సంగతి తెలియజేశారు. అప్పుడు మత్తు
లెకిష్ మరో మాట అన్నాడు. ‘వార్త అందించే
మనిషి మరి నిధిని తొక్కుతాడు కదా' అన్నాడు.
లెకిష్ మాట సత్యమని
పెద్దలకు అర్థమయింది. మళ్లీ నుదుట ముడతలు పడేట్టు ఆలోచనలు మొదలయ్యాయి.
'తోచింది!’ అన్నాడు
గ్రోనామ్ ఎద్దు. ‘చెప్పు మరి’ అడిగారు అందరు.
'వార్త మనిషి నడుస్తూ
వెళ్లకూడదు. అతగాడిని ఒక బల్లమీద పెట్టి పంపితే, అతను మంచును
తొక్కడు!’
గ్రోనామ్ చాలా
తెలివిగలవాడు. ఆ తెలివికి సంతోషించి పెద్దలందరూ ఈసారి చప్పట్లు చరిచారు.
వెంటనే గింపెల్ కోసం
వంటశాలకు పంపించారు. కుర్రవాడు వచ్చాడు. వాడిని ఒక బల్లమీద ఎక్కించారు. మరి ఆ బల్ల
ఎట్లా కదులుతుంది? వంటశాలలో వంటాయన ట్రైటెల్,
దుంపచెక్కులు తీసే బెరెల్, సలాడ్ కలిపే యూకేల్,
యోంటెల్ అక్కడే ఉన్నారు. వాళ్లంతా మేకలకు మేత వేస్తున్నారు.
ఆ నలుగురూ కలిసి గింపెల్ ఎక్కిన బల్లను ఎత్తుకుపోవాలని నిర్ణయించారు. వాళ్లు
బల్లకాళ్లు తలొకరూ పట్టుకున్నారు. గింపెల్ చేతిలో కర్రసుత్తి పట్టుకుని
నిలబడ్డాడు. దానితో అతను ఇళ్ల కిటికీల మీద కొడతాడు. ఇక అందరూ బయలుదేరారు.
ప్రతి ఇంటి కిటికీ
మీద సుత్తెతో కొట్టి గింపెల్ ‘ఈ రాత్రి
ఎవరూ ఇంట్లోనుంచి బయటకు రాకూడదు. బయట నిధి కురిసింది. దాన్ని తొక్కకూడదు’ అని
చెప్పసాగాడు.
ఛెల్మ్‌లో వాళ్లకు
పెద్దలమీద గౌరవం ఎక్కువ. అందుకే ఎవరూ ఇళ్లలో నుంచి బయటికి రాలేదు. ఇక అక్కడ
పెద్దలు మాత్రం నిధిని సేకరించడం గురించి, దాన్ని వాడడం గురించి ఆలోచనలో
ఉన్నారు. నిధిని అమ్మి, బంగారు గుడ్లు పెట్టే బాతును కొంటే
బాగుంటుందని ఒక పెద్దాయన చెప్పాడు. ఇక ఒకరోజు కాదు, నిత్యమూ నిధి
దొరుకుతుంది.
మత్తు లెకిష్‌కు మరో
ఆలోచన వచ్చింది. ఛెల్మ్‌లో వాళ్లకంతా కళ్లజోళ్లు కొని ఇవ్వాలి. ఇక ఇళ్లు,
వీధులు, దుకాణాలు అన్నీ పెద్దవిగా
కనిపిస్తాయి! ఛెల్మ్ మొత్తం పెద్దదిగా కనిపిస్తే మరి పెద్దదే అవుతుంది. అది పల్లె
పోయి పట్నం అవుతుంది.
ఇంకా మంచి మంచి
ఆలోచనలు వచ్చాయి. అవి కొనసాగుతుండగానే ఉదయం కూడా వచ్చింది. సూర్యుడు వచ్చాడు.
పెద్దలంతా కిటికీలోనుంచి బయటకు చూచారు. ఆశ్చర్యం. కురిసిన మంచును ఎవరో కసకసా
తొక్కనే తొక్కారు. ఎవరని చూస్తే,
బల్ల మోసిన నలుగురి కాళ్లు అని తెలిసింది.
ఛెల్మ్ పెద్దలు తమ
తెల్లగడ్డాలు పట్టుకుని పీక్కుంటూ, తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఆ
నలుగురినీ నడిపించకుండా వాళ్లను ఎత్తుకుని పొమ్మని మరో నలుగురికి చెబితే
బాగుండునేమో అనుకున్నారు!
మళ్లీ పండుగకు మళ్లీ
నిధి కురిస్తే అప్పుడయినా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటినుంచే నిశ్చయించుకున్నారు.
ఛెల్మ్‌లో వాళ్లకు
నిధి మిగలలేదు. కానీ, మళ్లీ సంవత్సరం అది కురుస్తుందని ఆశ
మాత్రం మిగిలింది. పెద్దలు చెప్పిన మాట ఎప్పుడూ తప్పు పోదుకదా!
No comments:
Post a Comment