రచయిత ఐజక్ బషేవిష్ సింగర్, నొబేల్ బహుమతి గ్రహీత
పిల్లల కథలు రాసినడు. ఎంత బాగుంటయో... విని చూడండి....
పెద్దమనుషులు : పోలాండ్ పిల్లల కథ
ద్దమనుషులు
రచయిత ఐజక్ బషేవిష్ సింగర్
ఊరి పేరు ఛెల్మ్. అక్కడ పెత్తనం చేయడానికి ఒక కమ్యూనిటీ
కౌన్సిల్ ఉందని, దానికొక
పెద్ద ఉన్నాడని, వాళ్లందరూ
పిచ్చివాళ్లేనని తెలుసు. అందరికన్నా పెద్ద అధికారి పేరు ఎద్దు (గ్రొనామ్ ఆక్స్).
ఇక కౌన్సిల్‌లో సభ్యులు మత్తు (డోపీ లెకిష్), దద్దమ్మ (జైన్‌వెల్ నిన్నీ), పిచ్చయ్య (ట్రైటెల్
ఫూల్), గాడిద
(సెండర్ డాంకీ), ఓటి
బుర్ర (ష్మెండ్రిక్ నమ్‌స్కల్). ఇంకా ముద్దపప్పు (ఫైవెల్ థిక్‌విట్), ఎన్నికయిన పెద్ద, ఎద్దు వయసులోనూ
పెద్దవాడు. ఆయనకు పొడుగాటి తెల్లని బవిరి గడ్డం ఉంటుంది. నుదురు ఎత్తుగా ఉంటుంది.
ఈ గ్రోనామ్ ఎద్దుకు పెద్ద ఇల్లు ఉంది. కనుక మీటింగ్‌లన్నీ
అక్కడే జరుగుతుంటాయి. ఆయన పెద్ద భార్య పేరు గెనెండెల్. అప్పుడప్పుడు ఆమె మీటింగ్‌లో
వాళ్లందరికీ కేక్‌లు, టీ, జామ్ ఇస్తూ ఉంటుంది.
ఎద్దు నిజానికి సంతోషంగా ఉండవలసిన వాడే. ఒకటే చిక్కు.
మీటింగ్ ముగిసి అందరూ వెళ్లిపోయిన తరువాత ప్రతిసారీ గెనెండెల్ వచ్చి పిచ్చిమాటలు మాట్లాడావంటూ మొగుణ్ణి తిడుతుంది.
ఆమెకు మొగుడు అంటే గొప్ప గౌరవమే. కానీ, అతను మరీ అమాయకుడు అన్న అభిప్రాయం నిండుగా ఉంది.
ఓసారి ఇలాగే ఇద్దరూ కీచులాడుకున్నారు. గ్రోనామ్ భార్యతో
అన్నాడు గదా, ‘పెద్ద వాళ్లందరూ
వెళ్లిపోయిన తరువాత నాతో యుద్ధం మొదలుపెట్టి
ఏం లాభం? ఇకమీదట
నేను వాళ్లమధ్య ఏదయినా అర్థంలేని మాట అంటున్నట్టు తోస్తే, నేరుగా అక్కడికి
వచ్చేయి. సంగతి నాకు చెప్పు. నేను విషయం మార్చుకుంటాను’ అని.
‘అంతమంది పెద్దవాళ్ల ముందర నేను వచ్చి, నీవు అర్థంలేని మాటలు
అంటున్నావని ఎట్లా చెప్పడం? నీవు పిచ్చివాడవన్న సంగతి వాళ్లకు అర్థమయిందంటే, నీ పెద్దరికానికి
ముప్పు వస్తుంది. కౌన్సిల్ పెద్దగా మరెవరినో ఎన్నుకుంటారు.’
‘నీవు మహా తెలివిగలదానివి గదా! దారి వెతుకు’ అన్నాడు
గ్రోనామ్ ఎద్దు.
గెనెండెల్ కొంచెం ఆలోచించి ‘తోచింది’ అని గట్టిగా
అరిచింది.
‘ఏమిటది?’
‘నువ్వేదో పిచ్చిమాట అనగానే నేను అక్కడికి వచ్చి మన
ఇనప్పెట్టె తాళం చెవి నీకు ఇస్తాను. నీవు పిచ్చిమాటలు మాట్లాడుతున్నానని అర్థం
చేసుకోవాలి.’
ఎద్దుకు మహా సంతోషమయింది. పెళ్లం తెలివిని మెచ్చుకుంటూ
చప్పట్లు చరిచాడు. ‘ఓహో! ఏం తెలివి? తెలివికన్నా తెలివి!’ అన్నాడు.
కొన్నాళ్ల తరువాత గ్రోనామ్ ఎద్దు ఇంట్లో మరో సమావేశం
జరిగింది. రానున్న పెంతెకోస్ట్ పండుగ
గురించి చర్చ మొదలయింది. ఆ పండుగ సందర్భంగా అందరూ ప్రత్యేకమయిన రొట్టెతోబాటు
పులిసిన మీగడ తింటారు. ఈసారి వానలు బాగా కురవలేదు. గడ్డి పెరగలేదు. ఆవులు అంతగా
పాలు ఇవ్వలేదు.
ఊరి పెద్దలు అందరూ గడ్డాలు పీక్కున్నారు. నుదురులు
రాసుకున్నారు. అంటే, వాళ్ల మెదళ్లు గట్టిగా పనిచేస్తున్నాయని అర్థం. అయినాసరే, కావలసినంత మీగడ సంపాదించడం ఎట్లాగో ఎవరికీ తోచలేదు.
ఒక్కసారిగా గ్రోనామ్ పిడికిలితో బల్లమీద గుద్ది, ‘తోచింది’ అన్నాడు.
‘ఏమిటది?’
‘ఇకమీదట నీళ్లను మీగడ అనాలని, మీగడను నీళ్లు అనాలని ఒక చట్టం చేసేద్దాం. మన ఊళ్లో
బావుల్లో ఇంకా నీళున్నాయి. ఆ రకంగా ప్రతి ఇల్లాలు బానలనిండా మీగడ తెచ్చుకుంటుంది.’
‘బ్రహ్మాండమయిన ఆలోచన’ అన్నాడు గాడిద.
‘తెలివంటే అది’ అన్నాడు దద్దమ్మ.
‘మన ఎద్దుగారు మాత్రమే ఇంతగొప్ప ఆలోచనలను చేయగలరు’
తేల్చేశాడు మత్తు.
మిగతావాళ్లందరు కూడా తలలు ఊపారు. ముద్దపప్పు ఒకడికే రాత
తెలుసు. అతనే సంఘానికి రాయసకాడు! కలము, తోలు తెచ్చాడు. కొత్త చట్టాన్ని రాసిపెట్టాడు. ఇక ఆ రోజు
నుంచి ఊళ్లో అందరూ నీటిని మీగడ అనాలి. మీగడను నీళ్లు అనాలి.
మామూలుగానే కమ్యూనిటీ వ్యవహారం ముగిసింది. పెద్దలందరూ మరేవో
సంగతులు చెప్పుకోసాగారు. అంతలో గ్రోనామ్ ‘రాత్రి నాకు కంటి మీద కునుకు లేదు.
వేసవిలోనే ఇంత వేడిగా ఎందుకు ఉంటుందని ఆలోచించాను. మొత్తానికి జవాబు తోచింది.’
అంటూ చెప్పసాగాడు.
‘ఏం తోచింది?’ అందరూ ఒక గొంతుగా అడిగారు.
‘చలికాలమంతా ఇళ్లలో నెగళ్లు వెలిగిస్తాం గదా. ఆ వేడి ఛెల్మ్‌లో
మిగిలిపోయి వేసవిలో వేడి పుడుతుంది.’
పెద్దలందరూ ఔనన్నట్టు తలలాడించారు. మత్తు లెకిష్ మాత్రం, ‘మరి చలికాలంలో చలిగా
ఎందుకుంటుందో?’ అంటూ ఓ ప్రశ్న అడిగాడు.
‘అది తెలిసిందే. వేసవిలో నెగళ్లు ఉండవు. కనుక వేడి మిగిలే
ప్రశ్న లేదు’ జవాబు ఇచ్చాడు గ్రోనామ్.
గ్రోనామ్ తెలివి గురించి అందరూ ఆశ్చర్యంగా అనుకుంటున్నారు.
ఇంతగా కష్టపడి ఆలోచించారు గనుక, అందరి చూపు వంటింటివేపు మళ్లింది. గెనెండెల్ టీ, కేకులు, జామ్‌తో వస్తుందని
వాళ్ల ఆశ.
గెనెండెల్ రానే వచ్చింది. కానీ ట్రే తేలేదు. చేతిలో ఒక
తాళం చెవి పట్టుకువచ్చి ‘గ్రోనామ్, ఇదుగో ఇనప్పెట్టె తాళం చెవి’ అంటూ మొగుడి చేతిలో పెట్టింది.
గ్రోనామ్ ఎద్దు మాత్రం ఇవాళ తాను తెలివిగల మాటలే అన్నానని గొప్ప నమ్మకంగా
ఉన్నాడు. కానీ గెనెండెల్ తాళం చెవితో వచ్చి నిలబడింది. అంటే, తానేదో పిచ్చిమాటలు
అన్నాడనే అర్థం. ఆయనకు బాగా కోపం వచ్చింది. అందరివేపు తిరిగి, ‘చెప్పండి. నేనేం
పిచ్చిమాటలు అన్నాను గనుక మాయావిడ తాళం చెవి తెచ్చి ఇచ్చింది?’ అంటూ ప్రశ్న వేశాడు.
ఆ మాటలతో పెద్దలంతా తికమక పడ్డారు. ఎద్దు భార్యతో తాను
చేసుకున్న ఒప్పందాన్ని వివరించి చెప్పాడు. తాను వెర్రి మాటలు అన్న వెంటనే ఆమె తాళం
తెచ్చి ఇస్తుందని వివరించాడు. ‘ఇవాళ మాత్రం నేను మాట్లాడనవన్నీ నిజంగా తెలివిగల
మాటలు గదా? మీరే
చెప్పండి’ అన్నాడు కూడా.
పెద్దలందరికీ గెనెండెల్ మీద కోపం వచ్చింది. ‘ఛెల్మ్ అనే ఈ
ఊరికే మేం పెద్దలం. మాకు అన్నీ అర్థమవుతాయి. తెలివి, తెలివిలేనితనం గురించి ఒక ఆడమనిషి మాకు చెప్పే పనిలేదు’
అన్నాడు ముద్దపప్పు.
విషయం గురించి కొంత చర్చ జరిగింది. వాళ్లు ఒక కొత్త చట్టం
తెచ్చారు. గ్రోనామ్ ఎద్దు అర్థంలేని మాటలు అంటున్నాడని పెళ్లానికి తోస్తే, ఆవిడ వచ్చి తాళం చెవిని పెద్దలకు ఇవ్వాలి. వాళ్లంతా
ఒప్పుకుంటేనే విషయం మార్చవలసిందిగా తమ పెద్దకు చెపుతారు. ఇక పెద్దలు గెనెండెల్
అభిప్రాయాన్ని అంగీకరించకుంటే, ఆనాడు ఇచ్చే టీ, కేక్‌లు, జామ్ రెండింతలు ఎక్కువగా ఉండాలి. ప్రత్యేకమయిన రొట్టె కూడా
ఇవ్వాలి. అది చట్టం.
ముద్దపప్పు వెంటనే కొత్త చట్టాన్ని కూడా తోలు పొర మీద
రాశాడు. ఛెల్మ్ గ్రామపు ముద్రను దాని మీద వేశాడు. ఆ ముద్రలో ఆరు కొమ్ములున్న ఒక
ఎద్దు ఉంటుంది.
ఆ రోజు నుంచి సమావేశాల్లో గ్రోనామ్ ఎద్దు మరీ బరితెగించి
మాట్లాడసాగాడు. తన భార్య గెనెండెల్ చాలా పిసినారి మనిషి అని తెలుసు మరి. ఇంట్లోని
పదార్ధాలన్నింటిని పెద్దలమంటూ వాళ్లు మింగేయడం ఆమెకు ఎలాగూ నచ్చదు.
ఆసారి పెంతెకోస్ట్ పండగకు పుల్లని మీగడ కావలసినంత
దొరికినట్టు లెక్క. కానీ, కొంతమంది ఇల్లాళ్లు నీళ్లు సరిపడినన్ని లేవని గునిశారు.
నిజానికి అది ఒక కొత్త సమస్య. కనుక పండుగ తరువాత దాన్ని తేలుస్తారు.
ఒక్క చట్టంతో ` ఛెల్మ్‌వారికి ఒక నది నిండాను, కొన్ని బావుల నిండాను
మీగడ అందించినవాడుగా గ్రోనామ్
ఎద్దుకు ప్రపంచమంతటా గొప్ప పేరు వచ్చింది.
No comments:
Post a Comment