Showing posts with label Famous. Show all posts
Showing posts with label Famous. Show all posts

Tuesday, March 3, 2026

కిటికీ : సాకీ కథకు నా తెలుగు అనువాదం


కిటికీ

సాకీ కథకు నా తెలుగు అనువాదం


కిటికీ

ఎచ్‌.ఎచ్‌. మన్రో (సాకీ)

మా ఆంట్‌ కొంచెంసేపట్లో వస్తుంది, మిస్టర్‌ నటల్‌’ అన్నది ఆ పదిహేనేళ్ల పడుచు. ‘ఈలోగా మీరు ప్రయత్నించి నా ఉనికిని భరించాలి’.

రావలసిన ఆ అత్తగారికి బదులు ఎదురుగా వచ్చిన నీస్‌ కు సరిగ్గా ఏదో మాట చెప్పి సంతృప్తిపరచాలి. ఆలోగా ఆంట్‌ మీద గౌరవం తగ్గకూడదు. ఫ్రామ్‌టన్‌ నటల్‌ సమస్యలో పడ్డాడు. అతను చికిత్స కోసం ఆ ప్రాంతానికి వచ్చాడు. అయితే, వరుసబెట్టి, అంతకు ముందెన్నడూ ఎరుగనివాళ్లను కలిసినందుకు అసలు ప్రయోజనం ఉంటుందా అన్న అనుమానం అతనికి లోలోపల ఉండనే ఉన్నది.

చికిత్సకోసం అతను పల్లె ప్రాంతాలకు పోతున్నాడంటే, వాళ్ల అక్కయ్య సలహా ఇచ్చింది. ‘ఎలాగుంటుందో నాకు తెలుసు. నీవు ఎక్కడో పాతుకుపోతావ్‌. ఎవ్వరితోనూ మాట్లాడవు. నీ నాడులు మరింత పాడవుతాయి. అక్కడ నాకు తెలిసినవాళ్లందరికీ పరిచయాలు చేస్తూ, నేను నీకు ఉత్తరాలు ఇస్తాను. నాకు గుర్తున్నంత వరకూ వాళ్లలో కొంతమంది చాలా మంచివాళ్లు’ అన్నది ఆమె.

ఆ ఉత్తరాలలోనుంచి ఒకదాన్ని మిసెస్‌ సాపుల్టన్‌కి ఇవ్వడానికి ఫ్రామ్‌టన్‌ వచ్చాడు. మరి ఆమె మంచివాళ్లలోకి చేరుతుందా అన్నది అతని అనుమానం.

ఈ చుట్టుపక్కల మీకు చాలామంది తెలుసా?’ అంతసేపూ నిశ్శబ్దంగా ఉన్నామన్న సంగతిని గ్రహించిన ఆ నీస్‌ అడిగింది.

ఒక్కరూ తెలియదు. మా అక్క ఒకప్పుడు ఇక్కడ ఉండేది. సుమారు నాలుగేళ్ల క్రితం రెక్టరీలో ఉండేది. ఆమె ఇక్కడివాళ్లను పరిచయం చేస్తూ నాకు ఉత్తరాలు ఇచ్చింది’ అన్నాడు ఫ్రామ్‌టన్‌. అతని చివరి మాటల్లో ఒక రకమయిన అయిష్టత ధ్వనించింది.

అయితే ఆంట్‌ గురించి మీకు అసలు తెలియదన్నమాట?’ బింకంగా ఉన్న ఆ యువతి పరిశోధనగా అడిగింది.

ఆమె పేరు, చిరునామా తప్ప!’ ఆగంతకుడు ఒప్పుకున్నాడు.

మిసెస్‌ సాపుల్టన్‌కి పెళ్లయిందా? లేక భర్త పోయాడా అని అతను ఆలోచిస్తున్నాడు. గదిలోని చెప్పరాని సంగతులేవో మగవాళ్ల ఉనికిని సూచిస్తున్నాయి.

మూడు సంవత్సరాల క్రితం ఆమె గొప్ప విషాదంలో పడింది. అంటే, మీ అక్కయ్యగారు వెళ్లిపోయిన తరువాత అన్నమాట!’ అన్నది ఆ పాప.

ఏమిటది?’ ఫ్రామ్‌టన్‌ అడిగాడు. ఎందుకో ఈ ప్రశాంతమయిన ప్రాంతంలో అనుకోని ఆపదలు అమరినట్టు అతనికి కనిపించలేదు.

ఒక అక్టోబర్‌ మధ్యాహ్నాన ఆ కిటికీ ఎందుకు తెరిచి ఉందని మీరు ఆశ్చర్యపడి ఉంటారు’ లాన్‌ మీదికి తెరుచుకుని ఉన్న ఒక పెద్ద ఫ్రెంచ్‌ విండో వేపు చూపిస్తూ, నీస్‌ అన్నది.

నిజానికి ఉండవలసినకన్నా ఎక్కువ వేడిగానే ఉంది. అయితే, ఆ కిటికీకి, జరిగిన దురంతానికి సంబంధం ఏదయినా ఉందా?’ అన్నాడు ఫ్రామ్‌టన్‌.

ఆ కిటికీలోనుంచి, సరిగ్గా ఇదే రోజున మూడు సంవత్సరాల నాడు ఆమె భర్త, ఆయనతో ఆమె ఇద్దరు తమ్ముళ్లు వేటకోసం వెళ్లిపోయారు.  వాళ్లు ఇక తిరిగి రాలేదు. మైదానం మీదుగా వేట ప్రాంతానికి వెళుతుండగా, వాళ్లు ముగ్గురు ఒక బురదగుంటలో చిక్కుకున్నారు. అంతకు ముందు సంవత్సరాలలో ఆపద లేదనుకున్న ప్రదేశాలు, అకస్మాత్తుగా బురదగా మారాయి. వాళ్ల శరీరాలు కూడా దొరకలేదు. అది అన్నింటికన్నా భయంకరమయిన సంగతి’.

ఇక్కడ అమ్మాయి గొంతులో మునుపటి బింకం పోయింది. అందులో మానవతలోని బలహీనత కనిపించింది.

పాపం ఆంట్‌, వాళ్లు ఏదో ఒక రోజున తిరిగి వస్తారని ఎప్పుడూ అనుకుంటుంది. వాళ్లతో పాటు పోయిన చిన్న స్పానియల్‌ కుక్క కూడా  కలిసి, ఆ కిటికీ గుండా నడిచి చాలా మామూలుగా వాళ్లు వచ్చేస్తారని ఆమె ఆశ. అందుకే సాయంత్రమయితే చాలు, చీకటిపడే వరకూ ఆ కిటికీ తెరిచే ఉంటుంది. పాపం, పిచ్చి ఆంట్‌. తెల్లని వాటర్‌ ప్రూఫ్‌ కోటు చేతిమీద వేసుకుని తన భర్త, ఇంకా తమ్ముడు రోనీ, వెళ్లిన తీరు గురించి ఎన్నిసార్లు చెప్పిందో! తమ్ముడు ఒక పాట పాడుతూ ఈమెని ఎప్పుడూ ఏడిపించేవాడట. ఆ పాట ఇష్టంలేదని ఈవిడ అన్నది కనుక, అతను ఎప్పుడూ దాన్నే పాడతాడట! మీకు తెలుసా? ఒక్కోసారి ప్రశాంతమయిన ఒక సాయంత్రాన వాళ్లు నిజంగానే కిటికీలోంచి నడిచి వస్తారేమోనని నాకూ అనిపిస్తుంది.  ...... ’

ఆమె ఉలిక్కిపడి మాటలు ఆపింది. ఫ్రామ్‌టన్‌కు తెరపి దొరికింది. ఆలస్యానికి క్షమాపణలు చెబుతూ ఆంట్‌ గదిలోకి వేగంగా వచ్చింది.

మీకు తోడుగా సరదాగా వేరా, ఉందనుకుంటాను?’ ఆమె అన్నది.

ఆమె చాలా ఆసక్తి కలిగించే మనిషి’ ఫ్రామ్‌టన్‌ అన్నాడు.

కిటికీ తెరిచి ఉన్నందుకు మీకేమీ అభ్యంతరం లేదనుకుంటాను? నా భర్త, తమ్ముళ్లు వేటనుంచి నేరుగా ఇంటికి వస్తారు. ఈ దారి గుండానే వస్తారు. బురద ప్రాంతంలో వేటాడడానికి వెళ్లారు. లోపలికి వచ్చి కార్పెట్లనంతా పాడుచేస్తారు. మీ మగవాళ్లంతా అంతే! అవునంటారా?’   మిసెస్‌ సాపుల్టన్‌ గబగబా అన్నది. ఆమె సంతోషంగా వేట గురించి, పక్షులు తగ్గిపోవడం గురించి, చలికాలంలో బాతులు దొరకడం గురించి ఏవో చెపుతూనే ఉన్నది.

ఫ్రామ్‌టన్‌కు అదంతా పచ్చి భయంకరంగా ఉంది. మాటలను అంతకన్నా తక్కువ భయంకరమయిన విషయం మీదికి మార్చడానికి అతను అరకొర ప్రయత్నాలు చేశాడు. కానీ కుదరలేదు. ఇల్లుగలావిడ తన మనసులోని భ్రమను ఒకదాన్ని తనకు వినిపిస్తున్నదని అతనికి తెలుసు.  ఆమె కళ్లు అదే పనిగా తెరిచిన కిటికీలోనుంచి బయట లాన్‌ మీదుగా చూస్తున్నాయి. సరిగ్గా ప్రమాదం జరిగిన రోజునే ఏళ్ల తరువాత తాను అక్కడికి రావడం అనుకోకుండా జరిగినా, దురదృష్టమని అతనికి నమ్మకం మొదలయింది.

డాక్టర్లు నాకు పూర్తి విశ్రాంతి అవసరమంటారు. ఏ రకంగానూ ఆదుర్దా కూడదంటారు. శరీరాన్ని కుదిపే ఈ పనులూ కూడదంటారు’  ఫ్రామ్‌టన్‌ ప్రకటించాడు.

కొత్తవారికి లేదా అనుకోకుండా కలిసినవారికి, ఎదుటివారి జబ్బులు, అవకరాలు, వాటి కారణాలు, చికిత్స గురించి తెలుసుకోవాలని గొప్ప ఆదుర్దాగా ఉంటుందని అందరిలాగే, భ్రమలో పడ్డ ఫ్రామ్‌టన్‌, ‘ఇక తిండి విషయంలో వాళ్లు మరీ పట్టుదలగా ఉన్నారు’ అంటూ ఏదో చెపుతున్నాడు.

నో?’ ఆవులిస్తున్న మిసెస్‌ సాపుల్టన్‌ ఆపి ఒక్కసారిగా ఆ మాట అన్నది.

అనుకోకుండా ఆమె చురుకుగా కనిపించసాగింది. అది ఫ్రామ్‌టన్‌ మాటలవల్ల మాత్రం కాదు.

అదుగో, చివరకు రానే వచ్చారు. సరిగ్గా టీ సమయానికి. వాళ్లు కళ్లదాకా బురదలో కూరుకున్నట్టు కనిపిస్తున్నది కదూ?’ ఆమె అరిచింది.

ఫ్రామ్‌టన్‌ కొంచెంగా వొణికిపోయాడు. సానుభూతి తెలిపే పద్ధతిలో ఒకసారి నీస్‌ వేపు చూచాడు. ఆ అమ్మాయి కళ్లు పెద్దగా తెరుచుకుని భయంగా కిటికీలోంచి చూస్తున్నది. పేరులేని భయంతో అదిరిపోతూ ఫ్రామ్‌టన్‌ కుర్చీలో గుండ్రంగా తిరిగాడు. అతనూ అటువేపే చూచాడు.  సంజ చీకట్లు ముదురుతున్నాయి. గడ్డిమీద నడుస్తూ మూడు ఆకారాలు కిటికీవేపు వస్తున్నాయి. వాళ్లు ముగ్గురూ తుపాకీలు చంకన పెట్టుకున్నారు.  ఒకతని బుజం మీద తెల్లని కోటు బరువుగా వేలాడుతున్నది. అలసిపోయిన స్పానియల్‌ ఒకటి వాళ్ల వెనుకే వస్తున్నది. వాళ్లు నిశ్శబ్దంగా ఇంటిదాకా వచ్చారు. ఆ మసక వెలుతురులోనుంచే ఒక మొరటు కుర్ర గొంతు గట్టిగా పాడటం వినిపించింది. ఫ్రామ్‌టన్‌ తన చేతికర్రను, టోపీని భయంతో  గట్టిగా పట్టుకున్నాడు. హాలు ద్వారం, ముందరి రాళ్ల బాట, గేటు, అతని పరుగుదారిలో చూచాయిగా తెలిశాయి. రోడ్డుమీద వెళుతున్న ఒక సైకిల్‌ మనిషి ఇతనికి కొట్టుకోకుండా రోడ్డు దిగి దూరంగా వెళ్లవలసి వచ్చింది.

వచ్చేశాం మైడియర్‌!’ తెల్లవాన కోటు మోస్తున్న మనిషి, కిటికీలోంచి వస్తూ అన్నాడు. బాగా బురద, కానీ చాలామటుకు ఆరిపోయింది. మేం వస్తుంటే, పరుగున వెళ్లిపోయాడే, ఎవరాయన?’

ఒక అసాధారణమయిన మనిషి. పేరు మిస్టర్‌ నటాల్‌’ మిసెస్‌ సాపుల్టన్‌ చెప్పింది. తన అనారోగ్యం గురించి మాత్రమే చెప్పాడు. మీరు వస్తూ ఉంటే, కనీసం క్షమాపణ గుడ్‌ బై ఒక్క మాటన్నా చెప్పకుండా పరుగెత్తిపోయాడు. అతను దయ్యాన్ని చూచాడని ఎవరయినా అనుకుంటారు’.

కుక్కను చూచి భయపడ్డాడనుకుంటాను!’ నీస్‌ ప్రశాంతంగా అన్నది. ‘తనకు కుక్కలంటే తెగని భయమని ఆయన చెప్పాడు. గంగానది ఒడ్డున ఊరకుక్కలు వెంటబడి ఆయనను ఒక స్మశానంలోకి తరిమాయట! అతను రాత్రంతా కొత్తగా తవ్విన ఒక గొయ్యిలో ఉండిపోయాడట. కుక్కలు ఆ పైనే పళ్లికిలిస్తూ, గురగురలాడుతూ చూస్తూ ఉన్నాయట! ఎవరికయినా భయపడిపోవడానికి అది చాలు!’

క్షణంలో కల్పనలు చెప్పడం ఆమె ప్రత్యేకత!


 

Thursday, January 29, 2026

శ్రీపాద గురించి వాకాటి మాటలు : Vakati Pandurangarao's words about Sripad...


శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి గురించి

వాకాటి పాండురంగరావు గారి మాటలు 


అత్తరు’ శాస్త్రిగారు

          తెలుగు కథావనంలో విరబూసిన దివ్యపారిజాతం సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీపాదం!  పదాలలో అన్నమయ్యా, పద్యాలలో వేమనలకు వలెనే కథలలో అచ్చతెనుగుతనం ఆఘ్రాణించాలి అంటే శ్రీ పాదవారే శరణ్యం. వారి కథలకు వారే నిర్వచనం, వారే కొలమానమున్నూ.... గోదావరికీ కోనసీమకూ కూడా అంతే కదా!

          నాకో మంచి నవల చదవాలినిపించినప్పుడెల్లా నేనో నవల రాసుకుంటాను’ అన్నాట్ట బెంజమిన్‌ డిజ్రాలీ.... బహుశ శాస్త్రిగారూ అలాగే రాసివుండాలి  తమ కథల్ని.

          కథలంటే ఏమిటో, వాటి పరమార్థం ఏమిటో ఈ సంపుటిలో కాపురం చేస్తున్న, వారి కథాదీపం ‘మార్గదర్శి’ అన్నదాన్లో ఆయనే వివరంగానే చెప్పారు.

          ‘‘కథలంటే పైపైని వున్నాయనుకున్నావేమో! అవి కల్పించడానికి చాల గొప్ప ప్రతిభ వుండాలి. వాటి విలువ తెలుసుకోవడానికెంతో పరిజ్ఞానం వుండాలి. అవి చెప్పడానికి ఎంతో నేర్పుండాలి......కథలు కళ్ళకు వెలుగిస్తాయి. బుద్ధికి పదును పెడతాయి. మనస్సుకి ఉత్సాహమూ ఉల్లాసమూ కల్గిస్తాయి. జడునకున్నూ కల్పనాశక్తి ప్రతిపాదిస్తాయి.’’

          కల్పనా ప్రతిభ, విశిష్టమైన పరిజ్ఞానం, కథన కౌశలం ` ఇవి పుష్కలంగా పండిన మాగాణి వారి కథల సీమ. వారి కథ దేనిని తీసుకున్నా వెలుగు, పదును, ఉత్సాహం, ఉల్లాసం పఠిత సంస్కార వైశాల్యాన్ని బట్టి పసిఫిక్‌ మహాసముద్రమంతగా లభిస్తాయి.

          మధునా పంతుల సత్యనారాయణశాస్త్రిగారి మాటలలో చెప్పాలంటే శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘‘ఆంగ్లము కాని, వంగము కాని, మఱియొక వాజ్మయము కాని మర్యాదకైనను చదివిచూచినవారు కారు. విశేషించి ‘హిందీ’ని చేరదీయరాదని వారి వాదము `’’ శ్రీపాద వారిలోని ఈ అంశ ఆయకే చేతనయిన వ్యంగ్య వైభవమంతా సంతరించుకుని ‘శుభికే శిర ఆరోహ’ అన్న ఈ సంపుటిలోని కథ నిండా పరుచుకుని వుంది. ఈ క్రింది సంభాషణ చిత్తగించండి.

          ‘‘ఉత్తరదేశం రాతలో రమా అనే వుంటుందిÑ కాని పలుకుబడి రొమా అని.’’

          ‘‘ఉన్నది ఉన్నట్టే పలికితే యేం?’’

          ‘‘పనికి రాదు, సంస్కృత భాషా సంప్రదాయ ప్రకారం ‘రొమా’ అనే పలకాలి. మనవాళ్ళకి హ్రస్వాకారం యెలా పలకాలో తెలియదు.’’

          ‘‘అయ్యో... అయితే అ ఆలు ఎలా పలకాలంటావోయ్‌?’’

          ‘‘ఓ ఆ అని!’’

          (ఇదంతా విని మూడోపాత్రయిన అన్నపూర్ణ అంటుంది) ‘‘మరి అంత తెలిసినవాడు కదా ఓ ఆ అని, అంటాడేమిటి బావ, నాన్నారూ, ‘ఒఆ  ఒని ఒనాలి’ కాదండి!’’

          1891`1961 సంవత్సరాల మధ్య జీవించిన ఈ కథక చక్రవర్తి ఆనాటి సమాజంలో పెల్లుబికిన అనేకానేక మార్పుల ఉప్పెనలను చదివి, వాటి దిశనూ సారాంశాన్ని గ్రహించి, తన కథలలో ఎంతో పోడిమితో పోహణించారు.

          తలిదండ్రులు ` పిల్లలు, సంప్రదాయం ` ఆధునికత, కులము ` గుణము, పెళ్ళి ` ప్రేమ, బానిసత్వం ` స్వాతంత్య్రం లాంటి ద్వంద్వాలన్నిటిలోనూ ఆయన అటుకన్నా ఇటే మొగ్గి తాను ఇరవయ్యవ శతాబ్దం వాడినని మాత్రమే కాదు, ఇరవయ్యొకటవ శతాబ్దానికి కూడా స్నేహితుడినేనని నిరూపించారు. ఇది చాల హర్షణీయమైన అంశమేÑ కాని శ్రీపాద వారిలో, ఆధునికతలోని అపస్వరాలను పసిగట్టి ప్రక్కకు పెట్టగల తెంపరితనమూ వుంది. అందులోనే  ఆయన పరిపక్వత, పరిపూర్ణత ద్యోతకమవుతాయి. ఈ క్రింది వాక్యాలు గమనించండి.

          ‘‘అడుక్కు తింటూ చెట్టుకింద కాలం గడిపే వాళ్ళని దరిద్రులంటుంది మన సంఘం. ఇది అర్థంలేని మాట. వాళ్ళకి కావలసినంత శక్తి వుందిÑ కాని దానికి వినియోగం లేదు అంతే. అలా లేకపోవడానికి సన్నికృష్ట కారణం. వాళ్ళకి సిగ్గు బిడియమూ లేకపోవడంÑ విప్రకృష్ణ కారణం మన ఆధ్యాత్మిక దృష్టి... ఆధ్యాత్మిక దృష్టి యెప్పుడేర్పడ్డదో అప్పుడే మన పతనం ప్రారంభం అయింది మనకు దాస్యం బలపడినకొద్దీ ఆధ్యాత్మిక చింత పెరిగిపోయింది.’’ అంటూ నిశితంగా మన ఆధ్యాత్మిక దృష్టిని తూర్పారబట్టిన కలమే`

          ‘‘వేద కాలం నుంచీ మన దేశంలో పట్నాలే కాదు నగరాలూ వుండినాయి. అప్పుడు కూడా మన పట్నాలకూ, నగరాలకూ వుండిన ఆకర్షణ, గౌరవమూ పల్లెలకు లేశమూ లేదు. అలా అని అప్పుడెవరూ పల్లెలను నిరసించనూలేదు. నగరాలను దుమ్మెత్తి పోయ్యనూలేదు..... మనం మహోన్నత నాగరికత అనుభవించిన  దినాల్లో పాశ్చాత్యులు ఇప్పుడు మనం వుండిన స్థితి కంటే అధ్వాన్నస్థితిలో వుండినారు`’’

          అని ఆనాటి మేలి అంశాలనూ ఎత్తి చూపగల్గింది.

          ఇంకొక వాక్యం చూడండి.

          ‘‘మనిషి వల్ల వర్తకం పాడవుతోందిÑ గాని వర్తకం వల్ల మనిషి యెన్నడూ పాడయిపోడు `’’ అన్న కీలకవాక్యం నేటి అమెరికా ధోరణి నుండి భారత్‌ లోని బ్యాంక్‌ల ` స్టాక్‌ విఫణుల భాగోతాలదాక వున్న వికారాలకు అర్థం చెప్పడం లేదూ?

          అందుకే శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు వేళ్ళున్న ప్రపంచస్థాయి రచయితగా కనిపిస్తాడు.

          శాస్త్రిగారు చేయి తిరిగిన నాటక రచయిత. అందువల్లనే ఆయన కథలలో కూడా నాటక రచయిత కుండవలసిన దృష్టి వైశిత్యమూ, వర్ణనా వైశాల్యమూ, పాత్ర చిత్రణము, సంభాషణా వైదగ్ధ్యమూ ప్రతిపంక్తిలోనూ సాక్షాత్కరిస్తాయి. అది ఆవిడ వాళ్ళాయనవైపు చూచిన చూపే కానివ్వండి ` ఆడపడుచు నోట నుండి కురిసిన నిప్పుల వానే కానివ్వండి ` దివాన్జీ గారి గీర్వాణమే కానివ్వండి`  ఒకదాత నిర్లక్ష్యం పరికింపుగా, పరికింపు పలకరింపుగా, పలకరింపు సానుభూతిగా,  సానుభూతి శ్రద్ధగా, శ్రద్ధ స్నేహంగా, స్నేహం బంధంగా అంచెలంచెలుగా మెట్లెక్కి మనం అలా చదువుతుండగా మాట వర్ణనయి, వర్ణన జీవమయి, జీవం వ్యక్తి అయి, ఆ వ్యక్తి నువ్వయి, నేనయి ` మనం కథను చదివే పాఠకులమా, లేక అందులోని పాత్రలమా అన్పించేంత అల్కెమీల చిరపుంజీలూ, చిరంజీవులూ ఆయన కథలు.

          కథను చెక్కడంలో శ్రీపాద వారొక మహాశిల్పిÑ నేపథ్య నిర్మాణంలో శాస్త్రిగారొక చిత్రకారుడుÑ వర్ణనల విషయంలో ఎక్స్‌రే కలం ఆయనది. రెండో మూడో పాత్రలను తీసుకుని చాలా అమాయకంగా కథనెత్తుకొని క్లిష్టమైన సన్నివేశాల్లోకి మన గుండెల్ని పట్టుకుని లాక్కువెళ్ళి శతఘ్నులు పేల్చగల ఫీల్డ్‌ మార్షల్‌ ఆయన.

           ఈ సంపుటిలోని ` ‘వడ్లగింజలు’ లక్ష్మీ సరస్వతుల మధ్య జరిగిన చదరంగంÑ స్నేహకరచాలనంతో ముగిసిన ఉజ్వల కథనవిలాసం.

          శుభి కే! శిర ఆరోహ।, కన్యాకాలే యత్నా ద్వరితా’ ` శాస్త్రిగారికి వల్లమాలిన ప్రీతిగల సంసార ప్రేమ కథాక్షేత్రంలోని భామాకలాపాలు.

          మార్గదర్శి’ ` అన్ని భాషలలోకి అనువదించి మెట్రిక్‌ పాసయిన ప్రతి వారికి ఉచితంగా పంచిపెట్టవలసిన స్నాతకోత్సవ రచన. దానితో బాటే అందించవలసిన సులోచనాల వంటి కథ ‘తాపీమేస్త్రి రామదీక్షితులు బి.ఎ’

          ఇక మిగిలిందల్లా షకూరల్లీఖాను అంటే సాక్షాత్తూ శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రిగారే! అత్తరు సౌరభం కంపుగా వెలవరించుకున్న దివాంజీలు మనమే, తెలుగు పాఠకులమే! ఇప్పటికీ గుబాళిస్తూన్న ‘గులాబీ అత్తరు’ సీసాలా....?