Thursday, January 29, 2026

శ్రీపాద గురించి వాకాటి మాటలు : Vakati Pandurangarao's words about Sripad...


శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి గురించి

వాకాటి పాండురంగరావు గారి మాటలు 


అత్తరు’ శాస్త్రిగారు

          తెలుగు కథావనంలో విరబూసిన దివ్యపారిజాతం సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీపాదం!  పదాలలో అన్నమయ్యా, పద్యాలలో వేమనలకు వలెనే కథలలో అచ్చతెనుగుతనం ఆఘ్రాణించాలి అంటే శ్రీ పాదవారే శరణ్యం. వారి కథలకు వారే నిర్వచనం, వారే కొలమానమున్నూ.... గోదావరికీ కోనసీమకూ కూడా అంతే కదా!

          నాకో మంచి నవల చదవాలినిపించినప్పుడెల్లా నేనో నవల రాసుకుంటాను’ అన్నాట్ట బెంజమిన్‌ డిజ్రాలీ.... బహుశ శాస్త్రిగారూ అలాగే రాసివుండాలి  తమ కథల్ని.

          కథలంటే ఏమిటో, వాటి పరమార్థం ఏమిటో ఈ సంపుటిలో కాపురం చేస్తున్న, వారి కథాదీపం ‘మార్గదర్శి’ అన్నదాన్లో ఆయనే వివరంగానే చెప్పారు.

          ‘‘కథలంటే పైపైని వున్నాయనుకున్నావేమో! అవి కల్పించడానికి చాల గొప్ప ప్రతిభ వుండాలి. వాటి విలువ తెలుసుకోవడానికెంతో పరిజ్ఞానం వుండాలి. అవి చెప్పడానికి ఎంతో నేర్పుండాలి......కథలు కళ్ళకు వెలుగిస్తాయి. బుద్ధికి పదును పెడతాయి. మనస్సుకి ఉత్సాహమూ ఉల్లాసమూ కల్గిస్తాయి. జడునకున్నూ కల్పనాశక్తి ప్రతిపాదిస్తాయి.’’

          కల్పనా ప్రతిభ, విశిష్టమైన పరిజ్ఞానం, కథన కౌశలం ` ఇవి పుష్కలంగా పండిన మాగాణి వారి కథల సీమ. వారి కథ దేనిని తీసుకున్నా వెలుగు, పదును, ఉత్సాహం, ఉల్లాసం పఠిత సంస్కార వైశాల్యాన్ని బట్టి పసిఫిక్‌ మహాసముద్రమంతగా లభిస్తాయి.

          మధునా పంతుల సత్యనారాయణశాస్త్రిగారి మాటలలో చెప్పాలంటే శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘‘ఆంగ్లము కాని, వంగము కాని, మఱియొక వాజ్మయము కాని మర్యాదకైనను చదివిచూచినవారు కారు. విశేషించి ‘హిందీ’ని చేరదీయరాదని వారి వాదము `’’ శ్రీపాద వారిలోని ఈ అంశ ఆయకే చేతనయిన వ్యంగ్య వైభవమంతా సంతరించుకుని ‘శుభికే శిర ఆరోహ’ అన్న ఈ సంపుటిలోని కథ నిండా పరుచుకుని వుంది. ఈ క్రింది సంభాషణ చిత్తగించండి.

          ‘‘ఉత్తరదేశం రాతలో రమా అనే వుంటుందిÑ కాని పలుకుబడి రొమా అని.’’

          ‘‘ఉన్నది ఉన్నట్టే పలికితే యేం?’’

          ‘‘పనికి రాదు, సంస్కృత భాషా సంప్రదాయ ప్రకారం ‘రొమా’ అనే పలకాలి. మనవాళ్ళకి హ్రస్వాకారం యెలా పలకాలో తెలియదు.’’

          ‘‘అయ్యో... అయితే అ ఆలు ఎలా పలకాలంటావోయ్‌?’’

          ‘‘ఓ ఆ అని!’’

          (ఇదంతా విని మూడోపాత్రయిన అన్నపూర్ణ అంటుంది) ‘‘మరి అంత తెలిసినవాడు కదా ఓ ఆ అని, అంటాడేమిటి బావ, నాన్నారూ, ‘ఒఆ  ఒని ఒనాలి’ కాదండి!’’

          1891`1961 సంవత్సరాల మధ్య జీవించిన ఈ కథక చక్రవర్తి ఆనాటి సమాజంలో పెల్లుబికిన అనేకానేక మార్పుల ఉప్పెనలను చదివి, వాటి దిశనూ సారాంశాన్ని గ్రహించి, తన కథలలో ఎంతో పోడిమితో పోహణించారు.

          తలిదండ్రులు ` పిల్లలు, సంప్రదాయం ` ఆధునికత, కులము ` గుణము, పెళ్ళి ` ప్రేమ, బానిసత్వం ` స్వాతంత్య్రం లాంటి ద్వంద్వాలన్నిటిలోనూ ఆయన అటుకన్నా ఇటే మొగ్గి తాను ఇరవయ్యవ శతాబ్దం వాడినని మాత్రమే కాదు, ఇరవయ్యొకటవ శతాబ్దానికి కూడా స్నేహితుడినేనని నిరూపించారు. ఇది చాల హర్షణీయమైన అంశమేÑ కాని శ్రీపాద వారిలో, ఆధునికతలోని అపస్వరాలను పసిగట్టి ప్రక్కకు పెట్టగల తెంపరితనమూ వుంది. అందులోనే  ఆయన పరిపక్వత, పరిపూర్ణత ద్యోతకమవుతాయి. ఈ క్రింది వాక్యాలు గమనించండి.

          ‘‘అడుక్కు తింటూ చెట్టుకింద కాలం గడిపే వాళ్ళని దరిద్రులంటుంది మన సంఘం. ఇది అర్థంలేని మాట. వాళ్ళకి కావలసినంత శక్తి వుందిÑ కాని దానికి వినియోగం లేదు అంతే. అలా లేకపోవడానికి సన్నికృష్ట కారణం. వాళ్ళకి సిగ్గు బిడియమూ లేకపోవడంÑ విప్రకృష్ణ కారణం మన ఆధ్యాత్మిక దృష్టి... ఆధ్యాత్మిక దృష్టి యెప్పుడేర్పడ్డదో అప్పుడే మన పతనం ప్రారంభం అయింది మనకు దాస్యం బలపడినకొద్దీ ఆధ్యాత్మిక చింత పెరిగిపోయింది.’’ అంటూ నిశితంగా మన ఆధ్యాత్మిక దృష్టిని తూర్పారబట్టిన కలమే`

          ‘‘వేద కాలం నుంచీ మన దేశంలో పట్నాలే కాదు నగరాలూ వుండినాయి. అప్పుడు కూడా మన పట్నాలకూ, నగరాలకూ వుండిన ఆకర్షణ, గౌరవమూ పల్లెలకు లేశమూ లేదు. అలా అని అప్పుడెవరూ పల్లెలను నిరసించనూలేదు. నగరాలను దుమ్మెత్తి పోయ్యనూలేదు..... మనం మహోన్నత నాగరికత అనుభవించిన  దినాల్లో పాశ్చాత్యులు ఇప్పుడు మనం వుండిన స్థితి కంటే అధ్వాన్నస్థితిలో వుండినారు`’’

          అని ఆనాటి మేలి అంశాలనూ ఎత్తి చూపగల్గింది.

          ఇంకొక వాక్యం చూడండి.

          ‘‘మనిషి వల్ల వర్తకం పాడవుతోందిÑ గాని వర్తకం వల్ల మనిషి యెన్నడూ పాడయిపోడు `’’ అన్న కీలకవాక్యం నేటి అమెరికా ధోరణి నుండి భారత్‌ లోని బ్యాంక్‌ల ` స్టాక్‌ విఫణుల భాగోతాలదాక వున్న వికారాలకు అర్థం చెప్పడం లేదూ?

          అందుకే శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు వేళ్ళున్న ప్రపంచస్థాయి రచయితగా కనిపిస్తాడు.

          శాస్త్రిగారు చేయి తిరిగిన నాటక రచయిత. అందువల్లనే ఆయన కథలలో కూడా నాటక రచయిత కుండవలసిన దృష్టి వైశిత్యమూ, వర్ణనా వైశాల్యమూ, పాత్ర చిత్రణము, సంభాషణా వైదగ్ధ్యమూ ప్రతిపంక్తిలోనూ సాక్షాత్కరిస్తాయి. అది ఆవిడ వాళ్ళాయనవైపు చూచిన చూపే కానివ్వండి ` ఆడపడుచు నోట నుండి కురిసిన నిప్పుల వానే కానివ్వండి ` దివాన్జీ గారి గీర్వాణమే కానివ్వండి`  ఒకదాత నిర్లక్ష్యం పరికింపుగా, పరికింపు పలకరింపుగా, పలకరింపు సానుభూతిగా,  సానుభూతి శ్రద్ధగా, శ్రద్ధ స్నేహంగా, స్నేహం బంధంగా అంచెలంచెలుగా మెట్లెక్కి మనం అలా చదువుతుండగా మాట వర్ణనయి, వర్ణన జీవమయి, జీవం వ్యక్తి అయి, ఆ వ్యక్తి నువ్వయి, నేనయి ` మనం కథను చదివే పాఠకులమా, లేక అందులోని పాత్రలమా అన్పించేంత అల్కెమీల చిరపుంజీలూ, చిరంజీవులూ ఆయన కథలు.

          కథను చెక్కడంలో శ్రీపాద వారొక మహాశిల్పిÑ నేపథ్య నిర్మాణంలో శాస్త్రిగారొక చిత్రకారుడుÑ వర్ణనల విషయంలో ఎక్స్‌రే కలం ఆయనది. రెండో మూడో పాత్రలను తీసుకుని చాలా అమాయకంగా కథనెత్తుకొని క్లిష్టమైన సన్నివేశాల్లోకి మన గుండెల్ని పట్టుకుని లాక్కువెళ్ళి శతఘ్నులు పేల్చగల ఫీల్డ్‌ మార్షల్‌ ఆయన.

           ఈ సంపుటిలోని ` ‘వడ్లగింజలు’ లక్ష్మీ సరస్వతుల మధ్య జరిగిన చదరంగంÑ స్నేహకరచాలనంతో ముగిసిన ఉజ్వల కథనవిలాసం.

          శుభి కే! శిర ఆరోహ।, కన్యాకాలే యత్నా ద్వరితా’ ` శాస్త్రిగారికి వల్లమాలిన ప్రీతిగల సంసార ప్రేమ కథాక్షేత్రంలోని భామాకలాపాలు.

          మార్గదర్శి’ ` అన్ని భాషలలోకి అనువదించి మెట్రిక్‌ పాసయిన ప్రతి వారికి ఉచితంగా పంచిపెట్టవలసిన స్నాతకోత్సవ రచన. దానితో బాటే అందించవలసిన సులోచనాల వంటి కథ ‘తాపీమేస్త్రి రామదీక్షితులు బి.ఎ’

          ఇక మిగిలిందల్లా షకూరల్లీఖాను అంటే సాక్షాత్తూ శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రిగారే! అత్తరు సౌరభం కంపుగా వెలవరించుకున్న దివాంజీలు మనమే, తెలుగు పాఠకులమే! ఇప్పటికీ గుబాళిస్తూన్న ‘గులాబీ అత్తరు’ సీసాలా....?

No comments: