Friday, May 8, 2026

చిట్టచివరకు.... రవీంద్రనాథ్ టాగోర్ కథకు కేబీ గోపాలం చేసిన తెలుగు అనువాదం

 


చిట్టచివరకు.... రవీంద్రనాథ్ టాగోర్ కథ


చిట్టచివరకు....

రవీంద్రనాథ్ టాగోర్ కథకు

కేబీ గోపాలం చేసిన తెలుగు అనువాదం

 

రికొత్తగా అందిన బిఏ డిగ్రీతోపాటు అపూర్వకృష్ణ కలకత్తా నుంచి ఇంటికి బయలుదేరాడు. నది సన్నగా ఉంటుంది, వర్షాలు ముగిసిన తరువాత అది ఎండిపోతుంది. కానీ ఇప్పుడు ఇంకా ఆగస్టు మాసం మధ్యలోనే ఉన్నాం. కనుకనే అది నిండుగా పారుతున్నది. నీళ్లు ఊరి కంచె అంచులను, వెదురు పొదల కింది మట్టిని తాకుతున్నది. ఆకాశం మేఘాలు లేకుండా నిర్మలంగా ఉంది, కొన్ని రోజులపాటు సాగిన వర్షం తరువాత సూర్యుడు తీవ్రంగా వెలుగుతున్నాడు.

మనం గనుక బోటు మీద ప్రయాణం చేస్తున్న అపూర్వకృష్ణ హృదయమనే నదిలోకి తొంగి చూడగలిగితే, మనకు అక్కడ అచ్చంగా అటువంటి దృశ్యమే కనబడుతుంది. అతని మనస్సు కూడా పొంగి పొరలుతున్నది మరి.

బోటు జెట్టీలో ఆగింది. అపూర్వ వాళ్ళ ఇంటి కాంక్రీట్ పైకప్పు చెట్లమధ్యలో నుంచి కనబడుతున్నది. అతను తను వస్తున్నట్లు ఎవరికీ కబురు పెట్టలేదు. అందుకే అతని కోసం నది పక్కకు ఎవరూ రాలేదు.. బోటుమనిషి సాయం చేయడానికి అన్నట్టు ముందుకు వచ్చాడు కానీ అపూర్వ అవసరం లేదు అన్నట్టు చెయ్యి ఊపి సంచిని తానే అందుకుని చురుకుగా దిగాడు. అతని అడుగుల్లో ఒక ఊపు కనపడుతున్నది.

అపూర్వ కిందకు కాలు పెట్టాడో లేదో జారుడుగా ఉన్న బురదలో పట్టుతప్పి జారి పడిపోయాడు. సంచి కూడా కింద పడింది. పడిపోతే పర్వాలేదు కానీ ఒక చక్కని గొంతు కీచుగా గలగలా నవ్వడం వినిపించింది. దాంతో దగ్గరలోని మర్రిచెట్టు మీద పక్షులన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయాయి.

అపూర్వ పరిస్థితి కనబడుతూనే ఉన్నది. అతను బిత్తర పోయాడు. కానీ తమాయించుకుని తనను తాను చూచాడు. అప్పులు ఇచ్చే అతని బోటునుంచి దింపిన ఇటుకలను పేర్చిన కుప్పమీద ఒక అమ్మాయి కూర్చుని ఉండడం కనిపించింది. ఆ అమ్మాయే పకపకా నవ్వుతున్నది.

ఆమె మృణ్మయి అని అపూర్వకు తెలుసు. ఆమె, కొత్తగా వచ్చిన పక్కింటివాళ్ళ అమ్మాయి. వాళ్ళు అంతకుముందు దూరంగా నది దాటి ఉండే చోట ఒక ఇంట్లో ఉండేవాళ్లు. రెండు మూడు సంవత్సరాల క్రితమే ఇక్కడికి వచ్చారు. అప్పటికి మరి, నది గట్లు తెగి వాళ్ళ ఇల్లు పాడయింది. అందుకే వచ్చారు.

నిజానికి ఆ అమ్మాయికి కొంత చెడ్డ పేరు ఉంది. మగవాళ్ళందరూ అమ్మాయిని అందగత్తె అంటారు. కానీ ఆమె తీరు గురించి ఊర్లో ఆడవాళ్లు, భార్యలందరూ బెంగ కలిగి ఉంటారు. ఆ అమ్మాయి మరి ఎప్పుడూ కుర్రవాళ్ళతో ఆడుతుంది. అమ్మాయిలను చూచి ఆవిడ విసుక్కుంటుంది. ఊళ్లోని కుర్రవాళ్ళు అందరిలోనూ, ఆమె ఒక మరాఠా గుర్రం వీరుడిలాగా చెలరేగిపోతూ ఉంటుంది.

ఆమె స్వభావం తండ్రి కారణంగా వచ్చింది, అంటారు. తల్లి మాత్రం వీలున్నప్పుడల్లా ఊళ్లో ఆడంగులతో, అవకాశం జారవిడవకుండా తన కూతురి గురించి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. పరదేశంలో ఉన్న భర్త మనసు తెలిసిన మనిషిగా, ఆమె బిడ్డను మాత్రం ఎప్పుడు ఒక్క మాట అనదు. అమ్మాయి కంట నీరు పెడితే ఆ తండ్రి భరించడు మరి.

మృణ్మయి చామనచాయగా ఉంటుంది. పొట్టిగా ఉండే ఆమె జుట్టు వీపుల మీద వేలాడుతూ ఉంటుంది. ముఖంలో మగలక్షణాలు కనబడతాయి. అందమైన ఆ రెండు పెద్ద పెద్ద కళ్ళలో వినయం గానీ, భయంగానీ, సంకోచంగానీ కనబడవు. అమ్మాయి మంచి పొడగరి. శరీరం సౌష్టవంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఒక్కరికి కూడా ఆమె వయస్సు గురించి అనుమానం రాదు. ఒకవేళ వస్తే, ఆమెకు ఇంకా పెళ్లి ఎందుకు చేయలేదని, తల్లిదండ్రుల మీద వారికి కోపం కలిగే వీలుంది. ఇప్పుడు ఇప్పుడు దూర దేశం నుంచి ఒక మహాప్రభువు ఎవరో వచ్చి బోటు దిగితే ఊరి వాళ్ళందరూ కలవర పడిపోతారు. అనుకోకుండా అక్కడే నది వద్ద ఉన్న ఆడంగులు ముఖాల మీదకి పరదాల లాగా కొంగును లాగుకొని క్షణాల్లో మాయం అవుతారు.మృణ్మయి మాత్రం గుడ్డలు లేని ఒక బాబును చంకన వేసుకుని, జుట్టు భుజాల మీద ఎగురుతూ ఉండగా, తప్పకుండా అక్కడకు వచ్చి ప్రత్యక్షమవుతుంది. కొత్తగా వచ్చిన మనిషిని కుతూహలంగా చూస్తూ, భయం తెలియని ఒక జింకపిల్ల లాగా, అంటే అక్కడ ఎవరూ వేటగాళ్లు లేకుంటే భయం లేని జింకలాగా, వచ్చి అంతే వేగంగా వెళ్ళిపోతుంది. కుర్రవాళ్ళ జట్టులోకి చేరి, కొత్తగా వచ్చిన మనిషి గురించి వివరంగా కబురు చెబుతుంది.

మన అపూర్వ, ఆ అమ్మాయిని అంతకు ముందు చాలాసార్లు చూచాడు. తీరిక దొరికినప్పుడల్లా ఆమెను గురించి ఆలోచించాడు. తీరిక లేనప్పుడూ ఆలోచించాడు. ప్రతినిత్యం ఎన్నో కొత్త ముఖాలు కనిపిస్తూ ఉంటాయి,. అందులో కొన్ని మాత్రం మనసులో గట్టిగా మిగిలి ఉంటాయి. అదేదో కేవలం అందం గురించి మాత్రమే కాదు. వాళ్లలో ఏదో ఒక ఆకర్షణ ఉంటుంది మరి. దాన్ని ఏమనాలో తెలియదు. చాలా ముఖాల్లో అటువంటి ఆకర్షణ వివరంగా కనిపించదు. గుహలో దాగున్న వంటి మనసును బయటికి లాగిందంటే, ఆ ముఖం ఎంతో ఆకర్షణ గలదని లెక్క. గమనించిన వారి మనసులో అది లోతుగా నాటుకుంటుంది. సరిగ్గా పాదుకొనని ఆడతనం, మృదుత్వం, కొంత కలవర పెట్టి గుండెను దడదడలాడిస్తుంది. స్వేచ్ఛగా అడవిలో తిరుగుతున్న జింక పిల్ల లాగా ఉండే ఆ మనిషి ముఖం, అందులోని చురుకుతనం, మరవడం కష్టం అవుతుంది.

చదువరీ, మృణ్మయి గలగల నవ్వు ఎంత శ్రావ్యంగా వినిపించినా, మన అపూర్వ మాత్రం కుదేలు పడిపోయాడు. వెంటనే చేతిలోని సంచిని బోటు మనిషికి ఇచ్చాడు. ఎర్రబడ్డ ముఖంతో ఇంటి వైపు బయలుదేరాడు.

దృశ్యం ఇంచుమించు పర్ఫెక్ట్ గా ఉంది. నదీ తీరం. చెట్ల నీడలు. పక్షుల పాటలు. ఉదయం సూర్యుడు. 20 ఏళ్ల వయసు. ఆ ఇటుకల పోగును అంతగా పొగడడానికి ఏమీ లేదు గాని, వాటి మీద ఎక్కి హాయిగా కూర్చుని ఉన్న, పొగడదగిన ఆ శాల్తీ తీరు పొడిబారిన అతని మనసు మీద వర్షంలా కురిసింది. పాపం అతని అదృష్టం అలా ఉంటే, ఎవరేం చేయగలుగుతారు? అది వంకర తిరిగింది. మొదటి అడుగులోనే ఒక వింత అనుభవాన్ని ముందు ఉంచింది.

 

రెండవ భాగం

 

చెట్ల నీడల కింద నడిచిన దారి వెంట అపూర్వ ఇంటికి చేరుకున్నాడు. ఇటుకల గుట్ట మీద నుంచి వినిపించిన ఆ గలగల నవ్వు అతని చెవుల్లో రింగుమంటూనే ఉన్నది. అతని శాలువా, సంచి మొత్తం బురద కొట్టుకొని ఉన్నాయి.

అపూర్వ రావడం అతని తల్లికి గొప్ప సంతోషాన్ని కలిగించింది. వెంటనే పనివాళ్ళను దూరాలకు, దగ్గరకు పంపించి చిక్కని తీయని పాలు, పెరుగు, రోహు చేపలు, తెప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. పక్కనున్న ఇళ్లన్నిటిలోనూ వార్త పొక్కింది.

భోజనాలు అయిన తర్వాత అపూర్వ వాళ్ళ అమ్మ, పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చింది. అందుకు మన అపూర్వ సిద్ధంగానే ఉన్నాడు. అటువంటి ప్రస్తావనలు ఇంతకు ముందు కూడా వచ్చినవే. ఈ కుమార శేఖరుడు మాత్రం రకరకాల మార్గాలు వెతికి, తన బిఏ డిగ్రీ చేతికందేదాకా పెళ్లి ప్రసక్తి లేదు, అన్నాడు. తల్లి మరి ఇంతకాలం ఓపిక పట్టింది. ఇప్పుడిక అతను ఆ మాట అనడానికి లేదు.

నేను ముందు అమ్మాయిని చూచిన తరువాతే నిర్ణయం జరుగుతుంది, అన్నాడు అపూర్వ. అమ్మ మాత్రం అమ్మాయిని మేము చూచాం గదా, నీవు శ్రమ పడవలసిన అవసరం లేదు, అన్నది. అయితే అపూర్వకు, శ్రమ పడాలనే ఉన్నది.. ముందు చూడకుండా నేను ఏ అమ్మాయినీ పెళ్లి చేసుకోను, అన్నాడతను. ఏమిటి ఈ కని విని ఎరుగని విచిత్ర ధోరణి, అనుకున్నది కానీ, ఆ తల్లి కొడుకును కాదనలేకపోయింది.

ఆ రాత్రి అపూర్వ దీపం మలిపి పడుకున్నాడు కానీ, ఇంకా పడకలో నిద్ర లేకుండానే పడి ఉన్నాడు. అతని చెవుల్లో మాత్రం గలగలా ఒక సందేహం లేని నవ్వు, చుట్టుకుని ఉన్న ఆ వర్షం రాత్రి శబ్దం నిశ్శబ్దాల మధ్యలో నుంచి వినపడుతూనే ఉన్నది.. అతను పాపం పొద్దున్నే లేచి బురదలో జారిపడకుండా ఉంటే ఎలా ఉండేది, అన్నట్టు మనసులోనే కలవరపడిపోతున్నాడు. అపూర్వకృష్ణ అనే ఈ నేను, ఎంతో తెలివిగలవాడిని, చదువుకున్నవాడిని, కలకత్తా నగరంలో ఎంతో కాలంగా ఉంటాను, ఏదో అనుకోకుండా బురదలో జారిపడ్డాను, అంతేగాని నేనేమీ పల్లె మనిషిని కాదు, అన్న సంగతి ఆ అమ్మాయికి పట్టనే లేదు. అయినా ఆమె నన్ను చూచి నవ్వింది, అన్నది అతని మనసులోని కలవరానికి కారణం.

తర్వాతి రోజున అపూర్వ ఒక పెళ్లి చూపులకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. వెళ్ళవలసిన చోటు దూరమేమీ లేదు, దగ్గర్లోనే ఉంది. అలవాటు కొద్ది వేసుకునే అడ్డపంచె, శాలువా బదులు, అతను చక్కగా దుస్తులు వేసుకున్నాడు. పట్టు లాల్చి, గుండ్రంగా తలపాగా, బాగా వార్నిష్ చేసిన జోళ్ళు, సిల్క్ గొడుగు అతని దుస్తులిప్పుడు.

మామగారు కావలసిన పెద్దమనిషి, వాళ్ల ఇంట్లోకి అడుగు పెట్టాడో లేదో, అక్కడి వాళ్ళందరూ ఘనంగా స్వాగతం పలుకుతూ, అతని చుట్టూ చేరారు. కొంతకాలం గడిచిన తర్వాత, భయంతో కుంచించుకుపోతున్న అమ్మాయిని, కాబోయే పెళ్ళికొడుకు ముందుకు తెచ్చారు. ఆమెను కష్టపడి సిద్ధం చేశారు. రంగురంగుల చీర కట్టారు. అది చాలా నాణ్యంగా ఉంది. జుట్టు ముడి వేసి, దాని చుట్టూ ఒక మెరుపుల గుడ్డ కట్టారు. ఆమె నిశ్శబ్దంగా ఒక మూలన, తలను మోకాళ్ళ మీదకు వంచుకుని, కూర్చుని ఉంది. ఒక ముసలి పనిమనిషి ఆమె వెనక ఉంది. బహుశా మద్దతుగా వచ్చిందామె. కాబోయే పెళ్లికూతురుకి బహుశా తమ్ముడయి ఉంటాడు ఒక చిన్న కుర్రవాడు వచ్చి, తమ కుటుంబాల్లోకి తీసుకువచ్చిన కొత్త మనిషి తాలూకు తలపాగా, గడియారం, కొత్తగా పెరుగుతున్న గడ్డం, మొదలైనవన్నీ పరిశీలనగా చూచాడు. ఆ కుర్రవాడు బహుశా అక్కకు తోడుగా వచ్చినట్టున్నాడు. అపూర్వ కాసేపు మీసం దువ్వుతూ కూర్చున్నాడు. చివరకు మెత్తని గొంతుతో ఏం చదువుతున్నావు?” అని అడిగాడు. గుడ్డలు కట్టుకుని, నగలు పెట్టుకున్న ఆ మర్యాదల కుప్ప, జవాబు చెప్పలేదు. ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగిన తర్వాత, వెనుకనున్న పనిమనిషి తట్టి ధైర్యం ఇచ్చిన తరువాత, ఆమె మెత్తని గొంతుతో, ఊపిరి కూడా తీసుకోవడానికి ఆగకుండా, గబగబా జవాబు చెప్పింది. ఎలిగెంట్ రీడర్ రెండో భాగం, ఎసెన్స్ ఆఫ్ బెంగాలీ గ్రామర్ మొదటి భాగం, అండ్ అకౌంట్ ఆఫ్ జాగ్రఫీ, లెక్కలు, భారతదేశ చరిత్ర అన్నది ఆమె. ఇంతలో బయట ఏదో గోల జరిగింది. ఒక్క క్షణంలో పరుగుతూ రొప్పుతూ మృణ్మయి గదిలోకి ప్రవేశించింది. ఆమె జుట్టు అటు ఇటు కదులుతున్నది. పెళ్లికూతురు తమ్ముడు రాఖాల్ని ఆమె చేయి పుచ్చుకుని,  అపూర్వకృష్ణ వేపుగాని, చూడనే చూడకుండా లాగ సాగింది. రాఖాల్ మాత్రం తన పరిశీలనలో మునిగి ఉన్నాడు. లేవడానికి నిరాకరించాడు. పనిమనిషి మృణ్మయిని వారిస్తూ అరవకుండానే నివారించను మొదలుపెట్టింది. అపూర్వకృష్ణ కొంచెం తమాయించుకుని వీలైనంత గంభీరంగా నిటారుగా, కూర్చుని తలపాగాతో బాటు తలను అలాగే ఎత్తి ఉంచి, గడియారాన్ని పొట్ట మీద చొక్కాకు రాసుకుంటున్నాడు. అమ్మాయి కుర్రవాని వీపు మీద చరిచింది. పెళ్లికూతురు ముఖం మీద ముసుగును లాగేసింది. పరుగు లంకించుకుంది. పనిమనిషి విసుగుతూ గురగురలాడింది. అక్కయ్య ముసుగు తొలగిపోవడం చూచి చిన్న కుర్రవాడు నవ్వడం మొదలుపెట్టాడు. వాడికి వీపుమీద పడిన దెబ్బ గురించి పట్టింపే లేదు. వాడికి ఇలాంటివన్నీ మామూలే. నిజం చెప్పాలంటే ఒకప్పుడు మృణ్మయి జుట్టు పొడుగ్గానే ఉండేది. అది వీపులో సగం దాకా వేళ్లాడుతూ ఉండేది. ఈ కుర్రవాడే ఆమె వెంట్రుకల మీద ఒక కత్తెరను ప్రయోగించాడు. అది జరిగిన తరువాత ఆ అమ్మాయి కత్తెర పుచ్చుకొని నిర్దయగా తన వెంట్రుకలను కోపంతో కత్తిరించి వేసింది. ద్రాక్షపళ్ళ గుత్తిలాగా తెగిన ఆ జుట్టు నేల మీద పడిపోయింది. ఆ పిల్లల ఆటలు అలా ఉండేవి.

ఆ నిశ్శబ్దంగా సాగిన పరీక్ష మరెంతో కాలం కొనసాగలేదు. రూపు పోసిన మర్యాదగా కూర్చుని ఉన్న అమ్మాయి, కష్టపడుతూ పైకి లేచింది, లోపలి గదిలోకి వెళ్లిపోయింది. పనిమనిషి ఆమెకు సహాయంగా వెళ్ళింది. తన తీరుకుతానే సంతృప్తి పడుతూ, అపూర్వ తన నూనూగు మీసాలను సవరించుకున్నాడు. పైకి లేచాడు. ద్వారం దగ్గరికి చేరేసరికి, తన కాళ్లు జోళ్ళు అక్కడ లేవని కనిపించింది. అవి ఎక్కడ ఉన్నది ఎవరికి తెలియదు.

దాంతో ఇంటివాళ్ళు బెంబేలు పడిపోయారు. ఆ పని చేసిన మనిషి గురించి గోలగోలగా విమర్శలు సాగించారు. కాసేపు వెతికారు, గాని జోళ్లు దొరకలేదు. వాటికి బదులుగా ఒక్క పాత అరిగిపోయిన జోళ్లజత అతనికి యిచ్చారు. అవి ఇల్లుగల పెద్దమనిషివి. వాటితోనే ఎలాగో ఒకలాగా, అనుమాన పడుతూ అపూర్వ, వీధి దారి వెంట నడవసాగాడు. అతని దుస్తులు అంటే పంట్లాము, చొక్కా, తలపాగాలు మాత్రం బాగున్నాయి.

అతను కొలను పక్కకు చేరేసరికి మళ్ళీ ఒకసారి పెద్ద స్థాయిలో నవ్వు వినిపించింది. అడవిలో హాయిగా తిరిగే ఆకతాయి అమ్మాయి, అపూర్వకృష్ణ వేసుకున్న జోళ్లను చూచి నవ్వు ఆపుకోలేకపోయింది.

అపూర్వ ఒక్కసారిగా ఆగిపోయాడు. అన్ని వైపులకు తలతిప్పి చూచాడు. అసలు సిగ్గు పడకుండా, దట్టంగా ఉన్న చెట్లనుంచి అమ్మాయి బయటకు వచ్చింది. కాళ్ళ ముందు అతని జోళ్లు పెట్టి, పరుగెత్తి వెళ్ళిపోసాగింది. కానీ అపూర్వకృష్ణ ఆమె చేయి పట్టుకుని ఆపగలిగాడు.

అమ్మాయి తప్పించుకోవడానికి పెనుగులాడింది. అటు ఇటు కదిలింది. కానీ ప్రయత్నం ఫలించలేదు.

ఆనందంగా ఉన్నా, ఆమె గుండ్రటి ముఖం మీద, చెట్ల మధ్యలో నుంచి ఎండ ప్రతిఫలించింది. దాని చుట్టూ ఉంగరాల జుట్టు ఉంది. ప్రవహించే నీళ్ల మీద ఎండ పడినప్పుడు ప్రయాణికుడు కుతూహలంగా చూసినట్టే, అమ్మాయి పైకెత్తిన ముఖంలోని కళ్ళలోకి లోతుగా చూచాడు మన అపూర్వ.. మెరుపులాగా చంచలమైన కళ్ళు చూస్తూ అతను తను పట్టుకున్న అమ్మాయి చేయి వదిలేశాడు. బందీని వదిలినట్టు, తప్పు భావం కూడా అతని మదిలో తోచింది. అతడు గాని ఆ అమ్మాయి మీద చేయి చేసుకుంటే ఆమె ఎంత మాత్రం ఆశ్చర్యపోయేది కాదు. ఏకాంతంగా ఉన్న, చుట్టూ ఎవరూ లేని ఆ దారిలో అతని మెత్తని ప్రవర్తన వెనుక గల అర్థాన్ని మాత్రం, ఆమె అర్థం చేసుకోలేకపోయింది.

ప్రకృతి నాట్యం చేస్తుంటే ఖాళీ గజ్జెలు గలగలనాటినట్టు అదేపనిగా సాగుతున్న నవ్వు మాత్రం ఆకాశమంతటా నిండింది.

 

మూడవ భాగం

 

ఆ రోజంతా అపూర్వ అమ్మను తప్పించుకుని తిరిగాడు. అందుకు ఏవేవో సాకులు చెప్పాడు. లోని గదులలోకి వెళ్ళనే లేదు. అతడిని ఎవరో భోజనానికి పిలిచారు, కనుక అక్కడకు వెళ్లి తిన్నాడు. అపూర్వ బాగా చదువుకున్న మనిషి. గుంభనంగా ఉంటాడు. మంచి ఆలోచనలు గలవాడు. పోయిన తన గాంభీర్యాన్ని గురించి అతను ఇంతగా కుమలడానికి గల కారణం చెప్పడం అంత సులభం కాదు. అవతలి వ్యక్తి ఏమి తెలియని ఒక అమ్మాయి. ఆమె ముందు తన గొప్పదనాన్ని అంతగా పోగొట్టుకున్న భావం అతనికి నిజానికి అనవసరం. ఓ పల్లెటూరి పిచ్చి పిల్ల తన గురించి ఏమనుకుంటే మాత్రం అతనికి అంతగా ఎందుకు. ఆమె అతగాడిని చూసి నవ్వింది. అతడిని చూసి నవ్వవచ్చు అనుకుంది.  అంతట్లోనే అదే అమ్మాయి రాఖాల్ లాంటి చదువు లేని ఒక కుర్రవాడితో ఆడుకోవడానికి పరుగులెత్తుతుంది. ఆ సమయంలో తన గురించి పట్టించుకోనే పట్టించుకోదు. అటువంటి అమ్మాయి ముందు తాను ఒక సాహిత్య విమర్శకుడిని అని, ఏ లాంప్ టు ద వరల్డ్ అనే పత్రికతో తనకు సంబంధం ఉందని రుజువు పరుచుకోవాల్సిన అవసరం ఉందా? తన వద్ద మంచి అత్తరు బుడ్డీలు, మేలైన కాలి జోళ్ళు, రూబిన్ కర్పూరం, రంగు రంగుల కాగితాలు, హార్మోనియం నేర్చుకోవడం ఎలా అనే పుస్తకం, అలాగే రాత్రి కడుపుని చీల్చుకుని బయటపడడానికి ఉదయ సూర్యుడు వేచి ఉన్నట్టే, అచ్చు కోసం వేచి ఉన్న తన రచనలతో నిండిన నోట్ బుక్, కూడా ఉందని రుజువు చేయవలసిన అవసరం లేదు. అయితే మనసుతో చర్చ చేయడం నిజంగా కొంచెం కష్టమే. కనుకనే అపూర్వకృష్ణ రాయ్, బి ఏ, ఒక తుంటరి పల్లెటూరి పిల్ల ముందు ఓడిపోవడానికి నిరాకరిస్తున్నాడు.

అపూర్వ తన ఇంట్లోకి వెళ్ళాడు. అమ్మ ఎదురయింది. సరేగాని అపూ, అమ్మాయి గురించి ఏమంటావు? నచ్చిందంటావా?” అని అడిగింది.

అపూర్వ ధైర్యంగానే జవాబు ఇచ్చాడు. అవునమ్మా, అమ్మాయిలను చూచాను. వాళ్లలో ఒకరు నాకు నచ్చారు, అన్నాడతను.

ఎంతమంది అమ్మాయిలను చూచావేమిటి, ఆమె ఆశ్చర్యంగా అడిగింది.

కొంత బెట్టుసరి సాగిన తర్వాత ఒక విషయం అర్థమయింది. పక్కింటి శరత్ కూతురు, మృణ్మయిని తన కొడుకు పెళ్లి చేసుకోవాల నుకుంటున్నాడు అన్నది, ఆ సంగతి. ఇంత చదువుకున్న తరువాత ఇదన్నమాట నిర్ణయం.

అపూర్వ ముందుగా కొంచెం సిగ్గుపడ్డాడు. తల్లి మాత్రం ససేమిరా వీల్లేదు, అన్నది. అతను తన గట్టి పట్టును సాగించాడు. తను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కుదరదు, అంటే ఇక తనకు పెళ్లి అవసరం లేదు, అన్నాడు. బుట్టబొమ్మ లాగా కనిపించిన, ప్రవర్తించిన మరో అమ్మాయి గురించి ఆలోచించిన కొద్దీ, ఆమెతో పెళ్లి అసలు కుదరదు, అన్న భావం అతని ముందు బలంగా నిలిచింది. రెండుమూడు నాళ్లు వాదప్రతివాదాలు జరిగాయి. ఉపవాసాలు, నిద్రలేమి సాగాయి. తల్లి ముందు, అపూర్వ గట్టి పట్టు పట్టాడు. తల్లి కూడా కొంత పట్టు సడలించింది. మృణ్మయి నిజానికి చిన్నపిల్ల. ఆమె తల్లికి, తన పిల్లకు చదువు చెప్పించే స్తోమత లేదు. ఇక తానే తన కోడలికి నచ్చజెప్పి, ఆమె తీరు మార్చాలి, అనుకున్నది ఆమె. మృణ్మయి ముఖం అందంగా ఉందని కూడా తనకు తాను నచ్చజెప్పుకున్నది. ఆమె అదంతా సాధించిన తరువాత, మరోసారి ఆమె మనసు కృంగి పోయింది. ఆలోచనల్లో మృణ్మయి పొట్టిజుట్టు ఎదురయింది. కానీ అది కూడా సమస్య కాదు. తలకు బాగా నూనె పట్టించి, ముడికట్టి ఉంచితే పోతుంది, అనుకున్నది ఆమె.

ఇరుగుపొరుగు వాళ్లు అతని ఎంపికను చాలా మెచ్చుకున్నారు. అతని పేరులోనే ఆ తీరు ఉందన్నారు. అమ్మాయి ఎలాగున్నా వాళ్లందరికీ ఎంతో ఇష్టమయినదే. అయితే ఆమెను కోడలుగా చేసుకోవాలంటే మాత్రం ఎవరూ ముందుకు రారు.

మృణ్మయి తండ్రి ఈషాన్ మజూందార్ కు సంగతి సకాలంలో తెలియజేశారు. ఆయన ఒక స్టీమర్ కంపెనీలో గుమాస్తాగా పని చేస్తుంటాడు. ఆ చోటు నదీతీరం మీద ఎక్కడో ఉంటుంది. పనిలో భాగంగా అతను టికెట్లు అమ్ముతుంటాడు. సరుకులు ఎక్కించడం, దించడం, చేయిస్తుంటాడు. రేకు పైకప్పు గల ఒక గుడిసెలోనుంచి ఆ పనులన్నీ సాగిస్తుంటాడు.

తన మృణ్మయి పెళ్లి ప్రస్తావన వార్త అందగానే, అతని కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. వాటిలో తన కూతురు తననుంచి దూరం అవుతుందని వచ్చినవి ఎన్ని, ఆనందంతో వచ్చినవి ఎన్ని, చెప్పడం మాత్రం కుదరదు. విదేశంలో ఉన్న యజమానిని శెలవు కోసం అడిగాడు. అతనికి మాత్రం అదేదో గొప్ప విషయంలాగ కనిపించలేదు. శెలవు లేదు పొమ్మన్నాడు. వారం రోజులు శెలవు దొరుకుతుంది, గనుక పెళ్లి దుర్గాపూజ సమయంలో పెట్టండి, అని అతను అడిగాడు. అపూర్వ తల్లికి అంతవరకు వేచి ఉండడం ఇష్టం లేదు. పెళ్లి ఎలాగయినా ఆ నెలలోనే జరగాలి, అని నిర్ణయించింది ఆమె. మంచి ముహూర్తం ఉందని పట్టుదల. అటూయిటూ తన ప్రార్థనలు పనిచేయలేదని ఈశాన్ ఏ ఆనందమూ లేకుండా తన సరుకులు తూచే పనిలో, టికెట్లు అమ్మడంలో, మునిగి పోయాడు.

ఆ తరువాత మృణ్మయి తల్లీ, ఊళ్లోని మిగతా ఆడంగులు, అమ్మాయికి రాబోయే కాలంలో, ఉండవలసిన తీరు గురించి సలహా లివ్వను, మొదలు పెట్టారు. ఆటలాడడం, అటూయిటూ పరుగులు పెట్టడం, అబ్బాయిలతో కలిసి ఆడడం, ఆకలికొద్దీ తినడం లాంటివన్నీ, ఇక పనికి రావని చెపుతూ, వ్యవహారాన్ని మొత్తంగా ఒక పెద్ద రాక్షస లక్షణం, కింద వర్ణించ సాగారు. మృణ్మయికి అంతా చికాకుగా ఉంది. తనకేమయినా ఆజీవ కారాగారం, ఆ తరువాత మరణదండన విదించారేమోనని, ఆమె ఆశ్చర్య పడసాగింది.

అడవి గుఱ్ఱం పిల్లలాగ వెనక్కు కదిలి నేను పెళ్లి చేసుకోను అంటూ తెగేసి గట్టిగా చెప్పేసింది.

 




No comments: