Saturday, January 31, 2026

రుచిలేని కుక్కరు బ్రతుకులు Cooker Bratuklu

రుచిలేని కుక్కరు బ్రతుకులు


తిండి గురించి నా వ్యాసం.

Thursday, January 29, 2026

శ్రీపాద గురించి వాకాటి మాటలు : Vakati Pandurangarao's words about Sripad...


శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి గురించి

వాకాటి పాండురంగరావు గారి మాటలు 


అత్తరు’ శాస్త్రిగారు

          తెలుగు కథావనంలో విరబూసిన దివ్యపారిజాతం సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీపాదం!  పదాలలో అన్నమయ్యా, పద్యాలలో వేమనలకు వలెనే కథలలో అచ్చతెనుగుతనం ఆఘ్రాణించాలి అంటే శ్రీ పాదవారే శరణ్యం. వారి కథలకు వారే నిర్వచనం, వారే కొలమానమున్నూ.... గోదావరికీ కోనసీమకూ కూడా అంతే కదా!

          నాకో మంచి నవల చదవాలినిపించినప్పుడెల్లా నేనో నవల రాసుకుంటాను’ అన్నాట్ట బెంజమిన్‌ డిజ్రాలీ.... బహుశ శాస్త్రిగారూ అలాగే రాసివుండాలి  తమ కథల్ని.

          కథలంటే ఏమిటో, వాటి పరమార్థం ఏమిటో ఈ సంపుటిలో కాపురం చేస్తున్న, వారి కథాదీపం ‘మార్గదర్శి’ అన్నదాన్లో ఆయనే వివరంగానే చెప్పారు.

          ‘‘కథలంటే పైపైని వున్నాయనుకున్నావేమో! అవి కల్పించడానికి చాల గొప్ప ప్రతిభ వుండాలి. వాటి విలువ తెలుసుకోవడానికెంతో పరిజ్ఞానం వుండాలి. అవి చెప్పడానికి ఎంతో నేర్పుండాలి......కథలు కళ్ళకు వెలుగిస్తాయి. బుద్ధికి పదును పెడతాయి. మనస్సుకి ఉత్సాహమూ ఉల్లాసమూ కల్గిస్తాయి. జడునకున్నూ కల్పనాశక్తి ప్రతిపాదిస్తాయి.’’

          కల్పనా ప్రతిభ, విశిష్టమైన పరిజ్ఞానం, కథన కౌశలం ` ఇవి పుష్కలంగా పండిన మాగాణి వారి కథల సీమ. వారి కథ దేనిని తీసుకున్నా వెలుగు, పదును, ఉత్సాహం, ఉల్లాసం పఠిత సంస్కార వైశాల్యాన్ని బట్టి పసిఫిక్‌ మహాసముద్రమంతగా లభిస్తాయి.

          మధునా పంతుల సత్యనారాయణశాస్త్రిగారి మాటలలో చెప్పాలంటే శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘‘ఆంగ్లము కాని, వంగము కాని, మఱియొక వాజ్మయము కాని మర్యాదకైనను చదివిచూచినవారు కారు. విశేషించి ‘హిందీ’ని చేరదీయరాదని వారి వాదము `’’ శ్రీపాద వారిలోని ఈ అంశ ఆయకే చేతనయిన వ్యంగ్య వైభవమంతా సంతరించుకుని ‘శుభికే శిర ఆరోహ’ అన్న ఈ సంపుటిలోని కథ నిండా పరుచుకుని వుంది. ఈ క్రింది సంభాషణ చిత్తగించండి.

          ‘‘ఉత్తరదేశం రాతలో రమా అనే వుంటుందిÑ కాని పలుకుబడి రొమా అని.’’

          ‘‘ఉన్నది ఉన్నట్టే పలికితే యేం?’’

          ‘‘పనికి రాదు, సంస్కృత భాషా సంప్రదాయ ప్రకారం ‘రొమా’ అనే పలకాలి. మనవాళ్ళకి హ్రస్వాకారం యెలా పలకాలో తెలియదు.’’

          ‘‘అయ్యో... అయితే అ ఆలు ఎలా పలకాలంటావోయ్‌?’’

          ‘‘ఓ ఆ అని!’’

          (ఇదంతా విని మూడోపాత్రయిన అన్నపూర్ణ అంటుంది) ‘‘మరి అంత తెలిసినవాడు కదా ఓ ఆ అని, అంటాడేమిటి బావ, నాన్నారూ, ‘ఒఆ  ఒని ఒనాలి’ కాదండి!’’

          1891`1961 సంవత్సరాల మధ్య జీవించిన ఈ కథక చక్రవర్తి ఆనాటి సమాజంలో పెల్లుబికిన అనేకానేక మార్పుల ఉప్పెనలను చదివి, వాటి దిశనూ సారాంశాన్ని గ్రహించి, తన కథలలో ఎంతో పోడిమితో పోహణించారు.

          తలిదండ్రులు ` పిల్లలు, సంప్రదాయం ` ఆధునికత, కులము ` గుణము, పెళ్ళి ` ప్రేమ, బానిసత్వం ` స్వాతంత్య్రం లాంటి ద్వంద్వాలన్నిటిలోనూ ఆయన అటుకన్నా ఇటే మొగ్గి తాను ఇరవయ్యవ శతాబ్దం వాడినని మాత్రమే కాదు, ఇరవయ్యొకటవ శతాబ్దానికి కూడా స్నేహితుడినేనని నిరూపించారు. ఇది చాల హర్షణీయమైన అంశమేÑ కాని శ్రీపాద వారిలో, ఆధునికతలోని అపస్వరాలను పసిగట్టి ప్రక్కకు పెట్టగల తెంపరితనమూ వుంది. అందులోనే  ఆయన పరిపక్వత, పరిపూర్ణత ద్యోతకమవుతాయి. ఈ క్రింది వాక్యాలు గమనించండి.

          ‘‘అడుక్కు తింటూ చెట్టుకింద కాలం గడిపే వాళ్ళని దరిద్రులంటుంది మన సంఘం. ఇది అర్థంలేని మాట. వాళ్ళకి కావలసినంత శక్తి వుందిÑ కాని దానికి వినియోగం లేదు అంతే. అలా లేకపోవడానికి సన్నికృష్ట కారణం. వాళ్ళకి సిగ్గు బిడియమూ లేకపోవడంÑ విప్రకృష్ణ కారణం మన ఆధ్యాత్మిక దృష్టి... ఆధ్యాత్మిక దృష్టి యెప్పుడేర్పడ్డదో అప్పుడే మన పతనం ప్రారంభం అయింది మనకు దాస్యం బలపడినకొద్దీ ఆధ్యాత్మిక చింత పెరిగిపోయింది.’’ అంటూ నిశితంగా మన ఆధ్యాత్మిక దృష్టిని తూర్పారబట్టిన కలమే`

          ‘‘వేద కాలం నుంచీ మన దేశంలో పట్నాలే కాదు నగరాలూ వుండినాయి. అప్పుడు కూడా మన పట్నాలకూ, నగరాలకూ వుండిన ఆకర్షణ, గౌరవమూ పల్లెలకు లేశమూ లేదు. అలా అని అప్పుడెవరూ పల్లెలను నిరసించనూలేదు. నగరాలను దుమ్మెత్తి పోయ్యనూలేదు..... మనం మహోన్నత నాగరికత అనుభవించిన  దినాల్లో పాశ్చాత్యులు ఇప్పుడు మనం వుండిన స్థితి కంటే అధ్వాన్నస్థితిలో వుండినారు`’’

          అని ఆనాటి మేలి అంశాలనూ ఎత్తి చూపగల్గింది.

          ఇంకొక వాక్యం చూడండి.

          ‘‘మనిషి వల్ల వర్తకం పాడవుతోందిÑ గాని వర్తకం వల్ల మనిషి యెన్నడూ పాడయిపోడు `’’ అన్న కీలకవాక్యం నేటి అమెరికా ధోరణి నుండి భారత్‌ లోని బ్యాంక్‌ల ` స్టాక్‌ విఫణుల భాగోతాలదాక వున్న వికారాలకు అర్థం చెప్పడం లేదూ?

          అందుకే శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు వేళ్ళున్న ప్రపంచస్థాయి రచయితగా కనిపిస్తాడు.

          శాస్త్రిగారు చేయి తిరిగిన నాటక రచయిత. అందువల్లనే ఆయన కథలలో కూడా నాటక రచయిత కుండవలసిన దృష్టి వైశిత్యమూ, వర్ణనా వైశాల్యమూ, పాత్ర చిత్రణము, సంభాషణా వైదగ్ధ్యమూ ప్రతిపంక్తిలోనూ సాక్షాత్కరిస్తాయి. అది ఆవిడ వాళ్ళాయనవైపు చూచిన చూపే కానివ్వండి ` ఆడపడుచు నోట నుండి కురిసిన నిప్పుల వానే కానివ్వండి ` దివాన్జీ గారి గీర్వాణమే కానివ్వండి`  ఒకదాత నిర్లక్ష్యం పరికింపుగా, పరికింపు పలకరింపుగా, పలకరింపు సానుభూతిగా,  సానుభూతి శ్రద్ధగా, శ్రద్ధ స్నేహంగా, స్నేహం బంధంగా అంచెలంచెలుగా మెట్లెక్కి మనం అలా చదువుతుండగా మాట వర్ణనయి, వర్ణన జీవమయి, జీవం వ్యక్తి అయి, ఆ వ్యక్తి నువ్వయి, నేనయి ` మనం కథను చదివే పాఠకులమా, లేక అందులోని పాత్రలమా అన్పించేంత అల్కెమీల చిరపుంజీలూ, చిరంజీవులూ ఆయన కథలు.

          కథను చెక్కడంలో శ్రీపాద వారొక మహాశిల్పిÑ నేపథ్య నిర్మాణంలో శాస్త్రిగారొక చిత్రకారుడుÑ వర్ణనల విషయంలో ఎక్స్‌రే కలం ఆయనది. రెండో మూడో పాత్రలను తీసుకుని చాలా అమాయకంగా కథనెత్తుకొని క్లిష్టమైన సన్నివేశాల్లోకి మన గుండెల్ని పట్టుకుని లాక్కువెళ్ళి శతఘ్నులు పేల్చగల ఫీల్డ్‌ మార్షల్‌ ఆయన.

           ఈ సంపుటిలోని ` ‘వడ్లగింజలు’ లక్ష్మీ సరస్వతుల మధ్య జరిగిన చదరంగంÑ స్నేహకరచాలనంతో ముగిసిన ఉజ్వల కథనవిలాసం.

          శుభి కే! శిర ఆరోహ।, కన్యాకాలే యత్నా ద్వరితా’ ` శాస్త్రిగారికి వల్లమాలిన ప్రీతిగల సంసార ప్రేమ కథాక్షేత్రంలోని భామాకలాపాలు.

          మార్గదర్శి’ ` అన్ని భాషలలోకి అనువదించి మెట్రిక్‌ పాసయిన ప్రతి వారికి ఉచితంగా పంచిపెట్టవలసిన స్నాతకోత్సవ రచన. దానితో బాటే అందించవలసిన సులోచనాల వంటి కథ ‘తాపీమేస్త్రి రామదీక్షితులు బి.ఎ’

          ఇక మిగిలిందల్లా షకూరల్లీఖాను అంటే సాక్షాత్తూ శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రిగారే! అత్తరు సౌరభం కంపుగా వెలవరించుకున్న దివాంజీలు మనమే, తెలుగు పాఠకులమే! ఇప్పటికీ గుబాళిస్తూన్న ‘గులాబీ అత్తరు’ సీసాలా....?

Wednesday, January 28, 2026

కరెంటు - మిఖయిల్ జోషెంకో : రష్యన్ కథ

కరెంటు

మిఖయిల్ జోషెంకో  : రష్యన్ కథ


కరెంటు

మిఖయిల్‌ మిఖయిలోవిచ్‌ జోషెంకో

ఇవాళ రేపు, అన్నలారా, అన్నిటికంటే ఫ్యాషనబుల్‌ మాట ఏమిటి?

ఇవాళటి అన్నిటికన్నా ఫ్యాషనబుల్‌ మాట అదే, “కరెంటు, అంటే ఎలక్ట్రిఫికేషన్‌'.

సోవియట్‌ రష్యాని కరెంటు లైట్లతో వెలిగింపజేయడం అన్నది (ప్రస్తుతం చాలా ప్రాముఖ్యతగల విషయం అనడంలో

అనుమానంలేదు. కానీ, ప్రస్తుతానికి, అందులో కొంత అసౌకర్యంగా కూడా ఉంది. నేనంటున్నది, కామ్రేడ్స్‌, దాని ధర ఎక్కువగా ఉందని మాత్రం కాదు. దానికి డబ్బులు కావాలి అంతే. లేదు, నేను చెప్పేది మరొకమాట.

నేను చెపుతున్నది ఇది:

నేను, కామ్రేడ్స్‌, ఒక పెద్ద బిల్డింగ్‌లో బతుకుతున్నాను. ఆ మొత్తం బిల్డింగ్‌లో పారఫిన్‌ మైనం వాడతారు. మాలో కొందరికి

దీపాలున్నాయి. కొందరికి వత్తి వేసిన నూనె దీపాలున్నాయి. ఇక అందరికన్నా బీదవాళ్లు చర్చ్‌ కొవ్వొత్తులతో పని గడుపుకోవాలి.

బతుకు అంత సులభమయినది కాదు.

ఇక అప్పుడు అందరూ లైట్లు పెట్టించసాగారు.

మొట్టమొదట హౌజ్‌ మేనేజర్‌ ఇంట్లో. తన గదిని అతను వెలుగుతో నింపాడు

- అంతే. ప్రశాంతంగా ఉంటాడు. అతని

ఆలోచనలను బయట పడనివ్వడు. వింతగా అటూఇటూ తిరుగుతూనే ఉంటాడు. తెలియకుండానే తరచూ ముక్కు చీదుతూ ఉ౦టాడు. అయినాసరే తాను దేన్నిగురించి ఆలోచిస్తున్నాడన్నది మాత్రం బయటకు రానివ్వడు.

ఇక అప్పుడు మా ఆవిడ అనే, యెలిజవెతా ఇగ్బాత్యేవ్నా |ప్రాఖరోవా, లోపలికి వచ్చేసింది. మనం కూడా అపార్ట్‌మెంట్‌ని

వెలిగించాలంటుంది. అందరూ లైట్లు పెట్టిస్తున్నారు. డైరెక్టర్‌ కూడా లైట్లు పెట్టించాడు" అంటుంది ఆమె. కనుక - ఇక - మేమూ అదే పని చేశాము.

లైట్లు పెట్టేశారు. అపార్ట్‌మెంట్‌ వెలుగుతో నిండింది - ఓహో పైలోకం! ఏం మురికి, ఏం చీదర!

అప్పటివరకు, నీవు పొద్దున్నే లేచి పనిలోకి పోతావు, సాయంత్రం తిరిగి వచ్చేస్తావు, నీటీ తాగేస్తావు, ఇక పడక చేరుకుంటావు.

కేవలం పారఫిన్‌ వెలుగులో ఒక్క విషయం కూడా నీవు చూడజాలవు. మరి ఇప్పుడో వెలుగు నిండిపోయిన తరువాత – గోడమీద ఊడి ఊగిసలాడుతున్న వాల్‌పేపర్‌ ఇంకా నేలమీద పడిఉన్న ఎవరిదో అరిగిపోయిన స్లిప్పర్‌ అన్నీ కనబడతాయి. పాకుతున్న ఒక నల్లి, వెలుగునుంచి తప్పించుకుపోవడానికి ప్రయత్నిస్తూ నీకు కనబడుతుంది. ఇక్కడొక పాత చింపుగుడ్డ, అక్కడొక ఉమ్మి కళ్లె, ఒక సిగరెట్‌ ముక్క ఎగురుతున్న ఒక మిన్నల్లి....

ఓహో పైలోకం! నైట్‌ వాచ్‌మన్‌ను పిలవడానికి ఇక అది చాలు. అలాంటి దృశ్యం చూడడం దు:ఖకరం.

మా గదిలో, ఉదాహరణకు, మాకొక సోఫా ఉంది. అది ఏమంత చెడ్డ సోఫా కాదని నేను ఎప్పుడూ అనుకునే వాడిని -

నిజానికి మంచి సోఫా అనుకున్నాను! సాయంత్రాలలో నేను దానిమీద కూచునేవాడిని. ఇక ఇప్పుడు & ఎలక్ట్రిసిటీతో - ఓహో

'పైలోకం! అది సోఫానా! అక్కడా ఇక్కడా పైకి చొచ్చుకువచ్చిన ముక్కలు, కొన్ని వేళ్లాడే ముక్కలు, కొన్ని రాలిపడుతున్న ముక్కలు.

అటువంటి సోఫా మీద నేను ఎలా కూచోగలను? నా ఆత్మ ఘోషిస్తున్నది.

లేదు, నేను, పెద్ద లగ్జరీలో బతుకుతున్నానని అనుకోవడం లేదు. చూచిన ప్రతి వస్తువూ తిరగబడుతున్నట్టు కనబడుతున్నది.

చేస్తున్న ప్రతి పని తప్పుదారి పడుతున్నది.

అప్పుడు నేను డియర్‌ ఎలిజబెతా ఇగ్బాత్ర్యేవ్నాను చూచాను. ఆమె దు:ఖంగా కనిపించింది. తనలో తాను మాట్లాడుకుంటున్నది.

వంటింట్లో వస్తువులను సర్దుతున్నది.

'దేని గురించి దుఃఖంగా ఉన్నావు, నా ప్రియమయిన భార్యామణీ?” నేను అడిగాను.

ఆమె భుజాలు ఎగరేసింది.

ప్రియమయిన మగాయనా, ఇంతకాలంగా నేను ఎంత మురికి బతుకు గడిపానో నాకే తెలియదు” ఆమె అన్నది.

నేను మా వస్తువులవేపు చూచాను. పెద్ద గొప్పవి ఏమీ కావని అనుకున్నాను. మురికి, ఇంకా చీదర, ఒకరకం పీలికలు, ఇక మరోరకం పీలికలు, అన్నింటిమీదా వెలుగు వెల్లువెత్తి అన్నీ నీకంట్లోకి సూటిగా చూస్తున్నాయి.

సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు నాకు నోట్లో ఏదో తట్టుకున్నట్టు ఉంటుందని, మీరు అనవచ్చు.

నేను వస్తాను, లైటు వేస్తాను, కొద్దిసేపు దాన్ని బాగా చూస్తాను, ఆ తరువాత మాత్రం ముఖాన్ని తలగడలో దాచుకుంటాను.

అప్పుడు నేను ఆలోచనలో పడతాను. జీతం అందుకుంటాను. ఆ తరువాత సున్నం కొన్నాను, దాన్ని బాగా కలిపాను - ఇక

పనిలోకి దిగాను. వాల్‌ పేపర్‌ని లాగేశాను, నల్లులను నలిపేశాను, బూజులను దులిపేశాను. సోఫాను సర్దాను, రంగులు వేశాను,

పొంగిపోతూ చూచాను - నా ఆత్మ ఇప్పుడు పాడుతూ ఆనందంగా ఉంది.

నేను మంచిపని చేశాను. కానీ మరీ అంత మంచిపని కాదు. అంతా వ్యర్థమయింది ప్రియమయిన అన్నలారా, ఆ డబ్బులన్నీ

గాలిలో పోయాయి. మా ఆవిడ తీగలు కత్తింరించేసింది.

లైటు ఉంటే బతుకు భయంకరమయిన మురికిగా కనిపిస్తుంది, ఏమంటావ్‌, మన బీదతనం మీద లైటు వెలిగించడమేనా?

నల్లులు కూడా నవ్వలేక చచ్చిపోతున్నాయి” అన్నది ఆమె.

నేను ఆమెను అడుక్కున్నాను, ఆమెతో వాదం వాదించాను. అయినా లాభం లేదు.

కావాలంటే నీవు మరో అపార్ట్‌మెంట్‌లోకి మారవచ్చు. నేను మాత్రం లైట్‌లో ఉండడానికి రాను. నా దగ్గర ఇంటిని మళ్లీ

బాగు చేయించడానికి, దాన్ని కొత్తదిగా మార్చడానికి డబ్బులు లేవు” ఆమె చెప్పింది.

కానీ, నేను మాత్రం ఎలా మారగలను, కామ్రేడ్స్‌, సున్నం పేరున బోలెడంత ఖర్చు పెట్టాశాను మరి? నేను లొంగిపోయాను.

లైట్లు మంచివే, అన్నలారా, కానీ వాటితో బతకడం మాత్రం సులభం కాదు.

(1924 కథ)



Monday, January 26, 2026

లోకాభిరామం - బయటి తిండి


లోకాభిరామం

బయటి తిండి 


బయట తిండి

అవుట్‌ సైడ్‌ పుడ్‌ అవాయిడ్‌ చేయడానికి ట్రై చేస్తాను అంటుంది మా యజమానురాలు. అక్కడికి ఆవిడ అదేపనిగా బయట తిండి తిన్నట్టు మాట్లాడిన భావం మీకు కలిగితే బాధ్యత నాది కాదు. అవుట్‌ సైడ్‌ లో ఏం దొరుకుతుందో కూడా ఆమెకు తెలియదు.

సాంబశివయ్య గారు బడిలో పిల్లలకు బజారు తిండి తినకూడదు అని భారీ ఎత్తున ఉపన్యాసం చెప్పి అదే సాయంత్రం బండి పక్కన నిలబడి రెణ్ణాల బజ్జీలు ఇయ్యవయ్యా, అన్నాడని మా విజయ చెప్పి తెగ నవ్వేది. అంటే రెండు అణాల అని అర్థం. బండి మనిషికి సంగతి అర్ధం అయిందో లేదో అప్రస్తుతం. మనం ఇప్పుడు తిండి గురించి మాట్లాడుకుంటాం.

పల్లెకే పరిమితం అయినప్పుడు ఐస్క్రోట్‌ అనే ఐస్‌ ఫ్రూట్‌ తినడం వరకు అనుమతి ఉంది. అప్పుడో ఇప్పుడో బొంబాయి మిఠాయి

అనే పీచు మిఠాయి అనే షుగర్‌ క్యాండీ అరుదుగా అమ్మడానికి వస్తే దాన్ని కొని తిన్నాము. అదే మరి జిగురుగా ఉండే మరో చక్కెర

మిఠాయి తినడానికి అనుమతి లేదు. దాన్ని నాకవలసి ఉంటుంది. చెరువులో దొరికే దుంపలను ఉడకబెట్టి అమ్మేవారు. పచ్చి దుంపలను తెచ్చి ఉడక పెట్టాలి అంతేగాని ఉడకపెట్టిన దుంపలు తినడానికి అనుమతి లేదు.

పాలమూరు చేరిన తరువాత పరిస్థితి కొంచెం మారింది. అక్కడ మిరపకాయ బజ్జి రుచి తెలిసింది. పాలమూరులో విషయంలో ఒక ప్రత్యేకత కూడా తెలిసింది. కట్‌ మిర్చి అని ఒక విశేషమైన పదార్థం దొరికేది. మామూలు మిరపకాయ బజ్జీలను ముక్కలుగా కోసి మళ్లీ నూనెలో వేపి వాటిమీద మసాలా వేసి మరీ అమ్మేవారు. రుచిగా ఉండడమే కాక అవి బహుశా కడుపుకు కూడా అంత హాని కలుగ చేసేవి కావు. నాకు వాటి మీద ఇష్టం కలిగింది. జేబులో చిల్లుకానీ ఉండేది కాదు గాని ఇటువంటి కోరికలు ఎలాగో తీరేవి.

కొంతకాలానికి గంజి అంటే గంజు అంటే ధాన్యం బజారు అనే ప్రాంతంలో ఒక ఉత్తర భారత బ్రాహ్మణుడు నడిపించే చాట్‌ బండి గురించి తెలిసింది. గప్‌ చుప్‌ లేదా పానీ పూరి అనే ఒక కొత్త విశేషం అర్థం అయింది. దానికి మా వాళ్ళందరూ అభిమానులుగా మారారు. అంటే మిత్రబృందం అన్నమాట. కాలంలో నాలుగు అణాలకు కట్లెట్‌, మరో నాలుగు అణాలకు గప్ ప్ లు వచ్చేవి. నలుగురం కలిసి వెళ్లి తిన్నా రెండు రూపాయలు మాత్రమే. రెండు రూపాయలు నా దగ్గర ఉన్నాయని మాత్రం కాదు. బండి బ్రాహ్మణుడు సాయంత్రం పూట మాత్రమే వ్యాపారం కోసం బయటకు వచ్చేవాడు. మిగతా సమయంలో ఇంట్లోనే ఉండేవాడు. మా వాళ్లు ఇంటిని కనుగొన్నారు. మనసుకు వచ్చినప్పుడు అతను ఇంటికి వెళ్లడం మొదలైంది. అతను వంట చేస్తున్న ఛాయలకు కూడా రానిచ్చేవాడు కాదు. ఒక బెంచి మీద దూరంగా కూర్చోమనే వాడు. మడి అన్న పద్ధతితో అడిగిన పదార్థాలను దొన్నెలలో తెచ్చి పైనుంచి చేతిలో పడేసేవాడు. మిగతావాళ్ల సంగతి తెలియదుగాని పద్ధతులు నాకు అలవాటు కనుక ఇంట్లోలాగే అనిపించేది. ఇంటికి దగ్గరలోనే ఉండే డీఈఓ ఆఫీస్‌ ముందు చెట్టుకింద తడికలతో ఏర్పాటుచేసిన ఖాన్‌ సాహెబ్‌ చాయ్‌ హోటేల్‌ ఉండేది. అతని దగ్గర టీ చాలా బాగుంటుంది అని అందరూ అనేవారు. ఆఫీసులోని పెద్ద వాళ్లతో మొదలు అలగాజనం దాకా అందరూ అక్కడే టీ తాగేవారు. నాకు నిజానికి టి అలవాటు లేదు. కానీ బంధువులైన ఒకరిద్దరు అన్నలతో ఒకసారి నేను అంగడిలోకి వెళ్లాను. మిరపకాయ బజ్జీలు కూడా తిన్నాము. టీ తాగడం సరేసరి. అయితే సంగతి ఇంట్లో వాళ్లకు ఎవరికో తెలిసింది. ఇక సాయంత్రం మామీద కోర్టు మార్షల్‌ లాంటి పెద్ద తతంగం నడిచింది. మేము కట్‌ మిర్చి, కట్‌ లెట్‌ కూడా తింటున్నామని తెలిస్తే బహుశా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే వాళ్లేమో!

నాకు పాలమూరులోనే ఉల్లిపాయ పకోడీల రుచి తెలిసింది. మొట్టమొదటి సారి ఎక్కడ తిన్నాను గుర్తులేదు కానీ కమల్‌ హోటేల్‌ అని ఒక చిన్న అంగడి దొరికింది. ఉత్తర భారతానికి చెందిన ఇద్దరు దంపతులు దాన్ని నడిపిస్తూ ఉండేవారు. వాళ్లు చాలా శుభ్రంగా చూడడానికి కూడా చక్కగా ఉండేవారు. అంగడి మొదట్లో కొంతకాలం అన్నయ్య వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉండేది. అప్పుడు అక్కడికి వెళ్లడం పెద్ద సమస్య కాదు. బడి కూడా పక్కనే ఉంటుంది. కనుక మిత్రులము అంతా చేరి అక్కడికి వెళ్ళేవాళ్ళం. పాలమూరులో మామూలుగా దొరకని కూల్‌ డ్రింక్స్‌ కూడా వాళ్ళు ఎవరో అమ్మవారు. రాస్ప్‌ బెర్రీ అనే రుచి అక్కడే పరిచయం అయింది. వాళ్లు అంగడి న్యూటౌన్‌ కు మార్చారు. అయినా సరే మేము వెళ్లడం ఆగలేదు. నిజానికి మా సాయంత్రాలు అక్కడే అంటే ప్రాంతంలోనే ఎక్కువగా గడిచేవి మరి.

పట్నం చేరిన తరువాత పరిస్థితి చాలా మారిపోయింది. హాస్టల్లో చేరాము అంటే మొత్తం తిండి మనవాళ్లు వండింది కానేకాదు. ఇక ఎక్కడపడితే అక్కడ తినడానికి సందేహం లేనేలేదు. పెద్దవాళ్లు ఊరిలో లేరు. ఎక్కడో దూరంగా ఉన్నారు. చాట్‌ రుచి పిలుస్తూనే ఉన్నది. కోఠీలో గోకుల్‌ చాట్‌ ఇప్పుడు అందరికీ మిరపకాయ బజ్జీలకన్నా బాంబుల కారణంగా ఎక్కువగా తెలుసు. మాకు మాత్రం ఇది కేవలం ఒకే ఒక్క మడిగె ఉన్ననాటి నుంచి తెలుసు. ప్రస్తుతం వ్యాపారాన్ని నడిపిస్తున్న అన్నదమ్ముల తండ్రి అద్భుతమైన మిరపకాయ బజ్జీలు వేసేవాడు. లోపల రెండు బెంచీలు ఉండేవి. వెళ్లి కూర్చుంటే వేడివేడిగా రకరకాల పదార్థాలు దొరికేవి. బాంబులు పేలిన తరువాత కూడా అంగడిలో మనుషులు నిలబడి తిండి తింటున్నారు అంటే నాకు గుండె కరిగి కాలువై ప్రవహిస్తుంది. ఘాతుకం తరువాత నాకు ప్రాంతంలో నడవాలంటేనే చిత్రమైన భావాలు కలుగుతుంటాయి. మరే దేశంలో అయినా అక్కడ ఒక స్మారక మందిరం కట్టి ప్రతినిత్యం పువ్వులు పెట్టే వారేమో. మనవాళ్లు చీమ కూడా కొట్టినట్టు ఇంకా మిరపకాయ బజ్జీలు అమ్ముకుంటున్నారు.

గోకుల్‌ గురించి ఆలోచిస్తుంటే ఒక విషయం జ్ఞాపకం వస్తున్నది. అంగడికి ఎదురుగా అంటే అమ్మాయిల కాలేజీ గోడ పక్కన చాలా ప్రసిద్ధి చెందిన చాట్‌ బండి ఒకటి ఉండేది. అది కూడా అసలు సిసలైన బాపన వ్యవహారం. పెద్దాయనకు బహుశా చొక్కా ఉండేది కాదేమో అని అనుమానం. బండిని తాకనిచ్చేవాడు కాదు. దూరంగా నిల్చోవాలి. తిండి వస్తువులను ఎత్తి చేతిలో పడేసేవాడు. అక్కడ రోకలికి మువ్వలు కట్టి మసాలా దంచుతూ ఉంటే వచ్చే లయబద్ధమైన చప్పుడు బండికి ప్రచారంగా పనికి వచ్చేది. చాలా రుచికరమైన చాట్‌ పదార్థాలు అతని దగ్గర తిన్నట్టు గుర్తున్నది. చిత్రంగా ఒక అప్రస్తుతమైన అంశం చెప్పాలా లేదా తెలియడంలేదు. బండి పెద్దమనిషికి ఒక అందమైన కొడుకు ఉండేవాడు. బొద్దుగా ఉన్న కుర్రవాడు తండ్రికి పనిలో సహాయపడుతూ వుండేవాడు. యుక్తవయసు వచ్చేసరికి అతను అబ్బాయి కాదు అమ్మాయి అని బయటపడింది. వ్యవహారం

ప్రపంచానికి తెలియదు. అప్పటికి నేను పరిశోధనలోకి వచ్చాను కనుక తోటి పరిశోధకుని వలన విషయం తెలిసింది. అది పక్కనపెడితే, తరువాత తండ్రి గాని కొడుకు గాని మళ్లీ కనిపించలేదు.

ఇక తరువాత పరిస్థితులు మారాయి. నేను ఒకరిద్దరు మిత్రులతో కలిసి హైదరాబాదులోని స్టీట్‌ పుడ్‌ మీద ఇంచుమించు పరిశోధన చేసినంత పని చేశాను. నాకు తెలియని బండిగాని కార్నర్‌ అంగడిగాని లేదు అంటే ఒకప్పటికి ఆశ్చర్యం కాదు. కేవలం నూనెలో వేపిన వేరుశెనగ పప్పు మిరపకాయ బజ్జీల మంటకు విరుగుడుగా ఇస్తారు కనుక పారడైస్‌ బస్టాండ్‌ పక్కన ఉండే కోమటి సోదరుల మిరపకాయ బజ్జీల బండి వద్దకు ప్రయత్నంగా ఎన్నిసార్లు వెళ్ళాము గుర్తులేదు. ఆలు టోస్ట్‌ , శాండ్విచ్‌ కోసం రాణీగంజి దాకా వెళ్ళేవాళ్ళం అంటే ఆశ్చర్యం లేదు.

దేశమంతా తిరిగాను. ఎక్కడా నాకు మిరపకాయ బజ్జీల వెర్రి కనిపించలేదుఏళ్ల క్రితం కలకత్తా వెళ్ళినప్పుడు అక్కడ చిత్రంగా వంకాయ బజ్జీలు అమ్మడం కనిపించింది. దాన్ని వాళ్లు బేగుని అన్నారు. బైంగన్‌ ను మరి వాళ్లు బేగున్ అంటారేమో! మద్రాసు అనే చెన్నపురిలో భేల్‌ పూరి లో మామిడికాయ ముక్కలు వేస్తే ఆశ్చర్యపోయాను. పాండీబజార్లో ఒకచోట తారుడబ్బాతో పొయ్యి తయారుచేసి వాటిమీద రకరకాల టిఫిన్లు వండిపెట్టిన అంగడిని చూసి ఆశ్చర్యపోయాను. రెండు పొయ్యిలమీద ఒక దానిమీద బాణలి మరొక దానిమీద పెనం ఉన్నాయి. బాణలిలో పూరీలు, బజ్జీలు తయారవుతుంటే, పెనం మీద చపాతీలు, దోసెలు తయారవుతున్నాయి. ఇద్దరు ముగ్గురు కన్నా పనివాళ్ళు ఎక్కువగా లేరు. తిన్నవాళ్లు తినగా చివరకు ఏం తిన్నావు అని అతను అడుగుతున్నాడు. ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. అంటే అందరూ అతని అభిమానులు, శ్రేయోభిలాషులు అని అర్థం. నేను రెండవ ఐటమ్‌ కొరకు అడిగే సందర్భంలో డబ్బుల ప్రసక్తి చేశాను. ముందు మీరు తినండి అన్నాడు అతను.

దశాబ్దాల క్రితం మద్రాస్‌లోని మరొక ఒక విచిత్రం చూచాను. ఒక యువకుడు మొత్తం బస్సును హొటేల్‌గా మార్చి ఉదయం సాయంత్రాలలో రద్దీగల ప్రాంతానికి తీసుకువచ్చి వ్యాపారం నడిపిస్తున్నాడు. ఆఫీసులకు వెళ్లే వాళ్లు కూడా అక్కడ ఉపాహారం ముగించుకుని మధ్యాహ్నానికి కావాల్సింది కూడా డబ్బాలో వేసుకుని వెళ్లడం నేను గమనించాను. అప్పట్లో ఆశ్చర్యం కలిగింది. ఆ పక్కనే ఒక చెత్తకుండీ పెట్టాడు. అరటి ఆకులు కాగితాలను అందులో వేయండి అంటున్నాడు. బస్సు బయలుదేరి వెళ్ళే సమయానికి చెత్తను కూడా తనతో పాటే తీసుకుపోతున్నాడు. ఇప్పుడు ఇటువంటి మొబైల్‌ పుడ్‌ యూనిట్లు ప్రపంచంలో అన్నిచోట్లా కనబడుతున్నాయి. కానీ నేను 40 ఏళ్ల క్రిందటి సంగతి చెబుతున్నాను.

దిల్లీలో దారి పక్కన తిండి గురించి నిజంగా చెప్పాలంటే పెద్ద పుస్తకమే రాయాలి. చాందినిచౌక్‌ లోని వేడివేడి జిలేబి, గలీ పరాఠేవాలీలోని పరాఠాలు, శివాజీ స్టేడియం బస్‌స్టాప్‌ లోని ఆలుచాట్‌, మండీ హౌస్‌ పక్కన ఉండే గుండ్రని మార్కెట్లోని మిఠాయి అంగళ్ళు, అన్ని దేనికదే ప్రత్యేక ఆకర్షణగా నిలబడగలవి. నగరంలో చలి, ఎండ రెండు విపరీతంగా ఉంటాయి. కనుక వేసవికాలంలో చల్లని రసగుల్లాలు, చలికాలంలో వేడివేడి గులాబ్‌ జామున్‌లు తినడం అక్కడే బాగా అలవాటు అయింది. చాందిని చౌక్‌ జలేబిలను వెతుకుతూ ప్రపంచం నలుమూలల నుండి మధురప్రియులు వస్తారు అని అర్థం అయింది. నిజంగానే అక్కడ ఏదో ప్రత్యేకత ఉన్నట్టు తోచింది. ఇక రాజధాని నగరంలో తిండి పరిస్థితి గురించి పరిశీలిస్తే కొన్ని విచిత్రాలు కనిపిస్తాయి. మన దగ్గర ఉన్నట్లు తక్కువ ధరలో ఉపాహారం తీసుకుని కాలం కాపాడుకోవడానికి తగిన తిండి ఏర్పాట్లు అక్కడ ఉండవు. మంచి వెలగల పుడ్‌ జాయింట్స్‌ ఉంటాయి. లేదంటే దారి పక్కన తినవచ్చు. నేను ఉద్యోగ పరంగా కూడా అక్కడ ఉండి విచిత్రాలన్నీ తెలుసుకున్నాను. పెద్దపెద్ద ఆఫీసర్లు కూడా రోడ్డు పక్కన నిలబడి బండిమీద తిండి తినడానికి మాత్రం అనుమానం లేకుండా వచ్చేస్తారు. తిండి పరిశుభ్రంగానే ఉంటుంది.

దిల్లీలోని పాలు, లస్సీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాలను అన్ని రకాలుగా తాగ వచ్చునని మొదటిసారిగా తెలిసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. పాడిని అనుభవించడం అంటే పంజాబ్‌ వాళ్ల దగ్గరే నేర్చుకోవాలి. ఇటుకలు లాగ పనీర్‌ ను అంగళ్ళ ముందు పెట్టి అమ్మడం చూచినప్పుడు ఆశ్చర్యం కూడా కాని భావం ఏదో కలిగింది. దిల్లీలో ఎక్కడికక్కడ ప్రత్యేకమైన వీధి తిండి దొరుకుతుంది. వెతుకుతూ తిరగడానికి ఓపిక ఉండాలే కానీ, ఆసక్తిగల వారికి అది మంచి కాలక్షేపం.

తిండి గురించి మాత్రమే రాసే బ్లాగర్లు ఉన్నారట. నా బ్లాగులో నేను తిండి గురించి మాత్రం రాసినట్లు లేదు. తలుచుకుంటే దేశం మొత్తంలోనూ వెళ్లిన ప్రతిచోట తిన్న తిండి గురించి బ్లాగు కర్మ ఏమిటి ఏకంగా ఒక టీవీ సీరియల్‌ తీయవచ్చు. అటువంటి సీరియల్స్‌ చూచి సంతోషపడుతున్నాను. తిండి తినడం పోయి చూచి సంతోషపడే కాలం వచ్చింది. దాన్ని గురించి రాసి సంతోషపడే కాలం వచ్చింది. ఏదైనా బాగానే ఉంది.