Wednesday, September 9, 2026

కన్నీళ్ల గురించి ఎన్నెన్నో వివరాలు : On Tears


కన్నీళ్ల గురించి

 

ఉల్లిపాయలను తరుగుతుంటే కళ్ళలోంచి ఉప్పునీరు వస్తుంది. దుఃఖం, సంతోషం అనే భావావేశాలు కలిగినా, అదే ఉప్పునీరు వస్తుంది. భావం కారణంగా కంటనీరు పెట్టడం ఒక్క మనుషులలో మాత్రమే ఉంది. ఇంతకు కంట నీరు పెడితే మనసు కుదుటపడుతుందా?

సైన్సులో ఏ సమస్యలోకి తిరిగి చూడాలన్నా ముందుగా నిర్వచనాలు కావాలి. ఏడుపును గురించి విక్రమ్ పటేల్ అనే పరిశోధకుడు 1993లో పరిశోధనలు నిర్వహించాడు. ఇది ఒక సంక్లిష్టమైన ప్రతిచర్య. ఇందులో మోటార్, మనం అనుకునే కారు వంటి మోటర్ కాదు ఇది, వ్యవస్థ కారణంగా, ఏ రకమైన ఇరిటేషన్ లేదా అసౌకర్యం లేకుండానే, లాక్రిమల్ గ్రంధుల నుండి కన్నీరు స్రవిస్తుంది. ఈ కన్నీళ్లే ఏడుపు వచ్చింది అనడానికి గుర్తు. ముఖంలోని కండరాలలో మార్పు ఏర్పడుతుంది. కొంతమందిలో గొంతు మారుతుంది. ధ్వనులు కూడా మొదలవుతాయి. కడుపు కండరాలు కదిలే రకంగా, శ్వాసలో కూడా తేడా వస్తుంది. ఈ విక్రమ్ ఏడుపును నిర్వచించాడు. మిగతా పరిశోధకులు అంతా ఇదంతా సరదాగా ఉంది, అన్నారు.

పారిశ్రామిక విప్లవం వచ్చే ముందుదాకా పదిమంది ఏడ్చినా తప్పులేదన్న పద్ధతి ఉండేది. గ్రీకులు, రోమనులు అంత్యక్రియల సమయంలో తమ కన్నీటిని ప్రత్యేకంగా సీసాల్లోకి సేకరించేవారట. మనదేశంలో, బాహాటంగా ఏడవడానికి, కూలీకి మనుషులను పెట్టే రుదాలి సంప్రదాయం గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. గ్రీకులు తమ కన్నీటిని గతించిన వ్యక్తితో పాటు సమాధి చేసేవారట కూడా.

మెదడులో కొన్ని హ్యూమర్స్ అనే స్రావాలు చేరి అసౌకర్యం కలిగిస్తాయని, మనస్సు తేలికవుతుందని, హిప్పొక్రేట్స్ భావించాడు. ఏడిస్తే మెదడు శుభ్రం అవుతుందని అరిస్టాటిల్ అన్నాడు. ఇక రోమన్ కవి ఒవిడ్ కన్నీళ్ళతో పాటు, దుఃఖం కూడా, కారి బయటకు పోతుంది, అన్నాడు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి ఏడ్చి ఏడ్చి గుడ్డివాడయ్యాడు.

భావావేశంతో రక్తం కళ్లలోకి చేరుకుంటుంది. ఏడిస్తే అది పోతుంది, అన్నాడు డార్విన్.

ఇంతకు ప్రస్తుత పరిశోధకులు కన్నీటి గురించి ఏమంటున్నారు? కన్నీరు మూడు రకాలు అంటున్నారు. కనీసం ఏడుపు మూడు రకాలుగా ఉండాలి. కన్నీరు కంటిలో వెలుపలి పైమూలలో తయారవుతుంది. అది బయటకు రావడం మాత్రం లోపలి, కింది మూల నుంచి జరుగుతుంది. అంటే కన్నీరు మొత్తం కంటిలో పరుచుకుంటుంది, అని అర్థం. మిల్లిమీటర్లో మూడవ వంతు మందం ఉండే పంక్టా అనే గొట్టాలు కన్నీటిని ముక్కులోకి, నోట్లో, గొంతు మొదట్లోకి కూడా పంపుతాయి. అందుకే ఏడ్చిన తర్వాత నోట్లో కూడా రుచి మారిన భావం కలుగుతుంది. కనుబొమ్మలు కదిలినందుకు నీరు కన్ను అంతటా పరుచుకుంటుంది. కన్ను ఆర్పడానికి 0.3 నుండి 0.5 సెకండ్ల కాలం పడుతుంది. ప్రతి రెండు నుంచి పది సెకండ్లకు ఒకసారి మనం కళ్ళు అర్పుతాము. కొంతమంది ఎక్కువ సార్లు కళ్ళు ఆర్పుతుంటారు. అటువంటి వారు జీవితం మొత్తంలో అదనంగా, అంటే నిద్రపోయిన సమయం కాకుండా, కళ్ళు మూసుకుని ఉంటారు. ఇవన్నీ సైంటిస్టులు లెక్క తేల్చిన వివరాలు.

 

కన్నీటిలో మూడు రకాల ద్రవాలు ఉంటాయి. అవి మూడు వేరువేరు గ్రంధులలో తయారవుతాయి. మొదటిది తెల్ల గుడ్డులో పుట్టే జిగురు రకం. ఆ ద్రవం కనుగుడ్డు మీద అంతటా సమంగా పరుచుకుంటుంది. కనుకనే కళ్ళు ఆర్పడం అంత సులభంగా జరుగుతుంది. రెండవ పొర మరింత నీరుగా ఉంటుంది. ఇది ఇంతకు ముందు చెప్పుకున్న లాక్రిమల్ గ్రందులలో తయారు అవుతుంది.కన్నీటిలో రకాల ప్రోటీన్లు, ఆంటిబయోటిక్స్, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఈ కంటి నీరు కనుగుడ్లను సూక్ష్మజీవుల నుంచి కాపాడి, వేడిని నియంత్రించి, ఉప్పుదనాన్ని అందించి, రకరకాలుగా సహాయపడుతుంది. ఇక కనుబొమ్మల చివరన ఉండే మైలోమియన్ గ్రంధుల నుంచి కొవ్వుతో కలిసి వచ్చేది మూడవరకం. లేకుంటే కన్నీరు వెంటనే కిందకు జారిపోతుంది. ఆరిపోతుంది కూడా.

 

మూడు రకాల ద్రవాలు ఉన్నట్టే కన్నీళ్లు, ఏడుపులకు, మూడు రకాల కారణాలు ఉంటాయి. దుమ్ము పడితే వచ్చే కన్నీరు ఒకరకం. కాంతి, పొగలాంటి వాటి కారణంగా ఏడుపు మరో రకం. భావోద్వేగంతో నవ్వినా, ఏడ్చినా వచ్చేవి మూడవ రకం. కన్నీళ్ళ వెనుక ఇంత సైన్సు ఉంది అని ఎంతమందికి తెలుసు?

 


 

No comments: